April 16, 2024

చీకటి మూసిన ఏకాంతం – 5

రచన: మన్నెం శారద

 

“కృష్ణారావుగారబ్బాయి ఎం.డి. చేసి ఫారిన్ వెళ్తున్నాడట!”

“మంచిది. వెళ్ళిరమ్మను” అన్నాడు నవనీతరావు పేపర్లోంచి దృష్టి తిప్పకుండానే.

వసుంధర అతని వైపు కోపంగా చూసి “మీరు చెప్పలేదనే వెళ్ళడం లేదు.” అంది విసురుగా.

నవనీతరావు తలెత్తి “నీకేదో కోపం వచ్చినట్లుంది. అసలేం చెప్పేవు నువ్వు!” అనడిగేడు అమాయకంగా.

“నా ఖర్మ కాలిందని చెప్పేను.”

“తప్పు. నేను బాగానే వున్నానుగా!”

“బాగానే ఉన్నారు బండరాయిలా. ఎదిగిన కూతురు కళ్ళెమొదిలేసిన గుర్రంలా తిరుగుతోంది. దానికి పెళ్ళి చేయండని చెబుతున్నాను.” అంది ఉక్రోషంగా.

“మొగుడు ముండ అంటే వీధిలో అందరూ అన్నారట. నీ కూతుర్ని నువ్వే ఆడిపోసుకుంటావు దేనికి? పెళ్ళి చేయనని నేను మాత్రం అన్నానా? ఆ పరీక్షలయిపోనీ!” అన్నాడాయన కొంచెం విసుగ్గా‌.

“ఈలోపున సంబంధాలు చూడందీ ఎలా చేస్తారు! అదేమో ఆ ముష్టివాడు ఫోను చేస్తే చాలు రివ్వునెగిరి పోతున్నది! చూస్తూ తల్లిగా నాకు బాధగా అనిపించదా?” అంది వసుంధర కన్నీళ్ళతో.

భార్య కన్నీళ్ళు చూసి కొద్దిగా చలించేడు నవనీతరావు.

“నువ్వన్నీ భూతద్దంలో చూసి బెంబేలెత్తుతావు వసూ! నిశాంత అంత విచ్చలవిడిగా ప్రవర్తించే పిల్ల కాదు. ఇంతకీ ఆ విద్యాసాగరేం ముష్టివాడు కాదు. దాని క్లాస్ మేట్” అన్నాడు శాంతంగా.

“నేను చెప్పేది ఆ సాగర్ గురించి కాదు. ఆ మధ్య మనింటికి పాట పాడి అడుక్కోడానికొచ్చేడే వాడు రోజూ ఫోను చేస్తున్నాడు దీనికి.”

ఈసారి నవనీతరావు నిజంగానే ఆశ్చర్యపోయాడు.

“నీకు సరిగ్గా తెలుసా?”.

“వాడే చెప్పాడు నాకు. లేకపోతే నేనేం సవత్తల్లినా ఆడిపోసుకోడానికి! ”

“ఏం చెప్పేడు?”

“ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పేడు. ఇంతలోకిదొచ్చి రిసీవర్ లాక్కుని తప్పక వస్తానని చెప్పి వెళ్ళింది.”

”ఈమధ్య నిశాంత బాంక్ అకౌంట్ లో చాలా డబ్బు డ్రా చేసినట్లు తెలిసింది. అనుకోకుండా బాంక్ బుక్ చూసాడు తను. ఎందుకంత డబ్బు వారం రోజుల్లోనే అవసరమొచ్చిందో తనకి తెలియదు. నిజానికతను ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఆడపిల్లలు చీరలకి, నగలకి బాగా డబ్బు తగలేసే వయసిదే. ప్రతి చిన్నదానికి తన ముందు చెయ్యి చాపి ఆమె నిలబడకూడదనే తనా ఏర్పాట్లు చేసేడు. ఒకవేళ ఈ డబ్బు అతనికిస్తున్నదా నిశాంత!  నిశాంతకి పాటలంటే ప్రాణమని తనకూ తెలుసు. కాని… అసలెప్పుడతనితో పరిచయం చేసుకుంది. తనకి మాట మాత్రం చెప్పలేదే!”  వసుంధర ఆయన్ని కుదుపుతూ  “అందుకే ఆ కృష్ణారావుగారితో మాట్లాడండి. ఈ శెలవుల్లో పెళ్ళి కానిచ్చేద్దాం.” అంది.

“సరేనన్నట్లుగా తల పంకించేరాయన.

 

*****

 

“రేపే నా పాట రికార్డింగు!” బీచ్ వడ్డున కూర్చుని చెప్పేడు మహేంద్ర.

“బెస్ట్ ఆఫ్ లక్. అతి త్వరలో మీరు ఇండియాలో బెస్ట్ సింగరనిపించుకుంటారు.” అంది నిశాంత నవ్వుతూ.

“అది కాదు” అతను మొగమాటంగా చూశాడు.

“చెప్పండి.” గాలికి ఎగురుతున్న ముంగురుల్ని సరి చేసుకుంటూ అడిగింది నిశాంత.

“నేనింత త్వరగా ఇంత ఎత్తు ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదు. నాకిది చాలా కంగారుని, భయాన్ని కల్గిస్తోంది!” అన్నాడతను తడబడుతూ.

“ఏం, ఈ ఎదుగుదల మీకిష్టం లేదా?”

నిశాంత ప్రశ్నకి అతను వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.

“అది కాదు నిశాంత గారూ! రేపు నా మొదటి పాటని బాలూ గారితో కలిసి పాడాలంటే నా కాళ్ళు వణుకుతున్నాయి. దయచేసి మీరు రికార్డింగుకొస్తే నేను ధైర్యం చేసి పాడగలను. లేకపోతే నేను ధియేటర్ కి వెళ్ళనే వెళ్ళను.”

“ఛంపేసేరు. మనం పడిన శ్రమంతా వృధా చేయకండి. ఎన్నింటికో చెప్పండి. నేనొస్తాను” అంది నిశాంత.

“రేపు తొమ్మిది గంటలకి. తప్పకొస్తారా?” అతని కళ్ళలో ఆశ తొంగి చూసింది.

“తప్పకుండా. ఎందుకంత అనుమానం!”

ఆమె జవాబు విని అతని కళ్ళు మెరిసేయి.

“మీ రుణం తీర్చుకోలేను.” అతని చెయ్యి ఇసుకలో ఉన్న ఆమె చేతిని గట్టిగా నొక్కడం కేవలం ఆమెకే గాని అతనికి తెలియనేలేదు.

ఆనందంతో కూడిన మైకం అంతగా క్రమ్మిందతన్ని. నిశాంత మెల్లిగా తన చేతిని లాక్కుని “పదండి వెళ్దాం” అంటూ లేచి నిలబడింది.

ఇద్దరూ ఇసుకలో నడుస్తూండగా నిశాంతే అంది “మీరు రాత్రికి నిశ్చింతగా పడుకోండి. రేపు నేనొచ్చి తీసుకెళ్తాను. అవసరమైతే మొన్న వేసుకొన్న టాబ్లెట్ మరొకటి వేసుకుందురుగాని.” అంది.

“ఆ టాబ్లెట్ పేరు చెప్పకూడదూ! నేనే కొనుక్కుంటాను”

“వద్దు. అవి ఎక్కువ వాడటం మంచిది కాదు. కొన్నాళ్ళయ్యేక మీకు స్టేజి ఫియర్ పోతుంది. ఎక్కడంటే అక్కడ ఎంతమంది లోనయినా పాడగలరు.”

హితేంద్ర సరేనన్నట్లుగా తలూపేడు.

నిశాంత అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి చేరుకుంది.

ఆమె లోనికెళ్ళడం క్రీగంట గమనిస్తూనే వున్నాడు నవనీతరావు.

అతనెప్పుడు కూతురి మీద విరుచుకు పడతాడా అని వసుంధర ఎదురు చూస్తోంది.

ఎలా కూతురి దగ్గర ఆ విషయాన్నెత్తాలా అని ఆలోచిస్తున్నాడు నవనీతరావు.

నిశాంత స్నానం చేసి నైటీ వేసుకొని తండ్రి దగ్గరకొచ్చింది.

“ఎక్కడికెళ్ళేవమ్మా. ఈమధ్య చాలా బిజీగా వుంటున్నావు?” అనడిగేడు తన ప్రస్తావనకి నాంది పలుకుతూ నవనీతరావు.

“ఒక ఎడ్వెంచర్ చేసేను డేడీ! మీకు రెండ్రోజులాగి చెబుదామనుకున్నాను” అంటూ నవ్వింది నిశాంత.

“ఏంటది?”

“మన ఇంటికి రెండు నెలల క్రితం ఒకబ్బాయి వచ్చి పాటలు పాడలేదూ?”

“ఎవరా ముష్టోడా?” అంది వసుంధర కలుగజేసుకుంటూ.

నిశాంత తల్లి వైపు కోపంగా చూసి “నీకు చాల తొందరపాటు ‌మమ్మీ! అతనిప్పుడు బాలూతో ఇళయరాజా మ్యూజిక్ లో రేపు ఒక తమిళ సినిమాకి పాట పాడబోతున్నాడు.” అంది.

“అంత మాత్రాన వాడి నెత్తిమీద కొమ్మలు మొలిచేయా! అడుక్కుతినే వెధవ!”

నవనీతరావు భార్య వైపు కోపంగా చూశాడు.

“నాకంతా తెలుసు. కూతుర్ని చూస్తే వళ్ళు తెలీదు మీకు. అదేనా దాన్ని నిలేసే విధానం!” అంది వసుంధర నిష్టూరంగా.

“నిశాంత వాళ్ళిద్దర్నీ తెల్లబోతూ చూసి “నన్ను నిలేయడమెందుకు? ఏం చేసేనని?” అనడిగింది.

“నీకు తెలుగు కేలండర్ చూడటమొచ్చా?”

తండ్రి ప్రశ్నకి అర్థం కాక తెల్లబోతూ చూసింది నిశాంత.

“ఇవాళ అమావాస్య అంత్య ఘడియలున్నాయి. ఇంకో అరగంటకి పాడ్యమి వస్తుంది. అప్పుడింక ఫర్వాలేదు.”

నిశాంత అప్పటికీ అర్ధం కాక తండ్రి వైపు అయోమయంగా చూసింది.

వసుంధర మాత్రం కోపంతో ఎగిరిపడింది.

“అంటే నాకు పిచ్చనేగా చెప్పడం! అలాగే దాన్ని వెనకేసుకురండి. ఎప్పుడో మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేసి ఉడాయిస్తుంది.” అంటూ రయ్యిన లోనికెళ్ళిపోయింది.

నిశాంత ఆశ్చర్యపోతూ “అమావాస్యకి పిచ్చెక్కుతుందా డేడీ!” అనడిగింది.

“పిచ్చెక్కదు. అది ఆల్రెడీ వున్నవాళ్ళకి ఎక్కువవుతుంది. దట్సాల్!”

అతని మాటకి పకపకా నవ్వింది నిశాంత.

అతను కూడ నవ్వుతూ “ఇంతకీ అతనంత స్థాయికి రావడానికి కారణమెవరు?” అనడిగేడు.

“అతని అదృష్టం,  టాలెంటు.” అంది నిశాంత తడుముకోకుండా.

నవనీతరావు కూతురివైపాశ్చర్యంగా చూస్తూ “అసలింతకీ అతను నీకెలా పరిచయమయ్యేడు?” అనడిగేడు కుతూహలంగా.

“మనింటి నుండి వెళ్ళిన రోజే దారిలో కనబడ్డాడు. అతనిలోని టాలెంటుని గుర్తించి హెల్ప్ చేసేను. తప్పా డేడీ!”

కూతురు చేసిన పని తప్పని చెప్పడం అతనికి సాధ్యం కాలేదు.

“ఇందులో తప్పేముంది! యు హావ్ డనే గుడ్ థింగ్!” అన్నాడతను నవ్వుతూ.

“థాంక్యూ డేడీ!” అంటూ తన గదిలోకెళ్ళిపోయింది నిశాంత.

తన కూతురు శారీరకంగానే సున్నితమైనది కాని మానసికంగా చాలా ఇండివిడ్యుయాలిటీ, దారుఢ్యం కలదని మొదటిసారి బాగా అర్థమయింది నవనీతరావుకి.

 

*****

 

ఆరోజు లత ఆపరేషన్ అని తెలిసి గబగబా ధియేటర్ దగ్గరకెళ్ళింది నిశాంత.

అప్పటికే ఆపరేషన్ జరుగుతోంది.

బయట సాగర్, శేషయ్య కూర్చుని వున్నారు.

నిశాంత గబగబా సాగర్ దగ్గరగా వెళ్ళి “ఈ రోజు ఆపరేషనని ఫోను చెయ్యలేదేంటి? లతకి నేను దగ్గరుంటానని ప్రామిస్ చేసేను.” అంది.

“నువ్వు మాత్రం ఎంతమందికని సర్వీస్ చేస్తావు! అందుకే చెప్పలేదు.”

సాగర్ జవాబులో నిష్ఠూరం ధ్వనించిందామెకు.

అందుకే అతని మొహంలోకి సాలోచనగా చూసి “నీక్కోపమొచ్చినట్లుంది” అంది.

“నేను కోప్పడటం – అసూయపడటం ఎప్పుడైనా చూశావా?” అన్నాడు సాగర్.

“పోన్లే. మనం అనవసరంగా డీవియేటవుతున్నాం. నేను బ్రహ్మానందం గారి పర్మిషనడిగి ధియేటర్ లోకి వెళ్తాను. నువ్వూ రాకూడదూ!” అంది నిశాంత.

“నేను రాను. అయినవాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంటే చూసే శక్తి నాకు లేదు” అన్నాడు సాగర్.

నిశాంత తనే వెళ్ళింది.

ఆపరేషన్ ఆరుగంటలు జరిగింది.

అంతసేపూ సాగర్, శేషయ్య బయటే కూర్చున్నారు.

నిశాంత బయటికి రాగానే శేషయ్య లేచి నిలబడి “ఎలా ఉందమ్మా లత!” అనడిగేడు ఆత్రంగా.

ఇంకా స్పృహలోకి రాలేదు. డాక్టరుగారొస్తున్నారు. మాట్లాడండి” అంది బ్రహ్మానందం గారొస్తుంటే చూపిస్తూ.

అతని దగ్గరకెళ్ళి దణ్ణం పెట్టి “హౌ ఈజ్ షి సర్!” అనడిగేడు సాగర్.

“మోకాళ్ళ క్రింద భాగం నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఆమె కోలుకుంటుంది కాని పూర్తిగా కాదు. నడిచినా ఎక్కువ సేపు నడవలేదు.” అన్నాడు డాక్టర్.

శేషయ్య వైపు చూశాడు సాగర్.

అప్పటికే అతని కళ్ళు నీళ్ళతో నిండిపోతున్నాయి.

“మీరలా బెంబేలు పడి పేషెంటుని మరీ కృంగదీయకండి. మనిషి మెంటల్ గా హేండీకేప్డ్ కానంతవరకూ ఎలాంటి ప్రాబ్లమూ ఉండదు” అంటూ వెళ్ళిపోయేడు డాక్టర్.

“మీరూరికే బాధ పడకండి. తమ కోలుకున్నాక కొన్ని ఎక్సర్ సైజ్ లున్నాయి. అవి చేస్తే నార్మల్సీ వచ్చేస్తుంది.” అంది.

లతని పోస్టాపరేషన్ ధియేటర్ కి తరలించేరు.

నిశాంత ఆ వార్డులో డ్యూటీ వేయించుకుని లతని పర్యవేక్షించింది. లత స్పృహ రాగానే నిశాంతని చూసి “థాంక్సండీ. అన్నమాట నిలబెట్టుకున్నారు” అంది.

నిశాంత నవ్వి “నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం.” అంది.

లత కళ్ళు మెరిసేయి.

“నిజంగానా?” అంది నమ్మలేనట్లుగా.

“అబద్ధం చెబితే నాకేం ఒరుగుతుంది లతా! నాకెందుకో అమాయకుల్ని చూస్తే చాలా జాలి!” అంది.

“నేనమాయకురాల్నా?”

“కాదా. ఎవరో స్వార్ధపరుణ్ణి ప్రేమించి… అతని కోసం ఆవేశంలో కాళ్ళిరగ్గొట్టుకున్నావు! తీరా అతను కాళ్ళు లేనిదాన్ని పెళ్ళి చేసుకోనని చెప్పేడట! ఒక స్వార్ధపరుడి కోసం కాళ్ళు పోగొట్టుకున్న నిన్నమాయకురాలనక ఏమనాలి?”

లత నిశాంత వైపదోలా చూసి “నాన్న చెప్పేరా అలా?” అంది.

“కాదు. మీ బావ.అద్సరే నువ్వీ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఈ పాటలు విను. నేను వార్డులో మిగతా పేషెంట్సుని కూడ చూసొస్తాను. లేకపోతే చీఫ్ కి రిపోర్టు వెళ్తాయి” అంటూ నవ్వుతూ ఇయర్ ఫోన్సు లతకి ఎరేంజ్ చేసి వాక్ మాన్ చేతికిచ్చి వెళ్ళిపోయింది.

లత ఆలోచిస్తూ పాటలు వింటోంది.

ఎవరో ఘంటసాలలా పాడేరు. కాని… ఘంటసాల కాదు. మనసుకి తెలీకుండానే వాటిలో లీనమైపోయింది.

అర్ధగంట తర్వాత నిశాంత తిరిగొచ్చింది.

“పాటలెలా వున్నాయి?” అంటూ.

“చాలా బాగా పాడేడు. ఎవరతను?”

“హితేంద్రని కొత్త సింగరు. పైకొస్తాడంటావా?”

“రావడమేంటి వచ్చేసేడు. అప్పుడే అరడజను పిక్చర్స్ కి ఆఫర్సొచ్చేయట. ఈ సంగతి నీకు చెప్పమని నాకు ఫోను చేసేడు. రేపేదో పూజా కార్యక్రమం వుందట విజయాలో. నిన్ను రమ్మనమని చెప్పమన్నాడు” అన్నాడు సాగర్ లోనికొచ్చి.

నిశాంత కళ్ళు సంతోషంతో మెరిసేయి.

“నిజంగానా?” అంది.

“ఇందులో నాకబధ్ధం చెప్పాల్సిన అవసరమేముంది నిశాంతా! కాని… మొన్న నువ్వు డ్యూటీ ఎగ్గొట్టి వెళ్ళినందుకే ప్రొఫెసర్ కి చాలా కోపమొచ్చి కేకలేసేరు. ప్రతిసారీ ఇదే పనిగా పెట్టుకుంటే… నీ కెరీర్ పాడవుతుంది.” అన్నాడు సాగర్.

నిశాంత తప్పు చేసినదాన్లా చూసి “అతనింకా నెర్వస్ గా ఫీలవుతున్నాడు పాపం! పైగా మనమే పైకి తీసుకొచ్చేమన్న కృతజ్ఞతతో చెబుతున్నాడు. ఇందులో తప్పేముంది?” అంది.

“తప్పేం లేదు. నీ సంగతి కూడ చూసుకో. టైమయింది. రిలీవయి నువ్వింటికెళ్ళు. మీ డేడీ కూడ ఫోను చేసేరు.” అన్నాడు సాగర్ ‌ లతకి చెప్పి వెళ్ళిపోయింది నిశాంత.

“పాపం. చాలా మంచిది బావా!” అంది లత.

“అందుకే కష్టాల పాలవుతుందని నా బాధ!” అన్నాడు సాగర్.

“ఎలాగైనా నువ్వదృష్టవంతుడివి.”

లత మాటకి ఆశ్చర్యపడుతూ “ఎందుకని?” అనడిగేడు.

“తెలియనట్లు. నీక్కాబోయే భార్యలో అన్ని మంచి లక్షణాలుంటే నీదదృష్టం కాదా?” అంది లత.

ఆ మాట విని గాభరా పడ్తూ “ఎవరు చెప్పేరీ సంగతి?” అనడిగేడు.

“నాన్న.”

“కొంపతీసి ఈ మాట ఆవిడతో అనలేదు కదా!” అనడిగేడు సాగర్ గాభరాగా.

“లేదు. అంటే ఏం?”

“నీకెలా చెప్పాలో తెలీడం లేదు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వనుకున్న ప్రేమలు, దోమలూ మా మధ్య ఏమీ లేవు.” అన్నాడు సాగర్ చిరాగ్గా.

లత విప్పారిత నేత్రాలతో సాగర్ వైపు చూసింది.

“బావా. అయితే నువ్వావిణ్ణి పెళ్ళి చేసుకోవన్నమాట!”

‘లేదు’ అనలేకపోయేడు సాగర్.

“హాస్పిటల్ బెడ్ మీద నీకీ డిస్కషన్స్ దేనికి లతా! హాయిగా రెస్టు తీసుకో.” అంటూ సాగర్ బయటికొచ్చేడే గాని అతని మనసు రెస్ట్ లెస్ గా మారింది.

నిశాంతని తను ప్రేమించలేదా?

తనెందుకా నిజం లత నుండి దాచేడు.

ఎన్నాళ్ళిలా తను ముసుగులో గుద్దులాడుకుంటాడు!

మగవాడిగా తానే బయట పడాలని నిశాంత ఆశిస్తున్నదేమో? ఇక తమ హౌస్ సర్జనీ కూడ పూర్తి కావొస్తున్నది‌.

అతనాలోచిస్తూ రోడ్డు మీదకి రాగానే అతని పక్కన ఒక కారాగింది.

పక్కకి చూశాడు సాగర్.

కారులో నవనీతరావున్నాడు.

“నమస్కారమండీ!”

“నీతో మాట్లాడాలి. కారెక్కుతావా?”

సాగర్ కారెక్కేడు.

కారు గీతాంజలి హోటల్ ముందాగింది.

ఇద్దరూ లోపలికెళ్ళేరు.

“ఏవైనా తీసుకుంటావా?” అనడిగేడు నవనీతరావు.

“ఏం వద్దండి.”

“మొగమాటపడకు. హాస్పిటల్ వార్డుల్లో నడిస్తే ఆకలేయకపోవడమంటూ వుండదు.”

“సరే మీ ఇష్టం. నేనేదైనా తింటాను.”

నవనీతరావు బేరర్ ని పిలిచి “రెండు థైయిర్ వడ, కాఫీ” అని చెప్పేడు.

బేరర్ వెళ్ళగానే “మీ చదువులు పూర్తవుతున్నాయి. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు?” అనడిగేడు.

“ఇంకా ఏం నిర్ణయించుకోలేదండి” అన్నాడు సాగర్.

నవనీతరావు పకపకా నవ్వి “మరెప్పుడు నిర్ణయించుకుంటారు?” అనడిగేడు.

“నిశాంతకేమండి? మీ అండదండలున్నాయి. మీరొక ప్రయివేటు నర్సింగ్ హోం కట్టివ్వగలరు. నేను గవర్నమెంట్ జాబ్ వెదుక్కోవాల్సిందే!”

“మీ ఇద్దరూ కలిసెందుకు ప్రాక్టీసు చెయ్యకూడదూ?”

నవనీతరావు ప్రశ్నకి వింతగా చూశాడు సాగర్.

“అది సాధ్యమవుతుందంటారా?”

నవనీతరావు బేరర్ తెచ్చిన వడ తింటూ “ఇందులో అంత సాధ్యం కానిదేముంది? చదువెక్కువయ్యే కొలది ప్రతిది సమస్యగా కన్పిస్తుందేమో! నాయితే శుభ్రంగా సాధ్యపడుతుందనిపిస్తోంది. మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటే!” అన్నాడు తాపీగా.

అతని మాట విని సాగర్ ముందు తెల్లబోయేడు.

ఆ తర్వాత అతని మనసు జ్యోత్స్నా పులకిత సాగరంలా పొంగిపోయింది. అయినా తన సంతోషాన్ని బయల్పడకుండా చూసుకుంటూ “నిశాంత ఒప్పుకోవాలి కదా!” అన్నాడు.

“అంటే నీకిష్టమేనన్న మాటేగా!”

నవనీతరావు సూటి ప్రశ్నకి సిగ్గుగా తలదించుకున్నాడు సాగర్.

“నాకు తెలీకడుగుతాను. మీరిద్దరూ సంవత్సరాలు పొడుగునా బీచ్ వడ్డులో చెప్పుకున్న కబుర్లేంటి?”

విద్యాసాగర్ మరింత తెల్లబోతూ “మీకు తెలుసా?” అనడిగేడు.

“తెలిసేదేంటయ్యా! నేనెన్నిసార్లు మిమ్మల్ని గాంధీ బీచ్ లో చూశానో బహుశ మీకు తెలియదు. మీకు అయిదారు గజాల దూరంలో వేరుశెనక్కాయలు తింటూ ఎన్నో సార్లు కూర్చున్నాను. అందుకే మీ ఇద్దరూ ఖచ్చితంగా ప్రేమించుకుని వుంటారని అనుకున్నాను. అందుకే ఆ విషయం మాట్లాడాలని వచ్చేను అన్నాడు నవనీతరావు కాఫీ తాగుతూ.

“నా కూతురు ఆడపిల్ల. నీకయినా ఆ సంగతి మాట్లాడాలనిపించలేదంటే నీలోనే లోపముంది. వెనకటికి నీలాంటివాడే గారెలు తినాలనిపించి కష్టపడి వండుకొని – మంచి ముహూర్తంలో తిందామని ఆలోచిస్తూ కూర్చునే సరికి గద్ద తన్నుకెళ్ళిందట. మనసులో ప్రేమించేక ఇన్నాళ్ళు దాయడం పధ్ధతి కాదు. నేననుకోవడం నిశాంత కూడ నిన్ను ప్రేమించే వుంటుంది. నువ్వు కదపలేదని మొగమాటపడి తనూ ఊరుకొనుంటుంది. నిశాంత పెళ్ళి గురించి వాళ్ళమ్మ తొందర పడుతోంది. ఆమె దృష్టిలో మంచి సంబంధమంటే బాగా డబ్బు, పలుకుబడి వుండటం. నా దృష్టిలో మంచి కేరెక్టర్ తో బాటు భార్య పట్ల ప్రేమాభిమానాలుండటం. ఆ రకంగా నేను నీ గురించి వాకబు చేసేను. నేనన్నివిధాల ఆశించిన లక్షణాలన్నీ నీలో వున్నాయి. మీరిద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికొస్తే నేను ముహూర్తాలు పెట్టించేస్తాను” అంటూ లేచేడాయన.

సాగర్ అతన్ననుసరించేడు.

సాగర్ తనింటి దగ్గర కారు దిగుతుంటే “రేపటికేసంగతీ చెబుతావుగా!” అంటూ మరోసారి రెట్టించేడు నవనీతరావు.

సాగర్ తలూపేడు ఆనందంగా.

 

************

 

హాల్లో ఫోను రింగవుతుంటే క్రీగంట చూసేడు నవనీతరావు ఫోను వైపు.

నిశాంత వెళ్ళి రిసీవరందుకుని “హలో” అంది.

నవనీతరావు జాగ్రత్తగా ఆమె మాటలు వింటున్నాడు.

“ఇప్పుడా, ఏంటంతర్జంటు?… సరే! వస్తానిప్పుడే! నేను కూడ నీతో ఓ ముఖ్యమైన సంగతి చెప్పాలనుకున్నాను.” అంటూ రిసీవర్ క్రెడిల్ చేసింది నిశాంత.

ఆమె క్షణంలో తయారయి కారు తాళాలు తీసుకొని వెళ్తుంటే నవనీతరావు గుంభనంగా నవ్వుకున్నాడు.

నిశాంత పది నిముషాల్లో గాంధీ బీచ్ చేరుకుంది. అక్కడే ఫుట్ పాత్ మీద నిలబడి వున్నాడు సాగర్ నవ్వుతూ.

“ఏంటంత కొంపలంటుకుపోతున్నట్లుగా పిలిచేవ్?” అంది నిశాంత కూర్చుంటూ.

“కొంపలంటుకోలేదు. వెలగబోతున్నాయి. నీకో గుడ్ న్యూస్ – అయ్ మీన్ మనకో గుడ్ న్యూస్!” అన్నాడు సాగర్ నవ్వుతూ.

నిశాంత కళ్ళు పెద్దవి చేసి “కొంపదీసి లతగాని నడిచేస్తున్నదా?” అనడిగింది.

ఆ మాట విని సాగర్ మొహం కొద్దిగా పేలవమైంది.

“నువ్వో పరోపకారం పాపమ్మవి. ఎప్పుడూ ఎదుటివాడి మేలేగాని నీ గురించి నీకేం అక్కర్లేదా?”

నిశాంత కొద్దిగా నవ్వింది.

ఆ నవ్వులో సిగ్గు మిళితమైంది.

“కావాలి. ఆ విషయమే చెబుదామనుకుంటుండగా నీ ఫోనొచ్చింది.”

“రియల్లీ! అయితే నువ్వే చెప్పు ముందు!”

“లేదు. నువ్వే పిలిచేవ్! నువ్వే చెప్పు!”

“నీ నోటితోనే ముందుగా వినాలి నిశా! నీకు సంతోషం కల్గించే ఏ విషయమైనా నాకూ ఆనందాన్ని కల్గిస్తుంది!”

“నేనంటే నీకంత ఇష్టమా?”

“వేరే చెప్పాలా?”

“అయితే నువ్వే నాకీ సహాయం చెయ్యగలవు!”

“సహాయమా?” ఆశ్చర్యపోతూ అడిగేడు సాగర్.

“అవును. ఈ సమస్య కొన్ని రోజులుగా నలుగుతున్నది. నీ సలహా కావాలి!”

“ఏంటది?”

“హితేంద్ర కెరీరిప్పుడు చాల బాగుంది. చాల పిక్చర్స్ కి పాడుతున్నాడు . బాలు అమెరికన్ తెలుగువారి ఆహ్వానం మీద అమెరికా వెళ్ళడం కూడ ఇతనికి బాగా కలిసొచ్చింది. కాని… అతను పాడనంటున్నాడు.” అంటూ సాగర్ కళ్ళలోకి చూసింది నిశాంత.

నిశాంత ఏం చెప్పబోతోందో సాగర్ కి అర్థం కాలేదు. పైగా ఈ సందర్భంలో హితేంద్ర పేరెత్తడం కూడ అతనికి చికాకు తెప్పించింది. అయినా ఓపిగ్గా వింటున్నాడు.

“ఎందుకట?” అన్నాడు తన చిరాకుని లోలోపలే అణచుకుంటూ.

“కళాకారులకి ఇన్స్పిరేషన్ కావాలి. అతను తోడు కోరుకుంటున్నాడు.”

“అంటే?” నిజంగా అర్ధంకాకనే అడిగేడు సాగర్.

“నీకెలా చెప్పను సాగర్! అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నాతోడు లేందీ అతని గొంతు పలకదట. నన్ను పెళ్ళి చేసుకుంటాడట. లేకపోతే ఈ రంగం వదిలేసి వెళ్ళిపోతాడట.”

ఆ మాట విని విద్యాసాగర్ హృదయం నొక్కేసినట్లయింది.

“అతని సంగతికేం, నీ ఉద్దేశ్యం చెప్పు!” అన్నాడు మెల్లిగా.

నిశాంత కాసేపు మౌనం వహించింది.

సాగర్ ఆమె జవాబు కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నాడు.

“నాకేం అయిష్టం లేదు. అతని పాటలు వింటూ ఈ ప్రపంచాన్ని మరచిపోవచ్చు. హితేంద్రకేం తక్కువ?”

నిశాంత జవాబు విని వెయ్యి ఆశల్ని ఒడ్డుకి మోసుకొచ్చి విరిగిపడి నిరాశతో వెనక్కు మళ్ళే కెరటమైంది అతని హృదయం.

తన బాధని బలవంతంగా నొక్కి పెట్టి “ఇంత వరకూ వచ్చేక నా సహాయమేముంది నిశాంతా! బెస్టాఫ్ లక్!” అన్నాడు.

“అది కాదు… మా డేడీ ఈ పెళ్ళికి ఒప్పుకోరు.”

“ఎందుకని?”

“సినిమా మనుషులంటే మాడేడీకి మంచి అభిప్రాయం లేదు. వాళ్ళు నిముషానికొకసారి రంగులు మారుస్తారంటారు.”

“నేనిప్పుడు హితేంద్ర చాలా మంచివాడు – అందరిలాంటి వాడు కాదని చెప్పాలా?”

“అక్కర్లేదు. అతని గురించి నీకేం అభిప్రాయముందో నాకు చెప్పు చాలు!”

సాగర్ నిరాశగా నవ్వాడు.

“నీకంటూ అతనిమీద సదభిప్రాయం కల్గేక ఇతరులు చెప్పింది వినాలనిపిస్తుందా? అయినా అతని గురించి నాకేం తెలుసని చెబుతాను. మనుషుల మంచి చెడ్డలు నిర్ణయించి బహిర్గతం చేసేది కాలమొక్కటే!”

“అయితే డేడీకి నా ప్రేమ గురించి చెబుతావా?”

“నువ్వు నా స్నేహితురాలివి. తప్పకుండా చెబుతాను.”

“థాంక్యూ సాగర్!” అంది నిశాంత లేచి నిలబడుతూ. వెనుక ఘోషిస్తున్న సముద్రం కన్నా విశాలమైన దుఃఖ వాహినిని గుండెలో మోస్తూ అతను తన వెనుకే అడుగులేస్తున్న సంగతి నిశాంతకెంత మాత్రమూ తెలియదు.

 

*****

 

సాగర్ చెప్పిన సంగతి విని మ్రాన్పడిపోయేడు నవనీతరావు. కళ్ళలో దుఃఖం సుడులు తిరిగింది.

“నా కూతురు చాలా తెలివైందని గర్వపడ్డాను. కాని… ఇంత తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు” అన్నాడు బాధగా.

“ఎందుకంత సీరియస్సవుతారు. హితేంద్ర కూడ చెడ్డవాడు కాదు. పైగా ఇప్పుడొక పాపులర్ సింగర్!” అని నచ్చచెప్పబోయేడు సాగర్.

నవనీతరావు పరిహాసంగా నవ్వేడు.

ఆ నవ్వు కూడ గుండెని కదిలించి కన్నీళ్ళే తెప్పించింది.

“నాయనా, ఎప్పుడో చిన్నప్పుడు శ్రీనాథుడు రాసిన శృంగార నైషధం చదివేను. అందులో నలోపాఖ్యానంలో నలుడి అవతారమెత్తేవు నువ్వు. ప్రేమించిన దమయంతిని దిక్పాలులకి కట్టబెట్టాలని రాయబారం చేస్తాడతను. వద్దు నాయనా! ఇంత దరిద్రపు పాత్ర నువ్వు వహించకు.” అన్నాడు వణుకుతున్న కంఠస్వరంతో.

సాగర్ తల దించుకున్నాడు. “ఇందులో నిశాంత తప్పు లేదు. నేను ముందుగా చెప్పలేకపోయేను. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మన గొప్పతనమేముంది! నా మాట విని దయచేసి నిశాంత వివాహం అతనితో జరిపించండి!” అన్నాడు.

“జరిపించను.” దాదాపు ఘర్జించినట్లే అన్నాడు నవనీతరావు ఆవేశంగా.

సాగర్ తెల్లబోయినట్లు చూశాడు.

“మనిషి జీవన విధానం మనిషి కేరెక్టర్ ని తెలియజేస్తుందయ్యా! నిన్నటి వరకు ఆత్మాభిమానం చంపుకొని చెయ్యి చాచి ముష్టెత్తుకున్నవాడికి ఆత్మగౌరవమెక్కడనుండొస్తుందయ్యా! అది చేసుకుంటే చేసుకోనివ్వు. నేను మాత్రం వాడి గత చరిత్ర తెలిసి కాళ్ళు కడిగి కన్యాదానం ఛస్తే చెయ్యను.” అన్నాడు నవనీతరావు బాధగా.

“ఇంకోసారి ఆలోచించండి.” అంటూ లేచొచ్చేసేడు.

“ఆలోచించడానికేముంది! అది పూర్తిగా మునిగిపోబోతోంది.” అంటూ గొణుక్కున్నాడు నవనీతరావు.

 

ఇంకా వుంది..

 

 

2 thoughts on “చీకటి మూసిన ఏకాంతం – 5

  1. చాలా బాగా సాగుతోందమ్మా సీరియల్. పాపం సాగర్ భంగపాటుకి‌ లోనవ్వడం బాధని కలిగించింది. అన్ని సంవత్సరాలుగా సాగర్ నిశాంతలు కలిసి ఉన్నాక సడన్ గా తను వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్తే బాధే కదా! తరువాత ఏమవుతుందోనని కుతూహలంగా ఉంది. నిశాంత హితేంద్రని చేసుకుంటుందా లేక సాగర్ ని చేసుకుంటుదా అనేది తెలియట్లేదు. వచ్చే నెల వరకూ ఆగక తప్పదు కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *