April 20, 2024

14. వింత కాపురం. . !

రచన:  ఆకుల రాఘవ
ప్రపంచంలో ఈయన లాంటి మనిషి ఎక్కడైనా ఉంటాడా?  ఏమో. . ?  నాకైతే ఎక్కడ తారసపడలేదు.  ఇప్పుడు మాత్రం
నేను ఈయనతో అనుభవిస్తున్నాను.
అతనితో నా పెళ్లి జరిగేవరకు ఆయనేంటో నాకెలా తెలుస్తుంది?  అతని చిన్ననాటి జీవితం ఎలావుందో. . . కాని,  పెళ్లి అయిన తరువాత తెలిసి వచ్చింది! ఎప్పుడు ఎలా ఉంటారో?  ఎప్పుడు ఎలా మారుతారో? ఆయనను సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడుకి కూడా తెలియదు కాబోలు!  నేను మాత్రం ప్రత్యక్షంగా చూడటం ఆయనకు భార్యగా అయిన నాటి నుండి.
ఆయన అంత కటినాత్ముడా? ప్రతి రోజు కొట్టి చంపుతున్నాడా?  లేదే?  మరి ఎందుకు ఆయన గురించి ఇలా వాపోతున్నాను.
ఆయన మౌనాన్నీ భరించలేక పోతున్నాను.  ఆ నిశబ్దం మహా విస్పోటనంలా తోస్తుంది!  అది భరించటం నావల్ల కావట్లేదు? కాపురం అన్నప్పుడు, ఏవో. . . చిన్న,  చిన్న గొడవలు. మాటకు మాట అనుకోవటం జరుగుతుంది.  అంత మాత్రాన అలిగి కూర్చుండిపోతాడా? ఎంత బతిమిలాడినా?  తినడా?  పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటాడా?

ఓ మూడు రోజులు పస్తులుండి, నాలుగు రోజుల తరువాత తనకు తాను వండుకొని తినడం. తన పనులు తాను చేసుకోవటం, చివరికి తన బట్టలు కూడా తానే ఉతుక్కొని ఆరేసుకుంటాడు. ఇక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఒక పొయ్యి రెండు వంటలు.

పోని,  నా తరపు వాళ్లకు,  ఆయన తరపు వాళ్లకు చెప్పుకుంటాడా?  అంటే అది వుండదు. అది నాలుగు గోడల మధ్యనే ఉండిపోవాలి! ఇరుగు, పొరుగు వాళ్లకు కూడా తెలియదు. ఆయన, నేను లోకానికి చూడ ముచ్చటగా ఉండిపోతాం! కాని,  నా అంతరంగంలో రగిలే జ్వాల ఎవరికి తెలుసు?

ఇది అప్పుడే అయిపోయే బాగోతం కాదులే! ముడి వేసుకున్నాక తప్పుతుందా?  అనుకొని అలవాటు పడి
పోయాను!

మౌనం సరే. . ! పక్క విషయానికి వస్తే . . . అది మాత్రం జరిగి పోవలసిందే! పోని ఆప్పుడన్నా పెదవి విప్పి నాలుగు మాటలు మాట్లాడుతాడా అంటే. . .  అది లేదు?  నిశబ్ద రతి సమరమే!  ఆ అనుభవాల్లో కూడా ఆనందమయ అనుభూతే!  ఆ ఒక్క దానికే నేను బానిసనయ్యాను కాబోలు! లేక పోతే ముడి విప్పి ముఖాన కొట్టి వెళ్ళేదాన్ని. అయినా.? తెంపి ముడి వేస్తే కురచే కదా?         ఇతనే ఇలా ఉన్నాడు అనుకొంటే. . . మరొకడు ఎలా ఉంటాడో?
ఒకర్ని విడిచి ఒకర్ని కట్టు కోవటం అంటే. . .
వేశ్యకు నాకు ఉన్న తేడా ఏమిటి?

ఆ శీలమే నన్ను అతనితో. . . కాపురం చేసేలా చేస్తుంది!
ఇక తను మౌనం వీడితే మహారాజే! కాని, అతని గుణం ఎందుకిలా మారుతుందో అర్థం కావటం లేదు.

అతను కూడా తన మానసిక పరిస్థితి గురించి ఆలోచించడు.  నేను అడిగినా. . . చెప్పడు.  పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది.
ఇప్పుడు పిల్లలు పుట్టారు.  ఐనా. . ?ఆయన పద్ధతి మారలేదు.
పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు.
కాని, ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.
పిల్లలు కూడా నాలాగే అలవాటు పడిపోయారు. “ఆయన అంతేలే! మనలను బాగానే చూసుకుంటున్నారు కదా?  మనతో
ఆయనెప్పడు గొడవ పడింది లేదు. అడగకుండానే అన్ని సమకూర్చి పెడుతున్నాడు.  ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.  చాలా చక్కగా చదివిస్తున్నాడు”. అనుకుంటున్నారు తప్ప అమ్మకు,  మీకు ఈ గొడవ ఎందుకు?
నీ మౌన సంగ్రహమేంటి? మా ముందే మీరు ఇలా ప్రవర్తించటం బావుందా? ఎందుకు అలిగిపోతారు. మా ముందే వేరుగా ఉండి,  అలా ఎందుకు వండుకు తింటారు? మీ పనులు మీరెందుకు చేసుకుంటారు? అని,  ఒక్కనాడు అడిగింది లేదు. ఆయన అలిగితే బతిమిలాడి ఇంత తినిపించింది లేదు.
పిల్లలు ఆలిగితే,  తట్టుకునేవాడు కాదు!
దానికి కారణం తెలుసుకొని, క్షణంలో తీర్చేవాడు. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిలు అయిపోయాయి. వాళ్లకు పిల్లలు కలిగారు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఐనా. . ?
మా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.
అదే పద్ధతి అదే దోరణి!

కాలంలో ఎన్నో రకాల మార్పులు! ఈ తరంలో ఎన్నో రకాల మార్పులు! ప్రపంచం గుప్పిట్లో ఒదిగి పోయింది! సాంకేతిక విప్లవంతో. . .  పరుగులిడుతుంది! కాని, ఆయన గుణంలో మార్పు రాలేదు.
పిల్లల కాపురాలు వేరయ్యాయి. ఆస్తులు పంపకాలు జరిగాయి.

ఇప్పుడు మేమిద్దరం.
మాలో మాకు వేరు కుంపటి తప్పటం లేదు!
ఇన్నాళ్లు కొట్టుకున్నామో?  తిట్టుకున్నామో?
ఎప్పుడు వీధికి ఎక్కింది లేదు మాలో మేమే సర్దుకు పోయాము.

ఎవ్వరూ ఓదార్చింది లేదు. దగ్గరకు చేర్చింది లేదు. కాని, ఈ వయసులో. . .  నేను ఆయన మౌనాన్ని భరించలేక పోతున్నాను.

పిల్లలతో సహా వాళ్లకు పుట్టిన పిల్లలు ఆయన్నే కలవరిస్తారు.  తాత. . . తాత! అని, ప్రేమ కురిపిస్తారు!
పోనీ. . .  ఇతన్ని వదిలేసి పిల్లలతో ఉండిపోదాం అనుకుంటే, ఈయనే ఇప్పుడు పిల్లవాడై పోయే? ! ఇన్నాళ్లు ఆయన మౌనవిస్పోటనాన్ని భరించిన దాన్ని ఇప్పుడు భరించలేనా. . ?

భూదేవికి వున్నంత ఓపిక స్త్రీకి ఉందంటారు! అది ఇదే కాబోలు!
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *