March 29, 2024

19. మానవత్వం చిగురించిన వేళ!

రచన:  ప్రతాప వెంకట సుబ్బారాయుడు

 

నేను ఓ ప్రైవేట్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్నాను. డబ్బుకు హోదాకు కొదవలేదు. సంవత్సర కాలమంతా మెదడును చిత్రిక పట్టి, ఉదయం నుంచి అర్థరాత్రి దాకా సీట్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోయి గొడ్డు(?) చాకిరీ చేస్తాను.  మనిషన్నాక కాస్త ఆటవిడుపు ఉండాలి. మెంటల్ గా రెజువెనేట్ అవ్వాలి. అప్పుడే ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తామన్నది నా పాలసీ! అందుకే మార్చి ఫైనాన్షియల్ టార్గెట్స్ క్లియర్ అయ్యాక ఫ్యామిలీతో పదిరోజులు సెలవు తీసుకుని మన దేశంలోని ఊటీకో సిమ్లాకో, లేదా ఏదన్నా ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్ కో వెళ్లి ఆనందంగా గడిపి వస్తాం.

ఈ సంవత్సరం కూడా మా ఫ్యామిలీ అలాంటి ఆలోచనతోనే, రాత్రి భోజనాలయ్యాక డిస్కషన్ మొదలెట్టాం.

“చెప్పండి ఈ సంవత్సరం మనం ఎక్కడికెళదాం”అన్నాను ఉపోద్ఘాతంగా.

అడగడంతోటే మా పెద్దాడు ‘డాడీ.. ఆస్ట్రేలియాలోని షిడ్నీ సిటీకెళదాం, చూడ్డానికి రెండు కళ్లు చాలవట మా ఫ్రెండ్ రఘు చెప్పాడు” అన్నాడు.

మా ఆవిడ “మన పొరుగున్న ఉన్న నేపాల్ కు వెళదామండీ..బుద్ధుడి గురించి తెలుసుకుందాం..మనసు ప్రశాంతత పొందుతుంది కూడా”అంది.

వెంటనే మా చిన్నాడు “చ..అదేంటమ్మా..టూరిస్ట్ గా ఎక్కడికైనా వెళదామనుకున్న మన ప్లాన్ ను, పిలిగ్రిమేజ్ గా మార్చేస్తున్నావ్. మనం దుబాయ్ వెళ్లడం బెటర్ అది హెవెన్ తో ఈక్వల్ ట.. లాస్ట్ ఇయర్ అక్కడికెళ్లొచ్చిన మా టీచర్ నూర్జహాన్ చెప్పింది. మనం అక్కడికెళ్లాల్సిందే!” అన్నాడు.

నేను మా నాన్న వంక చూశాను. ఆయనెందుకో చాలా నిర్లిప్తంగా ఉన్నారు.

నాలుగైదేళ్ల క్రితం మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న కొంతకాలం చాలా డల్ అయిపోయాడు. తర్వాత ఇక్కడి పాష్ లొకాల్టీలో విల్లా తీసుకుని షిఫ్ట్ అయినప్పటి నుంచి కొంత మెరుగయ్యారు. ఆయనకు అన్ని ఫెసిలిటీస్ తో రూం ఏర్పాటు చేశాను. పొద్దుట పాలు తాగి వాకింగ్ కి వెళ్లి తన ఏజ్ గ్రూప్ వాళ్లతో హాయిగా చిట్ ఛాట్ చేసి, ఇంటికొచ్చి ఫ్రెష్ అయి పేపర్ చదువుతూ టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుంటారు. మధ్యాహ్నం లంచయ్యాక తనకు ఇష్టమైన పాత సినిమా చూస్తారు.

సాయంత్రం మొక్కలకు నీళ్లు పోసి, ఈవెనింగ్ వాక్ కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి లైట్ గా టిఫిన్ చేసి కమ్మగా నిద్రపోతాడు. కొడుగ్గా ఆయనకు నేను ఏ లోటూ చేయలేదు. ఎక్కడికి వెళ్లినా మాతోపాటే ఆయనానూ.

“చెప్పండి నాన్నా..ఎక్కడికెళదాం”అన్నాను.

ఆయన నావంక చూశారు. అందరూ ఆత్రంగా ఆయన వంక చూస్తున్నారు ‘ఆయనేం చెబుతారా’ అని.

“ఈసారికి మీరెళ్లొచ్చేయండిరా..కానైతే నా వంతుగా ఖర్చు ఎంతవుతుందో అది మాత్రం నాకిచ్చేయండి”అన్నాడు.

“అదేంటి..మీక్కావాలంటే నేను డబ్బు ఇవ్వనన్నానా..మీరు మాతో రాకుండా..డబ్బు తీసుకోవడమేంటి?” నొచ్చుకుంటూ అన్నాను.

“అదేం లేదురా, మన సంస్కృతిలో త్యాగం అనే ఒక గొప్ప పదం ఉంది. అయితే సర్వత్రా స్వార్థం పడగలెత్తుతున్న ఈ కాలంలో త్యాగం అనే పదం మరుగున పడి పోయిందనుకో. మన దగ్గర డబ్బు ఉంది కదాని ఇవ్వడం వేరు,  మన అవసరాల్ని తగ్గించుకుని, ఆడంబరాల్ని తుంచుకుని సహాయం చేయడం వేరు. దీంట్లో మనం పొందే ఆనందం మాటల్లో చెప్పలేం. మొన్న నేను వాకింగ్ కు వెళుతున్నప్పుడు ఒక రేకుల ఇంట్లోంచి సన్నగా ఏడుపులు వినిపిస్తున్నాయి. వెళ్లి విషయం కనుక్కున్నాను. అదేమిటంటే, రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి ఆ ఇంట్లోని నలుగురిని పోషించే ఓ ముప్పై అయిదేళ్ల వ్యక్తికి కిడ్నీ సమస్య వచ్చిందట, ఆ సమస్యను అతన్నుంచి దూరం చేసే ఆర్థిక శక్తి వాళ్లకు లేదు. అందుకే నేను అతని వైద్యానికి అయ్యే ఖర్చు భరించాలనుకుంటున్నాను. మీరు కష్టపడతారు. ఆ కష్టాన్ని మర్చిపోడానికి రంగు రంగుల లోకాన్ని చూసి ఆనందించాలి.  నాకేంటిరా, పెద్దవాణ్నయిపోయాను. అందాలని కంటితో చూసి మురిసిపోయే వయసు నాది కాదు. నాకయ్యే ఖర్చు ఒకింటికి వెలుగునిస్తే నాకంతకంటే తృప్తి ఇంకేం కావాలి. నాకొక్కోసారి అనిపిస్తుంటుంది- భగవంతుడు కావాలనే మనుషులకు కఠినమైన సమస్యలు ఇస్తాడేమోనని, ఎందుకంటే దేవుడి రూపంలో మరో మనిషి అతణ్నిఆదుకుంటాడని. కాని మనలో రాను రాను దైవత్వం పోయి రాక్షసత్వం విజృంభిస్తోంది. సరే సరే..నా వాటా నాకు శాంక్షన్ చేస్తావు కదా ప్లీజ్”అన్నాడు.

కొద్దిసేపు నిశ్శబ్దం చోటుచేసుకుంది. ఆ తర్వాత మా పెద్దాడు “తాతయ్య చెప్పింది నిజమే నాన్నా. మొన్న మా స్కూల్ బస్ రోడ్డు మీద ట్రాఫిక్ ఇష్యూ వస్తే కొద్ది సేపు ఆగిపోయింది. అక్కడే కొద్ది దూరంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. అక్కడి ప్రిన్సిపల్ మాట్లాడే మాటలు మైకులోంచి తెరలు తెరలుగా నాకు వినిపించాయి. విషయం ఏంటంటే అందులో ఏడవ తరగతి చదువుతున్న కుర్రాడి గుండెకి ఆపరేషన్ చెయ్యాలట. ఆ స్కూళ్లోని అందరూ దానికి కంట్రిబ్యూట్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. దానికి నేను యాడ్ అవుదామనుకుంటున్నాను డాడీ”అన్నాడు.

మా చిన్నాడు కూడా మా ఏరియాలోని గుడిలో బీదవారికోసం జరిగే అన్నదానానికి తన వాటా ఇస్తానన్నాడు.

మా ఆవిడా తనకు నిత్యం కూరగాయలమ్మే రాణమ్మ కళ్లకు ఆపరేషన్ చేయించి కళ్లజోడు ఇప్పిస్తానంది.

ఇహ నా వంతు వచ్చింది. “మీరందరూ మీకున్న పరిథిలో ఇంత చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. మనిషి తానొక కొవ్వత్తై చుట్టూ వెలుగిస్తేనే అతని జీవితానికి సార్థకత. నా అడుగూ మీతోపాటే. రేపే నా వాటా సొమ్ముతో అమ్మపేర ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. వీలైనంత మందిలో అమ్మకు ప్రాణం పోస్తాను” అన్నాను.

నాన్న కళ్లలో ఆనందబాష్పాలు!

మా అందరి హృదయాలు కడిగిన ముత్యాలయ్యాయి.

మనలోని మానవత్వమే భగవంతుడు. సేవే తృప్తి.

ఆ రాత్రి అందరం హాయిగా పడుకున్నాం. నాకు తెలిసి మేము వేరే ఏ ప్లాన్ వేసుకున్నా, ఇంతటి మనశ్శాంతి కలిగేది కాదు.

*****

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *