2. చెంప పెట్టు

 

మీనాక్షి శ్రీనివాస్

వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది, అంతకంటే ఎక్కువగా ఉంది దశరథరామయ్య మనసులో ముసురు. కొడుకు ఉదయ్,  తల్లి పోయిందన్న కబురు విని సుమారు పది ఏళ్ళ తరువాత వచ్చాడు ఇండియా. అదీ ఒక్కడే .. అప్పుడు కూడా భార్యా పిల్లలని తీసుకురావాలనే కనీస జ్ఞానం కూడా లేదు.

తల్లి బ్రతికి ఉన్ననాళ్ళూ చూడాలని ఉంది ఒక్కసారి వచ్చివెళ్ళమని ఎన్నిసార్లు అడిగిందో, తనెంతగా ప్రాధేయపడ్డాడో లెక్కలేదు ఒకటి కాదు రెండు కాదు పదేళ్ళు .. పదేళ్ళ కాలంలో ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్క సారి రావడానికి తీరిక లేదా? భార్యాపిల్లలతో కలిసి విహారయాత్రలకు దేశదేశాలు చుట్టి వచ్చాడే .. మరి, ఒక్క సారి కూడా రావాలనిపించలేదా? అనవసరం అనుకున్నాడా?

ఏం పాపం చేసారు తాము అందరిలాగే కన్నారు, అల్లారుముద్దుగా పెంచారు .. విద్యాబుద్ధులు నేర్పారు .. విదేశాల్లో చదువు అన్నాడు .. ఉన్న పొలం అమ్మి మరీ చెప్పించాడు, అక్కడే ఉద్యోగం .. అక్కడే మనసుకు నచ్చిన అమ్మాయితో పెళ్ళి .. సంతోషించారు .. సుఖంగా ఉంటే అంతే చాలని ఆశీర్వదించారు .. ఒక్కసారంటే ఒక్కసారి భార్యాబిడ్డలతో రమ్మనీ చూడాలని ఉందని ఎన్నిసార్లు అడిగారు ! పిచ్చిది .. కన్నతల్లికదా, నమ్మకం .. వస్తాడనే నమ్మకం .. చివరివరకూ ఎదురుచూసింది .. ఆ ఎదురుచూపుతోనే కన్ను మూసింది. వచ్చాడు ..

ఇప్పుడు .. ఊరుఊరంతా చెప్పుకునేలా ఆవిడ అంతిమయాత్ర .. దానధర్మాలు, దశదిన కర్మా అంటూ హడావుడి చేశాడు. .. దశరధరామయ్య మనసే కాదు .. ప్రకృతి కూడా అంగీకరించలేదు .. అందుకే రెన్నాళ్ళుగా తెరిపిలేకుండా ముసురు.  ఈ అకాల వర్షమేమిటో .. నట్టింట్లో శవాన్ని పెట్టుకుని పొయ్యిలో పిల్లి లేవకూడదనే ఛాదస్తం పోని పల్లెటూరు. అలా అని ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి .. ఉదయం నుంచీ దశరథరామయ్య తన గది విడిచి బయటకు రాలేదు. పిల్లలు ఆకలికి ఆగలేరని కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వండుకున్నారు .. తిన్నారు.

ఊరి పెద్దదిక్కు శేషయ్య అంత వర్షంలోనూ ఎలాగో ఈదుకుంటూ వచ్చాడు .. ఏం చేద్దాం .. ఈ ముసురు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు పోనీ ఏదైనా వాహనం మాట్లాడుకుని పట్నం తీసుకెళ్ళి దహనం చేద్దామా? అన్న ఆలోచనతో వచ్చాడు .. ఎలా అడగాలో తెలియడం లేదు .. వసారాలో బంధువులంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు, దశరథరామయ్య జాడ లేదు.

కొడుకుని అడిగాడు శేషయ్య ” ఉదయ్ .. మీ నాన్న ఏడి? ఏం చేద్దామంటారు? ఏమైనా ఆలోచించారా? ” అంటూ.

“ఏం చెయ్యాలో నాకూ అర్ధం కావడం లేదండీ .. మా నాన్న మనసులో ఏముందో .. మరి నే వచ్చినప్పటి నుండీ కనీసం నాతో మాట కూడా మాట్లాడలేదు ..” ఆపై ఇంక ఏం మాట్లాడాలో అర్ధం కాక ఊరుకున్నాడు ఉదయ్.

శేషయ్య కూడా మాట్లాడలేదు. దశరథరామయ్య బాధా, కొడుకు మీద ఉన్న అసంతృప్తి తెలిసిన వాడు కానీ ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో మాత్రం అర్థం కాలేదు.

అంతలో బయట వెహికల్ ఆగిన శబ్దం. ‘ ఇంత హోరు వానలో ఎవరొచ్చారు చెప్మా! ‘ అనుకుంటూ బయటకు వచ్చారు ఉదయ్, శేషయ్య.

” దశరథరామయ్య గారి ఇల్లు ఇదేనాండీ? ” వేన్ లోంచి దిగకుండానే అడిగాడు డ్రైవర్.

ముఖముఖాలు చూసుకున్నారు ఉదయ్, శేషయ్యా .. ‘అవును1 మీరు? ‘ అడిగాడు శేషయ్య.

వేన్ లోంచి ఇద్దరు దిగి లోపలికి వచ్చారు .. ” మేము గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి దశరథరామయ్యగారింటి నుంచి  ఉదయం ఫోన్ చేసారు. దశరథరామయ్యగారు, సావిత్రి గారు నిన్న మరణించారనీ,   రాసి ఇచ్చిన అంగీకార పత్రం ప్రకారం   పార్ధివ దేహాలను మెడికల్ కాలేజ్ కు ‘ స్పెసిమన్ ‘ గా తరలించవలసినది అనీ చెప్పారు. ఇదిగో వారు స్వదస్తూరితో రాసిన అంగీకార పత్రాలు” అంటూ తన చేతిలోని కవర్ తీసి ఓ కాగితం శేషయ్యకు అందించాడాయన.

‘తమ మరణానంతరం తమ శరీరాలను గాంధీ మెడికల్ కాలేజ్ కు డొనేట్ చేస్తున్నట్లు రాసి ఇచ్చిన పత్రాలవి.

ఏదో ఆలోచన మనసులో మెదలగా ఒక్క పరుగున తండ్రి గదిలోకి వెళ్ళిన ఉదయ్ ‘ నాన్నా’ అంటూ పెట్టిన కేకకు అంతా ఒక్క సారిగా అక్కడికి పరుగెట్టుకు వచ్చారు.

అక్కడ కటిక నేల పై ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఉన్న దశరథరామయ్యను చూడగానే వారికి విషయం అర్ధమైంది.  ఆయన చేతిలో ఉన్న కాగితం తీసాడు శేషయ్య.

‘తన చావుకు ఎవరూ బాధ్యులు కారనీ, తన భార్య మరణం తరువాత ఒంటరిగా జీవించే ఇఛ్ఛా, ధైర్యం రెండూ లేవనీ .. కనుకనే తను వెళ్ళిపోతున్నాననీ .. తమ దేహాలు తీసుకెళ్ళడానికి వచ్చే వారి వెంట తమను సాగనంపమనీ .. అలాగే తన తదనంతరం తనకున్న ఏకైక ఆస్థి తన ఇంటిని ఆ ఊరి పాఠశాలగా మార్చడానికి సంబంధించిన అన్ని రాతకోతలూ పూర్తిచేసిన కాగితాలు తన గదిలో బీరువాలో ఉన్నాయనీ .. తన భార్య వంటిమీద ఉన్న కాస్త బంగారం .. ఆమెను కడసారిగా చూడవచిన శ్రీ ఉదయ్ గారికివ్వవలసినదిగా’ పేర్కొంటూ రాసిన ఆ ఉత్తరం చదివిన శేషయ్య కళ్ళనీరు పైపంచతో ఒత్తుకుంటూ ఆ ఉత్తరం మౌనంగా ఉదయ్ కు ఇచ్చాడు .  అందుకుని చదివిన ఉదయ్ ఒక్కసారిగా గొల్లుమన్నాడు.

తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసి ‘ అమ్మ నిన్ను చూడాలని కొట్టుకుంటోందిరా, ఒక్కసారి రారా ‘ అంటూ చెప్పాడో చెవుల్లో మారుమోగింది. తన అలక్ష్యం వాళ్ళని ఎంత కుంగదీసిందో .. వాళ్ళ మనసు ఎంతగా బాధపడితే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారో అర్థమైన ఉదయ్ గుండె బద్దలయ్యేలా ఏడ్చాడు.

అతని ఏడుపు కానీ, పశ్చాత్తాపం కానీ వినిపించనంత దూరం వెళ్ళిపోయారా దంపతులు.

కొడుకుగా వాళ్ళ కనీస కోర్కె తీర్చలేకపోయినా వాళ్ళ పట్ల ఆఖరి బాధ్యతగా ఆ కాలేజ్ వాళ్ళకు తల్లితండ్రుల శవాలను అప్పగించే బాధ్యత పూర్తి చేసిన ఉదయ్ దుఖానికి అంతు లేదు.

ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఆ పుణ్యదంపతుల శరీరాలతో ఆ వేన్ కదిలింది.

వాళ్ళ మనసులు (ఆత్మలు) తేలికపడ్డ గుర్తుగా వాన వెలిసింది.

ఆ నట్టింట్లో కూలబడి గుండెలవిసేలా ఏడుస్తున్న అతనిని ఓదార్చేందుకు కూడా ఎవరిదగ్గరా మాటలు లేవు.

ఇంతలో మరో వేన్ వచ్చిన శబ్దం .. అందులోంచి దిగిన వేదపండితులు ఎవరి ప్రమేయమూ లేకుండా ఆ ఇంటినంతా సంప్రోక్షం చేసారు. తమతో తెచ్చిన వంటకాలను అక్కడ దించి ఊరందరికీ భోజనాలు పెట్టారు. అదీ దశరధరామయ్య ముందుగా చేసుకున్న ఏర్పాటే.

ఆయన ముందుచూపు అలాంటి కొడుకులను కన్న తల్లితండ్రులకు ఆదర్శం అయితే .. అలాంటి కొడుకులకు చెంప పెట్టు.

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

One comment on “2. చెంప పెట్టు”

  1. అమ్మ నాన్నల ప్రేమ మమకారాల విలువను గ్రహంచలేని, వృద్ధాప్యంలో వారి తుదికోరికలైన తీర్చలేని స్వార్థ జీవితాలకు బానిసలయిన బిడ్డల కథ …?!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *