June 14, 2024

కౌండిన్య కథలు – ప్రకృతి క్రితి

రచన: రమేష్ కలవల

ఈ ప్రదేశం గురించి చాలా సార్లు విన్నాడు గీత్. ఎన్నో రోజుల నుండి అక్కడికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. దగ్గర ఉన్న గ్రామంలో కొన్ని రోజులు ఉండి, ఆ చుట్టుపక్కలా ఉన్న పరిసరాల ప్రకృతిని చిత్రీకరించటాని కావలసినవన్నీ తనతో తీసుకొని వచ్చాడు. అక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు.
అక్కడ చూడటానికి అంతా కనువిందుగా, ఆహ్లాదకరంగా ఉంది, చుట్టూ నిశ్శబ్ధం ఆవహించి కదలిక లేని కొలను కనబడుతుంది. ఆ కొలనులో ఓ భాగం సూర్యుడి కిరణాలు పడుతూ బంగారంలా మెరుస్తూ ఉంది. ఓ భాగంలో కొన్ని విడువని కలువలు, కొన్ని విప్పారిన పద్మ కమలములు కనిపిస్తున్నాయి, వాటి ఆకుల మీద ఉన్న కొన్ని నీటి బిందువులు ముత్యాల్లా దొల్లుతూ కొలనులో కలిసిపోతున్నాయి.
ఆ ప్రదేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ, కిలకిలా రావం చేస్తున్న రకరకాల పక్షులు, ఒళ్ళు పులకరింతలు కలిగించేలా పలురకాల మధురమైన పుష్పాలు కూడా ఉన్నాయి. ఆ విప్పారిన పుష్పాలమీద తీయని మకరందాన్ని ఆస్వాదిస్తున్న తేనెటీగలు వాలబోతున్నాయి. ఆ కొలను పక్కనే చిన్న సెలయేరు పారుతూ మువ్వల్లా చిరు సవ్వడి చేస్తోంది. అవీ కాకుండా తూనీగలు చిన్న చిన్న శబ్ధం చేస్తూ నీటి మీద వాలి వాలకుండా ఎగురుతున్నాయి. ఆ వీచే చిరు గాలికి కొలను నీటి అంచుల వరుకూ వొంగిన చెట్లు సన్నటి అలజడి చేస్తున్నాయి. ఆ చెట్ల నీడలో కొన్ని హంసలు ఒదిగి కూర్చున్నాయి. ఈ అద్భుత ప్రదేశానికి సరిజోడుగా రంగు రంగుల తుమ్మెదలు విహారం చేస్తున్నాయి. అన్నింటినీ తన కంటితో చూస్తూ, ఆ ప్రదేశంలో లీనమవుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ నున్నటి బండరాయి మీద కూర్చున్న మృదులమైన ఓ యువతి కనిపించింది. ఆమె ఆలోచనలోఅతను రావడం గమనించనే లేదు. అతను తను ఉన్న చోటే అలానే నిలుచుండి పోయాడు, మళ్ళీ ఎక్కడ శబ్థం చేస్తే తను వెడిపోతుందోనని. తనకు కనిపించిందంతా చూస్తూ కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించడం మొదలు పెట్టాడు.
క్రితి. ఆమె సౌందర్యం ఆ అందమైన ప్రదేశానికి ఏమాత్రం తీసిపోదు. ఇంటిలో అమ్మా నాన్నల పెళ్ళి పోరు పడలేక తనకు ఇష్టమైన ప్రకృతి తో సమయం గడపటానికి రోజూ వస్తుంది. పెళ్ళి చేసుకుంటేనేనా జీవితం? పెద్దవాళ్ళయిన అమ్మ నాన్నల భాద్యతలు తీరుతాయి, కాదనను, కానీ నా స్వేచ్ఛ సంగతీ? అని తనలో ఉన్న భావనతో తను ఇప్పుడల్లా పెళ్ళి చేసుకోసుకోనని కొంత సమయం కావాలని చెప్పింది.
తన పెళ్ళి దీర్ఘాలోచనలోంచి కొంతసేపటికి తేరుకుంది. తన ముందున్న తెనెటీగను చూసి ఎంత స్వేచ్ఛగా తిరుగుతోందో అనుకుంటోంది. ఆ తెనటీగనే అడుగుతాను తనతో తీసుకొని వెడుతుందేమో అని అనుకుంటోంది. పోనీ ఈ తుమ్మెదేమైనా తనతో రమ్మంటుదేమో అని అది ఎటు వెడుతుంటే దానిని చూస్తూ తన చూపు అటు ఆ చిత్రకారుడి వైపుకు మళ్ళి ఒక్కసారిగా తుళ్ళి పడింది. అక్కడి నుంచి తొందరగా వెడదామని లేచింది. మళ్ళీ ఎందుకనో వెనుకకు తిరిగి అతన్ని చూసింది.
అతను తన చెవులు పట్టుకొని తప్పుకు క్షమించమన్నట్లుగా సైగలు చేసాడు, తన అభిప్రాయం తెలుసుకోకుండా ప్రకృతి రమణీయతలో మునిగిఉన్న తన చిత్రం గీసినందుకు ఏమనుకోవద్దు అని అన్నట్లుగా తెలుస్తోంది అతను చేసే సైగలు చూస్తే.
ఇంతలో అతను దగ్గరకు వచ్చి ఆ గీసిన చిత్రం తీసుకోమని చేయిజాచాడు. అతను అందించిన విధానం చూస్తే చిత్రం అతను గీసినా అది తనకే చెందుతుంది అన్న భావం కలిగింది అమెకు. అతడి కళ్ళు ఏమి అనుకోకుండా స్వీకరించమని అడుగుతున్నాయి. క్రితి బెరుకుగా ఆ చిత్రాన్ని దూరం నుంచి తీసుకుంది. దాన్ని చూసి ఆశ్చర్యబోయి తను అంత అందంగా ఉంటానా అనుకొంది.
ఆ చుట్టూరు ఉన్న పరిసరాలకి అద్దం పట్టేలాగా ఉంది చిత్రం. మళ్ళీ ఆ చిత్రంలో తనను తాను చూసుకొని క్రితి మొహం కమిలింది, బుగ్గలు ఎర్రగా తయారయ్యాయి, పెదాలు ఎండిపోయాయి. తన లోపలనుండి ఏదో చెప్పలేని అనుభూతి రగిలింది.
క్రితి తేరుకొని ఆ చిత్రం వెనుకకు తిరిగి ఇచ్చి, చాలా అద్భుతంగా గీసారు కాబట్టి అది మీకే చెందుతుందని, తను అందులో మిగతా వాటితో పాటు ఒక పాత్రధారి మాత్రమేనని ఆ చిత్రాన్ని తీసుకోవడానికి తిరస్కరించింది. వెనుకకు తిరిగి ఇచ్చేసి తను ఇంటికి బయలుదేరింది.
గీత్ తను ఏదో చెబుదామని మళ్ళీ నిగ్రహించు కున్నాడు. క్రితిని ఆ చిత్రం బాగా కదిలించింది. ప్రకృతి తో పాటు అంత చక్కగా ఎలా తన అందాన్ని చిత్రీకరించాడో అని అనుకుంటోంది. ఆ చిత్రం తీసుకొని ఉంటే బావుండేదేమో అనుకుంటోంది. పోనీ వెనుతిరిగి వెళ్ళి అడిగితే అని ఆగి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరుకుంది.
“వచ్చావా అమ్మా” అని అడిగారు నాన్న. “ఒంటరిగా బయటకు తిరుగకు పెళ్ళికావలసిన పిల్లవి” అన్నారు.
“పెళ్ళికి కొంత సమయం అడిగాను కదా నాన్న” అంది.
“నేను పెద్దవాడిని అవుతున్నాను కద తల్లీ ఎన్నాళ్ళో ఈ భారం మోయను” అన్నాడు.
“మీకు భారం లేకుండానే చేస్తానులే నాన్న” అంది క్రితి. వంటగదిలో అమ్మకు పనిలో సాయానికి తోడు వెళ్ళింది.
అమ్మకూడా నాన్న లానే మళ్ళీ పెళ్ళిగురించి ప్రస్తావించడంతో తను పట్టించుకోకుండా పనిలో పడింది. ఆ చేస్తున్న పని మధ్యలో మళ్ళీ తన ఆలోచన అటు ఆ చిత్రం వైపు మళ్ళింది, అది కాక ఆ చిత్రికారుడైని గుర్తుకు తెచ్చుకుంది. తన అందానికి సరిజోడు కానే కాదు అనుకుంది, కానీ అతని చేతిలోని కళలోఎంత అందం దాగి ఉందో అని అనుకుంటోంది క్రితి. అదే ప్రదేశానికి వెడితే గనుక తను కలుస్తాడేమో అని అనుకొంటోంది.
తనను కలిసింది ఒక్కసారే అయినా ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నాను, ఏది ఏమైనా ఆ చిత్రం నన్ను చలించింది అనుకొంది క్రితి. మళ్ళీ తనను కలవాలన్న కుతూహలం కలిగింది.
తరువాత రోజు అక్కడికి వెళ్ళింది, చాలా ఎదురు చూసింది. ఆ తుమ్మెదతో కబురంపింది. తను వెళ్ళిన చోటకల్లా తూనీగను తోడు రమ్మంది. అతను నిన్ను ఎటువెళ్ళాడో చూసావా అని ఆ తేనెటీగ నిలదీసింది. నిరుత్సాహం తో వెనుతిరిగి ఇంటికొచ్చింది.
తనను తాను నిందించుకొని ఏమి లాభం, కలిసిన మొదటి సారి పరాయివాళ్ళను వాళ్ళని అన్నీ అడగటం మంచిది కాదు అని తనకు తాను సర్ధి చెప్పుకుంటోంది. తన మనసు ఒకవైపు కనీసం ఆ చిత్రం తీసుకున్నా దాని మీద తన పేరన్నా రాసి ఉండేదోమో అనుకుంది, ఉత్త పేరుతో మనుషుల చిరునామా తెలియదు లే, ఇంక ఆ సంగతి మరిస్తేనే నయం అనుకుంది.
రోజూ లానే ఆ రోజు కూడ వెళ్ళింది అక్కడికి క్రితి. కూర్చొని చూస్తుంటే ఆ తేనెటీగ రివ్వున చెవి దగ్గరే తిరగడం మొదలు పెట్టింది. అటు వెళ్ళి మళ్ళీ క్రితి దగ్గరకు వస్తోంది. తను లేచి ఎటు వెడుతుంటే అటు వెళ్ళడం మొదలు పెట్టింది. కొత్త ప్రదేశానికి తీసుకెని వెడుతోంది. పెళ్ళి కావలసిన దానివి బయటకు ఒక్కదానివే వెళ్ళడం మంచిది కాదు, అని నాన్న అన్న మాటలు చెవిలో మారు మ్రోగాయి. తను ఇంక ముందుకు వెళ్ళడం మంచిది కాదనుకోంది. తను వెనుతిరిగే లోగ ఆ తెనెటీగ క్రితి దగ్గరే తిరగడంతో సరేనని ధైర్యం చెద్దామని అనుకొంది. ముందుకు సాగింది, కొంత దూరంలో గీత్ ని చూసింది. తనకు ప్రాణం లేచి వచ్చింది. దగ్గరకు వెళ్ళి కౌగలించుకుంది. ఆశ్చర్యబోయాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కొంత సేపటికి అర్థం అయ్యింది క్రితికి. దూరంగా జరిగింది తన మనసు కూడా గీత్ మాటలానే మూగబోయింది.
ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్ధం కాలేదు క్రితికి. కళ్ళలోంచి నీళ్ళు ఎర్రటి బుగ్గల మీదనుండి కారడం మొదలు పెట్టాయి. ఏంతో ఎదురు చూసి తనను కలిసినందుకు వచ్చిన ఆనంద భాష్పాలా లేక తను మూగవాడని తెలిసిన క్షణం మనసు చివుక్కుమని దుఃఖంతో తన్నకు వచ్చిన కన్నీరా అని అనుకుంటోంది క్రితి.
తను వేసిన చిత్రం చూడమంటున్నాడు. ఎంతో అద్భుతంగా గీసాడు. తను నించొన్న ప్రదేశం నుండి చూస్తే రెండూ పోలినట్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉందని గుండె లోతునుండి వచ్చిన స్వరంతో అంది. గీత్ తను వేసినవి ఇంకొన్ని తీసి చూపించాడు. అవన్నీ ఈ చుట్టు పక్కల ప్రాంతాలే అన్నట్లు సైగలు చేసాడు.
తను అంత బాగా గీసినందుకు మళ్ళీ హద్దుకోవాలని పించింది. మరి కొన్ని తీసి చూపించాడు, భార్య పిల్లలవి కాబోలు. ఆవిడను చూసి ఎంత అదృష్టవంతురాలో అనుకుంది మనసులో.
నాకు కూడా చిత్రాలు వేయడం నేర్పిస్తారా అంటూ అడిగింది క్రితి. వెంటనే సరే అన్నాడు. తనకు తెలిసిన ఇంకొన్ని ప్రదేశాలు తీసుకెడతానంది. కొన్ని రోజులు కొత్త ప్రదేశాలలో తను చిత్రీకరిస్తూ, క్రితి కూడా నేర్పించాడు.
తను వచ్చిన పని పూర్తి అయినందులకు క్రితికి చిత్రాలు గీయటానికి కావలసినవీ తనతో తెచ్చుకున్నవన్నీ ఇచ్చాడు. గురుదక్షిణ గా తను గీసిన చిత్రాన్ని బహుకరించింది. మంచి శిష్యురాలు దొరికినందుకు, ఆ చిత్రం బాగా వేసినందుకు అభినందించాడు గీత్. తను కూడా ఓ చిత్రం ఇచ్చాడు, గీత్ అని రాసుండంతో చూసి తన పేరు సరైనదే అనుకుంది.
తన ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానికి అనుకోకుండా చేజిక్కిన కళతో క్రితి చక్కగా సమయం గడుపుతుంది. రోజు రోజుకు కొత్త ప్రదేశాలను చిత్రీకరించ సాగింది.
ఓ రోజు నాన్న మళ్ళీ ప్రస్తావన తీసుకొని వచ్చారు. క్రితిని ఎలాంటి వడైతే బావుంటుందో అడిగారు. తను మాట్లాడలేదు. తను వేస్తున్న చిత్రాలు చూసి అబ్బుర పడి ఎలాంటి వరుడు కావలనుకుంటోందో ఆ చిత్రాన్ని గీయమన్నారు.
అది నచ్చి కొన్ని రోజులు తీసుకొని తన రాజకుమారుడిని చూపించింది. నాన్నగారు నవ్వి సరే అలాంటి వాడినే తీసుకొని వస్తానని అన్నారు క్రితితో.
పెళ్ళి చూపులు ఏర్పాటు చేయించారు. అందరూ అతని కోసం ఎదురు చూస్తున్నారు, ఇంతలో రానే వచ్చాడు. అతడిని చూసి తన చిత్రీకరించిన వాడిలానే ఉందనుకోంది. అన్నీ కుదిరాయి. ముహూర్తం నిశ్చయించారు, అందరూ చాలా సంతోషం గా ఉన్నారు.
పెళ్ళి సంతోషంగా జరగడం, తన చిరకాల వాంఛ తీరినందుకు నాన్న, అమ్మ చాలా సంతోషించారు. తన పెళ్ళి కారణమైన విద్య నేర్పిన గురువును మనసులో తలుచుకుంది క్రితి.
ఏదో ఓ రోజు మళ్ళీ తన గురువును కలుస్తానన్న కోరికతో తను నేర్చుకున్న , తన తోడైన విద్యను శ్రద్ధగా కొనసాగిద్దామని తలిచింది క్రితి.
శుభం భూయాత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *