February 23, 2024

తరం – అనంతం

రచన : సోమ సుధేష్ణ

హరిణి ఇంట్లోకి రాగానే సుజాత ఎదురుగా వెళ్లి మనవరాలిని గట్టిగా కౌగిలించుకుంది. హరిణి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక క్షణం చూసింది. మనవరాలి కళ్ళల్లోంచి కారుతున్న కన్నీటిని ప్రేమగా తుడుస్తూ భుజాలపై చేయివేసి లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చుంది. నిన్నంతా ఫోనులో జరిగిన తంతు గురించి చెప్పి గుండె లవిసి పోయేలా ఏడ్చే మనవరాలిని వెంటనే తన దగ్గరకు రమ్మని చెప్పింది. కారు డ్రైవ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి హరిణి తరుచుగా నానమ్మ, తాతలను విజిట్ చేస్తూనే ఉంది. జయరాం, సుజాత దంపతులు ఇండియాలో అర్లీ రిటైర్ మెంటు తీసుకొని ఉన్నవన్నీ అమ్మేసుకుని అమెరికాలో కొడుకు దగ్గరకు వచ్చారు. వచ్చిన సంవత్సరం లోనే వర్క్ పర్మిట్ తీసుకున్నాడు జయరాం. ప్రపంచం నలుమూలలా తిరిగిన వాళ్ళు గాబట్టి ఆ అనుభవమున్న ఇంటలిజెంట్ ఇంజనీరు పర్మిట్ వచ్చిన ఆరునేల్లోనే ఒక కంపెనీలో ఉద్యోగం చూసుకుని కొడుకుకు దగ్గరే ఆరు మైళ్ళ దూరంలో ఉన్న రిటైర్డ్ కమ్యూనిటి లో రెండు బెడ్ రూమ్స్ ఉన్న చిన్న ఇల్లు కొనుక్కు న్నారు. జయరాం ‘మా కుటీరానికి’ రండి అందరితో అంటాడు. విన్నవాళ్ళకు అదే మాట అలవాటై పోయింది. బస్ సర్వీస్ ఇంటిదగ్గరనుండే ఉంది గాబట్టి అన్ని చోట్లకు వెళ్ళడం తమ పనులు తామే చేసుకోవడం అలవాటై పోయింది. దగ్గరగా ఉండటం మూలాన గ్రాండ్ చిల్రన్ ను పెంచడంలోని అందమైన అనుభవాలలో భాగమై పోయారు. తాత, నానమ్మ అంటే హరిణికే కాదు పదేళ్ళ తర్వాత పుట్టిన ట్విన్ బాయ్స్ కూడా ప్రాణమే.
హరిణి కాలేజి పూర్తి చేసి పై చదువులు వద్దని ఉద్యోగం చూసుకుంది. కాలేజీలో తనకు రెండేళ్ళు సీనియర్ అయిన కపిల్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే పేరెంట్సు ఎగిరి గంతేసారు. ముప్పై దాటి నలభయ్యో పడిలో ఉంటె గాని పెళ్ళి ధ్యాస రాని పిల్లలున్న ఈ రోజుల్లో ఇరవై ఐదేళ్ళ కూతురు తనకు తానై ‘నేను ప్రేమించాను, పెళ్ళిచేసుకుంటా’ నంటే ఏ తల్లితండ్రులు మాత్రం ఎగిరి గంతేయరు! వాళ్ళకు మొదట్లో నమ్మడానికి కాస్త టైం పట్టింది.
“నేను ఎంతో ఇష్టంగా ఇండియానుండి పెళ్ళి పత్రికలు అచ్చువేయించి తెప్పించుకున్నాను కద నానమ్మ! పెళ్ళి ఆహ్వానాలు పంపాలని సిద్ధమవుతూ ఉండగా ‘నేను మనసు మార్చుకున్నాను.’
అని చెప్పి వెళ్లి పోయాడు కపిల్. పెళ్ళి చేసుకునేటంత ప్రేమ లేదట. ఆరునెల్ల నుండి నాతో ఎంతో ప్రేమగా తిరిగాడే గాని చిన్న హింట్ గూడా కనిపించలేదు.” హరిణి వెక్కుతూ మాటలను పూర్తి
చేయక ముందే కట్ట తెగిన నదిలా బోరున ఏడ్చింది. ఆ పక్కనే టేబుల్ మీద ఉన్న టిష్యు
అందుకుని సుజాత మనవరాలి కళ్ళు తుడిచి, తన కళ్ళు కూడా తుడుచుకుంది. ప్రేమో లేక మొదటిసారి మరో స్నేహ భావమో తెలీని యౌవ్వనం అనుకుని మనవరాలిని ఓదార్చింది. ఎలాంటిదైన సరే మనవరాలు బాధ పడితే భరించలేదు.
హరిణిని దగ్గరగా తీసుకుని వీపుపై చేతితో నిమురుతూ కాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు.
“కొన్ని వారాలుగా కపిల్ లో మార్పు కనిపించినా పెళ్ళి ముందు వచ్చే నర్వస్ నెస్ అను కున్నాను. నాకసలు అనుమానమే రాలేదు. మొన్న కార్లో రైడ్ కు తీసుకెళ్ళి అతని మనసులోని మాట చెప్పాడు. నీమీద అనకు ప్రేమ ఎప్పుడూ ఉంటుంది కానీ పెళ్ళంటే నేను…నానమ్మా! కపిల్ ఆ మాట చెప్పినా నేను వెంటనే నమ్మలేక పోయాను. తుపాకీ గుండులా వదిలాడు.” నానమ్మలో ఒదిగి పోతూ దుఃఖాన్ని ఆపుకోవాలని ప్రయత్నించింది.
“దుఃఖాన్నిఆపుకోకు. బాధను వెలికి రానివ్వు. పెళ్ళి అయ్యాక అతడి మనసు మారేకంటే ఇప్పుడు మారడమే మంచిదయింది. అందుకే జరిగింది మన మంచికే అనుకోవాలి. ఈ వయస్సు లో ప్రేమ గురించి సరిగ్గా అవగాహన లేక అన్ని ఇష్టాలను ప్రేమ అనుకునే వారున్నారు.” నచ్చ చెప్పే ధోరణిలో అంది సుజాత.
“ఉ..ఊ.. కపిల్ మనసు మారకుండా మొదట్లో లాగే ఉంటె బాగుండేది. నేను ఎప్పుడూ కపిల్ ను లవ్ చేస్తాను. నేను బతికి ఉన్నంత కాలం లవ్ చేస్తాను. నిజం నానమ్మా.” యువత మనసు తెలిసిన సుజాత,
“కపిల్ ను మరిచి పొమ్మని నేను చెప్పను. నువ్వు మరిచి పోలేవు కూడా.” హరిణి మొహంలోకి చూస్తూ “ప్రేమలో పడటం మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కానీ అది నిజమైన ప్రేమ అవునా కాదా అన్నది తెలుసుకోవడానికి కొంత టైము పడ్తుంది. నిన్ను నిజంగా ప్రేమించేవాడిని గుర్తు పట్టి అతన్ని ప్రేమించడం నేర్చుకో. నువ్వు సుఖపద్తావు. నీ మనసు అమృతం.”
హరిణి తల అడ్డంగా తిప్పింది. మరొకరిని ప్రేమించడమా! ఇంపాజిబుల్!
“హరీ! మనిద్దరం టీ తాగుదాం రా. నీకు పాలకూర పకోడీ ఇష్టం. ఆ స్టీలు డబ్బాలో ఉన్నాయి
పట్టుకురా.” సుజాత టీ పెడ్తోంది.
“నానమ్మా! నువ్వు, తాతయ్య మాఇంటికి వచ్చేయండి. డాడీ మీరెలా ఉన్నారో నని ఎప్పుడు
మీగురించి వర్రీ అవుతుంటారు.”
సుజాత నవ్వుతూ, “తాతకు, నాకు అక్కడ ఏం తోస్తుంది చెప్పు. దినమంతా మీరెవ్వరు ఉండరు. ఇక్కడ చాల మంది ఇండియన్స్ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకరు అటు పోతూ, ఇటు పోతూ వస్తుంటారు, మమ్మల్ని పలకరిస్తుంటారు. అయినా మీరెంత దూరం గట్టిగా అరిస్తే విని పిస్తుంది.”
“నీకో కథ చెప్తాను..” ఆ మాట వినగానే హరిణి చిన్న పిల్లలా సుజాత కాళ్ళ దగ్గర కుర్చుని ఆమె మోకాలిపై తల ఆనించి చెప్పూ అన్నట్టుగా చూసింది. హరిణి చిన్నప్పుడు ఇలాగె నానమ్మ కథలు చెప్తూంటే తాతయ్య పక్కన వాలు కుర్చీలో కూర్చుని నవ్వుతూ మధ్య మధ్యలో మాటలు అందిచ్చే వాడు. ఇప్పుడు తాతయ్య క్లబ్బులోనే ఫ్రెండ్సుతో బిజీ అయి పోయాడు.
ఇద్దరూ టీ మగ్గులతో సోఫాలో కుర్చున్నాక,
“చాల కాలం క్రితం ఒక ఊళ్ళో..” సుజాత చెప్పడం మొదలు పెట్టగానే హరిణి అన్నీ మరిచి పోయి కుతూహలంగా చెవులు రిక్కించి కూర్చుంది.
“ఒకబ్బాయి, ఒకమ్మాయి ఒకే నేయిబర్ హుడ్ లో ఉండేవారు. కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. చిన్నప్పటి నుడి చాల స్నేహంగా ఉండేవాళ్ళు, ఇతర పిల్లలు ఉన్నా వీళ్లిద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్నంత అభిమానం, చొరవ వేరె వాళ్ల మీద కలగలేదు. అమ్మాయిని ఎవరేమన్నా అంటే అబ్బాయి వాళ్ళ మీదకు ఉరికి గొంతు నులిమి నంత పని చేసేవాడు. అబ్బాయి గురించి ఎవరేమైన చెడుగా అంటే ఆ అమ్మాయి వాళ్ళను చీత్కరించుకుని మళ్ళి వాళ్ళ మొహం కూడా చూసేది కాదు. ఇద్దరూ కలిసి వేరే వాళ్లతో పోట్లాడేవారు కానీ వారి మధ్య ఎప్పుడూ గిల్ల్లి కజ్జాలు ఉండేవి కావు. నేయిబర్ హుడ్ లో ఉన్న పిల్లలకు తెలుసు వాళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారని. రెండు కుటుంబాల్లోని వారికీ కూడా వారి అన్యోన్నత అలవాటై పోయింది. పెద్దయ్యాక అబ్బాయి కాలేజికి వెళ్ళాడు అబ్బాయిలతో కలిసి. అమ్మాయిలతో కలిసి అమ్మాయి ఉమెన్స్ కాలేజికి వెళ్ళింది. అప్పుడప్పుడు కలుసుకునే వారు. సెలవులు వస్తున్నా యంటే ఇద్దరూ కేరమ్స్, కార్డ్ గేమ్స్ ఆడుకునేవారు. అన్ని కబుర్లు చెప్పుకున్నారు కానీ ప్రేమ కబుర్లు ఎప్పుడూ చెప్పుకోలేదు, ప్రమాణాలు చేసుకోలేదు. అయినా కొన్నాళ్ళు కనిపించక పోతే ఒకరి కోసం ఒకరు ఎదురు చూసేవారు. అమ్మాయి గ్రాడ్యుయేషన్ పుర్తవగానే తల్లిదండ్రులు పెళ్ళి చేయాలనే ఉన్ద్దేశ్యంతో అన్ని విధాల సరి పోతదనుకున్న ఆ అబ్బాయిని మన అమ్మాయికి ఇస్తే బావుంటాడని అతని పేరెంట్సును వెళ్లి అడగాలను కుంటారు. ఆ అమ్మాయి అది విని ఆ సాయంత్రమే వచ్చిన అబ్బాయికి తన పేరెంట్సు వేసే పెళ్ళి ప్లాన్ చెబుతుంది.
“మనిద్దరం మంచి స్నేహితులం. నా జీవితాంతం మనిద్దరం స్నేహితులం. మనిద్దరికి తెలుసు మన మధ్య ప్రేమ ఎప్పుడూ లేదు. నా ఫ్రెండు వికాస్ తన ఆంటీ వాళ్ళు లండన్ నుండి రెండు వారాల క్రితమే వచ్చారని నీతో చెప్పానుగా. నేను వికాస్ కజిన్ ను కలిసాను. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమని చెప్పింది. నాక్కూడా ఆ అమ్మాయి చాలా ఇష్టమయింది. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనుకో పెళ్ళి చేసుకో బోతున్నాము. వాళ్ళు మూడు వారాలే ఉంటారట. అందుకే వెంటనే పెళ్ళి చేసుకోమని రెండు జతల పేరెంట్సు హడావుడిగ పనుల్లోకి దిగారు. ఈ రోజు నీకా మాట చెప్పాలనే వచ్చాను. మీ పెద్దవాళ్ళు అలా అన్నారని నువ్వు బాధ పడ్తున్నావా? మనిద్దరికీ తెలుసు మనం ఎంత స్నేహంగా ఉంటామో. నువ్వు తప్పకుండా పెళ్ళికి రావాలి.” కథ చెప్తున్నట్టుగా చెప్పేసాడు.
అమ్మాయి నవ్వి, “మన పెద్దవాళ్ళు అలా ఎలా అను కున్నారో నా కర్థం కావడం లేదు. మన మేనాడు అలా ప్రవర్తించలేదు. నేను బాధ పడడమెందుకు! నీ పెళ్ళి వార్త విని నేను గుండె పగిలి ఏడుస్తా ననుకున్నావా! అదేమీ లేదు. ఈ మధ్యే అనుకుంటున్నాను మనమిలా తరుచుగా కలుసు కోవడం చూసి అందరూ ఏమనుకుంటారు, మనం కలవడం కాస్త తగ్గించాలని. ఎనీవే కంగ్రాట్స్! నాకు చాల సంతోషంగా ఉంది.” బెట్టుగా అంది ఆ అమ్మాయి.
అమ్మాయి మాటలు ఆ అబ్బాయి నమ్మాడో లేదో తెలీదు. అబ్బాయి తన మాటలు నమ్మితే బాగుండునని చాల సార్లు అనుకుంది ఆ అమ్మాయి.
అబ్బాయి వెళ్ళగానే- అమ్మాయి అభిమానం దెబ్బతింది. ఉక్రోషం తన్నుకొచ్చింది. అహం బుసలు కొట్టింది. ఎవరినో ప్రేమించాడా! ప్రేమట..ప్రేమ..గుడ్డివాడు కాకపోతే…నా ప్రేమ కనిపించదా! నన్ను కాకుండా మరొకరిని పెళ్ళి చేసు కుంటున్నాడు. ఈ వెంగళప్పకు నా ప్రేమ కనిపించక పోతే నాది ప్రేమకాదా! అమ్మాయి తనలోని బాధను ఎవరికీ చూపించలేదు. ఎవరి జాలి నాకవసరం లేదు అనుకున్నది. రెండు రోజులు తిండి మానేసి, నిద్ర ఎలాగు రాలేదు. ఏదో వంక చెప్పి తన గదిలోంచి కదలకుండా అలక గృహంగా మార్చేసింది. తనివి తీర ఏడ్చింది. ఆ ఫారిన్ గర్ల్ ఎలా ఉందో చూడాలని చాల తహ తహ లాడింది. ఆ ఫారిన్ గర్ల్ మేనమామ బెంగుళూరులో ఉంటాడు. మేనమామ తానే మేన కోడలి పెళ్ళి చేయాలని చిన్నప్పటి నుండి అనుకున్నాడట. అందరూ పోలో మని బెంగుళూరు వెళ్లి పెళ్ళి, ఆతర్వాత తిరుపతికి వేల్లోచ్చారు. పెళ్ళికి మమ్మల్ని అందరిని రమ్మని మరీ మరీ చెప్పారు. కానీ అమ్మాయి పేరెంట్సు అబ్బాయి మాకు అందలేదే అని చిన్న బోయి పెళ్ళికి వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళే లోగా భార్యను తీసుకుని రాక పోతాడా అను కుంది అమ్మాయి. కానీ అటు తిరిగి ఇటు తిరిగి కుదరలేదంటూ ఇంగ్లాండుకు వెళ్లి పోయాడు, టైం లేదట. తర్వాత తెలిసింది అబ్బాయి వచ్చాడు కానీ అమ్మాయి పేరెంట్సు ఏవో చెప్పి అమ్మాయిని చూడకుండానే పంపిచేసారని. అబ్బాయిని చూడక చాలా రోజులయిందని అమ్మాయి దిగులు పడింది. ఇలా లాభం లేదు తన జీవితం ఒక కోవలోకి తెచ్చుకోవాలని అమ్మాయి బిఇడి పూర్తి చేసి టీచర్ ఉద్యోగంలో చేరింది. అబ్బాయి మీద కోపంతో పెళ్ళి చేసు కోకుండా జీవిత కాలం వెళ్ళ బుచ్చాలనుకుంది. మాట్లాడటానికి ఎవరు లేనట్టు, ఒంటరి దైనట్టు ఫీలయింది. ఎవరికీ చెప్పుకుంటుంది. అబ్బాయి హాయిగా ఖుషీ చేస్తూ వెళ్లి ఇంగ్లండులో చేరాడు.
అమ్మాయి పని చేసే స్కూల్లో కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ జయరాం యువకుడు, మంచివాడు. స్కూల్ కల్చరల్ ప్రోగ్రాం ఇంప్రూవ్ చేయడానికి అమ్మాయి సహాయం అడిగాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే తన కిష్టమే అని వెంటనే కుతూహలంగా పనిలోకి దిగింది అమ్మాయి. స్కూల్ ఇనాగ్యురేషన్ ప్రోగ్రాంతో ఆమెలో ఉత్సాహం పెరిగింది. ఇతర ప్రోగ్రామ్స్ లో కూడా ప్రిన్సిపాల్ అమ్మాయిని సహాయం అడగడం, కలిసి వేరే స్కూల్ పనులు చేయడంతో హెడ్ మాస్టరుకు అమ్మాయికి మధ్య చనువు కూడా పెరిగింది.
“అలా ఎక్జిబిషన్ కు వెళ్దాం వస్తారా?” అడిగాడొక రోజు.
“నేను టెస్ట్ పేపర్లు కరెక్టు చేయాలి”.
“కాసేపలా వెల్లోస్తే ఫ్రెష్ గా ఉంటుంది. ఆ తర్వాత పని ఫాస్ట్ గా చేస్తారు.”
“మీరు మా అమ్మలాగ అంటున్నారు.” అతని కళ్ళు నవ్వుతున్నాయి.
“మీ అమ్మ అంటే నాకు గౌరవమే. నా మాటలు మీ అమ్మలాగ ఉన్నాయంటే ఏమనుకోను కానీ
నేను మాత్రం మీ అమ్మలాగ లేను.” అతని మాటలకు నవ్వుకుంది. అతనంటే ఆమ్మాయికి చాల
ఇష్టమయి పోయాడు. అతనితో ఎప్పుడు మాట్లాడాలని, అతనితోనే కలిసి ఉండాలని కోరికగా ఉండేది. అతను నవ్వితే ఇష్టం, అతను తనను నవ్విస్తే ఇంకా ఇష్టం. కొన్ని రోజుల్లోనే అది నిజమైన ప్రేమ అని మొదటిసారిగా తెలుసుకుంది. అబ్బాయి మీద ఉన్నది ప్రేమ కాదని తన కేందుకు అర్థం కాలేదా అని వాపోయింది.
ఆ శనివారం సినీమాకు తీసికెళ్ళాడు. నలుగురు ఏమనుకుంటారో నని భయపడే అమ్మాయికి సంఘం ఎంత గుడ్డిదో, నోరు తప్ప ఏమి లేని సంఘం గురించి లెక్చరిచ్చాడు. పెళ్ళి చేసుకోవడం ఇష్టమయితే పెద్దవాళ్ళతో మాట్లాడతా నని ధీమాగా హామీ ఇచ్చాడు. హీరో అనుకుంది.
“అది నా కథకు మొదలు. నన్నే కాదు నా తల్లిదండ్రులను కూడా ఒప్పించి నన్ను పెళ్ళి చేసు కున్న దేవుడు.” హరిణిని చూస్తూ నవ్వింది సుజాత.
“నానమ్మ! అతడు తాతయ్యేనని నాకు తెలిసి పోయింది. నీ కథ నాకు ధైర్యాన్నిస్తోంది.” నానమ్మను గట్టిగా హత్తుకుని చెంపపై ముద్దు పెట్టింది
“కథ అయిపోలేదు, ఇంకా ఉంది.”
హరిణి లేచి నానమ్మ పక్కనే కూచుంది.
“ఒక సంవత్సరం తర్వాత నాకు బాబు పుట్టాడు. ఒక్కడే చాలనుకుని చాల పద్దతిగా పెంచు కున్నాము. ఇంజనీరింగులో గోల్డ్ మేడలు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లోనే అమెరికా నుండి ఒక అమ్మాయి వచ్చింది”
“మై మాం!!” పేరెంట్సు ఇండియాలో కలుసుకున్నారని హరిణికి తెలుసు. నానమ్మ మొహం చూస్తే ముఖ్యమైన దేదో చెప్ప బోతోందని తెలుసుకుంది.
“ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే ప్రేమలో పడ్డారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలిసి పోయింది.
కళ్ళు తప్ప మొహం అంతా తండ్రి పోలికే.”
హరిణి తలలో ఆలోచనలు గిర్రున తిరిగాయి.
“నిన్ను కాదని వేరే అమ్మాయిని చేసుకున్నతను రఘువీర్ తాతయ్యేనా!” ఆశ్చర్యంతో హరిణి కళ్ళు పెద్దవయ్యాయి.
“రఘువీర్ తాతయ్యను చూసాక నీకెలా అనిపించింది?” ఆత్రుత అణుచుకోలేక పోతోంది హరిణి.
“చాల రోజుల తర్వాత ఆత్మీయులను చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉండింది. మేమిద్దరం
ముందులాగే చనువుగా మాట్లాడుకున్నాము. నన్ను చూడగానే ‘నామీద కోపం పోయిందా?’ అని అడిగాడు. ‘నాకేం కోపం లేదు. దెబ్బతిన్న అహం కాబోలు కొన్ని రోజుల్లోనే మామూలయి పోయాను.’ అన్నాను.
‘నీ పెళ్ళి అయ్యాక నేను చేసుకుంటే నీకంత కోపం ఉండేది కాదేమో! లండన్ వెళ్ళే ముందు నీతో ఒకసారి మాట్లాడాలని చాల ప్రయత్నించాను. కానీ మీ పేరెంట్సు కోపంలో ఉన్నారు. నన్ను నిందించారు, అయినా నాకేం కోపం రాలేదు. వాళ్ళు మన స్నేహాన్ని తప్పుగా అనుకున్నారని అప్పుడే తెలిసింది. బాధ అనిపించింది. నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటా ను.ఇప్పుడు చూడు పరిస్థితులు మనల్ని ఎలా కలిపాయో!’ నవ్వాడు.
ఆ వయస్సులో అభిమానం, ఆత్మీయత అన్ని ప్రేమలాగే అనిపిస్తాయి. ఆ భావాలు కూడా ఒక విధమైన ప్రేమ స్వరూపాలే. కొన్ని రోజుల్లోనే తెలిసింది నాకున్నది ఆత్మీయత కాని ప్రేమ కాదు అని. జయరాంను చూసిన తర్వాత అసలు ప్రేమంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలిసింది. మీ డాడి పెళ్ళి తర్వాత మీ అమ్మమ్మ నేను మంచి స్నేహితులమయ్యాము. నీకు గుర్తు ఉండి ఉండదు. నీకు రెండేళ్ళప్పుడే ఆవిడకు కేన్సర్ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత మీ తాతయ్య మేరీని పెళ్ళి చేసుకున్నాడు. ఆవిడ కూడా నాకు ఇప్పటికి మంచి స్నేహితురాలు. ఇక వంట చేయాలి పద, తాతయ్య వచ్చే టైం అయ్యింది.” నానమ్మ మోహంలో కదులుతున్న గత జీవితపు ఆనందపు ఛాయలు కని పించాయి.
“మీ నాన్న ఇంగ్లండుకు వెళ్ళాక కొడుకును విడిచి ఉండలేక మేము కూడా ఇంగ్లాండుకు వెళ్ళాము. రెండేళ్ళు ఉన్నాక ఆ వాతావరణం తట్టుకోలేక తిరిగి ఇండియా వెళ్లి పోయాము.”
తన పెళ్ళి ఆగిపోయిన తర్వాత హరిణి మొదటి సారి పెద్దగా నవ్వింది. కొడుకు వెంట దేశాలు
తిరిగారు పిచ్చి తల్లిదండ్రులు. పెద్దగా నవ్వింది.
“అన్నింటికంటే మాకు ఆనందాన్నిచ్చేది నువ్వు, నీ ట్విన్ బ్రదర్స్.”
సుజాత వంట మొదలు పెట్టింది. హరిణి పక్కనే నిలబడి చూస్తోంది. వృద్ధాప్యం/ యౌవ్వనం పక్క పక్కనే పాలు తేనే లాగ కలిసి పోయారు.
హరిణి మనసులో కపిల్ మెదిలి కళ్ళనిండా నీళ్ళు నిండాయి.
నానమ్మ చూడకుండా గబుక్కున పక్కకు తిరిగింది. నానమ్మ చూడనే చూసింది.
“ఏడవడంలో చిన్నతనం లేదు హరీ.” గొంతులో ఓదార్పు, ప్రేమ.
“ఆ కళ్ళ నీళ్ళతోనే బాధ తుడుచుకు పోతుంది. ఏడుపును దిగ మింగకు. స్పైసీ చిప్స్ ఉన్నాయి,
ఇప్పుడు తింటావా, డిన్నర్ అయ్యాక తింటావా? మనస్సు బాగా లేకపోతే జంకుఫుడ్ లో మనస్సును ఆహ్లాదపరిచేదేదో ఉందంటావు.”
అప్పుడే జయరాం ఇంట్లోకి అడుగు పెడుతూ “ఇద్దరు అప్సరసలు ఏం చేస్తున్నారు?”
“తాతయ్య వచ్చేసాడు నానమ్మా.”
“తోచక ఏదోఒక కమీటిలే అని ఫైనాన్స్ కమీటిలో ఉన్నానా, బేంకులో డబ్బు కంటే ఎక్కువ వాదోపవాదాలు. తల తినేస్తున్నారనుకో.”
“టీ తాగుతావా జయా!”
“తాతయ్యకు తెలుసా నానమ్మా?” గుస గుసలాడింది హరిణి.
“తెలుసు. ‘ప్రేమంటే ఏమిటో తెలీని పిచ్చిదానా’ అని నన్ను ఆట పట్టిస్తారు.”
తాతయ్య చెయ్యి పట్టుకుని నడక నేర్చింది ఈ వీధిలోనే. సైకిల్ తొక్కడం నేర్పిన తాతయ్య, ఈత నేర్పిన తాతయ్య నా ప్రియమైన తాతయ్య.
“నా కథ వినిపించాను.” సుజాత నవ్వుతూ చెప్పింది.
“నేనెంత హేండ్ సంగా ఉండేవాడినో ఆ రోజుల్లో చెప్పావా! ప్రేమంటే ఏమిటో తెలీని వెఱ్ఱి
వెంగలమ్మ.” అంటూ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు.
“ఇప్పుడూ హేండ్ సమ్ గానే ఉన్నావు తాతయ్యా.”
“నానమ్మా నాకు జంకు ఫుడ్ కావాలి. అదే నా డిన్నరు. బాధ ఆకలిని తినేస్తుంది. జంక్ ఫుడ్ బాధను తినేస్తుంది. నా అనుభవం నానమ్మా.”
“అయితే సరే. ఈ రోజు వంటలేదు. నీకు కంపెనీ ఇస్తాను. స్పైసీ కార్న్ చిప్స్ పేకెట్ తీసుకురా. నీకు, తాతకు ఫిష్ కట్ లెటులు ఉన్నాయి.
“నా కొద్దు. ఈ చిప్స్ మీద కాస్త టోమేటో సాస్ వేసి ఆ పైన చీజ్ వేసి వేడి చేస్తాను. అవి తింటూ
మూవీ చూద్దాం.” హరిణి స్నాక్ చేస్తోంటే వంట మానేసి సుజాత వచ్చి కూచుంది.
తన మాటలను గుండెలో దాచుకుని తీయని మాటలతో ఎప్పుడు చెలిమిని, బలిమిని ఇచ్చే
నానమ్మ, నవ్వినా ఏడ్చినా తన కౌగిలిలో దాచుకునే నానమ్మ చూసి,
“నానమ్మా! ఐ లవ్ యూ” గట్టిగా హత్తుకుంది.
“నా ప్రిన్సెస్ వి.” హరిణి నుదుటి పై ముద్దుతో సేద తీర్చింది.
“అసలు కంటే వడ్డీ మీద మక్కువ ఎక్కువ అని ఊరకే అన్నారా! నా డార్లింగ్ లు ఇద్దరూ ఏం చేస్తున్నారో గాని నన్ను కూడా మీటీమ్ లో చేర్చుకోండి.” వచ్చి సోఫాలో కూచున్నాడు.
హరిణి వాళ్ళ ఇద్దరి మధ్య రాకుమారిలా పొందికగా కూర్చుంది. తరం తరం కలిస్తే అనంతమే కదా! ముగ్గురూ వేడి వేడి సల్సా చిప్స్ తింటూ మూవీ లో లీనమయ్యారు..

***** సమాప్తం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *