May 25, 2024

అమ్మమ్మ – 5

రచన: గిరిజ పీసపాటి

నాగ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్న వారి కుటుంబంలో వారి పాపలాగా కలిసిపోయింది. ఆ అద్దెకుంటున్న వారికి‌ ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. బొటాబొటీగా వచ్చే ఆదాయంలో గుట్టుగా బతుకుతున్న మంచి మనసున్న మనుషులు. వారి ఆఖరి అమ్మాయి నాగ కన్నా మూడు లేక నాలుగేళ్ళు పెద్ద ఉండొచ్చు. అందరికన్నా పెద్దబ్బాయికి వివాహం కూడా అయింది. ఆయన భార్య చాలా మంచి ఇల్లాలు. మగ పిల్లలందరినీ అన్నయ్యా అనీ, ఆడపిల్లలందరినీ అక్కయ్యా అనీ, పెద్దన్నయ్య భార్యను వదినా అని వచ్చీ రాని ముద్దు మాటలతో‌ పిలుస్తూ తనూ వారి కుటుంబంలో ఒక భాగమే అన్నట్లు ఉండేది నాగ.

తిండి, నిద్ర, స్నానం, ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు అన్నీ అక్కడే, వాళ్ళతోనే. వాళ్ళ ఆఖరి అమ్మాయి వాడిన గౌనులే నాగకి తొడిగేవారు. మల్లెపూలు వీధిలో అమ్ముతుంటే తనకొక్కర్తికే పమిట వేసుకున్నంత దండ కావాలని పేచీ పెట్టి మరీ కొనిపించుకునేది పెద్దన్నయ్య చేత. అందరూ చిన్న చిన్న దండలు పెట్టుకుని నాగకి‌ మాత్రం ఆరేడు మూరల దండ పెట్టి మురిసిపోయేవారు.

ఆఖరికి‌ నాగకు ఏనాడూ కొత్త బట్టలు కూడా కొనలేదు తాతయ్య, అమ్మమ్మ. తమ చేత్తో కొన్న బట్టలు వేసుకుంటే ఈ పిల్ల కూడా తమకు ఎక్కడ దూరమైపోతుందోననే భయం. కళ్ళెదురుగా కన్నబిడ్డని పెట్టుకుని కూడా కళ్ళారా ఆమె ముద్దు ముచ్చటలు తీర్చలేక, ఆటపాటలు చూడలేక, అందరూ ముద్దు చేస్తున్న తమ బిడ్డని తాము ముద్దాడలేక భయపడి, నాగ అసలు తమ పిల్ల కానట్లే దూరంగా ఉండేది అమ్మమ్మ.

ఒక కన్నతల్లి మనసులోనే తన మాతృత్వపు మమకారాన్ని అణచుకుని బతకడం కన్నా‌ దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? పగవారికి కూడా తన పరిస్థితి రాకూడదని దేవుడిని కోరుకునేది అమ్మమ్మ. నాగకి రెండు నిండి మూడో ఏడు రావడం, తెనాలి తాతయ్య జాబ్ నుండి రిటైర్ అవ్వడం జరిగింది. అడపాదడపా పీసపాటి తాతయ్య నాటకాల రీత్యా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తెనాలి తాతయ్యను కలిసి‌ వెళ్ళేవారు.

ఒకసారి పీసపాటి తాతయ్య అలా వచ్చినప్పుడు ఒక నాటక సంస్థ సరిగా నిర్వహించేవారు లేక మూలపడబోతోందని తెలియడం, తాతయ్యలు ఇద్దరూ, మరికొందరు నటులు కలిసి ఆ సంస్థను తాము తీసుకుని తిరిగి పాత వైభవాన్ని కలిగిస్తే బాగుంటుందేమో అనే ప్రతిపాదన వచ్చింది. అందరూ ఆలోచించి, సమ్మతిని తెలియజేయడంతో, సమాజాన్ని నడపాలనే నిర్ణయానికి వచ్చారు. దానికి తెనాలి తాతయ్యను మేనేజర్ గా ఉండమని పీసపాటి తాతయ్య కోరడం, తెనాలి తాతయ్య అంగీకరించడం జరిగింది.

ఆవిధంగా ‘ఆంధ్రా ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే సిక్ అయన ఒక నాటక సమాజాన్ని వీరు తీసుకుని పునరుధ్ధరించే భాగంలో సంస్థ ద్వారా విరామం లేకుండా నాటక ప్రదర్శనలు ఇవ్వసాగారు. అందరూ ప్రముఖ నటులే కనుక ప్రతీ నాటకానికీ విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. అదే సమయంలో తను స్వయంగా రచించిన ‘రాజ్యకాంక్ష, పృధ్వీ పుత్రి, గౌతమ బుధ్ధ’ నాటకాలను కూడా స్వీయ దర్శకత్వంలో పీసపాటి తాతయ్య మరియు ట్రూప్ ద్వారా ప్రదర్శనలిప్పించేవారు తెనాలి తాతయ్య. అతి కొద్ది కాలంలోనే మంచి సంస్థగా పేరు తెచ్చుకుంది.

నాగకు మూడవ ఏడు నిండి నాలుగో ఏడు వచ్చింది. అంతా బాగానే ఉన్నా ఎప్పుడు ఎటువైపు నుండి మృత్యువు ఏ రూపంలో‌ వచ్చి నాగను కబళిస్తుందోననే భయం ఎక్కువైంది అమ్మమ్మకి. తాతయ్య తరచూ నాటక ప్రదర్శనలు ఇచ్చే పనిమీద ఊర్లు తిరగడం వల్ల పేకాట పూర్తిగా మానేసినా తన మనసులోని భయాలను చెప్పుకుందామంటే సమయం చిక్కేది కాదు.

ఇంతలో రానే వచ్చింది తాము రాకూడదని కోరుకున్న రోజు. రాత్రి పడుకున్న నాగ ఒళ్ళు తెలియని జ్వరంతో మూలగసాగింది. దాంతో తమ దగ్గర పడుకోపెట్టుకున్న అద్దె ఇంటివారు అర్ధరాత్రి వీళ్ళను లేపి విషయం చెప్పడం, ఆరోజు అదృష్టవశాత్తూ ఇంటి దగ్గరే ఉన్న తెనాలి తాతయ్య నాగని భుజం పై వేసుకుని తమ ఇంట్లో మెత్తటి పక్క మీద పడుకోబెట్టి, ఆచారి గారికి‌ కబురు చేయగా, వారు వచ్చి నాగని పరీక్షించి, మందులు ఇచ్చి, తెల్లవార్లూ గంటకి ఒక డోసు చొప్పున వెయ్యమని చెప్పారు.

******* సశేషం ********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *