March 28, 2024

తేనెలొలుకు తెలుగు – పద్యప్రేమ

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

 

 

ఇటీవల కొన్ని ఫేస్బుక్ మరియు వాట్సప్ గ్రూపుల్లో పద్య ప్రక్రియ ప్రధానంగా చేసుకుని అనేకమంది పాల్గొనడం చూసిన తరువాత పద్యప్రక్రియపై కొన్ని భావాలు పంచుకోవాలనిపించింది. పద్యం తెలుగువారి ఒక ప్రత్యేక సాహిత్య సంప్రదాయం.పద్యవిద్య పట్ల మక్కువ గలిగిన వారు పద్య రచన చేయాలనుకునే ఔత్సాహికులైన వారి కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు  మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను

———-

తెలుగు వారి సాహిత్య అస్తిత్వానికి మూలం పద్యమనేది నిర్వివాదాంశం. సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్నది కొంత ,దేశీయమైనది కొంత తెలుగు ఛందస్సు వేయి సంవత్సరాల సాహిత్య శిఖరంగా నిలబెట్టింది.

తెలుగు లో తొలి గ్రంథం అనువాద ప్రక్రియయే అయినా ,అది ముగ్గురు కవులతో రచింపబడినా స్వతంత్ర కావ్యమనిపించేంత సుందరంగా తీర్చి దిద్దబడి తరువాతి కవులకు ఆదర్శ ప్రాయమైంది.నన్నయ,తిక్కన,ఎఱ్ఱన

వాగనుశాసనుడు,కవిబ్రహ్మ,ప్రబంధపరమేశ్వరుడను బిరుదులను సార్థక్యమొనరించిన వారు.

సంస్కృత వ్వావహారికం నుండి తెలుగు వ్యావహారికం కావడానికి కొన్ని శతాబ్దాల కాలం జనావళి మనోభూము లలో మెల్ల మెల్లగా రూపుదిద్దుకున్నది. సహజ కవిత్వాంశతో జన్మించిన పామరుల నోళ్లలో పదాలూ పాటలు పుట్టినాయి.

సంస్కృత ఛందో మార్గంలో పద్యానికి త్రోవ ఏర్పడ్డది.అక్కడి శ్లోకం ఇక్కడ పాదాలు గలిగిన పద్యమయ్యింది. పాదాలకు నడక సహజ లక్షణం.అలాగే పాదాలు గలిగిన పద్యం అనేక రకాలైన నడకలు నేర్చుకుంది. నాట్యమాడింది. అందమైన అజంత భాష శ్రవణ సుభగమై ,ధారణానుకూలమైన పద్యభాషగా తొలుత శాసనాలలో ఉపయోగించబడింది.

ఆ తర్వాత మల్లియరేచన కవిజనాశ్రయం వంటి కందాలలో రాయబడిన లక్షణగ్రంథము నుండి ఆంధ్రమహాభారత రచనవైపు సాగింది   కవిత్రయం రచించిన భారతం అటు మార్గ ఛందస్సులోని శార్దూల మత్తేభ చంపకోత్పలమాలలతో పాటు సీసం కందం,ఆటవెలది,తేటగీతి,రగడ,తరువోజ వంటి దేశీ ఛందో ప్రక్రియలతో చంపూ కావ్యంగా తెలుగు సాహితీ సామ్రాజ్యానికి గవనియై విలసిల్లింది.

నన్నయ పద్యాలలో సంస్కృత పదాలు ఎక్కువ నుండి తక్కువకు దిగుతూ వచ్చాయి. తిక్కన తెలుగు పదాలకు పెద్ద పీటవేశాడు.అలాగని సంస్కృతాన్ని వదలలేదు

అదే సమయంలో జనవ్యవహారంలోని భాషలో (జానుతెనుగు) ప్రసిద్ధ శివకవి పాల్కురికి సోమనాథుడు దేశికవితకు ప్రాధాన్యమిచ్చి బసవ పురాణం వంటి ద్విపద కావ్యం,పండితారాధ్యచరితం,చెన్నమల్లు సీసాలు వంటి అనేక  రచనలు జనజీనంలోని కథలను ఎన్నుకుని రాయడంతో తొలి స్వతంత్ర కవి గా నిలిచాడు.వృషాధిప శతకంతో శతక ప్రక్రియకు ఆద్యుడయ్యాడు.

ఆ తరువాత ఆరణ్య పర్వ శేషాన్ని పూరించిన ఎఱ్ఱన  నన్నయ తిక్కనలకు వారధి గా నిలిచాడు.వర్ణనకు అత్యంత ప్రాధాన్యతనొసంగిన ఈ కవి నృసింహ పురాణము,హరివంశం వంటి గ్రంథాలలో తన సత్తాచాటుకున్నాడు.ఉత్తర హరివంశం రాసిన నాచనసోముడు, శృంగార నైషధం,కాశీఖండం శ్రీనాథుడు, ఆంధ్ర మహాభాగవతకర్త బమ్మెర పోతన వంటి కవులతో తెలుగు సాహిత్యం సుసంపన్నమైంది.

వాగ్గేయకారుడు అన్నమయ్య ఆరాధ్యదైవమైన వేంకటేశ్వర స్వామిపై ముప్పద రెండు వేల కీర్తనలు రచించి తెలుగు భాషను అందగించాడు

విజయనగర సామ్రాజ్యాధిపతి స్వయంగా కవి ఆముక్త మాల్యద గ్రంథకర్త ఏకంగా తన ఆస్థానంలో భువనవిజయమనే సాహిత్య సదనం ఏర్పాటు చేసి అష్టదిగ్గజాలుగా చెప్పబడే అల్లసాని పెద్దన,నంది తిమ్మన,పింగళి సూరన, రామరాజభూష ణుడు (భట్టుకవి), ధూర్జటి,తెనాలి రామకృష్ణుడు, అయ్యల రాజు రామభద్రుడు, మాదయగారి మల్లన వంటి కవులకు రాజాశ్రయం కల్పించి తెలుగు సాహిత్య సీమలో అజరామర మైన కీర్తిని పొందినాడు.

భోగలాలసుడైన వేమభూపాలుడు యోగి వేమనగా మారి తెలుగు భాషను సామాన్య ప్రజలకు దగ్గరచేసాడు. అను భవ సారమైన జ్ఞానాన్ని జనహితానికై అందమైన ఆట వెలదుల్లో రచించాడు.

మగవారితో దీటుగా రామాయణం రాసిన మొల్ల,రాధికా సాంత్వనం రాసిన ముద్దు పళని వంటి స్త్రీలు కూడా తెలుగు భాషా యోషను తమకృతులతో అలంకరించా రు.

ఇలా పదవశతాబ్దం నుండి పందొమ్మిద వ శతాబ్దం దాకా తెలుగు సాహిత్యసామ్రా జ్యాన్ని పద్యం పరిపాలించింది. తెలుగు పద్యం పోదగినన్ని పోకడలు పోయింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *