February 21, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “విశ్వం పిలిచింది”

రచన: డా.విజయలక్ష్మీ పండిట్

చేతిమీద చల్లగ ఏదో స్పర్శ తగలడంతో కండ్లు తెరిచాడు అభిదీప్.ఆ స్పర్శలో ఎంతో స్వాంతన ..ఏదో మహత్తు వున్నట్టు తోచింది.
లేచికూర్చుని ఎవరా అని చుట్టూ చూశాడు.
తనపక్కన ఒక యువకుడు నిలుచుని వున్నాడు.
అతనిలో ఏదో చెప్పవీలుకాని తేజస్సు .అతని ఒంటినుండి ఆహ్లాదంగా ప్రవహిస్తూ చల్లగా
అభిదీప్ ను తాకుతూంది.
“ఎవరు మీరు “ అంటూ ఆ అర్ధరాత్ర సమయంలో తన నిద్ర చెరిగిపోయినందుకు చీకాకుగా అడిగాడు చుట్టు చూస్తూ..,
మిద్దెమీద పిండి ఆరబోసినట్టు వెన్నెల వెలుగు. తనకు కొంచెం దూరంలో అమ్మ , నాన్న, చెల్లి పడుకొనివున్నారు పడకలపైన.
అప్పుడప్పుడు వేసవి కాలంలో ముఖ్యంగ వెన్నెలలో చల్లని గాలికి పడుకోవడం అలవాటు చేశాడు పదహారేండ్ల అభిదీప్ అందరికి.
అందుకు కారణం..,చిన్నప్పటినుండి
అభిదీప్ కు ఆకాశమన్నా నక్షత్రాలన్నా చందమామన్నా అమితమైన ఆసక్తి , ఇష్టం .
“మీరు ఎవరు ? ఎందుకొచ్చారు? ఏంకావాలి “అన్నాడు అభిదీప్ ఆ యువకుడినుద్దేసించి.
“నా పేరు చంద్రుడు ,నేను నీకోసమే వచ్చాను
అభి “అన్నాడు అతడు.
“నా పేరు ఎట్లా తెలుసు ఇతనికి ?అదీ అమ్మ నాన్న ,దగ్గరి ఫ్రెండ్స పిలిచినట్టు అభి అనిపిలుస్తున్నాడు “ అనుకుమ్మాడు అభిదీప్.
“నేనెట్లా తెలుసు మీకు ..,నా పేరుకూడా చెప్పకనే పిలుస్తున్నారు” అన్నాడు
“నేను నీ బాల్యంనుండి నీ స్నేహితున్ని . ఇంకా చిన్నగా వున్నపుడు నీవెప్పుడు మీ అమ్మ నడుగుతూ వుండేవాడివి కదా..,చంద్రుడు నా స్నేహితుడంటావు కదా .., ఎప్పుడు నాకోసం క్రిందికి దిగివచ్చి నాతో ఆడుకోడేమి ..? “అని
అన్నాడు చంద్రుడు.
నా చిన్నప్పటి మాటలు ఇతనికెలా తెలుసని
మరింత ఆశ్చర్యంతో అనుమానంతో చంద్రుడి
వైపు చూడసాగాడు అభిదీప్.
“మీరెప్పుడు ముందెపుడు నాకు కనిపించలేదు
ఇప్పుడెందుకు వచ్చారు “ ఇంత రాత్రి అని ..,
మీరు చంద్రుడన్నారు ..,అయినా చంద్రుడు మవిషి ఆకారంలో వుండడు కదా “ అంటూ పౌర్ణమి చంద్రుని వైపు చూశాడు అభిదీప్.
“నీవు ఆస్ట్రోనట్ కావాలి చంద్రుడిపై కాలుపెట్టాలి ,తిరగాలి అని ఎప్పుడు నీలో రగులు తూంటుంది కదా ,ఆ నీ కోరిక..ఆకర్షణకు ఇక దిగురాక తప్పలేదు నాకు మిత్రమా ..” అంటాడు చంద్రుడు.
“మీకెలా తెలుసు నా మనసులోని కోరికలు, ఆలోచనలు” అని అడుగుతాడు చంద్రుడిని.
“మాకు అందుతాయి అభి ..,నిర్మల నిశ్చల నిజాయితి మనసు కోరికల ఆలోచనల తరంగాలు.
మా చైతన్యము .., కాన్సియస్నెస్ వాటిని
గ్రహిస్తుంది .., రెండు రోజుల క్రితం భారతదేశం
చేసిన “చంద్రయాన్” అంతరిక్ష ప్రయోగం విజయవంతమయినపుడు పొంగిపోయీవు.
నీవు కూడా ఆస్ట్రోనట్ అయి భూమికి దగ్గరున్న చంద్ర గ్రహాన్ని మనుషుల ఆవాస యోగ్యంగా చేసే ఆ భృహత్ కార్యంలో నేను వుండాలి..,చంద్రగ్రహంపై
కాలుమోపాలి..,అక్కడ చెట్లను మెక్కలను పెంచి మానవ ఆవాసాలను ఏర్పరచాలి అని నీ మనసులోని బలంగా నాటుకున్న నీ కోరికను మీ అమ్మ నాన్నలతో అన్నావుకదా. అప్పుడు
వారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నీ
కోరికను కొట్టి పారేశారు కదా..?!”
“ఆ నీ కోరిక చిన్నప్పుడు నీ గుండె
లోతులలో నాటుకుని పెద్ద వృక్షమై ఇప్పుడు బయట పడిందని వాళ్ళకు తెలియదు. ఆ నీ కోరికను నెరవేర్చే వైపు నీకు చేయూతనిచ్చి నిన్ను సన్నద్ధం చేయడానికి విశ్వం నన్ను నీ వద్దకు పంపింది అభి “ అన్నాడు చంద్రుడు.
“నిన్ను నాతో చంద్ర గ్రహానికి తీసుకుపోయి
భవిష్యత్ లో మానవులు .. మీరు ఏర్పరచ బోయె
ఆ ఆవాసాలను .., అదే మూన్ కాలనీలను
నీకిపుడే చూపిస్తాను వస్తావా . నన్ను చంద్రా అని పిలువు “ అని మిలమిల మెరుస్తున్న తన
కుడి చేతిని చాచాడు చంద్రుడు అభిదీప్ వైపు.
ప్రేమతో ఆప్యాయంగా పిలిచిన ఆ మాటలు
అభిదీప్ మనసును తాకాయి. కొంచెంసేపు తటపటాయించాడు ..ఈ అగంతకుడితో
పోవడం మంచిదా కాదా .. అనుకుంటూ..,
మరల కొన్ని నిముషాలకు చంద్రునితో వెళ్ళాలనే నిర్ణయం తళుక్కున మెరిసి చంద్రుని చేయందుకున్నాడు నిద్రపోతున్న అమ్మ
నాన్నలను చూస్తూ .
“నేను మరలా మీ ఇంట్లో ఇక్కడ ఈ రాత్రికే మీ అమ్మ నాన్న మేలుకోక ముందే దింపుతాను నిన్ను అభి ..రా” అంటూ అభిదీప్ చేయి పట్టుకున్నాడు.
అభిదీప్ శరీరమంతా ఏదో విద్యుత్ అయస్కాంత
శక్తి పాకి దూదిపింజలా శరీరం తేలికై అంతరిక్షంలో
చంద్రుడితో కూడా మాయమయ్యాడు .
అభిదీప్ కు ఊహించే శక్తి, సృహ ఏమిలేవు.
అంతా శూన్యం గా తోచింది.
అభిదీప్ కు సృహవచ్చేప్పటికి చంద్రుడితో
కూడా చంద్రగ్రహంపై వున్నారిద్దరు.
చంద్రుని శరీరం లాగే ఏదో శక్తి అభిదీప్ లో ప్రవేశించి శరీరంపై ఏ తొడుగు ఏమిలేకుండానే చంద్రుడు తన చేయిపట్టుకుని నడిపిస్తున్నాడు.
శరీరం లేనట్టు తను చంద్రుడితో గాలిలో తేలిపోతూ చూస్తున్నాడు ఆసక్తిగా.
చంద్రగ్రహం పై మనుషుల కాలనీలు వెలిసాయి.
గుండ్రని మెరిసే బోర్లించిన పేద్ద తెల్లని ఇండ్లు బారులు బారులుగా . మధ్యలో పెద్ద
గాజు తలుపులతో అల్యూమినియంలా మెరసే
తొట్లలో పచ్చని చిన్నగ గిడసబారి బోన్సాయి చెట్లు మొక్కలు కాయలు పండ్ల తో నిండుగా ఉన్నాయి. అక్కడక్కడా మనుషులు తేలుతూ పండ్లు కూరగాయలు సేకరిస్తూ కనిపించారు. వాళ్ళ శరీరాలకు తలకు పలుచటి తొడుగులున్నాయి.
వీపుమీద చిన్న ఆక్సిజన్ సిలిండర్.
“ మనుషుకు కావాలసిన ప్రాణవాయువు.., అదే ఆక్సిజన్ సప్లై ఎలా ..చంద్రునిపై ఆక్సిజన్ వుండదుకదా..” అని అడిగాడు అభిదీప్.
“భూమిపైని గ్రీన్ హౌస్సెస్ లాగ ఇక్కడ
ఘనీభవించిన నీటిని తెచ్చి నిలువచేసుకుని ఈ వాతావరణానికి పెరిగే ఆహారపు మొక్కలను పెంచుతున్నారు., పిండిపదార్థాలు తయారుచేసే కిరణజన్యసంయోగ క్రియ ప్రక్రియ కోసం కార్బన్ డయాక్సైడ్ను విడుదలచేసే మొక్కలను,ఆ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి పచ్చని చెట్లు
విడుదలచేసే ఆక్సజన్ ను
సేకరించి స్టోర్ చేయడం,ఇక్కడున్న మనుషులకు ఆహారానికి కాలాల్సిన అనుకూల పంటలు పండించుకోవడం ఇక్కడ పెద్ద పరిశ్రమ.
హీలియం ఖనిజం తీసే గనులు , రాకెట్, సెటలైట్ లాంచింగ్ స్టేషన్లు చాలా దేశాలు ఇక్కడ నడుపుతున్నాయి. భూమిపై హీలియం నిక్షేపాల కొరతుంది.హీలియం నుండి విద్యుశ్చక్తి ని తక్కువ కర్చుతో తయారు చేయడానికి వీలున్నందువల్ల
కూడా ఇక్కడ ఆ గనుల నుండి తీసి భూమికి తీసుకుపోతున్నారు. చంద్ర గ్రహం నుండి ఇతర గ్రహాలకు సెటలైట్ లను దూరాన్ని అధికమించి పంపడం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల రాకెట్ లాంచింగ్ స్టేషన్లు వెలిసాయి చంద్ర గ్రహంపైన అన్నాడు చంద్రుడు .

“చంద్రా ఇది భవిష్యత్ పరిస్థితి అన్నావుకదా ఇప్పుడు భూమిపై ఏ సంవత్సరం జరుగుతూంది”
అడిగాడు అభిదీప్.

“ఇప్పుడు భూమిపై 2040 వ సంవత్సరం నడుస్తూంది . ఆ కాలంలో నీవుకూడా ఒక వ్యోమగామునిగా అంటే ఆస్ట్రోనట్ గా ఇక్కడ
ఉండి కొన్ని ముఖ్యమయిన ప్రయోగాలు జరుపుతావు అభి “ అన్నాడు చంద్రుడు.

ఆశ్ఛర్యంతో అభిదీప్ ముఖం వెలిగింది .అవునా అన్నట్టు చూశాడు . చంద్రుడు చిరునవ్వుతో తల ఊపాడు.

అభిదీప్ మెదడులో ఒక అలోచన మెదిలింది.
“ నీఆలోచన నీ కుటుంబాన్ని గురించి కదా.. నీ భార్య బిడ్డ భూమి పైనే వుంటారు.నీవు మాత్రం ఐదు సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమయిన ప్రయోగాలు చేసి కీర్తి గడిస్తావు.”

తనమనసులో మెదిలే ఆలోచనలు చంద్రుడు పసికట్టడం ఆశ్చర్యంగా వుంది అభిదీప్ కు.

“ఈ విశ్వమంతా శక్తి తరంగాల మయం అభి ..,నీ ఆలోచనల శబ్దతరంగాలు నాకు చేరి నీ ఆలోచనలు ఏమిటో తెలుస్తాయి “అంటాడు చంద్రుడు.

కొడుకు చేయిపట్టి నడిపిస్తున్న తండ్రి లా చంద్రుడి చేతిలో తనచేయితోఅభిదీప్ ఎంతో ఉత్సుకతతో విమానంనుండి క్రింద భూమిపైన దృశ్యాలను తిలకించి ఆనందించే పిల్లాడిలా చంద్ర గ్రహం ఉపరితలంపైని మానవ ఆవాసాలను ప్రయోగశాలలను, ఇతర గనులను, రాకెట్ లాంచింగ్ స్టేషన్లను ఆనందంతో తిలకించాడు.

“ అభి ఇంక బయలుదేరుదాము మీ అమ్మ నాన్న లేవక ముందే తెలవారక ముందే నిన్ను మీ మిద్దె పైన దింపుతాను . లేకపోతే మీ అమ్మ నాన్న కంగారు పడతారు రా… “అన్నాక అంతా శూన్యం..

కొన్ని క్షణాలలో మిద్దెపైన వున్నా రిద్దరు.తన మునుపటి శరీర స్థితిని పొందుతాడు అభిదీప్.

ఆ సమయంలో అభిదీప్ మనసులోని అనుమానానికి చంద్రుడు ఇలా జవాబిచ్చాడు.।
“ అభి నీవు నాతో కూడా చంద్రునిపైకి వచ్చిన
రీతిన మానవులు చంద్రగ్రహానికి వెళ్ళలేరా
అని అనుకుంటున్నావు..,అది ఈ మానవ
శరీరంతో వీలుకాదు.మనోమయ తరంగ సూక్ష్మ
శరీర జీవులు వేరే వున్నారు..,
నీవు నాతో చంద్రుడిపై తిరుగాడిన అనుభవం అనుభూతి నీవు భవిష్యత్తులో నీ లక్ష్యం నెరవేరడానికి తొలిమెట్టు. నీ కలను సజీవంగ వుంచి నిన్ను విశ్వం ముందుకు నడిపిస్తుంది మిత్రమా..”
అంటూ అభిదీప్ ను కౌగిలించుకుని “ఇక సెలవు “అంటూ అభిదీప్ చేయివదిలి పెడతాడు.

ఆ అయస్కాంత అద్భుత అనుభవం అభిదీప్ ను
చాల సంవత్సరాలు వెంటాడింది.

***

అభిదీప్ కొడుకు శశాంక్ వాళ్ళనాన్న చెప్పిన కలలాంటి తన అనుభవాన్ని ఆశ్చర్యంతో విన్నాడు.
చంద్రుడిపై తన ఐదు సంవత్సరాల ప్రయోగాలు ముగించుకుని తిరిగి వచ్చిన తరువాత చంద్రునిపై తన అనుభవాలను భార్య దివ్య కొడుకు శశాంక్
తో పంచుకుంటాడు.

పది సంవత్శరాల శశాంక్ ఆ సమయంలో వాళ్ళనాన్ననడుగుతాడు,” నాన్నా మీకు ఎందుకు ఆస్ట్రోనాట్ అవ్వాలనిపించింది .., తాత నాన్నమ్మ ఒప్పుకున్నారా ?“ అని.

“ అది నాజీవిత కల శశాంక్ ..,నేను చిన్నప్పుడు
మా అమ్మ ఒడిలో కూర్చోపెట్టుకుని చంద్రున్ని చూపిస్తూ అదిగో ఆ
చల్లని చంద్రుడు నీ స్నేహితుడు నాన్నా..
నీవు కూడా వెళతావా చంద్రున పైకి అని చంద్రుని తలంపై అడుగిడిన వ్యోమగాములగురించి చెప్పేది.
ఆ మాటలు నాలో అన్నంతో పాటు జీర్ణ మయి నా శరీర ధాతువుల్లో కలిసిపోయి నా జీవన కలగా ధ్యేయంగా మిగిలిపోయింది.చంద్రుని పైకి వెళ్ళాలనే కోరిక బలంగా ఉండిపోయింది.
నా కోరికను ,సంకల్పాన్ని ఈ విశ్వం గ్రహించి నాకు తోడయి చంద్రుడితో ఆ అపురూప అద్భుత అనుభవాన్నిచ్చింది.
ఆ నా బాల్యపు సృతులతో , చంద్రునితో కలలాంటి అనుభవంతో నా వెన్నంటి నడిపించింది విశ్వం నన్ను “ అని అంటాడు కొడుకుతో అభిదీప్.

“నాన్నా చంద్రునితో చంద్రగ్రహంపైకి వెళ్ళి వచ్చిన మీ కల లాంటి ఆ అనుభవాన్ని తాత నాన్నమ్మ తో చెప్పారా మీరు..వాళ్ళేమన్నారు ?”అని అడుగుతాడు శశాంక్.

“రెండుమూడ సార్లు చెప్పినపుడు వాళ్ళు అయోమయంతో నన్ను చూస్తూ వీడికేదో గాలి సోకినట్టుందనుకుని మా అమ్మమ్మ ఊరి
దగ్గర వున్న అవధూత దగ్గరకు తీసుకున వెళ్ళారు.
మా అమ్మమ్మ ఆ అవదూతను తన పరమగురువుగా భావించ తన పిల్లల జీవిత సమస్యలను చెపుకుంటూ ఆ అవధూత సలహాలు తీసుకున స్వాంతన పొందుతూండేది.

మా అమ్మ నాన్న అమ్మమ్మ వాళ్ళు నన్ను ఆ అవదూత దగ్గరకు తీసుకెళ్ళినారు.
మేము అతనున్న ఆశ్రమం లోపలికి వెళ్ళగానే
కండ్లు తెరిచి నావైవు చూసి,
“ చంద్రుడి చేయి పట్టుకుని “చంద్రయాన్” చేసి చంద్రునిపై కాలు పెట్టి భవిష్యత్ లోని మానవుల ఆవాసాలను చూసివచ్చావు అభిదీప్ అదృష్టవంతుడివి “అన్నాడు.

“చంద్రుడి చైతన్యం చెప్పినట్టు ఇతడు చంద్రుడి పైకి వెళతాడు “అని కండ్లు మూసుకున్నాడు.
అప్పటినుండి అమ్మ నాన్నలు నా ప్రయత్నాలకు లక్ష్య సాధనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు .

“శశాంక్ ఇప్పుడు నేను చెప్పే దేమంటే జీవితంలో యవ్వనంలోనే ఆలోచించి ఒక మంచి లక్ష్యాన్ని
పెట్టుకోవాలి.ఎవరికోసమో కాకుండా నీవేమి కావాలనుకుంటావో , సాధించాలనుకుంటావో ఆ కలను సాకారం చేసుకొని సాధించడానికి నిజాయితితో నీ వంతు శ్రమించాలి.
మనుషులన్నాక ప్రేమలు, పెండ్లిల్లు పిల్లలు ఇవి సహజంగా జరిగేవే కాని నీవు పెట్టుకున్న ఆ లక్ష్యం ,కల నిన్ను ఆ వైపు నడిపించి అమూల్యమయిన మన జీవితానికి ఒక సార్థకతనిస్తుంది.
ఆ కల గురించిన చింత తీవ్రతను బట్టి అది మంచి పని అయినప్పుడు ఒళ్ళంత కండ్లు చెవులతో మనను ఎల్ల వేళల కనిపెట్టుకుని వున్న ఈ విశ్వం మన సంకల్ప సాధనవైపు నడిపిస్తుందని నా గట్టి నమ్మకం .”అంటాడు కొడుకుతో అభిదీప్.

బాల్కనీలో కూర్చొని వాళ్ళనాన్న చెప్పిన వుదంతం విన్న శశాంక్ చీకటి కమ్ముకుంటున్న ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలవైపు చూస్తూ వుండిపోయాడు.

లోపలికి నడిచిన అభిదీప్ వంటింట్లో ఉన్న
భార్య దివ్య దగ్గరకు వచ్చి, “ దివ్య ..శశి కి సరయిన వయసులోనే నా జీవితానుభవాలను లక్ష్య సాధను గురించి చెప్పాను.అల్లరి చిల్లర తిరుగుడులు ఆలోచనలకు చోటివ్వకుండా వాడి మనసు ఒక జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశవైపు సాగాలని నాకోరిక దివ్య” అంటాడు.

ఒక జీవితలక్ష్యం తో తన తో కూడా చదివిన అభిదీప్ ను ఎంతో అభిమానించేది దివ్య.
ఇద్దరు ఇష్టపడి పెండ్లి చేసుకున్నారు. దివ్య
అభిదీప్ బుజంపై చేయివేసి నవ్వుతూ “నీ కొడుకు ఏమి కలకంటాడో..ఆ మంచి లక్ష్య సాధనవైపు నడిపించమని విశ్వం ను వేడుకుంటూ శశిని గైడ్ చేయడానికి ఎవరిని పంపుతుందో చూడాలి మనం .” అంటుంది దివ్య .
*******
By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *