April 24, 2024

9. వైరాగ్యం

రచన:  విశాలి పేరి

 

“ఇది మీకు భగవంతుడు ఇచ్చిన ఇంకో జన్మ. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.. జీవిత చరమాంక దశలో ఉన్నారు. కాస్త వైరాగ్య ధోరణిలో ఆలోచించండి ” అని మాతాజీ అన్నారు.

“మాతాజీ. చాలా ఆలోచించానండి. నేను వెళ్లకపోతే అక్కడ చాలా గొడవలు జరుగుతాయి.. నా పిల్లలకి లోక జ్ఞానం లేదు. వెళ్ళి అక్కడ అన్నీ వ్యవహారాలు సద్దుమణిగాక తిరిగి వస్తాను..” రత్నమ్మ అంది

“మళ్ళీ చెబుతున్నాను.. అవన్నీ వదిలేసే ఇక్కడకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వాటి జోలికి ఎందుకు మీకు?  అవేవీ మీవి కాదనే కదా ఆస్తి మొత్తం పిల్లల పేరున రాసేశారు.. మళ్ళీ ఇప్పుడు వాటి పైకి మనసుని తిప్పకండి, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ చివరి దశలో ఈ వారణాశిలో ఉండము, ఇక్కడ ఉండీ ఆ లయకారకుడి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాలి, బోలెడు పరీక్షలు పెడితే కానీ ఆయన దగ్గరకు రానివ్వడు.. ఇంకోసారి ఆలోచించుకోండి రత్నమ్మ గారూ, ఇవన్నీ ఆయన పెట్టే పరీక్షలు.. మీరు దేనికి చెలించకూడదు, ప్రశాంతమైన మనసుతో ఆలోచించండి, ఇవన్నీ భవబంధాలు   ” అని  అన్నారు మాతాజీ.

మాతాజీ అన్న మాటలకి రత్నమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు, కిటికీలో నుంచి దూరంగా ఉన్న మామిడి చెట్టువైపు చూస్తూ ఉండిపోయింది.

********

రత్నమ్మ. చాలా శ్రీమంతురాలు. పల్లెటూర్లో యాభై ఎకరాల వరకు ఉంది. ఆమెకు ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు భర్తపోయాడు. అప్పుడు ఆవిడకు ఇద్దరు పిల్లలు వయస్సు పదేళ్లు  పెద్దవాడికి, ఎనిమిదేళ్లు చిన్నవాడికి. భర్తపోయిన కొత్తలో చాలా నిరుత్సాహపడిపోయింది రత్నమ్మ. ఇంక జీవితంలో ఏదీ అవసరం లేదనుకుంది. కానీ తన జీవితం ఇప్పుడు తనపిల్లల కోసం. తాను పోతే వారి జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని గ్రహించింది. పిల్లలిద్దరినీ చాలా క్రమశిక్షణలో పెంచింది. యాభై ఎకరాలని తానే స్వయంగా చూసుకోసాగింది. అది కాక చుట్టుపక్కల కొన్ని రిసార్ట్స్ కట్టి ఆ వ్యాపారంలో కూడా బాగా సంపాదించింది. పదేళ్ళల్లో పిల్లల కి మంచి చదువులు వచ్చాయి.  వ్యాపారంలో  కూడా చాలా సంపాదించింది.

పిల్లలకి రత్నమ్మ చెప్పిందే వేదం. ఆవిడ ఇష్టప్రకారమే కోడల్ని తెచ్చుకుంది. కోడళ్లు కూడా ఆమె ఎంత చెబితే అంతా! ఏ రోజు ఆవిడ మాటకు ఎదురు తిరగలేదు. ఇలా నల్లేరు మీద నావలా జీవితం  సాగుతుండగా ఒక రోజు రత్నమ్మ కి కాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. ఆవిడ కు చాలా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర వైద్యం చేయించడానికి కొడుకులు సిద్ధపడ్డారు. కానీ రత్నమ్మ. ఇంక తాను వచ్చిన పని అయ్యిపోయింది.. పిల్లల కోసం బ్రతికింది. ఇక పిల్లలను కోడళ్ల చేతిలో పెట్టాక తాను ఇంక నిష్క్రమించాలని భగవంతుడు నిర్ణయించుకున్నాడని గ్రహించింది.

ఆస్తి అంతా కొడుకుల, కోడళ్ల పేర రాసేసింది.  కాశీ వెళ్ళిపోవాలనుకుంది. పిల్లలు వద్దంటున్నా కాశీలో ముముక్షి భవన్ లో ఉండటానికి నిర్ణయించుకుంది. ఇక తప్పేది లేదని పిల్లలు ఆవిడకు ముముక్షి భవన్ లో ఒక ఇల్లు కొని ఇచ్చారు. అక్కడే డాక్టర్ల చేత వైద్యమూ చేయించసాగారు. రోజూ అక్కడ జరిగే మాతాజీ భక్తులతో చేసే సత్సంగాలు, పొద్దుటే రోజూ చేసే గంగా స్నానము, ఆ తరవాత విశ్వనాథుడి దర్శనమూ, మళ్లీ సాయంత్రము గంగా హారతి చూడటం. ఇలా ఆవిడకు కొత్తగా ఏదో లోకంలో తేలిపోయింది రెండేళ్ల  పాటు.

ఆ సమయంలో ఆవిడకు ఆవిడ ఇల్లు కానీ, పిల్లలు కానీ కోడళ్లు కానీ గుర్తుకురాలేదు. ఏదో తెలియని కొత్త అనుభూతితో శరీరం అంతా ప్రకాశవంతమయ్యింది. ఆ కాశీ విశ్వేశ్వరుడు దయ వల్ల ఆవిడ కాన్సర్ రోగం మాయమైపోయింది. పూర్వం కన్నా ఇప్పుడు చాలా బలంగా ఉన్నట్టు అనిపించింది ఆవిడకు. కాశీ లో మాతాజీ చెప్పే దివ్యభోదనలతో రోజులు చాలా ఉత్సాహంగా దొర్లిపోయాయి. పూర్తి వైరాగ్యంలో కాలం గడపసాగింది రత్నమ్మ! ఆ రెండేళ్లలో  కొడుకు, కోడళ్లు నాలుగు సార్లు వచ్చి వెళ్ళారు.

ఇలా ఉండగా ఒకరోజు పెద్ద కొడుకు నుంచి ఫోన్ వచ్చింది.. “ఎన్నో ఏళ్లుగా కోర్ట్ వ్యవహారంలో ఉన్న 150  కోట్ల ఆస్తి వారికే వచ్చినట్లు ”  చెప్పాడు పెద్దకొడుకు.

ఆ వార్త విన్నాక రత్నమ్మ గారి మనస్సు మనస్సులో లేదు.. ఆ డబ్బు పిల్లలు ఏంచేసి పాడు చేసేస్తారో, పెద్దకోడలు పుట్టింటివారికి దోచిపెడుతుందో, చిన్నకోడలు ఏమాత్రం అనుభవం లేని రియల్ ఎస్టేట్ లో పెడుతుందో అన్న భయం ఎక్కువయ్యింది రత్నమ్మగారికి.

మరునాడే తన ఊరికి వెళ్ళడానికి టికెట్ తీసుకుంది. మాతాజీ చాలా వారించారు..”రత్నమ్మ గారూ. అన్నీ వదిలి ఈ విశ్వేశ్వరుడు సన్నిధికి వచ్చేశారు మీరు. ఆ భగవంతుడు మీ వైరాగ్యానికి పెట్టే పరీక్ష ఇది.. , మీరు ఇలాంటి వాటికి లోబడకండి. ఆ డబ్బు మీది కాదు. అది ఎవరు ఏ విధంగా చేసుకుంటే మీకెందుకు? మీ పిల్లలకి కూడా అనుభవం రానివ్వండి, బాగా పండిన దోశపండు తొడిమను వదిలినట్టు ఈ మోహాలన్నీ విడిచిపెట్టాలి, మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళకండి.  అసలు ఈ శరీరం, ఈ జీవితం  మీది కాదు. క్యాన్సర్ తో బాధపడేది మీ పాత శరీరం, ఈ కొత్త శరీరం భగవంతుడి జ్ఞానజ్యోతితో ప్రకాశిస్తోంది, మళ్ళీ ఆ అంధకారంలోకి తీసుకొని వెళ్ళకండి   ” అని చాలా విధాలుగా చెప్పి చూశారు..

“మీ జీవితాన్ని సంపాదించిన ధనంతో కాదు మీరు గడించిన పుణ్యంతో  లెక్కబెట్టాలి, మీకు ఆ విశ్వేశ్వరుడు ఇచ్చిన సదవకాశం ఈ శరీరంతో పుణ్యం చేసుకోవడం.” అని మళ్ళీ మాతాజీయే అన్నారు.

“క్షమించండి మాతాజీ! ఒక్క నెలలో అన్ని విషయాలు సద్దుబాటు చేసి వచ్చేస్తాను, నన్ను ఇబ్బంది పెట్టకండి ” అని నమస్కరించి బయలుదేరారు రత్నమ్మ గారు.

****

రత్నమ్మ ఫ్లైట్ దిగగానే కొడుకులిద్దరూ, కోడల్లిద్దరూ ఆవిడను రిసీవ్ చేసుకోడానికి వచ్చారు. రాగానే ఆవిడ చెయ్యి పట్టుకొని కుశల ప్రశ్నలు వేశారు. చాలా రోజుల తరవాత పిల్లల్ని కలిసిందేమో.. చాలా ఎమోషనల్ అయ్యింది రత్నమ్మ. కారులో ఇల్లు చేరుకుంది. ఇంట్లోకి వచ్చాక, పెద్దకోడలు అందరికీ కాఫీ ఇచ్చింది. కాసేపు కబుర్లు, కుశల ప్రశ్నలయ్యాక చిన్న కొడుకూ, కోడలు. “ఇక మేము బయలుదేరుతాము ” అని అన్నారు

అయ్యోమయంగా చూసింది రత్నమ్మ.. “అది. ఇప్పుడు మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండటం లేదు అమ్మా! వాడు పక్క వీధిలో ఉన్న మన బంగ్లాలో ఉంటున్నాడు, ఇలా అకేషనల్ గా కలుసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. నువ్వే చెప్పూ ఒకే ఇంట్లో ఉంటూ గొడవలు పడే కన్నా, వేరుగా ఉంటూ కలిసి ఉండటమే మేలు కదా ” అని ఆవిడకు జవాబు చెప్పే అవకాశం ఇవ్వకుండా అంతా తానే చెప్పేశాడు పెద్ద కొడుకు.

రత్నమ్మ ఇల్లు చేరి రెండు రోజులౌతోంది. కొడుకులూ, కోడళ్లు ఒకే ఇంట్లో ఉండేవారు తాను కాశీకి వెళ్ళే సమయానికి, కానీ తాను తిరిగి వచ్చేటప్పటికి ఇద్దరూ వేరు వేరు కాపురాలు. వ్యాపారాలు కూడా విడివిడిగానే చేస్తున్నారు. ఒకటిగా ఉంటారనుకున్న పిల్లలు ఇలా వేరు వేరు అయ్యేటప్పటికి తట్టుకోలేకపోయింది రత్నమ్మ. కోడళ్ల  ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. చాలా అణిగిమణిగి ఉండే కోడళ్లు ఇప్పుడు కాస్త జూలు విదులుస్తున్నారనిపించింది.  అన్నిటికీ సమాధాన పడింది, ఇక ఆ డబ్బు విషయం మాట్లాడాలని అందరినీ ఒకరోజు తన దగ్గరకు రమ్మంది. వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా ఒకటి చేయాలి. ఆ నూటాభై కోట్లతో కొత్త వ్యాపారం ఏది చెయ్యాలో చెప్పాలనుకుంది.

ఆవిడ కోరుకున్నట్టుగానే ఒకరోజు సాయంత్రం ఆవిడ కుటుంబం అంతా ఆవిడ దగ్గర కూర్చుంది. చాలా సేపు ఆవిడ ఆరోగ్యం గురించి వాకబు చేసారు ఆవిడ కొడుకులు. చాలా ఆనందపడింది. అప్పుడు పిల్లలతో రత్నమ్మ” ఆ నూటాభై  కోట్ల ఆస్తి మన ఊరిలో ఇంకొన్ని ఎకరాలు కొని రిసాస్ట్స్ కట్టించాలని అనుకుంటున్నాను, ఇంకా కొంత డబ్బు” అని ఏదో  చెప్పబోతుండగా..

“లేదు అత్తయ్య గారు. ఆ డబ్బుతో మేము సిటీలోనే రియల్ ఎస్టేట్ లో  పెట్టాలని అనుకుంటున్నాము ” అని పెద్దకోడలు అంది..

రత్నమ్మ ఈ ఎదురు సమాధానం తట్టుకోలేపోయింది..” అది కాదు. మీకు ఇక్కడ వ్యవహారాలు తెలీవు..” అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా

“అత్తయ్యా. వ్యవహారం తెలియకపోతే కొన్నిరోజులకు అదే తెలుస్తుంది.. నడక వచ్చే  పిల్లాడిని నడిచేలా చెయ్యాలి. ఎత్తుకొని మీరు నడిపిస్తే ఆ పిల్లాడికి నడక ఎలా వస్తుంది. అలాగే తయ్యారు చేశారు మా భర్తలని ” అని నిష్టూరంగా చిన్నకోడలు అంది..

వస్తోన్న కోపం తమాయించుకొని ” కాస్త డబ్బులు చేతబడగానే మాటలు బానే వచ్చాయి..హ్మ్మ్. నా కొడుకుల కోసం కష్టపడ్డాను.. ఇంత డబ్బు సంపాదించాను.. ఎన్నో కష్టాలు పడ్డాను, ఇలా డబ్బుని దుర్వినియోగం చేస్తుంటే చూడలేను ఆవాలు ఒక్కొక్కటే ఏరి పోగేసి ముద్ద చేసి ఇచ్చినట్టు ఇచ్చాను ఈ ఆస్తిని..” అని అంది

” చూడండి అత్తయ్యా. అన్నీ వదిలేసి వెళ్లిపోయిన మీరు మళ్ళీ వెనక్కి రావడానికి కారణం ఈ డబ్భే కదా, ఇకపోతే మీరు కష్టపడి పెంచింది మీ పిల్లలనే, ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయ్యిపోకండి..  ఈ డబ్బు మా ఇష్టప్రకారం వాడుకుంటాము. ఈ విషయంలో మీ సలహాలు మాకు వద్దు ” అని చిన్న కోడలు తేల్చి చెప్పింది.

కొడుకులు ఏమాత్రం వారిని ఊరుకోమని చెప్పకపోవడం మరింత బాధపెట్టింది రత్నమ్మని. అలా చూస్తూ కుప్పకూలిపోయింది..

తనలో నుంచి ఏదో బయటకు వెళ్ళిపోతున్న భావం.. “వైరాగ్యం వచ్చినప్పుడు భగవంతుడు అది నిజమైన వైరాగ్యమా కాదా అని పరీక్ష పెడతాడు. మీ జీవితం ఆయన బిక్ష.” ఇలా మాతాజీ మాటలు వినపడుతున్నాయి.. కానీ శరీరంలో తాను లేదు…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *