March 29, 2024

జలజం టీవీ వంట.

రచన: గిరిజరాణి కలవల

” ఆహా.. నా వంటా…ఓహో..నే..తింటా” టివీ షో వారిని ఎప్పుడో.. మన జూలీ తన ఇంటికి రమ్మని పెట్టుకున్న పిలుపు.. ఈనాటికి వాళ్ళు కరుణించి.. ఫలానా రోజున మీ ఇంటికి వస్తాము.. మంచి వంట చేయండి.. రికార్డు చేస్తామని కబురు చేసారు.
ఇక మన జూలీ మొహం చూడాలి.. ఆనందంతో తబ్బిబ్బు అయిపోయింది.. వీధి మొత్తం టాంటాం టముకు వేసి చెప్పింది. మూతి ముఫ్ఫై సార్లు తిప్పుకున్నవారు కొందరైతే.. ఆ.. ఇంతే.. ఇలాగే వస్తామంటారు కానీ.. ఉట్టిదే.. ఎవరూ రారు.. అంటూ వెక్కిరించినవారు కొందరు. ఏదీ పట్టించుకోకుండా.. మన జూలీ.. టీవీ వారు వస్తానన్న టైమ్ కి ఇల్లు అట్టహాసంగా ఇంద్ర భవనంలా తీర్చిదిద్దింది. తను కూడా.. అంగుళానికి తగ్గకుండా మేకప్ వేసేసి.. తలకి, మొహానికీ, పెదాలకీ ఆయా రంగులు పూసేసి.. జిలుగ్ వెలుగ్ చీర కట్టేసి, పీకకి ఉరేసేలా వుండే నెక్లెస్ పెట్టేసి.. రెడీ అయి కూర్చుంది.
ఇంతలో ఊడిపడ్డారు.. టీవీ యూనిట్ వాళ్ళు… కెమెరామెన్ యాద్గిరితో… యాంకర్ పింకీ.. పొట్టి డ్రస్సు వేసుకుని.. ఎగుడుదిగుడు జుట్టు.. కళ్ళ లో పడిపోతోంటే.. మెల్లకన్ను తో చూస్తూ.. ‘ హాయ్.. హలో.. నమస్తే.. మిసెస్ జూలీ..” అని షేక్హ్యాండ్ ఇచ్చి.. బొంగురుగొంతుతో…” జూలీ.. ఆ.. ఆ.. ఆ.. ఐ లవ్ యూ.. అంటూ పాడుతూ.. హే.. ఈ సాంగ్ మిమ్మల్ని చూసే సినిమా లో రాసుంటారు.. వావ్.. చాలా బ్యూటిఫుల్ గా వున్నారు ” అంది ఊగిపోతూ… ఆ మాటలకి జూలీ మెలితిరిగిపోయింది.. సిగ్గు పడిపోతున్నానుకుంది..

ఇహ చూస్కోండి… ఇద్దరూ పోటీలు పడి ఇరగదీసేసారు.. అదే ఇంగ్లీష్ ని..

” వావ్.. మీ హౌస్.. అమేజింగ్.. చాలా బాగా డెకరేట్ చేసారు. సోఫా సెట్ సెలక్షన్ బావుంది.. మీరేనా షాపింగ్ చేసేది ” అంది పింకీ..
” యా.. యా.. నేనూ.. మా హస్బెండ్.. వి బోత్ కలిసే షాపింగ్ చేస్తాం. నా హబ్బీ బిజినెస్ మేన్ కదా.. ఫారిన్ టూర్ వెళ్లి నపుడు.. కొన్ని కొంటూ వుంటారు.. ఈ ప్రోగ్రామ్ మిస్ అయిపోయారు తను..
ఇప్పుడు పారిస్ లో వున్నారు ” అంది జూలీ నెక్లెస్ సవరించుకుంటూ..
ఇలా కొన్ని పరిచయాలు అయ్యాక.. ” ఇంతకీ.. టుడే.. విచ్ డిష్ చేస్తున్నారు? ” అని అడిగింది పింకీ..
” స్వీట్ పొటాటో పికిల్.. వెరీ రేర్ గా వుంటుంది.. వెరీ న్యూ పికిల్.. వన్స్ ఈట్ చేస్తే.. ఆసమ్.. యమ్మీ యమ్మీ.. అంటారు” అంది జూలీ..
” వావ్.. రియల్లీ.. అయితే స్టార్ట్ చేసేయండి” అంది పింకీ..
” ఇది చేయాలంటే ఫస్ట్ స్టౌ ఆన్ చేయాలి ” అంది ముసి ముసి నవ్వులతో జూలీ..
” వావ్.. వాటే నైస్ జోక్.. హహహహహ.. ” పగలబడిపోయి.. పింకీ..
” స్వీట్ పొటాటో… స్మాల్ పీసెస్ గా కట్ చేయాలి.. కొంచెం టమరిండ్ వాటర్ లో సోక్ చేసుకుని వుంచాలి. పేన్ లో.. టూ స్పూన్ ఆయిల్ వేసి హీటయ్యాక.. రెడ్ చిల్లీ.. పోపు గింజలు ( వీటిని ఇంగ్లీషు లో ఏమంటారో నాకూ తెలీదు.. జూలీకి తెలీదు) వేసి ఫ్రై చేయాలి. కూల్ అయ్యాక.. సాల్ట్ వేసి.. మిక్సీ లో స్మాష్ అయేలా చేయాలి. దెన్.. స్వీట్ పొటాటో అండ్ సోక్ చేసిన టామరిండ్ కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి. ఒక గ్లాస్ బౌల్ లోకి తీసి కొరియాండర్ తో గార్నిష్ చేయాలి. రోటీలోకి కానీ రైస్ లోకి కానీ.. చాలా టేష్టిగా వుంటుంది ” అంటూ జూలీ చేసిన.. పచ్చడి.. యాంకరమ్మ పింకీ కాస్త స్పూన్ తో నాకి..” వావ్.. అమేజింగ్.. రియల్లీ సూపర్బ్.. పిచ్చ టేస్టీగా వుంది. ” అంది కళ్ళు, ముక్కు పెద్దవి చేసుకుని లొట్టలు వేస్తూ..
ఆనందంతో తబ్బిబ్బు అయిపోతూ జూలీ..” ఓ.. గ్రాండ్ మా.. థాంక్యూ వెరీమచ్.. నువ్వు నేర్పిన ఈ పికిల్ ఈరోజు పింకీ గారికి భలే నచ్చింది..” అంటూ అక్కడ దండ వేసి వున్న అమ్మమ్మ ఫోటో కి దండం పెట్టింది.
” ఓ.. యువర్స్ గ్రాండ్ మా.. నేర్పారా.. ఎనీ హౌ.. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఓల్డ్ డిషెస్.. ఇంకా రిమెంబర్ చేసుకోవడం టూ గ్రేట్.. ” అంటూ.. పింకీ కూడా గ్రాండ్ మా ఫోటోకి నమస్తే పెడుతూ..” హే.. ఈ ఫోటో.. ఐ నో దిస్ లేడీ.. .. షి ఈజ్ కాంతమ్మ.. ఏమ్ ఐ రైట్?” అంది.
జూలీ ఆశ్చర్యపోతూ…” యా.. మై గ్రాండ్ మా నేమ్ కాంతమ్మే.. మీకు ఎలా తెలుసు? ” అంది.
జూలీ కేసి తేరిపార చూసి.. పింకీ ” ఏందమ్మే..
నువ్వు జలజానివి కదూ.. నేనే పంకజాన్ని.. మీ ఇంటి పక్క ఇల్లే.. నీతో పాటు సిన్నపుడు చదువుకున్నాను.. గుర్తు పట్టావా? చీమిడి ముక్కుతో.. రెండు పిలకలు వేసుకుని రోజూ.. చేగోడీలు తెచ్చుకునేదానివి.. నాకు పెట్టమంటే.. ఏడ్చి చచ్చేదానివి…. జలజం పేరు జూలీగా మార్చుకున్నావా? ఏడో క్లాస్ మూడు సార్లు తప్పి తర్వాత చదువు మానేసి పెళ్ళి చేసుకున్నావు కదూ.. మీ ఆయన బొగ్గుల అడితీ కదా.. ఇందాక బిజినెస్ అని చెప్పావు.. ” అంటూ బోలెడు వివరాలు చెప్పేసరికి.. జూలీ ఉరఫ్ జలజానికి గుర్తు వచ్చింది.
” ఓసోసి.. నువ్వటే పంకజం… పింకీ అని పెట్టుకుండావా.. పేరు.. గుర్తు వచ్చింది….ఇప్పుడు యాడ వుంటాండావే.. రోజూ ఆలస్యంగా వచ్చి గుంజీలు తీసేదానివి.. తల నిండా పేలే.. ఎప్పుడూ గోక్కుంటూవుండేదానివి.. నీ పక్కన కూర్చుంటే నాకు ఎక్కుతున్నాయని.. మా అమ్మ నన్ను వేరే బెంచీ మీద కూర్చోమనేది… ఔనూ.. ఇప్పుడు తగ్గాయా పేలు.. నువ్వు సినిమాల్లోకి వెళ్ళావని మొన్న మీ పెద్దమ్మ కనపడినపుడు చెప్పింది. ఏవేం సినిమాల్లో కట్టావు వేషాలు? ఛాన్స్ లు లేక టివీలోకి వచ్చేసావా ఇప్పుడు.. “అంది జలజం..
‘ ఓయబ్బో.. ఒకటా రెండా.. చానా సినిమాల్లో నే వేసాను. మహేష్ బాబు సినిమా లో.. ఈరో.. ఇలనూ కొట్లాట అవుతుందే.. అది కూరగాయల
మార్కెట్ లో కదా.. అక్కడ టమాటా లు అమ్మేది నేనే.. ఇలన్ వచ్చి నా టమోటాల మీద పడిపోతే.. సచ్చినోడా.. అని తిట్టే డైలాగ్ కూడా వుంది నాకు. ఇంకా సమంత సినిమాలో కూడా చేసాను.. బస్సు దిగేటపుడు సమంత ఎనకమాల్నే దిగింది వోరనుకున్నావు నేనే కదా.. సినిమాలు లేనపుడు ఇద్గో ఇలా టీవీలోకి వస్తా వుంటా.. సానా రోజులకి కలుసుకున్నాం గదా.. ” అంది.
” పింకీ.. సారీ పంకజం.. తన చిన్ననాటి ఫ్రెండ్ జూలీ.. అదే జలజాన్ని కలిసిన ఆనందం పట్టలేక.. వాళ్ళ ఇద్దరు మధ్య బోలెడు ముచ్చట్లు.. దొర్లిపోయాయి.. తెలుగులోనే..చచ్చినా ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాలేదు. మీరందరూ గమనించే వుంటారు. ఆహా.. నా వంటా.. ఓహో నే తింటా.. అనే ఈ ప్రోగ్రామ్ లో స్వీట్ పొటాటో పికిల్ తో పాటుగా.. స్వీట్ గా కలుసుకున్న ఇద్దరు చిన్ననాటి స్నేహితులని.. అదీ తెలుగులో మాత్రమే మాట్లాడుకున్న ఈ ఇద్దరినీ చూసారు కదా.. వీళ్ళిద్దరినీ ఇలాగే వదిలేసి.. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాము.. పంకజమనే పింకీతో కలిసి కెమెరామెన్.. యాద్గిరి.. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *