April 20, 2024

23. నీ తలకాయ్…

రచన: కె. వెంకట సుధాకర్

 

అమ్మ రాజమండ్రిలో సడన్ గా పెళ్లి చూపులు ఫిక్స్ చేసింది. రేపు ఉదయం 9 గంటలకల్లా రాజమండ్రిలో ఉండాలంది. నేను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని. ఆఫీస్ నుంచి డైరెక్టుగా ట్రావెల్స్ వాడి దగ్గరికి వెళ్లి, బ్రతిమాలాడుకుని, సాయంత్రం ఏడు గంటలకు అమీర్ పేటలో దొరికిన బస్సు ఎక్కేసా.

నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో, అమ్మ కష్టపడి నన్ను పెంచింది. 35 దాటినా పెళ్లి కాకపోవడంతో అమ్మకు దిగులు పెరిగిపోయింది. నేను చామన చాయగా యావరేజ్ గా ఉంటాను. సరైన సంబంధాలు మాట పక్కన పెడితే అసలు సంబంధాలే రావట్లేదు. రాక రాక ఏదో సంబంధం వచ్చింది, అమ్మాయి బాగా నల్లగా ఉంది, కళగా కూడా లేదు, ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు, చదువు కూడా ఇంటర్ తో ఆపేసింది అంట, ఏ విధంగానూ  నాకు నచ్చలేదు. రాకరాక వచ్చిన సంబంధం ఇది కూడా చెడగొట్టుకుంటే ఇక సంబంధాలు రావేమో, పెళ్లి కాకుండా మిగిలిపోతాను, అమ్మ దిగులుతో ఏమైపోతుందో, అనే భయంతో పెళ్లిచూపులకి బయలుదేరా…

బాగా వెనక సీటు దొరికింది, నా ముందు సీట్లో ఎవరో పెద్దాయన కూర్చున్నాడు. మనిషి వెరైటీగా డ్రస్ చేసుకుని ఉన్నాడు. నాకేసి మధ్యమధ్యలో అనుమానంగా చూస్తున్నాడు. మనిషి కొంచెం తేడా అనిపించింది. అనుకోకుండా సీట్ మధ్య సందులోంచి చూస్తే, అతని ముందు కూర్చున్న దంపతుల సంచిలోంచి  వాళ్ళకు తెలియకుండా చెగోడీలు, స్వీట్లు తినేస్తున్నాడు అంతటితో ఆగకుండా సంచిలో ఏవో టాబ్లెట్స్ ఉంటే అవి కూడా వేసుకున్నాడు, వాళ్ల అరుకు సీసాలో కొద్దిగా అరుకు తాగేసాడు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేవాళ్ళు ఉంటారని  విన్నాను గాని, ఇదే చూడటం. అదేం బుద్దో  నాకు అర్థం కాలేదు. నేను గమనించడం చూసి,  నా వైపు సీరియస్ గా చూసాడు,.

కాసేపటికి ఆ దంపతులు సంచిలో వస్తువులు మిస్ అవ్వడం గమనించి, ఆ పెద్దాయనను “ఏమైనా చూసారా” అని అడిగారు.

ఆ పెద్దాయన నా వైపు చూపిస్తూ “ఈ కుర్రాడు ఇందాక, మీ సంచీలోంచి చాలా తీసుకుని తినేసాడు, మీ బంధువుల అబ్బాయి అనుకున్నాను ” అన్నాడు

నేను గతుక్కుమన్నాను.

“ఆకలైతే.. అడిగితే ఇచ్చేవాళ్లం కదా” అని హీనంగా ఒక చూపు చూశారు.

అందరిముందు, తల కొట్టేసినట్టు అయ్యింది.

*****

టైం రాత్రి  ఎనిమిదయ్యింది, బస్సు  హైదరాబాదు శివార్లలో వనస్థలిపురం ఏరియాకు  వచ్చింది.

నా పక్క సీటు ఒకటే ఖాళీ ఉంది, ఎవరో అమ్మాయి ఎక్కి డ్రైవర్ను చాలా అర్జెంట్  అని  బతిమాలుతుంది. డ్రైవర్ డబ్బులు తీసుకుని నా పక్క సీటు ఆమెకి ఇచ్చేశాడు.

ఆమె తన బ్యాగ్ తీసుకుని నా సీట్ దగ్గరికి వచ్చింది. చాలా అందంగా ఉంది, బాగా కలిగిన కుటుంబం అనుకుంటా.

“కొంచెం విండో సీట్ ఇస్తారా?” అని అడిగింది

“అయ్యో… తప్పకుండా…”  అంటూ జరిగాను.

“థాంక్స్ అండి” అంది

“నా పేరు రాము, మీ పేరు ఏంటండీ” అంటూ మాటలు కలిపాను

“సీత”

రాము – సీత …ఎందుకో తెలియని సంతోషం కలిగింది

ముందు సీట్,  ఫినాయిల్ గాడు ఈర్ష్యగా చూస్తున్నాడు.

“సీతగారు…ఏ ఊరు వెళ్తున్నారు అండి?” అని అడిగాను

“ఆమె, ఏ ఊరు వెళితే నీకెందుకు?” ఫినాయిల్ గాడు మధ్యలో ఎంటరయ్యాడు…. ఆల్రెడీ వాడు ఒక చెవి ఇక్కడ పడేసాడు అన్నమాట.

నేను సైలెంట్ అయిపోయాను.

“వాడి తలకాయ్ , వాడి మాటలు పట్టించుకోకండి” అంటూ మాటలు కలిపింది. కొద్ది గంటల్లోనే బాగా దగ్గరయ్యాం.

తనది హైదరాబాద్ అని తనకు తల్లి లేదని , తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ అని, తండ్రి బాగా ధనవంతుడు అని, డబ్బు మనిషి అని, ఏ రకమైన ప్రేమ లేకుండా పెరిగానని, బలవంతంగా తన ఫ్రెండ్ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే డబ్బు నగలతో పారిపోయి వస్తున్నాను అని.  తండ్రి కానిస్టేబుల్స్ ని పెట్టి తనని వెతికి స్తున్నా రని, ఇక ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని ఎలాగోలా బయట ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతానని కళ్ళనీళ్ళతో చెప్పింది.

నాకు బాగా జాలి వేసింది, ఓదార్చాను. ఆమె మూడ్ మార్చడానికి , టాపిక్ మార్చాను.

“ఏ కూరంటే ఇష్టం ?”

“తలకాయ కూర”

“ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు? అందమా? చదువా? డబ్బా?”

“తలకాయ ఉంటే చాలు”

“ఎవర్నైనా ప్రేమించారా?”

“నీ తలకాయ్” (నవ్వింది)

తరువాత , నా వివరాలన్నీ అడిగింది, నా పెళ్లిచూపులు విషయం చెప్పగానే మొహం దిగులుగా పెట్టింది

టైం రాత్రి 11 గంటలు దాటింది…

ధైర్యం చేసి “నన్ను పెళ్లి చేసుకుంటారా?” అని అడిగేసా.

ఒక్కసారి షాక్ తింది. కళ్ళనీళ్ళతో తల నా భుజంపై ఆనించింది.

నాకు ప్రపంచం గెలిచినంత ఆనందం గా ఉంది…..

“నాలో ఏం నచ్చింది? “ ఉండబట్టలేక అడిగేసా..

“నీ తలకాయ్… మాట్లాడకుండా పడుకో” అంది

అర్ధరాత్రి అని కూడా చూడకుండా అమ్మకు ఫోన్ చేసి తెగేసి చెప్పేసా, ఆ పెళ్లిచూపులకి వెళ్ళను అని. మిగతా వివరాలు తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేసా.

మిర్యాలగూడ దాటాక బస్సు సడన్ గా ఆగింది అందరూ నిద్రలో ఉన్నారు, ఎవరో నలుగురు బస్ ఎక్కి,  డ్రైవర్  తో మాట్లాడి, ఒక ఫోటో పెట్టుకుని వెతుక్కుంటూ వస్తున్నారు.

సీత టెన్షన్ పడుతోంది… నేను నచ్చచెప్పి,  నా వళ్ళో పూర్తిగా దుప్పటి కప్పి పడుకోమని చెప్పాను..

వాళ్లు నా దగ్గరికి వచ్చి “ఎవరు?” అని అడిగారు,” నా భార్య”  అని చెప్పాను.

వాళ్లు వెళ్లిపోయారు, సీత ఆరాధనగా ముద్దు పెట్టింది. నన్ను గట్టిగా పట్టుకుని ధైర్యంగా పడుకుంది .ఎప్పుడు పట్టిందో తెలియదు, నాకు బాగా నిద్ర పట్టేసింది

*****

టైం ఉదయం 6:00… తాడేపల్లిగూడెం వచ్చింది. న్యూస్ పేపర్ వాడి అరుపుకు మెలుకువ వచ్చింది, న్యూస్ పేపర్ కొన్నాను.

పక్కన సీత కనపడలేదు. ఆమె లగేజ్ మాత్రం బస్ లోనే ఉంది. నాకు కంగారు మొదలయ్యింది.

క్లీనర్ ని  వాకబు చేస్తే , ఉదయం నాలుగు గంటలకు విజయవాడ బస్టాండ్ లో  టీ కోసం ఆమె దిగిందని , కొంతమంది పోలీసులు బలవంతంగా ఆమెను తీసుకెళ్లారని చెప్పారు.

ఆ బ్యాగ్ లో బోలెడు  నగలు, డబ్బు ఉన్నాయని నాకు మాత్రమే తెలుసు. నేను కాజేసినా అడిగేవాడు లేడు, ఆమె అమాయకపు మొహం గుర్తొచ్చింది. ఆమె నన్ను నమ్మింది, మోసం చెయ్యకూడదు. రాత్రి మాటల్లో ఆమె అడ్రస్  లీలగా నాకు గుర్తుంది , ఇంటికి వెళ్లి వాళ్ల తండ్రితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను, మెల్లగా ఆమె లగేజ్ తీసుకున్నాను. నేను రాత్రి ఆమె ఫోన్ నంబర్ తీసుకోలేదు, ఒక వేళ ఆమె బ్యాగ్  లో వెతికితే దొరకొచ్చేమో అని చెయ్యి బ్యాగ్ లో పెట్టాను. లోపల ఏదో పోలిథిన్ కవర్ తగిలింది, కవర్ లోపల గట్టిగా ఏదో ఉంది.  కవర్ విప్పి చూస్తే. ఏవడిదో తలకాయ్. నీట్ గా పోలిథిన్  కవర్ లో ప్యాక్ చేసి ఉంది.

నా   పై ప్రాణాలు పైనే పోయాయి. కాళ్ళూ చేతులు ఆడటం లేదు. కాసేపటికి తేరుకున్నాను. నా దృష్ఠి పేపర్ లో న్యూస్ పైన పడింది. ‘తలకాయ్ తాయారు’ ఒక లేడీ సైకో సీరియల్ కిల్లర్ , యువకులను మాయ మాటలటో నమ్మించి , నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్ళి, చంపి , తల నరికి తీసుకుపోతుందని, జాగ్రత్తగా ఉండమని ఆ న్యూస్…. నాకు అప్పుడు జరిగింది అంతా అర్థం అయ్యింది, అది ఎవడినో నమ్మించి చంపి, తలకాయ్ బ్యాగ్ లో పెట్టుకు వచ్చి, కంగారుగా బస్ ఎక్కి, నా పక్కన కూర్చుంది, అందుకే దాని గురించి పోలీసులు వెతుకుతున్నారు. నేను తింగరివాడిలా అది చెప్పిన సొల్లంతా నమ్మి, పెళ్ళి సంబంధం క్యాన్సెల్ చేసుకున్నాను. నన్ను కూడా మాయమాటలతో నమ్మించి, నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్ళి , నా తలకాయ పట్టుకు పోదామనుకుంది, కొంచెంలో బ్రతికిపోయాను. ఒకటికి పది సార్లు, అది తలకాయ్….తలకాయ్…అంటున్నపుడే దాన్ని అనుమానించాల్సింది.

ఇప్పుడు ఈ తలకాయ్ తో నన్ను పోలీసులు చూస్తే, నా  “తలకాయ్ కూర” వండేస్తారు.

ఈ తలకాయ్ ని ఎలాగైనా వదిలించుకోవాలి.

ఇక ఇలా అయితే లాభం లేదు అని, చుట్టూ చూసా, ఫినాయిల్ గాడు  తప్పించి బస్ లో అందరూ దిగిపోయారు.

ఫినాయిల్ గాడు , దిగిపోయిన ప్యాసెంజర్స్ వదిలేసిన వాటర్ బాటిల్స్, చిప్స్ పాకెట్స్ ఏరుకునే పనిలో బిజీగా వున్నాడు.

నేను ఇలాగే రాజమండ్రి దాకా వెళితే రిస్కు ఎక్కువ, కాబట్టి రావులపాలెంలో దిగిపోడానికి డిసైడ్ అయ్యా..

రావులపాలెం వచ్చింది, మెల్లగా సీట్ లోంచి లేచాను.

తలకాయ ఉన్న బ్యాగ్ గట్టిగా పట్టుకున్నాను. ఫినాయిల్ గాడు బ్యాగ్ వైపు  అనుమానంగా చూస్తున్నాడు.

డ్రైవర్ , క్లీనర్ మమ్మల్నే చూస్తున్నారు

నాకు గుండె దడ మొదలయింది, కంగారులో ” ఈ  బ్యాగ్   మీదా సార్” అన్నాను ఫినాయిల్ గాడితో

“ఆ… నాదే…. ఏం… దొబ్బేద్దామనుకున్నావా?” అన్నాడు ఫినాయిల్ గాడు తడుముకోకుండా

(వీడసలు నిజాలు చెప్పడం పూర్తిగా మానేసాడనుకుంటా, ఫ్రీ గా వస్తుంది అని బ్యాగ్ కొట్టేద్దామనుకుంటునట్టు ఉన్నాడు)

కొంచెం ధైర్యం తెచ్చుకుని  “బాగా బరువుగా ఉంది, ఏముంది సర్ బ్యాగ్ లో?” అన్నా

“ఆ…మా ఊర్లో ఒకడు ఇలాగే పిచ్చి పిచ్చి  ప్రశ్నలు వేసి విసిగిస్తుంటే, వాడి తల నరికి  బ్యాగ్ లో  పెట్టుకుని తీసుకెళ్తున్నా” వెటకారంగా అన్నాడు  ఫినాయిల్ గాడు

“మీరు ఆ మాటలు పట్టించుకోకండి… దిగండి సర్”   డ్రైవర్ అరిచాడు

బ్యాగ్, ఫినాయిల్ గాడి చేతిలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా…బ్రతుకుజీవుడా అనుకుంటూ బస్ దిగేసా…

అమ్మకు ఫోన్ చేసా …. పెళ్ళి చూపులకి వెళ్తున్నాను అని చెప్పడానికి…

 

సమాప్తం

 

 

 

 

 

4 thoughts on “23. నీ తలకాయ్…

  1. చాలా బాగుంది.
    కొంచెం గగుర్పాటు కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *