April 25, 2024

20. అమ్మ ఒకవైపు… జన్మంతా ఒకవైపు

రచన: డా.జడా సుబ్బారావు

కొండమీదనుండి దొర్లించిన బండరాయిలా కాలం ఎవరికోసం ఆగకుండా పరిగెత్తసాగింది. అమ్మ చనిపోయి అప్పుడే అయిదేళ్లు దాటిపోయింది. కాలం గాయాల్ని మాన్పుతుందని అంటారు. నిజమే… మనిషిలేని లోటును  కాలం కొంతవరకు మాన్పించగలిగింది గానీ ఙ్ఞాపకాల్లో జీవించిన అమ్మను పూర్తిగా తుడిచెయ్య లేకపోయింది.  ‘నువ్వెప్పుడూ చదువుల పేరుతో ఇంటిపట్టున లేవు. కనీసం నేను పోయాకైనా ఇంటికొచ్చిపోతుండు’ ఆగి ఆగి మాట్లాడుతూ అమ్మ పోయేముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

ఊహ తెల్సిన దగ్గర్నుంచీ ఎంతో అల్లారుముద్దుగా పెంచింది అమ్మ. తండ్రిరూపం కూడా తనకు తెలియదు. ఇల్లు గడవడానికి శక్తికి మించిన పనులు ఎన్నో చేసింది. తెలిస్తే ఎక్కడ బాధపడతాననో అని తనకున్న అనారోగ్యం సంగతి కూడా చెప్పలేదు. అమ్మ కష్టాల్ని అనుభవించి ఒక్కోమెట్టూ ఎక్కుతూ జీవితంలో స్థిరపడ్డాను. అమ్మకు సుఖవంతమైన జీవితాన్ని అందిద్దామనుకునేలోపే ‘క్యాన్సర్’ రూపంలో విధి అమ్మను కబళించింది.

ఆరోజు తనకు బాగా గుర్తు. జీవితాన్ని చీకటి మింగిన రోజు, ఆలోచనలు ఘనీభవించి అడుగుకూడా ముందుకు పడనిరోజు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది అమ్మ. చుట్టూ ఉన్నవాళ్లందరూ మంచం చుట్టూ చేరి ఏవేవో మాటలు మాట్లాడసాగారు.  చిన్నప్పటినుండీ అమ్మతో వాళ్లకున్న అనుబంధాన్ని వాళ్లకు తోచినట్లుగా మాట్లాడుకోసాగారు. అన్నింటినీ వింటూ ఆదుర్దాగా అమ్మవైపు చూడసాగాను. ఏ దేవుడైనా కరుణించి ‘ఉన్నపళంగా అమ్మలేచి కూర్చుంటే బాగుండు’ అని కోరుకోసాగింది మనసు. చావుపుట్టుకలు సహజమని తెలిసినా ఆత్మీయులు దూరమైతే ఆ బాధ ఎంత భరింపలేనిదిగా వుంటుందో అనుభవంలోకి వచ్చింది. అన్నిబంధాలను తనతో కలుపుకుని అమ్మ శాశ్వతంగా వెళ్ళిపోయింది.

రోజులు గడుస్తున్నాయి…. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. తండ్రి చనిపోతే ఒకరకమైన బాధ ఉంటుంది. తల్లీదండ్రీ లేకపోతే ఆ దుఃఖాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. తల్లీదండ్రీ మనతో చివరివరకూ ఉంటారని కాదుగానీ ఎవరో ఒకరుంటే మనం పుట్టిపెరిగిన చోట మన చిరునామా నిలబడి వుంటుందని ఆశ. అమ్మ కష్టం కళ్లముందు కనిపించి నప్పుడల్లా నా మనసు తీవ్రమైన ఆవేదనతో కదిలిపోయేది. మగమనిషి తోడు లేకుండా, అయినవారి ఆదరణ లేకుండా పిల్లల్ని పెంచడం ఒక  స్త్రీకి ఎంత కష్టమో తను కళ్లారా చూశాడు.

ఎదిగిన తర్వాత సంపాదించిన దాంతో తృప్తిగా సౌకర్యంగా ఒకరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు. కానీ ఎదుగుదలకు మార్గమేసిన, అందులోనూ తన సర్వస్వాన్ని ధారపోసి తను కొవ్వొత్తిలా కరిగిపోయిన అమ్మకు ఏమివ్వగలం?  సంపాదనంతా ఒకపక్కా, అమ్మను ఒక పక్కా నుంచోబెడితే అమ్మరుణం ఎన్ని జన్మలెత్తినా తీరదేమో!

ఎదలోతుల్లో నిద్రాణంగా వున్న ఙ్ఞాపకాలన్నీ పనిగట్టుకుని వచ్చి మరీ పలకరించసాగాయి. అమ్మ గుర్తొస్తే కళ్లు తడుస్తాయి, ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. నరనరంలోనూ తనకే తెలియని మైమరపు. అమ్మ అనే పిలుపులోనే అనంతమైన భావన నిక్షిప్తమైతే, ఇక అమ్మతో వున్న ఆ కొన్నిరోజుల్ని ఎన్ని కోట్లిచ్చినా వెనక్కితీసుకురాలేము కదా! సిగిరెట్ వెలిగించి అగ్గిపుల్ల పక్కకి విసిరేశాను.

స్నేహితుడి పెళ్లికి వెళ్ళినపుడు జరిగిన సంగతి తన జీవితంలో మర్చిపోదామన్నా మరపుకు రాదు.  అమ్మ చనిపోయాక కర్మకాండలు పూర్తిచేసి యథావిధిగా ఉద్యోగానికి వెళ్లిపోయాను. స్నేహితుల బలవంతం మీద అయిష్టంగానే పెళ్ళికి వెళ్లాను. ఒకరిమీద ఒకరు జోకులేసుకుంటూ తుళ్ళుతూ తిరుగుతున్న స్నేహితులతో మనస్ఫూర్తిగా కలవలేక పోయాను. ముభావంగానే భోజనాల వేళవరకూ గడిపాను.

భోజనాలు అవగానే శుభాకాంక్షలు చెప్పి వద్దామని స్నేహితులంతా వెళ్లి గ్రూఫ్ ఫొటో తీసుకున్నారు. ఇంతలో స్టేజీ కిందనుండి పైకొచ్చిన ఒకావిడ ‘అబ్బాయి ముచ్చటగా వున్నాడు. చూస్తుంటే పెళ్లైనట్లు లేదు. మీ తల్లిదండ్రుల్ని తీసుకురా బాబూ.. మంచి సంబంధం వుంది..’ అని నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

స్నేహితులంతా విరగబడి నవ్వారు. ఇంకాస్త ముందుకెళ్ళి పెళ్ళి ఎలా జరుగుతుందో వర్ణించుకుని, అప్పటికి నేనెలా వుంటానో ఊహించుకుని మరీ నవ్వసాగారు. నాకెందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. అమ్మ ఙ్ఞాపకాలు అప్పుడప్పుడు బాధపెడుతూనే వున్నా ఇలాంటి సందర్భాల్లో ఇంకా వేదనను కలిగించసాగాయి. చాలారోజుల వరకూ ఆ సంఘటన కలిగించిన బాధనుండి తేరుకోలేకపోయాను. నాలో నేనే అయోమయంగా, అలజడిగా వున్నప్పుడు ‘పరిణిత’ పరిచయం అయింది. నా ఒంటరి జీవితానికి ఆమె పరిచయం కాస్త ఊరట కలిగించింది. ‘పరిణిత’ పేరెంత బాగుంటుందో  మనిషి కూడా అంతే బాధ్యతగా  వుంటుంది. టీములో సమస్య వచ్చినప్పుడు ఆమె పరిష్కరించే విధానం చాలా పరిపక్వంగా వుండేది. ఎలాంటి ఒత్తిడిలోనైనా తన సలహా అద్భుతమైన  ఊరటగా అనిపించేది అందరికీ.

పరిణిత దగ్గరయింది నాకు. నేనంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేది. నాకోసం ఇంటిదగ్గర నుంచి తినడానికి ఏవో తీసుకొచ్చేది. మొహమాటానికి షేర్ చేసుకుని తినేవాళ్లం. చాన్నాళ్లనుండీ మాట్లాడుకుంటున్నా తను నాతో ఇష్టంగానే ప్రవర్తించేది.  కానీ ఎప్పుడూ నావాళ్ల గురించి అడగలేదు. సందర్భం లేకుండా నేను కూడా ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నాతో ‘ఈరోజు సాయంత్రం నువ్వు ఖాళీగా వుంటే  మా ఇంటికెళ్దాం…’ అంది.

చేస్తున్న పని ఆపేసి ‘ఎందుకు’ అన్నట్లు ఆమెవంక చూశాను. ‘ఏమో.. నాకేమి తెలుసు… మా పేరెంట్స్ తీసుకురమ్మన్నారు’ అంది కళ్లను భుజాలను ఒకేసారి ఎగరేస్తూ.

సాయంత్రమైంది.

ఇద్దరం కారులో పరిణిత ఇంటికి వెళ్లాం. విశాలంగా వుంది ఇల్లు. ఇంటిచుట్టూ కాంపౌండ్, రకరకాల పూలమొక్కలు, గేటునుండి గుమ్మందాకా టైల్స్ వేసున్నాయి.  ఏపుగా ఎదిగిన పళ్లమొక్కలు చాలా వున్నాయి. పూలమొక్కల్ని చక్కగా తీర్చిదిద్దారు. కొంచెందూరంగా మెత్తని పచ్చగడ్డి మధ్యలో పెద్ద ఉయ్యాల కట్టివుంది. గేటుకి ఇంకొక వైపు పెంపుడు కుక్క కనిపించింది.

లోపలికి వెళ్తుంటే.. “రా… బాబూ..’ అంటూ ఆహ్వానించారు పరిణిత తల్లి. ఆ పక్కన తండ్రి, వారితో పాటు చెల్లి, తమ్ముడు కూడా పలకరించారు. చూడచక్కటి కుటుంబం. ముచ్చటగా అనిపించింది.

ఫలహారాల తర్వాత ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ “పరిణిత నీ గురించి చెప్పింది బాబూ. నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతుంది. మీ పెద్దవాళ్లని పిలిపించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని…’ మధ్యలో ఆపేసింది.

పరిణిత వైపు చూశాను.

సిగ్గులమొగ్గలా మారిపోయింది. బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. తలొంచుకుని నేలవైపు చూడసాగింది. ఆఫీసులో అందరివంకా వేలుచూపిస్తూ అజమాయిషీ చెలాయించే పరిణిత, పరిణయం అనగానే సహజ లక్షణాన్ని పుణికిపుచ్చుకుని కుందనంబొమ్మలా కనిపించింది.

“నాకెవరూ లేరండీ…” ముక్తసరిగా చెప్పాను.

“బాబూ… అంటే..?” పూర్తిగా అర్థంకాక ఆర్థోక్తిలో ఆపేసింది.                                                                                            “చిన్నప్పుడూ తండ్రిపోయాడు. అయిదేళ్ల క్రితం అమ్మపోయింది. బంధువులున్నా ఎక్కడున్నారో అంతగా పరిచయాలు, రాకపోకలు లేవు. నేనొక్కడినే…” తెలియకుండానే నీళ్లు తిరిగాయి కళ్లల్లో.

నాకోసం నలుగురున్నారని చెప్పుకునేటప్పుడు మనసు ఎంతో ఊరటచెందుతుంది. ఒంటరివాడినని చెప్పుకుంటే  మాత్రం ఎక్కడలేని దుఃఖం మనసును ఆవరిస్తుంది.

‘అడిగి ఇబ్బంది పెట్టినట్లున్నాను.  నీకు ఇష్టమైతే మేమే దగ్గరుండి మీ పెళ్ళి చేస్తాం…” అందావిడ.

‘ఆలోచించుకుని చెప్తాను…” అని చెప్పి పైకి లేచాను.

***

వద్దని చెప్పడానికి అంతగా కారణాలు కనిపించలేదు.                                                                                                          కొన్నిరోజుల తర్వాత స్నేహితుల సమక్షంలో  పెళ్ళి జరిగింది. అటువైపు నుండి బంధువులు ఎక్కువమంది వచ్చారు. అమ్మాయి పెళ్ళికనుక ఉన్నదాంట్లో ఆడంబరంగానే చేశారు. పెళ్ళికి వచ్చినవాళ్లంతా  ‘నా’ తరుపువాళ్లకోసం ఆరాతీశారు. చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. అటో ఇటో ఎటో ఎలా తిరిగితే అలా  తిప్పాను తలని. ‘పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకో’మని ఎందుకంటారో అర్థమయింది.

కొన్నాళ్లు గడిచాయి.

ఇద్దరం ఒకరికొకరు తోడుగా, నీడగా ఉండసాగాం. పరిణితతో కూడా చెప్పుకోవాలంటే చాలా ఆత్మన్యూనతగా అనిపించింది. అమ్మలేని లోటు ఎలా పూడ్చుకోవాలి? మనసుని ఏదో నిరాశ నిలువునా కమ్మేసేది.

ఒకనాటి అర్థరాత్రి  హఠాత్తుగా మెలకువొచ్చింది.

ఏదో పీడకల… మళ్ళీ నిద్రపట్టలేదు. బాల్కనీలోకి వెళ్ళి సిగిరెట్ వెలిగించాను.

ఆలోచనలు తెరిపిలేకుండా బుర్రను తొలిచేస్తున్నాయి. అమ్మ ఙ్ఞాపకంగా ఏదో చేయాలన్న ఆశ మనసును పట్టి పీడించసాగింది. అమ్మ భౌతికంగా లేకపోయినా కళ్లముందు ఉండేలా చేయాలనే ఆరాటం  ఎక్కువయింది. చాలాసేపటి తర్వాత బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ప్రశాంతంగా నిద్రపోయాను.

ఉదయం ‘ఊరు’ వెళ్ళొస్తానని చెప్పి బయల్దేరి వచ్చేశాను.

***

అమ్మ వున్నప్పుడు అద్దంలా కళకళలాడిన ఇల్లు…. కళావిహీనంగా మారిపోయింది.   గాలికి పోగుపడిన చెత్తతోనూ, గుట్టలుగా పడిన ఆకులతోనూ కనిపించింది. మనుషులను పెట్టించి ఇల్లంతా శుభ్రంచేయించాను. చుట్టూ గోడ కట్టించాను. ఇంటి మధ్యలో వున్న గోడ పడగొట్టించి  పెద్ద హాలులాగా తయారుచేయించాను. ఇంటి వెనుకవైపు పెద్ద వంటగది, దాని పక్కన సిమెంట్ బల్లలతో పేర్చి భోజనశాలగా మార్చేశాను. ఎండకీ వానకీ ఇబ్బంది లేకుండా పైన రేకులతో కప్పించేశాను.

మనసు ప్రశాంతంగా మారిపోయింది. అమ్మ పక్కనే వుండి పలకరిస్తున్నట్లుగా వుంది. ఒకప్పుడు నా ఆట పాటలతో అల్లరిగా గడిచిపోయిన ప్రాంగణం రేపటినుండి ఎంతోమంది తల్లులకు ఆశ్రమంగా మారబోతోంది. ఎందరికో నీడను, ఆహారాన్ని అందించబోతోంది.

బయట అందరికీ కనిపించేలా ‘అమ్మ ఆశ్రమం అని పెద్దబోర్డు రాయించి పెట్టాను. పేరు ఏదైనా అమ్మ అమ్మే. జన్మకు ఒక గుర్తింపు, సార్ధకత అమ్మే. ఈ జన్మంతా ఒకవైపు పేర్చినా అమ్మతో సరిపోవు. అందుకే మెయిన్’గేటు ప్రక్కన పెద్దబోర్డు మీద ఇలా రాయించి పెట్టాను.. “మీకు ఎవరున్నా లేకపోయినా అమ్మ ఆశ్రమం మీకు అండగా ఉంటుంది. ఉన్నవాళ్ళు పట్టించకోవట్లేదు అని కుంగిపోవద్దు, ఎవరూ లేరని నిరాశపడొద్దు. మీ ఇంట్లో వున్నట్లే ఇక్కడుండండి. మీకు చేతనైన పనిలోనే రోజు గడపండి…”                                                                                                                                                                                                                                            ***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *