April 23, 2024

30. రామక్కవ్వ

రచన: RC కృష్ణస్వామిరాజు

 

రామక్కవ్వ తన  తిత్తి లోని పొగాకు చెక్కల్ని నముల్తూ రెడ్డోళ్ళ బావి కాడ నిలబడి ఆకాశం కేసి పదే పదే చూస్తోమ్ది. మిట్ట మధ్యాహ్నం మూడు గంటలైనా   కాలికి చెప్పులైనా  లేకుండా ఆకాశాన్ని చూసి చూసి విసిగింది. తల దించి నీళ్లు లేక ఎండిపోతున్న  తన సెనిక్కాయల కయ్యిల్నిచూస్తూ ఏడుపుమొఖంతో నిలబడి ఉంది. నాలుగు మూరల నారాయణవనం పంచె కట్టి సైకిల్లో సర సర పోతున్న సాంగెన్నని  తన  ఎడమ చేతితో ఆపింది.

‘ ఒరేయ్ సాంగా, ఎండలేందిరా ఇట్టా మండి పోతా ఉండాయి. ఊర్లో పిలకాయల్ని పురమాయించి కప్పల పెండ్లి చేయరాదారా. కప్పల పెండ్లి చేస్తే  కోరిన కొండ మీద వాన పడతంది కదరా’ అని నిలబెట్టి అడిగింది.

‘ ఆదివారం తెల్లార్తో సిన్నక్కోళ్ల కొట్టం  కాడికి బడి పిలకాయలంతా చెడుగుడు ఆడేదానికి వస్తారక్కా. అప్పుడు అడిగి చూస్తా. అయినా మంత్రాలకు చింతకాయలు రాలే కాలమక్కా ఇది’ అంటూ నడుము తిప్పుతూ    సైకిలు తొక్కుకొంటూ పోయినాడు. ‘అట్ట అనమాకురా నాయనా,  ఏ పుట్టలో ఏ పాము వుందో ఎవడికి తెలుసురా నాయనా’ అంటూ రామక్కవ్వ కాళ్లీడ్చుకొంటూ ఊర్లోకి నడిచింది.

XXXXX

సాంగెన్న తన  నోట్లోనుంచి కారుతున్న జల్లును పై గుడ్డతో తుడుచుకొంటూ  తుంబూరామె మసాలా వడలు తింటూ తాటి చెట్ల కింద కూర్చొని వున్నాడు. చెడుగుడు  ఆడదామని వచ్చిన చీమిడి చిన్నబ్బకి విషయం చెప్పినాడు. వాడు గుండమ్మకథ సినిమాలో ఎన్టీయారు లెక్కన భుజాలు ఎగురవేస్తూ, స్టెప్పులేస్తూ పడిసెం ప్రకాషుకి, దగ్గుల జగ్గయ్యకి, కత్తుల కాంతారావు కీ చెప్పినాడు. అందరూ చేరి తన వడల్ని పెరుక్కొంటారేమోనని సాంగెన్న వేడి వేడి  వడల్ని తన లోపలి నిక్కరులో దాచి పెట్టినాడు. వడల వేడి తొడలకి తగులుతున్నా తైతక్క లాడతా కప్పల పెండ్లి ఎట్ల చేయాల్నో వాళ్ళకి చెప్పినాడు.

ఇంతలోపల తంటలాయన కొడుకు, ఆరేల్లాయన మనవడు, తునకలాయన తమ్ముడు, పొట్టేళ్లఆయన పెద్దమ్మ కొడుకు, నేండ్రకాయన్న నాలుగో కొడుకు వచ్చినారు. ” మొదట వచ్చిన వాళ్లే అబ్బా పెండ్లి పెద్దలు. వెనక వచ్చినోళ్లంతా ఊరకే పక్కనుండి పెండ్లికి ఆ పనీ ఈ పనీ చేయాలసిందేనబ్బా” అని పెద్దరాయుడు లెక్కన ఫోజు కొడతా చెప్పినాడు సాంగెన్న.

కాలర్లు ఎగర వేసినారు చీమిడి చిన్నబ్బ పడిసెం ప్రకాశు దగ్గుల జగ్గయ్య కత్తుల కాంతారావు. మిగిలినోళ్లు మూతులు ముడిచినారు. అయినా చేసేదేమీ లేక ” దీపం నూనెలో ఊర్లో వాళ్ళు వేసిన చిల్లర పైసల్తో కొనిన గెనిసి గెడ్డలు, గేగులు,మొక్క జొన్నలు   మాకు కూడా పెట్టాలి” అని షరతు పెట్టినారు.

అందరూ కలిసి కోమిటోళ్ల బావి కాడికి పోయినారు. మగ కప్ప సులభంగానే దొరికింది. మూడు ఆడ కప్పలు దొరికినట్లే దొరికి జారిపోయినాయి. ‘ఎక్కడైనా లేడీస్ కి డిమాండు రబ్బా’ అని   నాలికతో మీసాలు  లాక్కొంటూ చెప్పినాడు సాంగెన్న. పిల్లగ్యాంగుపకపకా నవ్వింది. అయినా పాలుమారకుండా[ఓపిక నశించనీయకుండా] రాఘవన్నోళ్ల   బావి, సింగరాజోల్ల బావి,ఆకేటోళ్ల బావి తిరిగి ఆడ కప్పను పట్టుకొచ్చినారు.

నల్ల పొడుగాటి రోకలిని చేంద బావి నీళ్లతో శుభ్రంగా కడిగినారు. పసుపు కుంకుమలు రాసినారు. మామిడిమండలు కట్టినారు.గుండుమల్లెల మాల రోకలికి చుట్టినారు.కప్పలకు బొట్టూ కాటుకలు పెట్టి అలంకరించినారు. రోకలి కుడిపక్కన ఆడ కప్పను, ఎడమపక్కన మగ కప్పను దారమేసి కట్టినారు.చిన్నబ్బ గోవిందలు చెబుతూ గండర నూనె దీపం ఎత్తుకున్నాడు.ప్రకాషు పూజారి లెక్కన తెల్ల పంచెతో కీసాపు కట్టి నుదిటిన నామాలు పెట్టి ముందు నడిచినాడు.జగ్గారావు  కాంతారావులు రోకలిని భుజాలపైన పెట్టుకున్నారు. సాంగెన్న పెండ్లి పెద్దగా కుడి చేతిలోని  తెల్ల రుమాలు విసురుతూ ఎడమ చేతితో విజిల్  వేస్తూ మూడు మూరల వెదురు కర్రను చంకన పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ లెక్కన వీరి వెంట నడుస్తున్నాడు.

తమకు అర్థం కాని  జరుగుతున్న తంతుకి[పెండ్లికి]కప్పలు బెకెబెకా అరావాల్సింది పోయి బిత్తరబిత్తరగా అటూఇటూ చూస్తున్నాయి.

ఇంతలో గండు గిరిజ, పొట్టి జడల పద్ది, పోనీటైల్ పారు, బోడి బాలామణి ‘మమ్మల్ని పిలవకుండానే పెండ్లి చేస్తేస్తారా, రా’ అంటూ పరిగెత్తుకొంటూ వచ్చి పెళ్లి బృందంతో కలిసి పోయినారు.

‘ఊళ్ళో పెళ్ళయితే  కుక్కలకు హడావుడి కదా’, రాఘవడి  ఇంట్లోని ఎర్ర కుక్క, చీటయ్యన్న వాళ్ళ తెల్ల కుక్క, గూని గురవరాజు ఇంటి నల్ల  కుక్క, గజలక్ష్మక్కోళ్ల గోధుమ రంగు కుక్కలు వీరి వెనకనే నడిచినాయి

రాములోరి గుడికాడినుంచి తూర్పు వీధిలోకి పోయినారు.

రచ్చ బండ కాడ రామక్కవ్వ కూర్చొని పొగాకు నమలతా సినిమా చూసినట్లు చూస్తా ఉంది. అప్పటికే ఆకాశం నల్ల బడటం రామక్కవ్వ గమనించింది. ఊర్లోని  గుర్రమ్మ గోవిందమ్మ  సాలక్క  బంగారక్కలు ఊర్లో విషయాలు మాట్లాడదామని రామక్కవ్వ చుట్టూ చేరినారు.రామక్కవ్వ కప్పల పెండ్లి చూస్తా ఉండేసరికి వాళ్ళు కూడా ఊర్లో కథలు మాట్లాడేది నిలిపేసి పిలకాయలు చేసే పెండ్లిని ‘ఆ’ అని నోరు తెరిచి చూడ సాగారు.

ఊర్లో కొత్తగా ప్రాక్టీసు పెట్టబోయే ఆర్ ఎమ్ పీ డాక్టరు  తాను కొత్తగా చేర్చుకోబోయే నర్సుకి సూది వేయడం ఎలాగో నేర్పిస్తున్నాడు. పెళ్లి బృందాన్ని చూసి చెప్పులు తీసి దీపానికి దండం పెట్టుకొని రూపాయి బిళ్ళని నూనె దీపంలో వేసినాడు. భలే మంచి బోణీ కొట్టామని అనుకున్నారు సాంగెన్న బృందం.

తాగేలి తులసి వీధిలోకి వచ్చి ‘ఒరే చిన్నబ్బా, మీ అమ్మ నాయన్లు ప్రతిసారీ బెల్లం గానుగ ఆడించేటప్పుడు  చెంబు చెరుకు రసం పంపించే వాళ్ళు. ఈసారి పాలడ[బిడ్డలకు పాలు పొసే చిన్న గిన్నె] అంత చెరుకు రసం కూడా పంపలేదు ఏమిట్రా’ అని నిల దీసింది.’మాకే లేదు నాకుడు బెల్లం,నీకు ఎక్కడనుంచి తెచ్చి ఇచ్చేది గోకుడు బెల్లం’ అందామనుకొని తాగేలి తులసికి కోపం వస్తే ఈడ్చి ఈడ్చి కొడుతుందనే   విషయం గుర్తుకు వచ్చి ‘అమ్మ తో చెప్తాలే అక్కా’ అని నెమ్మదిగా చెప్పినాడు.  తాగేలి తులసి ఇంట్లో ఉండే మారని అర్థ రూపాయ బిళ్లల్ని బిజారి[సేకరించి]  తెచ్చి నూనె దీపంలో వేసింది.

XXXXX

పడమటి వీధి లోకి వెళ్ళినారు.

శేషంపేట శ్యామలక్క యెర్ర నీళ్లు కలుపుకొచ్చి కప్పల పైన పోసింది. ‘పెండ్లికి పైసలియ్యలేనుకానీ ఇవి పట్టుకుపోండ్రా’ అని సొరకాయ ఒకటి గుమ్మడి కాయ ఒకటి  సాంగెన్న  చేతిలో పెట్టింది. ‘మంత్రసాని పనికి ఒప్పుకున్నాక బిడ్డ  అయినా, గడ్డ అయినా పడాలసిందేకదా’ అనుకొని ముందుచూపుతో తెచ్చుకొన్న  గోతాములో వాటిని వేసుకొన్నాడు.

అంతలో శ్యామలక్క ఆడ పడుచు ఆదిలక్ష్మి గబగబా పరుగెత్తుకొచ్చి ప్రకాషుతో ‘మీ  టైలర్   నాయన జాకెట్లు  ఫిట్టుగా కుట్టి పెట్టినాడు ఏందిరా నాయనా,వదులు చేసుకోలేక చస్తా వున్నాము’ అని నిలదీసింది. ప్రకాషు ‘కాశీకి పోయినా కావడి బరువు మోయాల్సిందే కదా’ అనుకొని నవ్వి ఊరుకున్నాడు.

XXXXX

దక్షిణం వీధికెళ్ళినారు. ముంగిలిపట్టు మార్కొండన్న పంచె ఎగగట్టి సరసరా పోతా వీళ్లని చూసి నిలబడినాడు. ‘ఏమి మార్కొండన్నా పరుగులు తీస్తా వుండావే?’ అని అడిగినాడు సాంగెన్న. ‘ఏమీ  లేదురా సాంగా, మూడేండ్ల ముందు నీరువాయి నరసింహం మనవడి పెండ్లికి 116లు చదివించినానురా,విశ్వాసం లేని నాయాలు …  మొన్న మా పాప పెండ్లికి వచ్చి తౌడు తినినట్లు తిని పోయినాడుగానీ, పైసా చదివించ  లేదురా  అబ్బీ … ఈ  రోజు తాడో పేడో తేల్చుకొందామని నీరువాయి నరసింహం ఇంటికి పోతా ఉండా …. అంటూ సర్రున వెళ్ళినాడు.

నవ్వితే నాలుగు తన్నులు తంతాడేమోనని భయపడి ఆయన పోయే వరకు నవ్వును బిగబట్టి ఆయన పోయినాక అందరూ పడీపడీ నవ్వినారు.

ఇంతలో కువైట్ కమలక్క తన మూడవ మనవడిని చంకన పెట్టుకొని దక్షిణం వీధి కొసలో  గాడిదల దగ్గర నిలబడి ఉంది. రామసముద్రం నుంచి గాడిదలను ఊరూరా తోలుకొచ్చి పాలు పిండి ఇచ్చే పురుషోత్తముడు అక్కడే ఉన్నాడు. ‘పసి బిడ్డలకి గాడిద పాలు తాగిపిస్తే బిడ్డలు పుష్టిగా బలిష్ఠంగా తయారవుతారని  ఊరులో అందరూ పసి బిడ్డలకు గాడిద పాలు తాగిస్తారు కదా’ అని గమ్మున కమలక్క దగ్గరే నిలబడినారు.

‘ఏమిరా సాంగా, వానల కోసం కప్పల పెండ్లి చేస్తా ఉండారా, భలే భలే … అయినా నా కాడ మొత్తం  అంతా దీనార్లే ఉండాయి కదరా,రేపన్నా ఎళ్లుండన్నా తిరుపతి బ్యాంకు కెళ్ళి మార్చుకొని రావాలి’ అని చెప్పి ఇంట్లోకెళ్ళి సూట్ కేస్ లో ఎక్కడో ఇరుక్కొని వున్న బ్రెడ్డు ముక్కలు,చాక్లెట్లు ,ఖర్జురాలు పేపర్లో పొట్లం కట్టి తెచ్చి ఇచ్చిమ్ది. పిలకాయలంతా చాక్లెట్లు చూసి తియ్యటి   గుటకలు మింగినారు.

జగ్గారావును చూసిన కమలక్క ‘ఒరేయ్ జగ్గా,మూడేండ్ల ముందు నేను కువైటు కు పోయే ముందు మీ ఇంటికి కోడిగుడ్ల పొరుటు పంపించిన చిన్న గిన్నె ఇంకా మాకు ఇవ్వలేదంట కదరా,మీ అమ్మనడిగి రేపన్నా తెచ్చి ఇయ్యరా’అనింది. జగ్గారావు మూతి -మాడిన దోసె పెనుము మాదిరి ఐయింది. ‘ఈ పెద్దోళ్లు  గర్ల్ ఫ్రెండ్స్ ముందర వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గాలి తీయ కూడదని ఎప్పుడు తెలుసుకొంటారో కదా ‘అని తెగ బాధ పడుతూ ‘అట్లే కమలక్కా, అమ్మతో చెప్తాలే’ అని చిన్న గొంతుతో చెప్పినాడు.

XXXXX

చివరిగా ఉత్తరం వీధి మలుపు తిరుగుతూ ఉంటే సాంగెన్న గట్టిగా విజిల్ ఊది ‘స్టాప్ ‘అని గట్టిగా అరచినాడు. ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడ్డారు. ‘గోవిందలు పలకడం లేదు’ అని అరచినాడు. అంతే.. అందరూగట్టి గట్టిగా  గోవిందలు పలికినారు . పెండ్లి బృందం నడక ప్రారంభించింది .

దోవలో వారికి  చింత చెట్టు కనిపించింది. పెళ్లి బృందంలోని ఆడ పిలకాయలంతా పోయి అందినన్ని పచ్చి చింతకాయలను కోసినారు.సాంగెన్న పరుగెత్తి పోయి వాల్లింటిలోనుంచి ఉప్పు మిరక్కాయ తెచ్చినాడు. పక్కనే వున్న రాళ్ల పైన చింతకాయలు పెట్టి రాళ్లతోనే చింతకాయలను దంచినారు.  తలా కొంచెం ఊరు[మి]బిండి [పచ్చడి] చప్పరిస్తూ పుల్లదనానికి ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ అనుకొంటూ ఉత్తరం వీధిలోకి ఉరికినారు.

ఆరూరామె మనవడిని ఎత్తుకొని మురిపంగా కోడి కూరని చిన్న చిన్న ముక్కలుగా చేసి మనవడి నోట్లో   దూరస్తా ఉంది.వాడు తిననంటే తిననని మొరాయిస్తా ఉండాడు.  సాంగెన్నఉండ బట్టలేక ‘ఏమక్కా, అబ్బికి  కోడి కూర  నచ్చలేదా’ అని అడిగినాడు. ‘అవునురా సాంగా, వాడికి చికెన్ ముక్కలు వద్దంటరా నాయనా, పెద్ద పెద్ద చియ్యలు[మటన్ ముక్కలు] కావాలంట! మీ మావ మటన్ రేటు పెరిగిపోయిందని చికెన్ తెచ్చినాడురా, నేను ఇప్పటికిప్పుడు పొట్టేలు కూర ఎక్కడినుంచి తెచ్చేదిరా?’ అంటూ ఇంట్లోకెళ్ళి పడి బియ్యం తెచ్చి పెళ్లి బృందానికి ఇచ్చ్చింది.

వెనక వెనక దాక్కొంటున్న కాంతారావును చూసిన ఆరూరామె ‘ఒరేయ్ కాంతఁడూ … ఏమిరాఎనుము  [బఱ్ఱె] పాలు పల్చగా పోస్తా ఉండారు. పాలల్లో చింత గింజ వేస్తే తేలాడాల్సింది పోయి బుడుక్కున మునిగి పోతా   ఉంది కదరా,ఒక పూట కాకపోయినా ఇంకొక పూట అయినా చిక్కంగా పాలు పోస్తే కదరా, మాకేమైనా దుడ్లు చెట్లకు కాస్తా ఉండాయా, మీ అబ్బాఅమ్మలకు చెప్పురా’అని రాగాలు తీస్తూ చెప్పింది. ‘చింత గింజ పాలల్లోనే కాదు,నీళ్ళల్లో వేసినా మునిగిపోతుందక్కా’అందామనుకొని ఎందుకొచ్చిన గొడవ, మంచి పాలగిరాకీ  వదులుకునేది ఎందుకని ‘అట్లనే పిన్నమ్మా’ అని బదులిచ్చినాడు.

ఎదురుగా వైట్ &వైట్ డ్రెస్సు వేసిన  బంగారు రాజు తన చొక్కా జేబులో  హీరో శోభన్ బాబుతో తాను కలసి వున్న  ఫోటో పెట్టుకొని ఎదురు వచ్చాడు. ఆయన వెనుకే ఆయన మిత్ర[భజన]మండలి నడుస్తోమ్ది.వీరిని చూసి బంగారు రాజు సినీ  స్టార్ స్టైల్ లో  నిలబడి రేబాన్ కళ్ళజోడు ముక్కుల మీదకి లాక్కొని చొక్కా జేబులోనుంచి పల పల లాడే పది రూపాయల నోటిచ్చి ‘జల్సా చేసుకోండి’ అని చెప్పి వెళ్ళినాడు. పిలకాయలు పది రూపాయల నోటుని కను గుడ్లు పెద్దవి చేసి చూసినారు.

బంగారు రాజు పది అడుగులు వేసినాడో లేదో కాంతారావు అదో రకంగా చూస్తూ సాంగె న్నతో ‘బంగారన్న ఏయే సినిమాలలో నటించినాడన్నా’  అని అడిగినాడు.

‘అయ్యోరామా, అప్పుడెప్పుడో కోడెనాగు సినిమాలో షూటింగ్ కని చంద్రగిరికి శోభన్ బాబు వస్తే గ్రూపు సీన్ లోనో, డ్యాన్సులోనో  ఈయన ఎక్కడో ఒక మూల నిలబడి వున్నాడు. అప్పటినించి ఇదే బిల్డప్. షూటింగ్ అయినాక శోభన్ బాబుతో ఫోటో తీసుకొని వాల్లింట్లో హాల్ లో పెద్ద కలర్ ఫోటో పెట్టించినాడు . ఫోటో కింద పెద్ద అక్షరాలతో బంగారురాజుతో శోభన్ బాబు అని తెలుగులో టైపు చేయించినాడు . ఇంటికి వచ్చి పోయే వాళ్ళకి ఆ ఫోటో చూపిస్తాడు.మెచ్చుకొంటే మురిసి పోతాడు. ఈయన సుత్తి భరించలేక వాళ్ళ  ఇంట్లో వాళ్ళు, ఆ పక్క నాలుగు ఊరోళ్లు, ఈ పక్క నాలుగు ఊరోళ్లు తలలు బాదుకొంటూ ఉంటారురా నాయనా!  తను ఒక పెద్ద యాక్టరు అయినట్లు ఎప్పుడూ తన చుట్టూ నలుగురిని తిప్పుతూ వారిని  మేపుతూ ఉంటాడు’ అనడంతో అందరూ పక పక నవ్వినారు.

ఎండల్లో వీధులన్నీ తిరిగి అలసిన పిలకాయలు కప్పల  ఊరేగింపు పూర్తి చేసి వస్తా ఉంటే సాంగెన్న ‘ఒరేయ్ చిన్నబ్బా, నీ తలకాయ పైన చుక్కలుచుక్కలుగా నీళ్లు ఉండాయి ఏందిరా’ అని అడిగినాడు. వాడు గలగల నవ్వతా ‘పైన వాన పడతా ఉంటే నా తల పైననే కాదు,అందరి తలల పైనా నీళ్లు ఉండాయి’అని ఎగిరి ఎగిరి చెప్పినాడు. అప్పుడు అందరూ ఆకాశం వైపు చూసినారు .చిన్నచిన్నగా వాన చినుకులు పడుతున్నాయి.               అందరూ ఎగిరి గంతులేసుకొంటూ రాములోరి గుడి కాడ చేరినారు. వచ్చిన ఉప్పు పప్పు బియ్యం కాయగూరలు పండ్లు పైసలు అన్నీ రోకలి ముందర ఉడ్డ [కుప్ప] బోసినారు. కప్పలకి టెంకాయ కొట్టి కర్పూర హారతులిచ్చి గోవిందలు చెప్పినారు.

అందరూ గుంపుగా తమకు వచ్చిన పైసల్ని పప్పు ఉప్పు కూరగాయల్ని పండ్లనీ తీసుకొని సుగుణక్క అంగడికి పోయి ‘బదులుకు బదులు… ఇవన్నీ తీసుకొని గెనిసి గెడ్డలు, గేగులు,మొక్క జొన్నలు  ఇవ్వక్కా’ అని అడిగినారు. వారిని ఎగా దిగా చూసిన సుగుణక్క ‘మీరు నేను చెప్పే పొడుపు కథ విప్పితే మీరు అడిగినవన్నీ ఇస్తాను ‘ అంటూ ‘గద్వాల శంకరయ్య,గంతులేసి దొంతిగ కూసుంటాడు’  అని పొడుపు విసిరింది. అందరూ తలలు గోక్కొంటూ అటూ ఇటూ చూడసాగారు.

సుగుణక్కను మంచి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సాంగెన్న అంగడిలో మూలగా కూర్చొని వున్న సుగుణక్క మొగుడిని ‘ఏమన్నా,అప్పుడెప్పుడో ఒళ్ళు నెప్పులని చెబతా వున్నావు. ఇప్పుడు ఎట్లా ఉండా దన్నా’ అని అడిగినాడు. సుగుణక్క మొగుడు వయ్యారంగా ఊగుతూ ‘మందు తాగేటప్పుడు మేలుగా ఉనిందిరా సాంగా, డాక్టరు రాసిచ్చిన మందులు వాడతా  ఉంటే ఎందోగా వుందిరా సాంగా’ అని బదులిచ్చినాడు. పిలకాయలంతా పకపక నవ్వినారు. సుగుణక్క తన మొగుడ్ని ఉరిమి ఉరిమి చూసింది.

ఎక్కడినుంచి వచ్చ్చిందో రామక్కవ్వ కులకతా వచ్చ్చింది. వస్తూ వస్తూ సుగుణక్క పొడు పుకు విడుపుగా పిలకాయలకు సమాధానానికి ఉప్పు అందిస్తున్నట్లుగా ‘నాలుగు కాళ్ళ నటంగి ,తోక లేని తొట్టంగి గంతేసి మీద కూర్చోమ్ది’ అనడంతో… అందరూ గట్టిగా “కప్ప” అని అరచినారు.

xxxxx

వాన ఆగి ఆగి కురుస్తోంది.

రామక్కవ్వసాంగెన్నలతో  పాటు ఆడ పిలకాయలు మగ పిలకాయలు నడుచుకొంటూ వెళ్లి చెరువు గట్టుపైన కూర్చొన్నారు. ఆడ పిలకాయలు గబగబ వెళ్లి చెరువు గట్టున వున్న రేగు చెట్టు కింద రాలి వున్న రేగుకాయలు, అర నెల్లి చెట్టుకున్న అర  నెల్లి కాయలు పావడల్లో పోసుకొచ్చారు. మగ పిలకాయలు కానుగ ఆకుల్ని కోసి బూరలుగా చేసి వూద సాగారు. సాంగెన్న చిన్నగా కప్పలకు కట్టిన దారాలను విప్పినాడు. ‘బతుకు జీవుడా’ అంటూ కప్పలు  అటూ ఇటూ చూడకుండా గబగబా వాన లో తడుస్తూ కాలి లోతుకూడా లేని  చెరువు నీటిలోకి పరుగులు తీసినాయి. అందరూ తప్పట్లు కొట్టినారు.

తెచ్చుకున్న సంచుల్లోని ఆహారం పంచుకోసాగారు. రామక్కవ్వసాంగెన్నలు మధ్యలో కూర్చోగా పిలకాయలంతా వారి చుట్టూ గుండ్రంగా కూర్చొన్నారు. రామక్కవ్వ తన  కొంగు కొనలో మూట  కట్టుకొచ్చిన అంటి [బెంగుళూరు]మామిడి కాయలు,ఉప్పూకారం విప్పింది. మామిడి కాయలను రాళ్లతో కొట్టి ముక్కలు చేసి ఉప్పూకారం చల్లి అందరూ పంచుకున్నారు.

సాంగెన్న మొక్కజొన్న పొత్తులు తింటూ ‘రామక్కా!సెనిక్కాయల డబ్బుతో ఏమి చేస్తావు ?’అని అడిగినాడు.

రామక్కవ్వ ముసిముసిగా నవ్వుతూ ‘అమెరికాలోని నా కొడుక్కి మగ బిడ్డ పుట్టినాడురా,వాళ్ళు దీపావళికి ఇక్కడికి వస్తా ఉండారు. నా మనవడికి ఈ డబ్బుల్తో బంగారు చైను చేయిద్దామని వున్నాను ‘ అని చెప్పింది.సాంగెన్న తన పాచి పండ్లను ఇకిలిస్తూ ‘అమెరికాలో పుట్టి పెరుగుతున్న నీ మనవడికి ఇదొక లెక్కా రామక్కా’ అని  వెటకారంగా అడిగినాడు.

“ఒరేయ్ సాంగా, వాళ్లకు ఎంత ఉంటే నాకేమిరా, నాకు పెట్టాలనిపిస్తా ఉంది.పెడ్తా ఉండా, అయినా మీకు తెలుసునో తెలియదో? అసలు కన్నా వడ్డీ ముద్దు,కొడుకు కన్నా మనవడు ముద్దు. పాల కన్నా పాల మీగడ మరీ  ముద్దు,మిద్దె కన్నా మిద్దె మీద మిద్దె మరీ మరీ  ముద్దు’ అని చెప్పింది. పిలకాయలంతా పడీ పడీ నవ్వుతూ రామక్కవ్వ నోటిలో కువైటు ఖర్జురాలు దూర్చినారు. సాంగెన్న ఎగిరెగిరి గంతులేసినాడు.

వాన జోరు ఎక్కువైయ్యింది. చెరువులోకి నీళ్లు కొంచెం కొంచెంగా వచ్చి చేరుతున్నాయి. అందరూ కలిసి నిలబడి చిందులేయసాగారు. చెరువులోని కప్పలు వీరిని విచిత్రంగా చూస్తూ బెకబెకా అరుస్తున్నాయి..

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *