April 19, 2024

5. ఆరవ తంత్రం

రచన: మాచవోలు శ్రీధరరావు

 

“అదొక పసి కోడె దూడ. గ్రామంలోని తన కోడెల బృందం నుండి తప్పించుకొని దూరంగా గల అడవిలోకి చేరుకుంది. ఎడతెఱపి లేకుండా కురిసిన గాలివాన వేగానికి ఆగలేక దూరంగా గల చెట్ల కొమ్మలపై పడడంతో శరీరానికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. గాలివాన తగ్గిన తర్వాత చూస్తే పశువుల కాపరి కనిపించ లేదు. తన వారెవరూ కనిపించ లేదు. ఎటు పోవాలో పాలుపోక ఆడవి అంతా తిరిగింది. తిరిగి తిరిగి అలసి పోయి అలాగే పడి నిద్ర పోయింది.

సూర్య కిరణాల తాకిడితో మఱునాడు లేచి అటూ ఇటూ చూసేసరికి చిన్న చిన్న జంతువులు కొన్ని పచ్చిక మేస్తూండడంతో ఆకలేసి తనూ పచ్చిక మేయ సాగింది. అంత రుచి గల పచ్చికను ఇదివరకెప్పుడు మేసి యెఱుగదు. అలాగే దగ్గరలొని నీటి గుంటలోని నీరు త్రాగి మళ్ళీ తిరుగ నారంభించింది. ఇలా రోజులు పక్షాలుగను, పక్షాలు మాసాలుగను, మాసాలు ఋతువులుగను, ఋతువులు సంవత్సరాలుగను గడువ సాగాయి. దూడ బలిష్ఠంగా తయారయింది. అసలే కోడె, పనేమీ లేదు – తినడం , తిరగడం – కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, గంగా జలాల వంటి పానీయం, చల్లని నీడల విశ్రాంతి. ఇంకేం కావాలి!

ఇలాగే తిరుగుతూ తిరుగుగూ ఒకరోజు అడవిలోని ఒక పెద్ద మైదానానికి చేరుకుంది. అక్కడి సెలయేటిలోని నీటిని త్రాగి ప్రక్కనే గల చెట్టు క్రింద సేద తీరి గర్వాతిరేకంతో పెద్దగా ఒక ఱంకె వేసింది. అంతే, దగ్గరలోని కొండను ఢీ కొన్న ఆ శబ్ద తరంగాల సమూహం మఱొక పెద్ద ఱంకెగా ప్రతిధ్వనించింది. ‘హూ, నన్నెదిరించే వాళ్ళెవరని అనుకున్నదేమో, ఈ సారి శబ్దాన్ని మఱింతగా పెంచింది. సమాధానం కూడా అదే స్థాయిలో రావడంతో కోపాతిశయంతో చెలరేగి కొమ్ములతో నేలను త్రవ్వ సాగింది. బాగా అలసిపొయ్యే వరకు త్రవ్వి త్రవ్వి ఆ మట్టి ప్రక్కగా కాసేపు కూల పడింది.  తను త్రవ్విన ప్రదేశంలో ఏర్పడిన గుంతలో జల ఊరడం గమనించి సంతోషంగా ఆ నీటిని త్రాగింది.

కాని ఇంతలో తాను త్రవ్వి పోసిన మట్టి ఒక పెద్ద దిబ్బగా తయారై అక్కడుండడాన్ని చూచి ఇంతకు ముందు తనకు వ్యతిరేకంగా ఱంకె వేసినది యీ కొండేనని, ఇప్పుడు సమీపంలోకే వచ్చేసిందే, దీని కింత పొగరా దీని పని పడతా ననుకుంటూ తన వాడి యైన కొమ్ములతో ఆ మట్టి కొండను ఢీ కొనసాగింది. కుమ్మి కుమ్మి ఆ మొత్తం మట్టిని పెళ్ళగించి ప్రక్కనే గల తను తీసిన గోతిలోకి తోసివేసేసింది. కొండను పూర్తిగా నిర్మూలిస్తే కాని దానికి  ప్రశాంతత సమకూరలేదు.” ఇదేనయ్యా నేను చెబుతానన్న కథ అంటూ ముగించాడు  చిన్ననాటి మిత్రుడు కృష్ణమూర్తి.

అదేమిటి? నేనేదో నీ దగ్గర ఒక మంచి ప్లాట్ తీసుకొని చక్కగా కథ నల్లుకొని కథల పోటీకి పంపుదామనుకుంటూంటే నాలుగు మాటలు చెప్పేసి ఇదే కథంటే ఎలా? ఇప్పుడేమి చెయ్యమంటావు” అన్నాను.

“చెబుతానన్నాను, చెప్పాను. అంతకు మించి నాకు తెలియదు. ఇక నీ యిష్టం.” అన్నాడు మూర్తి. పైగా “ఈ కథ నీకిచ్చేశాను, నీ యిష్టమొచ్చినట్లు వాడుకో” అంటాడే తప్ప అంతకు మించి చెప్పడాయె.

“సరే నేనే ఎలాగో పూర్తి చేసి నీకు వినిపిస్తానులే” అంటూ వచ్చేశాను.

రెండు నిముషాలు కళ్ళు మూసుకుని ఆలోచించడం ఆరంభించాను. ఎనిమిది మంది హేమామేమీలైన పృచ్ఛకుల మధ్యన నుదుటి మీద విజయ తిలకంతో వెలిగి పోతూ దర్పాన్ని ప్రదర్శిస్తున్న అష్టావధాని నా కళ్ళ ముందు కనిపించాడు. అంతే, సమస్యా పూరణలోకి దిగి పోయాను. ‘సమస్య వెనకాలే సమాధానాలూ వుంటాయి ‘, ‘సమస్యల్లోనే మఱికొన్నిటికి సమాధానాలు దొరుకుతాయి ‘, ‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి ‘ ‘పుట్టించిన వాడే గట్టెక్కిస్తాడు ‘ – పరిష్కారాన్వేష్వణా సమయంలో మామూలుగా స్ఫురించే ఈ అంశాలన్నీ నా మదిలో మెదల సాగాయి.

ఎప్పుడో చిన్న తనంలో నేర్చుకున్న ‘స్టాటిస్టికల్ మేథమేటిక్స్ ‘ లోని ఎక్స్ ట్రా పొలేషన్ ఇంటర్ పొలేషన్ అనే రెండు అంశాల వైపుగా బుర్ర వెళ్ళింది. ఏవో కొన్ని బిందువులు దొరికాయంటే వాటిని లోపలి వైపుగా పొడిగించుకొని వెళితే దాన్ని ఇంటర్ పొలేషన్ అనీ, వెలుపల వైపుకు పొడిగించుకొని వెళితే ఎక్స్ ట్రా పొలేషన్ అనీ లెక్కలను కూడా పూర్వా పరాలలోనికి పొడిగించుకోవడం ద్వారా పరిష్కరించుకో వచ్చంటుంది ఆ గణితం – జీవితాన్ని ఆకళింపు చేసు చేసుకోవడానికి ఆ లెక్కల లోని సారాంశాన్ని వాడుకున్నట్లుగానే.

“తల్లులార! ఎలాగైనా నాచేత ఒక విజయవంతమైన కథను వ్రాయించండంటూ జయమ్మకూ, సరస్వతమ్మకూ (విజయం కోసం, మంచి వాక్కు కోసం) చెఱొక నమస్కార బాణాన్ని విడచి ఆలోచనల్లోకి వెళ్ళి పోయాను. విచిత్రంగా ఒక్క ఐదు నిముషాల్లో నా మస్తిష్కంలో కృష్ణమూర్తి కథకు కొనసాగింపుగా ఒక చిన్న ఊహ మెరిసింది.. మఱి ఆలస్యం చేయకుండా కాగితం, కలం తీసుకొని కథలోకి వచ్చేశాను.

“అయితే ఆ కోడె ‘కొండగా భావించిన మట్టి దిబ్బను’ పెకళించి ఆ మట్టిని తిరిగి గుంతలోకి తోసెయ్యడానికి గల కారణాన్ని కృష్ణమూర్తి చెప్పినట్లుగా కాక నేను వేఱుగా ఊహించాను. ఆ కోడె బుర్రలో కొత్త ఆలోచ నొకటి పుట్టడమే అలా చేయడానికి కారణమన్నది నా ఊహ. తాను త్రవ్విన గోతి వేఱెవరికో ఎందుకు ఉపయోగపడాల అని అనుకున్నట్లుంది. అంతే కాదు, గుట్ట చిన్నదే అని తెలిసినా ఒక పెద్ద కొండను ఎదుర్కొనే రీతిలోనే దాన్ని ఢీ కొనాలని భావించింది. అందుకే గుట్టను కొమ్ములతో కుమ్మి కుమ్మి మొత్తం మట్టిని మరలా ఆ గోతిలోకి వేయ సాగింది.

తన మందను వీడి అడవిలోకి వచ్చానన్న దిగులు, బాధ ల్లాంటివి పూర్తిగా తగ్గిపోయాయి. ‘ఈ అడవి నాది, నాదే’ అన్న ఆలోచనలకు అంకురార్పణ కూడా ఇప్పుడిప్పుడే జరిగినట్లుంది. అందుకేనేమో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ త్రవ్వడం, పూడ్చివేయడం ఎక్కువయింది. అంతే కాదు, వేఱే చిన్న జంతువులపై అజమాయిషీ చేస్తూండడం, వాటిల్లో తగవులాటలను (వుంటే) తీరుస్తూండడం, లేకపోతే కల్పించడం వంటి లక్షణాలను వంట పట్టించుకుంది. అడవిలో విచ్చల విడిగా తిరుగుతూ దొరికింది తింటూ దొరకనిది దొరక బుచ్చుకుంటూ వికృత క్రీడ లాడుతూ అడవి జీవనానికి బాగా అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎద్దుగా ఎదిగిన ఈ కోడె తాను వీడి వచ్చిన పల్లెకు తీసికెళ్ళినా వెళ్ళే స్థితిలో లేదు. వయసులో వున్న బలిష్ఠమైన గిత్తగా తయారయింది.

తనలాగే తప్పిపోయి అడవిలోకి వచ్చి చేరిన మరొక ఆవుతో పరిచయం పెంచుకుని సంసారం చేయసాగింది. కాల చక్రంలో ఈ రెంటికీ మరి రెండు కోడె దూడలు పుట్టడం, అవీ పెరిగి పెద్దవడం  అలా అలా జరిగిపోయింది. ఇక ఈ ఎద్దులన్నీ కలసి అడవిని దున్నివేయ  మొదలెట్టాయి. చిన్న చిన్న జంతువులను అదలించి వాటి ఆహారానికి అడ్డు తగలడం, వాటిని దూరంగా తఱమడం  వంటి పనులు చేస్తూండడంతో  కొమ్ముల వలెనే  అహంకారమూ పెరిగింది. ఈ అడవికి తామే సొంతదారులమని చెప్పకనే చెప్పసాగాయి. తమ జాతీయులపై (ఆవులు, ఎద్దులపై)ఆత్మీయతను వేఱే జంతువులపై ఆధిక్యతను ప్రదర్శించడాన్ని అలవరచుకున్నాయి. వీటిని కలుపుకోవడం, వాటికి వ్యతిరేకంగా సమూహాలను కూడ గట్టడం బాగా నేర్చుకున్నాయి. పెద్ద జంతువుల్ని సైతం చికాకులకు గురి చేయ నారంభించాయి. సింహాన్నయినా దెబ్బ తీయ గలిగిన కరటక దమనకులను మనం ఎఱుగనిది కాదు కదా!

వేట కోసం, స్వార్ధం కోసం, వ్యాపారం కోసం, దుష్ట మానవుడు చట్టాలను వెక్కిరిస్తూ పరిసరాల పరిరక్షణను తుంగలో తొక్కి అడవిలోని చెట్లను కొట్టివేయ పూనుకున్నాడు. నీరు – నీడ అనూహ్యంగా తగ్గిపోయాయి. తమ సామ్రాజ్యానికి గండిపడే రోజులొస్తున్నాయని కూడా గ్రహించిందా ఎద్దు కుటుంబం. “అయినా ఈ ముప్పు వల్ల క్రూర మృగాలనబడే వాటికే కదా నష్టం. – వాటిలో కొన్నింటిని చంపి వేస్తారు, మఱి కొన్నింటిని ‘జూ ” లకు తరలిస్తారు. మనకేమిటి! మనమైతే ఎలాంటి తత్వాన్ని కలిగి యున్నా, ఎలంటి పనులు చేసినా  ప్రజల దృష్టిలో ఎన్నటికీ సాధు జంతువులమే. ఇది అడవిగానే వున్నా ఊరుగా మారినా మనకేమి? అవసరాన్ని బట్టి ఇటు అడవిలో నైనా కొనసాగ వచ్చు, కాదంటే తిరిగి జన జీవనంలోకైనా వెళ్ళిపోగల “అవకాశం” మనకుంది. ఈ ‘అవకాశ వాదమే ‘ మన ప్రధాన ఆయుధం”అన్న ధీమాతో అడవిలో విచ్చల విడిగా సంచరించ సాగాయి.

“ఏ గాలి కా గొడుగు”, “ఎవరింట వారి కండువా” వంటి పాఠాలెన్నో వంట పట్టాయి. ఎక్కడో పల్లెలో షావుకారు మందలో తల్లి దంద్రుల, బంధు మిత్రుల చాటు ముద్దు బిడ్డగా తిరుగాడిన కోడె దూడ నేడిలా అయింది.

“అంతా కాల మహిమ!  నాడు పంచతంత్ర కర్త విష్ణు శర్మగారు ప్రవచింపని, బహుశః గాంచని ఆరవ తంత్రాన్ని నేర్వడం వల్లనే ఈ కోడె ఇంతలా ఎదిగిందనడంలో సందేహం లేదు”, అనుకుంటూ

కథ పూర్తి చేసి మా ఆవిడ తెచ్చిచ్చిన అల్లం టీ పట్టించేసి “ఇదిగో ఒక్క సారి కథ విని పోదువు గాని రా” అని పిలచినా “నాకు వేఱే పనుంది. ఇప్పుడు కాదు, తర్వాత” అంటూ ఆమె లోనికి వెళ్ళడం మిత్రుడు కృష్ణమూర్తి కడపట్లో ఎదురవ్వడం ఒకే సారి జరిగాయి. “నీ కోసమే ఎదురు చూస్తున్నా” నంటూ ఆయన్ని లోనికి ఆహ్వానిస్తూనే “హల్లో, మూర్తి గారొచ్చారు. ఒక్క టీ పట్టుకు రావా” అంటూ కిచన్ వైపు తిరిగి పెరట్లో కెళ్ళిన ఆవిడకు వినిపించేటట్లుగా కాస్త పెద్దగానే చెప్పాను మూర్తి గారు నవ్వుతూంటే “అదేమిటి, మేమిద్దరం ఒకరినొకరు హల్లో అంటూ పిలుచు కోవడం నీకు తెలియంది కాదుగా, నవ్వుతున్నా వేంటి ” అన్నాను. “అది కాదు, మూర్తి గారొచ్చారు, ఒక టీ పట్రామ్మా –  అని అదేదో ఒక యాడ్ వుంది కదా అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది” అన్నాడు మూర్తి. “అయ్యా నువ్వు చెప్పేది కూడా నిజమే. నాకూ టీ అంటే అందునా ఆవిడ చేతి టీ అంటే మరీ యిష్టం.” అన్నాను. ఇంతలో ఆవిడ అన్నట్టుగానే రెండు టీ కప్పులతో వచ్చేసింది. “ఇప్పుడే కదా ఇచ్చావు” అంటే “ఫర్వా లేదులెండి, ఈ కొంచెం గానే వున్న కప్పు మీకిస్తున్నాను” అంటూ ఇద్దరికీ యిచ్చేసి తను లోనికెళ్ళింది.

“కథ నెలా పూర్తి చేశావో తెలుసుకుందామన్న ఆత్రుత పట్టలేక వేంటనే వచ్చేశాను. ఏదీ చూద్దాం” అంటూ  టీ త్రాగేసినంత ఉత్సాహంగా కథను కూడా పూర్తి చేశాడు మూర్తి. “చాలా బాగా చెప్పావు” అంటున్నఫ్ఫుడు ఆయన గొంతుకలోను, ముఖ కవళికల్లోను ఆవేశం పాలు కాస్త ఎక్కువగానే కనిపించింది.  హృదయాంతరాళాల్లో మరుగుతున్న ఆవేదనకు మాటల రూపాన్నివ్వ సాగాడు.

“దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి దాదాపు పది పదిహేనేళ్ళయ్యుంటుంది.  అంటే దేశ మాత స్వేచ్ఛ కోసం మహానుభావులు పడిన కష్టాలను వారి త్యాగ నిరతి అప్పటి కింకా సామాన్య జనుల గుండెల్లో కదలాడుతూనే వున్న రోజులవి. రెండు శతాబ్దాలుగా పూర్తిగా పరదేశీయులచే దోచి వేయబడి, బానిసత్వంలో మ్రగ్గిన మన దేశాన్ని తిరిగి ఎప్పుడెప్పుడు స్వర్ణ భారతంగా తయారు చేసుకుందామా అని దేశ ప్రజ వువ్విళ్ళూరుతూండిన శుభ ఘడియలవి. దేశభక్తి గంగోదకంలాగా జనవాహినిలో మిళితమై ప్రవహిస్తున్న రోజులవి. ఎక్కడో పుట్టి పల్లెల్లో వ్యవసాయం, పట్టణాల్లో వ్యాపారమో ఉద్యోగమో చేసుకుంటూ ప్రజా సేవ చేద్దామనే ఒక మంచి ఆలోచనతో ఔత్సాహికులు కొందరు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మాట వాస్తవమే!

అయితే  అందులోకి వచ్చిన తర్వాత కాల క్రమేణా వారి ఆలోచనా సరళిలోను బుద్ధుల లోను అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ధనం,అధికారాల పట్ల వ్యామోహం పెరుగ సాగింది. తదనుగుణంగా నీతి

-5-

తప్పడం, మాట తప్పడం, అక్రమ ధనార్జన ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వచ్చాయి.  ధనము వెనుకే బలము, అహము కలసి నడుస్తాయంటారు కదా! అహమనే అగ్నికి కులమనే ఆజ్యం తోడయ్యింది. మతం, భాష, ప్రాంతం ఇవన్నీ   చిదుగుల్లాగా సాయపడ్డాయి. ఇక సామాన్య జనం ఈ దావానలంలో పడే శలభాలుగా మారిపోయారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

ఓటు వేసే అధికారమే ప్రజలది –  వేసిన  ఓటును వెనక్కి తీసుకునే హక్కయితే లేదు. ఒక్క సారి గెలిస్తే చాలు, ఆ నేతలదే ఇక రాజ్యం. అభివృద్ధి కోసం (ఎవరి అభివృద్ధో మఱి) ఎంచక్కా పార్టీలెన్నయినా మారవచ్చు.

ధనం, బలం, అధికారం, వారసత్వాధికారాలను సంపాదించి పెట్టేదీ రాజకీయమే, వీటిని నిలబెట్టేదీ రాజకీయమే! ప్రజలను కులాలు,వర్గాలు,ప్రాంతాలుగా విడగొట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యడానికి కొందరు ఆడుతున్న క్రీడే ‘రాజకీయం ‘ ఈ క్రీడను వృత్తిగా చేసుకొని విజేతలుగా నిలుస్తున్న నేతలూ, మీకు హ్యాట్సాఫ్.” ఆవేశంతో ఊగిపోతున్న మిత్రునికి అడ్డు తగిలాను, ” నువ్వు చెప్పేది నిజమే అయినా ప్రజలను మరీ తక్కువగా అంచన వేయ వద్దు. వారు ఈ క్రీడను ఆడే ఆటగాళ్ళు కాకపోయినా అనునిత్యం ఏం జరుగుతున్నదనేది టీవీలు యితర మీడియాల ద్వారా తిలకిస్తూనే ఉన్నారు. అంతేకాదు, అబద్ధ ప్రచారాలను, మోసపూరిత చర్యలను కూడా ఇట్టే పసికట్ట గలరు. అందరినీ సరిగ్గానే అంచనా వేయగలరు. ఎవరికి ఓటెయ్యాలో, ఎవరికి వెయ్యకూడదో తెలుసుకోలేనంత అమాయకులైతే కాదు, ఇంత కాలంగా నేతల మాటలను, చేతలను, నటనను, వాస్తవాన్ని –  అంతా గమనిస్తూనే వున్నారు, చూడండి, క్రికెట్ స్టేడియంలో ఆడే వాళ్ళు ఇరవై రెండు మందే అయినా ప్రత్యక్ష ప్రేక్షకులు వేలల్లోను పరోక్ష ప్రేక్షకులు కోట్లలోను వుంటారు. ఈ చూచే వాళ్ళు ఆడక పోయినా ఆట ఎలా ఆడాలో తెలిసిన వాళ్ళే! అంతకు మించి మంచి విశ్లేషకులు అన్న విషయాలను మరువకండి.  ఎన్నిక లెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. మన వాళ్ళందరూ “వ్రేలి” పదను చూపడానికి సిద్ధంగా వున్నారు.” అన్నాను.

“అంతేనంటావా?” కొంచెం అనుమానంగాను, మరికొంచెం ఆశావహంగాను అడిగాడు మూర్తి.

“నిస్సందేహంగా అంతే! ఆ నాడు మందలో నుంచి తప్పిపోయిన ఆ పసి కోడె దూడ నేడెలా తయారయిందో ఇదీ అంతే. ఇదే రాజకీయపు మహత్తు అంటే”.

“అయితే ఆ ఎద్దు కుటుంబపు ఆధిక్యత, ఆగడాలు అలాగే కొనసాగుతూనే వుంటాయంటావా?” మళ్ళీ అందుకున్నారు మూర్తి గారు.

“అని నేనన్నానా? ఇంత విషయం విడమరచి చెప్పాక కూడా ఇంకా ఎందుకీ అనుమానం? అక్కడి కోడె దూడకైనా కాలం గడిచిన కొద్దీ ‘రాజకీయ ‘ మనేది అబ్బింది. ఇదే సమయంలో సామాన్యులు సైతం ఈ క్రీడను అర్థం చేసుకుంటున్నట్లే ఆ ఎద్దు కుటుంబపు ప్రవర్తన నర్థం చేసుకొని అడవిలోని మిగిలిన జంతుజాలం కూడా అప్రమత్తమౌతాయి. అయితే కొంచెం వెనకా ముందో కావచ్చేమో కాని న్యూటన్ మూడో సూత్రం గతి తప్పే అవకాశమే లేదు. అంతెందుకు, ఇప్పుడీ ఎద్దు కుటుంబం తిరిగి గ్రామానికి వెళ్ళినా అవి ఆశించేటట్లు పరిస్థితులక్కడ సుముఖంగా వుండవు – ఎందుకంటే ‘రాజకీయ’ మనబడే ఈ ఆరవ తంత్రం అన్ని చోట్లకూ విస్తరించింది. అందరూ కొద్దో గొప్పో నేర్చుకునే వుంటారు. కొందరికి వృత్తి కావచ్చు మఱి కొందరికి ఆత్మ రక్షణార్థము  కావచ్చు – అంతే తేడా.” ఇప్పుడు కృష్ణమూర్తి  ముఖంలో ప్రశాంతత కనిపించింది.

“అయితే నీ కథకిక తిరుగు లేదు. చక్కగా ఆలోచించావు, ఆలోచింప చేశావు, మంచి కథ వ్రాసినందుకు శుభాకాంక్షలు” అన్నాడు మూర్తి.

“అయ్యా మీరు చెప్పిన నాలుగు మంచి మాటలకు అటూ ఇటు అల్లికల జోడించి చేసింది, నాదెట్లవుతుంది” అన్నాన్నేను.

“నీదని నేను నాదని నువ్వు అనుకుంటూ వాదించుకునేకంటే ఇద్దరం ఏకాభిప్రాయాని కొద్దాం” అంటూనే “అసలిది నీది, నాది మాత్రమే కాదు. నూట ముప్ఫై కోట్ల భారతీయులది. ఇప్పుడేమంటావ్” అన్నాడు మూర్తి.

“అవును నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అందుకే ఈ కథ నూట ముప్ఫై కోట్ల భారతీయులకు అంకితం” అన్నాను.

ఇద్దరం సంతృప్తిగా చేతులు కలిపాము.

భారత్ మాతా కి జై.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *