March 29, 2024

11. అమ్మ ఋుణం !!

రచన: శశికళ వోలేటి

 

“సూర్రావు గారింట్లో బొమ్మల కొలువు పేరంటం. గబగబా క్షణాల్లో తయారయిపోవాలి మరి. “…… అప్పుడే కాలేజ్ నుండి వచ్చి, అలసటగా వాలిపోయిన నాతో అమ్మ!!!

మా అమ్మంతే!! నాందీప్రస్థావనలు లేకుండా నిర్ణయాలూ, ప్రయాణాలూ ప్రకటించడం ఆమెకలవాటు.

“సూర్రావుగారెవరమ్మా?? ఆ పేరంటమేదో నువ్వెళ్లు. నా వల్ల కాదు. దసరా అని కూడా లేదు. ఆ కాలేజ్ వాళ్లు క్లాసులు తీసుకుని తీరాలని చంపుతున్నారు. ఛీ! ఆ గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చి ఏదో తేలిపోతే బావుండు. గవర్నమెంట్ ఉద్యోగం. పని తక్కువ, రాబడి ఎక్కువ. ఈ అరవచాకిరీ నావల్ల కాదు”! అలసటగా సోఫామీద వాలిపోయా!

ఈ మాత్రానికే అలా వాలిపోతే ఎలాగే! నీ వయసులో నాకు మీరు ముగ్గురూ పుట్టేసి, ఇంటెడు చాకిరీ ఉండేది. అయినా ఆడుతూపాడుతూ చేసేసేదాన్ని……”!

“తల్లీ! నీ బతుకు పుస్తకం ఇప్పకు. వినీ వినీ చెవుల తుప్పు వదిలిపోయింది. నువ్వెళ్లు. నేను రాను”!

అమ్మ మెల్లగా విషయంలోకి వచ్చింది. ఫలానా యశోదగారు పేరంటానికొస్తారుట. వాళ్లబ్బాయి కోసం అనఫీషియల్ గా నన్ను చూస్తారుట. అదీ సంగతి.

సీన్ కట్ చేస్తే……

మేము సూర్రావుగారింట్లో ! తివాచీల మీద కూర్చుని. యశోదగారూ, నేనూ ఒకరినొకరం దొంగచూపులు చూసుకుంటూ!!

సూర్యారావుగారు మావూళ్లో చాలా ధనికబ్రాహ్మణ కుటుంబీకులు. పాత అగ్రహారపు పొలాలతో పాటూ, తెలివితేటలతో చేసిన వ్యాపారాలూ… ఆయనని సమాజంలో ధనికవర్గాలలో ప్రముఖుని చేసాయి. ఇద్దరు ఆడపిల్లల తరువాత పదేళ్లకి మరీ ఎక్కువయిపోతున్న సంపదంతా అనుభవించడానికి మరో ముగ్గురు ముద్దులొలికే ఆడపిల్లలు. అయిన వారింట ఆడపిల్లలకు అచ్చట్లూ ముచ్చట్లకూ లోటేముంటుంది.

****.

” రమా”!……… సన్నగా చిన్నపిలుపు.

పక్కకు తిరిగి చూసా! ఆ విశాలమైన హాలుకు ఆనుకుని ఉన్న డైనింగ్ రూం నుంచి . తలుపు చాటు చేసుకుని ఒక నడిమి వయసు స్త్రీ. నేను ఆమెకేసి చూడగానే అమ్మవైపు చూపిస్తూ పిలవమని సైగ చేస్తున్నారు. ఆమెను ఎక్కడో చూసినట్టే ఉంది. ఆకుపచ్చ ముతకజరీచీర కట్టుకుని ఉన్నారు. మొహంలో కనిపిస్తున్న అలసట, వంటింటికే పరిమితం అయినట్టు కనిపిస్తున్న ఆమె బహుశా ఆ యింటి వంటావిడ అయ్యింటారేమో. అమ్మ భుజం తట్టి ఆమెవేపు తర్జని చూపించా.   వంటింటి మసకచీకటిలో ఉన్న ఆమె మొహం అస్పష్టంగా ఉంది.

 

అమ్మ అయోమయంగా చూసి, మెల్లగా లేచి వంటింటి వైపు వెళ్లింది. అరగంటయింది. అమ్మ రాలేదు. మెల్లగా మాటకలిపిన యశోదగారూ నేనూ అరగంటలో బానే కబుర్లు చెప్పేసుకున్నాము. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరు నచ్చినట్టే ఉంది. అమ్మను పిలవడానికి మెల్లగా లేచి వంటింటి వేపు వెళ్లా. వంటింటి పెరటి గుమ్మంలో ఉన్నారు ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని. ఆవిడ కొంగుతో కళ్లు తుడుచుకుంటోంది. నన్ను చూసి ” రమా! ” అంటూ అమ్మకి చూపించింది. నన్ను పిలిచింది అమ్మ.

” సుమీ! గుర్తుపట్టేవా? మా సూరమ్మొదిన. మా పెద్ద అమ్మమ్మగారి మనవరాలు. నేను నీ చిన్నప్పుడు పేరంటాలకి జగన్నాధపురం వాళ్లింటికి తీసుకెళ్లేదాన్ని”.

“అవునా! నమస్కారమండి” … అంటున్న నన్ను కావలించుకుని , ” నీ మొహం! అండీ ఏవిటే. చిన్నప్పుడు అత్తా అని తిరిగేదానివి. మా ఇంట్లో వెండిగిన్నె పట్టిచ్చావు కూడా . గుర్తుందా?”

ఆ హడావిడిలో ఏం చెప్పాలో తెలీక, “అవునండి” అనేసా, కానీ గుర్తురాలేదు. ముతకచీరలో, నెరిసిన జుట్టు వేలిముడేసుకుని. , మెళ్లో ఎర్రతాడుతో, బోసి చెవులతో, పసుపుబారిన ఎత్తుపళ్లతో దిగువ మధ్యతరగతి మనిషిగా ఉన్నారు. వెండిగిన్నెల గురించి మాట్లాడడం కాస్త వింతగా అనిపించింది.

మళ్లీ పేరంటంలో కాసేపు కూర్చుని, తాంబూలం తీసుకుని, సూర్రావుగారి భార్య లక్ష్మిగారికి, యశోదగారికీ చెప్పీ బయటకొచ్చేస్తూ, అమ్మ మళ్లీ వాళ్ల సూరమ్మగారికి చెప్పడానికి లోపలికి వెళ్తూ నా దగ్గర ఒక రెండువేలు ఉన్నాయా అని అడిగింది. పర్స్ లో ఆరోజే అందుకున్న నా జీతాన్ని తడుముకుని ” లేవమ్మా” అనేసా! అమ్మ బేగ్ మర్చిపోయింది. లేకపోతే నేను ఇచ్చినా తీసుకోదు. నా కళ్లముందు నా జీతానికి లెక్కచిక్కని నా ఖర్చులు గుర్తొచ్చాయి. అందుకే అబద్ధం.

లోపలికెళ్లిన అమ్మ మొహం ఎర్రగా చేసుకుని బయటకొచ్చింది. “ఏంటమ్మా” అని అడిగితే చెయ్యి పిడికిలి విప్పింది. ఐదొందల నోటు.

“చెప్పినా వినలేదే. నీకివ్వమని డబ్బులు చేతులో పెట్టింది. ఏవిటో ఆ పాత ప్రేమలూ, అభిమానాలూ! ఇంత లేమిలోనూ పెట్టుగుణమే! జమీందారీయే! సిగ్గేసిందనుకో. మనం ఇవ్వాలి నిజానికి. ఇంక అక్కడ రభసెందుకని తీసుకున్నా! ” అమ్మ చెప్తుంటే ఆశ్చర్యంగా చూసా!!

కార్లో కూర్చున్నాకా అమ్మ చెప్పసాగింది. సూర్యకాంతం వదిన్ని ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదే. పెద్ద జమీందారీ చూసిన మనిషి. ఇలా వంటలు చేసుకోడమేమిటీ? అయినా అదే హుందాతనం. చిరునవ్వు! చాలా బాగా చూసుకుంటారుట. ఆడపిల్లలు తను పెడితే కానీ అన్నం తినరుట. చాలా గౌరవంగా చూస్తారుట. పదివేలు జీతం, ఉండడానికి గదీ…. ఏదో చెప్పుకొస్తోంది వెర్రిది”.

అమ్మ చాలా అప్ సెట్ అయిపోయినట్టుంది పాపం.

“మా పెద్దతాతగారు దివాన్ గా చేసేవారు. బోలెడు భూములు, పెద్ద జమీ సంపాదించారు. మా మావయ్య ఒక్కడే వారసుడు. మా అత్తయ్య పార్వతీ గొప్ప ఆస్థిపాస్థులతో వచ్చింది. మా సూర్యాకాంతం వదిన పుట్టినపుడు అత్తయ్యకు ఏదో మానసికరోగం వచ్చింది. ఒకరోజు ఎవ్వరూ చూడకుండా నూతిలోకి దూకేసి చచ్చిపోయింది. మా మేనమావ మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి కొన్నాళ్లకు దేశాటనకని వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు. ఉన్నాడో లేదో కూడా తెలీదు.

 

మా తాతగారు బాగా లేని కుటుంబంలోండి అబ్బాయిని ఇల్లరికం తెచ్చి సూరమ్మొదినకి పెళ్లి చేసారు. మూడు నాలుగు అబార్షన్ల తరువాత బిడ్డసంచీ తీసేసరికి, ఆడపడుచులూ, బావగార్లూ వాళ్ల పిల్లలతో వీళ్ల పంచ చేరారు. సూరమ్మొదిన అమాయకురాలు. విపరీతమైన పెట్టుగుణం. ఇంతమందికీ నవ్వుతూ వండి వారుస్తూ వాళ్లంతా తన కుటుంబమే అనుకునేది.

సడన్ గా నాకు వాళ్ల ఇల్లు గుర్తుకొచ్చింది. పెద్ద అద్దాల మేడ. పెద్దహాలులో సోఫాలు, ఫోను. ,ఇత్తడి పూలకుండీలు. మండువాలో ఓ మూల పెద్ద భోషాణం. మేడమీద ఉయ్యాలబల్ల. అయితే ఎక్కడా తీరూతెన్నూ లేకుండా సోఫాలమీద, కుర్చీల మీద విప్పి పడేసిన పట్టుచీరలూ, అందమైన కార్పెట్ల నిండా నూనెమరకలూ!

నా చిన్నప్పుడు భోగిపళ్ల పేరంటానికి వెళ్లాము వాళ్లింటికి. వీధి హాల్లో మొగాళ్లంతా పేకాటలు ఆడుతున్నారు. మమ్మల్ని చూసి సూరమ్మగారి మొగుడనుకుంటా లేచొచ్చీ లోపలికి వెళ్లండమ్మా అని పంపారు. ఇంటినిండా ఆడవాళ్లు,  పిల్లలు. ఎవరూ తయారయి లేరు. జుట్లు విరబోసుకుని , కాళ్లు చాపుక్కూర్చుని కొందరూ, పిల్లలని ముస్తాబు చేస్తున్నవాళ్లు కొందరూ, భోషాణంలోంచి దుక్కల్లాంటి వెండిసామాను తీస్తూ ఒక పెద్దావిడ, ఒకమూల పడున్న పెద్ద చేమంతి , గులాబీల బుట్టలు, తేగలు, చెరుగ్గడలూ……. ఆ దృశ్యం మనసులో ముద్రపడిపోయింది. ఎందుకో అంత చిన్న వయసులోనే మనసుకు నచ్చని దృశ్యం.

మమ్మల్ని ఎవ్వరూ పలకరించలేదూ, కనీసం నవ్వలేదు. ఆ పెద్దావిడ మాత్రం ” సూరమ్మ వంటింట్లో ఉంది. వెళ్లవమ్మా ” అంది అమ్మతో. ఇద్దరం వంటింట్లోకి వెళ్లాం. ఇద్దరు వంటవాళ్లూ, పెద్ద బెనారస్ పట్టుచీర కట్టుకుని వడ్డాణం, వంకీలూ, కాసులపేరు, ఇంతలావు చంద్రహారాలూ, మావిడిపిందెల నక్లేస్, బంగారానివీ పొళ్ల గాజులూ వేసుకుని చామంఛాయలో ఒకావిడా ఏవేవో పిండివంటలు చేస్తున్నారు.

అమ్మను చూసి ఆవిడమొహం వెలిగిపోయింది. ” వచ్చావే రమా! ” అంటూ కావలించుకుని, ” నా పుట్టింటి వేపు ఇదే నాకు అన్నీ”… అంటూ అమాయకంగా వంటావిడతో చెప్తున్న ఆవిడ ఎందుకో తెగ నచ్చేసారు. నా చేతిలో ఓ పెద్ద వెండి మట్టుగిన్నెలో చేగోడీలూ, గవ్వలూ పెట్టి, ” పెరట్లో అరుగుమీద ఆడుకుంటూ తిను “…. అని పంపారు.

అంత పెద్ద పెరడు నేను ఎప్పుడూ చూడలేదు. బోలెడు చెట్లూ, పిచ్చిపిచ్చిగా అల్లుకుపోయిన తీగలూ, పొదలతో ఆ శీతకాలసాయంత్రం ఎంత భయంగా అనిపించిందో!

పెద్దనుయ్యి, చుట్టూ చప్టా నిండా బోలెడు అంట్లు. డజన్లకొద్దీ వెండికంచాలు, గ్లాసులు, కటోరీలు, వెండి ప్లేటులు, దీపం సమ్మెలు, బిందెలు, చెంబులు, గంగాళాలు. నాకు మా ఇంట్లో ఉన్న పండగలకి, పూజలకీ  తీసే రెండు చిన్న వెండికంచాలు గుర్తొచ్చాయి.

నేను తినేసి గిన్నె నూతిచప్టా మీద పెట్టేసి డిసంబర్ పూలు కోసుకుంటున్నాను.. ఈలోపున పెరటితలుపు తెరుచుకుని చాకలమ్మాయి బట్టలమూటలతో వచ్చింది. అటూయిటూ చూసి నేను  ఖాళీచేసిన వెండిగిన్నె తీసి పాతబట్టల మూటలో పెట్టేసింది. నేను వెంటనే పొదమాటునుండి వచ్చి, ” ఏయ్! దొంగా! అది పెట్టక్కడ” అంటూ అరిచాను. ఆ అమ్మాయి భయపడి గిన్నె బయటకి తీసి, చప్టా మీద విసిరేసి , వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.  విషయం సూరమ్మగారికి చెప్తే , గట్టిగా నవ్వేసి నా బుగ్గ పుణికింది తప్పా ఏమీ అనలేదు. వెళ్లేప్పుడు మూడు స్టీల్ డబ్బాల్లో ఏవో పిండివంటలు , నా చేతిలో రెండొందలూ, భోషాణం నుండి గుట్టల చీరల్లోంచి అమ్మకు ఒక బెనారస్ పట్టుచీర ఇవ్వడం ఇప్పటికీ గుర్తుంది తనకు. ఆ సంపన్నురాలా ఈ సూరమ్మగారు . చాలా చేదు నిజం!

కారులో అమ్మ ఇంకా ఏదో చెప్తూనే ఉంది. ఈవిడ అమాయకత్వానికీ, మొగుడి చేతగానితనానికీ బంధువులు పందికొక్కుల్లా పడి అయినకాడికి దోచేసురున్నారుట. వాళ్ల పిల్లల చదువులూ, పెళ్లిళ్లకూ ఆస్తులన్నీ హారతికర్పూరంలా ఆవిరయిపోయాయట. మంచం మీద తీసుకుని తీసుకుని భర్త రెండేళ్ల క్రితం పోయారట. తన బావగారి కొడుకే ఈవిడని చూస్తున్నాడుట. అతనికీ చిన్నజీతం, పిల్లలూ అని భారం అవ్వకుండా వీరింట్లో ఇంటిపురోహితుడు గారు వంటకోసం ఏర్పాటు చేసారుట. వంటే కాకుండా ఆడపిల్లల సంరక్షణ కూడా తనే చూస్తుందట.

కారు సిరిపురం దగ్గరకు వచ్చేసరికి ఆపమని చెప్పి, “అమ్మా !చిన్న షాపింగ్ ఉంది. ఐదునిమిషాలు  అంతే”….. అంటూ జవాబుకోసం చూడకుండా గబగబా కారుదిగి ” కాయా క్లినిక్” లోకెళ్లి నాక్కాలసిన బ్యూటీప్రోడక్ట్స్ కొనుక్కుని వచ్చి కూర్చున్నా. కాయా బేగ్ తెరిచిన అమ్మకి తెలుసు ఆ సౌందర్యసాధనాల ఖరీదు కనీసం ఎనిమిది వేలుంటుందని. అమ్మ మొహం చూడ్డానికి భయం వేసింది.

” అదే మనకీ, ఆవిడకూ ఉన్న తేడా” …. ఆ ఒక్కముక్క చాలు మనసు సిగ్గుతో కుంగిపోడానికి. అమ్మ ఇంటికొచ్చాకా కాస్త ముభావంగానే ఉంది.

భోజనాలప్పుడు నాన్నగారితో చెప్తోంది అమ్మ సూరమ్మగారి గురించి. నాన్నగారి మొహంలో విపరీతమైన కన్సర్న్. ” పోనీ మనింటికి వచ్చేయమనలేక పోయావా రమా!”

“ఖచ్చితంగా రాదండి. ఆవిడ ఆత్మాభిమానం నాకు తెలుసు”

“సూరమ్మ వదినెవరమ్మా? ఎప్పుడూ వినలేదు”…. అన్నయ్య ప్రశ్న.

అమ్మ ఎందుకో నాన్నగారి కేసి కినుకగా చూసింది.

“హేమూ! సూర్యకాంతం నాకు మేనమామ కూతురు. మీ నాన్నతో నా పెళ్లయిందంటే ఆ మహాతల్లే కారణం. మా పెళ్లిలో మా నాన్న కట్నం డబ్బు పదివేలు సర్దలేకపోతే మీ నాయనమ్మా, తాతగారూ పెళ్లిపీటల మీంచి ఈయన్ని లేపేసారు! అప్పటికింకా మీ నాన్నకి చదువు పూర్తవలేదు. ఉద్యోగం లేదు. వాళ్ల మీద ఆధారపడి ఉన్నారు. దాంతో గట్టిగా ఎదురు మాట్లాడలేకపోయారు.

మా సూర్యకాంతం వదిన , వాళ్లాయన్ని, మా పెద్దతాతగారినీ  ఒప్పించి, అప్పటికప్పుడు  వాళ్లు పదివేలు తెచ్చిస్తామంటే అయ్యింది నా పెళ్లి.

వాళ్లు మాట నిలబెట్టుకున్నారు కానీ తీరుస్తానన్న మా అమ్మానాన్నా మాట నిలబెట్టుకోలేకపోయారు. అప్పడికే నాకు బంగారుగొలుసు కూడా చేయించింది తను. ఎక్కడో వేలునిడిచిన చుట్టరికం. ఆ రోజుల్లో పదివేలంటే ఈ రోజు లక్షల్లో మాటే!

 

ఆ రోజుల్లోనే వీళ్లది అమాయకత్వం అని, వెర్రిమాలోకాలు అని బంధువులంతా నవ్వేవారు. అది మానవత్వం అని తనకే తెలుసు.

ఆవిడ పెద్దగా లోకాన్ని చదవలేదు కనుకా గడుసుదనం రాలేదు. ఇంత దోచేసినా ” పోనీలేవే! ప్రాప్తం లేదు నాకు” అంటోంది ఆ వెర్రితల్లి.

“పర్స్ లో నెలజీతం పెట్టుకుని ఆవిడకిద్దామంటే రెండువేలు లేదంది మీ చెల్లి”…… అమ్మింక ఆవిషయం జన్మలో మర్చిపోదు.

” ఆవిడే ఐదొందలు ఇచ్చింది దీనికి. అదీ పెట్టుగుణం  అంటే!

 

********

 

ఇరవై కేలండర్లు మారాయి. ఆరోజ కలిసిన యశోదగారి అబ్బాయితోనే నా పెళ్లయిపోవడం, ఆ వెనువెంటనే అమెరికా వెళ్లిపోడం జరిగింది.

నా పెళ్లికి అమ్మ సూర్రావుగారింటికి వెళ్లి వాళ్ల సూరమ్మొదినకు చీరపెట్టి ఆహ్వానించింది. కవర్లో పదివేలు పెట్టి ఇస్తే, నవ్వుతూ తిరస్కరించి, చిన్నదానివి నువ్వు ఇవ్వడమేమిటే అందట ఆవిడ. పైగా పెళ్లికి రాకుండా లక్ష్మిగారితో చీర, పసుపు, కుంకుమ పంపారు.

అమెరికా వెళ్లేలోపు వెళ్లి అమ్మ కనిపించమంది కానీ చాలా ప్రయారిటీల్లో అది కొట్టుకుని పోయింది.

తరువాత కొన్నేళ్లూ పెట్టిన పరుగులూ, ఉరుకులూ, పిల్లలూ, కెరియర్ల ఒత్తిడిలో భారత్ వచ్చిందే తక్కువా. అమ్మానాన్నా, అత్తమామలు అమెరికా వస్తూ పోవడం తప్పా..

గత నాలుగేళ్లుగా అమ్మానాన్నలను నేను చూడలేదు..వాళ్ల అవసరాలు తగ్గాయి కదా అని నేనూ అమెరికాకు పిలవలేదు. అంతంత మాత్రపు ఆరోగ్యాలతో దేశం కాని దేశంలో అడ్డం పడితే అది పెనుభారమే! ఎదురు చేసే ఓపికా, సహనం నాకూ లేవు.

ఎప్పుడూ ఏదో ఒక పనే. స్వదేశం పిల్లలతో రావడం ఎప్పుడూ ఓ ఆర్ధికభారం అనుకునే సంకుచితత్వం కారణమేమో! యూరప్ ట్రిప్ లూ, చైనా , ఈజిప్ట్ సందర్శనకున్న వెసులుబాటు ఇండియా వచ్చి, అనారోగ్యంతో ఉన్న అమ్మని చూడడానికి దొరకలేదు నాకూ, తమ్ముడికీ!

అన్నయ్య మాత్రం విదేశీ అవకాశాలన్నీ ఎడం చేత్తో కొట్టేసి, అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకున్నాడు.

మళ్లీ ఇన్నేళ్లకు అమ్మకోసమే రావలసి వచ్చింది. అయితే చూడడానికి అమ్మేలేదు.

యాంత్రిక జీవితం హృదయాన్ని రాయిచేయడంతో మాతృత్వం రాళ్లల్లో  చెమ్మని బయటకు తేలేకపోయింది. ఎందుకో మనసులో ఒక రిలీఫ్. బహుశా అమ్మే నా మనస్సాక్షి యేమో!

 

అమ్మకూ నాకూ ఎన్నో వ్యత్యాసాలు, వ్యతిరేకతలు! అనుక్షణం నన్ను సరిదిద్దే తన ఖచ్చితత్వమంటే నాకు జంకు. నా స్వభావంలోని చీకటికోణాలన్నీ తనకు తెలుసు. ” నా”, ” నా కుటుంబం” తప్పా ఇంకేమీ పట్టని, అవసరం తీరేకా అత్తింటినీ, పుట్టింటినీ దూరం చేసేసిన నా స్వార్ధబుద్ధిని అమ్మ ఒక్కతే ఎత్తిచూపగలిగింది.

అమ్మను కోల్పోయిన  క్షణం నాలో ఆత్మావలోకనం మొదలయింది. అమ్మ ఆఖరిచూపులు దక్కని నాకు ఎందుకో అమ్మ రూపం అస్పష్టంగా తయారయింది మనోఫలకం మీద.

అమ్మ ఆఖరియాత్ర అత్యంత ఘనంగా చేసిన అన్నయ్యకు నావంతు ఖర్చుగా డాలర్లు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరించాడు. అమ్మ బంగారమంతా నా చేతిలో ఆదరంగా పెట్టారు వదినామరదళ్లు. చాలా భారంగా అనిపించింది అవి తీసుకోడానికి.

ఆఖరుకి అన్నయ్యే అన్నాడు , “నువ్వు ఇద్దామనుకున్నది ఏదయినా ఛారిటీకి ఇచ్చేయరా తల్లీ. అమ్మ సంతోషిస్తుంది, అని. నాన్నగారూ ఆమోదంగా తలూపారు. అమ్మ తన జీవన సంధ్యాసమయాన్నంతా సేవామార్గానికే తరలించింది మరి. అన్నయ్య చెప్పిన వృద్ధాశ్రమానికి కారులో వెళ్లాను.

ఆశ్రమం ఆఫీసులో అమ్మపేరిటి ఐదువేల డాలర్లు డొనేషన్ ఇచ్చి బయటకొస్తుంటే, బాగా పరిచయం ఉన్నట్టున్న అమ్మాయి కనిపించింది. ” చేతన”…. సూర్రావుగారి పెద్దమ్మాయి.

తనే గుర్తుపట్టి పలకరించింది.

“హాయ్! సుమన్ మేమ్! మీరేంటి ఇక్కడ? . నేను చదువయిన కొత్తలో టీచ్ చేసేప్పుడు సీనియర్ ఇంటర్ చదివేది.

చెప్పాను, నేను వచ్చిన కారణం. తనెందుకొచ్చిందో చెప్పింది.

“సూరమ్మ బామ్మని చూడ్డానికి వచ్చా. పెద్దవారయిపోయారు కదా. ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడయితే ఆవిడకి రెస్ట్, మెడికల్ ఎయిడ్ దొరుకుతుందని ఇక్కడ పెట్టాము. ప్రతీవారం ఎవరో ఒకళ్లం వచ్చి చూసి వెళ్తాము. మమ్మల్ని పెంచి పెద్దచేసిన బామ్మ కదా”….. నవ్వుతూ చెప్తోంది.

సూరమ్మగారి పేరు బుర్రలో రిజిస్టర్ అవ్వడానికే కొన్నిక్షణాలు పట్టింది. మనసు సిగ్గుతో గతుక్కుమంది.

“చూడచ్చా వెళ్లి”, అడిగా.

రూం నంబర్ చెప్పి వెళ్లిపోయింది.

మామూలుగానే వృద్ధాప్యమన్నా, అస్వస్థతన్నా కాస్త విముఖత్వం నాకు. సూరమ్మగారిని ఎలాంటి పరిస్థితుల్లో చూడాలా అనుకుంటూ వెళ్లా.

బాగా ధనికవర్గాల వారికి అన్ని సౌకర్యాలతో కట్టిన వింగ్ అది. లిఫ్ట్ లో మూడో అంతస్థులో ఉన్న ఆమె ఫ్లాట్ తలుపు కొట్టా. ఎవరో ఇరవై ఏళ్ల అబ్బాయి, చక్కటి స్ఫురద్రూపి తలుపుతీసాడు. సూరమ్మగారి గురించి వచ్చానని తెలిసి ఆమె రూంలోకి తీసుకెళ్లాడు.

నన్ను చూస్తూనే ” రమా! ” అంటూ సంబరంగా పిలిచింది.

 

కాస్త మతిమరుపు వచ్చిందని చెప్తున్నాడు అబ్బాయి. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు సూరమ్మగారు మెత్తటి కాటన్ చీరకట్టుకుని. మనసులోనే సూర్రావుగారి కుటుంబానికీ, తమకోసం పనిచేసిన పెద్దావిడకు ఆఖరిరోజులు హాయిగా గడవడానికి అంతగొప్ప ఏర్పాటు చేసిన వారి వితరణకు మనసులోనే జోహార్లు చెప్పుకున్నా.

నేను రమకూతుర్ని అని చెప్పి, అమ్మ వెళ్లిపోయిన సంగతి చెప్పకుండా ఆవిడను చూడడానికి వచ్చానని చెప్తే మొహం ఇంత విప్పారింది ఆమెకు.

ఒక ముప్పావుగంట కబుర్లు అయ్యాకా ఆ అబ్బాయి గురించి చెప్పింది. తను పెంచుకున్న బావగారి కొడుకుకు ఆఖరి నాల్గవ సంతానంట. పెద్దబ్బాయికి సూర్రావుగారే షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం వేయించారుట. ఆడపిల్లలిద్దరికీ పెళ్లయిందట. ఈ పిల్లాడు చిన్నప్పటినుండీ చదువుల్లో స్టేట్ ఫస్టేట.

ఆ అబ్బాయి రాజేష్ చెప్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసాడుట. యూనివర్సిటీ టాప్ చేసాడుట. కేంపస్ జాబ్ తీసుకోలేదుట. జీ ఆర్ ఈ లో చాలా మంచి స్కోర్ రావడంలో యుఎస్ లో టాప్ యూనివర్సిటీల్లో ఎమ్ ఎస్ చేయడానికి ఆఫర్స్ వచ్చాయిట. ఇంట్లో ఆర్ధికపరిస్థితులు సహకరించనందున వచ్చేయేడు ప్రయత్నిద్దామనుకుంటున్నాడుట. ఎంతో హుందాగా చెప్తున్నాడు.

డబ్బుసాయం చెయ్యమంటాడా?

సూరమ్మగారు మా కుటుంబానికి చేసిన సాయానికి మారుసాయం అడుగుతారేమో! ఏం చెప్పాలి?

నిజానికి అమ్మపేరున పదివేల డాలర్లు డొనేట్ చేద్దామనుకున్నది, అక్కడ దాతలు బానే ఉన్నారనిపించి ఐదువేలే చేసింది తను. పోనీ ఆ ఐదువేల డాలర్లూ ఈ పిల్లాడికిస్తే??

కళ్లముందు తన పిల్లలు, వాళ్లకి మూడు నాలుగేళ్లలో మెడికల్ స్కూల్ కి పంపడానికి అర్ధమిలియన్ డాలర్ల ఖర్చు కనిపిస్తున్నాయి. ఈ ఐదువేలకీ ఇంకో వందవేలు వేసి వసుంధరాస్ లో కొనబోయే నగలూ, ఇన్నేళ్ల తరువాత వచ్చినందుకు ఆడపడుచులకీ, వదినా మరదళ్లకీ పెడదామనుకుంటున్న పట్టుచీరల ఖర్చూ…… ఇంకా ఎన్నో కళ్లముందున్నాయి.

“వద్దులే. నేనే చెయ్యాలా యేంటి సాయం. బాగా బలిసిన ఆ సూర్రావుగారిలాంటి వాళ్లెవరో ఖచ్చితంగా చేస్తారు. నాకెందుకు అక్ఖరలేని, అక్కరకు రాని మెహర్బానీ”… నా అంతరంగంలో నాకే ప్రత్యేకమైన , సొంతమయిన స్వార్ధపాలోచనలు.

ఇంక వెళ్తానంటూ లేచాను.

సూరమ్మగారు నన్ను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా కావులించుకున్నారు. ” బావుందే రమా! నిన్నిలా చూడడం. నా పుట్టింటి వేపు నువ్వొక్కత్తివే నాకు”….. ఆవిడ నన్ను మా అమ్మ అనే అనుకుంటున్నట్టున్నారు మధ్యమధ్యన.

మెల్లగా మంచంమీంచి లేచి , వాకర్ పట్టుకుని పక్కనే ఉన్న చిన్న అలమారా తెరిచి ఆవిడ చీరల బొత్తి కిందనుంచి ఏదో తీసారు. మళ్లీ మంచం మీద కూర్చుని దగ్గరకు పిలిచారు. రాజేష్ కు సైగ చెయ్యగానే బుట్టలోంచి రెండు ఆపిల్ పళ్లు తీసి ఇచ్చాడు. సూరమ్మగారు ప్రేమగా నా చేతులో అవన్నీ పెట్టారు. గంధం రంగుకు వంగపండురంగు అంచున్న పాతకాలపు బెనారస్ పట్టుచీర. ఈ రోజుల్లో ఆ నేత చూడము. అంత బాగుంది.

 

” రమా! తాతగారి ఆస్తిలో నాకు మిగిలిన ఆఖరి వస్తువు. చీర పాతదే కానీ బంగారు జరీ. కరిగించుకుంటే ఐదుతులాలు వస్తుందిట”….।. అమాయకంగా ఎత్తుపళ్లతో నవ్వుతూ చెప్తున్న ఆవిడిని చూస్తూ  నిశ్చేష్టనై ఉండిపోయా!

“అదీ పెట్టుగుణమంటే”….. అమ్మమాటలు చెవిలో గింగుర్లెత్తుతున్నాయి.

ఒక్కసారి మిలియన్ డాలర్ల పైనే ఉన్న మా బేంక్ నిలువలు, అమెరికాలో, ఇండియాలో సంక్రమించిన, సంపాదించిన ఆస్థిపాస్థులు కళ్లముందు కదిలాయి.

“రమా! నిన్నొకటి అడగచ్చా”….. సూరమ్మగారు ! లేమిలోనూ చెయ్యిచాపని జమీందారురాలు! ఇన్నాళ్లకు ఏదో కావాలని అడుగుతున్నారు.

“తప్పకుండానండి. అడగండి”. ఆ క్షణంలో ఆవిడ ఎన్ని లక్షలు అడిగినా యివ్వడానికి సిద్ధంగా ఉన్నా.

” మా రాజేషు గాడు అమిరికా వెళ్తాట్టే! నీకు వీలయితే శ్రమనుకోకుండా ఎప్పుడయినా వాడికి ఫోన్ చేస్తావా. వెర్రివెధవ. మనూరు దాటి ఎక్కడకీ వెళ్లలేదు. “….. ఆవిడ నా కళ్లల్లోకి చూస్తూ అడుగుతున్నారు.

అమ్మ నా పక్కనే ఉన్నట్టనిపించింది. ఇంక నావల్ల కాలేదు. నా రాతిగుండె కరుడు వీడి కరిగింది. వెల్లువలా ఒక్కపెట్టున దుఃఖం నన్ను చుట్టేసింది. డబ్బు తరువాతే బంధాలను నిలబెట్టిన నా అస్థిత్వం కుంగిపోయింది సిగ్గుతో.

ఉండలేక బయటకొచ్చేసా. రాజేష్ నా వెనుకే వచ్చి, సూరమ్మగారి మాటలకు క్షమార్పణ అడుగుతున్నాడు.

నేను మాట్లాడలేదు. మౌనంగా నా బేగ్ తెరిచీ మిగిలిన ఐదువేల డాలర్లున్న కవర్ తీసి రాజేష్ చేతిలో పెట్టా. మళ్లీ నీ మనసు మారేలోగా ఇచ్చేయ్ ….. నా అంతరాత్మ ఇచ్చిన చేతావని.

“వీలయినంత తొందరగా అమెరికా వెళ్లిపో రాజేష్! వచ్చే యేటి పరిస్థితులు ఎలా ఉంటాయో! ఈ డబ్బు నీకు అమెరికా వచ్చి కొన్నాళ్లు నిలబడడానికి సరిపోతుంది. నేనుండే వూరిలో యూనివర్సిటీలో కానీ జాయిన్ అయితే నీకు షెల్టర్ కూడా ఇవ్వగలను. ” నా బిజినెస్ కార్డ్ తీసిచ్చా.

నాతో పాటూ లిఫ్ట్ లోకి వస్తూ రాజేష్ అన్నాడు.

“మీరు ఇదంతా చెయ్యక్కరలేదు మేడమ్. మీ మంచిమాటలు చాలు నాకు”, కవర్ నాకు తిరిగిస్తూ!

” రాజేష్! నేను చేసిందేమీ లేదు. ఇది మా అమ్మ ఋుణం. తను బ్రతికుండగా తీర్చడానికి ప్రయత్నించింది. అవ్వలేదు. సూరమ్మగారు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇన్నాళ్లకు ఆ ఋుణం తీర్చే అవకాశం నాకు వచ్చింది. అంతే” !

ఇప్పుడు మా అమ్మ మొహం స్పష్టంగా నాకు కనిపిస్తోంది .

ఆ చూపు నన్ను స్కాన్ చేస్తున్నట్టు లేదు. చిరునవ్వుతో నన్ను ఆమోదస్తున్నట్టు ఉంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *