April 20, 2024

చీకటి మూసిన ఏకాంతం 3

రచన: మన్నెం శారద

“ఇక చాలు!” వసుంధర మరో రెండు ఇడ్లీలు వెయ్యబోతుంటే చెయ్యడ్డం పెట్టింది నిశాంత.
“తిను. మళ్ళీ అర్ధరాత్రి వరకూ తిరగాలిగా!” అంది వసుంధర కటువుగా.
నిశాంత తల్లివైపదోలా చూసింది.
రాత్రి సాగర్ తనని స్కూటర్ మీద వదలడం ఆమె కంటపడింది. పొద్దుటే ఆ సంగతిని ఎలా అడగాలో అర్ధంకాక విశ్వప్రయత్నాలు చేస్తున్నదావిడన్న సంగతి నిశాంతకి అర్ధమయింది.
ఎదురుగా కూర్చుని టిఫిన్ తింటున్న కూతురి వైపు పరిశీలనగా చూశాడు నవనీతరావు.
నిశాంత తల్లిమాటకెగిరి పడకుండా టిఫిన్ చేయడం అతనికి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
“ఈ చదువులు, తద్దినాలు వద్దంటూనే వున్నాను. ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్ళి చేయలేమా? మర్యాద మంటకలిపి పోకుండానే ఎవణ్ణో ఒకణ్ణి పట్టుకొని కాళ్ళు కడిగి కన్యాదానం చేయమని చెబితే మీకు పడుతుందా?” వసుంధర భర్తని సాధిస్తూ మరో రెండు ఇడ్లీలు ఆయనకి వేయబోతుంటే, నవనీతరావు చెయ్యడ్డం పెట్టి వారించి “ఏదో ఒక టిఫిన్ చేస్తే చాలు వసూ! రెండు రకాలు జీర్ణించుకునే వయసు కాదు నాది!” అన్నాడు శాంతంగా.
వసుంధర ఆయనవైపాశ్చర్యంగా చూస్తూ “రెండు రకాలెక్కడ చేసేను? ఇడ్లీ ఒకటేగా!” అంది.
నువ్వు నోటితో వడ్డిస్తున్న వాటితోనే కడుపు నిండిపోయింది. ” అంటూ లేచి చెయ్యి కడుక్కున్నాడాయన.
నిశాంత కూడా అతనితో పాటూ లేచి చెయ్యి కడుక్కుని గదిలోకెళ్ళిపోయింది.
భర్త మాటకు కంగు తిన్నట్లయింది వసుంధర.
హార్లిక్సు తీసుకెళ్ళి అతనికిస్తూ “కూతుర్ని మందలించుకోడానిక్కూడ నాకధికారం లేదా?” అంది నిష్టూరంగా.
అతను చదువుతున్న పేపర్ పక్కకి పడేసి హార్లిక్స్ అందుకుంటూ “అలా ఎవరన్నారు?” అన్నాడు.
“వేరే అనాలా? నాకు నోరెక్కువని దానిముందే అంటే అదింక గౌరవిస్తుందా?”
“ముందు నువ్విలా కూర్చో!” అన్నాడాయన ఓర్పుగా.
వసుంధర అయిష్టంగానే కూర్చుందాయన పక్కన.
“ఇప్పుడు చెప్పు. అదింటి పరువు తీసే పనేం చేసింది?”
“రాత్రి… రాత్రి ఎవరో అతని స్కూటర్ మీద వచ్చింది. మనం పంపిన కారుని వెనక్కి పంపేసి అతనితో రావాల్సిన పనేంటి? ఊరినిండా నా బంధువులున్నారు! ఎవరైనా చూసి ఏవన్నా అంటే నా పరువేం కావాలి!” అంది వసుంధర ఉక్రోషంగా.
“అంటే నీ కూతురి భవిష్యత్తుకన్నా, నీకు మీవాళ్ళు చేసే వ్యాఖ్యానాలే ముఖ్యమన్నమాట!” అన్నాడాయన భార్యని నిశితంగా గమనిస్తూ.
వసుంధర అతని వైపు కోపంగా చూసింది.
“మీ డొంకతిరుగుడు నాకర్ధం కాదు. పదిమంది నోళ్ళలో పడితే దానికి మంచి సంబంధం దొరకదనేగా నా బాధ!” అంది బాధగా.
“నీ బాధ నాకర్ధమయింది వసూ! కానీ వ్యక్తిత్వమొచ్చిన కూతురికి చెప్పే విధానమది కాదు.”
“ఇంకెలా చెప్పాలో నాకు తెలీదు. వీధి గుమ్మంవైపు వస్తేనే వీపు చీరేసేది మా అమ్మ! అలా నేనేం ఆంక్షలు పెడుతున్నాను కనుక! అర్ధరాత్రి వరకూ ఇష్టం వచ్చినట్లు తిరిగి పరాయి మగాడి స్కూటర్ మీద రావాల్సిన అవసరముందంటారా?” అంది వసుంధర అవేశంగా.
నవనీతరావు కొంచెం సేపు మాట్లాడలేనట్లుగా చూశాడామె వైపు.
భర్త కూడా మౌనం వహించడంతో వసుంధరకి తన వాదనలో బలమున్నదన్న గురి కుదిరింది.
“ఇంతకీ ఇదంతా మీరిచ్చిన అలుసు! మనకి బోల్డంత ఆస్తుంది. ఆ డాక్టరు చదువు దేనికి? శుభ్రంగా పెళ్ళి చేయక దాన్ని బరితెగించినట్లు గాలికొదిలేసేరు!” అంది.
నవనీతరావు చిన్నగా నిట్టూర్చి “నీ ఆలోచనలు చాలా వెనుకే వున్నాయి వసుంధరా! నిశాంత మామూలు ఆడపిల్ల కాదు. ఏదో ఒకటి సాధించాల్సిన తత్వం ఆమెలో బాగా వుంది ‌ చదువులో కూడ బ్రిలియంట్. అలాంటి వ్యక్తిత్వమున్న ఆడపిల్లని ‘ఆడ’ అనే పేరుతో అణచివేయడం చాలా దుర్మార్గం. ఎవరితోనో స్కూటర్ మీద రాగానే ఏదో అపరాధం జరిగిపోయినట్లుగా ఎందుకంతగా గాభరా పడ్తావు? అతనెవరో సున్నితంగా అడగొచ్చుగా!” అన్నాడు మెల్లిగా.
“ఆ సున్నితాలూ, సుకుమారాలూ నాకు రావు. చేతులు కాలేదాక మీరలానే నా కూతురందరిలాంటి పిల్ల కాదని కూర్చోండి. ఫలితం తెలిసేక అసలు సిసలైన ఆడపిల్లేనని చేతులు నెత్తిమీద పెట్టుకొని అఘోరించొచ్చు” అంది.
“తల్లివై ఎందుకలా శాపాలు పెడ్తావు! నువ్వు చూసింది బహుశ ఆ పిల్లాణ్ణే అయుంటుంది!” అన్నాడతను కాస్త కోపంగా.
“ఏ పిల్లాణ్ణి? మీకతను తెలుసా? ఆశ్చర్యపోతూ అడిగింది వసుంధర.
“తెలియడమంటే చాలాసార్లు బీచ్ లో అమ్మాయితో చూశాను. ”
“చాలాసార్లు చూశారా? మరి ఎవరతనని అడగలేదూ!”
“ఎందుకడగాలి! దాని బాధ్యత దానికి తెలియదా? అమ్మాయి స్నేహితుడెవరో అయి వుంటాడని అటు పక్కకి కూడా వెళ్ళకుండా మరోవైపు కూర్చున్నాను.” అన్నాడు నవనీతరావు నిదానంగా.
“హవ్వ!” అంటూ నోరు నొక్కుకుంది వసుంధర.
“ఏం?” అనడిగేడు నవనీతరావు అమాయకంగా.
“బీచ్ లో వాడితో కబుర్లేంటని నిలెయ్యక పైగా అటు పక్కక్కూడా వెళ్ళకుండా మరోవైపు కూర్చున్నారట! వినడానికి నాకే సిగ్గుగా వుంది.” అంది వసుంధర కోపంగా.
“అలా ఎందుకులే! చెప్పడానికి సిగ్గులేదా అని డైరక్టుగానే అను.”
వసుంధర మాట్లాడలేదు.
“నీ వాక్చాతుర్యం నాకు తెలిసిందే గాని దాని దగ్గర ఈ తెలివితేటలు ప్రదర్శించకు. నేనలా దాని విషయంలో జోక్యం చేసుకోకపోవడం నీకు చేతగానితనంగా కన్పించొచ్చు. బావిలో కప్పకి చెరువు వైశాల్యమెలా తెలుస్తుంది? దాన్ని సూటిపోటి మాటలని కోడలు లేని సరదా తీర్చుకోకు. నా కూతురికెంత స్వేఛ్ఛివ్వాలో నాకు బాగా తెలుసు.” అన్నాడాయన కఠినంగా.
“సర్లెండి. మీరిద్దరూ ఒకటే! ఈ ఇంటి పరువు పోయాక అందరం కట్టకట్టుకొని ఏడవచ్చు” అంటూ విసురుగా వెళ్ళిపోయింది వసుంధరక్కణ్ణుంచి.
నవనీతరావు చిన్నగా నిట్టూర్చేడు.
తను గిరిగీసుకొన్న పరిధిలోనే నిలబడి ప్రపంచాన్ని చూడటం – ఆ చూసిందాన్నే ప్రపంచమనుకోవడం ఆమె లక్షణం.
పెళ్ళయిన ఈ పాతికేళ్ళలో ఆమె ఆలోచనా పరిధిని పెంచాలని అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేయి.
చూసిందాన్ని సూటిగా అడగకపోగా, సూటీపోటీ మాటలతో వేధించి విషయాన్ని బయటికి లాగాలని ఆమె చేసే ప్రయత్నం అతనికి అనేకసార్లు తలనొప్పి తెప్పిస్తుంటుంది.
కాని… అతని తీరే అంత!
అతను విసుగ్గా గదిలో పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు.
ఒకసారి ఆకుర్రాడెవరో నిశాంతనడిగేస్తే…?
ఆ ఆలోచన వచ్చినందుకు ‘ఛ!ఛ!’ అనుకున్నాడు మనసులోనే.
రోజూ కాలేకీలో జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పే కూతురు అంత చెప్పాల్సిన విషయముంటే అతని గురించి చెప్పదా?
అడిగి కూతురి దృష్టిలో తమకున్న విలువని పోగొట్టుకోవడానికి మనస్కరించలేదతనికి.
“డేడీ!”
కూతురి పిలుపుకి తలెత్తి చూశాడు నవనీతరావు.
“ఏమ్మా!” అన్నాడు మెల్లిగా.
“నీతో మాట్లాడాలి డేడీ!” అంది నిశాంత అతని దగ్గరగా వచ్చి.
“చెప్పమ్మా! డబ్బేమైనా కావాలా?” అన్నాడతను మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ.
“రాత్రి… రాత్రి… మమ్మీ చూసింది నిజమే!” అంది మెల్లిగా.
“నువ్వాసంగతింకా ఆలోచిస్తున్నావా? మీ మమ్మీ ధోరణి నీకు తెలుసుగా! నువ్వదేం పట్టించుకోకు!” అన్నాడు కూతురి తల నిమురుతూ.
నిశాంత కొంచెం సేపు మాట్లాడలేదు.
నవనీతరావు కూతుర్నే దీక్షగా చూస్తున్నాడు.
“డేడీ!” అంది నిశాంత మళ్ళీ.
“చెప్పు తల్లీ! ఏంటీ రోజలా సందేహంగా మాట్లాడుతున్నావు?” అనడిగేడు నవనీతరావు సందేహంగా చూస్తూ.
“నువ్వు.. నువ్వు.. బీచ్‌లో మమ్మల్ని చూసి కూడ ఎందుకని పలుకరించలేదు?” అంది తండ్రి మొహంలోకి నిశితంగా చూస్తూ.
కూతురు తమ సంభాషణ విన్నదని తెలిసి గతుక్కుమన్నాడతను.
“నువ్వు మా మాటలు విన్నావా?” అన్నాడాయన నీరసంగా.
“విన్నాను డేడీ! కాని కావాలని కాదు. నా గురించి మీ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని మాత్రమే. మీ మాటలు విన్నాక మీలాంటి వారి కడుపున పుట్టినందుకు, రియల్లీ అయామ్ వెరీ హేపీ డేడీ!” అంది నిశాంత ఆవేశంగా.
నవనీతరావు నిదానంగా నవ్వి “ఇది చెప్పడానికేనా… ఏదో మాట్లాడాలన్నావ్!” అన్నాడు.
“ఇంతదాక వచ్చేక అతనెవరో మీకు చెప్పకపోవడం భావ్యం కాదు. అతను…”
“వద్దమ్మా! అవసరమనుకుంటేనే చెప్పు. నిన్ను నిలవేసి అడిగే తక్కువ స్థాయికి నన్ను తీసుకెళ్ళొద్దు.” అంటూ కూతుర్ని వారించేడతను.
“కాని మమ్మి…” అంటూ సందేహంగా చూసింది నిశాంత.
“మీ మమ్మి చిన్నప్పుడు వాళ్ళమ్మమ్మగారి ఊరికి పడవ దాటి ఎద్దుల బండిలో వెళ్ళేదట! ఇప్పుడు విమానంలో రయ్ మంటూ ప్రయాణం చేస్తోంది! కాని బుద్ధులు మాత్రం ఎద్దుల బండి నాటివే! ఏం చేస్తాం! పట్టించుకోకు!” అన్నాడతను నవ్వుతూ.
నిశాంత చిన్నగా నవ్వి “పాపం, మమ్నీ మంచిదే డేడీ!” అంది.
నవనీతరావు ఆశ్చర్యపోతూ “చివరికి నేనేనన్న మాట చెడయింది” అన్నాడు నవ్వుతూ.
నిశాంత తండ్రితో కలిసి నవ్వింది, తేలిక పడిన మనసుతో.

“హాలు ఫిక్సయింది. టిక్కెట్స్ కూడ ప్రింటయ్యేయి. అతని సాధన ఎంతవరకొచ్చిందో తెలియదు. ఈమధ్య ఒకసారైనా కనిపించేడా?” అనడిగేడు విద్యాసాగర్.
“ఉహు” అంది నిశాంత.
“మరలా అయితే ప్రోగ్రాం అంతా అభాసయిపోదూ! అతని సంగతి కనుక్కో!”
“అలాగే! నేను నిన్ను చాలా స్ట్రెయిన్ చేస్తున్నాను కదూ!” అంది నిశాంత.
సాగర్ నవ్వి “సర్లే! ఇలా అనుకోవడం మొదలుపెడితే దీనికంతుండదు. ఈ పని నీది అనుకొని చెయ్యడం లేదు… మనది అనుకొని చేస్తున్నాను.” అన్నాడు.
“థాంక్స్!” అంది నిశాంత.
“అన్నట్లూ డబ్బు తీసుకొచ్చాను. ఖర్చులన్నీ జమ రాయి. చివర్లో చూసుకుందాం.” అంటూ పర్సులోంచి డబ్బు తీసి అతనికందించింది నిశాంత.
“ఎంత?” అన్నాడు సాగర్.
“ఎంతోకొంత! ముందు పనులు కానివ్వు” అంది.
“మీ డేడీనడిగేవా?”
“ఇంకా ఆయనకి చెప్పలేదు. ఇది నా అకౌంట్ లోది. తర్వాత మెల్లిగా చెబుతాను”.
” ఏమీ అనరా? కొంచెం ఆశ్చర్యంగా అడిగేడు సాగర్.
“ఉహు! ఆయన సంగతి నీకు చెబితే అర్థం కాదు. చూపిస్తానుగా. ఆ సమయం కూడ దగ్గరకొస్తున్నది.” అంది నిశాంత నవ్వుతూ.
అతని కళ్ళలో మెరుపు మెరిసింది.
దాన్ని కనిపించకుండా కప్పి పుచ్చుకుంటూ “నువ్వోసారి హితేంద్ర విషయం ఎంక్వయిరి చేసిరా. నేను కాలేజి సెక్రెటరీతో మాట్లాడి వస్తాను” అంటూ ముందుకు సాగిపోయేడు విద్యాసాగర్.
నిశాంత కారెక్కింది. కారు అతని ముందునుండే సాగిపోయింది. అతను ఉత్సాహంగా నడుస్తుంటే “హలో” అని పిలిచినట్లయి వెనుతిరిగి చూసేడు.
డాక్టర్ కృష్ణ నిలబడి వున్నాడక్కడ.
“గుడ్ మార్నింగ్!” అన్నాడు నవ్వుతూ.
“ఏమంటుంది మీ లవ్? హౌస్ సర్జన్సీ కాగానే పెళ్ళి భోజనాలేర్పాటు చేస్తున్నావా?”
సాగర్ ఉలిక్కిపడ్డాడు.
“ఎవరి గురించి మీరు మాట్లాడేది?” అన్నాడు ఆశ్చర్యంగా
“నా దగ్గర దాస్తావెందుకు? నిశాంతని నువ్వు చేసుకోబోతున్నట్లుగా విన్నాను” అన్నాడు డాక్టర్ కృష్ణ.
“లేదండీ! ఇంకా అనుకోలేదు మేం!” అన్నాడు సాగర్ మొహమాటంగా.
“ఊరంతా అనుకుంటున్నా మీరనుకోలేదంటే ఎలా? ఇప్పుడయినా అనుకోండి మరి!” అంటూ హెచ్చరించి నవ్వుతూ వెళ్ళిపోయేడు కృష్ణ.
సాగర్ మొహమంతా సంతోషంతో ఒకలాంటి వెలుగు క్రమ్ముకొంది.
‘అందుకేనేమో నిశాంత తనని త్వరలో తండ్రికి పరిచయం చేస్తానని చెప్పింది’ అనుకున్నాడు మనసులో.
నిశాంతని తను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం తన మనసుకి తెలుసు.
కాని… ఆ విషయం నిశాంతకి చెప్పాలంటే… ఎందుకో మొహమాటమడ్డమొస్తున్నది. దానిక్కారణం చేతకానితనం కాదు.
ఒకవేళ నిశాంత నిరాకరిస్తే… దాన్ని తను భరించలేడు. అంత హైపర్ సెన్సిటివ్ తను!
అందుకే నిశాంత వైపు నుండే ఆ ప్రపోజల్ రావాలనతనాశిస్తున్నాడు.
నిశాంత తన ఒక్కడితోనే చనువుగా వుంటుందని – స్నేహం చేస్తుందని అందరికీ తెలుసు.
కాని ఆమె తన పరిధిని దాటకుండా ఒకే బిందువులో అలానే వున్నదన్న సంగతి తనకి మాత్రమే తెలుసు.
ఇప్పుడిప్పుడే నిశాంత కొద్దికొద్దిగా బయటపడుతోంది!
నిశాంత తన జీవితంలోకి ప్రవేశిస్తే తన బతుకులో ఎంత వెలుగు నింపగలదో కేవలం అలోచిస్తుంటేనే అతని మనసు ఎంతో ఉత్తేజానికి లోనవుతోంది.
ఛాతీ గర్వంతో వెడల్పయింది.
అతని అడుగులు హుషారుగా ముందుకి పడ్డాయి.

*************

నిశాంత యూనివర్శిటీ కేంపస్ లో కారు దిగి హితేంద్ర గురించి వాకబు చేసింది.
అతనెవరో తెలీదనే చెప్పారు చాలామంది.
నిశాంతకి నిజంగానే ఆశ్చర్యమేసింది.
‘అంత బాగా పాటలు పాడే అతనెవరికీ తెలియకపోవడమేంటి? ఒక తెలుగువాడి ప్రతిభని గుర్తించడం ఈ తమిళులకి చిన్నతనమేమో!’ అనుకుంది మనసులోనే.
“అతను మంచి సింగర్!” అంది చివరికి.
అక్కడ నిలబడ్డ స్టూడెంట్స్ మొహమొహాలు చూసుకున్నారు.
“మా క్లాసులో సింగర్సెవరూ లేరు” అన్నాడొక నంబియార్.
ఇంకొక అయ్యంగారు ఏదో గుర్తు తెచ్చుకునట్లుగా నవ్వి “బహుశ వాడయి ఉంటాడేమో!” అన్నాడు తమిళంలో.
“యార్? యార్?” అంటూ అరిచేరు గుంపు.
“వాడే! ఎస్సెస్ గాడయి వుంటాడు.”
అవతలవాళ్ళు కూడా పెద్దగా నవ్వి నిశాంతని తేరిపార జూసేరు.
నిశాంతకి వాళ్ళు తననలా గమనించడం సిగ్గనిపించింది.
“ఎస్సెస్ అంటే?” అంది అయోమయంగా చూస్తూ.
“మీరతనికేమవుతారు?”
“ఏమీ కాను”
“ఇంత పెద్ద కారులో వచ్చినావిడ వాడికేమవుతుందిరా! చెప్పేద్దాం!” అన్నాడొకతను. అతని వాచికాన్ని బట్టి అతను తెలుగువాడయి వుంటాడని గ్రహించింది.
“అయితే పర్వాలేదు. వాణ్ణి మేం స్ట్రీట్ సింగరంటాం. దానికి షార్ట్ కట్టే ఎస్సెస్సంటే! హితేంద్రంటే ఎవడికి తెలుస్తుంది. చాలా మంచి పేరే వుందన్నమాట వాడికి!”
అతని హేళన ఆమెకి బాగా కోపాన్ని తెప్పించింది.
అయినా దాన్ని నిగ్రహించుకుని “అతను కాలేజీకి వచ్చేడా?” అనడిగింది.
“ఏం చెబుతాం మిస్! అతను వచ్చిందీ లేందీ ఎవరికి తెలుస్తుంది? జిడ్డోడుతూ ఏమూలో కూర్చుంటాడు. వాడి బెంచ్ మేట్ కన్నా వాడొచ్చిన సంగతి తెలుస్తుందో లేదో!” అన్నాడతను.
“వాడి బెంచీలో ఎవరు కూర్చుంటార్రా? వాసన!” అంటూ ముక్కు మూసుకున్నాడొకడు.
నిశాంత ఆ సిట్యుయేషన్ని చిరాగ్గా భరిస్తోంది.
“పాపం ఆవిడెందుకో అంత కష్టపడి వచ్చేరు. కనీసం తెలుసుకొని చెప్పాల్సిన బాధ్యత మనకుందిరా. ఆ సుబ్బులుగాడు కూడా తెలుంగుకారన్ కదా! వాణ్ణి పట్టుకొని కనుక్కోండి!” అన్నాడు నంబియార్ జాలి చూపిస్తున్నట్లుగా.
అందరూ అన్నివైపులా చూశారు.
మరో పది నిముషాల్లో అడ్డబొట్టు పెట్టుకొని నడవలేక నడుస్తున్నట్లుగా వస్తున్న కుర్రాణ్ణి చూసి వాళ్ళ కళ్ళలో మెరుపు మెరిసింది.
“హాయ్, సుబ్బులూ!” అన్నారు ఆనందంగా.
అతను వీళ్ళవైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోబోయేడు.
“ఉష్! వాడిప్పుడు సుబ్బులని పిలిస్తే పలకడు. పని మనది!” అన్నాడింకొకతను.
“మిస్టర్ బాలసుబ్రమణ్యం!”
ఈసారతనాగేడు.
“ఏంటి?” అన్నాడు చిరాగ్గానే.
“ఇట్రావోయ్. ఈవిడకి మీ ఎస్సెస్ వివరాలు కావాలట!.
అతను కళ్ళద్దాలు సవరించుకొని నిశాంత వైపు చూసాడు.
“నా పేరు నిశాంత. హౌస్ సర్జన్సీ చేస్తున్నాను. నాకు హితేంద్ర గారి వివరాలు కావాలి! ” అంది చిరునవ్వుతో.
ఆమె వివరాలు విని సుబ్రమణ్యంతో పాటు అవతలి వాళ్ళు కూడా కంగుతిన్నారు.
“మేం వస్తాం మేడమ్!” అంటూ మెల్లిగా అక్కణ్ణుంచి జారుకున్నారు.
“అతను కాలేజీకి రావడం లేదండీ!” అన్నాడు సుబ్రమణ్యం.
“ఎన్నాళ్ళయింది?”
“వారం దాటుతోంది.”
“ఎందుకు రావడం లేదో మీకు తెలియదా?” అంటూ ఆదుర్దాగా అడిగింది నిశాంత.
“లేదు మేడం! అతనెవరితోనూ క్లోజ్ గా మూవ్ కాడు.”
“మీకు ఇల్లు తెలుసా?”
“తెలీదు.”
“మరెలా? అతనితో చాలా అర్జెంటు పనుంది.” అంది నిశాంత.
సుబ్రమణ్యం ఒక క్షణమాలోచించేడు.
“అతను స్కంద షష్టులకి వడపళని మురుగన్ కోవెలలో పాటలు పాడుతుంటాడు. అక్కడెవరికన్నా తెలుస్తుందేమో!”
“నాతో ఒకసారి రాగలరా?”
ఆమె అభ్యర్థన త్రోసిపుచ్చలేకపోయేడు సుబ్రమణ్యం.
ఇద్దరూ కారెక్కేరు.
కారు పావుగంటలో వడపళని మురుగన్ కోవెలకి చేరుకొంది.
సుబ్రమణ్యం నిశాంతని కారులోనే వుండమని చెప్పి, అతనే వెళ్ళి పది నిముషాల్లో తిరిగొచ్చేడు.
“అన్నా నగర్. చాలా లోపలికి. బాగుండదు. మీరు రాగలరా?” అన్నాడు కారులో కూర్చుని.
“ఊ” అంది నిశాంత.
మరో అరగంటలో కారు అన్నా నగర్ లో ప్రవేశించింది.
సుబ్రమణ్యం చెప్పిన ప్రకారం కారు కొన్ని సందు గొందులు తిరిగి ఒకచోట ఇక తిరిగే అవకాశం లేక ఆగింది.
ఆ సందు చాలా ఇరుకుగా, మురికిగా, దుర్గంధంతో గందరగోళంగా ఉంది.
ఒకపక్క డ్రెయినేజీ పగిలి మురికి నీరు కాలవలా ప్రవహిస్తోంది.
ఆ మురికి నీటిలో పందులతో పాటు, రేపటి భావి భారత పౌరులు కూడా చెడ్డీల్లేకుండా ఈతలు కొడుతున్నారు.
అక్కడ కారాగగానే వాళ్ళ దృష్టి కారు మీద పడింది.
ఇనుమడించిన ఉత్సాహంతో కారు చుట్టూ మూగేరు.
సుబ్రమణ్యం కారు దిగి నిశాంతని దిగమని సైగ చేసేడు.
నిశాంత ముక్కుకి చేతిరుమాలడ్డం పెట్టుకుని మెల్లిగా కారు దిగింది.
“ఇక్కడ కాస్త వెతకాలి మిస్! ఇల్లు నాక్కూడ సరిగ్గా గుర్తు లేదు.” అన్నాడు సుబ్రమణ్యం.
హితేంద్రంటే అక్కడెవరికీ తెలియలేదు.
అలాంటి పేరు గలవాడెవరూ లేనేలేరన్నారు.
చివరికి సుబ్రమణ్యమే అడిగేడు “పాటలు పాడతాడు” అని.
కొంతసేపు ఆలోచించి చివరికి ఒక కిళ్ళీ కొట్టతను చెప్పేడు “పాటలు పాడి డబ్బులడుక్కుంటాడతనా?” అని.
మనసు చివుక్కుమనిపించినట్లయింది నిశాంతకి.
“అవును అతనే!” అన్నాడు సుబ్రమణ్యం.
“ఆ సందులో ఎడంవైపు మొదటింట్లో అడగండి.”
ఇద్దరూ ఆ ఇంటి దగ్గరకెళ్ళేరు.
దాన్ని ఇల్లు అనేకన్నా సత్రమంటే బాగుంటుంది. చాలా పెద్ద పెంకుటిల్లది!
ఒక పెద్ద చెట్టులో పక్షులు గూళ్ళు పెట్టినట్లుగా దాన్నిండా గుంపులు గుంపులుగా సంసారాలున్నాయి.
నిశాంతని, సుబ్రమణ్యాన్ని వాళ్ళు పనులొదిలేసి వింతగా చూస్తూ నిలబడిపోయేరు.
“పాటలు పాడే అబ్బాయి…” అంటూ తమిళంలోనే అడిగేడు సుబ్రమణ్యం.
“అతనా! సుభద్రమ్మ కొడుక్కోసవట! దొడ్డివేపెళ్ళండి” అందొక తమిళ పాటి.
ఇద్దరూ మురికి సందులోంచి వెనక్కు మళ్ళేరు.
ఆడవాళ్ళు కొందరు ఆ సందులో పనులు చేసుకుంటూ నిశాంతని ఆశ్చర్యంగా గమనిస్తున్నారు.
“సుభద్రమ్మా. నీకోసం ఎవరో వచ్చేరు!”
చేటలో బియ్యం పోసుకుని ఏరుకుంటున్న ఒక నడి వయసు స్త్రీ తలెత్తి చూసింది.
వెంటనే ఆవిడ కళ్ళలో ఒకలాంటి అపనమ్మకమూ, ఆశ్చర్యమూ చోటు చేసుకున్నాయి.
చేట వదిలేసి అనుమానంగా లేచి నిలబడింది.
“హితేంద్ర మీ అబ్బాయే కదూ!” అంటూ అడిగేడు సుబ్రమణ్యం.
ఆమె సందిగ్ధంగా తలాడించింది.
“ఈవిడ మీ అబ్బాయి కోసం వచ్చేరు.”
ఆవిడ నిశాంత వైపు కళ్ళప్పగించి చూసింది.
అప్పటికే ఆ ఇంటిలోని అన్ని వాటాల్లోని ఆడవాళ్ళూ నిశాంతని సినిమా ఏక్టర్లా వింతగా చూస్తున్నారు. కళ్ళెగరేసి సైగలు చేసుకుంటున్నారు.
“నా పేరు నిశాంత. మీ అబ్బాయికి స్నేహితురాల్ని. ఆయన ఉన్నారా?” అనడిగింది నిశాంత.
“ఆ! ఆ! ఉన్నాడు” అందామె కంగారుగా రేగిన నెరిసిన జుట్టు సరి చేసుకుని కొంగులో చిరుగులు సర్దుకొని కప్పిపుచ్చుకుంటూ.
“పిలుస్తారా?” అన్నాడు సుబ్రమణ్యం.
“అతనికి జ్వరం. మూసిన కన్ను తెరవలేకుండా వున్నాడు.” అందొకామె జోక్యం చేసుకుంటూ.
“జ్వరమా?” అంది నిశాంత కంగారుగా.
సుభద్రమ్మకి అప్పటిక్కాస్త ధైర్యం చిక్కినట్లయింది.
“అవునమ్మా. వాడికి వారం రోజులుగా ఒకటే జ్వరం! వళ్ళు పెనంలా మాడిపోతున్నది.” అంది దిగులుగా.
“మేం చూడొచ్చా? అనడిగేడు సుబ్రమణ్యం.
“రండి” అందామె.
ఆమెననుసరించేరిద్దరూ.
వరండాకే తడికెలు పెట్టి దాన్నొక గదిగా తయారు చేసి అద్దెకిచ్చేడు ఇంటి ఓనరు.
వానకి, ఎండకి, చలికి కూడ ఎలాంటి రక్షణా ఇవ్వలేని అలాంటి ఇంటిని ఏనాడూ జీవితంలో చూసెరగని నిశాంత ఎంతగానో నివ్వెరపోయింది ఆ ఇంటిని చూసి.
ఎదుటివాడి అవసరాన్ని బట్టి మనిషిని ఎంత యిరుకులో పెట్టి సంపాదించొచ్చునో కూడ ఆమెకు తెలియదు.
మంచంలాంటి ఆకారంలో వున్న పక్క మీద వళ్ళు తెలీకుండా పడివున్నాడు హితేంద్ర.
అతని మీద ఒక పాత చీర కప్పింది సుభద్రమ్మ.
“డాక్టరుకి చూపించేరా?” అనడిగింది నిశాంత.
సుభద్రమ్మ తల దించుకుంది.
“ఏం చూపిస్తుంది? అత్తయ్య దగ్గర డబ్బులెక్కడియ్యి? ఇప్పటికే ఇంటి చుట్టూ అప్పులు చేసింది.” అందొకమ్మాయి నిశాంత వైపు చూస్తూ.
నిశాంతకి పరిస్థితి అర్ధమయ్యింది.
ఆమె గబుక్కున మంచం మీద కూర్చుని అతని రిస్టందుకుని నాడి చూసింది.
వెంటనే బాగ్ లోని బుక్ తీసి మందులు రాసి సుబ్రమణ్యం చేతికి ప్రిస్క్రిప్షన్, డబ్బు యిచ్చి “మా డ్రైవరుకి చెప్పి ఇవి తెమ్మంటారా?” అనడిగింది.
సుబ్రమణ్యం తలూపి బయటకెళ్ళేడు.
“మీరు డాక్టరా?” అనడిగింది సుభద్రమ్మ.
నిశాంత తలూపి “ఫ్లూ లా వుంది. మీరేం కంగారు పడకండి” అంది ధైర్యం చెబుతున్నట్లుగా.
సుభద్రమ్మ అదోలా నవ్వి “దేవుడు పంపినట్లు నువ్వొచ్చేవు. తల్లినయి నేను చూస్తూ కూర్చున్నాను కాని ఏం చేయగల్గేను!” అంది కన్నీటినదుముకొంటూ.
“ఏం ఫర్వాలేదు. తగ్గిపోతుంది. ఆహారమేమిస్తున్నారు?” అనడిగింది.
సుభద్రమ్మ జవాబు చెప్పలేనట్లుగా మౌనం వహించింది.
నిశాంత పరిస్థితినర్ధం చేసుకుంది.
ఇంతలో సుబ్రమణ్యం మందులు తీసుకొని వచ్చేడు ఆయాసంగా.
“ఇవిగోండి. ముందో డోసు వేసెయ్యండి” అన్నాడు నిశాంతతో. నిశాంత లేచి అతన్ని పక్కకి పిలిచింది.
“ఏంటి ప్రాబ్లామ్?” అన్నాడతను మెల్లిగా.
“అతని కడుపులో ఆహారం లేదు.”
సుబ్రమణ్యం అర్ధం కానట్లుగా చూశాడు.
“ఆహారం లేకుండా ఈ మందులు వాడితే జబ్బు తగ్గకపోగా పేషెంటు సీరియస్సయిపోతాడు.”
“ఏం చేద్దాం మరి?”
“ఇతన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం మంచిది. వాళ్ళు డ్రిప్స్ పెట్టి ప్రతి నిముషం కనిపెట్టి చూస్తారు” అంది.
సుబ్రమణ్యం తల పంకించేడు.
సుభద్రమ్మ వాళ్ళిద్దర్నీ అనుమానంగా చూస్తూ నిలబడింది.
“అమ్మా!” అన్నాడు సుబ్రమణ్యం మెల్లిగా.
సుభద్రమ్మ నిస్తేజంగా చూసిందతని వైపు.
“వీణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. మీరు బయల్దేరండి.”
సుభద్రమ్మ గుండె దడదడలాడింది.
నిశాంత ఊరడింపుగా నవ్వి, ఆమె భుజమ్మీద ధైర్యం చెబుతున్నట్లుగా చెయ్యేసి “హాస్పిటలనగానే అంత కంగారు పడతారేం? అక్కడయితే ప్రతి నిముషం డాక్టర్లొచ్చి చూస్తుంటారు. మీ అబ్బాయికేం ఫర్వాలేదు.” అంది.
సుభద్రమ్మ బుట్టలో మరో రెండు జతలు పెట్టుకుంది.
సుబ్రమణ్యం, మరో ఇద్దరు మగవాళ్ళూ సాయం పట్టి హితేంద్రని కారులో చేర్చేరు.
సుభద్రమ్మ అతని తలని ఒళ్ళో పెట్టుకుంది.
కారు హాస్పిటల్ వైపు పరిగెత్తింది.

************

“ఎలా ఉంది?” విద్యాసాగరొచ్చి అతని పల్స్ చూస్తూ అడిగేడు.
“మీ దయవల్ల పూర్తిగా తగ్గిపోయినట్లే బాబూ!” అంది సుభద్రమ్మ లేచి నిలబడుతూ.
“ఆయనేం మాట్లాడటం లేదే?” అన్నాడు సాగర్ హితేంద్ర వైపు చూసి నవ్వుతూ.
హితేంద్ర నీరసంగా నవ్వి “ఈరోజు డిచ్ఛార్జి చేస్తారా?” అంటూ అడిగేడు.
“ఏం మా హాస్పిటల్ బోర్ కొడుతోందా?”
విద్యాసాగర్ ప్రశ్నకి సిగ్గుపడి “అది కాదు. ఇప్పటికే చాలా క్లాసులు పోయేయి” అన్నాడు.
“మరేం ఫర్వాలేదు. నువ్వు మంచమెక్కగానే రిజర్వేషన్ల గొడవలకి కాలేజీలు మూతపడ్డాయి.” అన్నాడు సుబ్రమణ్యం వచ్చి కూర్చుంటూ.
“అయితే మీరు చేయాల్సింది సంగీత సాధనే! ప్రోగ్రాం టైము దగ్గర పడ్తోందని తెగ కంగారు పడుతోంది మా నిశాంత!” అన్నాడు సాగర్.
“ప్రోగ్రామా?” అర్థం కానట్లుగా చూశాడు హితేంద్ర.
“నిశాంత మీకు చెప్పనే లేదా?” అన్నాడు సాగర్ ఆశ్చర్యంగా.
అప్పుడే వార్డులోకొచ్చిన నిశాంత “హలో! హౌ ఆర్యూ!” అంటూ అతని బెడ్ దగ్గరకొచ్చింది.
“ఫైన్” అన్నాడు హితేంద్ర ఉత్సాహం తెచ్చుకుంటూ.
“దటీస్ నైస్! అందరూ ఇక్కడే ఉన్నారే?” అంది సాగర్ వైపు చూస్తూ.
“నువ్వితనికి ప్రోగ్రాం సంగతి ఇన్ఫార్మ్ చెయ్యనే లేదా?” అన్నాడు సాగర్.
“ఎక్కడ? ఆ సంగతి చెబుదామనేగా వెళ్తే ఈయన శ్రీరంగసాయిలా పడకేసేడు. మెల్లిగా కోలుకున్నాక చెబుదామని ఊరుకున్నాను.” అంది
సుభద్రమ్మ అర్ధం కాక సాగర్ ని, నిశాంతని మార్చి మార్చి చూసింది.
హితేంద్ర పరిస్థితి కూడ అదే!
వాళ్ళిద్దర్నీ మరింత సస్పెన్స్ లో ఉంచడమిష్టం లేక సాగర్ కల్గజేసుకుని “నిశాంత మీ కోసం ఒక ప్రోగ్రాం ఎరేంజ్ చేసింది. టిక్కెట్స్ కూడ అమ్ముడయిపోయేయి. హాల్ బుక్ చేసేం. సమయానికి మీరు అనుకోకుండా మంచమెక్కేసి మా బి.పి. పెంచేసేరు.” అన్నాడు సాగర్ చమత్కారంగా.
ఆ మాటలు విని హితేంద్ర ఉలిక్కిపడ్డాడు.
“మీరు… మీరు చెప్పేది నిజమేనా?” అనడిగేడు అపనమ్మకంగా.
“నూటికి నూట పాతిక పాళ్ళు!”
“మై గాడ్! నేను… నేను ప్రోగ్రామివ్వగల గొప్ప సింగర్ని కాదండీ! అందులోనూ స్టేజి మీద! నాకు సంగీతం తెలీదసలు. జనం రాళ్ళు విసురుతారు.” అన్నాడు గాభరాగా.
నిశాంత ప్రశాంతంగా నవ్విందతని కంగారు చూసి.
“మీరెందుకలా అప్సెట్ అవుతున్నారు? శాస్త్రం తెలీకపోయినా ప్రతిభ వుంది మీ దగ్గర. ఈ నెల రోజుల్లో కాస్త సంగీతం గురించి కూడ తెలుసుకుందురుగాని. నేను మాస్టర్ తో మాట్లాడేను. మీరింక హాయిగా తిని, గొంతెత్తి పాడటమే!” అంది.
“అవును. ఎదుటివాడిలో గొప్పదనం గుర్తించందే ఏం చేయదు మా నిశాంత ” అన్నాడు సాగర్ నిశాంత వైపు మెరిసే కళ్ళతో చూస్తూ.
“ఆమె పేరే నిశాంత. ఎదుటి వాడి జీవితంలో చీకటిని అంతం చేసే వెలుగు రేఖ!” అంటూ కవిత్వ ధోరణిలో మాట్లాడేడు సుబ్రమణ్యం.
“ఆయన్నింక మన మాటలతో విసిగించొద్దు. రెస్టు తీసుకోనివ్వండి” అంటూ వార్డులో ముందుకెళ్ళిపోయింది నిశాంత.
“ఏ దేవుడు కరుణించేడో ఈ దేవత ప్రత్యక్షమైంది నాకు ‌ లేకపోతే నా బిడ్డ ఏమయిపోయేవాడో!” అంది సుభద్రమ్మ వెళ్తోన్న నిశాంత వైపు కృతజ్ఞతగా చూస్తూ.
“మీరంతా పొగడ్డం మొదలెట్టేరనే నిశాంత వెళ్ళిపోయింది.” అన్నాడు సాగర్.
“ఇవి పొగడ్తలు కావు బాబూ!” అందామె.
“నాకు తెలుసు” అంటూ మరో బెడ్ వైపు వెళ్ళేడు సాగర్.
దూరంగా పేషెంట్లని సాదరంగా పలుకరిస్తూ ముందుకి సాగిపోతున్న నిశాంతని ఆరాధనగా చూశాడు హితేంద్ర.

ఇంకా వుంది…

1 thought on “చీకటి మూసిన ఏకాంతం 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *