బాల్యం కురిపించిన హాస్యపు జల్లులు

రచన: సి.ఉమాదేవి

మనసుకు రెక్కలు తొడిగి జ్ఞాపకాల వలను తడిమినపుడు వెలువడే అనేక సంఘటనలు చిరస్మరణీయమైన మధురానుభూతులు. ఒకనాటి కుటుంబ వ్యవస్థను, అనుబంధాలను, ఆనాటి కట్టుబాట్లను మనముందుంచి, మన మనోవల్మీకములో నిక్షిప్తమైన మన చిన్ననాటి జ్ఞాపకాలను సైతం తోడి మనకందిస్తారు మన్నెం శారద. విభిన్నకళలలో ప్రవేశంగల రచయిత్రి ఆ కళలను నేర్చుకునే క్రమంలో వచ్చిన అడ్డంకులను తనదైన కళాస్ఫూర్తితో అధిగమించి కళలకే తన జీవిత ధ్యేయంగావించుకున్న కళారాధకురాలు.
ఫేస్ బుక్ లో చక్కని చిత్రాలతో అందరినీ అలరించి ఆహ్లాదపరచే మన్నెం శారద చిగురాకు రెపరెపలు పేరిట తన అల్లరి చేష్ఠల హాస్యవల్లరిని బాల్యపు తూగుటుయ్యలలో వూపి మరీ అందించిన రసగుళికలనవచ్చును.
చిత్రలేఖనం, నృత్యం, రచనా నైపుణ్యం ఒకే వ్యక్తిలో నిబిడీకృతమై కళావిపంచిని మీటగలిగిన రచయిత్రి ఈ రచనలో తన అనుభవాల పరంపరను మనోజ్ఞంగా చిత్రిక పట్టడం ఆనందకేళిగా భాసిస్తుంది.
పదిహేడు సంవత్సరాలకే నవలను రచించి ముఖచిత్రాన్ని కూడా చిత్రించడం అబ్బురమనిపిస్తుంది.పద్దెనిమిది సంవత్సరాల వయసులో మధువని అనే కథల పుస్తకంలో శాపగ్రస్తుడు అనే కథ ప్రచురించబడటమే కాదు రచయిత గణేశ్ పాత్రో వీరి రచనపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ రచయిత్రి రచనా శైలి బాగుందని, భవిష్యత్తులో గొప్ప రచయిత్రి కాగలరని దీవనలందించడం ముదావహం. వీరి రచనలు, ఇంటర్వ్యూలు ప్రతి పత్రికలోను ప్రచురింపబడేవి.అయితే వారిలోని నమ్రత, వారిని నిగర్విగా నిలబెట్టిన వైనం అభినందనీయం.
చిన్ననాటి చిలిపి అల్లర్లను అక్షరీకరించమని చెల్లెలు ఇందిర, స్నేహితురాళ్లు కోరిన కోరికను చిగురాకు రెపరెపలుగా మాలిక పత్రికలో ప్రచురించారు. బాల్యానికి నగిషీలు చెక్కిన నవ్వులు, కన్నీళ్లు కలగలిసిన రచయిత్రి అనుభవాలు పాఠకుల కళ్లను తడుపుతాయి. తన చిలిపి చేష్టలను తన అన్వేషణలో భాగంగా భావించుకున్న రచయిత్రి తల్లికి దెబ్బలద్వారా దగ్గరయాననడం ఆమెలోని సమవర్తిని దర్శింపచేస్తుంది. అయితే ఆనాటి కుటుంబ వ్యవస్థలో ఆడపిల్ల పెంపకంలో అనుక్షణం ఉలిక్కిపడే తల్లులున్న సమాజంలో వారి తల్లి మందలింపులో పొడచూపిన భయమే ఎక్కువనిపిస్తుంది.
కాకినాడలో పుట్టిన పాప పెరుగుతూ అల్లరిని పెంచి పోషించడం వెనుకనున్న అమాయకత్వం పసిపిల్లల నైజాన్ని తేటతెల్లం చేస్తుంది. పెద్దయాక అన్నను కోరి మరీ జగన్నాథపురంవైపు అడుగులు వేసిన రచయిత్రి మనసున సుళ్లు తిరిగిన జ్ఞాపకాల కెరటాలు ఆమె మనసునే కాదు మనల్ని కూడా పట్టి కుదుపుతాయి.ఎందుకంటే సమాంతరంగా మన బాల్యం మనల్ని రొదపెట్టి అందులోకి లాక్కుంటుంది.
ఇక వీరి చిలిపి పనులకు ప్రారంభం చనిపోయిన బల్లికి శాస్త్రోక్తంగా మరణానంతర కార్యక్రమాలన్నీ చేసి కడకు కాకులకు పిండప్రదానం వరకు అన్నీ జరిపించడం నవ్వు పుట్టించినా,జంతువులు మరణించినపుడు చెత్తకుండీలలోకి విసిరెయ్యడంకాక భూమిలో పాతిపెట్టడం మంచిదేమోననిపిస్తుంది.
అప్పారావు మామయ్యపై కోపాన్ని కారంలో ఇసుక కలిపి తీర్చుకోవడం, సైకిలు సీటు కత్తిరించడం వెనుక చిన్న పిల్లలకు నచ్చచెప్పే రీతిలోకాక కోపగించుకోవడం పిల్లలలో రగిలిన ఆవేశంలో మరో కోణం చూస్తాం.
సర్కస్ చూసి అదే తీరున రెండు అప్పడాల కర్రలపై పీటవేసి దానిపై చిన్నగా కదలుతుంటే జరిగిన గోల, నవ్వుల కేరింతలకు నజరానా.మరో సంఘటనలో చిలుకను పట్టుకునే వైనంలో గాయాలపాలైనా,పెద్దల కంటపడకుండా జామ చెట్టెక్కి దాక్కున్నా చివరకు జ్వరం బారిన పడటం అయ్యో అనిపిస్తుంది. కారుని తాళ్లతో బంధించిన నాటు పడవలపైకెక్కించి ఆ కారులో సంతోషంతో వేసిన గెంతులు గుండె ఝల్లుమనిపించే జ్ఞాపకమే!
మాస్టారి పిలకకు దారంకట్టి కిటికీకి కట్టినా అక్క మందలింపుతో పశ్చాత్తాపం పొంది గురువులను,పెద్దలను అల్లరి చేయడం మానేసానంటారు. జట్కా ఎక్కి గుర్రం కళ్లాలను లాగినపుడు ఆ వేగానికి భయమేసినా దారిలోని జామచెట్టు జట్కానాపడం ప్రమాదానికి గురికానివ్వదు. మామయ్య తుపాకీపై ట్రిగ్గరును నొక్కేలోపుల మరచిపోయిన తన పిస్టలు కోసం వెనుతిరిగిన మామయ్య కోపానికి గురికావడం, తిరిగి అదే మామయ్య అలిగిన శారదకు అన్నం తినిపించడం బంధాల బాంధవ్యాలకు చక్కటి ఉదాహరణే!అయితే ఆ మామయ్య మరణించినపుడు వెళ్తే అత్తయ్య,మామయ్య పిల్లలు, ‘ అంత అల్లరి చేసిన శారద ఇన్ని భావాలను తన రచనలలో ఎంత బాగా రాస్తుంది’ అని చెప్పడం రచయిత్రికే కాదు మనకు గుండె బరువవుతుంది.
ఇక నారు అడిగితే ఇవ్వని వారింటినుండి నారును దొంగతనంగా తెచ్చుకోవడం, ఆనాటి నటుడు వేమూరి గగ్గయ్యను చిన్ననాటే నాటకంలో కలుసుకోవడం, దేవుడి కోసం ఇంట్లోనే తపస్సు చేయడం వంటివి బాల్యపు రహదారిలో ఎదురుపడిన చక్కని విశేషాలే కదా!ఐదవ ఏటనుండి తొమ్మిదేండ్ల చిరు ప్రాయందాకా చేసిన చిలిపి పనులు నా బంగారు బాల్యంగా వ్రాసాను తప్ప ఘనకార్యాలు కాదు, ఇవన్నీ గాలికి ఊగుతూ సయ్యాటలాడే చిగురాకు రెపరెపలని ముగించిన శారదగారికి మనసారా అభినందనలు.

Leave a Comment