April 16, 2024

ఉదంకుడు

అంబడిపూడి శ్యామసుందర రావు.

పురాణకాలములో భారతావనిలో అనేక మంది మహర్షులు ఋషి పుంగవులు ఉండి, వేదానుసారము రాజ్యాలను ఏలే రాజులకు దిశా నిర్దేశించి పాలన సక్రమముగా జరిగేటట్లు సహకరించేవారు. కానీ వారు కూడా కొన్ని సందర్భాలలో కోపతాపాలకు సామాన్యువలే గురై ప్రవర్తించేవారు. అటువంటి ఋషులలో ఉదంకుడు గురించి తెలుసుకుందాము.

ఉదంకుడు వ్యాసుని శిష్యులలో ఒకరైన పైలుడి శిష్యుడు. ఉదంకుడు గురువును భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామన సాయిత ఆనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పోందిన అదృష్టవంతుడు తన విద్యాభ్యాసము ముగించుకున్న ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురువు ఎంత వారించిన తమ అభీష్టము నెరవేర్చనిదే ఇంటికి వెళ్లనని భీష్మించగా, గురువు గురుపత్నిని అడిగి ఆమె కోరిక ఏదైనా ఉంటే దానిని తీర్చమని చెపుతాడు గురుపత్ని అతడిని గురు దక్షిణగా పౌష్యుడనే రాజు భార్య కుండలాలు కావాలని అడిగింది. ఎందుకంటే తానూ చేస్తున్న పుణ్యక వ్రతము నాడు చేయు బ్రాహ్మణ సమారాధన ఆ కుండలాలు ధరించి చెయ్యాలనేది ఆవిడ కోరిక.

ఉదంకుడు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించి బయలుదేరే సమయంలో గురువు అతనికి బుద్ధిమతి చెప్పి పంపాడు. గురుపత్నికి నమస్కరించి గురువుగారి అశీస్సులతో బయలుదేరిన ఉదంకునికి దారిలో ఒక ఎద్దు పై కూర్చున్న పొడవైన మహాపురుషుడు కనిపించాడు. ఆతను ఉదంకునితో,” దీని గోమయము భక్షించు నీకు మేలు కలుగుతుంది. గతములో నీ ఆచార్యులవారు కుడా దీనిని స్వీకరించారు”అని చెపుతాడు. ఉదంకుడు మారు మాట్లాడకుండా మహాపురుషుడు చెప్పినట్లుగా గోమయము, పంచితము స్వీకరించి పౌష్య మహారాజు దర్శనార్ధము వెళ్ళాడు. మహారాజును దర్శించుకొని తన ఆశ్వీరచనాలతో రాజును అభినందించి తానూ వచ్చిన పని వివరించాడు.
మహారాజు అంతఃపురానికి వెళ్లి మహారాణిని అడిగి తీసుకోమని సెలవిచ్చాడు.

అంతఃపురానికి వెళ్లిన ఉదంకునికి ఎక్కడ మహారాణి కనిపించలేదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు అంతఃపురములోనే ఉంది కానీ ఉదంకుడు అశుచిగా ఉన్నందువల్ల ఆమె దర్శనము కాలేదు. అప్పుడు ఉదంకునికి తాను నడుస్తూ ఆచమనము చేసిన విషయము గుర్తుకు వచ్చింది అప్పుడు కాళ్ళు చేతులు ముఖము శుభ్రముగా కడుక్కొని, ఆచమనము చేసుకొని అంతఃపురానికి వెళ్లగా మహారాణిగారు నవ్వుతు దర్శనము ఇస్తుంది. అప్పుడు ఉదంకుడు విషయాన్ని చెప్పి గురుకార్య నిర్వహణ కోసమని మహారాణిగారి కుండలాలను అభ్యర్థిస్తాడు. మహారాణిగారు సంతోషముగా కుండలాలను ఇస్తూ” వీటిని నాగరాజు తక్షకుడు తస్కరించాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి నీవు ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్న ఇబ్బందుల పాలవుతావు” అని హెచ్చరించి కుండలాలను ఇస్తుంది.
కుండలాలను తీసుకున్న ఉదంకుడు మహారాజుకు కృతజ్ఞతలు చెప్పగా రాజు తన ఆతిధ్యము స్వీకరించి వెళ్ళవలసినదిగా కోరాడు. వెళ్లే తొందరలో ఉన్న ఉదంకుడు ఉన్నదేదో పెట్టమన్నాడు అలాగే వడ్డించారు. కానీ చల్లారిన అన్నములో తలవెంట్రుకలు రావటముతో ఆగ్రహించిన ఉదంకుడు కంటితో చూడకుండ అటువంటి భోజనాన్ని వడ్డించినందుకు రాజును అంధుడు అవమని శపిస్తాడు. రాజు కూడా ప్రతిగా వంశమే లేకుండా పోవుగాక అని ప్రతిశాపము ఇస్తాడు. అన్నములో వెంట్రుకలు చూసిన రాజు ఉదంకుని క్షమించమని అభ్యర్థిస్తాడు. శాంతించిన ఉదంకుడు శాపోహరణము చెపుతాడు. కానీ మహారాజుకు తన శాపమును వెనుకకు తీసుకొనే శక్తి లేదని చెపుతాడు “తప్పుంటే నాకు దోషము సంక్రమిస్తుంది తప్పు లేకపోతే నీ శాపము ఫలించదు” అని చెప్పి ఉదంకుడు బయలుదేరుతాడు.

తిరుగు ప్రయాణములో సాయంత్రము వేళ ఒక సరోవరం వద్ద ఆగి శుచియైన ప్రదేశములో కుండలాలను ఉంచి సంధ్యావందనం చేస్తున్న సమయములో తక్షకుడు వచ్చి వాటిని ఎత్తుకొని నాగలోకానికి వెళ్ళిపోతాడు. కుండలాల అన్వేషణలో నాగలోకము చేరిన అక్కడి నాగులను భక్తితో స్తుతించి వెదికినా కుండలాల జాడ దొరకలేదు. కానీ అక్కడ ఉదంకునికి ఒక అపురూప దృశ్యము ఒకటి కనిపించింది. అది ఏమిటి అంటే ఇద్దరు స్త్రీలు మగ్గము మీద తెల్లని నల్లని దారాల వస్త్రము నేస్తుంటే ఆరుగురు యువకులు పన్నెండు ఆకుల చక్రాన్ని తిప్పుతున్నారు. ఉన్నతమైన గుఱ్ఱము పై ఉన్నతుడైన వ్యక్తి కనిపిస్తాడు. ఉదంకుడు ఆ వ్యక్తిని స్తుతించి నాగలోక వాసులందరు తన స్వాధీనములో ఉండాలని కోరతాడు. దానికి ఆ మహాపురుషుడు తానెక్కిన గుఱ్ఱము చెవిలో శక్తి కొద్దీ ఊదమని చెపుతాడు. ఉదంకుడు ఆ విధముగా చేయగా గుఱ్ఱము చెవుల నుండి అగ్ని జ్వాలలు వెలువడి నాగలోకము అతలాకుతలం అవుతుంది. అప్పుడు తక్షకుడు భయముతో పరుగెత్తుకుంటూ వచ్చి తానూ దొంగలించిన కుండలాలను ఉదంకునికి అప్పజెపుతాడు.

సకాలములో జేరి గురుపత్నికి కుండలాలు అందివ్వలేనేమో అని భయపడుతుంటే ఆ మహా పురుషుడు తన గుఱ్ఱము పై ఉదంకుని ఆశ్రమానికి చేరుస్తాడు. ఆశ్రమానికి చేరిన వెంటనే కుండలాలను గురుపత్నికి అందజేసే తన ఆలస్యానికి గల కారణాలను గురువుకు చెపుతాడు. అప్పుడు గురువైన పైలుడు ,” నీకు కనిపించిన మహాపురుషుడు ఇంద్రుడు. ఆ వృషభము నాగరాజైన ఐరావతుడు. నీకు కనిపించిన స్త్రీలు దాత- విధాతలు. వారు నేస్తున్న వస్త్రము రాత్రి పగళ్లు. పన్నెండు ఆకులు పన్నెండు నెలలు. ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. నీవు తీసుకున్న గోమయ పంచితాలు అమృతము” అని వివరిస్తాడు. గురుదేవుల అభీష్టాన్ని నెరవేర్చిన వారికి అసాధ్యమనేది లేదని దీవించి పంపుతాడు.
తరువాతి కాలములో ఈ ఉదంకుడి పరీక్షుత్తు కుమారుడైన జనమేజేయ రాజును కలిసి నీ తండ్రి మరణానికి కారణమయిన తక్షకుని సంహరించటానికి దేవి యజ్ఞాన్ని అనుభందముగా సర్పయాగాన్ని చేయమని సలహాలిచ్చి తానే ఆ యాగ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తాడు. కానీ ఆ యాగము జగత్కారుని కుమారుడైన ఆస్తీకుని వలన మధ్యలోనే ఆగిపోతుంది. ఆ విధముగా తక్షకుడు రక్షింపబడతాడు. పగ పట్టుదలలు క్షత్రియులకు, క్షమ ఓర్పు బ్రాహ్మణుల సహజ లక్షణాలు అని ఉదంకుడు తెలుసుకుంటాడు.
కురుక్షేత్ర సంగ్రామము తరువాత శ్రీకృష్ణుడు ఉదంకుని ఆశ్రమము చూసి మహర్షి దర్శనార్ధము వెళ్ళాడు. శ్రీ కృష్ణునికి సముచిత మర్యాదలు చేసిన ఉదంకుడు శ్రీ కృష్ణుని ద్వారా కురువంశ నాశనము గురించి తెలుసుకొని కోపించి,”కృష్ణా సర్వసమర్ధుడివై ఉండి మహాసంగ్రామాన్ని జరిపి, కురువంశాన్నీ నాశనము చేసి నీకు ఇష్టమైన పాండవులకు పట్టము గట్టి దానికి ధర్మమని పేరు పెట్టావు ” అని కృష్ణుణ్ణి శపించటానికి చేతిలోకి ఉదకము తీసుకుంటాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు,”మహాముని నీవు తపస్సంపన్నుడివే కానీ నన్ను నిరోధించలేవు సత్యము తెలుసుకో”, అని భగవత్ తత్వాన్ని భోధపరిచి ,”మహాముని నీ చేతిలోని వీటిని భద్రము చేసుకో భవిష్యత్తులో అవసరము రావచ్చు”అని చెప్పగా ఉదంకుడు సంతృప్తి చెంది శ్రీ కృష్ణుని స్తుతించాడు
ఆ తరువాతి కాలంలో వర్షాలు పడక నీళ్ళు దొరకక ఇబ్బందులు పడుతున్న సమయములో నోరు తడి ఆరిపోతున్నప్పుడు ఉదంకుడు ,”కృష్ణా”అని హీన స్వరముతో భగవంతుడిని స్మరిస్తే భగవంతుడు రాకపోగా ఒక పంచముడు పిలిచినట్లు వచ్చి ,”సామి నీళ్లు కావాలా?”అని అడుగుతాడు. అతని నుండి నీళ్లు తీసుకోవటం ఇష్టము లేని ఉదంకుడు కసురుకొని పొమ్మంటాడు. కొంచెముసేపు తరువాత కొడిగడుతున్న ఊపిరితో కృష్ణా అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు “స్వామి మంచినీళ్ళకోసమని నిన్ను పిలిస్తే పంచముడు వచ్చి తోలు తిత్తిలోని నీళ్లను త్రాగమంటాడు. చూస్తుంటే ఇదంతా నీ మాయలాగా ఉంది మాయలమారివి నీవు” అని కృష్ణుడిని ఆక్షేపిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు, “మహర్షి ఇప్పటికి నీలో అహంభావాము నశించలేదు సమతాభావము తట్టలేదు. నీటికి నిప్పుకు మడి దడి లేవని తెలియదా? మహర్షివి అడిగావు కదా అని ఇంద్రుని అడిగి అమరత్వము కోసము అమృతము తెచ్చాను. అప్పటికి ఇంద్రుడు అంటూనే ఉన్నాడు మానవులు మానవులే వారు దైవత్వమును పొందగలరేమో తప్ప అమరత్వాన్ని పొందలేరు. పంచముని రూపములో తోలుతిత్తితో అమృతాన్ని తీసుకువెళ్ళు స్వీకరిస్తే ధన్యుడు లేదా భ్రష్టుడు. ఇంద్రుని సలహా మేరకు నీకు పంచముని రూపములో తోలుతిత్తిలో అమృతము తెచ్చాను. ఇంద్రుని మాటే నిజమైంది’ అని శ్రీకృష్ణుడి హితవచనాలు పలుకగా ఉదంకునికి జ్ఞానోదయము అయింది. అప్పుడు శ్రీ కృష్ణుడు కరుణించి,”మహర్షి నీవు తలంచిన క్షణము నీవు ఉన్న ప్రాంతములో ఉదంకులన్న మేఘాలు అప్పటికప్పుడు వర్షిస్తాయి ” అని వరము ఇచ్చి వెళ్ళిపోతాడు. ఉదంకుడు తన అజ్ఞానానికి చింతిల్లి కోపము ద్వేషము అసూయల ఫలాలను అనుభవించి ఈ లోకములోని వాటిని విడిచిన వారు భగవంతునికి ప్రియులు అవుతారని ఉదంకుడు నిరూపించాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *