June 19, 2024

అమ్మమ్మ – 6

రచన: గిరిజ పీసపాటి

నాగకి జ్వరం ఎక్కువగా ఉండడంతో తమ ఇంటిలోకి తీసుకుని వచ్చి పడుకోబెట్టాక తెల్లవార్లూ నాగను కనిపెట్టుకుని కూర్చున్నారు తాతయ్య, అమ్మమ్మ, పెద్దన్నయ్య, వాళ్ళ అమ్మగారు. గంట గంటకూ నాగకి జ్వరం పెరగసాగింది. తెల్లవారేసరికి నాగకి ఒళ్ళంతా‌ కుంకుడు గింజల‌ పరిమాణంలో కండలు పోసేసి పెద్దమ్మవారు పోసింది. నాలుక మీద, నాలుక కింద, ఆఖరికి కంట్లో కూడా కుండలు పోసాయి.

వాటివల్ల విపరీతమైన దురదలు, మంట, జ్వరంతో నాలుగు సంవత్సరాల వయసు గల నాగ బాధ పడసాగింది. నాగకు అమ్మవారు పోసిన విషయం చూసిన తాతయ్య వెంటనే నాగ పుట్టినప్పుడు అమ్మమ్మకి‌ పురుడు పోసిన డాక్టర్ రాజేశ్వరమ్మ గారికి కబురు చేసారు. ఈలోగా నాగకు ఒంట్లో బాగోలేదని తెలిసిన తెనాలి నాజర్ పేట నివాసులంతా నాగను‌ చూడడానికి రావడంతో ఇల్లు కిటకిటలాడసాగింది.

ఈలోగా డాక్టర్ రాజేశ్వరమ్మ గారు రావడం, నాగను పరీక్షించి అది పెద్దమ్మవారు అనీ, వెంటనే ఫిజీషియన్ అయిన డాక్టర్ నమశ్శివయ్య గారికి చూపించమని సలహా ఇచ్చారు. నాగను చూడడానికి వచ్చిన ఊరివారు మాత్రం అమ్మవారు పోసినప్పుడు వైద్యం చేయిస్తే అమ్మవారికి ఆగ్రహం ఎక్కువై పిల్ల దక్కదని, అందువల్ల వైద్యం చేయించొద్దని సలహా ఇచ్చారు.

కానీ తెనాలి తాతయ్య నాగకు వైద్యం చేయించడానికే నిశ్చయించుకుని డాక్టర్ నమశ్శివయ్య గారికి కబురు పెట్టగా ఆయన వెంటనే వచ్చి నాగను పరీక్షించి అవసరమైన ఇంజక్షన్స్‌ చేసి, మాత్రలు ఇచ్చి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళారు. కానీ మాత్రలు మింగడానికి నోటిలో పోసిన అమ్మవారి పొక్కుల వల్ల సాధ్యం కాక బాగా ఇబ్బంది పడింది నాగ.

ఊరి జనమంతా పిల్లకి వద్దన్నా వైద్యం చేయిస్తున్నారు – పిల్ల దక్కుతుందో లేదో, ఇంట్లో ఎవరికైనా అమ్మవారు పోస్తే నూనె వంటకాలు చెయ్యకూడదు కనుక మన ఇళ్ళల్లో కూడా నాగకి అమ్మవారు తగ్గేవరకు ఎవరూ నూనెతో వంటలు చేయరాదని, ఆఖరికి పోపుకోసం కూడా నూనె వాడరాదని‌, ఏదో పచ్చడి, పప్పు మాత్రమే వండుకుందామని తీర్మానించుకుని వెళ్ళిపోయారు. నాగ పరిస్థితి ఇలా ఉండడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పొయ్యి లోని పిల్లి లేవనేలేదు.

ఇలా పదిహేను రోజులు గడిచింది. అమ్మమ్మకి, తాతయ్యకి ఊరిలోనివారో, వారి ఇంటిలో అద్దెకుంటున్న వరలక్ష్మమ్మ గారో ఇంత ఉడకేసి ఇస్తే అదే తినసాగారు. నాగకి మందులు వాడుతున్నా పొక్కులు తగ్గలేదు సరికదా మరి కాస్త పెరిగాయి. ఒంటిమీద సెంటీమీటర్ గేప్ కూడా లేకుండా అమ్మవారు తీవ్రంగా పోసేసింది.

నాగకు అమ్మవారు పోసిన పదహారవ రోజు రాత్రి అమ్మమ్మ అర్ధరాత్రి దాటేవరకూ నాగను కనిపెట్టుకుని ఉండి, దుఃఖాన్ని నిగ్రహించుకోలేక దేవుడి గదిలోకి వెళ్ళి ఆ లలితా పరమేశ్వరిని ప్రార్ధిస్తూ అక్కడే మగత నిద్రలోకి జారుకుంది. అప్పుడు నిద్రలో వచ్చిన కలకి హఠాత్తుగా మెలకువ వచ్చింది అమ్మమ్మకి. ఆ కల తలుచుకుని నిలువునా‌ వణికిపోయింది.

తెల్లవారుజామున వచ్చిన కలలు తప్పకుండా నిజమౌతాయని అమ్మమ్మ ప్రగాఢ విశ్వాసం. కానీ… ఈ కల నిజమైతే… కాకూడదు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో అమ్మమ్మకు హఠాత్తుగా గుర్తుకొచ్చారు – తన అన్నయ్యకు ఒంట్లో బాగోలేనప్పుడు తరుణోపాయం సూచించి అన్నయ్య జీవితాన్ని నిలబెట్టిన అన్నపూర్ణ శాస్త్రులు గారు.

ఆయన ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసకులు. ఆయనే తనకు కూడా తరుణోపాయం సూచించగలవారు. కనుక ఆలస్యం చేయకుండా వెంటనే స్నానం చేసి, దేవుడికి దీపం పెట్టుకుని, తాతయ్యకి చెప్పి అన్నపూర్ణ శాస్త్రులగారి దగ్గరకు వెళ్ళింది. అప్పుడే పూజ, జపం పూర్తి చేసుకుని హాలులోని వాలు కుర్చీలో కూర్చుని ఉన్న అన్నపూర్ణ శాస్త్రులు గారు అమ్మమ్మను చూస్తూనే “బాగా దుఃఖంలో ఉండి, దిక్కుతోచని స్థితిలో వచ్చావు. ముందు లోపలికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని రా! తరువాత మాట్లాడుదాం” అన్నారు.
అమ్మమ్మ వారి ఇంట్లోనే ఉన్న పూజా పీఠాన్ని దర్శించి, నమస్కరించుకుని, తిరిగి వారి వద్దకు వచ్చింది.

అమ్మమ్మ తిరిగి వచ్చేసరికి వారు అర్ధ నిమీలిత నేత్రాలతో మౌనంగా ఉండడం చూసి, వారి ఏకాగ్రకు భంగం కలిగించకుండా మౌనంగా నిలుచుంది. కాసేపటి తరువాత కళ్ళు తరిచిన అన్నపూర్ణ శాస్త్రులు గారు “దేవుడితో పందెమా తల్లీ! అందులోనూ ఆ నాగేంద్రస్వామితోనా ఆటలు!? స్వామికి దయ కలిగితే ఎన్ని వరాలు కురిపిస్తాడో, కోపిస్తే అంతగా శపిస్తాడు. ఈ సంగతి తెలిసీ స్వామితో చెలగాటమా! అమ్మాయి పడమటి దిక్కుకి తిరిగి పడుకొనుంది. గౌరినాధం పక్కనే కూర్చుని వేపమండలతో విసురుతున్నాడు, పెద్దవాడు సత్యనారాయణ గ్లూకోజ్ నీరు పట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ, పిల్ల తాగలేక ఏడుస్తోంది” అంటూ చెప్తూనే మెత్తగా చీవాట్లు పెట్టారు.

తను ఏ విషయం చెప్పకుండానే సర్వం గ్రహించిన అన్నపూర్ణ శాస్త్రుల గారి పాదాల మీద పడింది అమ్మమ్మ. “తప్పు చేసాను, ముప్పు తప్పే మార్గం సూచించ”మని వేడుకుంటూ… ఇంతకీ అమ్మమ్మకి వచ్చిన కల మీకు చెప్పనే లేదు కదూ! మగత నిద్రలోకి జారిన అమ్మమ్మ కలలోకి ఒక చిన్న పాము పిల్ల కనిపించి చూస్తుండగానే ఐదు పడగలతో గదంతా చుట్ట చుట్టుకుని “బిడ్డ పుడితే కంఠానికి కాటు ఇస్తానని మొక్కుకున్నావు కదా! నీకు బిడ్డను ప్రసాదించాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన మాటను తప్పిన కారణంగా నేను ప్రసాదించిన బిడ్డను తిరిగి నాతో తీసుకుపోతున్నాను. నేనిటి సరిగ్గా నాలుగో రోజున నీ బిడ్డను నేను తీసుకెళ్ళపోతాను” అనడంతో అమ్మమ్మ భయపడిపోయింది.

తరువాత స్వామితో “అప్పుడు ఏదో నైరాశ్యంలో అలా అన్నాను కానీ, ఇప్పుడు నాకు పిల్లను చూస్తే బతకాలని ఉంది. ఆయనలో కూడా నేను కోరుకున్న మార్పు వచ్చింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నాకు అప్పుడే చనిపోవాలని లేదు. కనుక ఏదైనా వేరే మార్గం ఉందా? నేను, నా పిల్ల కూడా బతకడానికి?” అని అడగగా నాగేంద్రస్వామి ‘ఉంది’ అన్నట్లుగా తల ఊపుతూ అదృశ్యమైపోయాడు. ఇదీ అమ్మమ్మకి వచ్చిన కల. ఈ కల రావడంతో పరిష్కార మార్గానికై అన్నపూర్ణ శాస్త్రుల గారిని‌ ఆశ్రయించింది అమ్మమ్మ.

****** సశేషం ******

1 thought on “అమ్మమ్మ – 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *