April 26, 2024

22. మూగపోయిన మధ్యతరగతి

రచన: పోలంరాజు శారద

 

“అమ్మాయీ! దరివెం పరిచి ఆరునెలలయినట్టుంది కదే. ఆ తరువాత ఒకసారేమో కనిపించింది. మళ్ళీ ఊ ఆ అని కూడా అనలేదేమే? ఒకసారి డాక్టరమ్మను అడక్క పోయినావుటే. పిల్లదేమో నానాటికి ఆమేన గుమ్మటమాలే తయారవుతోంది.”

“అవునత్తా. పోయిన నెల డాక్టరమ్మతో ఆ మాటే అన్నాను. మరో నెల ఆగి పరీక్ష చేస్తానన్నారు. రేపు వంట చేయడానికి వెళ్తాను కదా. మళ్ళొకసారి అడుగుతానులే. ”

ఏమిటో మరీ ఈ సూపర్ పంటల వలనట మరీ పదేళ్ళు నిండి పదకొండొచ్చేటప్పటికి అయి కూర్చుంది. ఆ పాలిచ్చే గొడ్లకు కూడా ఏవో ఇంజక్షన్ ఇస్తున్నారట. ఆ పాలు తాగి ఇట్టా అవుతోందట. ” గొణుక్కుంటూ వెళ్ళిపోయింది ఆ పెద్దావిడ.

**********

“టీచరండీ టీచరండీ, మల్లికకు కడుపు నొప్పట బాగా ఏడుస్తోంది.” పిల్లలు గుంపుగుంపుగా వచ్చి ఫిర్యాదు చేసేటప్పటికి ఏడవ తరగతి క్లాసు టీచర్ గబగబా వెళ్ళి చూసేటప్పటికి మల్లిక కూలబడి కడుపు పట్టుకొని బాగా ఏడుస్తూ కనిపించింది. ఆ అమ్మాయి బట్టలు చూడగానే టీచరుకు పరిస్థితి అర్ధమయింది.

ఏటా తనకు అలవాటే. నెలకొకరు చొప్పున ఆ కంప్లైంట్ చేయడం ఇంటికి పంపించడం జరుగుతూనే ఉంటుంది. కాని మల్లిక నొప్పితో మెలికలు తిరుగుతూంటే పరిస్థితి కొంత కంగారుగా అనిపించి, స్కూల్ ఆవరణలో ఉన్న ఆటో పిలిపించి, ఆయా సాయంతో మల్లికను ఎత్తుకొని ఆటోలో కూర్చోబెట్టి పక్క సందులో ఉన్న నర్సింగ్ హోం వద్దకు తీసుకెళ్ళింది.

నొప్పితో బాధపడుతున్న మల్లికను స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ రూంలోకి తీసుకెళ్ళేటప్పటికి డాక్టర్ కరుణ అక్కడకు వచ్చేసి, “అరే మల్లికా? ఏమయిందిరా?” అని ఆప్యాయంగా అడుగుతూ, “టీచర్ మల్లిక మాకు కావలసిన అమ్మాయే. వాళ్ళ అమ్మ మా ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. ఫోన్ నంబరు నా వద్ద ఉన్నది. నేను చూసుకుంటాను లేండి.” అందరినీ పంపించి పరీక్ష చేయడానికి బల్ల వద్దకు వచ్చింది. అక్కడ పరిస్థితి చూసి అన్ని ఆపరేషన్లు చేసిన డాక్టర్‌కు కూడా గుండె ఆగినంత పనయింది.

“సిస్టర్ సెలైన్‌కు ఏర్పాట్లు చేయి,” అని నర్స్‌ ను, “ఆయా, కాటన్ చాలదు మరో బండిల్ తీసుకొని రా”  అని ఆయాను బయటకు పంపించి. బల్ల మీద రబ్బరు షీట్ మీద రక్తంలో కలిసి కనిపించిన ముద్దను ఫోర్‌సెప్స్ తో సెలైన్ కవర్‌లో పెట్టి పక్కకు పెట్టేసింది.

అవసరమైన ఇంజెక్షన్ మందులు ఇచ్చేసి నర్స్‌ కు మల్లికను అప్పగించి తన రూంలోకి వచ్చి కూర్చున్న కరుణకు కాళ్ళూ చేతులూ ఆడటం లేదు.

ఏమిటీ ఘోరం?

అంత చిన్నపిల్లకు ….. ఎట్లా సంభవం?

వాళ్ళ అమ్మకు ఫోన్ చేసే ముందర ఒకసారి మల్లికతో మాట్లాడి జరిగినదేమిటో తెలుసుకోవాలి.

*********

“ఏమ్మా మల్లికా ఎట్లా ఉందమ్మా?”

“ఇప్పుడు నొప్పి తగ్గిందమ్మా. అమ్మో స్కూల్లో ఉండగా పొట్టలో  ఎంత నొప్పి పుట్టిందో?” కళ్ళు పెద్దవి చేస్తున్న ఆ పాపను చూస్తే అయ్యో పాపం అనిపిస్తోంది.

“మల్లీ నువ్వు భలే  ముద్దుగా ఉన్నావే” దగ్గరకు తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టుకుంది.

“అమ్మ నానమ్మ కూడ ఇట్లాగే ముద్దు పెట్టుకుంటారు.” కిలకిల నవ్వింది.

“అమ్మ నానమ్మేనా?  ఇంకా……..”

“ఇంకా ఊ…….అని ఆలోచించినట్టు పైకి చూస్తూ…….”అవునమ్మా గుర్తుకొచ్చింది. ఆ రోజున బుల్లెబ్బాయిగారు అమ్మో గాట్టిగా వాటేసుకొని తెగ ముద్దులు పెట్టారు.” అన్న మాటలకు కరుణ గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానేసిందా అనిపించింది.

“బుల్లెబ్బాయా? ఎప్పుడు?”

మల్లిక చెప్పిన మాటలు వింటున్న కరుణకు కాస్సేపు నోటమాట రాలేదు.

మెల్లిగా తేరుకొని, “మల్లీ నువ్వు హాయిగా నిద్రపో. అమ్మకు ఫోన్ చేస్తాను. సాయంత్రానికి  ఇంటికెళ్ళి పోదువు”

భారంగా అడుగులు వేస్తూ తన గదిలోకి చేరి సోఫాలో కూలబడ్డది.

మల్లి చెప్పిన సమాచారం చెవిలో మారుమ్రోగుతున్నది.

“ఆ రోజున మీరు అమ్ములక్క పెళ్ళికి వెళ్ళారు చూడండి….. బామ్మగారు పక్కింటికెళ్తూ బుల్లెబ్బాయికి తోడుగా ఉండమని చెప్పారే  అప్పుడు.”

మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకున్న కరుణకు షాక్ మీద షాక్.

******************

ఇంట్లో మల్లిక బుల్లెబ్బాయి తప్ప ఇంకెవరూ లేరు. అతనిలో అప్పటి దాకా నిద్రాణమైన పశుత్వం మేలుకుంది.

“మల్లీ నా గదిలోకి రావే నీ కోసం భలే చాక్లెట్లు కూల్‌డ్రింక్ తెచ్చిపెట్టానే. ఇస్తాను పద.” చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళి.

ఒక నాలుగు చాక్లెట్లు చేతిలో పెట్టాడు.

పాపం మల్లికి కొత్తరకం చాక్లెట్లు కనబడగానే విప్పేసి గబగబా ఒకటి  తినేసింది.

“నేనెల్తానండి. ఇవి మా అమ్మకు నానమ్మకు కూడా ఇస్తాను.” వెళ్ళబోయిన పిల్లను పట్టుకొని, “అమ్మకు నానమ్మకు వేరే ఇంకా ఇస్తాను. ఇవి తినేసేయి. ఇదిగో ఈ కూల్‌డ్రింక్ తాగేసేయి.”

“ఆ చాకెట్లు తిని చల్లగా జ్యూస్ తాగగానే భలే  నిద్దర వచ్చేసింది. అట్లాగే మంచం మీద పడుకున్నాను. ఆయన నన్ను గట్టిగా పట్టుకొని ఇక్కడ ఇక్కడ గట్టిగా నొక్కి……..” చేత్తో చూపిస్తూ మల్లి చెప్తూన్న మాటలు వింటూంటే నమ్మశక్యం కాలేదు.

“నిద్ర లేచేటప్పటికి కాళ్ళూ నడుము తెగ నొప్పి పుట్టేసాయని ఏడుస్తూంటే, అదే తగ్గిపోతుందిలే అంటూ నన్ను ఇంటిదాకా దిగబెట్టారు. పరికిణీ మీద మరక చూసి అమ్మ నానమ్మ నన్ను మళ్ళీ మూలకు కూర్చోబెట్టారు.”

అయ్యయ్యో ఎంత ఘోరం? పాపం ఆ పసిదానికి ఏమి జరిగిందో కూడా తెలియకుండా మత్తు కలిపిన చాక్లెట్లు డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేసిన ఆ దౌర్భాగ్యుడికి ఎట్లాగైనా శిక్షపడేలాగా చూడాలి.

మల్లిక చెప్పిన మాటలు పదేపదే చెవుల్లో మారుమోగుతుంటే కసి పెరిగి  కళ్ళల్లో నీళ్ళు నిండుకుంటూన్నాయి.

పోలీసుకు ఫోన్ చేయడానికి రిసీవర్ అందుకుంది డాక్టర్ కరుణ.

************

“మేడం, అమూల్య మేడం, కోమలి మేడం వచ్చారు.” నర్స్ తొంగి చూసి చెప్తూండగానే ఇద్దరూ లోపలికి వచ్చేసారు.

చేతిలో ఫోన్ రిసీవర్ కళ్ళల్లో నీళ్ళతో మొహమంతా ఆందోళనగా ఉన్న తల్లిని చూసి అమూల్య కంగారు పడింది.

“అమ్మా ఏమిటమ్మా అంత కంగారుగా ఉన్నావు? ఏదైనా క్రిటికల్ కేసా?” పక్కనే కూర్చొని తల్లి చేతిని తన చేతిలోకి తీసుకున్న అమూల్యను చూడగానే,  అమ్మయ్య. తన బాధ పంచుకోవడానికి ఎవరో ఒకరు కనిపించారు, అన్న ధైర్యంతో నిలదొక్కుకున్నది కరుణ.

వెనకనే కనిపించింది కోమలి. కోమలి పోలీసు డిపార్ట్‌ మెంట్‌లో వుమెన్ సెల్‌లో కౌన్సిలర్.

ఇద్దరూ తనకు సాయంగా నిలిచేవారే…

“అమ్మూ! ఈ రోజు వచ్చినటువంటి కేస్ నా సర్వీసు మొత్తం మీద…….” నోట మాట రావడం లేదు మళ్ళీ కళ్ళు నీళ్ళతో నిండుకుంటూన్నాయి.

తల్లిని చూసి అమూల్య మరింత కంగారు పడింది. “ఏమయ్యిందమ్మా?”

“మన మల్లికి …. మల్లికి….ఈ రోజు…… ఎబార్షన్” మాటలు కూడదీసుకుంటూ చెప్పేసింది.

“వ్వాట్ మల్లికా? ఎబార్షనా? ఎట్లా? ఎవరా రాక్షసుడు” అరిచినట్టే  ప్రశ్న మీద ప్రశ్న.

“నెమ్మదిగా మాట్లాడు. ఎవరికీ తెలియకుండా మానేజీ చేసాను.”

మాటలు కూడదీసుకుంటూ మల్లిక తనకు చెప్పిన విషయం వివరించింది.

“అమ్మా ఆ దరిద్రుడు మన ఇంట్లో చేరిన దగ్గర నుండే వాడు వాడి చూపులు చేష్టలు కంపరం పుడుతున్నాయి…..కాని మరీ ఇంత అన్యాయంగా పసిపిల్ల మీద……”

ఆ మాటలకు నిర్ఘాంతపోయింది కరుణ. “ఏమిటే నువ్వనేది?”

“అవునమ్మా, అతని గుణం మంచిది కాదని మొదట్లోనే తెలిసింది. కాని ఏమని చెప్పాలి? ఎట్లా చెప్పాలి?

అందుకనే సాధ్యమైనంత వరకు నువ్వు ఇంట్లో లేని సమయంలో నేను బయటే గడిపేస్తున్నాను.

నాన్న ప్రాజెక్ట్ అయిపోయి రావటానికి మరో మూడు నెలలైనా పడుతుందన్నారు. ఆయన వచ్చాక అతన్ని ఇంట్లో నుండి పంపించేద్దామని అనుకుంటూనే ఉన్నాను. ఇంతలోకే……

అమ్మా! నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఇంట్లో తిరుగాడుతూంటే అతని చూపులు నీ వెనకనే. అదొక భయం కూడా పట్టుకుంది. నువ్వు స్నానానికి వెళ్ళగానే ఆ చుట్టుపక్కలే తచ్చాడేవాడు. మరి నేను చేస్తున్నప్పుడు కూడా అట్లాగే చేసేవాడొ ఏమో.

టివి చూడటానికి హాల్లో కూర్చోగానే తయారయ్యేవాడు. నాకేమో డబల్ సోఫాలో  రిలాక్స్‌డ్ గా కాళ్ళు జాచుకొని కూర్చొని చూడటం అలవాటు కదా. పక్కనే తయారయేవాడు. మొదట్లో అంతగా పట్టించుకోలేదు. కాని మెల్లిమెల్లిగా వాడి బుద్ది బయట పడింది. భుజం మీద చేయి వేసి మెడ దాకా తేవడం భుజాల కిందకు చేయి పోవడం……ఎవరికి చెప్పినా నమ్మరు.

అందులో నాయనమ్మ, నన్నే తిట్టిపోస్తుంది. .

చూసి చూసి ఒకరోజు చేతిలో ఒక సూది పట్టుకొని వాడు చేయి పెట్టగానే చటుక్కున గుచ్చేసాను. మళ్ళీ నా పక్కన కూర్చోలేదు.”

“అయ్యయ్యో మరి ఇన్నాళ్ళూ ఎప్పుడూ చెప్పక పోతివేమే?”

“ఏమని చెప్తానమ్మా. ఎవరు నమ్ముతారు? అందులో నాయనమ్మ ముద్దుల తమ్ముడాయె.”

“ఇంతకూ బుల్లెబ్బాయి అంటే ఎవరు ఆంటీ? ఎంత వయసుంటుంది.” ఆరాటం ఆపుకోలేక అడిగింది కోమలి.

“అవునాంటీ బుల్లెబ్బాయి అంటున్నారు. ఇంతకూ ఎవరతను?”

“దారేపోయే తద్దినాన్ని మా అత్తగారు మా నెత్తిన పెట్టిన దౌర్భాగ్యం. ఆ బుల్లెబ్బాయికి  డెబ్బయేళ్ళు దాటాయి.  మా అత్తగారికి వరుసకు తమ్ముడు. రెండేళ్ళనాడు భార్య చనిపోయింది. కొడుకు కోడలు చాలా ఉత్తములు. అత్తమామలను కళ్ళల్లో పెట్టుకు చూసుకునేవారు. ఆయనను తమతో విశాఖపట్నం తీసుకొని వెళ్ళారు.  వాళ్ళకు కూడా ఎదిగిన కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు. మరి ఏమి జరిగిందో ఏమో పోయినేడు  ఇక్కడే ఔట్‌స్కర్ట్స్ లో ఒక సీనియర్ సిటిజెన్స్ హోంలో అరవై లక్షలు పెట్టి చక్కటి ఇల్లు కొని ఆయనను అక్కడికి షిఫ్ట్ చేసారు.

ఒకసారి మా అత్తగారికి ఫోన్ చేసి  ఎమోషనల్ డ్రామా ఆడి అయినవాళ్ళందరికీ దూరమయ్యానని వాపోయేటప్పటికి ఈవిడ వెళ్ళి ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా మాతోటే ఉందువు అని తీసుకొచ్చారు.

ఆ సంగతి తెలిసిన కొడుకు కోడలు వారం పదిరోజులకొకసారైనా ఫోన్ చేసి ఆయన ఫ్లాట్‌కు ఆయనను పంపించేయమని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎందుకా పదేపదే అదే మాట అంటున్నారు అని విస్తుపోయాను. అసలే మా ఆయన ఆ ప్రాజెక్ట్ పని మీద లండన్ వెళ్ళి ఉన్నారు. ఇంట్లో మా అత్తగారు నేను ఆముక్త మాత్రమే ఉంటున్నామని ………

అంటే ఈయన వాళ్ళ దగ్గర కూడా ఏదో వెధవ్వేషాలు వేసే ఉంటాడు. ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు.  లేకపోతే అంత మంచివాళ్ళు భార్య మరణించిన ఆ ముసలాణ్ణి ఎందుకు వదిలించు కుంటారు?  వరసవావి లేని నికృష్టుడు.

*******************

“అట్లాగే పోయిన నెల అనుకుంటాను. అందరూ భోజనాలకు కూర్చున్నప్పుడు నాయనమ్మ నన్ను వడ్డన చేయమంది నీకు గుర్తుందా అమ్మా. వడ్డిస్తూంటే చటుక్కున చేయి పట్టుకొని, ఇంక చాలే చాలు అనడం, చేయి వదలకుండా నిమరడం. అట్లా రెండుసార్లో మూడుసార్లో అయ్యాక ఒళ్ళు మండి, పొయ్యి మీద మరుగుతున్న పులుసు వడ్డించటానికి తెచ్చాను.

మళ్ళీ ఆ కుక్క అట్లాగే చేయి పట్టుకోగానే, గబుక్కున ఆ ఉడుకుడుకు పులుసు చేయి మీద పోసేసాను. కెవ్వుమన్నాడు.

అయ్యో అదేంటి తాతయ్యా. నోటితో చెప్పితే సరిపోయేది కదా. చెయ్యి వణికి పులుసంతా పడి కాలిపోయింది.” అన్నాను.

“అవును ఆ రోజు నాకు గుర్తు ఉంది. వెంటనే ఆయింట్‌మెంట్ కూడా అప్లై చేసాను కదా. ఏక్సిడెంటల్‌గా అనుకున్నాను. నువ్వు కావాలని చేసావనుకోలేదు.”

“వాడిని వదలొద్దమ్మ. ఇప్పుడు సాక్షాలతో సహా పట్టుబడ్డాడు కదా. డి‌ఎన్‌ఏ కూడా చేయించి వాడిని బొక్కలో తోయించాలి. పోలీసులకు ఫోన్ చేయమ్మా.” కళ్ళల్లో కసి పగ ఒక పక్క, దుర్మార్గుడికి శిక్ష పడబోతుందన్న ఆశ మరొక పక్క.

ఫోన్ చేతిలోకి తీసుకుంది డా.కరుణ.

“ఆగండి ఆంటీ….” అప్పటి దాకా మౌనంగా తల్లీ కూతుళ్ళ సంభాషణ వింటున్న కోమలి మాటలతో ఆశ్చర్యంగా ఆగింది కరుణ.

“ఏమి చేయబోతున్నారు?

“అదేమిటే ఇప్పటిదాకా జరిగినదంతా విని ఆ ప్రశ్న ఏమిటే? ఆ కీచకుడి మీద కేసు వేయాలి. దానికన్నా ముందర పోలీసులకు అప్పగించాలి.”

“ఆ తరువాత?” కోమలి ప్రశ్నలకు తల్లీ కూతుళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

“ఊ చెప్పండి ఆ తరువాత? ……. ఎరెస్ట్ పోలీసులు, కోర్టు సాక్షాలు. నిరూపించబడితే అతనికి జైలు శిక్ష.”

“అంతేగా అందులో ఇంక అనుమానం ఏమిటి?”

“అతనిని పోలిసులు ఎరెస్ట్ చేయగానే శిక్షపడటానికి చట్టం మన చుట్టం కాదు కదా! విచారణ,  తప్పించుకోవడానికి ఏదో ఒక నాటకం, ఏళ్ళ తరబడి కేసు.

“ఈ రోజుల్లో ఇటువంటి అత్యాచార కేసులు బొత్తులు బొత్తులుగా కోర్టులలో పడి ఉన్నాయి.

అతని సంగతి అటు ఉంచండి.

కేసు నిరూపిస్తారా? శిక్ష వేస్తారా?

బస్తీ జనాలు చావచితక తంతారా? అనేది పక్కన పెడితే, మల్లిక సంగతి ఆలోచించారా?”

మళ్ళీ తల్లీ కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు.

“సాక్షము లేనిదే ఏ కేసూ కోర్టులో నిలవదు.

సాక్షానికి ఆ పసిదాన్ని బోనులోకి ఎక్కించడం.

ఏమయింది?

ఏమి చేసాడు?

ఎట్లా చేసాడు? అంటూ దిక్కుమాలిన ప్రశ్నల పరంపర. ఆంటీ…. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మల్లికకు ఆడమగ మధ్య ఉండే శారీరక బంధము గురించి ఏమీ తెలియదనిపిస్తున్నది. అవునా?”

“అవును కోమలి.  మల్లిక మాటల బట్టి చూస్తే  మత్తుచాక్లెట్లు తినిపించి ఏమీ అర్ధం కాని స్థితిలో అత్యాచారం జరిగింది. తనకు పాపం  అటువంటి స్త్రీపురుష సంబంధాలు ఉంటాయని కూడా తెలియదని అర్ధమయింది.”

“అంటే ఆ దుర్మార్గుడ్ని అట్లాగే అచ్చుపోసి వదిలేద్దామంటావా?” అమూల్యకు ఆవేశం వచ్చేస్తోంది.

“కూల్ కూల్. అమూల్యా. ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. ముందు వెనుకలు ఆలోచించు.

కోర్టు కేసుతో కథ ఆగదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటూ, వివిధ సంఘాలంటూ, అభాగినులకు న్యాయం చేస్తామంటూ, ఇటువంటి సంఘటనల కోసం కాచుకొని కూర్చున్న గోతికాడ నక్కలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి. బతుకులు జట్కాబండి కెక్కించి చదరంగం ఆడుకొనే స్వార్ధపరులు ఇటువంటి సంఘటనల కోసం కాచుకుని ఉంటారు.

అతన్ని అరెస్ట్ చేయగానే ఇన్ఫార్మర్స్ ద్వారా మీడియాకు తెలిసి పోతుంది.

వెంటనే, “పదకొండేళ్ళ బాలిక మీద అత్యాచారం. ఫలానా ఆస్పత్రిలో అబార్షన్…..విషమించిన బాలిక పరిస్థితి.” అంటూ అవాకులు చెవాకులతో స్క్రీన్లన్ని నిండి పోతాయి.

ఇంకా ముందుకు వెళ్ళి మల్లిక ఇంటిని పట్టుకొని అక్కడ చేరి తల్లిని నాయనమ్మను నానా ప్రశ్నలు.

ఈ లోగా డబ్బు ప్రలోభపెట్టి పోటీగా చానెల్ వాళ్ళు నాలుగు కుర్చీలు, ఒక డాక్టర్, ఒక సైకియాట్రిస్టు, మహిళా కార్యకర్తలు……తొక్క తోలు…..మధ్యలో మల్లిక. దిక్కుమాలిన ప్రశ్నలు. ఫోన్ కాల్స్. మేము ఆ పసిదానిఇ అండగా ఉంటామని భరోసాలు

సరే కేసు తొందరగా ముగిసి అతనికి శిక్షతో అన్నీ అయిపోయాయనుకుందాము.

రేపటి నుండి ఆ పిల్ల బడికి కాదు కదా వీధిలోకి కూడా కాలు పెట్టలేని గతి. నిక్కరు పైకి లాక్కుంటూ తిరిగే పదేళ్ళ వెధవ నుండి కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్న…ఇదిగో ఈ వెధవల వయసు వాళ్ళ దాకా  చొంగలు కారుస్తూ దాని మీద కన్నేసి అవకాశం కోసం కాచుక్కూర్చొని ఉంటారు.

ఏమీ పట్టించుకోకుండా బడికే పంపించారనుకుందాము. అక్కడ పిల్లలందరికీ ఆరాటము. దానిని వెలివేసినట్టు చూడటము. కొందరు సాడిస్ట్  టీచర్లు దాన్నీ పక్కకు తీసుకెళ్ళి ప్రశ్నలు.”

తనకు ఏమి జరిగిందీ తెలియని ఆ పసిదానికి ఇవన్నీ అవసరమా? పిల్లకు భవిష్యత్తు లేకుండా మనమే గోతిలో పాతేసిన  వాళ్ళము అవుతాము.”

“విదేశాల ప్రభావంలో ఉన్న గొప్పింటి వాళ్ళకు అది ఒక చిన్న ఏక్సిడెంట్ వంటిది. దులిపేసుకొని పోతారు.

కాని ఈ మధ్యతరగతి వాళ్ళకు అట్లా కాదు కదా. అది ఒక చెరగని మచ్చగా జీవితమంతా వెన్నాడుతూనే ఉంటుంది..”

తల్లీ కూతుళ్ళ స్పందన కోసం ఆగి వారినే గమనిస్తున్నది కోమలి.

“ఆంటీ…మనకు కావలసింది అతని పీడా మనకు ఉండకపోవటము.  ఇంటి నుండి పంపించేయడం. కొడుకు కోడలు కోరుకున్నట్టు ఆ హోంకి వెళ్ళిపోవడం. మల్లిక భవిష్యత్తుకు ఏ ఆటంకమూ లేకపోవడము.

ఒక విధంగా ఆ పిల్ల చాలా అదృష్టవంతురాలు. ఏ దేవుడో కరుణించి తన కడుపులో పడ్డ దరిద్రాన్ని నేలకూల్చేసాడు. అట్లా కాకుండా ఆ గర్భమే నిలిచి ఉంటే ఇంక ఆ పిల్ల బ్రతుకు ఎట్లా ఉండేదో ఆలోచించటానికే భయమేస్తోంది. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపడనక్కర లేదు.

జరిగిన అనర్ధము మన ముగ్గురి మధ్యనే ఉండాలి. మల్లిక తల్లికి గాని, నాయనమ్మకు గాని తెలియాల్సిన అవసరం లేదు. ఆలస్యంగా పీరియడ్స్ వచ్చేటప్పటికి కడుపులో నొప్పి వచ్చిందని నచ్చ చెప్పండి. అసలు సంగతి తెలిస్తే అందరికీ నరకమే. బస్తీ జనాలు మీ ఇంటి మీదకు దాడి చెసినా చేయవచ్చును.”

ఎక్కడో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్న కొడుకు కోడలు మనవరాళ్ళందరినీ వీధికి లాగుతారు.

ఇంత రచ్చ వల్ల ఎవరికి ఏమి ఒరుగుతుందాంటీ?”

“మరి ఈ సమస్యకు పరిష్కార మార్గమేమిటమ్మా?”

“ఆంటీ నేను ఒక మార్గము సూచిస్తాను. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. కాని మన సమస్యకు శాశ్వత పరిష్కారము…….. ”

ఒక పది నిమిషాలు తన మనసులో రూపు దిద్దుకున్న పథకం వివరించి, “తప్పకుండా నేననుకున్నట్టు అయ్యే అవకాశం ఉందాంటీ. ఒకసారి నెత్తురు రుచి మరిగిన పులి అవకాశము వచ్చినప్పుడు వదలదు. వాడిని బామ్మగారి చేతనే ఇంటి నుండి వెళ్ళగొట్టవచ్చు. కాని అమూల్యా నువ్వు కాస్త ఎలర్ట్‌ గా ఉండాలి. మల్లి బాగా కాలు పొడుగు పిల్ల. దాదాపు నీ అంత పొడుగూ ఉంటుంది కనుక నేననుకున్న ఉపాయము ఫలించవచ్చు.”

కోమలి వివరించిన మాటలు విన్నాక తల్లీకూతుళ్ళకు కాస్త ఉపశమనం కనిపించింది.

“ఆ దరిద్రుడి పీడా విరగడ చేయడానికి నేను ఏ సాహసమైనా చేయడానికి సిద్దమే.”

“అంతకన్నా నిస్సహాయులం ఈ మధ్య తరగతి వాళ్ళము చేయగలిగింది ఏమీ లేదు ఆంటీ.”

*****************

“ఏమిటే మల్లీ ఈ మధ్య కనిపించడం లేదు. ఓసినీ, గుమ్మటంలాగా తయారయి భలే  ఉన్నావే. నీ కోసం బోలెడు చాక్లెట్లు తెచ్చి పెట్టాను మళ్ళీ రాకపోతివేమే?”

ఆదివారము. కుటుంబ సభ్యులందరూ భోజనాలూ చేసి విశ్రాంతిగా కూర్చొని ఉండగా ముచ్చటగా తయారయి వచ్చిన మల్లిక కనబడగానే బుల్లెబ్బాయి కళ్ళల్లో మెరుపు అప్పుడే అక్కడకు వచ్చిన కోమలి దృష్టి దాటిపోలేదు.

మల్లిక భుజం మీద చేయి వేసి గట్టిగా నొక్కుతూ దగ్గరకు తీసుకోబోయినాడు.

వెంటనే డా.కరుణ మాటలు మల్లికకు గుర్తుకొచ్చాయి.

“చూడు మల్లీ, ఇన్నాళ్ళూ చిన్నపిల్లవు. ఇప్పుడు పెద్దదానివి అయ్యావు కదా. ఎవ్వరినీ,  అమ్మనానమ్మ నీ క్లాసు ఫ్రెండ్స్ తప్ప వేరెవ్వరినీ, నిన్ను ముట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయనివ్వవద్దు. పెద్దవాళ్ళు లేకుండా ఎవరి వద్దకూ ఒంటిగా వెళ్ళవద్దు.” అన్న మాటలు గుర్తుకొచ్చి ఆయన చేతి నుండి తప్పించుకొని దూరంగా జరిగింది.

“ఓసినీ…..అబ్బో సిగ్గు వచ్చేస్తోందే?”

“అమ్మాయీ కరుణా!  నేను నా గదిలోకి వెళ్ళి పడుకుంటాను. బాగా వేడి చేసినట్టుంది. తలనొప్పిగా ఉంది.   మల్లి చేత కాస్సేపాగి ఒక గ్లాసెడు మజ్జిగ పంపించమ్మా. ఆ చేత్తోటే అమృతాంజనం కూడా పంపించు. కాస్త  రాయించుకుంటాను. మల్లీ నీ కోసం తెచ్చిపెట్టిన చాక్లెట్లు తీసుకుపోవే.”

“అట్లాగే పంపిస్తాను. మల్లిక ఇప్పుడేగా వచ్చింది. అది ఇంకా అన్నం తిన్నట్టు లేదు. ఈ లోగా మీరు కాస్త నడుం వాల్చండి.”

“అమ్మగారూ మజ్జిగ చేసేదా?  మల్లి వెళ్ళి బుల్లెబ్బాయిగారికి మజ్జిగ ఇచ్చి తలకు అమృతాంజనం రాసేసి వస్తే ఇంటికి వెళ్తాము. మళ్ళీ బుల్లెబ్బాయిగారు పడుకుంటారేమో”

“ఫరవాలేదులేమ్మా,  అమ్ము ఇస్తుందిలే. నువ్వు కూడా భోజనం చేసేస్తే  మల్లిని తీసుకొని  ఇంటికి వెళ్ళు. పాపం అసలే ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటోంది. బాగా రెస్ట్ కావాలి దానికి.”

**********

“అమ్మూ…… ఏమిట్రా సాహసం చేస్తావా?”

“అయ్యో ఎందుకు చేయనమ్మా. మనమనుకున్నది సాధించాలంటే ఏమైనా చేస్తాను. నువ్వు నాయనమ్మ దగ్గర కూర్చో.”

ఒకచేత్తో మజ్జిగ గ్లాసు పట్టుకొని మూల గదిలోకి వెళ్ళింది అమూల్య.

కిటికీల కర్టెన్లన్నీ వేసి గది చీకటి చేసేసి మల్లి వస్తుందని రెడీగా ఉన్నాడు బుల్లెబ్బాయి.

లోపలికి వచ్చింది ఎవరో గమనించను కూడా లేదు. చేతిలో గ్లాసు తీసుకొని పక్కనే బల్ల మీద పెట్టి,

“రావే మల్లీ, ఇదిగో చాక్లెట్లు ఇస్తానన్నాను కదా. ఇవిగో తినేసేయి.. జ్యూస్ కూడా తీసుకో.” చేయి పట్టుకొని మంచం మీదకు లాగి కూర్చో బెట్టుకున్నాడు. “తిను తిను. చాక్లెట్లు తినేసేయి.”  బలవంతం చేస్తూంటే తిన్నట్టు నటించి మత్తు వచ్చినట్టు  మంచం మీద వాలిపోయింది.

అంతే అవకాశం వదులుకోనట్టు అమాంతం మీద పడిపోయాడు.

అదను కోసం ఎదురు చూస్తూ, “అమ్మో! వదులు వదులు. అమ్మా నాయనమ్మా. అయ్యో నన్ను వదలరా.” అంటూ గోలగోలగా అరవసాగింది.

వెంటనే అమూల్య  నోటి మీద చేయి పెట్టి నొక్కేసి పెనుగులాడుతున్న ఆమె మీద మృగంలాగా పడ్డాడు.

“అయ్యో అత్తయ్యా! అమ్మూ గొంతులాగా ఉంది. ఏమయిందో ఏమో పదండి చూద్దాము. ఎవడో దొంగాడు ఇంట్లో దూరినట్టున్నాడు. పదండి పదండి. ఇదిగో ఎందుకైనా మంచిది ఈ చీపురు చేతబుచ్చుకోండి. నేను ఈ కర్ర తెస్తాను.” అత్తగారిని హడావుడి చేసి ఒక్క పరుగున ఆ గది ముందు వచ్చి తలుపు గభాలున తోసింది కరుణ.

వెనకాలే లోపలికి వచ్చిన అత్తగారు అక్కడ కనిపించిన దృశ్యము చూసి కాళికావతారము ఎత్తింది.

ఆ చీకటి గదిలో పెనుగులాడుతూ గట్టిగా అరుస్తున్న అమూల్య, ఆమెను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఎవరో తెలియలేదు. “ఎవర్రా వెధవా, వదలరా వదులు. నా మనమరాలిని వదలరా.” అంటూ చేతిలో ఉన్న చీపురుతో ఫెడీపెడీమని వీపు మీద బాదసాగింది.

అదును చూసుకొని అమ్ము కాలు ఝాడించి ఒక్క తన్ను తన్ని అతని భల్లూక పట్టులోంచి బయటపడి పరుగున తల్లి వద్దకు వచ్చింది.

“అక్కయ్యా….నేనే.” అంటూ దెబ్బలు తప్పించుకుంటూ బయటపడ్డ అతన్ని చూసిన ఆమె ఒక్కసారి తన కళ్ళను తానే నమ్మలేక పోయింది.

“ఆరి దౌర్భాగ్యుడా నీకిదేం పోయే కాలంరా? ముసలి చచ్చినాడివి ఒంటరిగా పడి ఉన్నావు కదా అని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే పక్కలో పామై కాటేస్తావురా? వామ్మో వామ్మో కాస్తలో నా మనవరాలి బ్రతుకు బుగ్గి చేసేవాడివి కదరా… నడువు. నా ఇంటి నుండి బయటకు నడువు.” మెడ పట్టి ఈడ్చబోయింది.

“అత్తయ్యా. నెమ్మదించండి. గట్టిగా అరిస్తే అనవసరంగా ఇరుగుపొరుగులో రచ్చ. మీరు బయటకు రండి. అమ్మును తీసుకొని మీరు గదిలోకి వెళ్ళిపోండి. నేను చూసుకుంటాను.”

అప్పటికే ఆమె పిలిపించిన కాబ్ డ్రైవర్ ఫోన్ చేసాడు.

మాట్లాడకుండా బుల్లెబ్బాయి బట్టలు అన్నీ ఒక సంచీలో వేసి, “బయలుదేరు.” కఠినంగా అని బయట కాబ్ ఎక్కించి, కొంపల్లిలో ఆయన ఫ్లాట్ ఎడ్రెస్ వివరించింది.

**********

చాలా చాలా థాంక్స్ కోమలీ. ఆ రోజున నువ్వే రాకపోయి ఉంటే ఆ పసిదాని గతి ఏమయ్యేదో.

నువ్వన్నట్టు మధ్యతరగతి వాళ్ళము. మౌనము వహించక చేసేది ఏమీ లేదు.

ఇట్లా ఎంతెంత మంది నోళ్ళు నొక్కేసుకుని కీచకులకు బలైపోతున్నారో కదా.

 

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *