March 29, 2023

తేనెలూరు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

తెలుగు మాటల ప్రపంచము సువిశాలమైనది. అందులో స్త్రీల పాటలది ఒక ప్రత్యేక ప్రపంచము. ఈ పాటల పుట్టుక
పరిశోధనకందనిదని పూర్వ పండితులు గ్రహించినారు. నన్నయకు పూర్వమే శాసనాల్లో కనిపించే తరువోజ పద్యాలు పనిపాటలు చేసుకుంటూ స్త్రీలు పాడే రోకటి పాటలకు చాళుక్య పండితులు తీర్చిన రూపమని ఊహించుటకు వీలున్నది. నన్నెచోడుని కాలానికే ఊయలపాటలున్నాయని పరిశోధకుల అభిప్రాయము. పదమూడవ శతాబ్ది వరకు అంటే పాల్కురికి సోమనాథుని కాలానికి ఊరూరా పాటలు గట్టి పాడే సిరియాళ చరిత్ర కథాగేయము ప్రచారములో ఉంది.

నాలుగు కిటతకిట ఆవృతాలతో ఈ రోకటిపాటలు పధ్నాలుగవ శతాబ్దములో వెలసినవి.

‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ’అన్న సినిమా పాట ఒకప్పుడు మార్మ్రోగిన సంగతి మనకు తెలియనిది కాదు. ఆ పాట రాయడానికి ఇలాంటి పాటలు మూలమని చెప్పవచ్చు.

అప్పట్లో దైనందిన కృత్యాలైన దంపుళ్లు, విసురుళ్లు మొదలైన సమయాల్లో స్త్రీలు తమకు తెలిసిన పురాణ కథల్ని తమ మాటల్లో పాటలు కట్టి పాడుకున్నారు. ఉల్లాసంతో పనిచేస్తే ఉత్సాహం కలిగి శ్రమ తేలికవుతుంది. ఈ స్త్రీలు పండితులు కారు. వీరి పాటల్లో సామంజస్యముండక పోవచ్చు గానీ, సహజత్వముంటుంది. వారికి సీతమ్మ ఆదిలక్ష్మిలా గాక వారి ఆడపడుచులా, ఇరుగు పొరుగు వనితలా కనిపించటం తప్పుపట్ట తగింది కాదు. విమర్శకు నిలువక పోయినా వాటిలోని నిసర్గ సౌందర్యం మనల్ని అబ్బుర పరుస్తుంది.

రామునితో పాటు లక్ష్మణుడు పదునాలుగేళ్లు వనవాసం వెళ్లినంత కాలం ఊర్మిళ నిద్రలోనే ఉన్నట్టు రామాయణం చెబుతుంది. కానీ తనను లేపటానికి వచ్చిన లక్ష్మణుడెవరో పరాయి పురుషుడనుకొని, ‘పరసతిని కోరి కాదా రావణుడు మూలముతో హతమాయెనూ’ అంటుంది. ఆ విషయం ఊర్మిళకు తెలిసే అవకాశం లేకున్నా పాట కట్టినామె దాన్ని ఉదాహరణగా తీసుకుంది.

అలాగే ‘రంభాదులా సభలలో ఇంతి శుభ రమ్యముగ నాట్యమాడా’ అంటారు. ఇలాంటి అసమంజసమైన విషయాలను లోపంగా ఎంచక చదువుకోగలిగితే ఎంత హాయిగా ఉంటాయో.

సరే ఊర్మిళ నిద్రలో మరికొంత భాగం చదవండి.
శ్రీరాము తమ్ముండనే అతడనగ-సృష్టిలోనొకరు గలరా
జనకులనిగానటే భూమిలో-జనకులనగానెవ్వరూ
శతపత్రమున బుట్టినా చేడెరో-సీతకూ మరదిగానా
సీతయనగా నెవ్వరూ సృష్టిలో-సృష్టీశ నేను యెఱుగా
భూమి యూర్మిళవందురే నీపేరు-బొంకకూ యీ పట్లనూ
శరథుల నెడబాసియూ అక్కడా-జానకీ చెరబోయెనూ
రావణుని సంహరించీ ఆ సీత-దేవి తోడుకు వస్తిమి
చేకొన్న యిందువదనా లోకాప-కీర్తికే లోనౌదునూ
సీతమరదిని గానటే చేడెరో -దయయుంచి మేలుకొనవే
నిన్నుబాసినది మొదలూ ప్రాణసఖి- నిద్రహారములెరుగనే
నీవు లేకాయున్ననూ ఓ సఖీ-ప్రాణములు నిలుపలేనే
అనుచు కన్నుల జలములూ కారంగ-లక్ష్మణుడు తా బలికెనూ
కత్తి వరదీసి యపుడూ లక్ష్మణుడు -తా వేసుకొందుననెనూ
అంత వాదము సేయకా ఊర్మిళా-దద్దరిలి పడిలేచెనూ
ప్రాణేశుడగుట దెలిసీ కోమలికి-ప్రాణములు తేజరిల్లే
పతిపాద పద్మములకూ అప్పుడూ-పంకజాక్షీ మొక్కెనూ
పాదముల పయిని ఉన్నా తనసతిని-కరమునా లేవనెత్తీ
గ్రుచ్చి కౌగిట జేర్చుకూ కాంతకూ-కళ్ల జలములదుడిచెనూ

ఆ తరవాత ఊర్మిళ ఎలా ఆడిపోసుకుందో తరువాయి భాగంలో చదువుకుందాం. (సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

July 2019
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031