March 29, 2024

కర్ణాటక సంగీత విద్వాంసుడు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గారు

రచన:  శారదాప్రసాద్  

జాన్.బి.హిగ్గిన్స్ ను భారతీయ సంగీత ప్రియులు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గా పిలుస్తుంటారు.అమెరికా దేశానికి చెందిన ఈ గాయకుడు అమెరికాలోని వెస్లే విశ్వవిద్యాలయంలో విద్యార్ధిగా మరియు వృత్తి నిపుణుడిగా పనిచేశారు.18-09 -1939 న అమెరికాలోని Andover లో పుట్టారు.ఫిలిప్స్ అకాడమీలో ప్రాధమిక విద్యను  అభ్యసించాడు.తండ్రి ఆంగ్లాన్ని బోధించాడు.తల్లి సంగీతాన్నిచాలా సంవత్సరాలు నేర్పింది.వెస్లే విశ్వవిద్యాలయం నుండి 1962 లోనే మూడు డిగ్రీలను తీసుకున్నారు. సంగీతంలో కూడా పట్టాను సంపాదించారు.వివిధ దేశాలకు చెందిన సంగీతాన్ని గురించి పరిశోధన చేసి 1973 లో Ph.D.పట్టాను కూడా పొందారు.భారతీయ సంగీత విద్యను Toronto లోని  York University లో ప్రారంభించారు. దానికి శ్రీ తిరుచ్చి శంకరన్ గారు వీరికి ప్రోత్సాహము ఇచ్చారు.అలా కొంత కాలం సాగిన తరువాత

సంగీత శాస్త్రంలో ఒక ప్రొఫెసర్ గా గుర్తించబడ్డారు.ఏమాత్రము విరామము లేనప్పటికీ,కుటుంబంతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.European మరియు Western శాస్త్రీయ సంగీతాలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు.కర్ణాటక సంగీతం అంటే వీరికి అమితమైన ఇష్టం.అచిర కాలంలోనే స్వయం కృషితో దాని మీద మంచి పట్టును సాధించారు.శ్రీ రంగనాథన్ అనే వారు కొంతవరకు బోధించారు.ఆ సంగీతామృతాన్ని రుచిచూసిన ఈయన,ఇక జీవితమంతా దానిలోనే పరిపక్వతను సాధించాలని భావించారు.అచిరకాలంలోనే శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనలలో వీరు తన గానామృతాన్ని భారతీయులకు వినిపించారు.అందరి మన్ననలను పొందటమే కాకుండా విశేష ఖ్యాతిని కూడా గడించారు.ఆ తరువాత ప్రఖ్యాత నృత్య కళాకారిణి అయిన శ్రీమతి బాలసరస్వతి గారివద్ద కొంతకాలం నాట్య శాస్త్రాన్ని కూడా అభ్యసించారు.సంగీత,భరతనాట్య మేళవింపులపైన పరిశోధనా వ్యాసాలను వ్రాశారు.

అమెరికా  దేశ సాంస్కృతిక అధికార ప్రతినిధిగా భారతదేశానికి వచ్చారు. కర్ణాటక సంగీత కచేరీలను చేస్తూనే, కొన్ని రికార్డులను కూడా ఇచ్చారు .ఆ రోజుల్లోనే కర్ణాటక సంగీత ప్రియులైన తమిళ సోదరులు వీరిని ‘భాగవతార్’ గా పిలవటం ప్రారంభించారు.ఆయన విద్వత్తు అటువంటిది.ఆయన పాడిన త్యాగరాజకృతి ‘ఎందరో మహానుభావులు’ ఆయనకు విశేష కీర్తిని తెచ్చిపెట్టింది.ఆయన ఆ కృతిని పాడుతుంటే,ఒక అమెరికా దేశస్థుడు ఈ కృతిని పాడారంటే ఎవరూ నమ్మరు. ఆయన భాష,ఉచ్ఛారణ,సంగీత జ్ఞానం అంత గొప్పవి.’శివ శివ అనరాదా’,కృష్ణా నీ బేగనే’…ఇలాంటి ఎన్నో కృతులను అతి శ్రావ్యంగా శృతిపక్వంగా పాడేవారు.ఆయనను అల్ ఇండియా రేడియో వారు కూడా ఆహ్వానించి వారి సంగీతాన్ని శ్రోతలకు వినిపించారు.

తప్పతాగి  కారునడుపుతున్న ఒక దౌర్భాగ్యుడు, ఈ మధుర గాయకుడిని, 07-12-1984 న అమరలోకానికి పంపాడు.

సంగీతానికి ఎల్లలూ,భాష లేవని  నిరూపించిన మరో మధుర గాయకుడికి నా ఘనమైన నివాళి!

 

 

7 thoughts on “కర్ణాటక సంగీత విద్వాంసుడు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గారు

  1. ఈ తరం వారికి తెలియని ఒక గొప్ప సంగీత విద్వాన్సుడిని పరిచయటం బాగుందండీ!

  2. మంచి కళాకారుడు దారుణంగా చనిపోవటం బాధ అనిపించింది!

  3. జాన్ హిగ్గిన్స్ గారు యింత ప్రఖ్యాత విద్వాంసులని మాకు, పాఠక లోకానికి పరిచయంచేసిన శారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు. వారి ఫొటోగ్రాఫ్ ఈ వ్యాసానికి జతపరచివుంటే ఇంకా బాగుండేది.
    నాగయ్య

Leave a Reply to Nagaiah Cancel reply

Your email address will not be published. Required fields are marked *