March 29, 2024

జాగేశ్వర మహదేవ్ మందిరం

రచన: నాగలక్ష్మి కర్రా

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం గురించి వెతికితే మూడు రాష్ట్రాలలో అదే పేరుతో వున్నట్లు తెలిసింది. మొదటది మహారాష్ట్రలో వున్న ఔండ నాగనాధ్, ద్వారక దగ్గర వున్న నాగనాధ్ ఉత్తరాఖంఢ్ లో వున్న జాగేశ్వర్ లో వున్న నాగనాధ్. ఆయా రాష్ట్రాలవారు మాదే ఒరిజనల్ నాగనాధ్ అని అంటున్నారు, సరే మూడింటినీ చూసేస్తే పోలా అని జాగేశ్వర్ బయలుదేరేం.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభజించేరు. బదరినాధ్, కేదార్ నాధ్, గంగోత్రి, యమునోత్రి, మొదలయిన పుణ్యక్షేత్రాలు ఘరేవాల్ ప్రాంతంలో వుండగా నైనిటాల్, రాణిఖేత్, జాగేశ్వర్, భాగేశ్వర్, పాతాళ భువనేశ్వర్ కుమావు ప్రాంతంలో వున్నాయి.
కుమావు ప్రాంతంలో వున్న జాగేశ్వర్ మహాదేవ్ గురించి తెలుసుకుందాం.
భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి జాగేశ్వర్ కి 400 కిమి.., ఢిల్లి నుంచి టూరిస్టు బస్సులు, ప్రైవేట్ టాక్సీలు బుక్ చేసుకోవచ్చు. రైలులో వెళ్లాలనుకొనేవారు ఢిల్లీ నుంచి కాఠ్ గోదాం వరకు రైలులో వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. కాఠ్ గోదాం నుంచి జాగేశ్వర్ సుమారు 125 కిమీ.. ఈ దూరం మాత్రం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోగలం. కాఠ్ గోదాం నుంచి అంటా ఘాట్ రోడ్డే కాబట్టి ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది.
ఢిల్లీ నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే మన ప్రయాణం ఉత్తరప్రదేశ్ లోని మీరట్, మొరాదాబాద్, రామనగర్ ( సమాజ్ వాది పార్టీలో వుండగా జయప్రద ఎం.పి గా వున్న నగరం ) ప్రాంతాల మీదుగా సాగి ఉత్తరాఖండ్ లోని హాల్ద్ వాని, కాఠ్ గోదాం మీదుగా సాగి ఆల్మొడా చేరుతాం. కాఠ్ గోదాం దాటిన తరువాత భోజన వసతులకు అల్మొడాలో మాత్రమే అనుకూలంగా వుంటుంది. కాఠ్ గోదాం నుంచి అంటా ఘాట్ రోడ్డు అవటం వల్ల , రోడ్డు వెడల్పు తక్కువ, కొండ చరియలు విరిగి పడ్డం వల్ల ప్రయాణానికి అంతరాయం కలిగిస్తూ 125 కిమీ.. సుమారు ఆరు యేడు గంటల సమయం పడుతుంది.
ఆల్మోడా దగ్గర పిత్తొరాఘఢ్ వెళ్ళే హైవే మీద సుమారు 14 కిమీ.. వెళ్ళిన తరువాత చితై అనే వూరు వొచ్చింది. యీ కొండ ప్రాంతాలలో ఊరులన్నీ రోడ్డుకి ఆనుకొని వుంటాయి. వూరు అంటే వేళ్ళ మీద లెఖ్ఖ పెట్టగలినన్ని ఇళ్ళు నిత్యావుసర వస్తువుల దుకాణాలు ఒకటోరెండో.అదీ వూరు.బట్టల షాపు, టీ బడ్డి వుంటే అది టౌను.ఆ వూర్లో రోడ్డుకి యిరువైపులా చిన్నచిన్న షాప్స్ అందులో అమ్మే వస్తువలు మనని ఆకట్టుకుంటాయి. అవి గంటలు, కోవెలలో కట్టే లాంటివి అతిచిన్న సైజు నుంచి అతి పెద్ద సైజు వరకు పెట్టి అమ్ముతున్నారు. కుతూహలం ఆపుకోలేక కారు రోడ్డుపక్కన ఆపి విషయం అడిగితే వాళ్లు చెప్పినదేమిటంటే అక్కడే చిన్న గుట్ట మీద వున్న అమ్మవారిని చైతై దేవి, గోలు దేవి అని అంటారని ఈ అమ్మవారికి మొక్కుబడులు యీ గంటల రూపంలో తీర్చుకుంటారుట భక్తులు, కాబట్టి యీ దేవిని గంటా దేవి అని అంటారని చెప్పేరు. అది వినగానే మేము కూడా అమ్మవారిని దర్శించుకోడానికి వెళ్లేం. ప్రవేశద్వారం నుంచి మెట్లు వుంటాయి,మెట్లుకి రెండువైపులా కొన్నివేల లక్షకి చేరేయో చిన్న పెద్ద గంటలు వేలాడ దీసి వున్నాయి. మండపం చుట్టూరా యేవేవో రాసిన చిన్న పెద్ద కాయితాల గుత్తులు వేలాడదీసి వున్నాయి. అవి అన్నీ న్యాయంకోసం భక్తులు పెట్టుకున్న ఆర్జీలుట. కోర్టు లో సాక్షాధారాలు న్యాయం వైపు లేక అన్యాయం జరిగిన వారు, న్యాయం కోసం కోర్టు వరకు వెళ్ళలేని వారు యిక్కడ తమకు జరిగిన అన్యాయం గురించి వొక కాయితం మీద రాసి కోవెలలో వ్రేలాడ దీస్తారు. అలాంటి వారికి న్యాయం చేస్తుందిట అమ్మవారు. పన్నెండు సంవత్సరాలు క్రిందట మేం మొదటిమారు యీ గోలు దేవిని దర్శించు కున్నప్పుడు యిది ఆలా చిన్న మందిరం. ఏటికేడాది ఈ కోవెలలో మార్పులు చోటు చేసుకుంటూ యిప్పడు ఆ కోవేలకి అర కిమీ ముందు నుంచి పూజా ద్రవ్యాలు, గంటలు అమ్మే దుకాణాలు మొదలవుతున్నాయి.గంటల సంఖ్య కుడా బాగా పెరిగిపోయాయి. అలాగే అర్జీలు కుడా గణనీయంగా పెరిగేయి. దీన్ని బట్టి చైతై దేవి మీద భక్తుల నమ్మకం రోజు రోజు పెరుగుతోందని మనకు తెలుస్తోంది.


గోలు దేవిని దర్శించు కొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేము. మరో 20 కిమీ.. వెళ్లిన తరువాత రోడ్డుకి కుడివైపున జటగంగ వొడ్డున మందిర సముహం కనిపిస్తుంది. యిక్కడ కుబేరుని మందిరం, శివుని కోవెల యింకా చిన్న చిన్న మందిరాలు వున్నాయి. యీ దేవాలయ సమూహాలు అర్కియాలజి వారు సంరక్షిస్తున్నారు. దీనిని బాల జాగేశ్వర్ మందిరం అంటారు.
బాల జాగేశ్వర మందిరాన్ని చూసుకొని జాగేశ్వర్ బయలుదేరేం. మూడు కిలోమీటర్ల ప్రయాణానంతరం జాగేశ్వర్ చేరేం. అప్పట్లో జాగేశ్వర్ లో కుమావు వికాస మండల వారి గెస్ట్ హౌసు మాత్రమే వుండేది. వూరు మొదలులోనే గెస్ట్ హౌసు వుండడంతో ముందుగా రూము తీసుకొని ఫ్రెష్ అయి మందిరం వైపు వెళ్లేం. ఊరంతా కలిపి పది గడపల కంటే లేవు. గెస్ట్ హౌస్ కి పక్కగా మ్యూజియం వుంది అందులో చాలా పురాతనమైన రాతి విగ్రహాలు వున్నాయి. అక్కడ ఓ యూరోపియన్ జంట కలిసేరు, అక్కడ వున్న ఛాముండి విగ్రహం చూపించి యెవరు యేమిటి అని అడిగేరు, వచ్చీరాని యింగ్లీషులో పార్వతీ దేవి అవతారం అని చెప్తే కాళి, దుర్గాల గురించి తెలుసు కాని ఛాముండి గురించి తెలియదు అంటే ఛండ, ముండ అనే రాక్షసులను చంపడం మొదలయిన కథ వారికి వినిపించేను. మన హిందువులలో చాలామందికి పురాణాలమీద అవగాహన లేదు, ఆ శక్తిలేదు, వారి కుతూహలానికి జోహారు అనకుండా వుండలేకపోయేను. అయిదుకి మ్యూజియం మూసేస్తారు.
ఈ గ్రామం యిక్కడి మందిరం పేరు మీదనే గుర్తింపబడుతోంది. ఆల్మోడా నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరాన సుమారు 1870 మీటర్ల యెత్తులో దేవదారు వృక్షాల నడుమ , నందిని, సురభి అనే సెలయేరులు సంగమించిన పుణ్యప్రదేశం యిది.
ఆర్కియోలజికల్ సర్వే వారిచే సంరక్షింప పడుతున్న మందిర సముదాయం. సుమారు 124 చిన్న పెద్ద మందిరాలు వున్నాయి. ఇవి సుమారు తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యలో నిర్మించినట్లు అంచనా. దండేశ్వరమందిరం, ఛండి మందిరం, జాగేశ్వర మందిరం, కుబేర మందిరం, పుష్టి దేవి మందిరం, మృత్యుంజయ మహదేవ మందిరం, నందాదేవి, నవ దుర్గ, నవ గ్రహ, సూర్య మొదలైన మందిరాలు వున్నాయి. వాటిలో అతి పురాతనమైనది మృత్యుంజ మందిరం, దండేశ్వర మందిరం అతిపెద్దది. ప్రాంగణమంతా రాతి పలకలు పరిచి వుంటాయి. చాలా చల్లగా వుంటుంది సూర్యాస్తమయం అవగానే శయన హారతి యిచ్చి మందిరం మూసేస్తారు. ఈ మందిరాలు పాండవులచే నిర్మింపబడ్డవి.
అన్ని ఉత్తరభారతదేశ మందిరాలలో వున్నట్లు యిక్కడకూడా శివలింగాన్ని తాకి పూజలు చేసుకోవచ్చు. స్థలపురాణం చెప్పుకొనే ముందర మందిరం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం.
జాగేశ్వర మందిరం శంకరాచార్యులవారిచే గుర్తింపబడ్డ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం. ఇక్కడ పూజారులు కూడా శంకరాచార్యులచే నియమింపబడ్డ దక్షిణాదికి చెందిన పండితులే. అయితే కాలక్రమేణా యిక్కడి స్త్రీలను వివాహమాడి వారి భాషను కూడా మరచిపోయేరు, కాని మనం అడిగితే వారి పూర్వీకులు యే ప్రాంతానికి చెందినవారో చెప్పి సరదా పడతారు. జనవరి ఫిబ్రవరిలలో హిమపాతం జరుగుతుంది. మిగతా కాలం అతిచల్లగా వుంటుంది.
పాండవులు మృత్యుంజయుని రూపంలో శివుని ప్రార్ధించుకొని మహాభారత యుధ్దంలో మరణం లేకుండా వరం పొందేరుట.
జాగేశ్వరమహదేవ్ మందిరం కాస్త వెనుకవైపు వుంటుంది. ముందుగా యెడమవైపు వచ్చేది మృత్యంజయ మందిరం, ఇక్కడ చేసుకునే పూజ ధాన్యం ఆయుష్యు పెంచుతుందని నమ్మకం. ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగువారు యిక్కడ మృత్యుంజయ హోమాలు చేయించుకోడం చూసేం. కాలసర్పదోషం వున్నవారు యిక్కడ హోమం చేసుకుంటే దోషనివారణ జరుగుతుందని చెప్పేరు.

తరవాత దండేశ్వర మహదేవ్ మందిరం చివరగా కుడివైపున నాగేశం మందిరాలు వున్నాయి. నాగేశం మందిరం పైన పెద్ద రాతితో చెక్కిన పాము విగ్రహం వుంటుంది. బయట ద్వారపాలకులుగా నంది, స్కంది కాపలా కాస్తూ వున్నారు. లోపల మంటపంలో, మహంతు కూర్చొనే గద్ది వుంది . అక్కడ అఖండదీపం, శివలింగం వుంటాయి. శివలింగానికి వెనుకవైపు గోడకు అమ్మవారి విగ్రహం వుంటాయి. పక్కగా మంచం పరుపు వుంటాయి. ఇక్కడ శివలింగం రెండు ముఖాలు వున్నట్లుగా వుంటుంది. దీనిని అర్ధనారీశ్వర లింగం అంటారు, పెద్ద భాగం శివుడని, చిన్న భాగం పార్వతి అని అంటారు. అలాగే లింగం చేత్తో కదిపితే కదులుతూ వుంటుంది. ఇక్కడ శివుడు యెప్పుడూ జాగ్రదావస్థలో వుంటాడట, సాధారణంగా మందిరాలలో దేవుడు హారతి సమయాలలో మాత్రమే వుంటాడని, యిక్కడ మాత్రం యెప్పుడూ వుంటాడని అంటారు. అందుకే యీ శివుడిని జాగేశ్వరుడు అని పిలుస్తారు.
రాత్రి శయన హారతికి ముందు పక్కన వున్న పడకను చక్కగా అమర్చి పూజారులు తలుపులు మూసేస్తారు, మరునాడు తలుపులు తెరిచేసరికి పడక పైన వేసిన దుప్పటి శివుడు శయనించేడు అనడానికి నిదర్శనంగా చెదరి వుంటుందట యిది పూజారులు చెప్పిన విషయం.
ప్రతి సంవత్సరం శివరాత్రికి, శ్రావణ మాసంలోనూ యాత్ర జరుగుతుంది. అప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మిగతా సమయాలలో చాలా నిర్మానుష్యంగా వుంటుంది.
మందిర ప్రాంగణం లో పుష్టిదేవి మందిరం చూడదగ్గది.

స్థలపురాణం ప్రకారం విష్ణుమూర్తిచే స్థాపించబడ్డ జ్యోతిర్లింగమైన నాగేశం ని వెతుకుతూ శంకరాచార్యులవారు వచ్చి యీ ప్రదేశాన్ని గుర్తించి నాగనాథ్ లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసి తనకూడా వచ్చిన శిష్యులను పూజారులుగా నియమించేరు. కాలాంతరంలో చంద్ర వంశానికి చెందిన కతూరియా రాజులు మరమ్మత్తులు చేయించేరు. మరో కథనం ప్రకారం శివుడు యీ ప్రదేశానికి వచ్చి తపస్సమాధిలో వుండగా రాక్షసులు ధ్యాన భంగం చేస్తూవుంటారు. శివుడు మూడు నేత్రాలుకలిగిన ‘ శామ్ ‘ అనే గణాన్ని రాక్షస సంహారమునకు పంపుతాడు, శామ్ రాక్షస సంహారం గావించి అవతారం చాలిస్తాడు. ఈ ప్రదేశం జాగేశ్వర మహదేవ మందిరానికి 2 కిలోమీటర్ల దూరంలో వున్న ‘ కోటి లింగాలు ‘ అనే ప్రదేశం లో జరిగినట్లు చెప్తారు. ఇది జటగంగ శామ్ గంగల పవిత్ర సంగమ ప్రాంతం కావడం మరో విశేషం. శంకరాచార్యులవారు యిక్కడ నాగేశం మందిరాన్ని నిర్మించ దలచేరట, మందిరం సగం నిర్మించిన తర్వాత కూలిపోయిందట, ఇప్పటికీ అక్కడ పడి వున్న శిథిలాలను చూడొచ్చు. స్థానికుల నమ్మకం ప్రకారం కోటిలింగాలలో శివుడు యిప్పటికీ తపస్సమాధిలో వున్నట్లు కలియుగంలో తన 28 వ అవతారంగా ‘ లకులిష ‘ అనే పేరుతో మానవులను కలిప్రభావమునుండి రక్షించడానికి వస్తాడని, ఆ అవతారంలో శివుడు తన జడలలో కర్రతో చేసిన సుత్తి ఆకారాన్ని బంధించి తిరుగుతూ వస్తాడని కోటిలింగాల ప్రాంతంలో అతనికి మందిర నిర్మాణం చెయ్యమని శివుడు కోరినట్లుగా చెప్తారు, సోమనాధ్ ప్రాంతంలో వున్న గుజరాతీలలో కూడా యీ కథ గురించి నమ్మకం వుంది, ఆనమ్మకంతోనే కొంతమంది గుజరాతీలు 3, 4 తరాలకు పూర్వం యిక్కడకు వలస వచ్చేరు. శివుడు కోరిన ప్రకారం మందిరనిర్మాణం చేసేరట.
స్థానికల మరో కథనం ప్రకారం ‘ లకులిష ‘ అవతారం ఉద్భవించిందని బాలునిగా వున్నప్పుడు బాల జాగేశ్వర లోని మందిర సముదాయంలో సంచరించే వాడని మధ్య వయసువరకు జాగేశ్వర్ లోనూ ముసలి వయసులో వృద్ద జాగేశ్వర్ లో గడిపి అవతారం చాలించేడని, అతని శిష్యులను ‘ లకులిషులు ‘ అంటారని చెప్తారు. వీరు విభూతి ధారులై జడలతో మనకి యీ ప్రాంతాలలో కనిపిస్తారు.

వృద్ద జాగేశ్వర్ చిన్న గుట్టమీద వున్న చిన్న మందిరం, లోపల శివలింగం మందిరం పక్కనే పూజారి యిల్లు, రోజూ నైవేద్యం పెట్టి ఆ సమయంలో మందిరంలో భక్తులకు ప్రసాదం యిస్తూ వుంటారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం యేమిటంటే దక్షిణ కోసం పూజారులు పీడించకపోవడం, ఈ మందిరాలు యే ట్రస్టు ఆధ్వర్యంలోనూ లేవు, భుక్తికి యెలా అనే ప్రశ్నకు సమాధానం శివుడుని నమ్ముకున్నవారికి భుక్తి శివుడే యిస్తాడు అని సమాధానమిచ్చేరు.
సాయంత్రం ఒక దర్శనం, పొద్దున్న మరో దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయేం.

1 thought on “జాగేశ్వర మహదేవ్ మందిరం

  1. 2011 డిసెంబర్ లో మేము హిమాలయ దర్శన్ వెళ్లాము. జాగేశ్వర మందిరం వెళ్లాము.చాలా బాగుంటుంది.నైనిటాల్,జాగెశ్వర్,పాతాళభువ నేశ్వర్,రాణీకేత్,భాగేశ్వర్,బైద్యానాధ్,వెళ్లాము.చూడ వలసిన పుణ్య క్షేత్రాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *