March 29, 2024

36. దృష్టి

రచన: ఎమ్. రమేశ్ కుమార్

                                                                                                             

ఆమె మహారాణి..! ఏ రాజ్యానికీ కాదు.. అందంలో మహారాణి !  ఆమెను చూసిన వాడెవడూ దివి నుంచి దిగివచ్చిన సుందరి అంటే ఈమేనేమో… అనుకోకుండా ఉండలేడు. అలాంటి అద్భుత సౌందర్యం ఆమెది. పాల మీగడ మృదుత్వాన్ని సంతరించుకున్న శరీరం, తేనెరంగు కళ్ళు, చెంపల్లో దాగున్న మందారాలు, చీకటిని నింపుకున్న శిరోజాలు.. ఇవన్నీ ఆమె సొంతం. ఉన్నత స్థాయిలో వున్న కుటుంబం.. గారాబంగా చూసుకునే తల్లిదండ్రులు.. దేనికీ లోటు లేదు.

చదువుకునే వయసులోనే ఎన్నో ప్రేమలేఖలు.. పెళ్ళి ప్రతిపాదనలు.. ఆమె చుట్టూ గింగిరాలు తిరిగాయి. గిరికీలు కొట్టాయి. దేనికీ ఆమె ప్రతిస్పందించలేదు.

అమ్మాయి చదువు పూర్తయింది.. ఇంక పెళ్ళి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు తండ్రి.

మంచి సంబంధమే వచ్చింది. వరుడు అమెరికాలో ఇంజనీర్.. వీళ్ళకి తగ్గ స్థాయి గల కుటుంబం.. అబ్బాయి అందగాడు.. అన్నీ బావున్నాయి. ఆమెని చూసి వరుడికి మూర్ఛ వచ్చినంత పనైంది. ఇంత అందమైన అమ్మాయి

నా భార్య కాకపోతే నా జీవితమే వృధా అనుకున్నాడు. కట్నం లేదు.. లాంఛనాలక్కరలేదు.. అమ్మాయిని ఇస్తే చాలన్నాడు. ఇంక పెళ్ళి కుదిరిపోయినట్టే అనుకున్నారు తల్లిదండ్రులు. నిశ్చయ తాంబూలాలిచ్చేసుకుందాం.. అని సిద్ధమైపోయారు. అమ్మాయిని ఒక్కమాట అడగాలి కదా.. అయినా అమ్మాయి కాదనడానికేముంది..? ఏదైనా లోటుంటేనే కదా నచ్చకపోవడానికి..!

అమ్మాయిని అడిగారు. మరోమాట లేకుండా వద్దనేసింది.. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు నచ్చలేదని అడిగాడు. వివరాలు వొద్దంది. నేను సంతోషంగా వుండాలంటే ఈ సంబంధం చేసుకోలేనని చెప్పేసింది. ఎవరికీ ఏమీ పాలుపోలేదు.

“నాకర్థమైంది. అమ్మాయి మిమ్మల్ని వదిలి వుండాల్సొస్తుందని బహుశా వొద్దని చెప్పేస్తోంది. అలాంటి ఇబ్బందేమీ అక్కర్లేదు. నేను అక్కడ ఉద్యోగం వదిలేసి ఇండియాలోనే మరో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోగలను. కావాలంటే నేను ఇండియా వచ్చేశాకే పెళ్ళి పెట్టుకుందాం..” అన్నాడు వరుడు. పెళ్ళికూతురి తండ్రికి కూడా ఈ విషయం నిజమేననిపించింది. వరుడి నిర్ణయాన్ని ఆమెకు తెలియజేసి ‘ఇప్పుడింక పెళ్ళికి అభ్యంతరం లేదు కదా తల్లీ..?’ అనడిగాడు.

ఆమె మళ్ళీ మొదటి మాటకే వచ్చింది. ‘ఈ సంబంధం ఇష్టం లేదు.. అంతే..! నేను సుఖంగా వుండాలంటే ఇంక ఈ సంబంధం జోలికెళ్ళకండి..’ అనేసింది.

సరే.. ఇంక వొదిలేశారు. తర్వాత మరో సంబంధం వచ్చింది. వరుడు అదే సిటీలో ఓ పెద్ద కంపెనీలో ఉన్నతమైన పోస్టులో వున్నాడు. కలిగినవాళ్ళ కుటుంబం. దేనికీ లోటులేదు. అమ్మాయిని చూడగానే అతడూ అదేమాటన్నాడు. కట్నం, గిట్నం ఏమీ అక్కర్లేదు.. ఈ అమ్మాయిని నేను పెళ్ళిచేసుకుంటాను.. అన్నాడు. కావాలంటే ఎదురు కట్నమిస్తాం. పెళ్ళి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం.. ఇదీ పెళ్ళికొడుకు తరపువాళ్ళ మాట. ఇంకేం ఇబ్బంది లేదు. కుటుంబం గురించి కూడా కనుక్కున్నారు. మంచి కుటుంబం.. సంప్రదాయాలకు విలువిచ్చే మనుషులు అని తెలిసింది. ఈసారి వెంటనే పెళ్ళికూతుర్ని అడిగాడు తండ్రి.

మళ్ళీ అదేమాట. ‘ఇష్టం లేదు.. ఈ సంబంధం వద్దు..’

“ఈ సంబంధం ఇష్టం లేదా..? అసలు పెళ్ళి చేసుకోవడమే ఇష్టం లేదా..?” అసహనంగా అడిగాడు తండ్రి.

“లేదు.. పెళ్ళి చేసుకుంటాను.. ఈ సంబంధం ఇష్టం లేదు.. అంతే..” చెప్పింది అమ్మాయి.

“ఎందుకిష్టం లేదు..? కారణం చెప్పు..?” పట్టుపట్టాడు తండ్రి.

ముందు చెప్పిందే తిరిగి చెప్పింది. “కారణాలు అడగొద్దు.. నేను సుఖంగా వుండాలనుకొంటే ఈ సంబంధం మాట మరిచిపొండి..”

తండ్రికేం చెయ్యాలో పాలుపోవట్లేదు. సరే.. అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకొని మరో సంబంధం చూశాడు. ఇదీ కలిగినవాళ్ళ కుటుంబమే.. ఈ వరుడు కూడా కట్నంతో సంబంధం లేదు.. అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకడమే నా అదృష్టం అన్నట్టు భావించాడు.  ఏం లాభం..? మళ్ళీ ఆమె అదే సమాధానం చెప్పింది. “ఈ సంబంధం నాకొద్దు. అంతే..!”

తండ్రి విసిగిపోయాడు. నువ్వు పెళ్ళి చేసుకోకపోతే ఛస్తానన్నాడు. ‘నేను పెళ్ళి చేసుకోనని ఎప్పుడు చెప్పాను..? సరైన సంబంధం వస్తే తప్పకుండా చేసుకుంటాను’ అంది ఆమె. తండ్రికి పిచ్చెక్కినంత పనైంది. తర్వాత కూడా సంబంధాలు వచ్చాయి. అన్నీ మంచి సంబంధాలే.. గొప్ప సంబందాలే.. ఏవీ ఆమెకి నచ్చలేదు. దేనికీ సుముఖత తెలపలేదు. కాలం గడుస్తూనే వుంది.

*                    *                   *                    *

ఓ ఆదివారం ఆమె వెళ్ళేటప్పటికే అతడక్కడున్నాడు. ఒక్కోసారి అలా ఇద్దరూ ఒకేసారి రావడం తటస్థిస్తుంది. అదొక అనాధాశ్రమం. ఆమె అప్పుడప్పుడూ అక్కడకు వెళుతుంది.

అనాధలంటే ఆమెకి ప్రేమ. ప్రతి పుట్టినరోజుకీ అక్కడివారికి బట్టలు, స్వీట్లు పంచడం ఆమె అలవాటు. అంతేకాదు.. ఆ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకొని అప్పుడప్పుడూ వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ మంచిచెడ్డలు కనుక్కుంటూ తను చెయ్యగలిగిన సాయం చెయ్యడం ఆమె నైజం.

అతడో పాఠశాలలో టీచర్. కాకపోతే పుట్టు గుడ్డివాడు. తన వైకల్యం సంగతి మరిచిపోయి అనాధలైన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి అవసరాలు చూస్తూ.. గొంతు ఆధారంగా వారిని గుర్తు పట్టి పేర్లతో పిలుస్తూ

ఆ ఆశ్రమంలో అందరికీ ప్రియమైన వ్యక్తిగా గుర్తింపబడ్డాడు

“బాగున్నారా..?” అతడిని పలకరించింది ఆమె. ఆ గొంతు అతడికి పరిచయమే.!

సమాధానంగా నవ్వాడు.. “మీరెలా వున్నారు..?” అడిగాడు.

ఆమె కూడా నవ్వి “అసలు ఈరోజు సాయంత్రం వద్దామనుకున్నాను. ఎందుకనో మళ్ళీ ఉదయాన్నే బైల్దేరాను. పోన్లెండి.. మిమ్మల్ని కలవాలని వున్నట్టుంది..” అంది.

“పోనీ ప్రతి ఆదివారం ఉదయమే రండి.. నేను కూడా ఉదయమే వస్తాను.. మీ అందమైన గొంతు వినే భాగ్యం కలుగుతుంది కదా అని..” అతడు సగంలో ఆపేసి ఏవైనా తప్పు మాట్లాడానా..? అన్నట్టు మొహం పెట్టాడు.

ఆమె మళ్ళీ నవ్వేసి “దానికేం భాగ్యం.. అలాగే చేద్దాం..” అంది.

అప్పణ్ణుంచి ప్రతివారం వాళ్ళు కలుసుకుంటూనే వున్నారు

సాథారణమైన కుటుంబానికి చెందిన అతడి వ్యక్తిత్వం అసాధారణమని ఆమె త్వరలోనే గ్రహించింది. అతడితో పరిచయం ఆమెలో కొత్త ఆశలకు పునాదులు వేసింది.  తనంతతానుగా అతడి జీవితంలోకి వస్తానని అడిగింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. తన వైకల్యాన్ని గుర్తుచేశాడు. ఆమెకి తగనేమో అన్నాడు. ఆమె పట్టు వీడలేదు. చివరికి అతడు అంగీకరించాడు. ఆమె ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆమె మంకుపట్టు కారణంగా ఆ పెళ్ళి జరపక తప్పలేదు.

ఆ విధంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు.

*                  *                   *                   *

 

ఆ గది ఒక శృంగార సామ్రాజ్యం. అందులో అతడు మన్మధుడు.. ఆమె రతీదేవి ! కానీ ఒకటే లోటు ఆమె అద్భుత సౌందర్యాన్ని కళ్ళారా చూసే వీలు లేని గ్రుడ్డివాడు అతడు!

ఒక విషయంలో లోటున్న వారికి మిగతా విషయాల్లో శక్తి సామర్థ్యాలు ఎక్కువ వుంటాయంటారు. అతడు కూడా అంతే..!

“నిన్ను నా కళ్ళతో చూడలేను.. కానీ చేతివేళ్ళతో చూడగలను..” అన్నాడు. ఆమె నవ్వింది.

ప్రణయంలో ఒకర్నొకరు అల్లుకుపోయే వేళ.. మొదట ఆమె ముఖ భాగాన్ని తన చురుకైన చేతి వేళ్ళతో స్పర్శించాడు అతడు. ఆ ముక్కు.. అది సంపెంగకు దీటైనదే. పెదాలు.. తమలపాకు సున్నితత్వాన్ని సంతరించుకున్న ఆ పెదాలు అందంగా వొంపు తిరిగాయి. ఇక బుగ్గలు పాల మీగడ మృదుత్వాన్ని అరువు తెచ్చుకున్నాయి. మెడ శంఖానికి సరిసాటైనదే..!  పొడవైన కురులు అతడి మొహాన్ని కప్పేసినప్పుడు వచ్చిన సుగంధంలో అతడు ఉక్కిరిబిక్కిరయ్యాడు.

ఒక అద్భుతమైన శిల్పానికున్న అందాలు ఆమెలో అతడి చేతివేళ్ళు గుర్తించకపోలేదు. స్పర్శతోనే ఆమె అందాలన్నింటినీ కొలవగలిగిన అతడికి స్పష్టంగా అర్థమైంది.. ఆమె ఒక అపురూపమైన అద్భుత సౌందర్యరాశి !

అతడంటే సంపూర్ణమైన ఇష్టం, ప్రేమ వుంది ఆమెకి. అందుకే అతడి వెచ్చటి వూపిరికి ఆమె వేణువై స్వరాలు పలికింది. ఇద్దరిలో ఆవేశం తొలకరి చినుకైతే ఆ చినుకు వానై.. వాన వర్షమై.. వర్షం వరదగా మారి పరవళ్ళు తొక్కింది.  ఒకరి కౌగిలిలో మరొకరు సేదదీరుతున్న వేళ అతడన్నాడు.

 

 

“నీ అందం గురించి మా పెద్దలు నాతో చెప్తూ అదృష్టవంతుణ్ణని పొగిడితే నన్ను సంతృప్తి పరచడానికి అంటున్నారేమో అనుకున్నాను తప్ప నిజమని భావించలేదు. గుడ్డివాణ్ణైన నాకు ఎలాగూ నిన్ను చూసే భాగ్యం లేదు కాబట్టి ఆ విధంగా చెప్పేస్తున్నారేమో అనుకునేవాణ్ణి. నువ్వెలా వున్నా నాకు పట్టింపు లేదు కాబట్టి ఆ విషయం గురించి నేను పట్టించుకోనేలేదు. కానీ ఈరోజు.. ఈ క్షణం తర్వాత అర్థమైంది.. వాళ్ళు చెప్పింది అక్షరసత్యమని…! నన్ను మభ్యపెట్టడానికో.. మరి దేనికో వాళ్ళా మాట అనలేదనీ నిజాన్ని చెప్పారనీ ఇప్పుడు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను.. కానీ ఒకటే సందేహం.. నువ్వు కావాలనుకుంటే నాకంటే వున్నతస్థితిలో వున్నవాళ్ళూ.. ఏ లోపమూ లేనివాళ్ళూ ఎంతోమంది దొరుకుతారు.. నాకు తెలిసి నేను గొప్ప అందగాణ్ణి కూడా కాదు. మరి నన్నే ఎందుకు కోరుకున్నావో అర్థం కాకుండా వుంది..”

“ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే తెలుసుకోవాలా..?” అడిగింది ఆమె.

“అవును.. తెలుసుకోకపోతే నా మనసు మనసులో వుండదు..” అన్నాడతడు.

“సరే.. ముందు నేనో ప్రశ్న అడుగుతాను.. దానికి సమాధానం చెప్పండి..?”

“ఏమిటది..?”

“అసలు మీరెందుకు నన్ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించారు..?” అడిగింది.

“రెండు కారణాలు.. ఒకటి నా వైకల్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నువ్వు నన్నిష్టపడ్డావు. రెండవది.. అతి ముఖ్యమైనది.. నీ సేవాగుణం.. అనాధ పిల్లలతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడం, వారికోసం సమయం కేటాయించడం, అవసరమైన సాయం చెయ్యడం.. ఇవన్నీ నీలో నేను అమితంగా ఇష్టపడ్డ లక్షణాలు. ఇప్పుడు చెప్పు.. నువ్వు నన్ను కోరుకోవడానికి కారణం ఏమిటి..?”

“మీరు చెప్పిన రెండో కారణమే నావైపు నుంచి కూడా కారణం అవుతుంది. అదెలాగంటే మీరు నన్ను అంగీకరించింది నా అందం చూసి కాదు. ఇలాంటి సౌందర్యం మన సొంతమైతే చాలన్న దుగ్ధతో కాదు. నిజానికి నేనెలా వుంటానన్న విషయాన్ని తెలుసుకోవాలని మీరేనాడూ తహతహలాడలేదు. మీరన్నట్టు అసలా విషయంలో మీకెలాంటి పట్టింపు లేదని నాకు తెలుసు. మీరు కేవలం నా ప్రవర్తన.. స్వభావం నచ్చి అంగీకరించారు. నాక్కావాల్సింది అదే ! నన్ను పెళ్ళి చేసుకుంటానన్నవాళ్ళందరూ నా అందానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం నా అందం చూసే నన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అందం ఎంతకాలం వుంటుంది.,? కాలం చేసే మాయలో అందం మెల్లమెల్లగా నా నుంచి వీడ్కోలు తీసుకొంటుంది. అప్పుడు కూడా వాళ్ళ ప్రేమ అలాగే నిలిచివుంటుందని ఏమిటి నమ్మకం..? అయినా అంతవరకూ అక్కర్లేదు.. పెళ్ళైన కొంతకాలం తర్వాత.. కొత్త మోజు తీరిపోయిన తర్వాత సహజంగానే నా అందం

వాళ్ళకు గొప్పగా కనిపించడం మానేస్తుంది. అప్పుడిక మిగతా విషయాలన్నీ గుర్తుకొస్తాయి. అందుకే అలాంటి వాళ్ళు నాకు వొద్దనుకున్నాను. మీకు నా అందంతో సంబంధం లేదు కనుక ఇక్కడ ఆ సమస్య రాదు. అందం అశాశ్వతం.. కాబట్టి అందంగా వున్నానన్న కారణంతో చేసుకొనేవాళ్ళు నాకు అక్కర్లేదు. ఇక అనాధ పిల్లల పట్ల నాకున్న ప్రేమ, అభిమానం మీలో కూడా వున్నాయి. మీరు నాలో ఇష్టపడ్డ ఆ విషయాన్నే నేను కూడా మీలో ఇష్టపడ్డాను.

 

ఇక మీరనుకుంటున్న మీ వైకల్యం గురించి.. భాహ్య ప్రపంచాన్ని కళ్ళతో చూసి రూపాన్ని బట్టి అంచనా వేసే వాళ్ళలా కాకుండా గుణాన్ని బట్టి అవగాహన చేసుకునే ప్రత్యేక శక్తి మీకు సొంతం. అందుకే దాన్ని నేను వైకల్యంగా భావించటం లేదు.. నిజానికి మీరనుకుంటున్న మీ వైకల్యాన్ని నా విషయంలో ఒక అనుకూలతగా భావించాను. వినడానికి కొంచెం విచిత్రంగా వున్నా అదే నిజం. మీ మనోనేత్రంతో చూసిన నా రూపాన్ని ఎప్పటికీ అదేవిధంగా మదిలో వుంచుకోండి..

ఆ రూపానికి కాలదోషం లేదు.. అదే మీనుంచి నేను కోరుకునేది..” చెప్పింది. అతడేమీ మాట్లాడలేదు. వంగి ఆమె నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు  పెట్టుకున్నాడు. ఆనందంతో కూడిన అతడి సంపూర్ణ అంగీకారం ఆమెకు అర్థం కావడానికి అది చాలు..!

*                *                 *               *

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *