March 28, 2024

నేను…

రచన- డా లక్ష్మి రాఘవ

నన్ను అందంగా తయారు చేస్తున్నారు అన్న ఆనందం నన్ను నిలవనీయడం లేదు.
నా ముఖం ఇంకా ఎంత అందంగా ఉండాలో అని మాట్లాడుతూంటే సిగ్గుపడి పోయాను.
అసలే నా నిండా అందమైన ఆలోచనలు, వాటికి తోడు అలంకరణతో అద్బుతంగా అవుతుందంటే ఎవరికీ ఆనందం కలగదు? పైగా “ఎంత ఖర్చయినా పరవాలేదు ఎంత బాగుండాలంటే చూడగానే కావాలని అనిపించాలి” అన్నారు నా వాళ్ళు.
ఇక నా ఆనందానికి హద్దులు లేవు! చూడ్డానికి బాగుండటానికి, క్షణంలో నచ్చడానికి ఎంత ఖర్చు అయినా పరవాలేదు’ అన్న మాటలు చాలవా నాకు? ఇక అలా తయారవడాని కోసమై హైదరాబాదు దాకా ప్రయాణం అలసట అనిపించలేదు.
హైదరాబాదులో వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్ళారు. ప్రతి చోటా నా అందానికి మెరుగులు దిద్దడమే. నా గురించే ప్రత్యేకంగా పని చేయడమే.
అందుకని నన్నుఎన్నిసార్లు ముట్టుకున్తున్నా నాకేమీ అనిపించలేదు. ఎప్పటికప్పుడు సరిదిద్ది , మెరుగులద్దుతుంటే పులకించిపోయానంతే. నాకు కూడా చాలా కోరికలున్నాయన్న మాట!!
ఇదంతా జరగడానికి రెండు నెలలు టైం పట్టింది. నాకేమో ఎప్పుడెప్పుడు పూర్తిగా ముస్తాబై ఇల్లు చేరతానా అన్న ఆత్రుత వుంది.
ఒక రోజున నేను సంపూర్ణంగా ముస్తాబైనట్టు అనిపించింది. నన్ను హైదరాబాదు వాళ్ళు చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నారు.
ఇక మా ఇంటికి ప్రయాణమే మిగిలింది. ప్రయాణానికి సిద్దం చేశారు.
నాకు ఎక్కడా అసౌకర్యం కాకుండా భద్రంగా మా ఇంటికి చేర్చారు. నన్ను చూడటానికి మా ఇంటి వాళ్ళు పోటీ పడ్డారు.
అందరి చేతిలోనూ నేనే! “అరె ఎంత బాగుందో!!” అనడాలే!! మురిసి పోయాను. మొదటిగా దేవుడి గదికి తీసుకెళ్ళారు.
తరువాత నన్ను ఎక్కడ, ఎక్కడ పంపాలో నిర్ణయించారు. “ఇంత బాగా ఉన్నదాన్ని అందరూ ఆదరిస్తారు” అన్న మాటలు వినడానికి హాయిగా వున్నాయి.
ఒక వారం లోపల నన్ను అందరికీ పరిచయం చెయ్యాలని ఒక సభ చేసారు. ఆ సభలో అందరి దగ్గరా నేనే! అందరు మాట్లాడిందీ నాలోని ఆలోచనలూ, అందమైన ముఖాన్ని గురించే! ఓహ్! ఎంతో గర్వంగా వుంది…
న్యూస్ పేపర్స్ లో నా ఫోటోలు వేసారు. నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
ఇక నేను మేఘాలలో తెలియాడుతున్న సమయంలో నన్ను ఇంకా ఎంతమందికో పరిచయం కావడానికి ప్రిపేర్ చేసారు.
వివిధ ప్రాంతాలకు చేరాను. అందరూ బాగా ఆదరించారు!!
అలా కొన్నేళ్ళు రాజరికం అనుభవించాను.
తరువాత నన్ను అందరూ పట్టించుకోవడం మానేశారు.
ఎక్కడైనా ఎక్కడో ఒక మూల ఉంటున్నాను.
చివరకు ఇంట్లో వద్దని కొంతమంది బయటవారికి అమ్మేసారు! వారూ సరిగా చూసుకోలేదు…
కొత్తలో ఎప్పుడో రాత్రిపూట కాస్సేపు చేతిలో ఉంచుకుని నన్ను చూసినవారు, తరువాత రోజుల్లో అది కూడా కరువై గిరవాటు వేస్తే, పాత పేపర్ల వాడి చలవతో ఫుట్ పాత్ చేరాను.
భరించ లేనంత ఎండ! అలా పుట్ పాత్ పై ఎండకు మాడుతున్న సమయంలో ఒక చల్లని చెయ్యి నన్ను తాకింది. సుతారంగా సృశిస్తూ నన్ను బేరం చేసింది. మా యజమాని కూడా నన్ను ఎలాగైనా వదిలించు కోవాలని చాలా తక్కువ ఖరీదుకు నన్ను ఆ వ్యక్తికి అమ్మేశాడు. అదే నయం. కనీసం నీడపట్టున ఉండొచ్చు అనుకుంటూ అతడితో వెళ్ళిపోయాను..
ఇంటికి వెళ్ళగానే నన్ను ఒక్కసారి చూసి గిరవాటు వేస్తాడేమో అన్న అనుమాన౦గా వుంది. కానీ అతను నన్ను చాలా ఆప్యాయతతో బట్టతో శుభ్రం చేసి నాకు ఒక కొత్త ముసుగు వేసి బాగా బైండింగ్ చేయించాడు. అట్ట మీద చెరిగిపోయిన నా పేరుని మరింత అందంగా రాసాడు.
ఒక్కసారి మృదువుగా పెదవులకు ఆనించుకుని అల్మారాలో తన చిన్ని పుస్తకాల లైబ్రరీ లో చోటు కల్పించారు.
అవును నేను అనాదరణకు గురయ్యి తిరిగి ఉద్దరించబడ్డ పుస్తకాన్ని!!

******!

6 thoughts on “నేను…

  1. ఇటీవలే పువ్వుల స్వగతం గురించి వ్రాసిన లక్ష్మి రాఘవ గారు ఇప్పుడు పుస్తకం స్వగతం వ్రాసారు. Variety గా వుండడంతో పాటు impressive గా కూడా ఉంది. ఏది వ్రాసినా చదివించేలా వ్రాయడం లక్ష్మీరాఘవ గారి trademark. ఈ కథ లో కూడా ఆ mark కనిపిస్తుంది

    1. నా రచనల్లోని ట్రేడ్ మార్క్ ని మీరు గుర్తించి చెప్పడం ఎంత బాగుందో! ధన్యవాదాలు నాగభూషణం గారు. మీ కామెంట్ ఎప్పుడూ స్పెషల్ !

  2. ఎంత బావుందో… మళ్ళీ పూర్వ వైభవాన్ని పుస్తకాలకు తేవాలి.

Leave a Reply to పి.విజయలక్ష్మి పండట్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *