April 18, 2024

సంజయుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో ఆ రాజును నడిపించే మంత్రి అంత ముఖ్యము చాలా మంది రాజులు పేరు ప్రఖ్యాతులు వాళ్ళ మంత్రుల వల్లే వచ్చినాయి ఉదాహరణకు శ్రీ కృష్ణ దేవ రాయలు మంత్రి తిమ్మరుసు ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు వంటి వారు. రాజులు యుద్దాలు చేసి రాజ్య విస్తరణలో ఉంటె మంత్రులు రాజులకు మంచి సలహాలు ఇస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా రాజు పాలించటానికి సహకరించేవారు పాలనలో మంత్రి పాత్ర చాలా కీలకమైనది అటువంటి మంత్రులలో మహాభారత కాలంనాటి ధృతరాష్ట్రుని మంత్రి, రథసారధి అయిన సంజయుని గురించి తెలుసుకుందాము.
మహాభారతము లో సంజయుని ప్రస్తావన ముఖ్యముగా రెండు సందర్భాలలో వస్తుంది మొదటిసారిగా కౌరవుల తరుఫున పాండవుల అజ్ఞాత వాసం ముగిసినాక వారి వద్దకు రాయబారిగా వెళతాడు అంటే కృష్ణుడి రాయభారాని కన్నా ముందు అన్నమాట సంజయుడు ఎన్నడూ తన కుటుంబం గురించి గానీ, బంధువర్గం గురించిగానీ, తన సొంత పనుల గురించి గానీ ఆలోచించినట్లుగా వ్యాసమహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎల్లకాలాలందూ తన రాజు ఆయన కుమారులు, రాజ్యం, రాజసేవను మాత్రమే ఆలోచించే వాడు. ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారానికి పంపించినపుడు, శుష్కప్రియులు, శూన్యహస్తములుగా కార్యాన్ని నడిపించుకొని రమ్మని అభ్యర్థించాడు. సామ దాన దండోపాయాలను ఉపయోగించి వారిని యుద్ధ విముఖులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే చివరకు సంజయ రాయబారం శుష్కప్రియాలు శూన్యహస్తాలు మిగిల్చిందన్నది వాస్తవం. అదేవిధంగా అక్షరాలా అమలు జరిపి తన స్వామి భక్తిని ప్రకటించు కొన్న విశ్వాస పాత్రుడు సంజయుడు

సంజయుడు విచక్షణా జ్ఞాని గనుకే వేదవ్యాసుడు సంజయునికి కదన రంగంలో జరిగే పరిణామాలను చూడగలిగే నేర్పునే కాదు వీరుల మనస్సుల్లో రగిలే జ్వాలలను వారి మనసుల రీతిని కూడా చూడగల నైపుణ్య శక్తినిచ్చాడు. దానివల్లనే సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర మహా యుద్ధంలో జరిగే యుద్ధరీతిని అక్కడున్న వారి మనస్థితులని కూడా విపులంగా చెప్పాడు యుద్ధంలో ఒక్కో రోజు ధృతరాష్ట్రునికి తన నూరుగురు కుమారులు భీముని చేతిలో ఎలా చనిపోయారో ఆయనకు వివరించాల్సి వస్తుంది. ఈ కష్ట సమయంలో సంజయుడే ధృతరాష్ట్రునికి సాంత్వన చేకూరుస్తాడు ఇంకో గొప్ప విశేషము ఏమిటి అంటే శ్రీ కృష్ణ భగవానుడు యుద్ధభూమిలో అర్జునికి గీత భోధిస్తు న్నప్పుడు అర్జునుడితో పాటు భగవానుడి దివ్య స్వరూపాన్ని చూచే భాగ్యము పొందినవాడు సంజయుడొక్కడే.
మంత్రిగా సంజయునికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి యితడు జాతిచేత సూతుడు బుద్దిమంతుడు, నీతివేత్త, సత్యవాది నిజము చెప్పటంలో ఏమాత్రము వెరవని వాడు మిక్కిలి ప్రభుభక్తి కలిగినవాడు రాజు యొక్క రాజ్యము యొక్క హితము కోరుచు చాలా సందర్భాలలో నిర్భయముగా కొన్ని సందర్భాలలో కఠువుగాను మాట్లాడేవాడు. ఈయనకు ఉన్న ధర్మ బుద్ధి వలన వేద వ్యాసునికి శ్రీ కృష్ణ పరమాత్ముని కృపకు పాత్రుడైనాడు. అలాగే అర్జుని యందు శ్రీ కృష్ణుని యందు ఇతని ప్రీతి మెండు. దుర్యోధనుని అకృత్యాలను ఖండించే వాడు దుర్యోధనుడి అనుచితప్రవర్తన ను నిర్మొహమాటం గా విభేదిస్తూ ధృతరాష్టునితో,
“మహారాజా మీకు వంశ నాశనముతప్పదు ఏ పాపమురుగని ప్రజలను ఎందుకు నాశనము చేస్తావు ద్రౌపదిని వారు నిండు కొలువులు లో అవమానించారు వినాశ కాలే విపరీత బుద్ధి “, అని దృతరాష్రునితో అంటాడు. దుర్యోధనుడు తప్ప అన్యులెవ్వరు ఇటువంటి నీచమైన పని చేయజాలరు అని చక్కగా మందలిస్తాడు మహాభారతం లో అధర్మ పక్షంలో ఉంటూ తమ పక్షం వారు అధర్మం చేస్తున్నారని అందువల్ల వినాశనం తప్పదని తమవారికే చెప్పగలిగిన ధైర్యశాలి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామములో ప్రాణాలతో మిగిలినవాళ్ళలో ఇతనొకడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ధర్మం తప్పకుండా పనులు చేస్తూ అసత్యాన్ని పలకకుండా ఉండడమే నేర్పరితనం. ఆ నేర్పరితనంలో దిట్ట సంజయుడు.
కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజున సాత్యకి కంటబడిన సంజయుని సంహరించబోగా వ్యాస మహర్షి ఏతెంచి, అతడు పుణ్యాత్ముడు, వధార్హుడు కాడని విడిపించాడు. కొడుకుల్ని కోల్పోయిన తరువాత గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళాడు. ఆలనపాలనా చూసాడు. అయితే ఒకరోజు అడవిని కార్చిచ్చు కాల్చేస్తున్న సమయంలో గాంధారీ ధృతరాష్ట్రుని బలవంతంతో ప్రమాదం నుండి తప్పించు కొని వేరే దారిన వెళ్ళి చివరకు హిమాలయాలకు చేరుకున్నాడు. భారతంలో ప్రత్యేకంగా కనిపించిన సంజయుడు అందరికీ సర్వదా స్మరణీయుడు. ధర్మరహస్య బోధనలో, సహజ చాతుర్యంలో అందరికీ ఆదర్శ ప్రాయుడు

1 thought on “సంజయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *