March 28, 2024

బ్రహ్మకమలాల పుట్టిల్లు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ హేమకుంఢ్ సాహెబ్

రచన: కర్రా నాగలక్ష్మి

ఉత్తరా ఖండ్ అంటేనే యెత్తైన కొండలు , గలగలలను ప్రవహించే సెలయేళ్లు , భగీరధిని చేరుకోవాలని పరుగులు పెడుతున్న అలకనంద అందాలు , తెల్లని మంచు కప్పబడ్డ పర్వతాలు గుర్తుకొస్తాయి .
ఎత్తైన కొండల వెనుక యెన్నెన్నో అద్భుతాలు , యెన్ని సార్లు యీ కొండలలో తిరిగినా యింకా యెన్నో చూడవలసిన ప్రదేశాలు మిగిలే వుంటాయి .
అలాంటిదే జోషిమఠ్ నుంచి బదరీనాధ్ వెళ్లే దారిలోవున్న ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ .
‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ వెళ్లాలంటే ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో వున్న గోవింద్ ఘాట్ నుంచి కొండలలో నడక ద్వారా చేరుకోవాలి .
హెలికాఫ్టరు సేవ వున్నా మనం గుర్రాలనో , డోలీలలో ఆశ్రయించడమే మేలు . ఎందుకంటే యీ ప్రాంతాలలో హిమపాతం , వర్షపాతం రెండూ యెక్కువగానే వుంటాయి , అందువల్ల హెలికాఫ్టరు సేవ రద్దు చెయ్యబడుతూ వుంటాయి . గోవింద ఘాటు నుంచి హేమకుంఢ్ సాహెబ్ కి చాలామంది హిందువులు , శిక్కులు కూడా దర్శనార్థం వెళుతూ వుంటారు .
ఢిల్లీ కి 200 కిలో మీటర్లు దూరంలో వున్న హరిద్వార్ రైలు మార్గం ద్వారా గాని , రోడ్డు మార్గం ద్వారా గాని చేరుకోవచ్చు . హరిద్వార్ కి సుమారు 296 కిలో మీటర్ల దూరం లో వున్న గోవింద ఘాట్ కి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం . హరిద్వార్ నుంచి ప్రైవేటు రంగం వారి బస్సులు , ఉత్తరాఖండ్ ప్రభుత్వం చే నడుపబడుతున్న బస్సులు , టాక్సీలు లభిస్తాయి . బస్సులలో ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నది , యెక్కువ సమయం తీసుకుంటుంది . టాక్సీలు ఖర్చు యెక్కువ , మనకి కావలసిన చోట కావలసినంతసేపు గడిపే వీలుంటుంది . ఒకరో యిద్దరో కాకుండా నలుగురు అంతకన్న యెక్కువ మంది బయలు దేరి నపుడు టాక్సీ యే సుఖంగా వుంటుంది . మేం మొత్తం ఆరు జోడీలు బయలు దేరేం . ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు రెండు ‘ ఇన్నోవా ‘ లు మాట్లాడు కున్నాం .
మొదటి రోజు ప్రయాణం లో ఉత్తరాఖండ్ శ్రీనగరు చేరుకున్నాం . రాత్రి అక్కడ బస చేసి మరునాడు ఆరింటికి బయలు దేరి మధ్యాహ్నం జోషిమఠ్ చేరుకున్నాం . జోషిమఠ్ దగ్గర దారి మూసి వేసేరని యాత్రీకులను ముందుకు వెళ్లేందుకు అనుమతించలేదు . ఆ రోజు జోషిమఠ్ మఠ్ లో బస చేసి మరునాడు గోవింద ఘాట్ కి దారి తెరువబడగా మేం జోషిమఠ్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి గోవింద ఘాటు చేరుకున్నాం . జోషిమఠ్ నుంచి బదరీనాధ్ వెళ్లే ముఖ్య మార్గాన్ని ఆనుకొని వుంటుంది గోవింద ఘాట్ . ముఖ్య మార్గం నుంచి ఓ కిలోమీటరు ప్రయాణించేక గోవింద ఘాటు చేరుకుంటాం . అక్కడ అన్ని తరగతుల వారికి అందుబాటులో హోటల్స్ వున్నాయి . మరో పక్క అలకనంద వొడ్డున గురుద్వారా వుంది , అందులో యాత్రీకులకు ఉచిత భోజన , పార్కింగ్ , నివాసాలు వున్నాయి . అక్కడ నుంచి కాలిబాట మొదలవు తుంది .
ఓ అర కిలో మీటరు నడిచేక అక్కడ నుంచి గుర్రాలు , డోలీలు , సామానులు మేసేవారు లభిస్తారు .
గురుద్వారా దగ్గర రెండు రోజులకు సరిపడా బట్టలు మొదలయిన నిత్యావసరవస్తువలు చిన్న చిన్న తేలికైన బేగులలో సర్దుకొని మిగతావి మా టాక్సీలలో విడిచి పెట్టి నడక మొదలు పెట్టేం . గురుద్వారాలో మన లగేజీ దాచుకొనే వీలువుంది , అక్కడ కూడా వుంచుకోవచ్చు .
ఇలాంటి యాత్రలు చేసేటప్పుడు ముఖ్యంగా మనం సర్దుకోవలసిన వస్తువులు యేమిటో చూద్దాం . మోయిశ్చరైజింగు క్రీము , సన్ స్క్రీను , చాలినన్ని చలిబట్టలు , రైన్కోటు , కొండలలో నడకకు వీలుగా వుండే షూస్ , చీరలు గుర్రాలు యెక్కడానికి వీలుగా వుండవుకాబట్టి వీలుగా వుండే దుస్తులు , రుగ్మతలు వున్నవారు వారి మందులు , సామాన్య రుగ్మతలకు మందులు వుంచుకోవాలి . మంచి వెలుగునిచ్చే టార్చ్ , చిన్నచిన్న పోలిథిన్ బాగులు .


మా గ్రూపు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ , హేమకుంఢ్ సాహెబ్ రెండూ దర్శించుకుందామని నిర్ణయించుకున్నాం . మా గ్రూపులో యెక్కువగా యాత్రలు చేసింది మా దంపతులమే కావడం తో మమ్మల్ని గ్రూపు లీడర్లను చేసేరు . అందరం గుర్రాలమీద యాత్ర చేసుకోవాలనే ముందుగానే అనుకోడంతో గుర్రాలను మాట్లాడుకొని ప్రయాణం సాగించేము . మేము సుమారు 12 కిలో మీటర్లు ప్రయాణించి గంఘారియా చేరుకోవాలి . అక్కడకు చేరుకున్న తరువాత వెంటనే ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ కి బయలుదేరాలనేది మా ఆలోచన .
మట్టి , బురద మీద కొంతదూరం యెత్తైన బండరాళ్ల పైనుంచి కొంతదూరం మరీ యెత్తు యెక్కువగా వున్న చోట్ల గుర్రాలమీద నుంచి దిగి గుర్రం యజమాని చేయి వూతతో నడుస్తూ ఆపసోపాలు పడసాగేం . వందలలో శిక్కులు అయిదేళ్ల పిల్లల దగ్గర నుండి 70 , 80 యేళ్ల వయసు వారు కూడా సులువుగా నడుస్తూ వుండడం మాకు ఆశ్చర్యాన్ని కలుగ జేసింది. వారికి అంతబలం యెక్కడది అనుకుంటే వారి గురువులమీద వారికి వున్న భక్తే వారికి అంత బలాన్నిచ్చింది అని తట్టింది .
అతి కష్టమైన 12 కిలో మీటర్ల ప్రయాణం ముగియగానే చక్కని పచ్చిక మైదానం చిన్నచిన్న సెలయేళ్లు ప్రవహిస్తూ కనువిందు చేసే ప్రదేశంలో మరో రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి గంఘారియాలో మాబస చేరుకున్నాం . గోవింద ఘాట్ నుంచి సుమారు ఆరు గంటల సమయం పట్టింది .
ఘంగారియా భైందర లోయలోని భైందరగంగ , పుష్పవతి నదుల సంగమ ప్రదేశంలో వున్న ప్రదేశం . భైందరగంగ , పుష్పవతి నదులు సంగమించి లక్ష్మణ గంగగా ప్రవహించి గోవింద్ ఘాట్ దగ్గర అలకనందతో కలుస్తుంది .
టెంటు నివాసాలు , మట్టి నివాసాలు మాత్రమే వున్నాయి . అందులోనే భోజనసదుపాయాలు , పడకలు అన్నీ వున్నాయి . ఈ గంఘారియా వేలీ ఆఫ్ ఫ్లవర్స్ కి , హేమకుంఢ్ సాహెబ్ కి కూడలి లాంటిది . గోవింద్ ఘాట్ తరువాత నివాస , భోజన సదుపాయాలు కలిగిన ప్రదేశం యిదే . అయితే యిక్కడి హోటల్స్ ఆరుగంటలకు మూసివేస్తారు , ఆ లోపునే భోజనాదులు ముగించుకోవాలి .
మా నివాసంలో మా సామానులు పడేసి వేడి టీ లైట్ స్నేక్స్ తీసుకొని ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ కి బయలుదేరేం . మధ్యాహ్నం మూడు తరువాత యీ లోయలోకి ప్రవేశం అనుమతించరు . ప్రవేశ ద్వారం వద్ద టికెట్లు తీసుకొని నడక మొదలు పెట్టేం . ఒకసారి తీసుకున్న టికెట్టు మూడురోజులు వేలీ లోకి ప్రవేశాన్ని కలుగ జేస్తుంది .

ఉత్తరాంచల్ లోని చమోలి జిల్లాలో సుమారు 3,660 మీటర్ల యెత్తున వున్న కనువిందైన లోయ యిది .
వేలీ ఆఫ్ ఫ్లవర్స్ కి మూడు కిలో మీటర్ల యెగుడు దిగుడు కొండలమీద నడక అనంతరం ‘ నందాదేవి నేషనల్ పార్క్ ‘ లో ప్రవేశిస్తాం . వేలీ లోకి ప్రవేశించే దారి యెక్కువగా కురుసే వర్షాలకి కొండరాళ్లు దొర్లుకుంటూ రావడంతో చాలా కష్టతరం గా వుంటుంది .
మూడు కిలో మీటర్లు నడవడానికి మేం వేసుకున్న అంచనా తప్పడంతో సూర్యాస్తమయం అయేసరికి ‘ నందాదేవి నేషనల్ పార్క్ ‘ గేటు చేరుకున్నాం . చీకటి రాత్రిలో యెంతవరకు లోయలో తిరుగగలం , దారిలేని కొండలలో వెనుకకి క్షేమంగా చేరగలమా అనే ప్రశ్నలు తలెత్తడంతో తిరిగి మరునాడు రావాలని నిర్ణయించుకొని వెనుతిరిగేం .
మరునాడు పొద్దున్నే అయిదు గంటలకి డోలీలు కట్టించుకొని బయలుదేరేం . ‘ నందాదేవి నేషనల్ పార్క్ ‘ లో ప్రవేశించడానికే మూడు కిలో మీటర్ల నడక అంటే రాను పోను ఆరు కిలో మీటర్లు , అంత నడక అలవాటు లేదు , అదీకాక లోయలో తిరిగితే కాని యేమీ చూసినట్టుగా కాదు కదా ? నందాదేవి పార్క్ వరకు రానూపోనూ డోలి కట్టించుకున్నాం , వారే మాకు లోయలో మార్గదర్శకులు కూడా .
ఓ అరగంటలో పార్క్ గేటు దగ్గరకి చేరేం అక్కడ నుంచి వేలీ అంతా మైదానం కాబట్టి నడక కష్టం కాలేదు
లేలేత సూర్యుని కిరణాలు హిమాలయాలపై పడి పరావర్తనం చెందుతూ విరజిమ్ముతున్న బంగారు వన్నె కాంతిలో పూల లోయ అందాలు వర్ణించడం మహాకవులవల్ల తప్ప నావల్ల అవుతుందా ? ఒక్కో రంగు పువ్వులను ఒకేచోట వరుసగా నాటినట్టున్నాయి . అలా నడుస్తూ ఒక్కోరంగు పూలతోటలను దాటసాగేం , ఇంద్రధనుసు రంగులలో పూవులు , మధ్యమధ్యలో పిల్ల సెలయేళ్లని దాటుతూ పోతున్నాం . ఒకటి రెండు కిలోమీటర్లు దాటిన తరువాత రంగు రంగుల క్రోటన్స్ మొక్కలు . అంటే పూలమొక్కల మధ్యలో ఆకుల మొక్కలు పూల అమరికలో మనం పూలు , ఆకులను అమర్చినట్లుండం ఆశ్చర్యాన్ని కలుగ జేసింది .
దూరం నుంచి చూస్తే రంగురంగు చారల తివాసి పరిచినట్లు గా కనిపిస్తోంది నేల . పూలలోయ కి గోవింద ఘాట్ నుంచి వాతావరణం అనుమతించే రోజులలో హెలికాఫ్టర్ సర్వీసు వుంటుంది . మేం గోవింద ఘాట్ మీదుగా యెప్పుడు బదరీ వెళ్లినా హెలీకాప్టరు సర్వీసు బోర్డులే తప్ప హెలీకాఫ్టర్లునడుస్తూ మాత్రం కనిపించలేదు .


ఎంతదూరం నడిచినా నాలుగు వైపులా కనుచూపు మేర వరకు రంగు రంగుల పూలతో తీర్చిదిద్దినట్లుగా వుండి కనువిందు చేస్తూ వున్నాయి , అలా సెలయేళ్లు దాటుకుంటూ పూలవనంలో యెంత దూరం ప్రయాణించేమో తెలియలేదు , వెనక్కి వెళ్లాలంటే మనసు వొప్పలేదు , నడిచినంతదూరం వెనక్కి వెళ్లాలని వివేకం హెచ్చరించింది .
ఎదురుగా యేదో చిన్న సమాధి కనిపించింది . దాని పైన జాన్ మార్గెరెట్ అనే ఆమెదని , ఆమె 1939 లో యిక్కడ దొరికే అరుదైన పుష్పజాతుల పైన అధ్యయనం చేసేందుకు వచ్చి ప్రమాదవశాన మరిణించిందని రాసి వుంది . తరవాతి కాలంలో ఆమె చెల్లెలు అక్కగారి జ్ఞాపకార్థం సమాధినిర్మాణం చేసిందని మా డోలి వాళ్లిచ్చిన సమాచారం .
ఈ పూల విత్తనాలు ప్రతీ యేడాది గాలి , నీళ్ల వల్ల దూర ప్రాంతాలకు చేర్చబడి మొలకెత్తి పుష్పిస్తాయట . ఈ సంవత్సరం వున్న రంగుల వారి పూలచెట్ల అమరిక మళ్లా సంవత్సరం మారిపోతుందన్నమాట .
ఇక్కడ పూచే ప్రతీ పూవు , ఆకు వైద్యగుణాలు కలిగివున్న వని అంటారు . రామాయణం లో హనుమంతుడు తీసుకొని వచ్చిన సంజీవని పర్వతం యీ పూల లోయలోనిదేనని అంటారు . ఈ పూల మీంచి వీచేగాలిని పీల్చినా చాలా రోగాలు హరించబడతాయి అని అంటారు . అది నిజమేననడానికి చిన్న సాక్షంగా కొందరు స్థానికులు , బైరాగులు కొన్ని మొక్కలను సేకరిస్తూ కనిపించేరు .
ఈ పూల లోయ సుమారు 8కిలోమీటర్ల పొడవు , 2 కిలో మీటర్ల వెడల్పు కలిగి ఝంకారు మరియు హిమాలయా పర్వత శ్రేణుల మధ్య విస్తరించి వుంది . పూలలోయ కి తూర్పున నందాదేవి అభయారణ్యం వుంది . చాలా మంది ట్రెక్కర్లు నందాదేవి అభయారణ్యానికి పొద్దున్నే వెళ్లి సాయంకాలానికి తిరిగి వస్తూ వుంటారు . ఇక్కడ స్నొలెపర్డ్ , నల్ల యెలుగుబంట్లు , యెర్ర నక్కలు , నీలి గొర్రెలు , కస్తూరీమృగాలు వుంటాయి . మారే జంతువులు కనబడలేదు .
ఈ పూలలోయలో చిన్న కొంగలు , డేగలు తో పాటు రంగురంగుల యీకలతో వుండే మోనల్ పక్షులు కనువిందు చేసేయి .
అంత అందమైన లోయను వదలలేక మరికాస్త దూరం ముందుకు నడిచి మా డోలి వారి హెచ్చరికతో వెనుకకు మరలేం .
గంఘారియా చేరేక మేం బ్రేక్ఫాస్ట్ చెయ్యలేదని పొట్ట గుర్తుచెయ్యగా వేడివేడిగా నూడిల్స్ తిని టీ తాగి హేమకుంఢ్ సాహెబ్ కి బయలుదేరేం .
గోవింద్ ఘాట్ నుంచి ప్రయాణించిన 12 కిలోమీటర్లు వొకయెత్తైతే గంఘారియా నుంచి హేమకుంఢ్ వరకు వున్న 5 కిలో మీటర్లు ఒక యెత్తు . ఈ కిలో మీటర్ల లెక్క యెప్పుడూ ఒకేలా వుండదు . తరచు కురిసే వర్షాలవల్ల ముందువున్న దారిమూసుకు పోవటం కొండరాళ్లమథ్య నుంచి దారిచేసుకుంటూ యాత్ర చేసుకోవడం యీ కొండలలో అలవాటే . గంఘారియా వద్దకు చేరేసరికి సుమారు 3660 మీటర్ల యెత్తుకు చేరుతాం , హేమకుంఢ్ చేరేసరికి మనం 4640 మీటర్ల యెత్తుకి చేరుతాం .
నిటారుగా వున్న కొండలు యెక్కడం వల్ల ఆయాసం బాగా పెరుగుతుంది , యీ కొండలపై యెటువంటి చెట్టు చేమలు లేకపోవడం వల్ల గాలిలో ఆక్సిజన్ తగ్గడం వల్ల కూడా మనకి ఊపిరి తీసుకోడం చాలా కష్టంగా వుంటుంది . శ్వాసకోశ సంబంధ యిబ్బందులు వున్నవారు ఆక్సిజన్ సిలిండర్లు వెంట వుంచుకోవడం మంచిది .
చిన్నపాటి వాన పడుతూ మబ్బులు శరీరాన్ని తాకుతూ వణుకు పుట్టిస్తూ వుంటుంది వాతావరణం .
భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రయాణం సాగించేము .

మరో రెండు కిలోమీటర్ల ప్రయాణం తరువాత ఆ యెత్తైన కొండలలో అతి దుర్లభమైన బ్రహ్మకమలాల మొక్కలు పూలతో కనిపించేసరికి మా ఆనందానికి హద్దు లేకపోయింది . మేం వెళ్లింది సెప్టెంబరు మాసం కావడం వల్ల బ్రహ్మకమలాలను చూడగలిగేం . ఉత్తరాఖండ్ గవర్నమెంటు వీటిని రక్షిత పూ సంపదగా ప్రకటించేరు . పూలను ఫొటోలు తీసుకొని తృప్తి చెందేం . మిగతా ప్రయాణం కష్టంగా వున్నా బ్రహ్మకమలాలను చూసుకుంటూ సాగించేము .
మొత్తం అయిదు కిలో మీటర్లూ రెండు రెండున్నర గంటలలో పూర్తిచేసేం .
గుర్రాలు దిగి గురుద్వారా వైపు నడక సాగించేము . గురుద్వారా బయట లంగరులో వేడివేడి టీ , ఖిచిడీ రోటీ , కూరా యాత్రీకులకు అందజేస్తున్నారు శిక్కులు .
గురుద్వారాకి పక్కగా చిన్న సరస్సు వుంది దీనినే హేమకుంఢ్ అని అంటారు . శిక్కుల పదవ గురువైన గురు ‘ గోవింద్ సింగు ‘ ద్వారా రచింపబడ్డ దశమగ్రంధం లో గురునానక్ హిందూ పురాణాలలో త్రేతాయుగంలో రాముడు అవతారం చాలించి వైకుంఠానికి మరలి పోగా లక్ష్మణుడు యిందజిత్తు మొదలయిన వారిని వధించుట వల్ల సంభవించిన పాపం పరిహారం కానందువల్ల అవతారం పరిసమాప్తి కాలేదు . అప్పుడు లక్ష్మణుడు హిమం తో కప్పబడిన యేడు కొండల మధ్య వున్న సరస్సు వొడ్డున తపస్సాచరించి పాప పరిహారం చేసుకొని వైకుంఠానికి మరలిపోయిన వృత్తాంతం చదివి ఆ ప్రదేశాన్ని వెతుకుతూ వచ్చి యిక్కడ తపస్సాచరించినట్లు , ఆ విషయం గురుగ్రంధ్ సాహెబ్ లో రచించగా దానిని చదివి ఆ ప్రదేశ వర్ణన ప్రకారం యీ ప్రదేశాన్ని గుర్తించినట్లు రచించేడు . 1960 లో యీ గురుద్వారా నిర్మింప ఎబడింది . అప్పటినుంచి ప్రతీ యేడాది యాత్రీకులకు ఉచిత భోజనయేర్పాట్లు కలుగ జేస్తున్నారు . 2013 లో సంభవించిన వరదలలో చాలా మంది యాత్రీకులు , గురుద్వారా సేవకులు మరణించేరు .
సరస్సు చుట్టూరా యేడు కొండలు వాటిపైన శిక్కుల మతపరమైన ద్వజాలు కనిపిస్తాడు . వీటిని ‘ నిశాన్ సాహెబ్ ‘ అని అంటారు . వీటిని వారి గురువుల ఆదేశానుసారం , ఓ పవిత్ర మైన రోజున పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల నడుమ మారుస్తారు .
ఓ ఫర్లాంగు దూరంలో చిన్న మందిరం అక్కడ చిన్న బోర్డుమీద లక్ష్మణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం అని రాసి వుంటుంది .
ఆ యెముకలు కొరికే చలిలో శిక్కులు ఆ సరోవరం లో స్నానాలు చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది .

పెద్దహాలులో వుంచిన ‘ గ్రంధ్ సాహెబ్ ‘ ( పవిత్ర గ్రంథం , దానికి వారు పూజలు చేస్తారు ) దర్శనం చేసుకొని కాసేపు రజ్జాయిలలో శరీరాన్ని వేడి చేసుకొని వెనుతిరిగేం . బయట వేడి టీ తాగి మా గుర్రాలనెక్కి గంఘారియా వైపు బయలు దేరేం .
వంద సంఖ్యలో ఆ చలిలో పెద్దపెద్దపొయ్యల మీద టీ ఖిచిడీ మొదలయిన ఫలహారాలను వండి యాత్రీకులకు పెడుతున్న వారి శ్రద్ధకు మెచ్చుకోకుండా వుండలేక పోయేం . ప్రతీ రోజు ప్రొద్దుట 5 కిలో మీటర్లు నడిచి పైకి చేరి వంటలు మొదలు పెడతారు , మళ్లా రెండుగంటలకి తిరుగి కిందకి 5 కిలోమీటర్లు నడిచి గంఘారియా చేరుతారు . రాత్రి హేమకుంఢ్ లో యెవ్వరూ వుండకోడదు అని అంటారు . అలాగే ప్రతీరోజూ గంఘారియాకి వచ్చెస్తారు కూడా ! రాత్రి దేవతలు ఆ సరస్సులో స్నానం చెయ్యడా కి వస్తారు కాబట్టి దేవతలను చూసిన మనుష్యులు ప్రాణాలతో వుండరు అనేది మన పూర్వీకులు చెప్పే కథ అయితే రాత్రి పూట అక్కడ ఆక్సిజన్ వుండదు కాబట్టి రాత్రి అక్కడ వున్న వారు మరణిస్తారు అనేది యిప్పటి సైంటిస్టులు చెప్పేమాట , యేది యేమైనా అక్కడ రాత్రి పూట యెవరూ వుండరన్నది మాత్రం నిజం .
హేమకుంఢ్ సాహెబ్ కి బయలుదేరేటప్పుడు మాకు లక్ష్మణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం అక్కడ వున్నట్లు తెలీదు . ఆ మధ్య యీ విషయం ఒక పెద్దాయనతో అంటే రాముడు అక్కడ తపస్సు చేసుకొని రావణబ్రహ్మను సంహరించిన పాపం నుండి విముక్తి పొందేడు , లక్ష్మణుడు యిక్కడ తపస్సుచేసుకొని ఇంద్దజిత్తుని సంహరించిన పాపం పోగొట్టుకున్నాడు అని వాల్మీకి రామాయణం లో లేదు , మీరు చెప్పింది నిజం అనడానికి ఋతువులు చూపించగలరా అన్నారు . అక్కడ పెట్టిన బోర్డ్స్ చదివినది చెప్పగలం గాని ఋజువులు యెక్కడనుంచి తేగలం .
మొత్తం మీద మా యీ యాత్ర సాహసయాత్రని మాత్రం చెప్పగలను . కొండలపై ట్రెక్కింగు యిష్టపడేవారు , ప్రకృతిలోని వింతలను చూడాలనుకునేవారు యీయాత్రలు చెయాలని చెప్పగలను .
ఈ యాత్ర వల్ల కలిగిన ఆనందం ఓ జీవితకాలం నెమరు వేసుకోడానికి సరిపోతుంది .
ఆ రాత్రి గంఘారియాలో గడిపి మర్నాడు మాలో కొంతమంది గుర్రాలపై స్వారీ చెయ్యలేకపోడంతో వారికి డోలీ యేర్పాటు చేసి , మిగతావారం ముందుగా మాట్లాడుకున్న గుర్రాలమీద గోవింద ఘాట్ చేరి అక్కడనుంచి మా టాక్సీలలో జోషిమఠ్ చేరుకున్నాం .

3 thoughts on “బ్రహ్మకమలాల పుట్టిల్లు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ హేమకుంఢ్ సాహెబ్

  1. ఈ యాత్రకు నేను 2007 లో వెళ్ళానండి. అప్పటి నుండే ఆ ప్రదేశాలప్రభావం నా మీద చాలా
    ఉంది. ఆధ్యాత్మిక చింతన హాయినిస్తోంది.
    మీ యాత్రా వివరాలు చదువుతూ ఉంటె మళ్ళీ వెళ్ళినంత సంతోషంగా ఉంది. అభినందనలు.

    సోమ సుధేష్ణ

  2. కష్టమైన యాత్రని ఇష్టంగా చేసారు .. యాత్రా వివరాలు చదువుతుంటే నేనుగూడా మీతో కలిసి ప్రయాణం చేసానా అనిపించేలా చక్కగా రాశారు. మరిన్ని యాత్రలు చేయాలని కోరుకుంటూ … కర్రా నాగలక్ష్మి గారు మీకు మీ గ్రూప్ సభ్యులకూ అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *