March 4, 2024

క్షమయా ధరిత్రే కాని……

రచన:  మణి గోవిందరాజుల

 

విలేఖరుల చేతుల్లోని ఫ్లాష్ లైట్లు చక చకా వెలిగిపోతున్నాయి. అక్కడ అంతా హడావుడిగా వుంది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోతున్నారు. హంతకురాలిని చూడడానికి జనం విరగబడి పోతున్నారు.

“చీ!చి!  . . అమ్మ అన్నపదానికే అవమానం తెచ్చింది” యెవరో చీదరించుకుంటున్నారు.

“ అసలు కన్నకొడుకు కాదేమో. . అందుకే అలా చేయగలిగింది. ”

“మన దేశం పరువు తీసింది కదా?ఇలాంటి వాళ్ళను వురి తీయాలి ఆలో చించకుండా”

“ప్రపంచ దేశాల్లో మనం తలదించుకునేది  ఇలాంటి వాళ్ళు చేసే పనుల వల్లే”

మనసులో దుఃఖం సుళ్ళు తిరుగుతున్నా అందరి మాటలు  నిర్వికారంగా వింటున్నా వసుమతి మనసులో యెక్కడో అంతర్లీనంగా తృప్తి వుంది.

———————

“ఒరేయ్! నాన్నా! తొందరగా రారా అన్నానికి. . . యెప్పటి నుండి పిలుస్తున్నాను. .  రావేమిరా?” విసుక్కుంది

“వుండమ్మా! వస్తున్నాను. ” అన్న మాటలతో పాటే ధభీ ధభీ అన్న చప్పుడూ,  పక్కింటి పిల్ల యేడుపూ వినపడ్డాయి. వినగానే అబ్బా!మళ్ళీ వీడేదో చేసినట్లున్నాడు అని విసుక్కుంటూనే పరుగునా బయటికెళ్ళింది.  అనుకున్నట్లుగానే యేడేళ్ళ విక్రాంత్ పక్కవాళ్ళ అమ్మాయి సంధ్య ను పట్టుకుని కొడుతున్నాడు.  ఆ దృశ్యాన్ని చూడగానే వసుమతికి   వొళ్ళూ పై తెలీలేదు. గబ గబా వెళ్ళి కొడుకు చేతుల నుండి ఆ పిల్లను తప్పించి వీరావేశంతో చేతికందిన కర్రతో నాలుగు బాదింది.  “యెన్ని సార్లు చెపాలిరా?ఆ పిల్ల జోలికి పోవద్దని?”

“అమ్మా ! అది నా మాట వినడం లేదు.  అందుకని కొట్టాను”నిర్భయంగా చెప్పాడు.

ఇంతలో లోపలినుండి సంధ్య తల్లి పరుగునా వచ్చింది. ”వసుమతి  ! మీ వాడు యెప్పుడూ ఇలా కొడుతూనే వుంటాడు. పిల్ల తట్టుకోలేక పోతున్నది.  కాస్త భయం చెప్పు” అన్నది.  దాంతో కాస్త వుక్రోషం వచ్చింది వసుమతికి.

“నీ మూలంగానేరా నేను అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తున్నది”అంటూ ఇంకో రెండు బాదింది.

“అదేంటి వసుమతీ ! నేను పిల్లణ్ణి కొట్టమన్నానా? కాస్త భయం చెప్పమన్నాను కాని? కొడితే పిల్లలు ఇంకా మొండికేస్తారు” అనునయంగా చెప్పింది సంధ్యా వాళ్ళమ్మ.

అయినా సరే ఆ కోపం , వుక్రోశం తగ్గక” మళ్ళీ బయటికొచ్చావంటే కాళ్ళిరగ్గొడతాను.  యేమనుకున్నావో?” అరుస్తూ విక్రాంత్ ని లాక్కెళుతున్నట్లుగా లోపలికి తీసుకెళ్ళింది.

———————————

“చంపేస్తాను యేమనుకున్నాడో?నేనంత చాతగానివాడిననుకున్నాడా?”  గట్టిగా అరుపులు వినపడి  వరండాలోకి వచ్చింది వసుమతి. క్ విక్రాంత్ ఇంకో ఇద్దరు పిల్లలు హాలు ముందు వరండాలోని అరుగుల మీద కూర్చుని  వున్నారు.  అందరూ నూనూగు మీసాల వయసులో వారే. పదవతరగతి పిల్లలు. విక్రాంత్ మొహం యెర్రగా కందగడ్డలా వుంది ఆవేశంతో.

“అవున్రా వాడేదో పత్తిత్తు అయినట్లు కబుర్లు చెబుతాడు. ఒకసారి మన తడాఖా చూపించాలి. యెలా అంటే మళ్ళీ మన జోలికి రాకూడదు”

“ అసలు దానికెంత పొగరు? చెప్పు తీసుకు కొడుతుందా? వీడి అండ చూసుకునే కదా?

వీణ్ణి అణిస్తే దాని పొగరు దెబ్బకు దిగుతుంది”  రాని మీసాలను రువ్వుకుంటూ  రెచ్చగొడుతున్నారు విక్రాంత్ ని.

“యేంట్రా? విక్కీ ! యేమి జరుగుతున్నదిరా?యెందుకలా అరుచుకుంటున్నారు?”అడిగింది వసుమతి

“యేమీ  లేదమ్మా. . పదండ్రా పోదాము. ”తల్లి ముందు మాట్లాడ్డము ఇష్టము లేక స్నేహితుల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు విక్రాంత్.

ఆ తర్వాత స్కూల్ నుండి నోటీసు వస్తే కాని తెలీలేదు.  వీడు కొంతమంది కలిసి రమేశ్ అనే పిల్లవాణ్ణి చావబాదారని  రమేశ్ ని హాస్పిటల్ లో చేర్పించి వీడిని డిబార్ చేశారని. విక్రాంత్ తో పాటు చేయి కలిపిన పిల్లలు మొత్తం నేరం వీడిమీదకి నెట్టి వాళ్ళు తప్పుకున్నారు.

ఆ వెంటనే పరుగు పరుగున స్కూల్ కెళ్ళి హెడ్ మాష్టారి  కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలితే  పదవతరగతి కాబట్టి పరీక్షలు రాయనిస్తామని, స్కూలుకి మటుకు రానివ్వమని చెప్పారు.

విక్రాంత్ ని బతిమాలి, బెదిరించి మొత్తం మీద ఆ సంవత్సరం గట్టెక్కిందనిపించారు.

విక్రాంత్ కూడా యెందుకు భయపడ్డాడొ కాని ఆ పరీక్షలయ్యేంతవరకు ప్రశాంతంగానే వున్నాడు. పరీక్ష పాసయ్యాడే కాని ఆ వచ్చిన బొటా బొటీ మార్కులకు మంచికాలేజీ లో సీట్ రాలేదు. మామూలు కాలేజీలో చదవనని గొడవ చేస్తే మొత్తం మీద కష్టపడి ఒక కాలేజీలో చేర్పించారు.  చేరాడె కాని సరిగా వెళ్ళక  చెడు సావాసాలకి అలవాటు పడ్డాడు.  గొడవలు యెక్కువయ్యాయి.  తండ్రి ఆ దిగులుతో వుండగానే యేదో ఆక్సిడెంట్ లో మరణించాడు.  తండ్రి భయం కూడా లేకపోయేసరికి విచ్చలవిడితనం ఇంకా యెక్కువయ్యింది విక్రాంత్ కి.

——————————–

“ సైలెన్స్!సైలెన్స్! జడ్జి గారొస్తున్నారు” కోర్ట్ భంట్రోతు అందర్నీ హెచ్చరిస్తూ లోపలికి వస్తుండగా వెనకాలే జడ్జిగారు వచ్చి తన సీటులో కూర్చున్నారు

ఆ రోజు మొదటి కేసే వసుమతిది. దానికి సంబంధించిన ఫైలు జడ్జిగారికి అందించారు ప్రాసిక్యూషన్ లాయరు.

“వసుమతమ్మా, . . . వసుమతమ్మా. . . వసుమతమ్మా ” అని మూడుసార్లు పిలవగానే

లేచి చిన్నగా నడుచుకుంటూ వచ్చి బోనులో నుంచుంది వసుమతి. .  ఆమెని చూడగానే అక్కడ కూర్చున్న వారిలో మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి.

“ఆర్డర్!ఆర్డర్!” అందర్నీ హెచ్చరిస్తూనే కేసు పరిశీలించసాగారు .

అంతా అయ్యాక  బోనులో నుంచున్న వసుమతిని  పరిశీలనగా చూసారు.  యేడ్చి యేడ్చి కళ్ళు వాచి వున్నా ఆ కళ్ళల్లో యెక్కడా తప్పు చేసానే అన్న భావన లేదు. మధ్యతరగతి కుటుంబీకురాలిలా కనపడుతున్నది.  సాధారణమైన ఆకారం.  నిండా కొంగు కప్పుకుని వుంది.  అన్నం తిని చాలా రోజులయినట్లుగా బలహీనంగా వుంది.  ఆమెని చూస్తుంటే జడ్జిగారికి చాల జాలి వేసింది యెందుకో. .

ప్రాసిక్యూషన్ లాయరు లేచి కేసు పూర్వాపరాలు చెప్పి “కాబట్టి యువర్ ఆనర్. . . కన్నకొడుకునే కాక అతనితో పాటు మరి ఇద్దరిని  దారుణంగా హత్య చేసిన ఈమెకి మరణ దండనే సరి అయిన శిక్ష” అని చెప్పి తన వాదన ముగించారు.

“యేమ్మా? మీరు చెప్పుకునేది యేమైనా వుందా? కన్న కొడుకునే ఇంత దారుణంగా హత్య చేయడమనేది నా సర్వీసులో ఇది మొదటి సారి చూడడం. మీ తరపున వాదించడానికి చాలా మంది లాయర్లు వచ్చినా వద్దన్నారు?మీరు అంగీకరించక పోతే మీకు వ్యతిరేకంగా వున్న సాక్ష్యాధారాల ప్రకారం మీకు శిక్ష ఖరారు అవుతుంది” మృదువుగా అడిగారు జడ్జిగారువసుమతిని. .

ఒక్కసారి కొంగుతో కళ్ళని గట్టిగా తుడుచుకుంది వసుమతి. ”కన్న కొడుకు కాకపోతే పర్వాలేదా సార్?” నవ్వింది.  “తప్పు చేయబోయాడు. శిక్షించాను. కన్న కొడుకు కాబట్టే వాడిని శిక్షించే అర్హత నాకు మాత్రమే వుందని శిక్ష వేసేసాను. ”

“కాని దానికి చట్టము వుంది కదా? మీరు పోలీసులకి అప్పగించవలసింది. ”

“అంత సమయము ఆ సమయాన లేకపోయింది.”

“ఇప్పటికైన మీరు జరిగినదంతా కోర్టుకు చెప్పండి. ”

“అది చెప్పటానికే నేను బతికున్నాను సార్. మీకందరికీ వాడిని నేనెందుకు నా చేతులారా పోగొట్టు కున్నానో తెలియాలి. మేముసామాన్య  మధ్య తరగతి కుటుంబీకులము.  పరువుకు ప్రాణమిచ్చే వాళ్ళము.  అందరిలాగే మేము కూడా తొలిసారి మగపిల్లవాడు పుడితే యెంతో పొంగిపోయాము.   మా వంశాన్ని వుద్దరించేవాడు జన్మించాడని ఆశ పడ్డాము.  గొప్పగా పెంచగలిగితే ఒక్కడు చాలు అనుకున్నాము. కాని విధి ఇంకోలా రాసివుంది మా నుదుటిమీద. . .

పిల్లలు పుట్టి వాళ్ళు యెదిగే క్రమంలో వాళ్ళ ప్రవర్తనని మొదటగా గమనించేది తల్లి.  నేనూ అలాగే నా కొడుకులోని విపరీతబుద్దిని గమనించాను. కాని చిన్నతనం అని సర్దుకున్నాను.  కొడుకు కదా తప్పులు కనపడవు. ఇరుగు పొరుగు చెప్పినా కూడా వాళ్ళనే తప్పు పట్టాను.  అంతే కాని నా కొడుకుది తప్పని ఒప్పుకోలేదు.  యెంతైనా కొడుకు కదా? కొద్ది వయసు వచ్చాక అల్లరి చేస్తే కొన్నాళ్ళకి మారకపోతాడా అని ఆశపడ్డాను.  యుక్త వయసు వచ్చాక ఆడపిల్లల్ని అల్లరిపెడుతున్నాడని తెలిసి ఆ వయసు చేసే అల్లరి అని సరిపెట్టుకున్నాను.  ప్రేమించలేదని ఒక అమ్మాయి మొహం మీద ఆసిడ్ పోయటానికి ప్రయత్నించినపుడు తెలిసింది అది చిలిపి అల్లరి కాదనీ వయసుతో పాటు రాక్షసత్వం కూడా పెరుగుతున్నదని.  కాని తల్లిని కదా . . . జైల్లో పెడతారేమోనని నా ప్రాణం విల విలలాడింది.  పోలీసులనిబతిమాలుకుని,  ఆ పిల్ల అమ్మ నాన్నని బతిమాలుకుని  కొడుకుని జైలుకి పోకుండా కాపాడుకున్నాను. మహానుభావులు ఆ అమ్మాయి తలిదండ్రులు  యెక్కడవున్నారో?? వాళ్ళు అడగలేదు కాని వాళ్ళు నాకు చేసిన సహాయానికి  కృతజ్ఞతగా  వుంటున్న ఫ్లాట్ అమ్మి సగం ఆ అమ్మాయికి ఇచ్చాను.  ఆ పిల్ల కూడా ఒక అమ్మకి కూతురే కదా? మిగతా సగంతో వూరి చివర యెక్కడో చిన్న ఇంట్లొకి మారాను? ఇంత జరిగాక ఇక మారతాడులే ఇల్లు  లేకపోతే మటుకేమి కొడుకు మంచిగా వుంటే అదే చాలు పదిళ్ళ పెట్టు  అనుకున్నానండీ ” దుఃఖంతో మాటపెగల్లేదు వసుమతికి కోర్టంతా పిన్ డ్రాప్ సైలెన్స్ వుంది.  అందరి మనసులూ భారంగా అయ్యాయి. జడ్జిగారు కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నారు.

చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది వసుమతి.  “కాని ఒక రోజు తెలిసింది నా కడుపు తీపికొద్దీ నేను కాపాడుకున్న నా కన్నకొడుకు కొన్ని వేల తల్లుల గర్భశోకానికి కారణం కాబోతున్నాడని.  యేడ్చాను.  మొత్తుకున్నాను. ఆవేశపడి  కొట్టాను,  పోలీసులకప్పగిస్తానని బెదిరించాను. అమ్మని కదా సార్? బెదిరించానే కాని అప్పగించలేకపోయాను.  అప్పుడు తగ్గాడు. . విన్నట్టే విన్నాడు.  కాని వినిపించుకోలేదని తరువాత అర్ఠం అయింది.  ఆరోజు……. ”

మార్కెట్ నుండి వచ్చి తాళం తీసుకుని ఇంట్లోకి  రాగానే  కొడుకు బెడ్రూం లో నుండి

గట్టిగా అరుపులు వినపడుతున్నాయి. ”అబ్బ ! వీడు ఇంట్లో వుంటే గోలే…”విసుక్కుంటూ సరుకులు వంట ఇంట్లో పెట్టి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది.  లోపలి నుండి అరుపులు ఇంకా వినపడుతున్నాయి.  తల పగిలిపోతున్నది ఆ అరుపులతో.  ఇంకా వేరే వాళ్ళ మాటలు కూడా వినపడుతున్నాయి.  ఇంక తట్టుకోలేక వాళ్ళను తగ్గమనడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళింది.  ఇంట్లో యెవరూ లేరని వాళ్ళు స్వేచ్చగా మాట్లాడుకుంటున్నారు.  అంతకు ముందువరకు వాళ్ళేమి మాట్లాడుకున్నదీ దూరానికి వినపళ్ళేదు కాని దగ్గరికి వెళ్ళాక అర్థమై ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడి కాళ్ళల్లో సత్తువ లేనట్లై కిందపడిపోయింది.  అప్పటివరకు మాట్లాడుతున్న వాళ్ళల్లా చప్పుడు విని ఆపేసారు.  అప్పుడే తల్లిని చూసిన విక్రాంత్  కిందపడ్డ తల్లిని యెత్తుకెళ్ళి  మంచం మీద పడుకోబెట్టాడు. మొహం మీద చల్లిన నీళ్ళతో మెలకువ వచ్చింది.  ఒక్కసారిగా కొడుకుని పట్టుకుని పెద్దగా యేడ్చేసింది.  “యేంట్రా మీరు చేయాలనుకుంటున్నది?మారిపోతాను.  మంచిగా వుంటాను అన్నావు కదరా?ఇంత దౌర్భాగ్యపు ఆలోచన యెలా వచ్చిందిరా? యేరీ వీళ్ళంతా? ఒక్కొక్కళ్ళ కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చో బెట్టాలి” ఆవేశంగా అరిచిందివసుమతి.

“అమ్మా! అనవసరంగా అరిచి గోల చేయకు. మేము వినాయకచవితికి వేయడానికి డ్రామా రిహార్సల్స్ చేసుకుంటున్నాము. . వాళ్ళు నా కోసం బయట యెదురుచూస్తున్నారు.  నేను వెళ్తున్నాను” చెప్పి వెళ్ళిపోయాడు విక్రాంత్.  కాని వసుమతి నమ్మలేదు.  వాడి మాటల్లో,  చూపుల్లో నిజాయితీ లేదనిపించింది.  అప్పటినుండి వాడి మీద నిఘా పెట్టింది. విక్రాంత్ కూడా తల్లి గమనిస్తున్నదని కొన్నాళ్ళు చాలా మంచిగా వున్నాడు. ఒక నెల మామూలుగా గడిచింది.  ఒకరోజు  వుతుకుదామని విడిచిన  బట్టలు తీస్తే అందులో నుండి   నోట్ల కట్టలు బయటపడ్డాయి.  అంత డబ్బు యెక్కడిదని నిలదీస్తే స్నేహితుడిదని చెప్పాడు.  కాని వసుమతి నమ్మలేదు.  అప్పటినుండి ఇంట్లో సమంగా వుండడం మానేసాడు.  ఒకవేళ వచ్చినా వెంట యెవరెవరినో తీసుకొస్తాడు.  వాళ్ళు  ఒక వారం వుంటారు.  వాళ్ళు వెళ్ళగానె మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు వారం వుంటారు.  వాళ్ళు ఇంట్లో వున్నన్ని రోజులూ యెక్కడికీ కదలరు.  ఇల్లు వూరికి దూరంగా వుండడంతో ఇంట్లొ యేమి జరుగుతున్నా యెవరికీ తెలీడం లేదు.  ఇలా కొంతకాలం గడిచింది. . . ” ఆగింది వసుమతి.

అందరూ కూడా యేదో సస్పెన్స్ సినిమా చూస్తున్నట్లుగా చాలా ఆసక్తికరంగా వింటున్నారు.

ఒకరోజు ఇంట్లో యెవరూ లేరు.  అప్పటికి పదిరోజులనుండి కొడుకు కూడా కనపడటం మానేసాడు. ఇంతలో పోలీసులు వచ్చి విక్రాంత్ గురించి విచారణ చేసారు. తన కొడుకే అని పది రోజులుగా ఇంటికి రావడం లేదని ,  అతని స్నేహితులు మటుకు వచ్చి వెళ్తున్నారని చెప్పింది. జరుగుతున్నదంతా కూడా వివరంగా చెప్పింది.  వసుమతికి యేమీ తెలీదని పోలీసులు అనుకున్నారు.  పోలీసులని అడిగింది యెందుకు విక్రాంత్ కోసం వెతుకుతున్నారని? విద్రోహ శక్తులతో చేతులు కలుపుతున్నాడని అనుమానం కలిగిందని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి విచారణ చేయడానికి వెతుకుతున్నామని చెప్పారు వాళ్ళు.  కొన్నాళ్ళక్రితం వాళ్ళు మాట్లాడిన మాటలకర్థం ఇప్పుడు తెలుస్తున్నది.  గబ గబా లోపలికి వెళ్ళి వాడి గది మొత్తం వెదికింది.  యేమీ దొరకలేదు కాని యేదో చిన్న కాగితం మీద యేవో డేట్స్ వేసి వున్నాయి.  అన్నీ కూడా వచ్చే నెల తారీఖులు.  ఆ కాగితం తీసుకెళ్ళి  పోలీసులకి ఇచ్చింది.

“దీనివల్ల యేమీ వుపయోగం లేదు , అయినా కానీ దీన్ని తీసుకెళ్తాము. ఈ సారి కనక మీ అబ్బాయి ఇంటికొస్తే మాకు కబురు చెయ్యండి” చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.

వొంట్లో  వున్న శక్తంతా  హరించుకుపోగా నిస్సత్తువగా కూర్చుండిపోయింది వసుమతి.  ఇంతలో దాక్కుంటూ దాక్కుంటూ విక్రాంత్ లోపలికి వచ్చాడు.  వాడి వెంట ఇంకో  ఇద్దరు వున్నారు.  వారు కరుడు  గట్టిన రాక్షసుల్లా వున్నారు.

“యేరా విక్కీ! యేం జరుగుతుందిరా?  ఇప్పటివరకు పోలీసులు నీ గురించి కాచుకుని కూర్చుని  వెళ్ళారు.  నీ వెంట పోలీసులు యెందుకు పడుతున్నారు? చెప్పరా చెప్పు? ఆవేశంతో   కొడుకు చొక్కా పట్టుకుని గుంజుతూ అడిగింది.

“అమ్మా! చాదస్తంగా అరవకు. వీళ్ళింకా వారం రోజులు ఇక్కడే వుంటారు. ఈ సారి పోలీసులు వచ్చి నా గురించి అడిగితే  నాకు తెలీదు, ఇంకా రాలేదని చెప్పు. ఈ వారం గడిచిందంటే మనకు బోల్డు డబ్బు వస్తుంది. ఇక నేను ఇవన్నీ మానేసి మంచిగా వుంటాను.  అప్పటి వరకు నోరు తెరిచావో నేను అదిగో ఆ పెట్రోలు పోసుకుని చస్తాను. ” బెదిరించాడు విక్రాంత్.

“చావరా! చావు. నువు  చచ్చినా నాకు సంతోషమే. స్నేహితులు అంటే యెలా వుండాలి?వీళ్ళు స్నేహితుల్లా లేరు.  నాకు అర్థమవుతున్నది.  మీరంతా కలిసి యేదో కుట్ర చేస్తున్నారు.  అయ్యో భగవంతుడా యెలాంటి కొడుకునిచ్చావురా?వుండండి మిమ్మల్ని ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను. ”

“అమ్మా! మంచిగా చెప్తున్నాను విను.  ఇదే చివరిసారి. ఈ ఒక్కసారి నా మాట విను.  మనం వూహించలేనంత మొత్తం డబ్బు వస్తుంది.  ఇక జీవితంలో వెనక్కి చూసుకోనక్కరలేదు.  నువు వినకపోతే వీళ్ళకు తల్లీ పిల్లా అన్న జాలి వుండదు. ”

“వుండకపోతే యేం చేస్తార్రా?నేను ఇపుడే వెళ్తున్నాను”ఆవేశంగా గుమ్మం వేపు వెళ్ళబోయింది.  అప్పటివరకు మాట్లాడకుండా నించున్న అతని స్నేహితులిద్దరూ వసుమతిని పట్టి లాక్కొచ్చి లోపలకు బస్తాలా విసిరేసారు.  ఆ పడటం పడటం తల వెళ్ళి గోడకు కొట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. .  మెలకువ వచ్చి చూసేసరికి ఒక కుర్చీకి కట్టి పడేసుంది.  అది  తమ ఇల్లు కాదు.

“అరేయ్! యెక్కడున్నార్రా?వచ్చి నన్ను విప్పండి. ఒరేయ్ విక్కీ! నేను నీ తల్లినిరా. . ఇలా కట్టి పడేసావేంటిరా?”

“యేయ్! నోర్మూసుకుని పడుండు. లేకపోతే తెరవడానికి నోరుండదు.” బెదిరించాడు అందులో ఒకడు.

“అమ్మా!మళ్ళీ చెబుతున్నాను విను. ఒక్క వారమే.  నిన్ను ఇలాగే వుంచుతారు. వారం తర్వాత మనం యెక్కడికెళ్ళేదీ కూడా యెవరికీ తెలీదు. ”

రోజులు యెలా గడుస్తున్నాయో తెలీడం లేదు. కాలకృత్యాలకి మటుకు తీసుకెళ్తున్నారు. .  మళ్ళీ అన్నం తినగానే కాళ్ళు చేతులు కట్టి పడేసి వాళ్ళపని వాళ్ళు చేసుకుంటున్నారు.  కొడుకు మొహంలోకి పరీక్షగా చూసింది చాలాసార్లు. తల్లినిలా కట్టేసినందుకు యేమన్నా బాధ కనపడుతుందేమో అని. కాని యేమాత్రం బాధ లేకపోగా మధ్య మధ్య బెదిరిస్తున్నాడు.  ఆహారంలో యేమి కలుపుతున్నారో కాని రోజంతా  మగతగా పడివుంటున్నది.  ఇప్పుడేమీ చేయలేదుకదా అనేమో తన ముందే వాళ్ళ ప్లాన్స్ అన్నీ చర్చించుకుంటున్నారు.  శక్తినంతా కూడదీసుకుని వాళ్ళ ఆలోచనలు, కౄరమైన వాళ్ళ ప్రణాళికలు వింటుంటే భయంతో విపరీతమైన జ్వరం వచ్చేసింది. యెలాగైనా తప్పించుకుని పోలీసులకి వార్త అందజేయాలని చూస్తున్నది. కాని అవకాశం కుదరడం లేదు. ఒకసారి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే చూసి దొరకబుచ్చుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టారు.  యేమీ చేయలేని నిస్సహాయతతో భరించలేని దుఃఖం వచ్చింది. యెలా యెలా ఈ మారణహోమాన్ని  యెలా ఆపగలదు తాను? యెంతమంది తల్లులు  కడుపుకోతకు గురవుతారు? వందలమంది స్త్రీల సూత్రాలు తెగిపోతాయి. వేలమంది పసిపిల్లలు అనాధలవుతారు. భగవంతుడా!! నాకు ఒక్క అవకాశం ఇవ్వు తండ్రీ. . ఈ జీవితంలో నేను ఇంకేమీ కోరను. ఒక్క అవకాశం తండ్రీ. ఒక్కటంటే ఒక్కటే….  మోకాళ్ళతో నీ కొండకు నడిచి వస్తాను. తల నీలాలిచ్చుకుంటాను. కావాలంటే తల కూడా ఇస్తాను తండ్రీ” మనసులో వేదనపడుతూ వేడుకోసాగింది.

ఆ రోజెందుకో ముగ్గురూ చాలా వుత్సాహంగా వున్నారు. పొద్దుటినుండి ఇల్లు కదలకుండా మందు కొడుతూ కూర్చున్నారు.  చీకటి పడుతున్నా కూడా యెక్కడికి వెళ్ళలేదు.  ఆ రోజు యెమీ తినకుండా నిద్ర నటించసాగింది.  వాళ్ళు కూడా యెందుకో పట్టించుకోలేదు.

తెల్లవారితే దీపావళి.  యెక్కడో దూరం నుండి మతాబులు బాంబులు కాలుస్తున్నట్లుగా తెలుస్తున్నది.

“ఇంకొక్కరోజే. . ఈ రాత్రి గడిచిందంటే రేపు ఈ పాటికి మనం కోటీశ్వరులం అవుతాము” ఆనందంగా నవ్వుకున్నారు ముగ్గురూ.

గుండె గుభిల్లుమన్నది. ఇంకొక్కరోజా?రేపేమి చేస్తారు వీళ్ళు?ఈ రాక్షసుల్ని యెవరు చంపుతారు?యే దేవుడు దిగివస్తాడు?ఆలోచిస్తూ కళ్ళు తెరవకుండా వాళ్ళు మాట్లాడె మాటలు వినడానికి ప్రయత్నించసాగింది. వాళ్ళు యెవరెవరు యెక్కడికి వెళ్ళాల్సింది మాట్లాడుకుంటున్నారు. సిటీలో బాంబులు యెక్కడెక్కడ పెట్టాల్సింది కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. భూమి గిర్రున తిరిగిపోతున్నది. లోపలనుండి దుఃఖం తన్నుకుని రాసాగింది.  బలవంతాన ఆపుకున్నా కూడా వెక్కిళ్ళు రానే వచ్చాయి.

“యేడవడం తప్ప నువ్వేమీ చేయలేవు.  రేపీపాటికి సగం హైదరాబాద్ లేచిపోతుంది.” వికటంగా నవ్వాడు అందులో ఒకడు. మిగతావాళ్ళు జత కలిసారు . తాగి తాగి ఒళ్ళూ పై  తెలీకుండా నిద్రపోయారు ముగ్గురూ. కాళ్ళతో దగ్గరలో వున్న సీసాను తన్నింది. యెవ్వరూ లేవలేదు. చిన్నగా కట్లు విప్పుకోవడానికి ప్రయత్నించింది. ఇంక టైం దగ్గరపడుతుంది అనుకున్నారో యేమో తాళ్ళు గట్టిగా కట్టలేదు.  నెమ్మదిగా ఓపిక కూడగట్టుకుని  లేచింది.  బయటికి వెళ్ళే మార్గం వెతకసాగింది.   ఒక పాడుబడినట్లుగా వున్న ఇల్లు.  వీళ్ళు తెచ్చిన ఆహరపొట్లాలు, మందు , మంచినీళ్ళ సీసాలు తప్ప యేమీ లేవు. పక్క గదిలోకెళ్ళి చూసింది.  అక్కడ పెద్ద  సంచులు మూడు కనపడ్డాయి.  యేంటా అని దగ్గరకెళ్ళి  చూస్తే సినిమాల్లో మాదిరి కనపడ్డాయి బాంబుల డబ్బాలు.  చుట్ట చుట్టుకున్న కాల సర్పాల్లా కనపడ్డాయి.  అదే ముందుగదేమో ఒక గుమ్మం కనబడింది.  తలుపు తీసి చూస్తే ఆకాశం కనపడింది. అనందంతో కళ్ళనీళ్ళు తిరిగాయి.  పరుగునా బయటకెళ్ళి తలుపులు వేసేసింది. గొళ్ళెం పెడదామని చూస్తే బయటనుండి వేయటానికి యేమీ లేదు. యెవరన్నా కనపడతారేమో వాళ్ళ సాయం తీసుకుని ఆ ముగ్గుర్నీ పోలీసులకప్ప చెప్పొచ్చు అని.  కాని యెవరూ కనపడలేదు.  కనుచూపుమేరలో ఒక్క ఇల్లు కూడాలేదు.  అమావాస్య చీకటి.  నక్షత్రాల వెలుగులో అర్థమయింది అది ఒక పొలంలోని ఇల్లు.   అందుకే యెవరూ కనపడటం లేదు.  క్షణాలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ యెక్కువవుతున్నది.  యేడుపొచ్చేస్తున్నది.  నిస్సహాయంగా అక్కడే కూలబడిపోయింది. దూరంగా ఆకాశంలో మతాబులు వెలుగులు విరజిమ్ముతున్నాయి. నరకాసుర వధ అయినరోజు . దీపావళి పండగను అందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు.  “అయ్యో ఇక్కడ ఒకళ్ళు కాదు ముగ్గురు నరకాసురులు వున్నారు. యెవరన్నా రండిరా…”  యెలుగెత్తి అరిచింది వినేవాళ్ళు యెవరూ లేరని తెలిసినా. . మళ్ళీ వురుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది. . వాళ్ళు ఇంకా లేవలేదు.  తనని కట్టేసిన తాడు కనపడింది.  కాని ఒకడిని కట్టే లోపలే ఇంకోళ్ళని లేపుతే?. ఈసారి ఇక తనని కట్టేయడం కాదు చంపేస్తారు. చమటలు కారిపోతున్నాయి. .  ఆలోచనలతో తల పగిలిపోతున్నది.  భగవంతుడా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి యేమీ చేసే అవకాశం లేకుండా చేసావు కదయ్యా??పోనీ ఆ బాంబుల డబ్బాలు వేసుకుని ఇక్కడి నుండి పారిపోతే? వాటిని పట్టుకోవాలని చూసింది. కాని చాలా బరువుగా వున్నాయి. యేమి చేసినా ఈ రాత్రే చెయ్యాలి తెల్లవారితే నగరం శ్మశానం అవుతుంది. బూడిద కుప్పలా మారిన నగరం కనపడింది. పడుకున్న వాళ్ళని చూసింది.  వేయి తలలతో విషాన్ని వెదజల్లుతున్న సర్పాల్లా కనపడ్డారు. ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా  మందు సీసాల్లోని మందంతా వాళ్ళ చుట్టూ పోసింది. . వాళ్ళమీద కొద్ది కొద్దిగా చల్లింది. .  అగ్గిపెట్టె తీసుకుని బయటికి నడుస్తూ వెనక్కి చూసింది.  బుడి బుడి నడకలతో యెత్తుకో అంటూ నవ్వులతో వస్తున్న కొడుకు కనపడ్డాడు. దుఃఖంతో కాళ్ళు తడబడ్డాయి. . కాని ఆ వెంటనే కరాళ నృత్యం చేస్తున్న మృత్యుదేవత కనపడింది…. గుండెలు బాదుకుంటూ యేడుస్తున్న యెంతో మంది తల్లులు కనపడ్డారు,  మనసు గట్టిగా చేసుకుని అగ్గిపుల్ల గీసింది వసుమతి…….

వింటున్న వాళ్ళందరి హృదయాలు బరువెక్కాయి.

“దేశానికెంత మంచి చేసినా మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు.  అది చట్టరీత్యా నేరం. కాని మీరు చేసింది మంచి అని నమ్మిన లాయర్లు మీకు సహాయం చేస్తామంటే వొద్దన్నారు. వున్న సాక్ష్యాధారాల ప్రకారం మీకు కఠిన శిక్ష పడుతుంది.  ”

“అది ఆ లాయర్ల  మంచితనం.   నాకు  సహాయం చేస్తానన్న పెద్దలకు నమస్కారం. కాని  నేను బయటికి  వచ్చి యేమి చేస్తాను? వున్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని  నేను  బ్రతికి యెవరిని వుద్దరించాలి? వద్దు  సార్.  కాని ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నాను.  కొడుకులు తప్పు చేస్తే యే తల్లైనా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.   కాని తప్పులు చేయటమే జీవితంగా పెట్టుకున్న యే కొడుకునైనా శిక్షించడానికి   తల్లి సత్యభామ అవతరం యెత్తుతుందని పిల్లలు తెలుసుకోవాలి.  తప్పు చేయటానికి   ఆ పిల్లలు భయపడాలి. . . ఆ భయం పిల్లలకు తల్లులు కల్పించాలి. యెంత ప్రేమ పంచినా ప్రేమ పక్కన భయం లేకపోతే నా కొడుకులాంటివాళ్ళు మాట వినరు. సమాజానికి విషసర్పం లాంటి నా కొడుకు బ్రతకటానికి అర్హత లేని వాడు.  నేను నా కొడుకుని  దేశానికి  అర్పించాను.   అందుకు  బాధగా  యేమీ లేదు” గొంతు వణికింది వసుమతికి.

“ఒక పిల్లాడు పాడైతే ఒక తరమే పాడవుతుంది. తల్లులూ …. కనిపెట్టి వుండండి” చెపుతూనే పెద్దగా యేడుస్తూ  బోనులో ఒరిగిపోయింది వసుమతి. .

 

 

——————————

 

4 thoughts on “క్షమయా ధరిత్రే కాని……

  1. Koduku chedu pravarthana valla o thalli pade aavedana padaallo chaala chakkaga varninchaaru… katha mugimpu slaaghaneeyam…

  2. Nice mani.prati talli telusukovalasindi chakkaga narrate chesavu. intlonae kodukuni sarididdtae automatic ga samajam bagu padipotundi.

  3. Nice mani.prati talli telusukovaladindi chakkaga narrate chesavu. intlonae kodukuni sarididdtae automatic ga samajam bagu padipotundi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *