March 28, 2024

చిన్నారి మనసు….

రచన: మణి గోవిందరాజుల

అత్తకు, అత్త పిల్లలకు జరుగుతున్న వైభోగాన్ని కుతూహలంగా ఇంతలేసి కళ్ళేసుకుని పరిశీలిస్తున్నది ఎనిమిదేళ్ళ చిన్నారి. నిన్ననే దర్జీ వాడొచ్చి అత్తకు కుట్టిన కొత్త జాకెట్లూ ,అత్త పిల్లలకు కుట్టిన పట్టు లంగాలూ ఇచ్చి వెళ్ళాడు. . “పట్టు లంగాలైతే ఎంత బాగున్నాయో చెప్పలేను. ఒక్కసారి ముట్టుకుని చూట్టానికి కూడా ఇవ్వలేదు” గొణుక్కుంది చిన్నారి మనసులో. నాక్కూడా కావాలని చిన్నారి గొడవ చేసింది. కాని అమ్మ పక్కకు తీసుకెళ్ళి నోరు మూసి రహస్యంగా తొడపాశం పెట్టింది. చాలా ఏడుపొచ్చింది. నోర్మూసుకుని బోలెడు ఏడ్చుకుంది.
అయినా అమ్మ మటుకు ఏమి చేస్తుంది?అత్తా వాళ్ళకు అవన్నీ తేవాల్సిందేనని బామ్మ హుకుం చేసిందట. బామ్మ మాటంటే మాటే. నాన్నకు అవన్నీ తేవడానికి బోలెడు అప్పు చేయాల్సొచ్చిందట. మేనత్త, పిల్లలు వచ్చి నెల అవుతున్నది. ఈ నెలకే బోలెడు ఖర్చయిందట. ఇక తనకు కూడా పట్టు లంగా యేమి కొంటారు. ? తనను తానే ఓదార్చుకుంది చిన్నారి.
మామయ్యకు యెక్కడో ఢిల్లీలో అట వుద్యోగం. చాలా దూరమట. రైల్లో వస్తేనే రెండురోజుల ప్రయాణమట. మరి “బైల్ గాడీలో వస్తేనో” అని కుతూహలంగా తానడిగిన ప్రశ్నకు అందరూ పక పకా నవ్వారు. దీనికేం తెలీదు. “వుట్టి మడ్డిమొహం “ అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
వాళ్ళ వేషధారణ కూడా చిత్రంగా వుంది మోకాళ్ళ మీదికి లంగాలు. బిగుతుగా వున్న జాకెట్లూను. ఇక అత్తయ్య అయితే చేతుల్లేని జాకెట్లు పొట్టి కొంగుతో గమ్మత్తుగా వుంది. మామయ్య యేమో యేంటో హిందీ అట ఆ భాషలో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. మా కర్థమయ్యేట్లు మాట్లాడండి మామయ్యా అని అడిగితే ఏదో అన్నారు. తరువాత తెలిసింది ఆయన ఢిల్లీ వెళ్ళి మనం మాట్లాడుకునే మాటలు మర్చిపోయారుట.
కాని వాళ్ళొచ్చిన దగ్గరనుండి బామ్మ హడావుడి హడావుడి కాదు. ఎప్పుడో అయిదేళ్ళక్రితం వచ్చారట. మళ్ళీ యెప్పుడొస్తారో తెలీదట . అందుకే అస్తారు వైభోగంగా(అంటే ఏంటో తెలీదు. అందరూ అలానే అనుకుంటున్నారు. ) చూసుకుంటున్నారట. గడ్డ పెరుగులు, గ్లాసుల గ్లాసుల పాలు పిల్లలకి ఇస్తుంటే మనసంతా అటే లాగుతున్నది. ఇంకా ఇవే కాక రోజూ ఆలుగడ్డ వేపుడు కూడాను. తనకెంతిష్టమో ఆలుగడ్డ వేపుడంటే పోనీలే వాళ్ళ వల్ల తాను కూడా ఆలుగడ్డ వేపుడు తింటున్నది. తృప్తి పడింది మనసు.
ఇక అత్తయ్యకు అయితే మహారాణి వైభవమట(ఇది కూడా చూసిన వాళ్ళంటున్నారు మరి. ). కాలు కింద పెట్టకుండా మంచం దగ్గరికే అన్నీ అందిస్తూ అమ్మ క్షణం కాలు నిలవకుండా తిరుగుతున్నది. అమ్మ తిరగడమే కాకుండా నన్ను కూడా “వాళ్ళకు అదిచ్చి రాపో, ఇదిచ్చి రాపో,” అంటూ తిప్పడమే కాకుండా “అమ్మో అలా చెయ్యకు అత్తయ్యకు కోపం వస్తుంది. ఇలా చెయ్యకు అత్తకు కోపం వస్తుంది . యేయ్ చిన్నారీ వాళ్ళు వుండే నాలుగు రోజులు హఠం చేయకు. ” అంటూ ఆంక్షలు కూడా పెడుతున్నది.
రేపెళ్ళి పోతున్నారట అత్తావాళ్ళు. (హమ్మయ్య ) అందుకని ఈ రోజే వాళ్ళకు తెచ్చిన కొత్తబట్టలు పెట్టేస్తున్నారు. చిన్నారికి మనసంతా పట్టులంగాల మీదికే పోతున్నది. పిల్లలు పట్టులంగాలేసుకుని గిర గిరా తిరుగుతుంటే సగం ఆశగా సగం నిరాశగా వాళ్ళనే చూస్తూ “నాక్కూడా కొనిపించుకోవాలి”అనుకుంది.
**************
“చిన్నారీ అమ్మమ్మా వాళ్ల వూరెళుతున్నాము రేపు. మీ స్కూల్లో చెప్పిరా” పదేళ్ళ చిన్నారికి చెప్పింది అమ్మ. సంతోషంతో మనసు యెగిరి గంతులెసింది. రెండేళ్ళ క్రితం వచ్చెళ్ళిన అత్త కుటుంబానికి జరిగిన మర్యాదలు గుర్తొచ్చి అమ్మమ్మ దగ్గరికెళ్తే తమక్కూడా అలానే జరుగుతాయి కదా అని గాల్లో తేలిపోయింది.
ఇంట్లోకి వస్తున్న అక్కను అక్క పిల్లలను ఆపేక్షగా ఆహ్వానించాడు మేనమామ.
“తమ్ముడూ బాగున్నావారా?” తమ్ముణ్ణి పలకరిస్తూ లోపలికెళ్ళింది అమ్మ.
చిన్నారికి ఊహ తెలిశాక ఇప్పుడే రావడం. అందుకని అత్త బామ్మ దగ్గర కూర్చున్నట్లు అమ్మ కూడా అలానే కూర్చొని అన్నీ చేయించుకుంటుందని అనుకుంది. కాని అమ్మ అలా చేయించుకోలేదు. అప్పటికీ చిన్నారి రహస్యంగా అడిగింది. నువెందుకు అత్తలా చేయించుకోవటం లేదని? లేదని. అమ్మ నవ్వి అలా చేయించుకోవడం తప్పని చెప్పింది. మరి ఆ తప్పు అత్తెందుకు చేసిందో చెప్పలేదు.
ఇప్పుడు మామయ్య కూతురు ఓణీల ఫంక్షనట దానికొచ్చారు తామిప్పుడు. తనూ మామయ్య కూతురీడు పిల్లే కదా?. ”మరి ఇంటికెళ్ళాక నాకు చేస్తావా?” ఆశగా అడిగింది. నవ్వింది అమ్మ. అది చాతకాని నవ్వని కొన్నేళ్ళ తర్వాత తెలిసింది.
తర్వాత అమ్మనడిగింది. బామ్మింట్లో నేమో అత్త పిల్లలకి చేస్తారు. అమ్మమ్మ ఇంట్లోనేమొ మామ పిల్లలకి చేస్తారు మరి నాకెందుకు ఎక్కడా చెయ్యరు అని. కాని సమాధానం లేని ప్రశ్నయింది.
“మా నాన్నకు నేనంటే యెంత గారాబమో. నేనేదడిగితే అదిస్తారు. మా అమ్మయితే నన్ను కాలు కింద పెట్టనివ్వదు” స్కూల్లో స్నేహితులు గొప్పగా చెప్తున్నప్పుడు తనూ ఒక్కతే కూతురు కదా నలుగురన్న దమ్ముల మధ్య ?నన్నలా చూడరే అనిపించినా “వున్న సంతానంలో అలా ఒక్కళ్ళని వేరే ప్రేమగా చూడడం నాకు నచ్చదు. తలితండ్రులుగా మాకందరూ సమానమే” అని తండ్రి యెవరితోటో మాటల సందర్భంలో అన్నప్పుడు అవును కదా నిజమే కదా అనిపించింది. కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావడం లేదే అన్న మనసులో ఆర్తి, కోరిక తీరడం లేదు. యేదో కావాలి అది ప్రేమా?ఆదరణా?యేమో? మామూలు పొగడ్తా? యేమో మరి. .
గుర్తింపు కొరకు ఆరాటపడుతున్న మనసుకు స్వాంతన లభించడం లేదు. రోజులు గడుస్తున్నాయి.
కాలేజీలో చదువుతున్నప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను. నువు లేనిదే జీవించలేను అని
మగపిల్లలు వెంటపడితే గర్వంగా ఫీల్ అయింది. నీ కోసమే అంటూ వాళ్ళు చెపుతున్న మాటలు ఎడారిలో ఒయాసిస్సులా, మండు వేసవిలో శీతలపవనాల్లా సేదతీర్చాయి. కాని ఆ మాటల వెనుక ఉన్న అర్థం తెలిశాక వాళ్ళను దూరం పెట్టేసింది. అప్పటివరకు గాల్లో తేలిన మనసు గాల్లోనే పేలిపోయింది. ఇంకా నయం మోసపోయాను కాదు అనుకుని దేవుడికి దండం పెట్టుకుంది. .
అన్నల పెళ్ళిల్లు అయ్యాయి, అన్నా వదినల అన్యోన్యతను చూసినప్పుడల్లా సంతోషంగా అనిపించేది. అన్నలు వదినల పట్ల చూపిస్తున్న ప్రేమ, వాళ్ళకిస్తున్న గౌరవం చూస్తూ పొంగిపోయేది. అమ్మ ఎదుర్కొన్న పరిస్తితుల వల్ల అయితేనేమి సహజంగా అమ్మ స్వభావం వల్ల అయితేనేమి అమ్మ కూతురూ కోడళ్ళూ అన్న భేధభావం లేకుండా చూడటం ఒక విధంగా గర్వకారణం అనిపించేది. కాని నీ కంటే కూడా నాకు కోడళ్ళే యెక్కువ అన్నప్పుడు మాత్రం కాస్త ఈర్ష్యగా అనిపించేది. కూతురుగా నాకు ప్రత్యేకత ఇవ్వకపోతే పోనీ కోడళ్ళెక్కువ అనడం యెందుకో మనసులో వుడుక్కుంది.
కాలం గడుస్తున్నది డిగ్రీ పూర్తి కాగానే బ్యాంక్ పరీక్ష రాసి ప్రొబేషనరీ ఆఫీసరుగా జాయిన్ అయింది.
ఏడాది వ్యవధిలో తన పెళ్ళీ అయింది
”వదిన్లతో ప్రేమగా ఉండు అన్న సంతోశంగా వుంటాడు. పుట్టింటి ఆదరణ వుంటుంది. అత్తింటి వారితో ఆప్యాయంగా, బాధ్యతగా వుండు మొగుడు సంతోషంగా వుంటాడు” అని చెప్పిన అమ్మ మాట ప్రకారం రెండు వేపులా ప్రేమగా ,బాధ్యతగానే వుంది. కాని పుట్టింట్లో మాదిరిగా ఇక్కడ అంతా సమానం కాదు. బామ్మ తరం లాగే వుండేది. ఇంకా చెప్పాలంటే అమ్మకి కోడళ్ళెక్కువ అయితే అత్తగారికి కూతుళ్ళెక్కువ . ఇంటి ఆడపిల్లలకే ప్రాముఖ్యత. కోడలెప్పుడూ సెకండరీ నే. పని మాత్రమే చేయాలి. కాని అమ్మ చెప్పింది కదా మొగుడు సంతోషంగా వుండాలంటే అత్తింటివారితో బాధ్యతగా వుండాలని (భార్య సంతోషంగా వుండక్కర్లేదా? అలానే వదినతో ప్రేమగా వుండు అని అత్తగారు ఆడపడుచులకు చెప్పలేదా?) అలానే వుంటుంది తాను. మొగుడు సంతోషంగా వున్నాడా అంటే యేమో? కాని జీవితం హాయిగా యే వొడిదుడుకులూ లేకుండా నే గడిచిపోతున్నది.
ఫైనల్ గా ఒక్కతే కూతురైనా పుట్టింట్లో కూతురనే ప్రత్యేకతా లేదు. ఒక్కత్తే ` కోడలైనా అత్తింట్లో కోడలనే ప్రత్యేకత లేదు. అలాగని ఆరళ్ళూ లేవు.
కాని మనసులో యేదో వెలితి పోవడం లేదు. ఇప్పుడింకో సమస్య. అందరూ మా ఆయన నాకోసం ఇది కొన్నారు అది కొన్నారు అని చెప్పినప్పుడు అరే అలా కూడా వుంటారా అనిపిస్తుంది. మరి మా అయనకు నేనెందుకు ప్రత్యేకంగా కనపడను అనుకుంటుంది. ఒకసారి ఆపుకోలేక అదే ప్రశ్న అడిగితే నాకలా యెవరూ ప్రత్యేకం అంటూ వుండదు. నాకందరూ సమానమే అని జవాబు. అలా ఎలా?తోడపుట్టిన వారెప్పుడూ ముఖ్యమే. కాని తనవారిని వదిలి వచ్చి తోడు పంచుకుంటూ వున్న తాను కొద్ది ఎక్కువ కాదా? ఉసూరుమంది ప్రాణం ఇక అడగబుద్ది కాలేదు.
ఏపని చేసినా డెడికేటెడ్ గా చేస్తుంది కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా త్వరగానే వచ్చాయి. అదే విధంగా జీవితంలో కూడా.
తనను అమ్మను చేసిన కూతుర్ని మొదటిసారిగా చూసి, స్పృషించి, గుండెకు హత్తుకున్నప్పుడు సృష్టిలోని ఆనందమంతా నాదే కదా అనిపించింది చిన్నారికి. మురిసిపోయింది. కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు రాలాయి. ఆ చిన్ని చేతులను చెంపలకు రాసుకుంటుంటే ఆ భగవంతుడే వచ్చి సేద తీరుస్తున్నట్లుగా వుంది. అచ్చంగా ఈ చిట్టి తల్లి నాదే. నా కోసమే దేవుడు పంపాడు నా ఆర్తిని తీర్చడానికి అని దేవుడికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంది.
గుక్కపట్టి ఏడుస్తూ కూడా తన మాట యెటు వినపడితే అటు ఇంతలేసి కళ్ళేసుకుని చూస్తూ గుర్తుపట్టి హాయిగా నవ్వుతున్నబిడ్డ నెత్తుకుని మాతృత్వంలోని మాధుర్యాన్ని చవిచూస్తూ ఇదే కదా జీవితం అనుకుంది. నిలబడటం నేర్చుకుని పడుతూ లేస్తూ బుడి బుడి అడుగులు వేస్తూ అమ్మా ! అని తన కోసం వెతుక్కుంటుంటే దాన్నెత్తుకుని నా కోసమే అల్లాడుతున్నది. నన్ను మోసం చేసే ప్రేమ కాదు ఇది అని మనసంతా భారం చేసుకుంది. ఒక్కళ్ళు చాలు ఇంక నా ప్రేమను షేర్ చేయలేననుకుంది. టన్నుల కొద్దీ ప్రేమను కూతురు మీద చూపించాలనిపించేది.
కాని దేవుడి నిర్ణయం ఇంకో లాగా ఉంది. ఇంకొక్కళ్ళు కూడా వద్దనుకుంటే కవలలను ఇచ్చాడు. మొదటిసారి తల్లైనప్పుడు అమ్మతనంలోని ఆనందాన్ని యెలా అనుభవించిందో, అప్పటివరకు ఒక్కళ్ళు చాలు అనుకున్నదల్లా ఇద్దర్నీ గుండెలకు హత్తుకుని మళ్ళీ మొదటిసారిలాగే దేవుడు నా ఆనందాన్ని మూడింతలు చేసి ఇచ్చాడు అని దేవుడికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంది.
అదేమి విచిత్రమో ఒక్కళ్ళమీద యెలా వుందో ముగ్గురి మీదా అలానే వుండేది తన తల్లి ప్రేమ. అలానే తండ్రి చెప్పిన మాట ప్రకారం ముగ్గురినీ ఒకే లాగా పెంచుకుంది.
ముగ్గురూ చుట్టూ తిరుగుతూ అమ్మా! మాకది కావాలి మాకిది కావాలి అంటూ ఉంటే పొంగిపోయింది. వాళ్ళ కిష్టమైనవన్నీ అమరుస్తూ తనకేమి కావాలో మరచిపోయేది. తను ఒక్క రోజు ఊరికెళ్తే ఊండలేకపోయామని పిల్లలు ఏడుస్తూ చెప్తుంటే వాళ్ళని దగ్గరకు పొదువుకుని తాను కూడా కన్నీళ్ళు పెట్టుకుంది. ”ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను” అని ప్రమాణాలు చేసింది. ఒక్క క్షణం వాళ్ళనొదిలిపెడితే వాళ్ళేమవుతారో అని భయపడింది
వాళ్ళకోసమే జీవిస్తూ వాళ్ళగురించే ఆలోచిస్తూ. వాళ్ళ సంతోషమే తన సంతోషం అనుకుంటూ ఇదే నా జీవితం. ఇంతకన్నా యేమి కావాలి అనుకుంది. హమ్మయ్య ఇన్నాళ్ళకి నా మనసులో కోరిక తీరింది కదా అని సంబరపడింది. ఇంతగా తనకోసం తల్లడిల్లే తన పిల్లలు తననొదిలేసి యెక్కడికీ వెళ్ళరు అని గర్వపడింది.
కాని పిల్లలకి ఊహ తెలిసి వాళ్ళ జీవితంలో తల్లి ప్రాధాన్యత తగ్గి వాళ్ళ లోకం వాళ్ళకేర్పడగానే , వాళ్ళ జీవన విధానం మారి తల్లికి తక్కువా స్నేహితులకు యెక్కువ ప్రాధాన్యత మొదలు అయి చుట్టూ గమనించడం ప్రారంభించగానే మళ్ళీ మొదటికొచ్చింది చిన్నారి సమస్య. పిల్లల పట్ల తమ ప్రేమ మారదు కదా? అని అనుకున్నా మనసు దేనికోసమో వెతుకుతూనే వుంది. ఆర్తిగా ఎదురుచూస్తూనే వుంది.
ఆడపడుచుల పెళ్ళిళ్ళు, పురుళ్ళు పుణ్యాలు, ముగ్గురు పిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు కాలం యెలా గడిచిందో తెలీలేదు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కష్టాలు సుఖాలు, కన్నీళ్ళు, ఆనంద భాష్పాలు. కాలం వడి వడిగా నడుస్తూనే వుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అంత ఇంట్లో తామిద్దరే ఒకరికి ఒకరు తోడుగా. అత్తగారు మామగారు దాటిపోయారు. ముగ్గురు పిల్లలూ వారి జీవిత గమ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అమ్మ చేసి చూపించినట్లుగానే కూతురూ కోడలూ అన్న భేధం లేకుండా వుండసాగింది. కాకపోతే తల్లిలా కూతుర్ని తక్కువా చేయలేదు. అత్తగారిలా కోడల్నీ తక్కువ చేయలేదు.
ఇంతకాలం నిద్రపోయిన ఆర్తి మళ్ళీ లేచింది. అదేంటి పిల్లలను అంత ప్రేమగా పెంచుకున్నాను కద ?అలా ఎలా వెళ్ళిపోయారు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి అని ఆల్లోచనలను నింపుకుని అల్లల్లాడింది. కాని వెంటనే సర్దుకుంది తప్పదు కదా రెక్కలొచ్చిన పక్షులు ఎగిరి వెళ్ళాల్సిందే అని. అంతవరకు సందడిగా గడిచిన కాలం, క్షణం తీరిక లేని కాలం. ఇంటి నాలుగు మూలల నుండీ వినపడిన పిల్లల నవ్వులు, కేకలూ యెటు నుండీ యేమీ కనపడక వినపడక మనసు తల్లడిల్లిపోయింది.
అంతా శూన్యం. ఈ శూన్యంలో ఆనందాన్ని వెతుక్కోవల్సిందే. పిల్లల్ని వచ్చి కొన్నాళ్ళుండమంటే అమ్మో కుదరదంటారు. నిజమే కదా?తాను మటుకు అమ్మ యెన్నిసార్లు పిలిచినా వెళ్ళగలిగిందా? వీళ్ళూ అంతే కదా?. కాలం యెవరి గురించీ ఆగదు. ఇంతలో తామిద్దరి రెటైర్మెంట్ దగ్గరకొచ్చింది. అమ్మో! ఉద్యోగం కూడా లేకపోతే కాలం ఎలా గడుస్తుంది? అని కంగారు పడిపోయింది.
ఇంతలో కూతురు ఫోన్ చేసి “అమ్మా! మీరు అమ్మమ్మా తాతయ్యా కాబోతున్నారు. బాగా వేవిళ్ళు వున్నాయి. తిన్నదేదీ కడుపులో నిలవడం లేదు” అనేసరికి భూమ్మీద కాలు నిలవలేదు. అర్జెంటుగా వెళ్ళి కూతురికి కావాల్సినవి చేసి పెట్టాలన్న ఆరాటం మొదలయింది.
అప్పటివరకు ఉద్యోగ బాధ్యతలు కూడా లేకపోతే ఎలా అని కంగారు పడిందల్లా “అబ్బా! ఇన్నాళ్ళు చేసాను ఇంకా ఎన్నాళ్ళు చేస్తాను? పిల్లలకు అవసరమప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే ఇక తానెందుకు?”అనుకుని వన్ ఫైన్ డే వాలంటరీ రెటైర్మెంట్ తీసేసుకుని “హమ్మయ్య ఇప్పుడు కూతురు దగ్గరకు వెళ్ళడానికి తనకేమి అడ్డులేదు” అని ఎగిరి వెళ్ళి కూతురు దగ్గర పడింది. అక్కడికి వెళ్ళిందే కాని ఇంటి దగ్గర భర్త తింటున్నాడో లేదో అని ఆరాటపడింది మనసు. ఆయన నేను బానే వున్నాను అన్నా వినిపించుకోలేదు. సెలవు పెట్టి వచ్చిందాకా పోట్లాడింది.
తిన్నదేదీ ఇమడక వాంతులు చేసుకుంటున్న కూతుర్ని చూసి, తానూ ఆ స్టేజ్ లో నుండే వచ్చింది అన్న సంగతి మర్చిపోయి కన్నీళ్ళు పెట్టుకుంది. తన కూతుర్ని ఇబ్బంది పెడుతున్న పొట్టలో నున్న బేబీని ముద్దుగా కోప్పడింది.
తొమ్మిది నెలలూ నిండి కూతురికి కొడుకు పుట్టాడు. చిట్టి తండ్రిని చేతుల్లోకి తీసుకోగానే వొళ్ళు పులకరించింది. అప్పటిదాకా కూతుర్ని ఇబ్బందిపెట్టాడని కోపగించుకున్న మనవడు అపురూపంగా అనిపించాడు. సృష్టిలోని అందాన్నంతా మూటగట్టుకుని వచ్చిన మనవడిని యెత్తుకోగానే మళ్ళీ అమ్మ అయిన భావన కలిగింది.
మనవడి ముద్దు ముచ్చట్లతో ఇహ లోకాన్ని మర్చిపోయింది. వాడు నీక్కాదు కొడుకు, వాళ్ళ పిల్లాడిని వాళ్ళకు వదిలెయ్యి పాపం అని భర్త వెక్కిరిస్తున్నా పట్టించుకోలేదు. కాని ఎన్నాళ్ళు? ఆరునెలలు కాగానే ఇంటికి రావాల్సొచ్చింది. మనవడిని వదల్లేక వదల్లేక వదిలి వచ్చిందే కాని మళ్ళీ ఆరునెలలు కాగానే రెక్కలు కట్టుకుంది.
తన వేలు పట్టుకుని నడుస్తూ పడుతూ లేస్తూ “మ్మ… మ్మ… మ్మ” అంటూ శబ్దాలు చేస్తుంటే “అమ్మమ్మా అని నన్నే నన్నే పిలుస్తున్నాడు నా మనవడు” అని వాడిని ముద్దులతో ముంచెత్తింది. వాడి వొళ్ళు వెచ్చబడితే విల విల లాడింది. తగ్గేవరకు దేవుడికి ఎన్ని మొక్కులో మొక్కుకుంది . తగ్గిన తరువాత వాడి మొహంలోని నవ్వులు చిన్నారి మోములో పువ్వులై విరిశాయి.
అలా వాడి ఆటపాటలతో మైమరిచిపోతున్నచిన్నారికి హఠాత్తుగా ఒకరోజు ఒకటర్థమయింది. అది అర్థమవుతూనే మనసులోని వేదన అలా చేత్తో తీసినట్లుగా మాయమయ్యింది.
“ఆశించడం” అదే ఇన్నాళ్ళూ తనను శాసించింది. చిన్నతనంలో అందరితో పాటు సమానమైన గుర్తింపు నాశించింది. కొద్దిగా ఊహ తెలిశాక తలితండ్రుల దగ్గర ప్రాముఖ్యతని ఆశించింది. పదహారేళ్ళ వయసులో ప్రత్యేకతని ఆశించింది. పెళ్ళయ్యాక తాను చేసిన సేవలకి రిటర్న్ ఆశించింది. మధ్యలో ఎందరికో చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఆశించింది. తోడుగా వుండి కష్టసుఖాలలో పాలుపంచుకున్నందుకు భర్త దగ్గర ప్రత్యేక ప్రేమను ఆశించింది. సంతానం దగ్గర కొచ్చేటప్పటికి అప్పటివరకు తనే లోకంగా బ్రతికిన పిల్లలకు, ఊహ తెలిశాక వాళ్ళ జీవితంలో తన ప్రాధాన్యత తగ్గిపోవడం ఫీల్ అయింది. అంటే ప్రాధాన్యతను ఆశించింది.
అన్నిటికీ మనసే కారణం. యెప్పుడూ యెవరో ఒకరి దగ్గరనుండి యేదన్నా ఆశించిన క్షణమే అసంతృప్తికి తలుపు తెరుచుకుంటుంది. ఒక్కసారి అసంతృప్తి పాదం మోపిందీ అంటే ఇనుప పాదమే అది . గుండెను తొక్కి ఛిద్రం చేసిందాకా వదలదు. ఆ ఒక్క ఆశించడం అనేది లేకపోతే జీవితం సంతోష సాగరమే అవుతుంది.
ఒక్క మనవడి దగ్గర మటుకు అసలు యేదన్నా ఆశించాలన్న ఆలోచన కూడా రావటం లేదు. ఇది అన్ కండిషనల్ లవ్. అందుకే తాను చాలా హాయిగా వుంది. ఈ చిన్న సంగతి అర్థమైనాక చిన్నారి జీవితంలో మరి వెలితి కనపడలేదు. ఆర్తి ఆకాశంలోకి ఎగిరిపోయింది.
యెవరిని ప్రేమించినా, యెవరికి ఏమి చేసినా రిటర్న్ఆశించకపోతే , అసలు ఆశించడం అనేది లేకపోతే తన జీవితంలో అసంతృప్తికి తావుండదు. తనలోని వేదనని మూలాలతో సహా పెకిలించగలగడానికి కారణమైన మనవడిని అపురూపంగా చూసుకుంటూ అనుకుంది చిన్నారి….

******శుభం******

8 thoughts on “చిన్నారి మనసు….

  1. O stree alochanalni dasalavaariga entho chakkaga varnichaaru kathalo…nijanga pratiphalam aasinchakunda premani panchthunte migiledi anthaa anandame

  2. Chalaaaaa bhagundi.Award teche story.grand children vachaaka asalu prapanchame gurtundadu vaallade lokam adi nijam ani niruupinchaaru mee storylo.nijame anni stageslo edo okaty aashistaamu grand children vachaka aashinchaalanna aalochana kuda vundadu.Nice story.

  3. మనస్సుకి హత్తునే కథ చాలా బాగుంది. ప్రేమను పంచటంలోనున్న ఆనందం ప్రతిఫలం ఆశించడం లో ఉండదు..

  4. Nice story. It is true that unconditional love never leaves dissatisfaction. Well said

Leave a Reply to Dr. P. S. Rajeswara Prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *