April 20, 2024

4. మల్లీశ్వరి

రచన: తులసి భాను

 

వర్షా ఎప్పుడూ పాటలేనా నీకు..పదా, నీకు షాలిని ని పరిచయం చేస్తాను..తనిప్పుడు సెలెబ్రిటీ తెలుసా.. అని దామిని దాదాపు వర్షని లాక్కెళ్ళుతున్నట్టు తీసుకెళుతోంది ..

అబ్బా ఇదొక్కపాటన్నా విననీ, నా ఇళయరాజ పాటకి, నన్ను దూరం చేయకే రాక్షసి..అని అంటోంది వర్ష..ఇయర్ ఫోన్స్ లో పాట వింటోంది కదా తను కొంచెం గట్టిగా మాట్లాడినట్లు తెలీలేదు వర్షకి..

షాలిని , హర్ష, శరత్, దివ్యా ఒకేసారి, వర్ష వైపు చూసారు ..

వెంటనే అందరూ తనని చూస్తున్నారని పాటని ఆపేసింది వర్ష, ఇయర్ఫోన్స్ తీస్తూ నవ్వింది పలకరింపుగా అందరినీ చూస్తూ..

ఏ ఇళయరాజ పాట మీరు వినేది అడిగాడు హర్ష..ఇదే రాజయోగం పాట చామంతి మూవీ అనేసింది వర్ష..

ఓ,.. మంచిపాట.. మనిషికో స్నేహం పాట నా ఫేవరెట్..అన్నాడు హర్ష..

షాలిని తను వర్ష, వర్షా షాలిని అని ఆందరికీ పరిచయం చేసింది దామిని..అందరూ కబుర్లలో పడ్డాక మళ్ళీ తన పాటల ప్రపంచంలోకి వెళ్ళిపోయింది వర్ష..

హర్ష అప్రయత్నంగానే గమనిస్తున్నాడు వర్షని..ఇంకా పసితనం పోని క్యూట్ మొహం, కళ్ళు మూసుకుని పాటలు వింటూ ఉన్న వర్షని చూస్తే హర్షకు మనసుకి బావుంది..అస్సలు అమ్మాయిలంటేనే చిరాకు అంటాడు హర్ష..పెళ్ళి ప్రేమ అనేవి తనకి అర్ధమే కావు అంటాడు హర్ష..ఈ రోజు వర్షని చూస్తే మాత్రం అభిమానం కలుగుతోంది..

వర్ష తనకిచ్చిన జ్యూస్ గ్లాసుని తీసుకుంది, పాటలు ఆఫ్ చేసింది..

వర్షా మీరు ఏం జాబ్ చేస్తున్నారు అడిగాడు హర్ష వర్ష పక్కన కూర్చుంటూ..

నేను టీచర్ అంది..సిటీలో కాదు, మా అమ్మ ఊరిలో ..ఇప్పుడు ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాను, మరి మీరు అడిగింది..

నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్..అన్నాడు హర్ష..వర్షా మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు,

అమ్మో ఎక్కువ రోజులు ఉంటే నా స్కూల్ పిల్లలు ఊరుకోరు..అసలే నేను చాక్లెట్లు తీసుకెళతానని ఎదురుచూస్తూ ఉంటారు..మీ సిటీవాళ్ళకి ఫారెన్ చాక్లేట్స్ ఎలానో మా ఊరిపిల్లలకి ఈ పట్నం చాక్లెట్స్ అంటే పిచ్చి..అంది తమాషాగా నవ్వుతూ..

హర్ష అపురూపంగా ఆమె మాటలు వింటూ ఆమెనే చూస్తున్నాడు..వర్షా నేను మంచి అబ్బాయినే, నాకు మీ ఫోన్ నంబర్ ఇస్తారా..నేను మీ ఊరికి వస్తాను, వచ్చేముందు మీకు ఫోన్ చేసి వస్తాను..అన్నాడు హర్ష

..ఇస్తాను, మీరు ఎలాంటి అబ్బాయైనా, నాకు కరాటే వచ్చు, పిచ్చివేషాలేస్తే సిటీకి వచ్చి మరీ మీతో ఫైట్ చేస్తా అంది అల్లరిగా నవ్వుతూ వర్ష, తన నంబర్ ఇస్తూ..

హర్ష హాయిగా నవ్వేసాడు..యు ఆర్ టూ క్యూట్ అన్నాడు..మనస్ఫూర్తిగా..

సరే సరే బై చెప్పేసి వెళ్ళిపోయింది వర్ష..మొదటిసారి, ఎప్పుడూ జరగనట్లు తన నుంచి తానే విడిపోతున్నట్లు అనిపించింది హర్షకి, వర్ష దూరం వెళుతున్నకొద్దీ..

వర్ష పిల్లలికి బోర్డు మీదవి రాసుకోమని చెప్పి తాను పుస్తకం చూసుకుంటూ ఉంది..కాసేపటికి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి గేటు వైపు తలెత్తి చూసింది..హర్ష నుంచుని చూస్తూ ఉన్నాడు, వర్ష చూడగానే ఆప్యాయంగా నవ్వాడు..వర్ష లేచి వెళ్ళింది..

హాయ్ హర్షా చెప్పకుండా వచ్చావే..అంది..

మీ అమ్మగారిని పరిచయం చేస్తాను అన్నావుగా అన్నాడు కళ్ళారా వర్షని అపురూపంగా చూసుకుంటూ…

మల్లీశ్వరి తోటపని చేసుకుంటూ ఉంది..మధురమైన పాతపాటలు సన్నగా వచ్చేలా పెట్టుకుంది, కుందేళ్ళు కోళ్ళు పావురాలు తోటలో తిరుగుతూ ఉన్నాయి..తోట మధ్యలో చిద్విలాసంగా నవ్వుతూ ఉన్న కృష్ణయ్య ప్రతిమ ఒకటి పెట్టి ఉంది..తాను బృందావనానికి వచ్చానా అన్నట్టు అనిపించింది హర్షకి..

అమ్మా ఇతనే హర్ష..అని మా అమ్మ మల్లీశ్వరి..అని పరిచయం చేసింది..

దా బాబు అని మట్టిచేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చింది మల్లి..

మొలకలొచ్చిన పెసలు ఉల్లి పచ్చిమిర్చి ఉప్పు కలిపి ఇచ్చారు..ధనియాలు శొంఠి వేసి కాచిన శొంఠి కాఫీ ఇచ్చారు..భలే ఉన్నాయే అనుకున్నాడు హర్ష..

వర్ష మళ్ళీ స్కూలుకి వెళ్ళిపోయింది..మల్లి వంట చేస్తుంటే వంటింట్లోంచీ పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలను చూస్తూ మల్లి మాటలు వింటున్నాడు..వర్షకి నువ్వు నచ్చావు బాబు, మీ అమ్మానాన్న కూడా వచ్చుంటే బావుండేది అడిగింది మల్లి..వారు ప్రస్తుతం యూ ఎస్ ఏ లో ఉన్నారు..వచ్చే వారం వస్తారు, చెప్పాడు హర్ష..

వర్ష కూడా నాలానే ప్రకృతిని, సహజత్వాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది, కాలాన్ని బట్టీ అందరూ ఎలా ఉంటే మనమూ అలా అన్నట్టు కాకుండా తనకు నచ్చినరీతిలోనే ఉంటుంది వర్ష, మరి తన అలవాట్లు నీకు నచ్చుతాయో లేదో అంది సందేహంగా మల్లి..వర్ష ఎలా ఉన్నా నాకు ప్రాణం అత్తమ్మా అనేసాడు హర్ష..ఠక్కున తలతిప్పి హర్షని చూసింది మల్లి..చిన్నగా నవ్వింది..

మరో నెల లోపే హర్ష, వర్ష దంపతులయ్యారు, పెళ్ళికి హర్ష తల్లిదండ్రులు రాలేకపోయారు..హర్ష సిటీలో, తన కంపెనీ పనులు చూసుకుని ఊరు వస్తుంటాడు..

వర్ష ఊరిలోనే స్కూలుని, తల్లిని చూసుకుంటూ ఉంది..ఆ రోజు హర్ష వస్తాడని ఎదురుచూస్తోంది వర్ష..ఒక కబురు తన ప్రియసఖుడికే ముందు చెప్పాలని తల్లికి కూడా ఇంకా చెప్పలేదు వర్ష..ఎనిమిది అయ్యింది..వర్షా ఇంక తినేసెయ్యమ్మా, మద్యాహ్నం కూడా హర్ష వస్తాడని, అతనితో తింటానని కూర్చుని ఇప్పటివరకూ తినలేదు, తినేసేయ్, అంది మల్లి..

సరే అని అన్నం తింటోంది వర్ష..

హర్ష కొంచెం చిరాకుగా వచ్చాడు..మల్లి ఎదురెళ్ళింది, పట్టించుకోకుండా తమ గదిలోకి వెళ్ళిపోయాడు హర్ష..వర్ష హర్ష చిరాకుని గమనించుకోలేదు,

మల్లికి తెలిసింది ఏదో బాలేదని..

వర్ష అన్నం చేతులు కడుక్కుని గబగబా లోపలికివెళ్ళింది..హర్ష డ్రెస్ మార్చుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు..హర్షూ నేను నీకో మాటచెప్పాలి అంది గారాబంగా వర్ష..

హర్ష కళ్ళెత్తి చూసి ఏమిటి అన్నాడు..

మన ప్రేమకి ప్రతిరూపం మనమధ్యకి రాబోతున్నారు అంది చిరుసిగ్గుతో పొట్ట మీద చెయ్యేసి చూపిస్తూ..

హర్ష మొహం వెలిగిపోయింది..వర్షను చెయ్యిపట్టి దగ్గరకు తీసుకున్నాడు..ఒక నిముషమే అలా, వెంటనే వర్షా ఇప్పుడే వద్దురా అనేసాడు..

ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు..ఎందుకు వద్దు పిల్లలు ..అయినా ఇప్పుడు వద్దనుకుంటే ఎలా..అంది వర్ష..

నేను , నాకు , అని సరిగా చెప్పట్లేదు హర్ష..

హర్షా నీకు తెలుస్తోందా, నువ్వు మన ఒక మంచి సంఘటనని ఎంతలా పాడుచేస్తున్నావో, ఏమి ఆలోచిస్తున్నావు , నాకు చెప్పవా అంది స్నేహంగా వర్ష..

వర్షా అమ్మావాళ్ళు నన్ను అమెరికా రమ్మంటున్నారు, మనం వెళ్ళొద్దాము, అక్కడ మన సొంత కంపెనీ పనులు కొన్ని నేను చూడాలిరా, వెళ్దాము అన్నాడు హర్ష..

ఇప్పుడా అంది సంశయంగా వర్ష..అసలు ఏం జరుగుతోంది హర్షా, నేను నీతో ఈ సమయాన్ని ఊహించుకున్నదేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి అని నీరసపడింది వర్ష..

మనం రేపు సిటీ వెళ్ళాలి వర్షా ఫారెన్ వెళ్ళే పనుల కోసం..అన్నాడు హర్ష..ఎన్నిరోజుల ట్రిప్ హర్షా అడిగింది వర్ష..టూ ఇయర్స్ అన్నాడు..

ఏంటీ మరి అమ్మ సంగతి అడిగింది..

అత్తమ్మని కూడా తీసుకెళదాము అన్నాడు…

అమ్మ ఈ ఊరు దాటి , సరిగ్గా రెండ్రోజులు కూడా ఎక్కడా ఉండదు, అలాంటి అమ్మ దేశం దాటి రాదు..అంది వర్ష..

అలా అంటే ఎలా, మాట్లాడి ఒప్పిద్దాము అన్నాడు..

నాకు తెలుసు పర్ణశాల లాంటి ఈ ఇల్లు వదిలి అమ్మ ఎక్కడికీ రాదు..అంది..

అయితే మనిద్దరం వెళ్ళొద్దాము..అన్నాడు..

అమ్మనొదిలి అంత టైమ్ నేను ఉండను అంది స్పష్టంగా ..

వర్షా నేను అడిగేది మా అమ్మానాన్న దగ్గరికి..అన్నాడు స్థిరంగా…

అమ్మతోనే నేనుండాలి అని పెళ్ళికి ముందే చెప్పానుగా అంది..

అప్పుడు ఇలా అవసరం పడుతుందని నాకు ఎలా తెలుస్తుంది..అన్నాడు..

కష్టం హర్షా, మామూలుగానే కష్టం, ఇప్పుడు పాపను మోస్తూ నేను ఎక్కడకూ రాను అమ్మని వదిలి..అంది..

ప్చ్ ఇది కూడా ఒకటా ఇప్పుడు , వర్షా సరైన ప్లానింగ్ లేకుండా పిల్లలు ఎందుకు మనకి ఇప్పుడు అన్నాడు..

హర్షా అప్పుడు మనం తొందరపడి పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది, అంది..

 

సరే ఇప్పుడు ఏమయ్యింది, డాక్టర్ తో మాట్లాడితే పిల్లల బరువు తొలగించుకోవచ్చు అన్నాడు…

వర్ష కోపంగా హర్షను చూసి ఇవాళ నీకేమన్నా పిచ్చి పట్టిందా, అమ్మను వదిలి రమ్మంటావు, పిల్లలు వద్దంటావు … ఏంటిది హర్షా, నేను ప్రేమించిన వాడివేనా నువ్వు..అని బాధపడుతోంది వర్ష..

మల్లీశ్వరి మర్రోజు ఇద్దరినీ గమనించి ఇద్దరికీ ఏదో మనఃస్పర్ధ వచ్చిందని అర్థం చేసుకుంది..

రాత్రి భర్తకి తీపికబురు చెప్పి ఆనందపడి, పొద్దున్నే అమ్మకి చెప్పాలి, అమ్మ కళ్ళల్లో వెలుగు చూడాలి అనుకుంది, కానీ చివరికేమయ్యింది, విషయం చిక్కుముడిలా తయారయ్యింది అని బాధపడుతోంది వర్ష…

హర్ష, తయారయ్యావా వర్షా సిటీకి వెళ్దామా ఇంక అని అడిగాడు..

నువ్వు వెళ్ళిరా హర్షా నేను రావట్లేదు అంది..మల్లి,

వర్షా వెళ్ళిరా సిటీకి, స్కూలుపిల్లల్ని నేను చూసుకుంటానుగా అంది తనకి విషయం సరిగా తెలియదు కాబట్టి ..

అత్తమ్మా ..అంటూ హర్ష తమ ఫారెన్ ట్రిప్ గురించి చర్చ మొదలుపెట్టబోయాడు,

వెంటనే వర్ష అమ్మా నాకు ఆరెంజ్ జ్యూస్ చేసియ్యవా అని అడిగింది..హర్ష కి వద్దు,చెప్పద్దు అన్నట్టు సైగ చేసింది..

స్కూలుకి బయల్దేరి బయటకు వచ్చారు ఇద్దరు..ఉర్లోని జామ తోటలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు…హర్షా నేను అమ్మని వదిలి రాను, నువ్వు ఈ సమయంలో నన్ను వదిలివెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు అంది…

అరే నన్ను మా అమ్మావాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దంటావా అన్నాడు కోపంగా..పెళ్ళికిముందు , నా చిన్నప్పటినుంచీ అమ్మావాళ్ళూ , నేనూ ఎప్పుడూ ఒక్కచోట కలిసిలేము..అమ్మావాళ్ళకి నాకు ఏవో పనులతో విడివిడిగా ఉండటం మొదట్నుంచీ అలవాటు అయిపోయింది..నేను హాయిగా నీతో అత్తమ్మతో మన పర్ణశాలలో ప్రశాంతంగా ఉండిపోతాను,

నువ్వూ అత్తమ్మా నేను కలిసేఉందాము ఎప్పుడూ అన్నావు, ఇప్పుడేమో ఇలా,

అయితే ఏంటిప్పుడు వర్షా, నేను మా అమ్మావాళ్ళతో ఉండాల్సిన అవసరం ఇప్పుడొచ్చింది, మరి వెళ్ళాలా, వద్దా..అడిగాడు..

నీ ఇష్టం హర్షా అని నీరసంగా అంది, శారీరకంగా , మానసికంగా అలిసిన వర్ష…

సరే సిటీకి పదా, మనిద్దరి పాస్‌పోర్ట్ , వీసాల పనులు చూసుకుందాము అన్నాడు..

నేను రాలేను హర్షా..అంది వర్ష…

నా భార్యవి నువ్వు, నాతో రావా అడిగాడు…

ఊహూ రాను అని అంటూ తల అడ్డంగా ఊపింది…

నేను తీసుకెళ్ళకుండా ఉండను అన్నాడు..

వర్ష మౌనంగా లేచి వెళ్ళబోయింది,

వర్షా సమాధానం చెప్పు అని కోపంగా అడిగాడు…

అలా రెండునెలలు వాదనలతో నడుస్తోంది వర్ష, హర్ష మధ్య…అది తెలుస్తూ, ఏమీ చెయ్యలేక  మల్లీశ్వరి  నలిగిపోతోంది   వర్ష తల్లి కాబోతున్న విషయానికి మల్లి చాలా సంబరపడి, వర్షని ఇంకా అపురూపంగా చూసుకుంటోంది,

హర్ష కోపంతో వర్ష తల్లి కాబోతున్న విషయానికి కనీస విలువను కూడా ఇవ్వట్లేదు…

 

ఏంటీ ఈ మగవారి మనస్తత్వం , ప్రేమించేటప్పుడు అంతా నువ్వే అని నెత్తిన పెట్టుకుంటారు, పెళ్ళి అయ్యి బాధ్యతల్లో పడ్డాక నువ్వెవరో అన్నట్లు ప్రవర్తిస్తారు అని మల్లి వర్షకి చెబుతూ బాధపడుతోంది..అప్పుడే వచ్చి అది విన్న హర్ష , అత్తమ్మా, వర్షని మీమాటలతో ఎందుకు నాకు దూరం చెయ్యాలని చూస్తున్నారు, కూతురికి ఒక తల్లి చెప్పే మాటలేనా అవి, అని అడుగుతున్నాడు కోపంగా..వర్ష , హర్షని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి , అమ్మ మనిద్దరం బావుండాలని ఎంతో ఆశిస్తుంది, అలాంటి అమ్మని ఏం అంటున్నావు నువ్వూ, ఆ..అని కోప్పడింది వర్ష…మగవారి గురించి తనకున్న అర్థం లేని అభిప్రాయం నీకు నూరిపోయటం నేను విన్నానుగా అన్నాడు..నువ్వు చేసేదే అనుకుంటున్నాము, అందులో నిజం ఉంది తప్ప అర్థం లేని అభిప్రాయం ఏముంది, నువ్వు చేసేది ఎంతో నిర్లక్ష్యంగా ఉండి, నన్నెంత బాధ పెడుతోందో అమ్మేగా ప్రత్యక్షంగా చూస్తోంది..అంది కోపంగా…మరి నువ్వు నా తల్లిదండ్రుల దగ్గరికి రావటానికి అడ్డుచెప్పేది, మీ అమ్మ వల్లేగా, ఆవిడేగా కారణం, ఆవిడెలాగూ మీ నాన్నని అర్థం చేసుకోకుండా అహంకారంగా దూరం చేసుకున్నారు, ఇప్పుడు నీకూ అలానే నేర్పిసతున్నారు, మీ అమ్మా బిడ్డలకి మొగుడు ఒక అలంకారం మాత్రమే అనుకుంటా, మొగుడు , మొగుడి కుటుంబం అంటే విలువే లేదు మీకు ఛా…అన్నాడు కోపంగా హర్ష….ఏంటిది హర్షా అమ్మంటే నీకు గౌరవం అనుకున్నాను, ఆవిడంటే ఇలా ఒక చెడ్డ అభిప్రాయం నీకుందా అంది బాధగా వర్ష..ఇదొక్క విషయంలోనే నాకు ఆవిడంటే చిరాకు అన్నాడు హర్ష..హర్షా , ప్లీజ్ ఇంకొక్క మాట నువ్వు మాట్లాడావంటే బాగోదు, నువ్వు వారంలో ఈ ఇల్లు వదిలి, మీ అమ్మానాన్న దగ్గరికి వెళ్ళిపో, వారం తరువాత నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా నేనొప్పుకోను..అనేసింది వర్ష కోపంగా..సరే ..అని తానూ కోపంగా అనేసాడు హర్ష..

 

అదంతా విన్న మల్లి బాగా ఆలోచించింది…మల్లీశ్వరి హర్ష తల్లిదండ్రులు అయిన జానకి, ప్రభాకర్ లకు ఫోన్ కలిపింది..జానకి ఫోన్ లో ఉంది..వదినా బావున్నారా అడిగింది మల్లి..హా వదిన మీరు బావున్నారా అడిగింది జానకి..వదినా మీరూ అన్నయ్య ఒక పదిరోజులు మా దగ్గరకి వచ్చి వెళ్ళండి, మీ అబ్బాయి పెళ్ళి కి కూడా రాలేనంత బిజీ మీరని తెలుసు కానీ దయచేసి మీ ఇద్దరూ రండి..అంది మల్లి..కష్టం కదా వదినా, పరిస్థితులు బాలేవనే హర్షని కూడా ఇక్కడికి రమ్మన్నాము..అంది జానకి ..వదినా, డబ్బు నష్టం గురించి ఆలోచించకండి, అంతకుమించిన అవసరాలు కూడా మనిషికి ఉంటాయిగా, మీ వదినగా హక్కుగానే అడుగుతున్నా, నా మాట కాదనద్దు ప్లీజ్ అంది మల్లి జానకిని ఒప్పించుకోవటానికి..పిల్లనిచ్చిన తల్లి ఎందుకు అంతలా అడుగుతున్నారో అనుకుని..సరే వదిన వచ్చే వారం ఈపాటికి నీ దగ్గరే ఉంటాము అని మాటిచ్చింది జానకి..

 

ఆ రోజు పొద్దున్నే వచ్చేసారు జానకి, ప్రభాకర్..అప్పటికే మల్లి లేచి ఇంటి ముందు తోట, వెనక పెరడు అంతా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేసింది..బొగ్గులకుంపటి ముట్టించి పాలగిన్నె పొయ్యి మీద పెట్టింది, స్టవ్ మీద నీళ్ళు కాచి ఫిల్టర్ లో డికాక్షన్ కి కాఫీపొడి వేస్తోంది..ఇంటిముందున్న చిట్టిగంట మధురంగా మ్రోగింది..ఆ శబ్దం విని మల్లి వెళ్ళి తలుపు తీసింది..అప్పటికే ఫొటోల్లో చూసి ఉన్నారు కాబట్టి బానే గుర్తుపట్టి వదినా అని పలకరించుకున్నారు వెలిగిపోతున్న నవ్వుమొహాలతో జానకి, మల్లి..రండన్నయ్యా అని ప్రభాకర్ వాళ్ళని ఆహ్వానిస్తూ వర్ష రూమ్ తలుపు తట్టింది మల్లి..వర్ష , హర్ష బయటకువచ్చారు..అమ్మా ..మీరు ఇక్కడ అని హర్ష ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో వెళ్ళి తల్లిని గట్టిగా  ఆలింగనం చేసుకున్నాడు..తల్లి స్పర్శ హర్షకు ప్రశాంతంగా చల్లనిగాలి తాకినట్టు హాయిగా ఉంది, అప్రయత్నంగా హర్ష కళ్ళల్లో నీళ్ళు ..జానకి వర్షను చూస్తూ చేయి చాపింది..అయిదునెలల చిట్టికడుపుతో వర్ష , అప్పుడే నిద్రలేచిన ముద్దుమొహంతో ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది..తానే రెండడుగులు ముందుకెళ్ళి వర్షను ప్రేమగా దగ్గరకు తీసుకుంది జానకి, తమ రక్తపాశమైన చిట్టిపాపను స్ప్రశిస్తున్నట్టు వర్ష పొట్ట మీద చెయ్యి వేసి మ్రృదువుగా నిమిరింది..వర్ష కళ్ళు ఆనందంతో మెరిసాయి, అత్తగారి స్నేహానికి, జానకి ప్రేమగా వర్ష నుదుటిన ముద్దు పెట్టింది..వర్ష ప్రభాకర్ కాళ్ళకు దండం పెట్టింది..మల్లికి అవన్నీ కళ్ళకు నిండుగా అనిపించాయి…

మల్లి చేసిపెట్టిన కమ్మటి వంటలతో కడుపునిండా భోజనం చేసారు జానకి ప్రభాకర్..తమలపాకులకు సున్నం రాసి వక్కపొడి పెట్టి ఇచ్చింది మల్లి..పిల్లల పెళ్ళి అయ్యాక తాంబూలాలు పుచ్చుకుంటున్నాముగా వదినా అని ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు..ప్రభాకర్ భుక్తాయాసంతో సోఫాలో కూర్చునే గురకపెట్టి మరీ నిద్రపోతున్నాడు..వదినా రాత్రుళ్ళు నిద్రమాత్రలు వేసుకున్నా కూడా కంపెనీ వ్యవహారాలతో టెన్షన్ పుట్టి, నిద్రపట్టక చస్తాము..ఇక్కడ నీ చేతి కమ్మటిభోజనం, నీ ఇంటి ప్రశాంతవాతావరణంలో ఆయన వళ్ళు మరిచి ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంది జానకి ఆప్యాయంగా మల్లి చెయ్యి పట్టుకుని ..అలా పదిరోజులు అనుకున్నవాళ్ళు నెల రోజులు దాటినా మల్లి పర్ణశాలను, కడుపుతో ఉన్న వర్షను కళ్ళారా చూసుకోకుండా ఉండలేక, వెనక్కి తిరిగి వెళ్ళాలనిపించక ఇక్కడే ఉండిపోయారు..క్రృత్రిమంగా లేనిపోని హోదాలు, అంతస్థులు తెచ్చిపెట్టుకుని, తమని తామే కోల్పోయే ఆర్ధికలావాదేవీల జీవితం కంటే, సహజసిద్ధమైన జీవితశైలిలో జీవిస్తుంటే మనసుకి ఒత్తిడి  ఎక్కువ తెలీకుండా, ఎంత ప్రశాంతంగా జీవించవచ్చో మల్లి ద్వారా అనుభవంలోకి వచ్చింది జానకీ వాళ్ళకి..ఎందుకో ఈ వయసులో వెనక్కెళ్ళి పద్మవ్యూహం లాంటి గజిబిజి జీవితం గడిపేకంటే, అమ్మప్రేమ లాంటి ప్రక్రృతికి దగ్గరగా ఉండే జీవితమే బావుందనుకుని మల్లి వాళ్ళ దగ్గరే ఉండిపోవాలనుకుని నిర్ణయించేసుకున్నారు, రాబోయే మనవరాలితో ఆటలను ఆడుతున్నట్టు కూడా ఊహించేసుకుని మల్లి జానకి ప్రభాకర్ మురిసిపోతున్నారు..

ఆరోజు మల్లి జానకికి చెబుతోంది..వర్ష నాన్నగారు, ఆడపిల్ల అనే కారణంగా వర్షను కడుపులోనే తుంచేయమన్నారని, తాను అస్సలు ఒప్పుకోలేదనే కోపంతో తనకి నరకం చూపించాడని, వర్ష పుట్టాక కూడా ఒకసారి పిచ్చికోపంతో వర్షని నేలకేసి విసిరికొట్టాడని, అద్రృష్టం బావుండి కింద మెత్తనిబొంత ఉండటంతో వర్ష బతికిందని చెప్పి మల్లి జానకి చేతుల్లో మొహం పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది..ఎన్నేళ్ళ కన్నీళ్ళు గుండెల్లో దాచి ఉంచుకుందో మరి ఏడుపు ఆగట్లేదు మల్లికి, జానకి ఓపికగా మల్లి తేరుకునేదాకా మల్లిని కదిలించలేదు, కాసేపాగి మల్లిని నేనున్నానుగా నీకు నీ కష్టసుఖం పంచుకునేందుకు అన్నట్టుగా గట్టిగా దగ్గరకు తీసుకుంది..అదంతా విన్న హర్ష రూమ్ లోకి వెళ్ళి తన చెంప మీద తానే కొట్టుకున్నాడు, ఇది ఊహించి వెనకాలే వచ్చిన వర్ష హర్ష చేతిని పట్టుకుంది..వర్ష కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక హర్ష తలను వేరేవైపు తిప్పుకున్నాడు, సన్నగా హర్ష కళ్ళల్లో నీళ్ళు ..హర్ష తలను తన భుజంపైన ఆనించుకుని తన పొట్టమీద చేయి వేసుకుంది వర్ష, తనకు ఇద్దరూ పిల్లలే అన్నట్టుగా…అప్పుడే హర్ష మొదటిసారి ఆప్యాయంగా వర్ష పొట్ట మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు, అదే క్షణంలో మొదటిసారి పాప వర్ష బొజ్జలో కదిలింది..వర్షకు ఆనందమే ఆనందం అనిపించింది..హర్షా పాప మొదటిసారి కదిలింది, అమ్మా, అత్తమ్మా, మావయ్యా పాప కదులుతోంది అని సంబరంగా చెబుతోంది అందరితో..ఆ రోజు సాయంత్రం చిన్న పండుగ చేసుకున్నారు అందరూ కలిసి పర్ణశాలలో….

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *