అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 39

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఒక దొంగకు ఒక పాపాత్మునికి తల్లియైన స్త్రీ ఎవరికీ తన మొహం చూపలేక ఒంటరిగా మసలుతున్న రీతిని మనం గత జన్మలనుండి తెచ్చుకున్న పాపపుణ్యాలు రహస్యంగా ఖర్చవుతూనే ఉంటాయి అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.

కీర్తన:
పల్లవి: ముచ్చుగన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు
తెచ్చినసంబళమెల్ల దీరుబో లోలోనె ||ముచ్చు||

చ.1.దప్పముచెడినవానితరుణి కాగిట జేరి
అప్పటప్పటికి నుస్సురనినయట్టు
వొప్పయినహరిభక్తివొల్లని వానియింటి
కుప్పలైనసంపదలు కుళ్ళుబో లోలోనె ||ముచ్చు||

చ.2.ఆకలిచెడినవాని అన్నము కంచములోన
వోకిలింపుచు నేల నొలికినట్లు
తేకువైనహరిభక్తి తెరువుగాననివాని
వేకపుసిరులు కొంపవెళ్ళుబో లోలోనె ||ముచ్చు||

చ.3.వొడలుమాసినవాని వొనరుజుట్టములెల్ల
బడిబడినే వుండి పాసినయట్టు
యెడయక తిరువేంకటేశు దలచనివాని
అడరుబుద్ధులు పగలౌబో లోలోనె ||ముచ్చు||
(రాగం: శ్రీరాగం, సం.1. సంకీ.240)

విశ్లేషణ:
పల్లవి: ముచ్చుగన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు
తెచ్చిన సంబళమెల్ల దీరుబో లోలోనె

తల్లి కుమారులను కంటుంది గానీ వారి కర్మ ఫలములను కనలేదు గదా! వారి వారి పూర్వ జన్మ కర్మానుసారం వారి జీవనం సాగుతూ ఉంటుంది. అయితే ఒక దొంగకు జన్మిచ్చానని ఆ తల్లి ఆవేదన పడని రోజంటూ ఉండదు. ఆమె ఆ అవమాన భారంతో బయటి ప్రపంచానికి కనబడకుండానే బ్రతుకు వెళ్ళదీస్తున్న రీతిన మనం గత జన్మనుండి తెచ్చుకున్న పాప పుణ్యాల మూట మనకు తెలియకుండానే రహశ్యంగా ఖర్చు అవుతూ ఉంటుంది కదా అంటున్నాడు అన్నమయ్య.

చ.1. దప్పము చెడినవాని తరుణి కాగిట జేరి
అప్పటప్పటికి నుస్సురనినయట్టు
వొప్పయిన హరిభక్తివొల్లని వానియింటి
కుప్పలైన సంపదలు కుళ్ళుబో లోలోనె

దర్పము లేక గొప్పదనము కోల్పోయిన వాని ఇల్లాలు భర్త కౌగిటిలో ఉన్నను ఆమెకు సంతృప్తి అనేది ఉండదు. ఉస్సూరంటూ నిట్టూర్పులు విడుస్తూనే ఉంటుంది. హరిభక్తి లేని వాని యింట ఎంత సంపద ఉన్నప్పటికీ వృధానే! ఉన్నసంపదంతా కుళ్ళిపోతూ ఉంటుంది అనగా వృధా అయిపోతూ ఉంటుంది. దానివలన వానికి గానీ గృహానికి గానీఎ జరిగే మేలు ఏమీ ఉండదు.

చ.2. ఆకలిచెడినవాని అన్నము కంచములోన
వోకిలింపుచు నేల నొలికినట్లు
తేకువైనహరిభక్తి తెరువుగాననివాని
వేకపుసిరులు కొంపవెళ్ళుబో లోలోనె
ఆకలిచెడిన వాడు తిన్న అన్నం కంచంలోనే కక్కుకుంటాడు. వాడికి వేళకు తిననందువల్ల అన్నం లోనకు వెళ్ళదు. అన్న హితవు ఉండదు. శ్రీహరిని కానని వానికి ఇంటిలో ఎంత సిరిసంపదలున్నా వాడెంత కోట్లకు పడగెత్తిన ఆగర్భ శ్రీమంతుడైనా వృధానే! వాడికి శ్రీహరి ధ్యాస కలగనంత వరకూ ఎన్ని సంపదలున్న వృధానే అంటున్నాడు.

చ.3. వొడలుమాసినవాని వొనరుజుట్టములెల్ల
బడిబడినే వుండి పాసినయట్టు
యెడయక తిరువేంకటేశు దలచనివాని
అడరు బుద్ధులు పగలౌబో లోలోనె

అన్నివిధముల చెడిపోయి సర్వబ్రష్టుడైన వానిని చుట్ట పక్కాలు ప్రక్క ప్రక్కనే ఉన్నా కూడా దూరంగా ఉంచుతారు గదా! అలాగే శ్రీవేంకటేశ్వరుని తలచని వానికి వాని బుద్ధియే వానికి శతృవౌతుంది అంటున్నాడు. శ్రీనివాసుని స్మరణ చేయని వానికి వాని బుద్ధే వాడికి మరణశాసన మౌతుందని ప్రబోధనం చేస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు ముచ్చు = దొంగ; సంబళము = ఆహారము; దప్పము = దర్పము, గౌరవము, గొప్పదనము; కాగిట జేరి = కౌగిట చేరి; ఉస్సురనినయట్టు = ఉసూరుమని బ్రతుకు వెళ్ళబుచ్చినట్లు; కుళ్ళుబోలేలేనె = కుళ్ళిబోతుంది గదా అన్న అర్ధంలో; ఓకిలింపు = వాంతి, క్రక్కుట; తేకువ = ధైర్యము, మెలకువ; తెరువు = మార్గము, దారి; వేకపు సిరులు = గర్భ సిరులు, ఆగర్భ శ్రీమంతులు అన్న అర్ధంలో వాడిన మాట; ఒడలు మాసిన వాడు = సర్వ విధముల అధోగతి పాలైన వాడు; ఒనరు = కలిగియున్న; బడి = వెంబడి; పాయుట = వదలిపెట్టుట; యెడయక = ఎడఁబాటులేక; అడరు = వర్ధిల్లు, వ్యాపించు, కలుగు.
-0o0-

Leave a Comment