March 29, 2024

కంభంపాటి కథలు – సీక్రెట్

రచన: రవీంద్ర కంభంపాటి

హ్యుండాయ్ వెర్నా కారు హుషారుగా డ్రైవ్ చేస్తున్న వసంత్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ‘వావ్ ..వెదర్ భలే రొమాంటిగ్గా ఉంది కద’ అన్నాడు.
‘అందుకేగా సరదాగా బయటికి వెళదామని అడిగింది…ఏసీ తగ్గించండి .. కొంచెం చలిగా ఉంది ‘ కొంటెగా నవ్వుతూ దగ్గిరికి జరిగింది సుమ
‘చలిగానే ఉండనీ .. నువ్వు దగ్గిరకి జరిగితే వేడి పెరిగింది ‘ ఎడం చేత్తో సుమ నడుం చుట్టూ చెయ్యేస్తూ, నవ్వేడు వసంత్
అంత వరకూ భోరున కురిసిన వాన అలిసిపోయినట్లు ఒక్కసారిగా ఆగిపోయింది . అప్పటివరకూ రోడ్డు పక్కనున్న చెట్ల కింద దాకున్న బైకులన్నీ ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేసి , ట్రాఫిక్ పెరిగింది .
‘ఛ .. ఈ వెధవ ఊళ్ళో రొమాంటిగ్గా ఓ డ్రైవ్ కి వెళదామంటే కుదిరి చావదు .. ఇప్పుడు చూడు.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిందే ‘ విసుక్కున్నాడు
‘విసుగెందుకూ .. మనం హాయిగా కార్లోనే ఉన్నాం కదా .. సరదాగా బయటనున్న జనాల్ని చూస్తూ ఎంజాయ్ చెయ్యండి .. ‘ అంది సుమ , సీట్లో కుదురుగా కూచుంటూ.
వసంత్ అన్నట్టుగానే , నిమిషాల్లోనే రోడ్డు మీద ట్రాఫిక్ పెరిగిపోయింది .. ముందునున్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆర్టీసీ బస్సొకటి బ్రేక్ డవునైనట్టుంది .. వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయేయి . ఖాళీగా ఉండడం ఎందుకని జనాలు ఎవరి హారన్ వాళ్ళు బయ్యని మోగించేస్తున్నారు !
‘ఛ ..అనవసరంగా బయల్దేరేం ‘ విసుక్కున్నాడు వసంత్
‘ఇందాకే రొమాంటిగ్గా ఉందన్నారు ‘ నవ్వుతూ అంది సుమ
‘అది ఇందాక.. ఇది ఇప్పుడు ‘ చిరాగ్గా బదులిచ్చేడు
‘అలా విసుక్కునే బదులు .. హాయిగా బయటనున్న రకరకాల జనాలూ .. వాళ్ళు చేసే పన్లూ చూడొచ్చు కదా .. ‘
‘ఏమిటి చూసేది ? ఐతే హారన్ మోగిస్తున్నారు .. కాకపోతే ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారు .. వాళ్లిద్దరూ తప్ప ‘
‘ఏ ఇద్దరూ తప్ప ?’ అడిగింది
‘అదుగో .. ఆ డ్యూక్ బైక్ మీద కూచున్న పెయిర్ చూడు .. ఆ పిల్ల ఆ కుర్రాణ్ణి ఎలా అతుక్కుపోయి కూచుందో ‘ అన్నాడు
‘బావున్నారు కదా ఇద్దరూ ‘ అంది
‘ఏమిటి బావుండేది ? వాడు మొహం కనబడ్డం లేదు .. ఈ పిల్ల మొహం కనబడకుండా తీవ్రవాదిలా చున్నీ తో తన మొహం చుట్టేసుకుంది .. ముసుగేసుకుని పబ్లిగ్గా రొమాన్సేమిటో ?’ కోపంగా అన్నాడు వసంత్
‘అందరికీ మనలా కారులో రొమాన్స్ చెయ్యాలంటే కుదరదు కదండీ ‘ అంది
చురుగ్గా చూసి , మొహం తిప్పుకున్నాడు
‘ఉన్నమాటంటే భలే కోపం మీకు ‘ నవ్వుతూ అంది సుమ
ట్రాఫిక్ ఎంతకీ కదలడం లేదు .. కొంతమంది ఆ ఆగిన బస్సుని ముందుకు తొయ్యడానికి ప్రయత్నిస్తున్నారు ..కానీ .. అది ముందుకు కదలడం లేదు .
ఇంతలో ఆ బైక్ మీద పిల్ల ఏవనుకుందో ఓసారి మొహం మీదనుంచి చున్నీ తీసి మళ్ళీ కప్పుకుంది .
ఆ పిల్ల మొహం చూసిన వసంత్ మొహం పాలిపోయింది . నిత్య..తన కన్న కూతురు..
ఇలా బరితెగించి ఎవడో వెధవ తో పబ్లిగ్గా బైకెక్కి అతుక్కుపోయి కూచోడం.. అస్సలు ఊహించలేదు .. బోలెడు డబ్బులు కట్టి ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పిస్తే , ఇదేమో ఇలా సిగ్గులేకుండా తిరుగుతూందా . తను ఏదడిగితే ఎందుకు అని కూడా ఆలోచించకుండా కొనిచ్చేడు. ఉదయం ఇంటి దగ్గిరే కాలేజీ బస్సు ఎక్కుతుంది .. దొంగ రాస్కెల్ .. కాలేజీ పేరు చెప్పి ఎవడో వెధవ తో ఇలా తిరుగుతూందన్నమాట ! ఇంత బాగా చూసుకుంటూంటే తనని ఇలా మోసం చేస్తుందా. ‘మిగతా పిల్లల్లా కాదు మా అమ్మాయి సోషల్ మీడియా లో ఉండదు ..అంత స్పెషల్ తను’ అంటూ నలుగురికీ గర్వంగా చెప్పుకునేవాడు .. అలాంటిది .. ఇప్పుడిప్పుడే ఇంజినీరింగ్ లో జాయినైన పద్దెనిమిదేళ్ల పిల్ల ఆ వెధవ ఎవడి మీదకో అలా బల్లిలా అతుక్కుపోయి కూచోడం చూసి తట్టుకోవడమే కష్టంగా ఉంది తనకి !
‘అదేమిటి ? మీ మొహం అలా నీరసంగా అయిపొయింది ? ఒంట్లో బాగానే ఉందా ?’ కొంచెం కంగారుగా అడిగింది సుమ
‘అక్కడ చూడు ..ఆ బైక్ మీద ఉన్న అమ్మాయి ఎవరో కాదు… నిత్య ‘ బాధగా అన్నాడు వసంత్
”అవునా !!.. ఏదీ ?..వెంటనే వెళ్లి రెండు చెంపలూ వాయించెయ్యండి ‘ అంటున్న సుమతో ,
‘ఇంకా నయం .. నీకసలు బుర్రుందా ?? ఇప్పుడు నిత్య మనల్ని చూసిందంటే .. నేను నీతో ఉన్న సంగతి వాళ్ళమ్మ ..అదే .. మా ఆవిడ తో చెప్పేస్తుంది..అప్పుడు మీ ఆయన నిన్నూ , మా ఆవిడ నన్నూ వాయించేస్తారు ..ఏదో సీక్రెట్ గా ఇలా కానిస్తున్నాం .. ‘ అన్నాడు బాధ, ఉక్రోషం కల్సిన గొంతుతో వసంత్

3 thoughts on “కంభంపాటి కథలు – సీక్రెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *