May 19, 2024

పరికిణీ

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

“అమ్మా..! రా అమ్మా..! కేక్ కట్ చేద్దూగానీ..  లేమ్మా.. నీకోసం కేక్ తెచ్చానమ్మా ” బ్రతిమాలుతోంది అమాయకంగా పర్ణిక, బెడ్రూం లో నిస్తేజంగా పడుకుని ఉన్న జయంతిని. ” ప్లీజ్ పర్ణిక నాకు ఇష్టం లేదు… గెట్ లాస్ట్ , ప్లీజ్ లీవ్ మి ఎలోన్” , హిస్టీరిక్ గా అరిచింది జయంతి.  ఎప్పుడూ పల్లెత్తు మాట అనని అమ్మ అలా అరిచే సరికి విస్తుపోయింది పదకొండేళ్ళ పర్ణిక. అంతలో వాకిలి తలుపు చప్పుడవ్వడంతో బెడ్రూం లోంచి బయటకు వచ్చి చూసింది. ఎదురుగా అమ్మమ్మ కనిపించడంతో బావురుమంటూ వెళ్ళి హత్తుకుంది. ఆ చిన్నారి కన్నులు శ్రావణ భాద్రపదాలయ్యి, అమ్మమ్మ రాగేశ్వరి భుజాలు తడిపేస్తున్నాయి. ” ఏమైంది చక్రీ, ఎందుకలా ఏడుస్తున్నావ్?” అంటూ హత్తుకున్న పర్ణికను ముందుకు తీసుకుని చేతుల్లో పొదివి పట్టుకుని ” నేనున్నా చెప్పు చక్రీ  తల్లీ ఏమైందీ చెప్పమ్మా” అంటుండగా “అమ్మా, అమ్మా”..అంటూ పర్ణిక ఏదో చెప్పేలోపే, ” అమ్మకేమైందీ, కొట్టిందా??” అనుమానం ఆదుర్దా కలగలిపిన స్వరంలో అడిగింది రాగేశ్వరి, పర్ణిక ఏడుస్తూ పలికిన పలుకులకు ప్రతిస్పందిస్తూ.

“నేను సంవత్సరం నుంచి దాచుకున్న  కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు పెట్టి ఈ రోజు అమ్మ బర్త్ డే అని సర్పరైజింగ్ గా ఉండాలని  మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి కేక్ కొనక్కొచ్చా..! కానీ అమ్మ ఆ కేక్ ను చూడటానికి కూడా రావట్లే..! ఎప్పుడూ నా బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు కదా..! ఏ.. నేను అమ్మ బర్త్ డే  సెలబ్రేట్ చేస్తే తప్పేంటీ??”  అని కన్నీరు మున్నీరవుతుండగా అమ్మమ్మ ను నిలదీసింది పర్ణిక.

సంతోషంగా ఉండాల్సిన పుట్టిన రోజునాడు తన కూతురు అలా ఎందుకు ప్రవర్తించిందో తెలిసిన రాగేశ్వరిలో ఆందోళన లేదు. అప్పటికే తనలో ప్రవేశించిన ఆందోళన కాస్తా, బాధగా రూపాంతరం చెందటం ఆరంభించింది. ఆమె కళ్ళ కొసలకు  అకస్మాత్తుగా గండిపడింది.

“అమ్మమ్మా..నువ్వెందుకేడుస్తున్నావ్..!” అంటూ అమాయకంగా  కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, తన తన ఏడుపు ఆపి రాగేశ్వరి కళ్ల నీళ్ళు తుడుస్తున్న పర్ణికను గట్టిగా హత్తుకుంది రాగేశ్వరి. ఆమె కళ్ళ ముందు పుష్కరం క్రితం జరిగిన ఓ చెదరని జ్ఞాపకం మనసును మరలా కదిలించనారంభించింది.

*******************************

మసక దుప్పటి తొలిచి సూరీడు తన జటాఝూటాలను ఆకాశమంతా విస్తరింపజేస్తూ వెలుగు నింపుతున్నాడు.

“బుజ్జి నిద్ర లేచిందా…?” కంచు కంఠం ఆ పాత ఇంటిలో మార్మోగింది. “ఎప్పుడో లేచి తన స్నేహితురాలు శ్రీలత ఇంటికి వెళ్ళింది. అది నిద్ర లేచాక కుదురుగా ఉంటుందా??”  వంటింట్లో నుంచి  పెద్దగా అరచి చెబుతున్న రాగేశ్వరి మాటలు వరండాలో అరుగు పై కూర్చున్న భర్త వెంకన్న చెవులకి ఒకటి తర్వాత ఒకటిగా చేరుతుంటే అతని పెదాలు అరమోడ్పులవ్వసాగాయి.. మీసం మెలేస్తూ..తనలో తాను మురిసిపోయాడు వెంకన్న. విషయం తెలియడంతో  అప్పటి వరకూ తన కూతురు కోసం వెదికిన పొద్దుతిరుగుడు కళ్ళకి శ్రమ తగ్గిస్తూ…” కాఫీ పట్రా..” అని తనూ పెద్దగా అరిచాడు, వంటింట్లోని భార్య రాగేశ్వరికి వినబడుతుండో లేదో అని.

ఆరడుగులకు మరో అంగుళం ఎత్తుండి, ఆజానుబాహుడికి కాస్త తక్కువగా కనిపించే వెంకన్న మనసు వెన్నంటుంటారందరూ. భార్య తెచ్చిన కాఫీ అందుకుని సిగరెట్ ముట్టించాడు.

“ఎందుకా ముదనష్టపు సిగరెట్టు, పొద్దుటే?? పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు.వాళ్ల నాన్న సిగరెట్ త్రాగుతున్నారంటే వాళ్ళు నొచ్చుకోవచ్చు..” ఏదో చెప్పాలని చూసిన రాగేశ్వరి వైపు చూసి, “రాగేశ్వరీ నువ్వు రోజూ సిగరెట్ త్రాగటం  ఆరోగ్యానికి హానికరం అని పెట్టె మీద యాడ్ చదివి చెప్పడం, దానికి నేనూ ఏదో ఒక మాట చెప్పి,అప్పటికి తప్పించుకోవడం మనిద్దరికీ మామూలే కదా..!” అంటూ తన ఎత్తుకి ఏమాత్రం పోలిక లేని రాగేశ్వరి నెత్తిన చిన్నగా తట్టి జారిపోతున్న కండవ సరి చేసుకుని,  “త్వరలోనే పూర్తిగా మానేస్తా సరేనా..!”అన్నాడు. ” చాలా సార్లు విన్నాంలే” అనే విధంగా చిలిపి నవ్వు నవ్విన రాగేశ్వరిని కన్ను గీటుతూ.. మరలా తానే ” నిజం పూర్తిగా త్వరలోనే మానేస్తా..ప్రామిస్!” అని స్నానాల గది వైపు అడుగులేశాడు వెంకన్న.

భర్త మాటలో తొలిసారి నిజాయితీ వెదుక్కుని అత్తయ్యగారికి , మామయ్యగారికీ కాఫీ ఇవ్వాలి అసలే ఆలస్యమైంది ఏమనుకుంటారో ఏమో అని తనలో తాను గొణుక్కుంటూ వంటిల్లనే తన సామ్రాజ్యం వైపు అడుగులేసింది రాగేశ్వరి.   అప్పటికే  …” అమ్మాయ్   కాఫీ పెట్టవా? పాలు వచ్చాయా రాలేదా?”  బాణాలు  బెడ్రూం వైపునుంచి ఒక్కొక్కటిగా దూసుకొస్తున్నాయి వంటింటి వైపు.

స్నానం  చేసి వచ్చి,  ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన కూతురు కోసం వాకిలి వైపు చూస్తూ, మరొక సిగరెట్ ముట్టించి దట్టంగా పొగ వదులుతూ మధ్య మధ్య లో తండ్రి వస్తాడేమో అని ఇంటిలోకి తొంగి చూస్తూ జాగ్రత్తగా సిగరెట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వెంకన్న.

” అయ్యా పొలానికెళ్లాలి ఈ రోజు కూలీలొస్తారు” అంటూ వచ్చిన పాలేరు అరుపు, వెంకన్న ప్రశాంతతను భగ్నం చేసింది. “ఉండ్రా..  బుజ్జమ్మ వచ్చిందాకా ఉండి వెళ్దాం ఈ లోపు అమ్మనడిగి కాఫీ తెచ్చుకో ఫో”..అంటూ అరుగు మీదనుంచి ముందుకొచ్చి  మబ్బులు పరుచుకుంటున్న ఆకాశం వైపు చూశాడు.  అంతలోనే “నాన్నా..” అంటూ వాకిలి తలుపు నెట్టుకుంటూ గాలిలోని సుగంధ పరిమళంలా  వచ్చి తండ్రిని కౌగిలించుకుంది కూతురు బుజ్జి.

“తల్లీ ఎక్కడికెళ్ళావ్ రా.. ప్రొద్దుటే ఆటలేంటీ , కాలేజ్ లేదా..?” అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టిన వెంకన్న వైపు ఓ సారి ప్రేమగా చూసి అంతలోనే ముఖం ముడిచి..
” ఆటకని ఎవరు చెప్పారూ అమ్మ చెప్పిందా? అదేంకాదు మా ఫ్రెండ్ శ్రీలత ఉంది కాదా.. వాళ్ళ అక్క సౌజన్య కి నొప్పులొస్తుంటే వెళ్లా అక్కడకి కీర్తన కూడా వస్తే లేటైంది. నొప్పులొసున్నాయంటే  బుజ్జిపాప పుడుతుందని చెప్పారంట, కాసేపు ఉండాలనిపించింది, కానీ కాలేజ్ కి వెళ్ళాలి కదా అందుకే వచ్చా ! కానీ..” అంటూ గడగడ ఆగకుండా విరిసిన మాటల పూదోటలో విహరించిన వెంకన్న, కానీ అని కూతురు మాట ఆగటంతో , స్వగతంలోకి వచ్చి “ఊ కానీ.. చెప్పూ తర్వాత”  అన్నాడు. “ఈ రోజు కాలేజ్ డుమ్మా కొడాతాలే నాన్నా” అని, “ఎందుకూ” అని అడుగుతున్న వెంకన్నకు నెమ్మదిగా గొలుసు కట్టు తెంచుకుని నేలను ముద్దాడుతున్న చిరుజల్లుని చూపించింది బుజ్జి.  “సరేరా తల్లీ వెళ్ళు.. వెళ్ళి స్నానం  చెయ్యిపో !” అని తనపై వాలిన కూతురి ప్రశాంత వదనాన్ని ఒక్కసారి చూసుకుని తృప్తిగా ఫీలయ్యాడు.

” బుజ్జమ్మా..! ఎటూ కాలేజ్ కి వెళ్ళటంలేదు కదా.. రెడీగా ఉండు సాయంత్రం పొలం నుంచి రాగానే పట్నం వెళ్దాం. నీ బర్త్ డే వస్తోంది కదా.. కొత్త పరికిణీ కొనుక్కొచ్చుకుందాం”  అన్నాడు వెంకన్న. అప్పటిదాకా ఆ ధ్యాస కూడా లేని బుజ్జి ఒక్కసారిగా ఆనందానికీ ఆశ్చర్యానికీ మధ్య ఊయలకట్టి ఊగిసలాడింది. ఆనందం చేసిన డామినేషన్ తో మరోసారి వెంకన్నను గట్టిగా కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి “ఐ లవ్యూ నాన్నా”అంది. ఎక్కడో అనుమానం తొలిచిన వెంకన్న ” ఏమ్మా.. పట్టు పరికిణీ ఓకేగా.. డ్రెస్ ఏమన్నా తీసుకుందామనుకున్నావా?”  అడిగిన తండ్రి ప్రశ్నకు అవుననలేక కాదనలేక తన ముఖారవిందాన్ని తామర పువ్వుని చేసి, “నీ ఇష్టం  నాన్నా” అంది బుజ్జమ్మ. “నిన్ను పరికిణీలో చూసి చాలా రోజులైంది బుజ్జమ్మా, మరోసారి పట్టు పరికీణీలో నిన్ను చూడాలని అలా డిసైడ్ అయ్యా..” అన్న తండ్రితో తల ఢీ కొట్టి “నీ ఇష్టమే నా ఇష్టం నాన్నా” అంది.

నాన్న కూతుర్ల సంరంభాన్ని చూస్తూ, వారి దగ్గరకి వచ్చిచేరుకున్న రాగేశ్వరి వారి మాటల మధ్యలో కలుగజేసుకుంటూ.. “దానికేం కావాలో అదే కొనిపెట్టు నువ్వెళ్ళాక నన్ను చంపుతుంది” అంటుండగా .. ఎక్కడ నుంచి విన్నాడో ఏమో.. “నాకూ కొత్త డ్రెస్ కావాలీ నాన్నా” అంటూ కళ్లు నులుముకుంటూ వచ్చి వెంకన్నపై వాలిపోయాడు కొడుకు శ్రావణ్.
“ఇద్దరికీ తీసుకుందాం.. వెళ్లండి వెళ్ళి ముందు స్నానం చేసి టిఫిన్ తినండి..” అని, పాలేరు రాజుతో బయలుదేరాడు వెంకన్న, ‘పద రాజూ’అంటూ..!

అంతలో రాజు.. “అయ్యా..! చిన్నమ్మ గారి పేరు  బుజ్జమ్మగారేనా? మరేటన్నా ఉందా..?” మట్టి బుర్రలో  నాటుకుపోయి మొక్కైన విత్తనాన్ని తొలిచేయాలని ఆపుకోలేక అడిగేశాడు రాజు.

“ఓహ్ అదా… బుజ్జమ్మ అసలుపేరు జయంతి మా నాన్నమ్మగారి పేరు. ఆ పేరంటే అందరికీ హడల్ అందుకే ఆ పేరుతో పిలవలేక తనని బుజ్జమ్మా అని ముద్దుగా పిలుచుకుంటుంటా” అసలు విషయం చెదరని నవ్వుతో చెప్పాడు వెంకన్న.
” బుజ్జమ్మ పెద్దపిల్లయ్యారయ్యా.. అంటూ లోపలికి తమ్ముడితో వెళ్తున్న జయంతి వైపు చూస్తూ వెంకన్నని అనుసరించాడు రాజు.

చినుకు సవ్వడి మువ్వలని తలపిస్తోంది.. ” ఆ గొడుగు పట్రారా..!” అంటూ మూలనున్న గొడుగు వైపు చేయి చూపిస్తూ బయటకు చేరుకున్నాడు వెంకన్న.

పొలానికి వెళ్ళిన వెంకన్న కోసం మధ్యాహ్నం నుంచీ వాకిలి వదలకుండా కూర్చున్నారు అక్క జయంతి, తమ్ముడు శ్రావణ్.  అంతలో కాలేజ్ కి వెళ్ళి తిరిగి వస్తున్న తన స్నేహితుడు కృష్ణని పిలిచి కొద్ది సేపట్లో తన తండ్రితో కలిసి పట్నం వెళ్ళి పట్టు పరికిణీ కొనుక్కో బోతున్నట్లు చెప్పింది జయంతి. “ఏ.. మన క్లాసులో అందరికీ చెప్పమంటావా..” అంటూ ఆటపట్టించబోయి, “ఎందుకులే దీంతో..గొడవ,  పైన బడి రక్కుతుంద”నుకుని ..  “సరే..సరే..” అనుకుంటూ ముందుకెళ్లాడు  కృష్ణ. గర్వంతోవెనుదిరిగిన జయంతి మరలా గుమ్మనికి వేలాడిన పూమాలలా తమ్ముడికి తోడుగా గడపను చేరింది.

చినుకు చినుకు కలిసి జోరందుకున్నాయి. వర్షం కొంచెం కొంచెంగా పెరుగుతోంది.. అయినా సరే నాన్న తో పట్నం వెళ్ళాల్సిందే అని కళ్ళను నాన్న పై ధ్యాస పెంచేలా మనసుని పురమాయించింది జయంతి…

టెన్షన్ ఆపుకోలేక వంటింట్లో కాఫీ కలుపుతున్న రాగేశ్వరి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి .. ” అమ్మా.. నాన్న రాలేదేందమ్మ.. ఇంకా..? అయినా  పట్టుపరికిణీలో నేను బాగుంటానంటావా..? చెప్పు మా..!” అంటుంటే.. ” ఒసేయ్.. దూరంగా ఉండవే..! కాఫీ పైన ఒలుకుతాయ్.. మీ నాన్నమ్మకి ఇచ్చిరా..” అని కాఫీ కప్పు అందించి నెత్తిన ఒక్క మొట్టికాయ్ వేసి “పొద్దుటి నుంచి ఎన్ని సార్లడిగావే..! రేపు పరికిణీ కొనుక్కున్నాక నువ్వే చెబుదువులే..! ఫో” అంటూ కూతురిని తరిమింది రాగేశ్వరి. “ఎంతసేపా రోడ్డుకు అతుక్కుపోతావ్ మీ నాన్న వస్తార్లే అంతవరకూ మీ తాతయ్యతో కాసిని కబుర్లు చెప్పు” అని కాఫీ తీసుకెళ్తున్న జయంతికి సలహా ఇచ్చింది.

అంతలో రోడ్డు మీద అలికిడవ్వడంతో నాయనమ్మ చేతికి కాఫీ ఇస్తూనే “నాన్న వచ్చినట్లున్నారు పట్నం వెళ్ళి పరికిణీ తెచ్చుకోవాలి ముసిలీ..!” అని రోడ్డు మీదకి పరుగు పరుగున చేరుకుంది.

వర్షంలో ముద్ద ముద్దగా తడిచిన పాలేరు రాజు “అమ్మా..! అమ్మా..” అంటూ రోడ్డు పైనే నిల్చొని  పిలుస్తున్నాడు.
వర్షం శబ్దం అతని మాటను సగం సగంగా మింగేస్తోంది.  అతని ఒళ్ళంతా బురద ఉండటంతో లోపలికి రావట్లేదనుకుని,  “నాన్నేరి రాజూ ఇంకా రాలేదూ.. చీకటి పడుతోంది టైం ఆరైంది” అంటున్న జయంతి మాటకు అడ్డు వస్తూ “అమ్మగార్లేరా.. పిలువు చిన్నమ్మా..!” అన్నాడు రాజు. ఆ గొంతులో వ్యాత్యాసం పసిగట్టలేని, జయంతి “నాన్నేడని నేను నిన్నడుగుతుంటే , నువ్ నన్ను ఖ్వశ్చన్ చేస్తావేంటీ..?” అంటూ తన సహజత్వానికి కాస్త కోపం కలిపి గద్దించినట్లు అడుగుతుండగా అక్కడికి చేరుకున్న రాగేశ్వరి ..”ఉండవే నువ్వు” అని జయంతిని మందలింపుగా అని  ” ఏంటిరాజూ ..” అంటూ వాకిలి  చేరుకుంది. వర్షం పెరగడంతో మకాం గడప నుంచి అరుగు మీదకు మారిన అక్క తమ్ముళ్ళు తండ్రి రాగానే బయలుదేరాలన్న సంకల్పంతో రెడీ అవ్వడానికి సమాయత్తమవుతున్నారు.

రాజు చెప్పిన మాటతో కుప్పకూలిపోయింది రాగేశ్వరి. అప్పటి దాకా వర్షంతో కలిపేసిన తన దొంగ ధైర్యాన్ని ఒక్కసారిగా బయటపెట్టి గొల్లుమన్నాడు రాజు. క్రిందపడిపోయిన తల్లిని చూసి గాబరాగా “అమ్మా..”  అని అరచిన జయంతి  అరుపుకు ” ఏమైంది బుజ్జమ్మా అంటూ నాయనమ్మ, తాతయ్యా!” ఇంటి లొపలి నుంచి అరుగుపైకి చేరుకున్నారు.

“ఆయనను సమీపించిన రాజు అయ్యా..! చిన్నయ్యగారి ట్రాక్టర్ బోల్తాపడింది..” అంటుండగా ఉరుము తన మానాన తను నింగిలో శబ్ధం చేసి, నేలమీది చెవులకు చిల్లు వేసింది. అది విన్న వెంకన్న తల్లి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది. ఏం జరుగుతుందో జయంతికి అర్ధం కాలేదు. అర్ద్ధంచేసుకునే ప్రయత్నంలో మనసు కీడు శంకించింది. అమ్మ క్రిందపడిపోవడంతో కళ్ళల్లో నీళ్ళు నింపుకుని పెద్దగా ఏడవడం ఆరంభించాడు చిన్నోడు శ్రావణ్.

అప్పటికే విషయం తెలిసిన గ్రామస్తులంతా హాహాకారాలు చేస్తూ జోరు వర్షాన్నికూడా లెక్క చేయకుండా వెంకన్న పొలం వైపు పరుగు పెడుతున్నారు. వాళ్ళని అనుసరిస్తూ పరుగులాంటి నడకతో  పొలంవైపుకు అడుగులేస్తున్నాడు వెంకన్నతండ్రి. వెంకన్న వద్దని వారిస్తున్నా  వినకుండా తాను డ్రైవ్ చేస్తానంటూ పాలేరు రాజూ ట్రాక్టర్ నడపడంతో అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడిందని, క్రిందపడ్డ వెంకన్న పై ట్రాక్టర్ పడిందని తెలుసుకున్న పెద్దాయన మనసు రాయి చేసుకుని నిస్తేజంగా చూస్తూ పొలంగట్టునే కూర్చుండిపోయాడు. వర్షం ఎంత ప్రయత్నించినా అతని హృదయంలో భగ్గుమన్న లావాను చల్లార్చలేకపోతోంది.

ప్రాణం ఉండకపోతుందా అన్న ఆరాటం తొలుస్తుండగా, మధ్య మధ్యలో మూగగా తన ప్రాణాలు తీసుకెళ్ళికొడుకు ప్రాణాలు భద్రంగా ఉంచంటూ దేవుడికే ఆఫర్ ఇస్తున్నాడు పెద్దాయన.  అప్పటికే అక్కడికి చేరుకున్న కూలీలందరూ కలిసి వేరే ట్రాక్టర్ సహాయంతో బోలాపడ్డ ట్రాక్టర్ ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు..

గ్రామం భాష్ప గోళాల చెరువవుతుండగా వెంకన్న మృతదేహాన్ని పొలం నుంచి తీసుకు వచ్చి, ఇంటి అరుగు పై పడుకోబెట్టారు. జయంతికి అర్ధం కావడంలేదు.. పరికిణీ తెచ్చుకునేందుకు పట్నం  వెళ్దామన్న తండ్రి రాలేదన్న భావన దాటి బయపడలేని అగమ్యగోచరం లో బంధీ అయ్యింది. తండ్రి  ఇకలేడన్న విషయం జీర్ణం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో స్థాణువై ఉండిపోయింది.

“సిగరెట్ మానేస్తానంటే ఏంటో అనుకున్ననయ్యా.. ఇలా మానేస్తావనుకోలేదు.. ఒంటరిదాన్ని చేసి ఎలా వెళ్ళావయ్యా” అంటూ రోదిస్తున్న రాగేశ్వరిని ఓదార్చే ధైర్యం అక్కడున్న ఎవరూ చేయలేకపోయారు. చిన్నారి శ్రావణ్ కూడా తల్లి ఏడ్పులో తన  స్వరాన్నీ లీనం చేసి “నాన్నా లే నాన్నా న్యూడ్రస్ తెచ్చుకోవాలి” అంటూ పిలుస్తుంటే విన్నవారి గుండె తరుక్కుపోతోంది.. ఊరు ఏడుస్తుంటే చూడలేకేమో వర్షం వారందరి కన్నీటిని తనలో కలిపేసుకుంటూ  తనూ సంద్రమవుతోంది.

అక్కడ అందరి కళ్లూ జలపాతాలై, గుండె అగ్నిపర్వతాలవుతుంటే, జయంతి కంటిలోంచి మాత్రం చుక్క నీరు ఒలకలేదు.. తడియారిన కళ్ళు తండ్రివైపు మూగగా చూస్తున్నాయి. అందులో ఏమాత్రం జీవంలేదు.. జరుగుతున్న తంతుని నమ్మే స్థితిలో లేదు జయంతి. పరికిణీ కొనుక్కునేందుకు  వెళ్దామన్న తండ్రి రాలేదన్న భావన నుంచి ఇంకా  తేరుకోలేదు.

మంచివాడిగా పేరున్న వెంకన్న మృతి విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామస్తులు కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మువ్వలంక లోని వెంకన్న ఇంటికి చేరుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు తెల్లవారిందో ఎవరికీ తెలీదు, వేదనా హృదయాలు బరువెక్కిపోతున్నాయి. రాత్రంతా కన్నీరొలికించిన ఆకాశం కళ్ళు, పొడిబారినట్లు వర్షం ఒక్కసారిగా నిలిచిపోయింది. మౌనం అక్కడ కొలువయ్యింది.  జయంతి మాత్రం స్పృహలోకి రాలేదు. వచ్చిన బంధువులందరూ అందరూ “నాన్నను చూడుపోవే” అంటూ పిలుస్తున్నా కదలలేదు మెదల్లేదు.

అయ్యవారు పంచాంగం పట్టుకుని “ఉత్తరాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ విదియ సోమవారం” అంటూ క్రతువు ప్రారంభించాడు. నిన్నటి దాకా ఆనందం తాండవం చేసిన ఆ పొదరిల్లులో, ఇప్పుడు విషాదం విస్తరిస్తూనే ఉంది.  నిజం-అబధ్ధం మధ్య మనసులు కొట్టుమిట్టాడుతున్నాయి. ఏదైనా అద్భుతం జరగాలని, వెంకన్న చిరునవ్వుతో శాశ్వత నిద్ర నుంచి లేవాలని అక్కడ అన్నీ హృదయాలూ,  కోరుకుంటూనే ఉన్నాయి. నారాయణ..నారాయణ శబ్ధం దూరమవుతుంటే..ఇంటి వాకిలికి ఆడవారి రోదనలు వేలాడాయి.

శ్ర్రీరామచంద్రుడంటి  వెంకన్న  పెదకర్మకు భారీగా అన్నదానం ఏర్పాటు చేశారు ఆయన సోదరులు. గ్రామస్తులు, బంధుమిత్రులందరూ ఒకరి తర్వాత ఒకరుగా వెంకన్న ఫొటో వద్దకు వచ్చి నివాళులర్పించి వారికి వెంకన్నతో ఉన్న బంధాన్ని తలుచుకుని కళ్ళు తుడుచుకుంటూ ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు.

ఒక వైపు పెదకర్మ జరుగుతుంటే  మరోవైపు  పన్నెండు రోజులైనా కోలుకోని జయంతి దగ్గరకు,  ఆమె మేనమామ నరసయ్య చేరుకుని తనతో తెచ్చిన పట్టు పరికిణీ అందించి కన్నీళ్ళు తుడుచుకుంటూ,”హేపీ బర్త్ డే రా బుజ్జీ” అన్నాడు. “నాకొద్దీ పరికిణీ, నాన్న కావాలి మామయ్యా..” అంటూ భోరున ఏడుస్తూ మేనమామను కౌగిలించుకుంది జయంతి ఆనకట్ట తెగిన గోదారమ్మై!! మేనత్త  శ్రీలత  కన్నీళ్ళు తుడుచుకుంటూ దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయింది.

*******************************

అమ్మమ్మ కూడా అమ్మని కేక్ కట్ చేయమని రికమెండ్ చేయకపోవడంతో  ఏం జరుగుతోందో అర్ధం కాని పర్ణిక  తాతయ్య ఫొటో దగ్గర నిలబడి “తాతా.. నువ్వన్నా చెప్పుతాతా అమ్మకి, నేను తనకోసం తెచ్చిన కేక్ కట్ చేయమని, నీమాట వింటుంది” అంటూ ఏడుస్తూ ప్రాధేయపడసాగింది.

*******************************

అంతం లేని కథ, తను అనుకున్న రీతిలో వచ్చిందని సంతృప్తి చెందిన కృష్ణుడు యథావిధిగా అచ్చుకు నోచుకోని తన కథల దొంతరలో ‘పరికిణీ’ని కూడా మడిచి సర్దేశాడు.

*******************************

 

30 thoughts on “పరికిణీ

  1. ధన్యోస్మి.. జయశ్రీగారూ.. ఇది నిజంగానే జరిగిన కథేనండీ.. ఓ చిన్నారి కన్నీటి కథే ఈ పరికిణీ… ఇప్పుడు కాదులేండీ.. అప్పుడెప్పుడో..

 1. చాలా చాల బావుందండి మీ శైలీ .. కొన్ని అనుకోని సంఘటనలనుండి బయట పడడం ఎంత కష్టమో అనిపించింది.. కధ మనసుని ఒక్కసాిరి కదిలించివేసింది.. చాల చాల బాగ వ్రాసారు

 2. పరికిణి కథ చాలా హృద్యంగా… చక్కటి సెంటిమెంట్ తో హత్తుకునేలా ఉంది కల్యాణ్ గారూ… మీలో మంచి నాణ్యమైన కథకుడు ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞుడైన రచయిత రాసినట్లు అనిపించింది. హృదయపూర్వక అభినందనలు… కొనసాగించండి… మీ రచనా వ్యాసంగాన్ని… మీ సామల సింహాచలం

 3. సహజంగా ఉంది.. చదివినంత సేపూ దృశ్యం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది.
  చదివాక కూడా వెంటాడుతూనే ఉంది.

  తండ్రి ప్రేమ.. తల్లి అనురాగం పల్లె మనుషులు.. ఆప్యాయతానురాగాలూ.. ఇవన్నీ చక్కగా ఇమిడి కుటుంబం ఇలా ఉండాలి అనిపించిది.
  ఐతే.. అనుకోని సంఘటన జరిగి పసితనపు ఆశల్ని కాలరాసినప్పుడు గుండెల్లో గోదావరి.. కళ్ళలో పోటెత్తింది.
  పరికిణీ వెనుక కథ.. కథనం చక్కగా ఉన్నాయి.
  అభినందనలు కళ్యాణ్ గారు

 4. బాగుంది..ఒకప్పటి రోజులు గుర్తుకు వచ్చె.. బట్ కేక్ కట్ చేస్తే పర్ణిక హప్ప్య్ అయ్యేది..కట్ చెయ్యాలిసింది

 5. బాగుంది…ఓ నాటి పల్లెటూళ్ల వైభవం ..ఆనందం..ఆ లోగిల్లు గుర్తుకు వచ్చాయి..బట్ పర్ణిక ని ఆఫ్సెట్ చేశారు..కేక్ కట్ చేస్తే బాగుండేది

  1. ధన్యవాదాలండీ… అందుకే తాత గారికి చెప్పుకుందిగా.. చేయించే ఉంటార్లేండీ..

 6. Chala adbhtam ga visadeekarincharu….tandri kutlla bandhanni.. .. kasha..chala babundi.vastavaniki Ati Da
  ggaralo

 7. క్షమించాలి . వేరే పోస్టులో పెట్టవలసిన కామెంట్ ఇక్కడ పడింది .

  కధ బాగున్నది . రచన శైలి కూడా బాగున్నది.

  1. ఫర్వాలేదమ్మా.. అదిలాబాద్ అనగానే అదిరిపడ్డా… ధన్యోస్మి మా..

 8. ఈ పిల్లగాడు ఆదిలాబాద్ జిల్లావాడును బాగున్నది
  స్కూల్ అనాల్సిన చోట. కాలేజీ అనడం , లాంటి కొన్ని చిన్నా చిన్న తప్పులు దొర్లాయి
  ఇంకా పిల్లని కసురుకున్నతల్లి , భాధ అర్ధమయ్యే వయసుకాదుకాబట్టి , అమ్మమ్మ తేన ధోరణిలో చెప్తే బాగుండేది .

  1. అమ్మా ఆ పాప కాలేజీ విద్యార్ధినే..మరొకసారి వీలున్నప్పుడు చదవగలరు.. మొదటి పాప పర్ణిక అనే పాప చిన్న పాప.. మీరన్నట్లు స్కూల్ విద్యార్ధిని… ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నది పర్ణిక తల్లి చిన్నప్పుడు.. కాలేజీ ఏజ్ లో క్యారెక్టర్.. గమనించగలరు.. మీ స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. _ కరణం

  2. మీ అదిలాబాద్ పిల్లగాడు ఏవిటో నాకు బోధపడలేదమ్మా.. వివరించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *