March 29, 2024

13. ఓన్లీ ఒన్ పీస్

రచన:  చెంగల్వల కామేశ్వరి
చిలకాకుపచ్చ జలతారు మెరుపుల చీరకున్న బంగారు నెమళ్ల  పైటకొంగును అలా అలవోకగా భుజాల మీదనుంచి జారు పైటగా జాలువారుస్తూ కనుకొలకులతో ఓరచూపు సంధించిన గీత పెదాలు గర్వంతో విచ్చుకున్నాయి.
తననే పట్టిపట్టి చూస్తున్న వాళ్లందర్నీ గమనించుకుంటూ పొంగిపోతున్న గీతని చూసి,  ఈ చీరలో బంగారు చిలకలా ఉన్నావు తెలుసా ! మెల్లగా గుసగుసలాడాడు. సుధాకర్ గీతకే వినిపించేలా!
భర్త మాటకు ఆతిశయంగా, “హమ్మయ్యా మీకు నచ్చింది. మీరుకొన్న పచ్చల సెట్ కి బాగా సూటవుతుందనే పదిహేనువేలు పెట్టి కొన్నాను. నేను సెలక్ట్ చేయగానే అలాంటిదే  కావాలని ఎందరడిగారో ! తెలుసా!
“ఓన్లీ  వన్ పీస్ ” ఈ మేడమ్ లా! అన్నాడు. ఆ కౌంటర్లో ఉన్బతను.

ఆనందంగా చెప్తున్న  గీతను. “నిజమే నాకోసమే! నువ్వు “ఒన్లీ వన్ పీస్” అని ప్రేమగా ఆమె చెయ్యి నొక్కిన భర్త
ప్రేమకి సిగ్గుతో ఆమె బుగ్లలు మందారాలయ్యాయి.
తమనే చూస్తున్న తన కజిన్స్, ఫ్రెండ్స్ మొహాలు చూస్తే లోలోపలే ఉప్పొంగిపోతోంది. ఆ జగతి అయితే మరీను గుడ్లు మిటకరించి చూస్తోంది. దానికి తన చీరె బాగా నచ్చినట్లు తెలుస్తోంది.కానీ చచ్చినా ఎవరినీ మెచ్చుకోదు.
కుళ్లుమొహంది! అడగకపోన అడగకపోనీ కడుపుబ్బి చస్తుంది ఇంక రమణి ఆత్రం అంతా ఇంతాకాదు. అదెంత ! ఎక్కడకొన్నావు! నువ్బు కొనుక్కున్నావా మీ ఆయన కొన్నాడా,! కొంటే ఎందుకు కొన్నాడు? పండగకా పెళ్లిరోజుకా!
అని యక్షప్రశ్నలు వేసి చంపుతుంది.
అందుకే పదిహేనువేలరూపాయల చీరని ఇరవయి వేలు చేసి చెప్పింది. ఆశ్చర్యంతో నోరు తెరచిన దానినోట్లో పెళ్లివారిచ్చిన లడ్డూ కూరి
“ఆరాలు చాలు ఇంక తిను! అని చెప్పి చక్కా వచ్చింది.
ఫంక్షన్ నుండి ఇంటికొచ్చి బట్టలు మార్చుకోడానికెడుతున్న గీతనుధ్దేశ్యించి, బట్టలు మార్చుకుని  రా! నీకివాళ దిష్టి తీస్తాను. అంటున్న భర్తను చూసి నవ్వుకుంటూ రూమ్ లోకి వెళ్లింది.
ఆమె నైటీ వేసుకురాగానే గుప్పిళ్లతో ఉప్పు తీసుకుని ఆమె చుట్టూ తిప్పుతూ, ఇరుగుదిష్టి పొరుగుదిష్టి పెళ్లిలో చూసిన వాళ్ళందరి దిష్టి పోవాలి చెడు దిష్టి పెట్టినవాళ్ల కళ్లల్లో కారం! కుళ్లు చూపులు చూసిన వారి కళ్లల్లో కాకిరెట్ట పెట్ట! అనగానే పక్కున నవ్విన  గీతతో కలిసి నవ్వుతూ,  కళ్లు నీళ్లతో తుడిచి కాళ్ల మీద నీళ్లు చల్లి దేముడి బొట్టు  పెట్టి దగ్గరకు తీసుకున్న భర్త కౌగిలి లో ఒదిగిపోయింది.
++++++++++++
తాము వెళ్లిన పెళ్లి ఫంక్షన్ ఫొటోలు షేర్ చేస్తే వేలకొద్దీ లైకులు, వందలకొద్దీ కామెంట్లుతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది గీత.
ఒకసారి ఆదివారమయినా బీరువా సర్దాలి అనుకుంటూ బీరువాలో  చీరలు వాటి బ్లవుజులు అన్నీ దేనికది  అన్ని అందంగా మడత పెట్టుకుంటూ సర్దుకొంది.
అందరి మెప్పు పొంది వేల లైకులు పొందిన చీర కనపడలేదు. మూడు వేలు పెట్టి మగ్గం వర్క్ చేయించుకున్న ఆ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది. చీర ఏమైనట్లు.
పిచ్చిదానిలా సర్దినవే సర్ది అలమారాలు, సూట్కేసులు  అన్నీ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. గీతకి టెన్షన్ హెచ్చింది. గుండె స్పీడుగా కొట్టుకుంటోంది.
ఏదయినా కనిపించకపోతే “సుమంతో సుమంతో కార్త్య వీరార్జునాయనమః “అని  ఒక పదకొండుసార్లు చదివుకుంది. మళ్లీ వెతికింది.
ఏడుపొస్తుంటే సుధాకర్ కి చెప్పింది.
వినగానే షాకయ్యాడు. చేత్తో క్రాఫ్ సర్దుకుంటూ ఒకవేళ ఎవరికయినా ఇచ్చావా! అనగానే సెకనులో వెయ్యోవంతులో గీత మెదడులో తళుకుమన్న జ్ఞాపకం “హా ఐరన్ చేయడానికిచ్చాను. అని గట్టిగా అరిచింది. అయినా వారం రోజులు అయింది ఇంకా ఇవ్వకపోవడమేమిటి? కొంపదీసి వాళ్లావిడ ఏ ఫంక్షన్లకయినా కట్టేస్తోందేమో!
అనుకోగానే గీత గుండె ఝల్లుమంది.
వెంటనే గబగబా అన్ని బట్టలు బీరువాలో సర్దేసి, సుధాకర్ కి వినపడేలా “నా చీర తెచ్చుకుని వస్తాను.” అంటూ   తమ బట్టలు ఇస్త్రీ చేసే రంగయ్య ఇంటికి వెళ్లింది.
గీతను చూడగానే, ఇంతెండలో వచ్చారేంటమ్మా! అనడిగి, మొన్న మీ బట్టలు ఒట్టుకొచ్చానమ్మా ! మీరెటో ఎల్లారని మీ ఓనరమ్మ చెప్పినాది.” అక్జడ ఇచ్చేసినాను. అన్న రంగయ్య మాటలు విని “హమ్మయ్య! అనుకుంటూ ఇంటి దారిపట్టింది.
ఇంటి ఓనర్ పంకజమ్మ ఇంటికెళ్లేసరికి ఆవిడ భోంచేస్తూ కనిపించింది.
గీతను చూస్తూనే “గీతా!  నీ చీరలిచ్చాడు రంగయ్య నా బీరువాలో పెట్టాను. ఇద్దామనుకుంటే, మొన్న నువ్వు లేవు, నిన్న నేను లేను. అని లేవబోతుంటే వారించింది.గీత.
“అయ్యయ్యో ఉండనీయండి  మనమెక్కడికి పోతాము.తర్వాత తీసుకుంటాను” అని చెప్పి  ఇంటికొచ్చేసింది.కాని గుండె పీచుపీచుమంటోంది. ఏదో అపశకునంలా కుడికన్ను కొట్టుకుంటోంది.
అసలే ఆ పంకజానికి తనకి పడదు. ప్రతీదానికి ఇంటి ఓనర్ అని బడాయిపోతుంది.నీట్ గా సర్దిన ఇంట్లోకి వచ్చి
” అబ్బా ఏంటో వాసన! అంటూ ముక్కుమూసుకుంటుంది.
అది చూస్తే ఆ ముక్కు కోసి చేతికిచ్చి ఓసి!పాగల్దానా నువ్వు స్నానంచేసి ఏడాదయిందేమో పోయి స్నానం చేయి వాసన పోతుంది” అనాలన్నంత కచ్చి పుడుతుంది.
తనేది కట్టుకున్నా పెట్టుకున్నా ఓర్వలేదు.
ఇంకాపిల్లా పీచులేరు కాబట్టి పెళపెళలాడుతున్నావు. పిల్లలు పుట్టలేదు కాబట్టి సినిమాలు షికార్లు నగలు చీరెలు ముద్దు మురిపాలు.. పిల్లలు పుట్టాక పెళ్లాలమొహాలు ఎవరు చూస్తారు.
అని ధీర్గాలు తీసే పంకజాన్ని చూస్తే ఒళ్లుమంట! అలాంటి దానిదగ్గర బంగారంలాంటి చీరె ఉండిపోయింది.
రేపెలాగయినా తెచ్చేసుకోవాలి. కుళ్లు పీనుగ ఏదయినా చేసినా చేస్తుంది ఆ చీరను.అనుకుంటూ తమింట్లోకి దారితీసింది గీత.
వీకెండ్ కావటాన సినిమా హొటల్ ప్రోగ్రామ్ పెట్టిన సుధాకర్ తో వెళ్లి ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రయింది.
తెల్లారుతూనే పెద్దగా ఏడుపులు వినిపించి హఢిలిపోయి ఏమిటా అని ఆరా తీస్తే నిన్న నిక్షేపంలా ఉన్న పంకజమ్మ నిద్రలోనే పోయిందని తెలిసిన గీత భయంతో బిగుసుకుపోయింది.
ఇదేమన్యాయం ఇలా కూడా పోతారా ! అని ట్విటిస్తుపోతూనే ఉన్నారా దంపతులు.
వచ్చేవాళ్లు పోయేవాళ్ల రోదనలతో ఇల్లంతా నిండిపోయి వీధంతా జనాలతో  నిండిపోయింది.
ఆవిడకి కావల్సినవారందరూ ఈ ఊరే కాబట్టి అందరూ వచ్చాక  పంకజమ్మ పునిస్త్రీగా పోయిందని పవిత్రంగా పసుపుకుంకుమలతో సాగనంపాలని ఏడవద్దని చెప్తూ చేయాలసిన కార్యక్రమాలను దగ్గరుండి చేయిస్తున్న బ్రాహ్మడు  ఆవిడకి స్నానం చేయించి మొహానికి పసుపు రాయించి, బొట్టు పెట్టించి ఏదయినా చీర తీసుకొచ్చి కప్పమనగానే పంకజమ్మ కోడలు బరబరా వెళ్లి సరసరా ఒక చీర ఆవిడ మీద కప్పేసి
“అయ్యో అత్తయ్యా! ఈ చీరలో మహాలక్ష్మిలా ఉన్నారత్తయ్యో!
అని బోరుబోరుమని ఏడ్వడం మొదలుపెట్టింది.
అది చూసి కెవ్వున కేక వేసింది గీత.ఒక్కసారిగా బావురుమంది..
అది చూసి మిగతావాళ్లు కూడా
మిగతావాళ్లు కూడా గీతతోపాటు శోకాలు పెడుతుంటే గీత  బోరుబోరుమని ఏడుస్తోంటే సుధాకర్ తెల్లబోయి “నువ్వెందుకే ఇలా అయిపోతున్నావు? అనబోయాడు.
వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ
“అది నా చీరండీ ఆ రంగయ్యగాడు వీళ్లింటిలో పెట్టాడు వెధవ ! నా చీర వేసుకొని వెఖ్లిపోతోందావిడ ”
అని ఏడుస్తున్న గీతని ఒకచేత్తో పొదివి పట్టుకుని పడుకున్న పంకజమ్మ మీద కప్పిన చిలకాకుపచ్చ నెమళ్ల జరీ బోర్డర్ చీర చూసి  ఖంగుతిన్నాడు సుధాకర్.
గీతనెలా ఊరడించాలో తెలీక అయోమయంగా అటూ ఇటూ చూసిన సుధాకర్ కి కళ్లల్లో నీళ్లు పెదాలలో బిగపట్టిన నవ్వుతో సతమతమవుతున్న గీత ఫ్రెండ్స్ జగతి, రమణి,లక్ష్మి కనిపించారు.
మీ మొహాలుమండ! మీకళ్లే పడ్డాయి మా గీత చీరె మీద” అని పళ్లు నూరుకుంటూ గీతని మెల్లగా ఓదారుస్తూ పక్కకు తీసుకెడుతున్బ సుధాకర్ ని చూసి
” అయ్యో పిచ్చిపిల్ల ఎంత ఏడుస్తోందో! అంత ప్రేమ సంపాదించుకుంది మన పంకజమత్త ! అనంటూ, జిర్రున ముక్కుచీదీంది ఒకావిడ! అవన్నీ తెలియని చనిపోయిన పంకజమ్మ మొహంలో చిరునవ్వు  మాత్రం చెదరలేదు‌.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

3 thoughts on “13. ఓన్లీ ఒన్ పీస్

  1. పట్టుచీర ఇతివృత్తం తో రాసిన ఈ కథలో ఎంత పట్టులేకపోతే మేముఊపిరిబిగపట్టి మరీచదువుతాం.ధన్యవాదాలు.

Leave a Reply to Nvvs murthy Cancel reply

Your email address will not be published. Required fields are marked *