March 29, 2024

అమ్మడు

రచన: డా. కె. మీరాబాయి

” అమ్మడు వెళ్ళిపోయాక నాకు పిచ్చెక్కినట్టు వుంది ” అన్న అక్క స్నేహితురాలి మాటలు వినబడి అక్కడే ఆగాడు నిఖిల్.
” నిజమే . ఇంట్లో వున్నంత సేపూ మన చుట్టు తిరుగుతూ వుండి అలవాటైన వాళ్ళు వూరెళ్ళితే దిక్కు తోచదు ప్రమీలా .” ఆక్క ఒదార్పుగా అంది.
” అసలే జనముద్దు పిల్ల. అందులోను వయసులో వుంది .నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు . కాస్త పొట్టిగా బొద్దుగా వున్నా అందరి కళ్ళు దానిమీదే. ఆందుకే బయటకువెళ్ళి వచ్చిన ప్రతీసారీ దానికి ద్రిష్టి తీసేస్తాను సరళా.. ” ప్రమీల అంది అక్కతో.
చాటునుండి వాళ్ళ మాటలు వింటున్న నిఖిల్ శరీరం మీద రోమాలు నిక్కబొడుచు కున్నాయి.
” తనకూ కూడా తెల్లని ఒళ్ళు ,నల్లని కళ్ళు వున్నాయి. అంతే కాదు తను కూడా పొట్టిగా, కాస్త పొట్టతో వున్నాడు. ఈ అమ్మడు ఎవరో నాకు జతగా ఆ బ్రహ్మ స్రుష్టించాడు ” అనుకున్న నిఖిల్ ముఖం మీద మందహాసం తొంగి చూసింది.
” వారాంతపు సెలవులు రెండు రోజులు నా చుట్టూ తిరుగుతూ వుంటుంది నా బంగారు తల్లి.లేకుంటే వేళకు తినిందో లేదో, ఏమి చేస్తోందో అని ఒకటే దిగులు గా వుంటుంది. ఇద్దరు మగ కుంకల తరువాత మన ఇంట మెరిసింది. నీ వెంట పెట్టుకు పోతే నాకేమి తోస్తుంది?” అని మొత్తుకున్నా వినకండా అమ్మ నా అమ్మడు ని మా చెల్లెలి ఇంటికి డబ్లిన్ తీసుకు పోయింది. “మనసులో బాధ వెళ్ళగక్కింది ప్రమీల.
” రెండు రోజులే కదా. సోమవారానికల్ల అమ్మడు నీ కళ్ళ ముందు వుంటుంది. సరే నేను ఇండియా బజారుకి వెళ్ళాలి. . . నీకేమైనా కావాలా? ” సంభాషణ ముగిస్తూ అడిగింది సరళ.
” ఏమీ వద్దు. ఇంటికి వెళ్ళి మా ఇద్దరికీ ఏదో అన్నం పప్పు వండుకోవాలిగా . అమ్మడికైతే చికెన్ , మటన్ వుండాల్సిందే.. ” అని వెళ్ళడానికి లేచింది ప్రమీల. .
చాటుగా వింటున్న నిఖిల్ గుండె ఆనందంతో లయ తప్పింది. ” రేప్పొద్దున్న అమ్మడి మొగుడిగా మీ ఇంటికి ఈ అల్లుడు వస్తే రోజూ చికెన్ మట్టన్ వండి పెడతావన్నమాట అత్తా! ” అనుకుంటూ విజిల్ వేయబోయి , కాబోయే అత్తగారు ఇంకా అక్కడే వుందని గుర్తు వచ్చి ఆగిపోయాడు.
నిఖిల్ కి మరో నెలలో ముప్ఫై ఏళ్ళు నిండ బోతున్నాయి. ఇంకా పెళ్ళి కాని ప్రసాదుగా మిగిలి పోయాడు. కారణాలు బోలెడు. అయిదడుగుల మనిషి నూట డెబ్భై పౌండ్లు వుండడం, తిండి యావతో పొట్ట కాస్తా ముందుకు వచ్చి , జుట్టు కాస్త వూడి బట్ట తల రావడం ముఖ్యమైనవి . ” అందులో ఈ కాలం అమ్మాయిలు జీతం గీతం వివరాలతోబాటు అమ్మా నాన్నా వున్నా రా , వుంటే నీతో వుంటారా, అక్క చెల్లెళ్ళు వచ్చి పోతుంటారా లాటి మామూలు ప్రశ్నలతో బాటు కాస్త బరువు తగ్గితే ఆలోచిస్తాను,జుట్టు మరీ పాత ఫాషన్ గా వుంది లాటి అభ్యంతరాలు లేవనెత్తు తున్నారు . ఈ అమ్మడు పొట్టిగా ,బొద్దుగా వుందంటున్నారు గనుక ఒప్పుకోవచ్చు. వుహలలో తేలి పోయాడు నిఖిల్.
నిఖిల్ అక్క సరళ ఈ మధ్యనే కాలిఫోర్నియా లో ఫ్రీమాంట్ కు మారింది . నిఖిల్ పక్కనే వున్న డబ్లిన్ లో పనిచేస్తాడు. ఆక్కడే రెండు పడక గదుల భాగం లో వుంటున్నాడు. . ప్రస్తుతం వాళ్ళ అమ్మ కూడా అతని దగ్గరే వుంది.
ఆ సాయంత్రం ఎలిజబెత్ పార్క్ లో నడక సాగిస్తున్న నిఖిల్ తన ముందు నడుస్తున్న ప్రమీల దంపతులను చూడగానే మనసులోనే ఎగిరే గంతులేసాడు.
తన నడక వేగం పెంచి వాళ్ళను చేరుకున్నాడు.
” హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ ! నా పేరు నిఖిల్. మీ స్నేహితురాలు ప్రమీల తమ్ముడిని. నిన్న ఆంటీ మా ఇంటికి వచ్చినప్పుడు చూసాను. ” అంటూ ముఖం నిండా నవ్వు పులుముకుని పలుకరించాడు.
ఈ నడుమనే నలభై ఐదు దాటిన తనను అంకుల్ అని ప్రియమార పిలిచిన ఈ శాల్తీ ఎవరా అని ఆగి గుర్రు గా చూడబోయి ,పరీక్షగా చూసాడు ప్రమీల భర్త సారథి. ప్రమీలకు కూడా ఆ పిలుపు చేదుగా వినిపించింది.
మనిషి చూడ బోతే ముదురుగా కనబడు తున్నాడు . ఆకారం చూస్తే పడమటి సంధ్యా రాగం సినిమా లో తిండిపోతు గణపతి పాత్రను గుర్తుకు తెస్తున్నాడు.
ఇప్పుడు అందరికీ ఇదో అలవాటు. బీరకాయ పీచు సంబంధం లేక పోయినా , నాలుగేళ్ళు పెద్ద వాడైతే చాలు అంకుల్ అనేస్తారు. ఒళ్ళు మండింది సారధికి. విసుగ్గా చూసాడు ప్రమీల కేసి. ఆవిడా అయిష్టంగా చూస్తొంది నిఖిల్ వైపు.
ఆ చూపుల లో వేడి నిఖిల్ చర్మాన్ని తాకలేదు.
అనుకోకుండా దొరికిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న ఆత్రుతలో వున్నాడు అతను.
” నేను డబ్లిన్ వుంటాను ఆంటీ. వారాంతపు సెలవులకు అక్క దగ్గరకు వచ్చాను. రేపు డబ్లిన్ వెళ్ళుతున్నా. . మీ వాళ్ళు ఎవరైనా అక్కడ వుంటే మీరు ఏదైనా పంపదలచు కుంటే నేను స్వయంగా అందిస్తాను. మీరేమీ మొహమాట పడనక్కర లేదు. “. ప్రమీల గారి అమ్మడు ని కలిసే అవకాశం వస్తుందేమో అన్న ఆశతో వాళ్ళకు సహాయం చేయడం తన భాగ్యం అనేట్టుగా అడిగాడు.
” థాంక్స్ తమ్ముడు. ఇప్పుడేమీ అవసరం లేదు. ” అంది ప్రమీల ముందుకు నడుస్తూ. సారథి తల వూపి నడక వేగం పెంచాడు.
నిఖిల్ మరీ అంత గా నిరాశ పడ లేదు. తమ్ముడు అంది గనుక వరుస కలిసినట్టే అని సద్దుకున్నాడు . అక్కని కదిలించి అటునుండి పావులు కదుపుదాం అనుకున్నాడు .
” ఎక్కడెక్కడో వెదుకుతున్నారు నాకోసం పిల్లని చూడ్డానికి. మీ స్నేహితురాళ్ళలో ఎవరికీ ఆడపిల్లలు లేరా అక్కా? లేక ఆ అమ్మడు నా ఇంట అడుగు పెడితే మన అమ్మ ఇక్కడకు మకాం మార్చేస్తుందని భయ పడుతున్నావా? హాస్యంగా అడుగుతూనే ఒక సూచను పడేసాడు ఇంటికి రాగానే.
” ఛీ .అమ్మాయి అనక అమ్మడు ఏమిట్రా అసహ్యంగా. ” అంది సరళ.
” అదేంటి అక్కా అలా అనేసావు . చిరంజీవి అంతటివాడు పాడుతూ డాన్స్ చేయలేదూ “అమ్మడూ లెట్ అస్ డూ కుమ్ముడూ అని? ఆందుకే అలా అన్నా. ”
“సరేలేరా అవకాశం వస్తే వదులుకుంటానుట్రా ? నా ప్రయత్నం నేను చేస్తాను. ” అంది.
నిఖిల్ మనసు కుదుటబడింది. ” అవునూ పోయిన నెల్లో మీ స్నేహితులు ముగ్గురో నలుగురో కుటుంబాలతో కలిసి లేక్ టాహో కి వెళ్ళామని చెప్పావు. ఆ ఫోటోలు ఏమీ చూపించనే లేదు ” మరో ప్రయత్నం చేసాడు.
“ఆవా? ఇదిగో చూడు ” అని ఫోనులో చూపించింది.
ఇక్కడా నిఖిల్ కి నిరాశే ఎదురైంది. ప్రమీల, సారథి కనబడ్డారు గానీ వాళ్ళ అమ్మడు జాడ కనబడ లేదు .
” మీ ప్రమీల పిల్లలు రాలేదా అక్కా ? “ఆగలేక అడిగాడు.
“వాళ్ళు బెర్కీలీ యూనివర్సిటీ లో చదువు తున్నారు మా పిల్లల లాగానే “అంది సరళ.
” అమ్మ తన పార్కు స్నేహితురాలి ఇంట్లో సంతాన కామితార్థ వ్రతం అని వెళ్ళింది. రాత్రి ఆలస్యం అవుతుంది అక్కడే పడుకుంటా అన్నది . ఆందుకే నీ దగ్గరకు వచ్చాను. వచ్చే వారం జూలై నాలుగు సెలవు కలిసి వస్తూంది కదా అమ్మ ని తీసుకుని వస్తాను. అని చెప్పి బయలుదేరాడు నిఖిల్.
రెండు రోజులు అయ్యాక తల్లి కి ఫోను చేసింది సరళ. ” ఆ పాపిలి సంబంధం వాళ్ళు ఏమైనా పలికారా అమ్మా? ” అని ఆరా తీసింది.
” ఆ ! ఆ ముచ్చటా అయ్యింది. ఆ పిల్ల పిట్స్ బర్గ్ లో వుంది కదా అక్కడికే వుద్యోగం చూసుకుని రావాలిట . అంతే కాదు తనకూ అక్కడ స్వంత ఇల్లు వుందట .అబ్బాయికి ఇల్లుందా అని ఆడిగిందట. జిమ్ముకు వెళ్ళడా ? ఆని ఆరా తీసిందట. ఇంక ఆశ వదులుకున్నట్టే . ” చెప్పింది ఆవిడ.
” ఈ సారి ఇండియా లో వున్న అమ్మాయిని చూడమ్మా . అమెరికా రావాలి అన్న ఆశ తో నైనా ఒప్పుకుంటా రేమో. సరే నిఖిల్ ఏం చేస్తున్నాడు? అనడిగింది సరళ.
” అదేమిటొనే నీ దగ్గరి నుండి వచ్చి నప్పటి నుండి అదేదొ ‘అమ్మడూ ‘ అంటూ చిరంజీవి పాట కు డాన్స్ చేస్తున్నాడు. ఏదైనా ప్రదర్శన వుందేమో ” ” అన్నట్టు ఈ వారాంతపు సెలవులు నాలుగు రోజులట. ఫ్రీమాంట్ పోదాము అన్నాడు. మీరు ఎక్కడికైన వెళ్ళాలి అనుకోలేదు కదా? ” అడిగిందావిడ
సరళకు చప్పున ఆ గురు వారం తన ఇంట్లో కిట్టీ పార్టీ , శనివారం ప్రమీల ఇంట్లో గెట్ టుగెదర్ వుందని గుర్తుకు వచ్చింది గానీ అమ్మ వుంటే కాస్త సాయంగా వుంటుంది ,పై గా ఆవిడకు అందరితో కలవడం ఇష్టం అని తోచింది . ఆందుకే
” ఎక్కడికీ వెళ్ళంలే అమ్మా ! మీరు రండి . కానీ వీలయినంత తొందరగా వాడికి పెళ్ళి చేయాలి అమ్మా . ” చెప్పి ఫోను పెట్టేసింది సరళ .
సెలవు రోజున గనుక , కిట్టీ పార్టీ పగలే పెట్టుకున్నారు.
” మా వాళ్ళంతా ఒంటి గంటకల్లా వస్తారు. మీ బావా , బావ మరదులు ఆ లోగా తినేసి మేడ ఎక్కుతారో , బయట షికారుకు వెళ్తారో మీ ఇష్టం అని చెప్పేసింది సరళ తమ్ముడికీ మొగుడికీ. పలావు, కేరట్ హల్వా, సమోసాలు, పనీర్ కర్రీ, పూరీలు ఏవేవో చేసింది సరళ. సుష్టుగా తిన్నాడు నిఖిల్ .
సారథి స్నేహితుడి దగ్గరికీ, నిఖిల్ మేడ మీదకీ వెళ్ళారు.
నిఖిల్ ఇంట్లో వుండిపోవడానికి కారణం సెలవులకు అమ్మడు ఇంటికి వచ్చిందేమో , ప్రమీల వెంట ఇక్కడికి వస్తుందేమో ఆన్న ఆశ.
” హాయ్ ప్రమీలా “అన్న అక్క స్వాగతం వినగానే ఒక్క దూకున నాలుగు మెట్లు దిగి తొంగి చూసాడు.
ప్రమీల ఒక్కతే లోపలికి వచ్చింది. అద్రుష్టం లేదు అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు నిఖిల్.
పదిమంది ఆడవాళ్ళు చేరేసరికి అక్కడ నవ్వుల పువ్వులు విరిసాయి.
” ఇంతకీ ఈ వేడుకకు అమ్మడికి ఏం బహుమతి ఇస్తునావు ప్రమీలా? ” సరదాగా అడిగింది ఒక స్నేహితురాలు.
” బంగారు వడ్డాణం అయివుంటుంది ” అంది మరొక ఆమె.
” బాబోయ్ అయితే మనమూ బంగారు గొలుసులు కానుకగా ఇవ్వాలేమో! ” భయంగా అంది ఇంకొక ఆమె.
“అలా అయితే మనకూ బంగారు బిస్కట్లు తిరుగు బహుమతి గా ఇవ్వాలి “అని ఒకరు
“వాటి మీద కుక్క బొమ్మ ముద్రించినా ఫరవాలేదు.” ఆని మరొక చెలి అనగానే అందరూ కిల కిల లాడారు.
” మీ జోక్స్ అమ్మడు వింటే మిమ్మల్ని పీకి పెడుతుంది జాగ్రత్త. ” నవ్వుతూనే హెచ్చరించింది ప్రమీల .
కబుర్లు నంచుకుంటూ తినడం ముగించాక నాలుగింటికి అందరూ కదిలారు .

మరునాడు మాల్ కి వెళ్ళి అమ్మడికి బహుమతి కొని తెచ్చింది ప్రమీల. ఆ పార్టీ ఆడవాళ్ళకు మాత్రమే అట . అది వినగానే వుసూరు మనిపించింది నిఖిల్ కి.

శనివారం రానే వచ్చింది. మరచి పోకుండా తీసుకు వెళ్ళాలని ఎదురుగా బల్ల మీద అక్క పెట్టిన గిఫ్ట్ పాక్ ని కావాలనే బల్ల కింద కుర్చీ మీద పెట్టాడు నిఖిల్.
ఈ రోజు ఎలాగైనా ఆ అమ్మడిని చూసి తీరాలని నిశ్చయించుకున్నాడు . అక్క గిఫ్ట్ మరచిపోయి వెళ్ళిపోతే తాను తీసుకు వెళ్ళి ఇవ్వ వచ్చునని అతని ఆలోచన.
అనుకున్నట్టే సరళ ఆలస్యం అవుతోందని హడావిడిగా కారెక్కింది.
అక్క ఆ కానుక కోసం వెనక్కి వస్తుందేమో అన్న భయంతో అయిదు నిముషాలలో ఆ పాకెట్ తీసుకుని నిఖిల్ బయలుదేరాడు. అడ్రెస్ తెలుకున్నాడు కనుక నేరుగా ప్రమీల ఇంటి ముందు ఆగాడు.
ఆందరూ లోపలికి రావడానికి వీలుగా వీధి తలుపులు తీసే వుంచింది ప్రమీల .

లోపలికి అడుగు పెడుతుంటే నిఖిల్ గుండె రెండు రెట్లు వేగంతో కొట్టుకోవడం మొదలు పెట్టింది.
ఒకటి అమ్మడిని ఎట్టకేలకు చూడబోతున్నాను అన్న ఉత్సాహం, రెండు ఆ అమ్మాయికి తను నచ్చుతాడా అన్న భయం కలిసి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముందు ఒకరి నొకరు చూసుకుని ,ఫరవాలేదు అనుకుంటే సరళ మిగతా విషయాలు చూసుకుంటుంది అన్న ఆశ అతన్ని ముందుకు నడిపించింది. తను అక్కడికి రావడానికి వంక అయిన గిఫ్ట్ అయితే చేతిలోనే వుంది గనుక మనసు చిక్క బట్టుకుని ముందుకు నడిచాడు.
విశాలంగా వున్న హాలు పువ్వులతో ,రంగులు కాగితాలతో , రంగు రంగుల బుడగలతో అందంగా అలంకరించారు. దీపాల కాంతిలో వెలిగి పోతోంది ఆ ప్రదేశం. మధ్యన సిం హాసనం లాటి పెద్ద సోఫా మీద నుదుట పొడుగ్గా దిద్దిన కుంకుమ బొట్టు, తెల్లని ఒంటిమీద మెరిసి పోతున్న పట్టు గౌన్ , మెడలో బంగారు గొలుసు ధరించి ఠీవిగా కూర్చుని ఒకరొకరు గా ప్రమీల స్నేహితురాళ్ళు వచ్చి ‘హాయ్ అమ్మడూ ‘ అని ముద్దు చేస్తుంటే ఆనందం గా తోక ఊపుతొంది అమ్మడు. ప్రమీల బంగారు తల్లి గా పెంచుకునే పొమేరియన్ శునకమ్మ.
” థాంక్స్ తమ్ముడూ సమయానికి పరువు కాపాడావు ” అంటూ నిఖిల్ చేతిలోని గిఫ్ట్ అందుకుని సిం హాసనం వైపు అడుగులు వేసింది సరళ.

అమ్మడి ముందు పెద్ద కేక్ తెచ్చి పెట్టింది ప్రమీల. మధ్యలో వున్న కొవ్వొత్తి వెలిగించింది సరళ . అమ్మడూ వుఫ్ అను అంటూ అమ్మడి తల ముందుకు వంచింది ప్రమీల. ఆమ్మడుకు తన మీద ఆ అధికారం నచ్చలేదేమో ఒక ఫూత్కారం చేసింది. టపీమని కొవ్వొత్తి ఆరిపొవడం అందరూ కోరస్ గా హాపీ భర్త్ డే టు యూ డియర్ అమ్మడు అంటూఅందుకున్నారు.
కుర్చీలో కూర్చున్న శునకమే అమ్మడు అని తెలిసాక ‘ఆ ‘ అంటూ నోరుతెరిచిన నిఖిల్ అలాగే వుండిపోయాడు.
కాస్త పక్కన నిలబడి ఈ తతంగాన్ని ఆశ్చర్యం గా గమనిస్తున్న నిఖిల్ అమ్మ కొడుకు వైపు , అమ్మడి వైపు అయోమయం గా చూస్తొంది.
” రా తమ్ముడు ” కేకు అందించడానికి పిలిచింది ప్రమీల.
ముఖాన వెర్రి నవ్వొకటి పులుముకుని అడుగు ముందుకు వేసాడు నిఖిల్.
“బి ఎ గుడ్ గర్ల్ . అంకుల్ కి షేక్ హాండ్ ఇవ్వమ్మా అమ్మడూ “అని ప్రమీల ముద్దు గా పిలవగానే కుర్చీ లో నుండి ఒక్క గంతున దూకి నిఖిల్ కి తన ముందు కాలు అందించింది అమ్మడు.
అమ్మడి చేయి ఇంకో రకం గా అందుకుంటానని కలలు కన్న నిఖిల్ కన్నీరు ఆపుకుంటూ ఆ చేయి /కాలు అందుకున్నాడు” హాపీ బర్త్ డే అమ్మడు ” అంటూ.
—————— ————- ————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *