April 19, 2024

విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

రచన: రాజన్

 

ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. అంగ్లేయులను మనదేశం నుండి వెళ్ళగొట్టి మనం విజయం సాధించామనుకుంటున్నాం కానీ, వాళ్ళ భాషావ్యవహారాలను మనలో మమేకం చేసి పరోక్షంగా వారే మనపై విజయం సాధించారు. తెలుగువారిపై అనధికార ప్రపంచభాషగా వెలుగొందుతున్న ఆంగ్లభాషాప్రభావం గురించి, మాతృభాషాబోధనావశ్యకత గురించి, ఆంగ్లభాష యదార్థ స్వరూపం గురించి చమత్కార ధోరణిలో రచింపబడ్డ ఆలోచనాత్మక నవల విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’. కవిసామ్రాట్ గా లబ్ధప్రతిష్టుడు, జగమెరిగిన సాహితీమూర్తి, పురాణ వైరి గ్రంథమాల, కాశ్మీర రాజవంశ చరిత్ర, నేపాళ రాజవంశ చరిత్ర మొదలగు నవలా సంపుటిల ద్వారా భారతదేశ యదార్థ చరిత్రను మనకందించిన విజ్ఞానఖని, జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న శ్రీమద్రామయణ కల్పవృక్ష కృతికర్త, వేయిపడగలు సృష్టికర్త, తెలుగుజాతి కన్న అపురూప సాహితీరత్నం కీ.శే. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ నవలారచయిత.

ఈ కథ అంతా రచయిత కలలో జరుగుతుంది. పంచతంత్రం వ్రాసిన విష్ణుశర్మ, భారతం తెనుగించిన కవిబ్రహ్మ తిక్కన స్వర్గంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇంగ్లీషు నేర్చుకోవడానికి వేరు వేరుగా భూలోకం వస్తారు. ఇంద్రుడు సలహా మేరకు వారు రచయిత కలలో ప్రవేశించి తమకు ఇంగ్లీషు నేర్పమంటారు. సరేనన్న రచయిత, ఇక అక్కడ నుండి పడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఆంగ్ల శబ్ధాల వ్యుత్పత్తి, అర్థం, ఉచ్చారణ మొదలైన వాటి గురించి విష్ణుశర్మ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రచయిత తికమక పడే సన్నివేశాలు వినోదంతో పాటు ఆలోచననూ కలిగిస్తాయి. నువ్వు అనడానికి ఇంగ్లీషులో ఏమంటారంటాడు విష్ణుశర్మ. దానికి రచయిత YOU ’యుఅనాలంటాడు. యు అనడానికి U అంటే సరిపోతుందిగా మరి ముందు YO ఎందుకు దండగ అంటాడు విష్ణుశర్మ. అలాగే OBLIQUE, CHEQUE అనే పదాలలో Q ని వాడవలసిన అవసరం ఏమొచ్చింది? కకారాన్ని పలకడానికి K అనే అక్షరం ఉందికదా అంటాడు. The, Bad, Enough పదాల ఉచ్చరణ విషయంలో కూడా విష్ణుశర్మ ప్రశ్నలు రచయితను అయోమయానికి గురిచేస్తాయి. క్యాపిటల్, స్మాల్ లెటర్స్ గురించిన ఆక్షేపణలు, గ్రామర్ విషయంలో Is, Am, Will, Shall ల ప్రయోగానికి సంబంధించి అడిగే సహేతుకమైన ప్రశ్నలు మనకు నవ్వు తెప్పిస్తున్నా, ఏదో నిజం బోధపడుతున్న భావం కలుగుతుంది. అప్పుడే వికసిస్తున్న పిల్లల మనసులపై పరభాషా ప్రభావం ఎలా ఉంటుంది, మాతృభాష పై సాధికారత వచ్చిన తరువాత పరభాషను నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? సంస్కృతం, తెలుగు మొదలైనవి సంస్కరింపబడిన భాషలుగా ఎందుకు పిలువబడుతున్నవి మొదలైన విషయాల గురించి తిక్కన, విష్ణుశర్మలు కూలంకషంగా మాట్లాడేతీరు మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. అప్పట్లో పాడ్యమి, అష్టమి, అమావస్య, పౌర్ణమి తిథులలో విద్య నేర్పేవారుకారట. ఆదివారం సెలవు అన్నది ఆంగ్లేయుల నుండి తీసుకున్నసంస్కృతి అట. తిక్కన కాలం నాటికే ఇంటిపేర్లు అంటూ ప్రత్యేకించి ఏవీ ఉండేవికావట. ఇలాంటి ఆసక్తికర అంశాలతోపాటు పూర్వం విద్యావిధానం ఎలా ఉండేది, భాషను నేర్చుకోవడం ఎలా మొదలుపెట్టాలి మొదలైన విషయాలమీద మంచి అవగాహన కలిగిస్తుంది. చివరకు ఇంత కంగాళీగా ఉన్న భాషను నేర్చుకోమని చెప్పి విష్ణుశర్మ, తిక్కన స్వర్గానికి వెళ్లడానికి సిద్ధపడి ట్రైన్ ఎక్కేస్తారు. మెలకువ వచ్చిన రచయితకు తనకు Head Of The Department గా ప్రమోషన్ వచ్చిందని తెలుస్తుంది. కలలో మాచవరం ఆంజనేయస్వామికి కొట్టిన వంద కొబ్బరికాయల ఫలితమే ఇదని రచయిత ముగింపు వాక్యం పలకడంతో కథ పూర్తవుతుంది.

విశ్వనాథవారి శైలి గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమేమున్నది. కథని పరిగెత్తించిన తీరు, సునిశిత హాస్యం, విష్ణుశర్మ పాత్రచిత్రీకరణ మనల్ని పేజీలవెంట పరుగుపెట్టిస్తాయి. రచయిత స్వగతంగా అనుకునేవి మనకు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తాయి. నవల చదవడం పూర్తయిన తరువాత మనభాష మీద మనకు గౌరవం పెరుగకా మానదు. మన భాష యొక్క అందాన్ని అవలోకనం చేసుకోకా మానము. సరదాగా సాగుతూనే మనల్ని విశ్లేషించుకునేలా చేసే ఓ మంచి నవల విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు”.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *