May 19, 2024

గిలకమ్మ కతలు – బాతుగుడ్డెక్కిన కోడి

రచన: కన్నెగంటి అనసూయ

“ అయినియ్యా రాతలు..? తెల్లారగట్టనగా మొదలెట్టేవ్ రాత్తం. అదేదో దేశాన్నుద్దరిత్తాకి పేద్ద పేద్ద డాట్రు సదువులు సదుంతున్నట్టు. ఏం రాతలో ఏవో..! ఇయ్యేటికవుతయ్యో లేదో బాబా..”
గుల్లుప్పోసి కుండలో లోపలకంటా కూరిన పిక్కల్దీసిన సింతపండుని సిన్న డబ్బాలోకి తీసుకొత్తాకి మూలగదిలోకెల్లి వత్తా వత్తా..అక్కడే కింద వసారాలో మడిగాళ్ళేసుకుని కూకుని ఓమొర్కులో ములిగిపోయిన గిలక్కేసి సూత్తా ఇసుగ్గా అంది సరోజ్ని.
“య్యే..! దానిపని నీకేవొచ్చిందే సరోజ్నే రాస్కోనివ్వక? కొండల్ని గుండగొట్టాలా యేటది?మల్లీ ఏవన్నా అంటే అన్నానంటాక్కానీ.. “
అప్పుడే కోసుకొచ్చిన కనకాంబరం పూల్ని దండ కడతా గిలకమ్మని ఎనకేసుకొచ్చింది ఆల్ల అమ్మమ్మ సుబ్బాయమ్మ.
ఏసంకాలంలో వడేలెడతాకొచ్చి ఆమట్నే ఉండిపోయిందేవో..సుబ్బాయమ్మకీ పొద్దు ఎల్తాలేదు. లేత్తానే కూతురు ఇస్టీలు గళాసుతో తెచ్చిచ్చిన కాపీ పుచ్చుకుని ఆమట్నే దోడ్డెనకాలకెల్లిందేవో.. సెట్టు సుట్టూతా రాలి కిందడిపోయిన కనకాంబరం పూలని సూసి “అయ్ మీ కడుపులు మాడ. సెట్టేత్తవెంతుకో పూలు కోసుకుండగాని. రాలి అట్తే కిందడ్దాయ్. ఉన్నదొక్కగానొక్క కుర్రముండ. ఆ నాలుగూ కోసి ఆమట్న దండ కడ్తే అదెట్టుకోదా? రాలి సచ్చినియ్..” అని తిట్టుకుంటా సెంగులోకి కాసిన్ని కనకాంబరం పూలుకోసుకొచ్చి దారపు రీలందుకుంది ..మాలకడ్దావని.
“ ఏటో మాయమ్మ మనవరాల్ని ఇట్తే ఎనకేసుకొత్తన్నాది. పూల్దండ కట్టేతలికి వాసనంటేసి మా ఇదైపోయిన్నట్టుందేటే అమ్మా. ..నీకు? దాన్నెనకేసుకొత్తన్నావ్? ఏ ఝామైందది అక్కడయ్యేసుకుని కూకుని..” కయ్యుమంది సరోజ్ని..
కూతురుకంటే నాలుగాకులెక్కువే సదివిందేవో సుబ్బయమ్మ… ఆవిడూరుకుంటదా..
తాస్పామల్లే ఇంతెత్తున లెసింది కూతురు మీద..
“ నోర్మూసుకో..! పిల్లామట్న రాసుకుంటంటే ఏడేడి పాలుగాసి తెచ్చిత్తం మానేసి మాటలోటా? నీకెలాగా అచ్చరం ముక్క రానే లేదు. దాన్నన్నా సదుంకోనియ్యి. మీ నాన్నెంత తవుసట్టేడో నీ సదుంకోసం. బళ్ళోకెల్తేనా? “ అంటా నాలుగు కనక్కాంబరం పూలు రెండటు రెండిటు పెట్టి తోకలు కలిపి దారంలోకి దూరుత్తా గిలక్కేసి తిరిగి..
“ ఆ సదివిన నాలుక్కళాసులు దాకా పల్కా, బలపాలకిడాకులేనే గిల్కా. పుత్తకాలకి ఇంకైతే ఒట్టు..వచ్చినోడు వచ్చినట్టుండేవోడు మేస్టరుగారు..” సరోజ్నమ్మ సంచీ తెరిత్తే ఒట్తమ్మా.. సదుంతుం లేదమ్మగోరూ “ అని.
ఆయనొచ్చినప్పుడల్లా ఏ ఆనపకాయ ముక్కో, గుమ్మిడికాయ ముక్కో , కందముక్కో ఎతుక్కోలేక సచ్చీదాన్ని..పచ్చిమిర్గాయలో సంచీలో ఏసిత్తాకి. ఏమాటకామాటే సెప్పుకోవాలి..సెట్లకి రెండు వంకాయలుంటే ఆ రెండే అట్టుకెల్లీవోడు..ముండా మేష్టరు..ముండామేస్టరని..”
“నా కూతురు సదుంకేంగానీ …నువ్విచ్చే ఆటికోసం వత్నాడా మేష్టరని మియ్యమ్మని ఎనకేసుకొచ్చేవోడు మీ తాత. మియ్యమ్మ మింద గాలారనిచ్చేవోడా..ఈగ వాల్నిచ్చేవోడా మీ తాత.. ?”
“ అయ్యన్నీ ఎంతుకే ఇత్తం అమ్మమ్మా..?” రాస్కునే రాస్కునేదల్లా తలెత్తడిగింది గిలక సుబ్బాయమ్మొంక సూత్తా..
“ అయ్యా..! ఇవ్వాపోతే బళ్లోంచి పంపేత్తాడేవోనని నా గుండెల్దడెత్తిపోయ్యేవే గిలక..మీ తాత్తో పళ్ళేను గందా..మాటాడితే కర్రెత్తీసీవోడు..ఏదో నాలుగచ్చరం ముక్కలు రాతం వొత్తే ఉత్తరవన్నా రాత్తదనీవోడు.. ”
“…ఇయ్యాల .. నిన్నంటాకి దానికి నోరెలా వత్తందోగానీ మీయమ్మకి..సిన్నప్పుడు అజ్జేసిన అల్లరికి సగం ఆయుస్సయిపోయిందే గిలక మీ తాతకి. సంకనాకిచ్చేసేదనుకో..”
“ ఉప్పుడంటే ఇలాటి సంచులొచ్చినియ్యిగానీ…మీయమ్మ సదుంకునే రోజుల్లో ఏసంకాలం శెలవులయ్యాకా బళ్ళు తెరిసే ఏలకి సంచికుట్టిత్తాకని మీ తాత పొలానికి మందేసిన ఈరియా సంచి ఉతికీ ఉతికీ ఎండేసి దాన్నట్టుకుని మిసనోడి దగ్గరికి తిరిగిందాన్ని తిరిగినట్టుండేదాన్ననుకో. అయినా కుట్టి సత్తేనే ఆ సచ్చినోడు. సూదిరిగిపోద్దని తిప్పిందాన్ని తిప్పినట్టు తిప్పీవోడు. అక్కడికీ తిరగలి మీద రాయల్లే ఆడి సుట్టూ తిరగలేక సూదిచ్చుకుని కుట్టిన్రోజులున్నాయ్. “
అంటా సుబ్బయ్యమ్మ ఇంక ఏదో సెప్పబోతుంటే
“నువ్వయ్యన్నీ సెప్పక సెప్పక దానికే సెప్పు. దాన్నోటికి అద్దూ పద్దూ ఉండదింక . ఆల్లున్నారనీ సూడదు..ఈల్లున్నారనీ సూడదు..ఎంతమాటబడితే అంత మాటంతది..” అంటా ..
గిలకమ్మ దగ్గరకంటా వచ్చి..
అడుగున నాలుగాకులేసిన వైరు బుట్ట, డబ్బులూ గిలకమ్మ సేతికందిత్తా..
“ ఇంకా బట్టైమవ్వలేదుగానీ ..సంచక్కడెట్టి..రావులోరి గుడికాడ ..నర్సమ్మామ్ముంది సూడు..”
“ ఏ నర్సమ్మామ్మా..”
“ అదే ..ఎర్రతాత లేడా?”
“ఊ..ఊ..ఆ తాత ఆల్ల మామ్మా..! “
“అమ్మయ్య. ఎల్గిందా? పోన్లే..! బేగినే..బతికిచ్చేవ్. ఆ మామ్మగారిల్లే. ఆల్లింటికెల్లి.. కోడిగుడ్లట్రా..! మొన్నామజ్జన ఏదో ఆయంతిలో కనపడి సెప్పింది..పెట్ట గుడ్లెడతందని..కావాలంటే పిల్లనంపు అని. ” అంది సరోజ్ని..పుస్తకాలు సంచీలో సర్దేసి లేసి నిలబడ్ద గిలకమ్మొంక సూత్తానే బుట్టున్న సేయి ముందుకు సాపుతా..
“ ఎన్ని…” అంది గిలక డబ్బులెనక్కి సూత్తా.
“ ఎన్నుంటే అన్నీ ఇచ్చెయ్ మను. గుడ్డు మూడ్రూపాలు. సరిపోపోతే మల్లీ వత్తానన్సెప్పు..”
“ఇత్తదో..ఇవ్వదో..”
“ అదిత్తదో ఇవ్వదో. ముందు నువ్వే సెప్పేత్తావ్. అపశకునం మాటలూ నువ్వూను..సుభం పలకరా పంతులూ అంటే పెల్లికూతురు ముండని లేపుకురండన్నాడంట. నీలాటోడే..”ఇసుక్కుంది సరోజ్ని.
“తప్పేవంది. అయినందానికీ కాందానికీ పిల్లనాడిపోసుకుంటావ్. అదొక్కటి దొరికింది నీకు తేరగాను. “ అని సరోజ్నిని జగడమాడి..గిలకెనక్కి సూత్తా..
“ ఎల్లు.ఎల్లి మియ్యమ్మిచ్చిన డబ్బులుకి ఎన్నుంటే అన్నియ్యమని పట్రా.ఒకేల ఇంకా ఉంటే ఎన్నున్నాయో అడిగి ఉంచమని సెప్పిరా. ఎవ్వరికీ ఇయ్యద్దు ఇప్పుడే వచ్చేత్తానని సెప్పు. డబ్బులట్టుకుని ఎల్దూగాని..” అంటా గిలకమ్మని దగ్గరకంటా వచ్చి కింద కూకోమన్నట్టు సైగ సేసి అంతకు ముందే బిగిచ్చి సివరకంటా అల్లి రిబ్బను ముడేసిన జడలో మూరడు కనకాంబరాల దండ జడ పొడుగూతా ఏల్లాడేలాగా పెట్టి..పిల్ల ఈపు మీద రెండు సేతులేసి ముందుకు తోత్తా వేల్లిరిసింది..దిట్టి తీత్తన్నట్టు సరోజ్నీ ఆల్లమ్మ కలవలపల్లి సుబ్బాయమ్మ.
“ సాల్లే సంబడం. బాగానే ఏల్లాడతన్నయ్ గానీ ..గుడ్లట్టుకుని అందరూ సూసేరో లేదోనన్నట్టు దండలెగరేసుకుంటా రాక నిదానంగా రా..పగిలిపోతాయ్..” ఎనకనించి కేకేసింది సరోజ్ని.
“నువ్ సెప్పాలి మరి నాకు. గుడ్లు మెల్లిగా తేవాలని నాకు తెల్దు” ఇసుక్కుంది గిలక తలుపు దగ్గరకేసి ఎల్తా..ఎల్తా..
పెద్ద ఎడల్పాటి పేడతో అలికిన దాగరి బుట్టలో..ఎండు గడ్డేసి మెత్తగా ఉంటాకని సిట్టూ తవుడూ పోసినంతసేప్పట్తలేదు గుడ్లట్టుకుని గిలకమ్మొత్తాకి..
వత్తా వత్తానే..”ఇంతుకా గుడ్లట్టుకు రమ్మన్నావ్. పిల్లల్ని సేయిత్తాకా? “
“మరెంతుకనుకున్నా..? ఇన్నేసి గుడ్లు తెప్పిచ్చి అట్టేసిత్తే ఆరగిద్దావనుకున్నావా? “ ఎటకారంగా అంది గిలక దగ్గర్నించి బుట్టందుకుని ఒక్కోటీ సెవి దగ్గరెట్టుకుని ఊగిచ్చి ఊగిచ్చి సూత్తా..
“ఎంతుకలా ఊపుతున్నా ..” అడిగింది సుబ్బాయమ్మ కూతురెనక్కి మా ఇదిగా సూత్తా..
“ జడిసిపోయ్యినియ్యేవోనని. ఓసారిలాగే పిల్లల్జేత్తానని కోడి గుడ్లకంపితే కొనుక్కునీవోల్లెవరూ రాక ఉండిపొయ్యినట్టున్నయ్. పాత గుడ్డిచ్చింది. మూడు వారాలు కోడి ముణగదీసుకుని కూకున్నా పిల్లైతే ఒట్టనుకో. కొనుక్కుంటాకి ఎవ్వరూ రాపోతే గిన్నెలో కాసిన్నీళ్ళోసి పొయ్యి మీదెడితే అదే ఉడుకుద్దిగదా..! ముసిలోడికిత్తే తినడా? అసలే పళ్లన్నీ ఊడి సచ్చినయ్యీయ్యేవో..మెల్లగా నవుల్దుడు. ఏటో..అన్నీ అమ్ముతువే..! మొన్నామజ్జన పాదుక్కాసిన దొండకాయలు ఏబులుం రాయేసి అమ్మిందంట ఆ బేంకులో పన్జేసి ఆవిడికి. గదిలో అద్దెకుంటందనుకో. ఉండేది ఒక్కగానొక్క మడిసి.మొగుడా మొద్దులా? పిల్లలా పితికిలా? నాలుక్కాయిలిచ్చి ఏపుకోమ్మా అంటే ఎంటందంగా ఉండిపోను. ఎక్కడ్నించొత్తయ్..! పేడ కుప్పలోంచి పుట్టిందానికి పిడక బుద్దులు రాక.! మల్లీ ఇంట్లో ఉంటన్న పాపానికి ఏదన్నా పనుండి బేకీకెల్తే ముందు పంపిచ్చెయ్యాలి..ఇదేదో ఊరికినే ఉండనిత్తన్నట్టు..”
“మరలాటప్పుడు మల్లీ దానింటికే ఎంతుకంపా గుడ్లకోసం..ఊరు గొడ్డోయిందా గుడ్లకి. ఇంతబతుకూ బతికి ఇంటెనకాల సచ్చినట్టు..తెలిసీ తెలిసీ దానింటికంపి తెచ్చింది గాక…మల్లీ నోరడేసుకుంటం ఒకటి. ఒకసారయ్యిందిగందా..కూకుని కూకుని పెట్టకి ముడ్డి నొప్పితప్పితే గుడ్డు పిల్లయ్యేనా? అదేదో ముందే సూస్కో..”
“ అంతుకే మరి..సెయ్యూడొచ్చేతట్టు ఊపి మరీ స్సూసేది..ఎంతుకనుకున్నా? అయినా ఇయ్యాలా రేపూ అందరూ తిని సత్తన్నారు. బలవొచ్చుద్దనంట. గసికిల్లాగ తయారవుతున్నారు ఎదవ సోకులని ఎదవ సోకులు. అదొక్కద్దే అమ్ముద్ది. పైకట్టుకెల్లద్దంట ముసలోడిక్కూడా పెట్తకుండా..”
“ ఏడిసినట్టే ఉందిగానీ ..ఎన్నయినియ్యో లెక్కెట్టు. ఎన్ని గుడ్లెడదావనుకుంటన్నా?.”
అంది సుబ్బాయమ్మ బుట్తలోని సిట్టులో సెయ్యెట్టి మునేళ్లతో అటూ ఇటూ తిప్పుతా..
“పెట్త పెద్దదే గడోతల్లే. ఎన్నెట్నా లాగేసుకుంటది ఒళ్ళోకి. ఇరవైయ్యెట్టు..”
“ పెట్టు…అయిదారు అడిలిపోయినా పదేను పిల్లల్దాకా అవుతాయ్..! ఇంతకీ పెట్టనొదిలేసేవా? ఇంకా గూట్టోనే ఉందా? “
“ వదలకుండా ఉంటే సత్తాది. అంతుకే వదిలేసి కాసిన్ని నూకలుంటే జల్లేను.
“మంచి పన్జేసా..! ఒకసారంటూ అనగటం మొదలెట్టిందంటే తిండీ తిప్పలూ ఉండవిక. ఆమట్నే కూకునుంటాది గుడ్ల మీద..”
“కూకోనిత్తావా ఏటి అది కూకుంటానంటే మాత్తరం. రోజూ గంటా, గంటన్నరైనా వదిలేత్తాను.. లేదంటే సచ్చూరుకుంటది.” అంటా గుడ్ల బుట్టదెచ్చి సుబ్బాయమ్మ దగ్గరకంటా పెట్టి..”నువ్ సర్ధుతా ఉండు. రావుకాలం జూసొత్తాను. దాన్ని బట్టి కోణ్ణి పడుకోబెడదాం..” అంటా లోనికెల్లబోతంటే ..
“ఇయ్యాలేవారం..?” అంది సుబ్బాయమ్మ.
“శుక్రోరం…”
“ శుక్రోరం మజ్జాన్నించి గానీ రాదు రావుకాలం..పెట్టనట్టుకురా..గుడ్లెడతం ఎంతసేపు..” అంటా..గుడ్లన్నీ వరసాగ్గా పేర్సి కూతురట్టుకొచ్చే పెట్తకోసం సూత్తన్న సుబ్బాయమ్మ..
ఆయసంతో రొప్పుతా పరిగెత్తుకొచ్చిన గిలకమ్మన్జూసి..
“ ఇప్పుడే గందా ఎల్లేవ్? ఆ సేతుల్లోయేటి..?” అంది నుదురు సిట్లిచ్చి గిలకమ్మనే సూత్తా..
“ గుడ్లు..ఇయ్యి గూడా పెట్తమ్మమ్మా..” అంది గౌన్లోంచి గుడ్లు తీసి వాళ్ల అమ్మమ్మకందిత్తా..
“ ఇయ్యేంగుడ్లే..! నీ కడుపు సల్లగుండా? కోడి గుడ్లు కాదియ్యి. ఏం గుడ్లుయ్యి..? ఇంత పెద్దగా ఉన్నాయ్..”
“ బాతు గుడ్లు..”
“ అయ్ నియ్యమ్మా కడుపు మాడా? అయ్యెక్కడియ్యే నీకు? “ యెనకనించొత్తా సరోజ్నంది.
“ కొన్నా..! “
“ఎక్కడ?”
“ మా బడికాడ సెంద్రమ్మామ్మ ఆల్లు అమ్ముతున్నారు”
“ దయిద్దురుగొట్టుమ్ముండా..నన్నడగద్దేటే తెచ్చేటప్పుడు? బాతుగుడ్డెవడు తెమ్మన్నాడు నిన్ను. అయినా డబ్బులెక్కడియ్ నీకు..”
“నువ్వియ్యి” ఇచ్చి తీరాలన్నట్టు అంటన్న గిలక్కేసి తెల్లబోయి సూసింది..సరోజ్ని.
“ అయినా కోడి కింద బాతు గుడ్డెడితే పిల్లలవుతయ్యని నీకెవరు సెప్పేరు?”
“ కాకి కింద కోయిల గుడ్లెట్టుకుంటే కోయిల్లవుతుల్లేదా?”
కిసుక్కున్నవ్విందా మాటకి సుబ్బాయమ్మ..నవ్వీ నవ్వీ
“ దానికి బదులిత్తం నీ వల్లగాదుగానీ ..పిల్ల సరదా పడింది డబ్బులిచ్చి పంపిచ్చు.
“ అని కూతురితో అని..మనవరాలొంక మురిపెంగా సూత్తా..
“ అయ్యిటియ్యి పెడతాను. “ అని మల్లీ కూతురొంక సూత్తా
“ పిల్లల సరదా మనవెంతుక్కాదనాలి. ఇయాలా, రేపూ పిల్లల దగ్గర నేర్సుకోవాలి మనం. తప్పులేదు. సదువులట్తాటియ్యి. కాపోతే బాతు గుడ్డెడితే ఇంకోవారం ఎక్కువ పడుకోబెట్టాలి కోణ్ణి. “అంది సుబ్బాయమ్మ ..
ఎనకనించెల్లి అమ్మమ్మ మెడని సుట్తేసింది గిలక.
“ అమ్మమ్మ నోట్తోంచి ఊడిపడిందిది..” మనసులోనే అనుకుంది సరోజ్ని ఆల్లిద్దర్నీ అలా సూత్తా..
—-

5 thoughts on “గిలకమ్మ కతలు – బాతుగుడ్డెక్కిన కోడి

 1. పలకాబలపాలకిడాకులు = అంటే పలక, బలపంలకి విడాకులు అని అర్థం అండి కళ్యాణ కృష్ణకుమార్ గారూ!

  1. ధన్యవాదాలు మేడం ఓపికగా అర్ధాలు చెప్పారు..

 2. thanku krishna kumar garu! thanku so much andi. ఆయంతి అంటే గోదారోళ్ళ భాషలో ఫంక్షన్ అండి.
  తవుసడతం అంటే తపన పడటం..అండి. గడోతల్లే అంటే పెద్దగా అన్న మాట. దున్నపోతల్లే అంటాం చూడండి. అది. సిట్టు అంటే ధాన్యం మిల్లులో పోసి ఆడించేటప్పుడు మనకు చిట్టూ,తవుడూ అని రెండు రకాలు వస్తాయండి. అవి గేదెలకి మంచి ఆహారం. మెత్తగా ఉంటుందని,గుడ్లు జరిగిపోకుండా ఉంటాయని చిట్టు మీద గుడ్లు పెట్టి గుడ్ల మీద కొడిని పెడతారండి. ఇకపోతే బలపాలకి డాకులేనే అనేది బలపం అంటే కణికి. డాకులేనే ఏమైనా spell mistake ఉందేమో చూడాలండి.

 3. చాలా బాగుందండీ.. యీయాల్రేపూ యాసబాసలో రాసేటోల్లు కరవే.. మీయంటోల్లవల్ల ఇలాంటి యాస మరింకొన్నళ్ళు పానం బోసుకుంటాయని నమ్మకమొస్తాంది.. గొప్పగ రాసిండ్రు..

  కొన్ని పదాలు అర్ధం కాలేదండీ..
  1. ఆయంతి లో కనబడి సెప్పింది…
  ఆయంతి అంటే..?

  2.మీ నాన్నెంత తవుసట్టేడో..
  తవుసట్టేడో.. అంటే?

  3.బలపాలకి డాకులేనే గిల్కా…
  అర్ధం కాలే..

  4.పెట్ట పెద్దదే గడోతల్లే…
  గడోతల్లే శబ్ధం అర్ధం కాలేదండీ

  5. బుట్టలోని సిట్టులో సెయ్యెట్టి…
  సిట్టు అంటే..??

  ఏమనుకోకుండా తెలుపగలరు.. నమోస్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *