April 20, 2024

34. కలహం

రచన: శాంతి ప్రభాకర్

 

కొర్తి బాంక్‌ నుండి వచ్చే సమయమైంది. చంప లేత మామిడి చిగురు రంగు చీర, కాటన్‌ది, దానిపైన నీలిరంగు జాకెట్టు వేసుకొంది. ఆమెది సహజమైన సౌందర్యం. పాశ్చాత్య వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమెకు తెలుగువారి కట్టు బొట్టులంటే ప్రాణం. పొడవైన నల్లని కురులతో ఆమె కదిలినప్పుడల్లా కూచిపూడి నాట్యం చేసే నాలుగున్నర అడుగుల పొడవుగా, ఒత్తుగా ఉండే జడ ఆమె సొంతం. ఆ జడకు మంజీరాలా అన్నట్లు వ్రేలాడే జడగంటలు కనువిందు చేస్తుంటే, వాటి కింకిణీ రాగాలు వినేవారి చెవులకు వినువిందు చేస్తూ ఉంటాయి. ఇంక ఆమె అలంకరించుకునే పాపిడిపిందె, చెంపస్వరాలు, బుట్టలోలకులు అప్పుడే వికసిస్తున్న ఎర్ర కలువ మొగ్గ వంటి ఆమె బుగ్గపై జీరాడుతూ, పొదిగిన రాళ్ళనుండి సప్తవర్ణ కాంతుల మెరుపులు వెదజల్లుతున్నాయి. తమ ఇంటి ముందర ఉన్న చిన్న ఆవరణలోని పూదోటలో వాలు కుర్చీలో కూర్చుని కొర్తి రాకకోసం ఎదురుచూస్తూ బాపిరాజుగారి ‘కోణంగి’నవల తిరగేస్తోంది చంప, తన కాంచన మేఖలను సవరించుకుంటూ.

కొర్తి, చంప యువ దంపతులే కాదు, నవ దంపతులు కూడా. వాళ్ళ పెళ్ళై ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు. కొర్తి అహమ్మదాబాద్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో ఏం.బి.ఏ. చదివాడు. గ్లోబల్ స్టేచర్‌ ఉన్న పెద్ద బ్యాంకులో మెరిట్‌ మీద డైరెక్టుగా ఆఫీసరుగా సెలక్ట్‌ అయ్యాడు. ముంబాయిలో బాంక్‌ ఫారెన్‌ ఎక్సేంజ్‌ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్‌ అయి ముంబైలో స్టాఫ్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. చంపతో రెండు, మూడు నెలల్లో ఫారెన్‌ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. చంపతో కలిసే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ‘‘చంపా నిన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేను. అది నా పెద్ద బహీనత’’ అంటాడు కొర్తి పెద్దగా నవ్వుతూ. ‘‘ఇంక ఆపు బడాయి కొర్తీ, నీ రావణాసురుడి నవ్వు కూడా. మన పెళ్ళి అయ్యి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. నా ఇష్టాఇష్టాలు కూడా నీకు పూర్తిగా తెలియలేదు. గొప్ప కబుర్లు చెప్పకు’’ అంటుంది చంప సిగ్గుతో ఎర్రబారిన ముఖాన్ని రెండు చేతులతో దాచుకొంటూ. ‘‘చంపా… మనది జన్మజన్మల బంధం. నేను రావణాసురుడినైతే నీవు మండోదరివి. గుర్తుంచుకో. వాళ్ళది పవిత్రబంధం…’’ కొర్తి పెదవులపై తన కోమలమైన కుడిచేయి నుంచింది చంప, ఇక మాటలు చాలు అన్నట్లు. ఈ ఘటన జరిగి నెళ్ళాళ్ళు దాటింది. ఈరోజు కొర్తి తన మిత్రులను డిన్నర్‌కు ఆహ్వానించాడు. వాళ్ళు సతీ సమేతులై వస్తారు. డిన్నర్‌ అయిటమ్స్‌ సెలక్షన్‌, ప్రిపరేషన్‌, సర్వింగ్‌ బాధ్యతలన్నీ చంపకే వదిలేసాడు కొర్తి. డ్రాయింగ్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌ డెకరేషన్‌తో సహా.

స్నేహితులు ‘ఆడి’కారు దిగిన వెంటనే కొర్తి, చంప వాళ్ళని ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకువెళ్ళారు. అతిథులు డ్రాయింగ్‌ రూమ్‌ చూసి చాలా కళాత్మకంగా ఉందని పొగడ్తతో ముంచెత్తి వేసారు. చంప, రమణి, రాధ – వంటింట్లోకి వెళ్ళారు. రమణి భర్త రాఘవ, రాధ భర్త కృష్ణ. ఇద్దరితో కబుర్లతో పడ్డాడు కొర్తి. టేబుల్‌ మీద ఉన్న ‘కోణంగి’నవల చూసి కృష్ణ దానిని చేతుల్లోకి తీసుకున్నాడు. రెండు, మూడు పేజీలు తిరగేసి ‘‘కొర్తీ! ఈ పాతచింతకాయ పచ్చడిలాంటి సాహిత్యం ఏం చదువుతావోయ్‌, నీ రీడింగ్ టేస్ట్‌ మారాలి, అంతా మోడరన్‌గా ఉండాలి’’ అన్నాడు పుస్తకాన్ని బల్లమీద విసురుతూ. కొర్తి మొహం ఒక్కసారి చిన్నబోయింది. వెంటనే చంప డ్రాయింగ్‌ రూమ్‌లోకి వచ్చి ‘‘అన్నగారూ… బాపిరాజుగారి సాహితీ విలువలు ఏ రచయిత ప్రదర్శింపగలడు? ఆయన కలం, కుంచె రెండూ అద్వితీయం, అజరామరం. అయినా పాత కొత్త మేలు కలయిక మనకు సంపూర్ణత్వాన్ని ఇస్తుందని మీకు నేను చెప్పాలా?’’ చిన్న చురక అంటించింది. కృష్ణ మొహం తిప్పుకున్నాడు ఆమె సమాధానంతో. కొర్తి ముఖ కవళికలు ఏమీ మారలేదు.

భోజనాల సమయం, మళ్ళీ వాతావరణం సందడి, సంతోషాలతో నిండిపోయింది. గుత్తివంకాయ కూర, గోంగూర పచ్చడి, కొబ్బరి పచ్చడి, హైలైట్స్‌. అయితే కందిపొడి రుచే అందరినీ కట్టివేసింది. “కందిపొడి చాలా బావుంది. కందులు తగినంతగా వేయించి పొడిచేసినట్లున్నారు” అంది రమణి. “మరీ మెత్తగా, మరీ గరకుగా కాకుండా చాలా చక్కగా మిక్సీ పట్టారు. పొడి చూడ ముచ్చటగా ఉంది” అంది కందిపొడి వేడి అన్నంలో కుపుకొంటూ. “లేదు రమణీ, మిక్సీలో పట్టలేదు. చిన్న రోలులో దంచాను. అందుకే పొడి చక్కగా వచ్చింది” చంప నవ్వుతూ చెప్పింది. “ఏం మిక్సీ పనిచేయలేదా చంపా?” అడిగింది రాధ. “మిక్సీకేం. భేషుగ్గా పనిచేస్తోంది. కాని కొన్ని వంటలూ, పచ్చళ్ళూ, పొడులూ మన సాంప్రదాయం ప్రకారం చేస్తే ఆ రుచీ, సువాసనా వేరు కదా! నేను నెయ్యి కూడా ఇంట్లోనే కాస్తాను. పాల్లోంచి వెన్నతీసి, అల్లాగే వక్కపొడి కూడా నేనే చేస్తా” చంప రాధకు నెయ్యి గిన్నె అందించింది. “మీ ఆవిడవన్నీ పాత పద్ధతుల్లా ఉన్నట్లున్నాయి కొర్తీ” అన్నాడు రాఘవ నవ్వుతూ. వాతావరణంలో సౌహాదృత లోపించింది. అందరూ భోజనం పూర్తి చేసారు. నేతిలో వేయించిన కర్పూర వాసనలు వెదజల్లుతున్న వక్కపొడిని ఆస్వాదిస్తూ డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చున్నారు పిచ్చాపాటీ చర్చిస్తూ.

“కొర్తీ ఇంక మేం వెళతాం. పది దాటుతోంది” అన్నాడు రాఘవ లేస్తూ. మిత్రులందరూ బయటకు వచ్చారు. చంప, కొర్తీ వాళ్ళను అనుసరించారు. అతిథులు కారెక్కారు.

గేరుమారుస్తూ “చంప వేసుకున్న డ్రెస్‌ చూసావా రమణీ. అందులోనే తెలుస్తోంది ఆమె ఒట్టి పాత చింతకాయ పచ్చడి అని” మెల్లగా పలికానని అనుకొంటూ గట్టిగా అన్నాడు రాఘవ. మిగిలిన వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వారు. గేట్‌ వేస్తున్న కొర్తీకి వాళ్ళ మాటలు, నవ్వులు వినిపించనే వినిపించాయి.

చంపను నిద్రపోనివ్వకుండా రోజూ వసపిట్టలా వాగే కొర్తి ఆ రాత్రి మౌన యోగీశ్వరుడైపోయాడు. ఉదయం ఆరు గంటకు లేచింది చంప. రాత్రంతా నిద్రలేని ఆమె కళ్ళు ఎర్రబారి వున్నాయి. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేసి తల ఆరబెట్టుకుంటూ కాఫీ ప్రయత్నంలో పడింది. చంప అందించిన కాఫీ గ్లాసు తీసుకుని “నీకు ముందరే చెప్పాను కదా! మోడ్రన్‌గా ఉండమని. వాళ్ళు నిన్ను అమ్మోరు అని పిలిస్తే నాకు ఎంత చిన్నతనమైందో తెలుసా! పైగా రీడింగ్ టేబుల్‌ మీద ఆ నవలొకటి” రుసరుసలాడాడు కొర్తి.

మధ్యాహ్నం పన్నెండు దాటింది. రోజూ వచ్చినట్లుగానే రంగమ్మ వచ్చింది. “చంపమ్మా.. అయ్యగారి టిపినీ రెడియేనా?” అంటూ. “ఈ రోజు అయ్యగారి కేరియర్‌ శుభ్రం చేయలేదు రంగమ్మా. అంచేత కేరియర్‌ మారింది” చంప కేరియర్‌ రంగమ్మ చేతికి ఇచ్చింది. “రేత్రి నిద్రరోలేదేంటీ. కళ్ళు రెండూ ఎర్రగున్నాయ్‌ చంపమ్మా” అంటూ రంగమ్మ మాటలో చంప కన్నుల నుండి నీళ్ళు జలజలారాలాయి. రంగమ్మ ఆశ్చర్యపోయింది. “అబ్బాయిగారికి కోపం వచ్చిందేంటి? బాధపడకమ్మా. మాపటేలకి అంతా సద్దుకుంటుంది. మా ఇంటోడు కూడా ఇల్లాగే కస్సుబుస్సు లాడతాడు అప్పుడప్పుడు. ఆ యవ్వ చెప్పేది సంసారంలో తంపతీ కలహం అప్పుడప్పుడు తప్పదని” అంటున్న రంగమ్మకు బుట్ట ఎత్తి సాయం చేసింది చంప.

రంగమ్మ వెళ్ళిపోయిన తరువాత చంప బెడ్‌రూంలోకి వెళ్ళిపోయింది. కాట్‌ మీద పడుకొని ఆలోచనలలో కొట్టుకొని పోయింది. “ఎంత ప్రేమగా చూసుకునేవాడు కొర్తి! అదంతా నటనేనా? కొత్త కుండలో నీరు తనకి ఇష్టమని కొత్త కుండను స్వయంగా తనే తెచ్చాడు. రోజూ తానే కుండను శుభ్రం చేసి మంచినీళ్ళు నింపుతాడు. కొత్త కుండలో నీరు తీయన, కోరిన పెళ్ళామె తీయన అని పాట పాడుతూ నీళ్ళ గ్లాసు అందిస్తాడు. తనకిష్టమని మల్లీశ్వరి, దాగుడుమూతలు, దేవదాసు, బండరాముడు – ఇంకా ఎన్నో పాత సినిమాలు చూపించాడు. అటువంటిది ఈరోజు ఇంత కోపం తెచ్చుకున్నాడేంటి? ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చిందని అందరికీ గొప్పగా తనను గురించి చెప్పిన కొర్తి తనపై అకారణంగా కలహించారు. తానేమైనా తక్కువతిందా’’ చివాలున మంచం మీద నుంచి లేచింది చంప.

మధ్యాహ్నం రెండు గంటలు కావొస్తోంది. అకస్మాత్తుగా కొర్తి బాస్‌ రమాకాంత్‌ ఆఫీసు డైనింగ్‌ హాల్‌కి వచ్చాడు. “సారీ కొర్తి, నిన్న మీ ఇంటికి డిన్నర్‌కి రాలేకపోయాను. నా మిసెస్‌కి కొద్దిగా జ్వరం వచ్చింది అందుచేత. ఏమీ అనుకోకు” అంటూ. కొర్తి “పరవాలేదు సార్‌. ఇప్పుడు మేడమ్‌ గారికి ఎల్లావుంది?” అడిగాడు బాస్‌ని. “సీజనల్‌ ఫీవర్‌, సాయంకాలానికి తగ్గిపోతుంది” రమాకాంత్‌ అన్నాడు. “మరి మీ లంచ్‌?” రాఘవ అడిగాడు. “ఈ రోజుకి ఉపవాసమే” నవ్వాడు రమాకాంత్‌. “సారీ సర్‌. మా లంచ్‌ అయిపోయింది, లేకపోతే మీతో షేర్‌ చేసుకుందుం” అన్నాడు కృష్ణ.

ఏదో అన్యమనస్కంగా ఉన్న కొర్తి “సార్‌ నేనింకా భోజనం చేయడం మొదలు పెట్టలేదు. మనం ఇద్దరం కలిసి లంచ్‌ చేద్దాం. అసలు ఎందుకో ఈ రోజు ఇంటినుండి డబుల్‌ కేరియర్‌ వచ్చింది” అంటూ కేరియర్‌ తెరచి ప్లేటులో వడ్డించడం ప్రారంభించాడు కొర్తి.

“నా అదృష్టం కొర్తి. నిన్న డిన్నర్‌ మిస్‌ అయినా ఈ రోజు వండ్రఫుల్‌ లంచ్‌ కొట్టేసా. నాకు ఇష్టమైన చింతచిగురు పప్పు, బీరకాయ కూర, పండుమిరప పచ్చడి, మన ముక్కల పులుసు, గడ్డ పెరుగు ఇంతకన్నా ఏమి కావాలి? చంపను చూడాలోయ్‌. అమ్మాయికి థ్యాంక్స్‌ చెప్పాలి స్వయంగా అప్పుడే నాకు తృప్తి” అన్నాడు తృప్తిగా భోజనం చేసి రమాకాంత్‌.

భోజనం చేసి రమాకాంత్‌ రాఘవ మొబైల్‌లో ఫోటోలు చూడడం ప్రారంభించాడు. “నిన్నటి ఈవినింగ్‌ మీట్‌ ఫోటోలు ఏవి” అంటూ. “ఫెంటాస్టిక్‌ కొర్తి. చంప ట్రెడిషనల్‌ వేర్‌లో అద్భుతంగా ఉంది. ఆ కట్టూ, బొట్టూ అన్నీ… నీ అదృష్టం. చంపను ఇంకా పొగిడితే నా దిష్టే తుగులుతుంది. నాకు డాటర్స్‌ లేరు. నీకు తెలుసుగా మిస్టర్‌ రాఘవ్‌. చంప ఈ క్షణం నుంచే నా కూతురు” రమాకాంత్‌ కొర్తి భుజం పట్టుకొని ఊపేసాడు.

సాయంకాలం నాలుగు గంటలు దాటింది. ఆకాశం నుండి కుంభవృష్టి. “ఈ ముంబాయిలో ఎప్పుడు వర్షం వస్తుందో ఆ భగవంతుడు కూడా చెప్పలేడు. నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి హైద్రాబాద్‌ ఫ్లైట్‌ కాచ్‌ చేయ్యాలి. ఈ రోజు డ్రైవర్‌ కూడా లేడు. కొర్తి నన్ను ఎయిర్‌ పోర్ట్‌లో డ్రాప్‌ చేసి నువ్వు నా వెహికల్‌లో ఇంటికి వెళ్ళు. నేను తిరిగి వచ్చేటప్పటికి మూడు, నాలుగు రోజులు పడుతుంది. అంతవరకు నా వెహికల్‌ నీ దగ్గరే ఉంచు. ఈ నాలుగు రోజులు సెలవు పెట్టి నువ్వు, చంప ముంబాయి అంతా చూడండి. నీకు లీవ్‌ గ్రాంట్‌ చేసాను. సరేనా” నవ్వుతూ అన్నాడు రమాకాంత్‌. రమాకాంత్‌ చంపపై చూపిస్తున్న అభిమానానికి, కృష్ణ, రాఘవ్ ఇద్దరూ అవాక్కయిపోయారు.

కొర్తి కార్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు. ఏకదారగా కురుస్తున్న వర్షంలా అతని ఆలోచనలు కూడా ఆగడం లేదు. “అనవసరంగా స్నేహితులు చేసిన కామెంట్స్‌కు చంపను కోపడ్డాను. ఆమె సుకుమారమైన మనసును నొప్పించాను. జెలసీ వలన వాళ్ళు ఆ కామెంట్స్‌ చేసారని నా బుర్రకు తట్టలేదు. మరి ఈ రోజు రమాకాంత్‌ గారి అభినందనను నేను ఎలా తీసుకోవాలి? ఇంటికి వెళ్ళిన వెంటనే చంపను క్షమించమని అడగాలి. మొబైల్‌లో మాట్లాడదామంటే స్విచ్‌ ఆఫ్‌ చేసివుంది. చంప నిద్రపోతోందో ఏమో?” తనలోతానే మాట్లాడుకున్నాడు కొర్తి. కొర్తికి బాల్యం నుండి తనకు చంపకు మధ్య పూదోటలా పెరిగిన ప్రేమ, స్నేహం గుర్తుకు వస్తున్నాయి. అనేకమైన అనుభూతులు, మరువలేనివి. అందులో ఒకటి తమ చిన్నప్పుడు చంప పెట్టుకున్న చెంపస్వరాలను తాను సర్దుతూ ఉండడం, ఆ ఆరవ ఏటనే చంపను ఆరాధించడం. టీచర్‌ క్లాసులో “కొర్తి, చంప చెంపస్వరాలు తరువాత సర్దుదువుగాని ముందుర అ, ఆ లు వ్రాయి అని నవ్వుతూ అనడం గుర్తుకువచ్చి తనలోతానే నవ్వుకున్నాడు.

వెయిటర్స్‌ లాంజ్ లోకి వెళ్ళడంతోటే కొర్తి ఆశ్చర్యపోయాడు. చిన్న బేగ్‌తో చైర్‌లో కూర్చున్న చంప దగ్గరకు పరుగున వెళ్ళి “చంపా ఇదేమిటి నువ్విక్కడ” అంటూ ఆమె భుజాలను గట్టిగా ఊపేసాడు. చంప ఏమీ మాట్లాడలేదు. ఆమె కన్నుల నుండి అశ్రుధారలు. “మావూరు…” ఏదో చెప్పాలని ప్రయత్నించింది చంప. కొర్తి “చాల్లే. గొప్పపని చేద్దామని బయల్దేరావు. నేను రమాకాంత్‌ గారితో రాకపోతే. అమ్మో నా గుండె ఆగిపోదా. ఆఫీసు నుండి ఇంటికి డైరెక్టుగా వెళ్ళితే నువ్వు కనపడకపోతే నా గుండె ఆగి…” చంప కొర్తిని ఇంక ఏమీ మాట్లాడనివ్వలేదు. కోమలమైన తన కుడిచేతి చూపుడు వ్రేలితో అతని పెదవులు మూసింది. ఇదంతా చూస్తున్న రమాకాంత్‌ ఏదో అర్థమైనట్లు “దంపతీ కలహం” అన్నమాట. ఆ కృష్ణుడికీ తప్పలేదు ఈ పాట్లు” అంటూ ‘ఇండి గో’ కేబిన్‌ వైపుదారి తీసాడు. “విష్‌ యూ బోత్‌ నైస్‌ టైమ్‌” అని గట్టిగా నవ్వాడు.

“చూడు వర్షంలో తడిసి ముద్ద అయ్యావు” కారులో ఏ.సి. ఆఫ్‌ చేస్తూ అన్నాడు కొర్తి. కుడిచేత్తో స్టీరింగు కంట్రోలు చేస్తూ, ఎడమచేతితో చంపను దగ్గరకు తీసుకున్నాడు. “నీ జుట్టుపైన తెల్లని వర్షం నీటి బిందువులు చెంపస్వరాలులా మెరుస్తున్నాయి చంపా” ఆరాధనగా అన్నాడు కొర్తి. “ఆ చాల్లే ఇంక చెంపస్వరాల ఆరాధన, మనది జన్మజన్మల బంధం అంటావు. అదేమీ నాకు తెలియదు. కాని మనది వీధిబడి బంధం, చెంప స్వరాల బంధం… మన టీచర్‌ నర్సరీ సత్యభామ గారి మాటల్లో” చంప కొర్తికి దగ్గరగా జరిగింది.

తెల్లవారింది. ఉదయం ఏడు గంటలకే వచ్చిన రంగమ్మను చూసి ఆశ్చర్యపోయింది చంప. చంప, కొర్తి ఒకే సోఫాలో కూర్చుని కాఫీ త్రాగుతున్నారు. “అమ్మయ్య. తంపతీ కలహం సినిమా వందరోజులు ఆడినట్టేగా” అంది రంగమ్మ నవ్వుతూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *