March 28, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 40

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

శ్రీమహావిష్ణువు విశ్వానికంతటికీ ఆదిమూలం, భర్త, కర్త సర్వం తానే. విష్ణుమూర్తి రూపమైన శ్రీనివాసుని ఆర్తితో వేడుకుంటున్నాడు అన్నమయ్య. భవ బంధాలనుండి, లంపటాలనుండి నీ అభయ హస్తం చాచి మమ్ములను రక్షించు దేవా అని కీర్తిస్తున్నాడు అన్నమయ్య కీర్తనలో.

 

కీర్తన:

పల్లవి: విభుడ వింతటికి వెరపుతో ననుగావు

అభయహస్తముతోడి ఆదిమూలమా            || విభుడ ||

 

.1. పలులంపటాలచేత బాతువడి పాటువడి

అలసితి గావవే వో ఆదిమూలమా

చలమరి యితరసంసారభ్రాంతి జిక్కితి

న్నలరించి కావవే వోఆదిమూలమా             || విభుడ ||

 

.2. యెంతకైనా నాసలచే యేగేగి వేసరితి

నంత కోప గావవే వో ఆదిమూలమా

సంతలచుట్టరికాల జడిసితి నిక గావు

అంతరాత్మ నాపాలిఆదిమూలమా               || విభుడ ||

 

.3. రంటదెప్పుటింద్రియాల రవ్వైతి గావవే వో

అంటినశ్రీవేంకటాద్రిఆదిమూలమా

గెంటక ముమ్మాటికిని నీకే శర

ణంటి గావవే వో ఆదిమూలమా

(రాగం: పాడి, సం.2. సంకీ.66)

 

విశ్లేషణ:

పల్లవి: విభుడ వింతటికి వెరపుతో ననుగావు

అభయహస్తముతోడి ఆదిమూలమా

సర్వ సృష్టికి విభుడైన వేంకటేశ్వరా! ఆదిమూలమైన శ్రీహరీ!నీ అభయ హస్తంతో మమ్ములను ఉద్ధరించు స్వామీ! అని ఆర్తిగా వేడుకుంటున్నాడు అన్నమయ్య.

 

.1. పలులంపటాలచేత బాటువడి పాటువడి

అలసితి గావవే వో ఆదిమూలమా

చలమరి యితరసంసారభ్రాంతి జిక్కితి

న్నలరించి కావవే వోఆదిమూలమా

          మాయా ప్రపంచంలో అనేక లంపటాలతో, గుదికొయ్యలవలె తగులుకొన్న బంధాలతో బాధలు పడి, పడి మిక్కిలి అలసిపోయాను నన్ను కాపాడు. సంసార భవ బంధాలలో చిక్కుకొని అరిషడ్వర్గాలనే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలతో అలసిపోయాను.నా అలసట పోగొట్టి చేరదీసి రక్షించరాదా స్వామీ!

 

.2. యెంతకైనా నాసలచే యేగేగి వేసరితి

నంత కోప గావవే వో ఆదిమూలమా

సంతలచుట్టరికాల జడిసితి నిక గావు

అంతరాత్మ నాపాలిఆదిమూలమా

          శ్రీనివాసా! ఆదిమూలమా! నా ఆశలను తీర్చుకోవడానికి ఇంతకాలం పరుగులు పెట్టి పెట్టి అలసిపోయాను. ఇప్పుడు ఓపికతో కావవలసిన బాధ్యత నీదే! నాకున్న బంధుత్వాలు, చుట్టరికాలు సంతలో దర్శనమిచ్చే వ్యక్తుల లాంటివే! ఏదో కొద్దిసేపు పరామర్శించి మాయమయేవే! శాశ్వతం కాదని నాకు తెలుసు. వారెవ్వరూ ఆపదలలో నన్ను ఆదుకోవడానికి ముందుకు రారు. అన్నిటికీ నీవే దిక్కు. నన్ను కరుణించి సద్గతులు ప్రసాదించే బాధ్యత నీదే సుమా!

 

.3. రంటదెప్పుటింద్రియాల రవ్వైతి గావవే వో

అంటినశ్రీవేంకటాద్రిఆదిమూలమా

గెంటక ముమ్మాటికిని నీకే శర

ణంటి గావవే వో ఆదిమూలమా

స్వామీ! నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా! ఇంద్రియాల సుడిగుండంలొ పడి సుళ్ళు తిరుగుతూ రవ్వ రవ్వలుగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయాను. సుఖదు:ఖాలకు, ఇంద్రియ సుఖాలకు బానిసనయ్యాను. ఇప్పుడు త్రికరణశుద్ధిగా నిన్ను శరణు కోరుతున్నాను. నన్ను నీ పాదాల వద్దనుండి గెంటివెయ్యకుండా కైవల్యం ప్రసాదించు స్వామీ అని దీర్ఘ శరణాగతి కోరుతున్నాడు అన్నమయ్య.   

           

ముఖ్యమైన అర్ధాలు: విభుడు = భర్త, కర్త; ఆదిమూలము = ముఖ్యమైన తల్లివేరు; లంపటము = పలువిధములైన కష్టాలు; అలరించి = కాపాడి; యేగేగి = వృధా పరుగులు; సంతల చుట్టరికాలు = సంతలలో, వ్యాపార కూడళ్ళలో కొనేవారు, అమ్మేవారు తాత్కాలిక సంబంధం పెట్టుకుని పని అవగానే ఎవరి దారిన వారు వెళ్ళే చుట్టరికాలు; జడిసితి = భయపడ్డాను; రంటదెప్పుటింద్రియాలు = కలయికవేళలు, ఇందిర్యాల సుడిగుండం అనే అర్ధంలో; ముమ్మాటికి = మూడు విధాల అనగా మనసా, వాచా, కర్మణా అనే అర్ధంలో; శరణంటి = నీవే తప్ప ఇతర గత్యంతరం లేదు అని చెప్పడం.    

-0o0-

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *