April 18, 2024

12. శ్రద్ధయా లభతే విద్యా

 

రచన: సాలగ్రామ ఎస్. ఎస్. ఎస్. వి. లక్ష్మణమూర్తి

 

జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణమంతా రంగు రంగుల దుస్తుల ధరించి వచ్చిన విద్యార్థులతో సందడిగా ఉంది. కొన్ని సంవత్సరాలు పాటు తమకు చక్కగా పాఠాలు చెప్పడమే కాకుండా సందేహాల నివృత్తి కూడా చేసి,  చదువులో ముందుండేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయులకి,  ఆ సంవత్సరం పాఠశాల ను విడిచిపెడుతున్న విద్యార్థులంతా కృతజ్ఞతా పూర్వకంగా ఏర్పాటు చేసుకున్న వీడ్కోలు వేడుక కోసమే ఈ సందడంతా…

రజని ప్రార్ధనా గీతంతో ప్రారంభమయిన వీడ్కోలు సభ దేవి, లక్ష్మీల వ్యాఖ్యానంతో ముందుకు సాగింది. ఉపాధ్యాయులు సుబ్బరాజుగారు మాట్లాడుతూ పాఠాలను సులువుగా ఎలా చదువుకోవాలి, ఏ ఏ  ఆహార నియమాలు పాటించాలో చెప్పారు.

పరీక్షలలో ఏ ఏ విభాగాలు అధ్యయనం చేస్తే సులువుగా మార్కులు సంపాదించుకోవచ్చో రామమూర్తి గారు చెబితే

చివరగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గత సంవత్సరాల విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలను వివరించి ఈ సంవత్సరం విద్యార్థులకు వాటికంటే ఎక్కువ సాధించే సత్తా ఉందని,  దాని కోసం ప్రయత్నించాలని సూచించారు.  తరువాత కొంత మంది విద్యార్థులు పాఠశాలతో పెనవేసుకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

గుణసూర్య మరియు కొంతమంది విద్యార్థులు ఈ సభ సజావుగా సాగడానికి ఉదయం నుండి అటు ఇటు తిరుగుతూ అక్కడ కావలిసినవి అందిస్తూ కష్టపడుతున్నారు.

సభలో ఉన్నవారిని అలరించడానికి మాధురి మరియు స్నేహితుల బృందగానం, ఆమని మరియు స్నేహితులు చేసిన నృత్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

అందరూ నిలబడి జాతీయ గీతం పాడిన తరువాత సభ ముగిసింది. విద్యార్థులంతా ఎవరి ఇళ్ళకు వారు బయలుదేరారు.  ఏర్పాట్లు చూస్తున్న గుణ సూర్య బృందం మాత్రం అక్కడవన్నీ తిరిగి యధాస్థానంలో సర్దే పనిలో ఉన్నారు.

ఉపాద్యాయులంతా కలిసి ఒక చోట ఉన్న పెద్ద బల్ల చుట్టూ కుర్చీలలో కూర్చుని పరీక్షలకు సంబంధించిన కాగితాలు పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మాటల మధ్యలో వారికి గుణసూర్య గురించి ప్రస్తావన వచ్చింది. తెలివితేటలు దండిగా ఉన్న గుణసూర్య ఈ మధ్య స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూ చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ  విషయంలో అతనిని ఒకసారి పిలిచి మాట్లాడి అతనిలో నిద్రాణమైన శక్తిని మేల్కొలిపితే పాఠశాలకు మంచి పేరు తీసుకురాగలడని వారందరూ నిర్ణయించుకుని గుణసూర్యని వెళ్లేముందు తమకు కనపడి వెళ్ళవలసిందిగా కబురు పంపించారు.

పనులన్నీ ముగించుకున్న గుణసూర్య స్నేహితులని బయట వేచి ఉండమని తను ఒక్కడే ఉపాధ్యాయుల వద్దకు వెళ్ళాడు.

అప్పుడు కాంతారావు గారు “ గుణసూర్యా,  నువ్వు తరగతిలో బాగా చదివే విద్యార్థులలో ఒకడివి.  అలాంటిది ఎందుకని ఈ మధ్య ఎక్కువ మార్కులు రావడం లేదని”ప్రశ్నించగా

జ్వరం వచ్చి చాలా రోజులు అనారోగ్యంతో పాఠశాలకు రాకపోవడం, అప్పటి పాఠాలు చదవకపోవడం వలన పూర్తిచేయగలనో లేదో అనే భయంతో దృష్టి పెట్టలేకపోతున్నానని గుణసూర్య చెప్పాడు.

పరీక్షలకు ఇంకా 15 రోజులకి పైనే ఉందని ఆ పాఠాలన్నీ పూర్తి చేసుకొని అవగాహన పొందాలని రామమూర్తిగారు సూచించారు.

సుబ్బరాజుగారు మాట్లాడుతూ బాబూ,  ఇప్పటి దాకా  తరగతిలో బాగా చదివే విద్యార్థుల్లో ఒకడిగా ఉన్న నువ్వు స్నేహితులతో తిరుగుతూ సమయాన్ని బాగా వృధా చేస్తున్నావు. అవన్నీ ప్రక్కన పెట్టి  ఈ 15 రోజులూ బాగా చదివితే నువ్వు మళ్లీ నీ స్థానానికి చేరుకోగలవు. ఆ సామర్థ్యం   నీకుందని గుణసూర్య తో వివరంగా చెప్పారు.

వారికి ధన్యవాదాలు చెప్పి గుణసూర్య స్నేహితులు ఉన్న వైపు నడిచాడు.  మౌనంగా వస్తున్న గుణసూర్యను చూసిన స్నేహితులు ఏమైందోనని అనుకుంటుండగా, వారికి జరిగింది చెప్పి పరీక్షలకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి  మనమందరం పరీక్షలయ్యేదాక కలుసుకోకూడదని ఒప్పందం చేసుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన క్షణం నుండే గుణసూర్య చదువు మీదే దృష్టి పెడుతూ ఏకాంత ప్రదేశంలో కూర్చుని పాఠాలన్నీ అవగాహన చేసుకున్నాడు. తిండి,  నిద్ర తప్ప మిగిలిన సమయమంతా చదువుతూ శ్రద్ధయా లభతే విద్యా  అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పరీక్షల సమయం రానే వచ్చింది. పరీక్షలన్నీ అనుకున్న దానికన్నా చాలా చక్కగా పూర్తి చేయడంతో ఆనందంగా ఉన్నాడు.  కొన్ని రోజులు ఆటపాటలతో గడిపాడు.

ఒకరోజు ఉదయాన్నే నాన్నగారు పిలిచి బాబూ ఈ రోజు హనుమజ్జయంతి కదా అలా ఆంజనేయస్వామి గుడికి వెళదామని చెప్పడంతో, చక్కగా తయారై వెళ్లి తమలపాకులు అలంకరణగా గంధసింధూరంతో పూజించబడిన కార్యసిద్ధి హనుమాన్ ని దర్శించుకుని అప్పాలు ప్రసాదంగా స్వీకరించి తిరిగి వస్తుండగా ఒకరు ఎదురుపడి ప్రధానోపాధ్యాయులు ఇపుడే బస్సు దిగారు, ఉన్నపళంగా నిన్ను  పాఠశాలకు రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే పాఠశాలకు వెళ్లగా ఫలితాలు వచ్చాయని అందరినీ పిలవమని చెప్పడంతో పిలవడానికి పరుగెట్టాడు.  అందరినీ పిలుచుకుని వచ్చేటప్పటికి అక్కడ అందరూ మార్కులు చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు.  చివరలో మార్కులు చూసుకున్న గుణసూర్య పాఠశాలకు ప్రధమ స్థానంలో ఉండడంతో ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు.  కాసేపటికి అతను జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నట్లు సమాచారం రావడంతో అందరూ అభినందనలుతో ముంచెత్తారు.

గ్రామానికి మంచిపేరు తీసుకొచ్చిన గుణసూర్య  అతని తల్లితండ్రుల మీద గ్రామ పెద్దలు,  బంధువులు పొగడ్తల వాన కురిపించారు. ఒక్కసారిగా గుణసూర్య కు ఇంతటి సంబరాలకు కారణమయ్యిన ఉపాధ్యాయ బృందం గుర్తుకువచ్చింది. సరియైన సమయానికి తనకు మార్గదర్శనం చేసిన వారి వద్దకు పరుగు పరుగు న వెళ్లి కృతజ్ఞతలు చెబుతూ నమస్కారం చేసాడు.

***

 

 

3 thoughts on “12. శ్రద్ధయా లభతే విద్యా

  1. మంచి కథ… పదాల పొందిక బావుంది. నేటి విద్యార్థులకు ఇటువంటి కథలు ఎంతో ప్రయోజనకరం..

    విజయకుమార్ తెలుగు అధ్యాపకులు. ముమ్మిడివరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *