June 19, 2024

కమనీయ నాట్యకళామూర్తి పసుమర్తి కృష్ణమూర్తి గారు

రచన: శారదాప్రసాద్

పసుమర్తి కృష్ణమూర్తి ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తి గారు గుర్తుకొస్తారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తి గారు. ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేచుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసించకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. కూచిపూడి నాట్య నీష్ణాతులు ‘పద్మశ్రీ’ స్వీకర్త – చింతా కృష్ణమూర్తి గారు పసుమర్తికి మేనమామ. వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శనలు ఇవ్వసాగారు.
ఒకసారి బెజవాడలో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తి గారి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థల నటుడు సూరిబాబు రాజరాజేశ్వరి వారు నిర్మించబోయే భక్త తులసీదాసు (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం – అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా కూచిపూడి శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. భక్త తులసీదాసు చిత్రానికి డైరెక్టరు లంక సత్యం, తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన చంపకవల్లి అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో రంభ, ఊర్వశుల నాట్యాలు ఉన్నాయి. కె. వి. రెడ్డి గారు పసుమర్తి గారి నాట్య లక్షణాలు, శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, ‘గుణసుందరి కథ’కి నాట్యదర్శకుడిగా నియమించారు. అదే గొప్ప ప్రవేశం, పరిచయం. గుణసుందరి కథలో రకరకాల నాట్యాలున్నాయి. వాటిని కృష్ణమూర్తి అతి నైపుణ్యంతో రచించారు . గుణసుందరి కథ చిత్రం ఘనవిజయం సాధించడంతో , అందరికి ఖ్యాతి లభించినట్టు – కృష్ణమూర్తి గారికి కూడ ఖ్యాతి లభించింది. పి. పుల్లయ్య తీసిన తిరుగుబాటు (1950) చిత్రానికి కృష్ణమూర్తిగారు పని చేసారు. విజయ సంస్థ ప్రారంభించిన తొలి చిత్రం ‘షావుకారు’ నుంచి చివరి చిత్రం ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ’ వరకు ప్రతి చిత్రానికీ పనిచేసిన నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి. మల్లీశ్వరిలో ఉషాపరిణయం యక్షగానం, మాయాబజార్లో మోహినీ భస్మాసుర ముఖాభినయం, పెళ్ళి చేసి చూడు (1952)లో ఊర్వశి, అర్జునుడు స్వప్నదృశ్యం లాంటివి కొన్ని నాట్యాలు మన మనస్సులో నిలిచిపోయాయి. రహస్యంలో గిరిజా కల్యాణం ఇంకొక ఉదాహరణ. మల్లీశ్వరిలో ఉషాపరిణయం సంగీత, సాహిత్య, నాట్యమయమై కనిపిస్తుంది. ఈ నాట్యరూపకం రూపొందే ముందు, రచయిత కృష్ణశాస్త్రిగారు, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారు, నాట్యదర్శకుడు కృష్ణమూర్తిగారు నెల రోజులకు పైగా చర్చలు చేసిన తర్వాత, కృష్ణమూర్తిగారు డాన్స్ కంపోజింగ్‌కి, రిహార్సల్స్‌కి ఇంకో నెలరోజులు పట్టింది.


మాయాబజార్లోని మోహిని భస్మాసుర – కథకళి శైలిలో రూపొందించారు. సాహిత్యం లేకుండా వాద్య గోష్టితోనే సాగి, అద్భుతంగా అలరించింది ఆ నాట్యం. పాతాళ భైరవిలోని మాయామహల్లో జరిగే నాట్యప్రదర్శనలు, మాయాబజార్‌ లోని పెళ్ళి కుమారా రావయ్యా ఆహ్వాన గీతం, నాట్యాలు యమాగా ఉన్నాయి . ఈ నాట్యాలు పసుమర్తి వారి ప్రతిభకు ఉదాహరణలు. ఈయన హాస్యనటులకు సమకూర్చే నృత్యాలు భిన్నంగా ఉంటాయి. పాతాళ భైరవిలో రేలంగి పాడిన వినవే బాలా, శ్రీ కృష్ణార్జున యుద్ధంలో అంచెలంచెల. . . కొన్ని ఉదాహరణలు మాత్రమే . ఈ పాటలో అల్లు రామలింగయ్య ఆంగికాభినయం నవ్వు పుట్టిస్తుంది . ఇంక మాయాబజార్‌లో సుందరి నీవంటి దివ్య స్వరూపము పాట గురించి చెప్పేదేముంది?. ఆయన 200 చిత్రాల్లో దక్షిణ భాషా చిత్రాలకు పనిచేసారు. వీటిలో సాంఘికాలు, చారిత్రకాలు, పౌరాణికాలు ఉన్నాయి. ఆయన చివరి చిత్రం భైరవద్వీపం (1994). ఆ చిత్రంలో శ్రీ తుంబర నారద పాటలో కనిపించే నాట్యాలు కృష్ణమూర్తి గారు సృష్టించినవే!పసుమర్తి కృష్ణమూర్తి గారు ఒకసారి ఇష్టాగోష్ఠిలో, అప్పుడప్పుడే నాయిక పాత్రల్లో అడుగిడుతున్న ఒక నటీమణిని ప్రస్తావిస్తూ , ఆమె తొలిరోజుల్లో చెప్పిన విధంగా చెయ్యటానికి ఎంతగానో శ్రమించేది! నేను ఫలానా చిత్రంలోని ఒక సన్నివేశంలో అలాకాదు అమ్మాయి ఇలా మరొక పర్యాయం చెయ్యి అంటే, అది చాలదా మాస్టారు’ అని ఎదురు ప్రశ్న వేసింది! 35 ఏళ్ళనాడే (1975 సంగతి) ఇలా ఉంటే నేటి స్థితిగతులు ఊహించటం
ఏమంతకష్టం కాదు!ఇక కళాఖండాలు ఎలా వస్తాయి?మల్లీశ్వరి, పాండవనవాసం, పూజాఫలం, సిరిసిరిమువ్వ, శ్రీ కృష్ణార్జునయుద్దం, నవరాత్రి, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి . కన్యాశుల్కం సినిమాలో ”ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” అనే శ్రీశ్రీ గీతాన్ని సినిమాలో సావిత్రి కోసమే చిత్రీకరించారు . ఘంటసాల శంకరాభరణ రాగంలో స్వరపరచి ఆ పాటకు వన్నె తెచ్చారు. దేవులపల్లి రాసిన బొమ్మలపెళ్ళిపాట ”చేదాము రారే కళ్యాణము. . . చిలకా గోరింక పెళ్లి సింగారము”ను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. బాలానందం సభ్యులచేత నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి చక్కగా డ్యాన్సు చేయించారు. ఈ పాటలో ఊర్వశి శారద బాలనటిగా కనిపిస్తుంది. గురజాడ రాసిన గేయనాటకం ”పుత్తడిబొమ్మ పూర్ణమ్మ”ను కూడా దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నారు. గిరీశానికి చుట్ట ముట్టించి సావిత్రి నాట్యంచేసే ”సరసుడ దరిజేరరా ఔరా సరసుడా”అనే జావళిని సదాశివబ్రహ్మం రాయగా, పసుమర్తి నృత్యరచన అద్భుతంగా చేసారు. ‘కీచకవధ’ వీధినాటకం- ”వెడలె సైరంధ్రి సభకూ మదమరాణిగమన వెడలె”ను చక్కగా చిత్రీకరించారు పసుమర్తి కృష్ణమూర్తి. ప్రముఖ నటి , నాట్యగత్తె రాజసులోచన ఈయన వద్ద కూడా నృత్యాన్ని నేర్చుకున్నారు. 12-11-1925 న కూచిపూడిలో జన్మించిన ఈయన , 08-08-2004 న చెన్నైలో మరణించారు. ఆయనకు ఆరుగురు సంతానం.

ఈ కమనీయ నృత్య దర్శకుడికి కళాభివందనాలు!

11 thoughts on “కమనీయ నాట్యకళామూర్తి పసుమర్తి కృష్ణమూర్తి గారు

 1. నేనూ ఆ కాలానికే చెందినప్పటికీ,ఇంతటి విశిష్ట వ్యక్తిని గురించి తెలుసుకోకపోవటం బాధ అనిపించింది

 2. ఈ కాలంలో కూడా ఇటువంటి కళాకారులు ఎందుకు లేరా?అని బాధ కలుగుతుంది!

 3. విశిష్ట వ్యక్తులను గురించి తెలియచేస్తున్నందుకు అభినందనలు

 4. ఆనాటి నృత్యదర్శకులలో పసుమర్తి కృష్ణమూర్తిగారు అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరు. మిశ్రమ నాట్యరీతులు (కూచిపూడితో భరతనాట్యం, కధకళి, కథక్ ఇత్యాది వాటి సమ్మేళనం) అవలంబించి తనదైన ముద్రను వేశారు. వారి గురించి మంచి విషయాలు తెలియచేశారు. మీరు అభినందనీయులు.

 5. ఆణిముత్యాలు లాంటి పసుమర్తి కృష్ణమూర్తి గారి గురించి చాలా విషయాలు తెలియ చేసారు శారదా ప్రసాద్ గారు .
  పునర్జన్మ అంటూవుంటే వీరు మరల పుట్టి తెలుగు కళామతల్లికి మల్లేశ్వరి, మాయాబజార్ లాంటి గొప్ప సినిమాలు అందించాలని కోరుకుంటూ
  నాగయ్య

 6. It is a privilege to know about great dance composer Sri Pasumarthi and his great works. Even today,once we think about old cinema dances e.g.MayaBazar etc.
  the celluloid wonders come before our hearts.
  Thank you very much for bringing those beautiful memories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *