May 25, 2024

చీకటి మూసిన ఏకాంతం – 4

రచన: మన్నెం శారద

సూర్యుడు పుడమి రేఖని దాటి బయటపడలేదు గాని తూర్పు ఎర్రబడుతోంది. అతని ఆగమనాన్ని సూచిస్తూ.
సముద్రం చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది.
కెరటాలు నురుగుపై పడిన ఎర్రని కాంతి ముడి విడిపడిన పగడాల మూటలా చెదరిపోతున్నది.
నిశాంత మెల్లిగా ఇసుకలో అడుగులేసి నడుస్తూ ఒక చోట ఆగిపోయింది.
అక్కడ సముద్రానికభిముఖంగా కూర్చుని గొంతెత్తి భూపాల రాగమాలపిస్తున్నాడు హితేంద్ర.
అతని కంఠం వడిలో దూకే జలపాతంగా, సుడిలో చిక్కుకున్న గోదారిలా అనంతమైన ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడి ఎగసిపడే సముద్రంలా రకరకాలుగా పల్లవిస్తోంది.
వినేవారి చెవుల్లోంచి ప్రవహించి గుండెని తాకి అలరిస్తోంది.
తరంగాల మీద ఆడుకునే పడవల్లా, పదాలు అతని కంఠస్వరంతో ఆడుకుంటున్నాయి.
సూర్యోదయమైంది.
జనసంచారం ప్రారంభమైంది.
అతని కంఠస్వరమాగింది.
లేచి నిలబడి ఇసుక దులుపుకుని వెనక్కు తిరిగి చూశాడు.
అతని కళ్లు ఆశ్చర్యంగా నీటిలో తేలిన చేప పిల్లల్లా తళుక్కున మెరిసేయి.
అతనికి పది పదిహేను గజాల దూరంలో మలచిన శిల్పంలా నిలబడి వుంది నిశాంత.
“మీరా?” అన్నాడతను ఆపుకోలేని ఆశ్చర్యంతో తల మునకలవుతూ.
ఆమె నవ్వింది తల వూపుతూ.
“ఇలా వచ్చేరేంటి, ప్రొద్దుటే?”
“తూర్పు తీరపు సముద్రపు బొడ్డున గంధర్వుడొకడు గానకచ్చేరి చేస్తున్నాడని తెలిసి!” ఆమె నవ్వుతూ చెప్పిన జవాబుకి సిగ్గుపడుతూ తల దించుకున్నాడు హితేంద్ర.
“రండి” అందామె చనువుగా.
అతను ఇసుకలో ఆమె వెంబడి నడుస్తూ “వాకింగు కొచ్చేరా?” అనడిగేడు.
“మీకోసమే వచ్చేనంటే నమ్మలేకపోతున్నారా?”
హితేంద్ర ఇబ్బందిగా చేతిలో గీతలు గీసుకుంటూ “మీరు చెబితే నమ్ముతాననుకోండి. కాని.. ఇంత పొద్దున్నే..”అన్నాడు సందిగ్ధంగా చూస్తూ.
“పొద్దున్నే ఏవిటండి బాబూ. నా మీద ఇంత బాధ్యత పెట్టుకుని ఎలా నిద్ర పొమ్మంటారు. రేపు మీరు సరిగ్గా పాడకపోతే.. మీరు బాగానే వుంటారు. నేను ఊరి ఖాళీ చేయాల్సుంటుంది” అంది నిశాంత.
హితేంద్ర నవ్వి “మీరు గమ్మత్తుగా మాట్లాడుతారు” అన్నాడు.
నిశాంత అతనివైపు సీరియస్‌గా చూసి “నేను నూటికి నూరుపాళ్లు నిజం మాట్లాడుతుంటే మీకు గమ్మత్తుగా అనిపిస్తుందా?” అంది కోపం నటిస్తూ.
హితేంద్ర ఆమె వైపు బెదురుతున్నట్లుగా చూసి “గమ్మత్తంటే గమ్మత్తుగా కాదనుకోండి”అన్నాడు.
నిశాంత అతని బెదురు చూసి ఫక్కున నవ్వింది. ఆమె నవ్వు చూసి అతను కొంచెం తేరుకున్నాడు.
“మీకు తెలీదు హితేంద్ర. మీ వాయిస్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఎందుకంటే కారణాలు చెప్పలేను గాని మిమ్మల్ని చాలా ఉజ్వలంగా చూడాలన్న కోరిక నాలో పుట్టి క్షణాలు మీద పెరిగి ఊడలు ఊనింది. అందుకే విద్యతో మాట్లాడి ఈ ప్రోగ్రాం ఎరేంజ్ చేసాను. అది సక్సెస్ కావాలని నా ఆకాంక్ష. మీరెలా ప్రాక్టీసు చేస్తున్నారో తెలుసుకోవాలని మీ ఇంటికెళ్ళేను. మీ అమ్మగారు చెబితే ఇటొచ్చేను. మీ పట్టుదల చూసి ఎంతో సంతోషం కల్గింది. మీరు తప్పక విజయం సాధిస్తారు.” అంది ఆవేశానికి గురవుతూ.
హితేంద్ర ఆమెవైపు విస్మయంగా చూసాడు.
ఎంతో నాజూకుగా, సన్నజాజి మొగ్గలా వుండే ఆమెలో ఇంత పట్టుదల, ఆశయం వున్నాయంటే బహుశ ఎవరూ నమ్మలేరు.
“ఏం మాట్లాడరూ? ఇంకా అపనమ్మకంగా వుందా?” అంది నిశాంత రెట్టిస్తున్నట్లుగా.
“ఆహా. అది కాదు.”
“మరి?”
“నిజం చెప్పమంటారా?”
“అబద్ధం కూడా చెప్పాలనుకుంటున్నారా?”
హితేంద్ర నవ్వి”మీతో మాట్లాడలేనంది. నాకసలు మటలు రావు.”అన్నాడు.
“ఆ సంగతి మీ సుబ్రహ్మణ్యం చెప్పాడు లెండి” నిశాంత కారు డోరు తెరచింది.
“ఎందుకు, నేను నడిచి వెళ్ళిపోతాలెండి”అన్నాడతను మొగమాటంగా.
“నాకీ మొగమాటాలు నచ్చవు మిస్టర్ హితేంద్రా?”
హితేంద్ర గబుక్కున ఎక్కి కూర్చున్నాడు.
నిశాంత కారు స్టార్టు చేసి “ఇప్పుడు చెప్పండి. ఏదో నిజం చెప్పేస్తానన్నారు?”అంది నవ్వుతూ.
“మీరు నా గురించి చాలా శ్రమ పడుతున్నారు.”
“స్తుతి శతకమా?”
“అది కాదు. నిజానికి నేనొక గొప్ప సింగర్ని అవుతానని ఎన్నడూ కలలు కనలేదు. అలా ఎవరూ నన్నాశీర్వదించలేదు కూడా. చాలా సామాన్యంగా జరుగుతున్న మా కుటుంబంలో మా నాన్నగారికి హఠాత్తుగా కేన్సరు రావడం వలన అస్తవ్యస్తమైంది. తగ్గదని తెలిసినా చూస్తూ ఊరుకోలేక ఉన్నదంతా ఊడ్చి పెట్టేం. ఆయన వెళ్ళిపోయేరు. మాకీ దరిద్రం మిగిలింది.”
“గతం తలచుకోకండి” అంది నిశాంత సానుభూతిగా.
“ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మేమత్యంత నికృష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా సాయపడిన వారెవరూ లేరు. అందుకే అమ్మ చుట్టాలకి దూరంగా మద్రాసులోనే వుండిపోయింది. తనకి నేను బాగా చదువుకోవాలని ఆశ. ఎలాగోలా నాన్నకొచ్చిన పెన్షన్‌తో నన్నింతవాణ్ణి చేసింది. ఈ కరువు రోజుల్లో అది చాలక నేను పని చేయడం వలన.. నిద్ర లేక ఈ ఫ్లూ వచ్చింది. అమ్మ చెప్పింది. మీరే సహాయపడకపోతే నేనీ పాటికి..” అంటూ నవ్వడానికి ప్రయత్నం చేసాడు హితేంద్ర.
నిజానికి అప్పటికే అతని కళ్ళు నీళ్లతో నిండిపోయేయి.
“భలేవారు! నేనేదో ఘనకార్యం చేసినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఆ సమయానికొచ్చేను కాబట్టి నాకు తోచింది చేసేను. మీరయితే మాత్రం.. చూస్తూ వెళ్లిపోతారా?”అంది నిశాంత.
“కాదనుకోండి. మీలాంటి డబ్బున్న వాళ్లకి జాలి హృదయాలుండవంటారు మాలాంటివాళ్ళు.” అన్నాడు హితేంద్ర మొగమాటంగా.
“దానికీ దీనికీ ఏం సంబంధం. హృదయం లేని వాళ్లకి డబ్బొస్తే కొత్తగా హృదయం పుట్టుకొస్తుందా? ఆ సంగతులొదిలేసి బాగా ప్రాక్టీసు చెయ్యండి”
హితేంద్ర బుద్ధిగా తలూపేడు.
“మ్యూజిక్ క్లాసులకెల్తున్నారా?”
“ఆ! వెళ్లకపోతే ఆయనూరుకుంటాడా? మీరేం చెప్పారోగాని ఒక్కరోజు నేను వెళ్లకపోతే.. ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఆయన్ని చూస్తే తెలియకుండానే సరిగమలు పలుకుతుంది నోరు”
“గురువుల పట్ల ఆ మాత్రం భయభక్తులు వుంటేనే విద్య అబ్బుతుంది” అంది నిశాంత.
కారు హితేంద్ర ఇంటి సందు ముందాగింది.
హితేంద్ర కారు దిగి “మీరూ రండి” అన్నాడు.
“ఇంకోసారి వస్తాను లెండి.”
“ఇక్కడిదాకా వచ్చి కూడా లోపలికి రాలేదంటే అమ్మ నన్ను కోప్పడుతుంది”
“మిమ్మల్నెందుకు కోఫ్ఫడటం?” ఆశ్చర్యంగా అడిగింది నిశాంత.
“ఏరా వెధవా! ఆ దేవతనేమన్నా అన్నావా? గుమ్మందాకా వచ్చిన లక్ష్మిని బయటనుండే పంపించేసేవా? న్వువెలా బాగుపడ్తావురా? అని”
హితేంద్ర మాటలకి నవ్వింద్ నిశాంత.
“మాటలు రావన్నారు గాని కాస్త ఎక్కువే మాట్లాడుతున్నారు” అంది.
“మీ దయ!”
“నా దయ వలన పాటలు పాడాలిగాని మాటలు కాదు. బై. మీ అమ్మగారికి చెప్పండి. విద్య మరదలు వచ్చిందట. వెళ్ళి చూడాలి!” అంటూ కారు స్టార్టు చేసింది నిశాంత.
*****
నిశాంతని చూడగానే గబగబా బయటకొచ్చేడు విద్యాసాగర్.
“ర. రా. ప్రొద్దుటే ఇలా వచ్చావేం?” అన్నాడు నవ్వుతూ.
“ఊరికే. అలా సీషోర్ వెళ్లొస్తున్నాను. మీ మరదల్ని కూడా చూడొచ్చని” అంది నిశాంత అతని వెంట డ్రాయింగ్ రూంలోకి నడుస్తూ.
“ఇంతకీ ఏది నీ మరదలుగారు?”
“బెడ్‌రూంలో వుంది. రా.” అంటూ ముందుకి నడిచేడు సాగర్.
నిశాంత కూడా ఆ గదిలోకెళ్లింది.
“లతా.. నా ఫ్రెండ్ నిశాంత వచ్చింది నిన్ను చూడ్డానికి.” అన్నాడు అక్కడ మంచమ్మీద పడుకున్న అమ్మాయి వైపు చూస్తూ
లత మెల్లిగా వెనక్కి జరిగి గోడకి జేరబడి “నమస్తే” అంది.
నిశాంత ప్రతి నమస్కారం చేస్తూ ఆమె వైపు చూసింది. నలుపు, సన్నం, చిన్నగా వున్న ఆకర్షణ లేని కళ్లు సామాన్య రూపం లతది. నిశాంతని కూర్చోబెట్టి కిచెన్‌లోకెళ్ళేడు సాగర్.
“బావ మీ గురించి చెబుతుంటాడు” అంది లత నవ్వుతూ.
“ఏమని?” కుతూహలంగా అడిగింది నిశంత.
“మీరు చాలా తెలివైనవారట. బెస్టాఫ్ ది బేచ్ అని. ఎంతో డబ్బున్నా గర్వం లేదని. నలుగురికి సహాయపడాలని ఆదుర్దా పడుతుంటారని.. ఇంకో సంగతి కూడా చెబితే ఏమీ అనుకోరుగా. “సందేహంగా చూసింది లత.
“చెప్పండి ఇన్ని మాటలన్నాక.. ఇక ఇంకో మాటంటే బాధ పడటం దేనికి?” అంటూ బాధ నటించింది.
లత నవ్వుతూ “మీరు కాలేజీ బ్యూటీయట కదూ!” అంది.
“మీ బావ ఎంత పచ్చి అబద్ధాలాడగలడో.. ఈ ఒక్క విషయం చాలు మీకర్ధం కావడానికి. మిగతావంటే కనిపించనివి. ఏవంటారు?” అంది నిశాంత.
“అబద్ధాలంటున్నావేంటి?” అంటూ ట్రేలో కాఫీలు పట్టుకొచ్చి ఒక కప్పు నిశాంతకిస్తూ అడిగేడు.
“నువ్వు చాలా మంచివాడివనుకున్నాను. నేను లేనప్పుడు నన్నింత డేమేజింగా తిడతావని అనుకోలేదు.” అంది నిశాంత కోపం నటిస్తూ.
“ఏం జరిగింది? ఏం చెప్పేవు లతా!” అన్నాడు సాగర్ కంగారుగా.
“నా తెలివితేటల గురించి, అందం గురించి అలా అనీ యిష్టం వచ్చినట్లుగా కమెంట్ చెయ్యడానికి నీకెన్ని గుండెలు?” అంది నిశాంత. విషయమర్ధమయి సాగర్ చిన్నగా నవ్వేడు.
“మా బావకు అబద్దాలాడడం రాదు. అందమంటే మోడెస్టీ అన్న విషయం నాకిప్పుడు బాగా అర్ధమవుతున్నది” అంది లత.
“ఇక్కడ కాస్సేపుంటే మీ పొగడ్తలకి నా బుర్ర పని చేయదు” అంటూ లేచి నిలబడింది.
“అప్పుడే వెళ్లిపోతావా?” అంది దిగులుగా లత.
“హాస్పిటల్‌కి వెళ్లాలిగా. ముఖ్యంగా నీకోసమే. మామయ్య బయటనుండి రాగానే చెప్పు. నేను డాక్టర్ బ్రహ్మానందంగారితో ఎపాయింట్‌మెంటు తీసుకొనొస్తాను” అన్నాడు సాగర్ తనూ కోటు, స్టెత్ తీసుకుంటూ.
లత తలూపింది.
“వస్తా లత. వీలున్నప్పుడు వస్తుంటాలే” అంది నిశాంత.
లత తలూపింది. కాని ఆమె కళ్లనిండా నీళ్లు చోటు చేసుకోవడం గమనించేడు సాగర్.
అవి నిశాంత కంటపడకూడదని ఆమె చూపులు దించుకుంది.
“ఈ పుస్తకాలు చదువుకో. ఎక్కువ ఆలోచించకు”అంటూ సాగర్ కొన్ని పుస్తకాల్ని మంచం మీద పెట్టి నిశాంతతో బయటకొచ్చేడు.
కారెక్కేక సాగర్ చెప్పేడు. “టికెట్స్ బాగా అమ్ముడుపోతున్నాయి నిశాంత. నిన్న కనుక్కొచ్చేను. అతని ప్రాక్టీసెలా వుంది?” అని
“బ్రహ్మాండంగా వుంది. వలలో రెండ్రోజులనుండి చేపలు పడటం లేదని జాలరులు ఒకటే గోల. పేపరు చూడలేదా?”
సాగర్ అర్ధం కానట్టుగా చూశాడు.
“తమాషాకంటున్నానులే. సముద్రపుటొడ్డున గానకచ్చేరి మొదలెట్టి కష్టపడుతున్నాడు పాపం” అంది.
సాగర్ నవ్వి “అదా సంగతి. ఇంతకీ నీ దృష్టిలో పడ్డవాడు అదృష్టవంతుడు ” అన్నాడు.
“ఎందుకనో?” కొంటెగా చూసింది నిశాంత.
“అకారణంగా వరాలిచ్చే దేవత ప్రత్యక్షమయితే ఆ భక్తుడు అదృష్టవంతుడు గాక మరేమవుతాడు?”అన్నాడు.
“ఈ మధ్య ఏ భట్రాజుతోనన్నా స్నేహం మొదలెట్టేవా? పొగడ్తలు ఎక్కువయ్యేయి. అద్సరే. లతా వాళ్లు ఎందుకొచ్చినట్లు?” అంది.
సాగర్ ఒక నిమిషం మాట్లాడలేదు.
అతని మొహం భారం కావడం గమనించింది నిశాంత.
“లత రెండు కాళ్లూ దెబ్బ తిన్నాయి. ఇక్కడ బ్రహ్మానందం గారికి చూపిద్దామని రమ్మన్నాను.
అప్పుడర్ధమయింది లత మోకాళ్లవరకు దుప్పటి ఎందుకు కప్పుకుందో.
“ఏం జరిగిందన్సలు?”
“తొందరపాటు. మేడ మీద నిండి దూకిందంట. ఆత్మహత్య చేసుకోవాలని”
“మైగాడ్. ఎందుకని?”
“ఈ వయసులో ఆడపిల్లలకుండే సమస్యేముంది? ప్రేమ – పెళ్లి”
“ఎవర్నో ప్రేమించిందంట. మామయ్య ఇష్టపడలేదని యింత పని చేసింది చివరికి ఫలితమిలా వికటించిందంట. కాళ్ళు లేని దాన్ని చేసుకోనంటున్నాడట అతను.”
నిశాంత నిట్టూర్చింది.
“చదువుకుని కూడా లత ఇంత మూర్ఖంగా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంది.” అంది బాధగా.
“మామయ్యకి బోల్డంత ఆస్తుంది. ఒక్కగానొక్క కూతురి భవిష్యత్తు ఇలా అయిందని తెగ కుమిలిపోతున్నాడు. తల్లిదండ్రి లేని నన్ను చేరదీసి చదివించేడు. ఆయనకిల్లాంటి గతి పట్టడం బాధని కల్గిస్తోంది”అన్నాడు సాగర్ వేదనగా.
“నాకీ సంగతి చెప్పనేలేదేం నువ్వు?”
సాగర్ నిర్లిప్తంగా నవ్వేడు.
“ఇందులో ఇతరులకు పంచాల్సిన ఆనందమేముందని చెప్పమంటావ్?” అన్నాడు.
నిశాంత మౌనం వహించింది.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *