March 29, 2024

‘ఉషోదయం’

రచన: నండూరి సుందరీ నాగమణి

 

“స్వాతంత్ర్యమె మా జన్మహక్కనీ చాటండీ!”రేడియో లో వినిపిస్తున్న ఘంటసాల వారి దేశభక్తి గేయాన్ని వింటూ మేను పులకించిపోతుండగా రెండు చేతులూ జోడించి కళ్ళుమూసుకుని ఒక ధ్యానంలో ఉండిపోయాడు గిరిధారి.

“అంకుల్, అంకుల్!”తలుపు కొట్టటంతో ధ్యాన భంగమై లేచి తలుపు తీసాడు. ఎదురుగా ఎదురింటి వారి మనవరాలు కుముద.ఆ పిల్ల వెనకాలే మరో పిల్లవాడు…

“మేమంతా ఆడుకుంటూ ఉంటే బంతి కిటికీలోంచిమీ ఇంట్లో పడింది…” అంది సోఫా క్రింద చూపిస్తూ. తీసుకోమన్నట్టు సైగ చేసాడు గిరి.

ఆ పాప అది తీసుకుని బయటకు వెళుతూ ఉండగా అడిగాడు… “ఈరోజు ఆగస్టు పదిహేను కదా, నువ్వు స్కూల్ కి వెళ్ళలేదా?”

“లేదంకుల్, మన కాలనీలో కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది కదా…ఇండిపెండెన్స్ డే కి, రిపబ్లిక్ డే కీ ఉంటుంది.ఓ, జాన్యువరి ట్వంటీ సిక్స్త్ కి మీరు ఇక్కడ లేరు కదా?” అంది ఏదో అర్థమైనట్టు.

“అవునమ్మా… గణతంత్ర దినోత్సవానికి నేనింకా ఇక్కడికి రాలేదు. మరిఎనిమిది దాటింది…ఇంకా మొదలుపెట్టలేదు? బాగా ఆలస్యం అవుతుందా ?

“కాలనీ సెక్రెటరీ గారు వెళ్లి ఎమ్మెల్యే గార్ని తీసుకురావాలట, మా డాడీ చెప్పారు… నేను వెళతాను అంకుల్, బై…

గిరిధారి మనసు బాధగా మూల్గింది. ఒకప్పుడు తానే సంవత్సరానికి రెండుసార్లు గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికీతన ఇంటి వాకిట్లో పతాకవందనం చేసుకునేవాడు. పిల్లలూ తానూ కలిసి మూడు రంగుల కాగితాలతో తోరణాలు కట్టేవారు. పెరట్లో పూసిన అందమైన రంగు రంగుల పూలన్నీ జెండాలో చుట్టి ఉంచేది అలివేలు. ఉదయం ఎనిమిదికల్లా అందరూ తలంట్ల స్నానాలు చేసి, కొత్త బట్టలు కట్టుకుని తయారై ఉండేవారు. పిల్లల హర్షధ్వానాల మధ్య తానుస్తంభానికి కట్టి ఉంచిన జాతీయపతాకం తాడులాగి, ఆవిష్కరించేవాడు. ఒక్కసారిగా పూవులన్నీ జారి అంతెత్తునుంచి భరతభూమికి అభిషేకం చేసేవి. జాతీయపతాకం ఠీవిగా తలెత్తుకుని వినువీధిలో ఆనందంగా ఎగిరేది. పతాక వందనానికి చుట్టు ప్రక్కల ఇరుగుపొరుగు వారు కూడా వచ్చే వారు. పతాకావిష్కరణ తరువాత, పిల్లల చేత దేశభక్తిగీతాలాపన చేయిచేవాడు. ఆ తరువాతఅందరికీ స్వీట్లు పంచేవారు. ఆ కార్యక్రమమంతా అయ్యాకే తాము ఉదయపు ఫలహారం చేసేవారు.

గతాన్ని తలచుకున్న గిరి కళ్ళలో నీళ్ళు నిలిచాయి. ‘ఏవి తల్లీ, నిరుడు కురుసిన హిమ సమూహములు?’ ఎక్కడ ఆ వైభవం? ఏదీ ఆ పండుగ వాతావరణం? ఈరోజు జాతీయ పండుగలన్నీ ఒక సెలవు దినంగా మాత్రమే పరిగణించబడటం శోచనీయం. ఆలోచిస్తున్న గిరిధారికి ఎదురుగా ఆన్ చేసి ఉన్న టీవీలో రాజధాని నగరంలో జరగబోతున్న పతాకావిష్కరణ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం రాబోతున్నదన్న ప్రకటనకనిపించి, సర్దుకుని కూర్చున్నాడు, పతాకవందనానికై.

ఆ విరామంలో ప్రసారమైన ‘మిలే సుర్ మేరా తుమ్హారా…’ అనే దేశభక్తి గేయపులఘుచిత్రంలో నటించిన కళాకారుల హావభావాలు, వారిలో పొంగి పొరలే దేశభక్తిఅతనిని ముగ్దుడిని చేసాయి. ఆ లఘుచిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదతనికి. మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. లఘుచిత్ర ప్రదర్శన అనంతరం మరి కొద్ది నిమిషాల తదుపరి పతాకావిష్కరణ కార్యక్రమం మొదలైంది.

***

‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి!’ ఉత్తేజపరచే ఆదేవులపల్లి గీతాన్ని వింటూ, చేతిలో తేనీటి కప్పుతో వరండాలో కూర్చున్నాడు గిరిధారి.

“ఏరా గిరీ… ఏం చేస్తున్నావు?’ అంటూ వచ్చిన మాధవరావు పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

“నాకేం రా? నేను బాగానే ఉన్నాను… ఉండు నీకూ టీ తెస్తాను…” అంటూ లేవబోతుంటే వారించి,

“నేనిప్పుడే తాగి వస్తున్నాలే. నువ్వు బాగుంటే, ఆ ముఖం ఎందుకురా అంత నీరసంగా ఉంది? జ్వరం వచ్చి తగ్గిందట కదా… పనిమనిషి చెప్పింది. నేను ఊరినుంచి రాత్రే వచ్చాను. అయినా అయినవాళ్ళు ఉండీ నీకీ ఖర్మమేమిటిరా? ఒంటరిగా ఉండటం ఎందుకు ఈ వయసులో? పిల్లలు లేరా?” కోప్పడ్డాడు మాధవరావు.

పిల్లల మాట వినగానే గిరి ముఖం జేవురించింది.

“నాకెవ్వరూ లేరు మాధవా… నా అనుకున్న మనుషులు ఇద్దరే. ఒకరు నా భార్య… పైకి వెళ్ళిపోయింది. రెండోది నువ్వే… నేను అడిగిన వెంటనే, మీ వీధిలోనే ఈ ఇల్లు చూపించి, స్నేహ ధర్మం నిలుపుకున్నావు. రెండురోజులకోసారి వచ్చిపోతున్నావు. ఇంతకన్నా ఏం కావాలి? నాకు పుట్టిన పిల్లలు నా వాళ్ళు కానేకాదు… ఇంకోసారి వాళ్ళ మాట ఎత్తకు…”

“అవేం మాటలురా?గాంధీ, సుభాష్, ఝాన్సీ ఎంత బాధ పడుతున్నారో తెలుసా?”

“పడతారు రా… ఈ వయసులో తండ్రి వాళ్ళ దగ్గర ఉండకుండా వేరేగా ఉంటున్నాడని లోకం ప్రశ్నిస్తుందని బాధపడతారుఅంతే… వదిలేసెయ్…” కణతలు రుద్దుకున్నాడు మనసులో ఎగసి పడే బాధావీచికలను అదుముకుంటూ.

“మరీ చాదస్తాలకు పోకు గిరీ… పిల్లలు చక్కగా చదువుకుని, మంచి సంపాదనా పరులయ్యారు. నీవు అక్కడ ఉండటమే ఉత్తమం. నా మాట విను… మరీ అంతంత పంతాలకు పోకురా… సరే, మార్కెట్ కి వెళుతూ ఇలా వచ్చాను. నీకేమైనా కావాలా?”

“వద్దురా, కూరలన్నీ అలాగే ఉన్నాయి.”

“సరేరా, మరి వస్తాను…” వెళ్ళిపోయాడు మాధవరావు.

గిరిధారి మనసంతా ముళ్ళకంపలా తయారైంది. పిల్లలు గుర్తు వస్తే చాలు,గుండె చెరువు అవుతోంది…

***

పెద్ద కొడుకు గాంధీఎంబీయే చదివి ఒక పెద్ద కంపెనీలో హెచ్చార్ మేనేజర్ గా స్థిరపడ్డాడు. రెండోవాడు సుభాష్ ఇంజినీరింగ్ చదివి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక ఆఖరు సంతానం అయిన ఝాన్సీని ఎంబీబియస్ చదివించాడు గిరి. ఆమె గైనకాలజిస్ట్ గా స్థిరపడింది. ముగ్గురు పిల్లలూ మంచి ముత్యాలని మురిసిపోయేవాడు గిరి. అలివేలు ఆకస్మిక మరణంతో తప్పనిసరిగా కొడుకుల దగ్గర ఉండటానికి సిద్ధమయ్యాడు.

తన త్రీ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో ఒక రూమ్ తండ్రికి కేటాయించాడు గాంధీ. ఉదయం వెళితే రాత్రి పది దాటాకే ఇంటికి వచ్చేవాడు. కంపెనీలో తనది కీలక పాత్ర కావటంతో ఉద్యోగబాధ్యతలు చాలా ఎక్కువ అతనికి. అతని భార్య రమాదేవి గృహిణి కావటం వలన గిరికిపెద్దగా సమస్య లేకపోయేది. ఎక్కువగా మాట్లాడకపోయినా,మామగారికిసమయానికి అన్నీ అమర్చి పెట్టేది ఆమె.

రోజులిలా గడచిపోతూ ఉంటే ఒకరోజు కొడుకు వచ్చేవరకూ మేలుకుని ఉన్నాడు గిరి. సాధారణంగా మందులు వేసుకుని రాత్రి తొమ్మిదిన్నరకల్లా పడుకుంటాడు.

రమ తలుపు తీయగానే లోపలికి వచ్చిన గాంధీ తండ్రి గదివైపు చూస్తూ, “నాన్న పడుకున్నారుగా?” అన్నాడు. ముద్దగా వచ్చిన అతని మాట తీరూ, గాలిలో వ్యాపించిన వాసనా గిరిని విస్మయపరిచాయి. మద్యం!తన కొడుకు మద్యం సేవించి వచ్చాడు… గాంధీ అని, తానెంతోప్రేమతో పేరుపెట్టుకున్న తన తనయుడు ఈరోజు బ్రాందీ తాగాడు… ఇలా ఎన్ని సార్లు జరిగిందో తెలియదు కానీ… తానిప్పుడే చూస్తున్నాడు… అడుగుల చప్పుడు విని నిద్రపోతున్నట్టుగా కళ్ళుమూసుకున్నాడు గిరి.

తండ్రి గదిలోకి తొంగి చూసి, నిశ్చింతగా వెనుతిరిగిన గాంధీ, “ఈరోజు మరీ మొహమాట పెట్టేసారు పార్టీలు… బయట పనిచేస్తున్నాక ఇవన్నీ తప్పదు కదా, ఈయనకేమో అర్థం కాదు… మడికట్టుకుని కూర్చోమంటాడు…ఇదిగో ఈ డబ్బు లోపల పెట్టు…” అన్నాడు భార్యతో.

“ఇది ఎప్పటికైనా ప్రమాదమే కదండీ… ఆయనఆశయాలతో పెరిగారు మీరంతా… ఇప్పుడీ పనులేమిటి చెప్పండి. వారానికి రెండు సార్లు మీరిలాగే వస్తున్నారు. ఇది అలవాటుగా ముదిరిపోతే ఎన్ని సమస్యలు వస్తాయి? ఈరోజు సరే, ఎప్పటికైనా మామయ్య గారికి తెలియకుండా పోదు. మీరు బీరువాలో నింపుతున్న డబ్బు చూస్తుంటే తల తిరిగిపోతుంది… వద్దండీ, ఈ పాపపు డబ్బు మనకెందుకు? ఎవరి ఉసురు పోసుకోవటానికి? నా మాట వినండి… ఇకనైనా కంపెనీ మారండి… మీకు వచ్చే జీతం చాలు… మనకి పిల్లా, పాపా పుట్టలేదింకా… ఎలాగో సర్దుకుందాం. నేనూ ఉద్యోగంలో చేరతాను…” అనునయంగా చెప్పింది రమ.

“ఓహోహో మామకు తగ్గ కోడలు… ఈ ధర్మపన్నాలన్నీ ఎప్పుడూ చెప్పేవే కానీ, బాగా ఆకలేస్తోంది, అన్నం వడ్డించు…” అని వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు గాంధీ.

సన్నగా అయినా స్పష్టంగా వినిపించిన సంభాషణకు నిశ్చేష్టుడైన గిరి ఆ రాత్రి నిద్రకు దూరమే అయ్యాడు.

***

మరుసటి రోజు తండ్రీ కొడుకులకు పెద్ద వాగ్యుద్ధమే జరిగింది. గిరి, గాంధీని నిలదీయటంతో ఎదురుతిరిగాడతను.

ఈరోజుల్లో పై సంపాదన లేకుండా, లంచాలు తీసుకోకుండా, అప్పుడప్పుడూ మందు కొట్టకుండా ఉండటం అసాధ్యమని అంటాడు కొడుకు.

ఎన్నెన్నో ఆశయాలతో ఆదర్శాలతో పెంచి పెద్దచేస్తే, ఇలా చేయటం తల్లి భారతిని అవమానించటమే అని అంటాడు తండ్రి.

“గాంధీ, ఇకనైనా అన్నీ మానేయ్ నాయనా, అమ్మాయి చెప్పినట్టు, ఇది కాకపోతే మరొకటి. వేరే ఉద్యోగం చూసుకుందువులేరా తండ్రీ…” అని నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు గిరి.

“నాన్నా, నువ్వూ నీ ఛాందస భావాలూ!బయట ప్రపంచమంతా ఇలాగే ఉంది. కాలం మారిపోయింది. నీలాగా, అబద్ధాలు చెప్పకుండా, పరుల సొమ్ము ఆశించకుండా ఎవ్వరూ లేరు… సుభాష్, ఝాన్సీ ల గురించి తెలుసా నీకు? నేనన్నా అద్దె అపార్ట్మెంట్ లో ఉంటున్నా, తమ్ముడీమధ్యే హైటెక్ సిటీలో విల్లా బుక్ చేసాడు. దాన్ని బట్టి వాడి సంపాదన ఎంతో అర్థం చేసుకో. కేవలం నెల జీతంతో ఇవన్నీ సాధ్యమా చెప్పు?

ఇక నీ ముద్దుల కూతురు ఝాన్సీ, దాని భర్తాకలిసి పెట్టుకున్న నర్సింగ్ హోమ్ లో జరుగుతున్న సర్గోసీ వ్యాపారం గురించి నీకు తెలియదు. వాళ్ళ మీద నేరాలు మోపటం నా అభిమతం కాదు. ఇలా ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో బ్రతకగలం అని చెప్పటానికి అంటున్నాను. నేనీ కంపెనీలో ఉద్యోగం మానేయటానికి క్షణం చాలు. నా సీటు కోసం లక్షలు వెచ్చించటానికి సిద్ధంగాఉన్నారు అభ్యర్థులు. పైగా మరోచోట ఉద్యోగానికి ప్రయత్నిస్తే నాకు వెంటనే దొరుకుతుంది. కానీ ఈ వ్యవస్థ అన్ని చోట్లా ఇలాగే ఉంది.” చెప్పాడు గాంధీ.

“అలా అయితే, నువ్వసలు ఉద్యోగమే చేయకు. మన ఊరికి వెళ్ళిపోదాము. అక్కడ ఒకచిన్న స్కూలు పెట్టుకుందువు గాని…”

చిన్నపిల్లాడిని చూసినట్టు జాలిగా తండ్రివైపు చూసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు గాంధీ. ఆ రాత్రే తన బట్టలు సర్దుకుని స్నేహితుడు మాధవరావు ఇంటికి వెళ్ళిపోయాడు గిరి.

***

“ఏమిటి నాన్నా ఇది, అన్నయ్యతో దెబ్బలాడి, ఇలా వేరే వచ్చేయటం ఏమిటి? అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండటం ఏమిటి? మాకేం బాగాలేదు నాన్నా…” చెల్లెలు ఝాన్సీ తో కలసి వచ్చిన సుభాష్ అన్నాడు తండ్రితో.

“మరెక్కడికి రమ్మంటావు? నీ ఇంటికా? కొత్తగా నువ్వెళ్ళబోయే నీ విల్లాకా? నేను మీకు ఉగ్గుపాలతో రంగరించి పోసిన నీతిసూత్రాలు ఏమైపోయాయో అర్థం కావటం లేదురా… మీరు మారందే నేను రాను. అన్నీ వదిలేయండి… నా కొడుకులుగా నిలవండి… ప్లీజ్ నాన్నా… మనం భరతమాతకు ద్రోహం చేయకూడదురా. ప్రపంచమే ఇలా ఉందని మీరంటున్నారు. కనీసం మీరు… మీరు మారండిరా… మీ పక్కవాడిని మార్చండి. లంచాలు తీసుకుని వ్యక్తిత్వాలను అమ్మకండి. అక్రమ సంపాదనతోఅక్రమ కట్టడాలు కట్టకండి… ఆ డబ్బుతో మీరు సుఖపడేది కేవలం తాత్కాలికమే. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందిరా.అధర్మానికి చేటు తప్పదు. ఇది గ్రహిస్తే మంచిది మీరు.”

“ఏమిటి నాన్నా చాదస్తం… అమ్మ ఎలాగూ లేదు. ఉన్న నువ్వైనామాతో ఉండకుండా ఇలా దూరంగా ఉంటే ఎలా నాన్నా?మీ అల్లుడు గారు నిన్ను నాతో మా ఇంటికి తీసుకువచ్చేయమని చెప్పారు…”

“ఎందుకమ్మా డాక్టర్ ఝాన్సీ? ముందు వైద్యులుగా మీకు పట్టిన అవినీతి జబ్బును నయం చేసుకోండి తల్లీ… ఆ తర్వాత జనాలను ఉద్ధరించుదురు గానీ… ఏంటమ్మా, సర్గోసీ బిజినెస్ చేస్తున్నారట… పిల్లలు లేని పెద్దింటి వాళ్ళకు పేదోళ్ళ గర్భఫలాన్ని అమ్మేస్తున్నారట. శభాష్… నువ్వు ఇంటర్ చదివేటప్పుడు నీ స్నేహితురాలింట్లో ఫంక్షన్ కి నీకు చున్నీ గిఫ్ట్ గా ఇస్తే, నేను కోప్పడతానేమోనని తిరస్కరించిన నా ముద్దుల కూతురు ఝాన్సీవేనా అమ్మా నీవు? పరులసొమ్ము పాము వంటిది అని నేను చెప్పిన పాఠం ఆనాటి వరకూ గుర్తుందికదా? ఇప్పుడెందుకమ్మా ఈ మార్పు? ఏమైనా అంటే లోకమంతా ఇలాగే ఉందని అంటున్నారు. మీకు ఏర్చి కూర్చి, గాంధీ, సుభాష్, ఝాన్సీ అనే భారత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టుకున్నానమ్మా. అయిపోయింది! నా గర్వమంతా అణగారిపోయింది. తండ్రిగా నేను చచ్చిపోయానమ్మా… ఇక మీకు నాన్న లేడు. వెళ్ళండి తల్లీ… నన్ను మరచిపొండి… మాధవా, వీళ్ళను పంపించు…” పక్క గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు గిరి.

***

ఇది జరిగి రెండేళ్ళు అయింది. మాధవరావు వీధిలోనే చిన్న ఇల్లు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు గిరి. అన్యాయాన్ని సహించలేని గిరి తన పిల్లల మీద ప్రభుత్వానికి తానే కంప్లయింట్ ఇవ్వాలని అనుకున్నాడు కానీ కడుపుతీపి, మిత్రుడి మాట అతన్ని ఆపేశాయి.

సంవత్సరం గడిచింది. గిరి బాగా కృంగిపోయాడు. ఒంటరితనం, అనారోగ్యం అతన్ని పట్టి పీడిస్తున్నాయి.

కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు కనుక ఒకరి తర్వాత ఒకరుగా గాంధీ, సుభాష్ ఉద్యోగాల్లోంచి సస్పెండ్ అయ్యారు. ఝాన్సీ నర్సింగ్ హోమ్ సీజ్ చేయబడింది. ఆమె మీద రకరకాల ఆరోపణలునమోదు అయ్యాయి.

బెయిల్ మీద బయటకు వచ్చి తండ్రి కాళ్ళమీద పడి క్షమాపణ వేడుకోవటానికి బయలు దేరింది ఝాన్సీ. అప్పటికే అన్నలిద్దరూ తండ్రి దగ్గర కూర్చుని పశ్చాత్తాపంతో విలపిస్తున్నారు. తండ్రి ముఖం తేటగా ఉంది. అన్యాయానికి, అధర్మానికి తగిన శిక్ష పడినందుకో ఏమో ఆయన ముఖంలో ఎప్పుడూ లేనంత శాంతి ప్రతిఫలిస్తోంది. పిల్లలు తమ తప్పు తెలుసుకున్నందుకు గిరి ముఖంలో ఆనందపు కాంతులు మెరుస్తున్నాయి.

వాళ్ళ భుజాలు తట్టి చెప్పాడు…

“ఇక పదండి, బయలుదేరదాం… మన ఊరు వెళ్ళి ప్రశాంతంగా గడుపుదాం. ఝాన్సీ తల్లీ, అక్కడ వైద్యశాల తెరుద్దువు గాని… ఏదో ఒక మంచి ఉద్యోగం, చిన్నదైనా వీళ్ళకు దొరక్క పోదు… లేదా మనింట్లో మామిడి చెట్టు కింద ఒక చిన్న బడి తెరుద్దాము. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా విద్యాదానం చేద్దాము.తప్పూచేయకుండా, ఏ భయం లేకుండా, నిశ్చింతగా, నిర్భీతిగా కాలం గడుపుదాం. ఈరోజు నేను మళ్ళీ పుట్టానర్రా… నన్నింక ఏ జబ్బూ ఏమీ చేయలేదు…” అన్నాడు మిలమిలా మెరిసే కళ్ళతో.

“కానీ నాన్నా, పాపం చేసినవాడికి తగిన శిక్ష పడి తీరవలసిందే. మూడు రోజులలో నాకేసు హియరింగ్ కి వస్తుంది. నాకు శిక్ష పడితే, దానిని అనుభవించి వస్తాను. నేను కూడా మన ఊరు వచ్చి మీతో జాయిన్ అవుతాను…”

“అలాగేనమ్మా… నీ తప్పు నీవు తెలుసుకున్నావు కనుక, దేవుడు క్షమించి, అతి తక్కువ శిక్ష వేస్తాడు లేమ్మా… నా ఆదర్శాలతో మిమ్మల్ని బాధపెడుతున్నానని నాకు తెలుసు… “ బాధగా అన్నాడు గిరిధారి.

“చెల్లాయికి జరినామా పడితే, అదిమేము కట్టేస్తాము నాన్నా… ” ముక్త కంఠంతో చెప్పారు అన్నదమ్ములిద్దరూ.

ఆ సైనికుడి ముగ్గురు సంతానపు హృదయాలలో అవినీతి చీకటి అంతరించి, నీతి అనే రవిబింబం ఉదయించసాగింది. అది ఇక ఎప్పటికీ అస్తమించదు.

***

 

 

 

 

 

 

 

 

 

5 thoughts on “‘ఉషోదయం’

  1. అవినీతి అక్రమార్కులకు ఇది ఒక చెంప పెట్టు లాంటిది. ఇలాంటి కధలు మీ ద్వారా ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను
    నాగమణి గారికి అభినందనలు

  2. అవినీతి చాప కింద నీరులా మన దేశాన్ని ఆక్రమించి ఉన్న తరుణంలో, ఇలాంటి కథలు మరెన్నో మీ ద్వారా జనాన్ని మేల్కొలపాలని ఆశిస్తున్నాను సుమనా.మంచికథని అందించినందుకు అభినందనలు.

Leave a Reply to B SURYANARAYANA Cancel reply

Your email address will not be published. Required fields are marked *