April 23, 2024

అమ్మమ్మ – 4

రచన: గిరిజ పీసపాటి

తన ఆస్తిని ఇంకమ్ టాక్స్ వారు సీజ్ చేసి, అందులో నుండి ఒక్క పైసా కూడా తను వినియోగించరాదనే ఉత్తర్వులు జారీ చెయ్యడంతో, ఏం చెయ్యాలో తెలియక వేదనకు లోనైన పీసపాటి తాతగారితో తెలిసిన వారు తెనాలి తాతయ్య పేరు చెప్పి, వారు పూనుకుంటే పని అవుతుందని చెప్పడంతో, పీసపాటి తాతయ్య తెనాలి తాతయ్యను కలిసి, విషయం చెప్పి ఎలాగైనా తనను ఈ సమస్య నుండి గట్టెక్కించమని కోరారు.

తెనాలి తాతయ్య పీసపాటి తాతయ్యకు ధైర్యం చెప్పి, ఖచ్చితంగా మీ అస్తిని మీకు దక్కేలా చేస్తానని మాట ఇచ్చారు. ఈ విధంగా ఇద్దరి తాతయ్యల పరిచయం జరిగింది. (ఇద్దరూ నాకు తాతయ్య గార్లే కనుక మీ, నా సౌలభ్యం కోసం నాన్న గారి నాన్నగారిని ‘పీసపాటి తాతయ్య’ అనీ, అమ్మ గారి నాన్నగారిని ‘తెనాలి తాతయ్య’ అనీ సంబోధిస్తాను. పాఠకులు గమనించ గలరు). ఆరోజు రాత్రి పీసపాటి తాతయ్య కృష్ణ పాత్రధారిగా నటించవలసిన నాటకం వేరే ఊరిలో ఉండటంతో నాటకానికి వెళ్ళకపోతే ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. వెళితే మనసు నాటకం మీద లగ్నం చేయలేక పరిస్థితి ఎలా ఉందో అనే ఆందోళన వల్ల నాటకంలో సరిగా నటించలేను.

సరిగా నటించకపోతే ఆస్తితో పాటు ఇప్పటివరకూ సంపాదించుకున్న ‘మంచి నటుడు’ అనే పేరు కూడా పోయి అభాసు పాలౌతాను అని బెంగ పడుతుంటే… “మీరు దిగులు పడకండి‌ నరసింహ మూర్తి గారూ! ఎలాగైనా పని సానుకూల పరిచి మీ ఆస్తి మీకు దక్కేలా చూసే బాధ్యత నాది. మీరు సంతోషంగా వెళ్ళి మీ పాత్ర వేసుకోండి” అని తెనాలి తాతయ్య పదే పదే చెప్పగా, మిగిలిన వారు కూడా “ప్రభుత్వ టీచర్ కదా అని ఆయనని తక్కువ అంచనా వెయ్యకండి. ఈ చుట్టుపక్కల ఆయన మాట కాదనేవారు ఎవరూ లేరు. ఆయన చాలా పలుకుబడి ఉన్న మనిషి” అని పీసపాటి తాతయ్యకు ధైర్యం చెప్పడంతో, ఆయన నాటకంలో తన పాత్ర వెయ్యడానికి వెళ్ళాల్సిన ఊరు వెళ్ళిపోయారు.

తెనాలి తాతయ్య ఆలస్యం చెయ్యకుండా అప్పటి ఇంకమ్ టాక్స్ కమిషనర్ ఇంటికి వెళ్ళి ఆయనను కలవడం, తీరా కలిసాక అతను తన వద్ద విద్యను అభ్యసించిన తన శిష్యడే కావడంతో తను వచ్చిన పనిని‌ వివరంగా చెప్పారు. కమిషనర్ ముందు “రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళలేను మాస్టారూ!” అని అంటే “చూడు బాబూ! నీకు విలువలు నేర్పిన గురువు గా నేనూ నిన్ను రూల్స్ కి విరుద్ధంగా నడుచుకోమని చెప్పలేను, చెప్పను కూడా. కానీ, ఒక విషయం నువ్వు గ్రహించాలి. పీసపాటి నరసింహమూర్తి గారు ఒక గొప్ప రంగస్థల నటుడు. ఆయన సంపాదించిన సంపాదన అంతా ఎన్నో రాత్రిళ్ళు తిండి తినకుండా (రంగస్థల నటులు కడుపునిండా తింటే తమ డైలాగులు చెప్పడానికి, పద్యం చదవడానికి చాలా కష్టం. ఆయాసం వస్తుంది), నిద్ర పోకుండా (నాటకాలు రాత్రిళ్ళే వేస్తారు) కష్టపడి సంపాదించిన సొమ్ము. ఆయన ఎవరి దగ్గరా ఆయాచితంగా, అన్యాయంగా తీసుకున్నది కాదు. అలాగే మీకు సబ్మిట్ చేసినవి కూడా దొంగ లెక్కలు. నిజమైన వివరాలు నేను తీసుకొచ్చాను.

ఒక గొప్ప కళాకారుడి జీవితం ఎవరో కిట్టని వాళ్ళు చేసిన ద్రోహానికి బలైపోకూడదు. అది మన కనీస ధర్మం. అలాగే తప్పుడు లెక్కలు రాసి మీకు సబ్మిట్ చేసిన వ్యక్తిని విచారిస్తే అసలు విషయం నీకే తెలుస్తుంది” అంటూ తను తీసుకెళ్ళిన అకౌంట్స్ అతనికి చూపించి, తప్పుడు లెక్కలు రాసి సబ్మిట్ చేసిన వ్యక్తి వివరాలు అడ్రస్ తో సహా అతనికి ఇచ్చారు తెనాలి తాతయ్య.

వెంటనే అతను ఎక్కడికో ఫోన్లు చేసి సూచనలు ఇవ్వడం, ఒక్క పూటలో తప్పుడు లెక్కలు రాసిన వ్యక్తిని పోలీసుల సహాయంతో పట్టుకుని, నిజం చెప్పించడం కూడా జరగడంతో అతను “మీరు చెప్పింది నిజమే మాస్టారూ! నేనే పొరపాటు పడ్డాను. వెంటనే ఆయన ఆస్తి ఆయన అనుభవించొచ్చు అని లెటర్ ఇస్తాను” అంటూ ఆస్తిని తిరిగి పీసపాటి తాతయ్య వాడుకోవచ్చు అన్న విషయాన్ని ధృవీకరిస్తూ లెటర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది.

వెంటనే తెనాలి తాతయ్య కోడ్ లాంగ్వేజ్ లో పీసపాటి తాతయ్యకి “బేబీ సేఫ్” అంటూ టెలిగ్రామ్ ఇచ్చారు. అప్పటికే నాటకం ప్రారంభం అయిపోవడంతో స్టేజ్ మీద చాలా డల్ గా పెర్ఫామ్ చేస్తున్న పీసపాటి తాతయ్యకి తెనాలి తాతయ్య పంపిన టెలిగ్రామ్ అందడం, విషయం తెలుసుకున్న పీసపాటి తాతయ్య తరువాత విజృంభించి నటించడం జరిగింది. పీసపాటి తాతయ్య పద్యం చదివితే సుదీర్ఘ రాగాలాపన లేకుండా భావయుక్తంగా చదువుతారు. అందువలన ప్రేక్షకులకు పద్యం చాలా సులభంగా అర్ధం అవడమే కాకుండా మిగిలిన నటులు గంటల తరబడి తీసే రాగాలాపనతో విసిగిపోయే ప్రేక్షకులు ఆయన పద్యం చదివే పధ్ధతిని చాలా ఇష్టపడేవారు.

వన్స్ మోర్ అని తెగ అరిచేవారు. కానీ, ఎన్నడూ రెండోసారి పద్యం చదివేవారు కాదు ఆయన. అలాటిది ఆరోజు మాత్రం ప్రతీ పద్యం అద్భుతంగా చదవడమే కాకుండా వన్స్ మోర్ అని ప్రేక్షకులు అడిగితే రెండోసారి కూడా ఆయన స్వభావానికి విరుధ్ధంగా చదివి వినిపించారు. అవిధంగా ఆనాటి నాటకం ‘నభూతో నభవిష్యతి’ అన్న విధంగా జరిగాక వెంటనే బయలుదేరి తెనాలి వచ్చి తెనాలి తాతయ్యను కౌగలించుకుని ఏడ్చేసారు పీసపాటి తాతయ్య. వారి స్నేహానికి ఆనాటి సంఘటన గట్టి పునాదిని వేసింది.

*********** సశేషం **************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *