March 29, 2024

కౌండిన్య కథలు .. సిద్దయ్య మనసు

రచన:  రమేష్ కలవల

 

ఆకు పచ్చని లుంగీ మీద మల్లెపువ్వు లాంటి తెల్లటి లాల్చీ లోంచి బనియను కనపడుతోంది. మెడలో నల్లటి తాయత్తు, కళ్ళకు సుర్మా, ఎర్రగా పండిన నోరు, భుజం మీద వేసుకున్న సంచిలో నెమలి ఈకలతో పాటు సాంబ్రాణికి కావలసిన సామగ్రితో ప్రతిరోజూ ఆ వీధి లో దట్టమైన పొగలలో కనిపించే మస్తాన్ వలి అంటే అందరికీ పరిచయమే. మస్తాన్ వలి కంటే కూడా సాంబ్రాణి వలి గానే అతను అందరికీ తెలుసు. డబ్బులు ప్రతీ రోజూ ఇచ్చినా ఇవ్వక పోయినా తను మాత్రం అడిగి, సాంబ్రాణి వేసి ఒక్కొక్క దుకాణాం నుండి ఇంకో దానికి హడావుడిగా వెడుతూ ఉంటాడు, పొగలు ఆయన వెనుక పరిగెడుతుంటాయి.

ఆ వీధిలో అన్ని దుకాణాలకు వెడుతూ ఆ కిళ్ళి కొట్టు దగ్గరకు ఆగాడు.  “సిద్దయ్యా.. సాంబ్రాణి?” అంటూ నములుతున్న కిళ్ళీ నిండిన నోటితో ముద్ద ముద్దగా పలికాడు వలి.

“ఊ….” కానివ్వు అన్నట్లుగా సైగలు చేసాడు తను లోపల సర్దుకుంటూ కిళ్ళీ కొట్టు యజమాని సిద్దయ్య. ఇద్దరికీ చనువు కూడా ఎక్కువే.

తను వేసిన సాంబ్రాణికి ఆ బడ్డీ కొట్టు మొత్తం పొగలతో నిండి బయట సిగరెట్ల కోసం వచ్చిన వారికి లోపల ఎవరైనా ఉన్నారో లేదో తెలియటానికి కొంతసేపు పట్టింది.

కొంతసేపటికి ఆయన కనపడంతో “ఈయన లోపలే ఉన్నాడ్రా” అంటూ ఒక కుర్రాడు నవ్వి డబ్బులు చేతిలో పెట్టి సిగిరెట్టు తీసుకొని, అక్కడ వేలాడుతున్న తాడు కొస నిప్పుతో వెలిగించుకొని దాన్ని తాగుతూ, ఆ సామ్రాణి సువాసనలను కొంత కలుషితం చేస్తూ వెడిపోయాడు.

ఇంక సిద్దయ్య కిళ్ళీ కొట్టు గురించి చెప్పాలంటే అక్కడ ఓ ముప్పై ఏళ్ళగా ఆ చుట్టు పక్కల వారికి సుపరిచయమే. కిళ్ళీలతో పాటు ధూమపానానికి కావలసిన వాటితో పాటు పాన్ మసాలాలు, చిన్న పుస్తకాలు, పేపర్లు, చక్ర కేళీలు అన్నీ వేలాడుతుంటాయి. లోపల ఒక్క మనిషికంటే ఎక్కువ పట్టరు, అన్నీ చేతికి అందేలా ఉండి ఎదురుగా కావలసినంత ప్రదేశం ఉంటుంది.

సిద్దయ్యకు పిల్లా జల్లా ఎవరూ లేరు. రోజూ వచ్చిన సంపాదనంతా ఆ వీధిలో ఓ నాలుగు కొట్ల అవతల ఉన్న బంగారం కొట్టు మార్వారీ సేటు చేతిలో పెడతాడు. ‘లెక్క చూసుకోని డబ్బులు తీసుకెల్లు” అంటున్నా వినకుండా “తీసుకుంటాలే సేటు” అంటూ మాటనమ్మకం మీద అప్పచెప్పి వెడతాడు.

వలి అక్కడే బడ్డీ కొట్టు పక్కన నించోని ఉన్నాడు. ఆ ఒక్క చోట మాత్రం ఎంతసేపైనా నించుంటాడు, కొంచెం ఆలస్యమైన అక్కడనుండి కదలడు ఎందుకంటే సిద్దయ్య పనిలో ఉండి మిగతావారికి కావలసినది ఇచ్చిన తరువాత, తనచేత ఓ నాలుగు కిళ్ళీలు కట్టించుకుంటే గానీ సంతృప్తిగా చెందడు. ఆ నోట్లో కిళ్ళీ, ఆ సాంబ్రాణిలో బొగ్గులు రోజు చివర్లో ఒకే సారి ఆగాల్సిందే.

కిళ్ళీ కొట్టు ముందున్న చిన్న స్ధలంలో ఓ రెండు కుర్చీలు వేయించే  జాగా ఉన్నా వేయించడు ఎందుకంటే కుర్రకారు అక్కడే తిష్ట వేసి, మళ్ళీ కదలరని తనకు అనుభవంతో తెలుసుకున్నాడు..

*****

సిద్దయ్యకు కిళ్ళీలు కట్టేటప్పుడు పని చేస్తున్నప్పుడు ఎదుటి వారితో మాటలాడుతూ, సలహాలిస్తూ అలసట తెలియకుండా పని చేయడం అలవాటు. తన మాటలతో ఎదుటి వారి బాధలను సగం నయం చేయడం తన ప్రత్యేకత.

ఆ కొట్టుకు వచ్చే  కుర్రకారుతో పాటు సగటు కష్టాలు పంచుకునే వయసు పడిన మనుషులు కూడా ఎంతో మంది రావడం షరా మామూలే. అలాంటి వాళ్ళల్లో శంకర్రావు ఒకడు.

శంకర్రావుకు సిద్దయ్య ఇరవై ఏళ్ళ పైచిలుకు పరిచయం. రోజూ ఓ సారి కిళ్ళీ కొట్టుకు రాకుండా ఇంటికి వెళ్ళడు. సొంత విషయాలు ఇంట్లో కంటే సిద్దయ్యకు చెప్పుకోవడం అలవాటు.

అక్కడ శంకర్రావు లాంటి వాళ్ళు ఓ పక్క కాళ్ళు లాగుతున్నా లెక్కచేయకుండా బాతాకాణి కొడుతూ కాలక్షేపం చేస్తుంటారు. తన చెప్పిందంతా చెప్పి  “నాకు తోచింది ఏదో చెబుతాను .. మీకు తోచిందే మీరు చేయండి” అంటాడు మళ్ళీ తన అభిప్రాయం ఎదుటి వారి మీద రుద్దే ఉద్దేశ్యం లేక.

శంకర్రావు మునిసిపల్ స్కూలు లో టీచర్. అత్తెసర జీతం లో భార్యా, ఓ కూతురిని పోషిస్తు తనకు స్తోమతకు తగ్గిన చదువులు కూతుర్ని చదివించాడు. ఇంకా రిటైర్మెంట్ కు కొన్ని సంవత్సరాలు ఉంది. కాస్తో కూస్తో  కూతురి పెళ్ళకోసం దాచి పెట్టాడు. ఆ పెళ్ళి కూడా ఓ రెండు వారాల్లో పడింది.

ఎప్పటి నుండో పెళ్ళి విషయాలు గంటలు తరబడి ముచ్చటిస్తూనే ఉన్నాడు సిద్దయ్యతో. అలాగే సాంబ్రాణి వలి కూడా శంకర్రావు కనిపించినప్పుడు పెళ్ళి పనులు ఎలా సాగతున్నాయో అడిగి తెలుసుకుంటుంటాడు.

ఆ రోజు శంకర్రావు పెళ్ళి భోజనాల విషయాలు చాలా సేపు మాట్లాడి  కిళ్ళీల ప్రస్తావన వచ్చి “సిద్దయ్యా.. పెళ్ళికి కిళ్ళీలు కట్టాలి, తిన్నవాళ్ళు జన్మలో మర్చిపోకుండా కూడదు.” అంటూ “ఏది ఓ కిళ్ళి ఇవ్వు” అని అడిగాడు శంకర్రావు జేబులోంచి డబ్బులు తీసి. “చేతిలో పనేగా.. అలాగే కడతాగా.” అంటూ “కిళ్ళీ బదులు ఇందా ఓ చక్ర కేళి తిను, చాలా సేపటి నుండి నించొని ఉన్నావు, డబ్బులు వొద్దులే” అంటూ కొట్టు లోంచి వొంగి మరీ అక్కడ వేలాడుతున్న గెలలోంచి ఓ మంచి పండు తీసి అందించాడు. శంకర్రావు ఎలాగూ తీసాడు కదా ఆ డబ్బులు అందించాడు. దాన్ని తిని “ఇదిగో నీలానే తియ్యగా ఉంది సిద్దయ్యా” అంటూ పెళ్ళి పనులున్నాయి, మళ్ళీ కలుస్తానంటూ బయలు దేరాడు శంకర్రావు.

తరువాత రోజు పొద్దున్న శంకర్రావు కూతురి పెళ్ళి కోసం దాచి పెట్టిన డబ్బులు బ్యాంక్ లో తీసుకొని దారిలో కిళ్ళీ కొట్టు దగ్గర ఓ సారి పలకరించి వెడదామని ఆ కొట్టు వైపుకు నడవబోతుంటే ఎదురుగా మోటర్ సైకిల్ రావడం, తనకు బలంగా తగిలి కిందపడడం, అక్కడే నించున్న సాంబ్రాణి వలి తనవైపు పరిగెడుతూ రావడం వరకూ గుర్తుంది.

కుప్పకూలుతున్న శంకర్రావును సమయానికి పట్టుకున్నాడు సాంబ్రాణి వలి. శంకర్రావు జేబులోంచి ఎగిరి పడిన డబ్బులను హడావుడిగా ఏరి మళ్ళీ జేబులో కూరాడు.

సిద్దయ్య కు అసలు ఏం జరిగిందో తెలుసుకొని బయటకు వచ్చేలోగా అటు వెడుతున్న రిక్షాని ఆపి శంకర్రావును తీసుకొని ఆసుపత్రికి హడావుడిగా బయలు దేరాడు సాంబ్రాణి వలి. సిద్దయ్య కూడా ఉన్న పళంగా కొట్టు మూసి బయలు దేరాడు. ఇద్దరూ ఆసుపత్రిలో చేర్పించారు.

శంకర్రావు భార్యా, కూతురికి కబురు ఎలా పంపాలో ఆలోచించారు. ఇంకో రెండు వారాలలో పెళ్ళి దగ్గర పడింది ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంటి విషయాలు శంకర్రావుకు ఎంత తెలుసో సిద్దయ్యకు కూడా అంత తెలుసు. ఒక్కగానొక్క శుభకార్యాన్ని ఆపదలుచుకోలేదు.

సాంబ్రాణి వలి ఆసుపత్రి లో ఉంచి సిద్దయ్య శంకర్రావు ఇంటికి బయలుదేరాడు. ఇంట్లోంచి భార్య బయటకు వచ్చింది. సిద్దయ్య రావడం చూసి

“ఆయన ఇంట్లో లేరు” అంది భార్య

“ఆయన పని మీదే వచ్చాను” అన్నాడు

“ఇందాకనగా బయటకు వెళ్ళారు.” అంది ఆవిడ

”అమ్మాయి…”  అంటూ కొంచెం బెరుకుగా అడిగాడు.

“బయటకు వెళ్ళింది“ అనగానే ఊపిరి పీల్చుకొని “మీకో విషయం చెప్పాలి” అంటూ అతను అనుకుంటున్నదంతా వివరించాడు. తనతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు. ఉన్న పరిస్థితులలో శంకర్రావు కూతురిని ఇబ్బంది పెట్టకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

పెళ్ళి పనులకు తను దగ్గరుండి సహాయం సహాయం చేస్తానని సాంబ్రాణి వలి మాటిచ్చాడు. శంకర్రావు కూతురి కోసం తీసుకున్న డబ్బులు భార్య చేతిలో పెట్టాడు. ఇంటికి చేరిన తరువాత కూతురికి తండ్రి గురించి సర్ది చెప్పింది శంకర్రావు భార్య.

ఆ తరువాత రోజు సాయంత్రం సిద్దయ్య మార్వారీ సేటు దగ్గరకు వెళ్ళాడు.

“సేటు నాకోసం ఓ హారం చేసి పెట్టు” అదీకాక “కొంత డబ్రులు కావలంటూ” ఎంత కావాలో చెప్పాడు.

“ఇంత డబ్బు కావాలంటున్నావు.. పెళ్ళి గానీ చేసుకుంటున్నావా?” అన్నాడు మార్వారీ సేటు నవ్వుతూ. అవునన్నట్లు తల ఊపాడు.

్ర్ర్ర్ర్ర

వారం రోజుల్లో పెళ్ళి పడింది.  శంకర్రావు కళ్ళు తెరిచాడు కానీ నోట మాట లేదు. చుట్టూరూ చూసుకున్నాడు. మొదటి ఆలోచన ఆసుపత్రికి అయ్యే ఖర్చు, తరువాత కూతురు పెళ్ళి ఖర్చు రెండూ జ్ఞాపకం వచ్చాయి. సిద్దయ్య దగ్గరకు వచ్చి ఓదార్చాడు, పెళ్ళి పనులంతా సక్రమంగా జరుగుతున్నాయంటూ చెప్పి సాంబ్రాణి వలి ని దగ్గరకు రమ్మని పిలిచాడు. శంకర్రావు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. విశ్రాంతి తాసుకోమని చెబుతూ తను దర్గా నుంచి తెచ్చి మెడలో కట్టిన తాయత్తు చూపిస్తూ శంకర్రావుకు అంతా మంచ జరుగుతుందన్నట్లుగా సైగలు చేసాడు.

పెళ్ళికి ముందు మూడు రోజుల ముందు శంకర్రావుని ఇంటికి తీసుకొచ్చారు. కూతురికి నచ్చ చెప్పారు. పెళ్ళి అనుకున్న దానికంటే అద్భుతంగా జరిగింది. అందరూ విందు ముగించుకొని, కిళ్ళీ పండిన నోరుతో అంత బాగా చేసినందుకు శంకర్రావుని పలకరించి, మెచ్చుకొని వెడుతున్నారు. ఇదంతా చూడటం తప్ప శంకర్రావు ఏమి మాట్లాడలేదు.

శంకర్రావు కు ఓ రెండు నెలలు పట్టింది కోలుకోవటానికి. రెండు నెలలు నోట్లో మాట లేదు అంతా సిద్దయ్యకు నోటి మాట పోయిందనుకున్నారు.

ఆ రోజు పొద్దున్నే తయారై కిళ్ళీ కొట్టు దగ్గరకు బయలుదేరబోయాడు. బయట పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉంది. ధైర్యం చేసి బయలుదేరి అక్కడకు చేరుకున్నాడు.

సిద్దయ్య కొట్టు దగ్గరకు చేరగానే ఆ పొగమంచు లోంచి మంచి సువాసనలు రావడంతో శంకర్రావు మనసు ఉప్పొంగింది. కావలసిన ఇద్దరూ అక్కడే ఉన్నారని గ్రహించి అటు నడిచాడు.

ఆ పొగమంచులో ముగ్గురి మాటలు వినిపించడం తప్ప ఏమీ కనపడటం లేదు.

“రా శంకర్రావ్ రా.. కొట్టు బోసి పోయింది నువ్వు లేకపోతే.. ఎన్ని రోజులనుండో నీ గురించి ఎదురుచూడటం.. “ అని పలకరించాడు సిద్దయ్య.

“ఇదిగో మన సాంబ్రాణి వలి దర్గాలో తాయత్తు తీసుకొచ్చ కట్టాడు చూడు ఆ రోజు తరువాత సరిగ్గా ఓ వారంలో తేరుకున్నావు ..” అన్నాడు సిద్దయ్య.

“నాదేముంది సిద్దయ్య.. అమ్మాయి పెళ్ళి ఆగకుండా దగ్గరుండి చేసి శంకర్రావుని మళ్ళీ మనిషిని చేసింది నువ్వేగా ” అన్నాడు సాంబ్రాణి వలి ముద్దు మాటలతో.

“సైగలు చేయిలే చాలు..” అన్నాడు.

వద్దన్నా కళ్ళలో నీళ్ళు ధారలా కారాయి. “మీ ఇద్దరి ఋణం ఎలా తీర్చుకోవాలో..” అని మొదటి సారి చాలా రోజుల తరువాత మాట్లాడాడు శంకర్రావు.

“చూసావా కొట్టు దగ్గరకు రాగానే మళ్ళీ మాటలు వచ్చాయి” అన్నాడు సిద్దయ్య

“నేనే గమ్మున ఉండ దలుతుకున్నా సిద్దయ్యా.. మీ మాటే నా మాట.. ఇద్దరూ దగ్గరుండి అన్నీ అంతలా చేస్తుంటే నే మాట్లాడి ఏం ప్రయోజనం అని ఇన్నాళ్ళూ మాట్లాడలేదు” అన్నాడు శంకర్రావు.

“మనకు అంతా తెలుసుగా.. ఒక్కో సారి ఇలా వస్తుంటాయిలే మవం లేము..” అన్నాడు సాంబ్రాణి వలి ను చూస్తూ.

“ఇంత ఖర్చు నీకెలా చెల్లించాలో తెలీదు.. ” అని శంకర్రావు అనేలోగా

“ఛ ఊరుకో .. నాకు మాత్రం పిల్లానా జల్లానా .. నేనేం చేసుకుంటా .. ఇంకా సంపాదిస్తావుగా ఇద్దువులే వాటి గురించి మరిచిపో.. ముందు పూర్తిగా కోలుకో. ” అంటూ ఆ మాటలలో తను కట్టిన కిళ్ళీలు సాంబ్రాణి వలికి అందిస్తూ

“ఇదిగో నీ కిళ్ళీలు” అని వినిపించింది.  అవి అందుకొని “వస్తా శంకర్రావు.. మళ్ళీ కలుస్తా..” అంటూ సాంబ్రాణి వలి బయలు దేరాడు.

“ఇదిగో శంకర్రావ్ .. నువ్వు కూడా ఓ చక్రకేళి తీసుకో రా” అన్నాడు

నిశ్శబ్దం. ఎంతకీ పలుకక పోయేసరికే

”ఓయ్ శంకర్రావు .. ఇంకా ఉన్నావా? అని అడిగాడు సుబ్బారావు.

“ఆ .. ఆ” అని దూరమవుతున్న సాంబ్రాణి పరిమళం దగ్గరవుతుందేమోనని గట్టిగా ఊపిరి గుండె లోతులోంచి పీల్చాడు శంకర్రావు.

ఆ చక్రకేళీ అందుకొని దానంత తీయటి మిత్రుల ఋణం ఈ జన్మలో తీర్చుకోగలనా అని అక్కడే నించొని ఆలోచనలో పడ్డాడు శంకర్రావు.

 

******

2 thoughts on “కౌండిన్య కథలు .. సిద్దయ్య మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *