April 18, 2024

కంభంపాటి కథలు – ఇన్ డిపెండెంట్

రచన: కంభంపాటి రవీంద్ర

క్యాంటీన్ లో లంచ్ తింటూంటే, ‘హలో ‘ అనే ఎవరో గట్టిగా అనేసరికి అదిరిపడి, పక్కకి చూసేసరికి నవ్వుతూ హైందవి కనిపించింది. ‘ఏమే.. ఎప్పట్లాగే వాళ్లనే చూస్తూ అలా అలా డ్రీమ్స్ లోకెళ్ళిపోయేవా ?’ అంటూంటే ‘నీ మొహం.. అయినా నాకేమైనా వినపడదా ? అంత గట్టిగా హలో అని అరిచేవు ‘ అన్నాను కోపంగా.
‘వీళ్ళిద్దర్నీ చూస్తూంటే ‘కలిసి ఉంటే కలదు సుఖమూ ‘ అనేది మార్చేసి ‘కలిసి భోంచేస్తే కలదు సుఖమూ ‘ అని పాడుకోవచ్చనిపిస్తుంది కదూ ‘ అంది హైందవి నవ్వుతూ
‘అవుననన్నట్టు ‘ నవ్వేసాను. నిజానికి నేను లంచ్ టైములో నా దృష్టి తిండి మీద తక్కువా, రాహుల్, శైలజ జంట మీదెక్కువ ఉంటుంది. మా టీంలోనే పని చేస్తారిద్దరూ, లవ్ మ్యారేజ్ అట.. ఆఫీస్ లో ఉన్నంత సేపూ, ఇద్దరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు.. కానీ ఇలా లంచ్ టైములో మటుకు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ తింటూంటే, నాకు కూడా అలాంటి మంచి కుర్రాడు దొరికితే బావుణ్ణు, వెంటనే పెళ్లి చేసేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది !
అన్నట్టు నా గురించే చెప్పలేదు కదూ.. నా పేరు కీర్తి.. రాహుల్, శైలజ వాళ్ళ ప్రాజెక్ట్ టీం కి లీడర్ ని. ప్రాజెక్ట్ పనిలో ఉన్నప్పుడు నువ్వెవరో నేనెవరో అన్నట్టుండే ఇద్దరూ, ఆఫీస్ బయటికి వచ్చేసరికి ఒకర్నొకరు అంటిపెట్టుకునే ఉంటారు. అంతవరకూ ఎందుకు, వాళ్ళిద్దర్నీ చూసినవాళ్లెవరికైనా భలే జంట అని అసూయ పుట్టకపోతే ఆశ్చర్యపోవాలి.
నాకూ ఏవేవో సంబంధాలు వస్తున్నాయి. వచ్చిన ప్రతి వెధవ (సారీ.. సంబంధం ఇంకా కుదరకుండానే ప్రతి పెళ్లి కొడుకు అని వాడడం నాకిష్టం లేదు ) ‘మీ టేక్ హోమ్ ఎంత ?’, ‘మీకు యూఎస్ వీసా ఉందా ‘, ‘ఒకవేళ యూఎస్ వస్తే ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా ‘ లాంటి ప్రశ్నలతోనే మాటలు మొదలయ్యేసరికి వీళ్ళు పెళ్లి చేసుకునేది నన్నా లేక నా జీతాన్నా అనే ఫీలింగ్ వచ్చేసి, కొంతకాలం పెళ్లి అనే ఆలోచనకే ఫుల్ స్టాప్ పెట్టేసేను.
ఆ ఏడాది మా టీంలో అమెరికాకి వెళ్ళడానికి హెచ్ వన్ బి వీసా కి అప్లై చెయ్యడానికి కొంతమందిని సెలెక్ట్ చెయ్యమంటే, మొదట నాకు శైలజ పేరే తట్టింది. పిలిచి అడిగేను, ‘యూఎస్ వెళతావా ?’ అని
‘రాహుల్ కి కూడా చేయిస్తే నాకు వెళ్ళడానికి ప్రాబ్లెమ్ లేదు ‘ అంది
‘సరే చూద్దాం.. ఇద్దరికీ ఒకేసారి వీసా చేయించడం కుదురుతుందో లేదో ‘
‘కీర్తీ.. వెళ్తే ఇద్దరం వెళ్తాం.. లేకపోతే లేదు ‘ అనేసి వెళ్ళిపోయింది
సరే.. ఇద్దరికీ అప్లై చెయ్యమని రికమెండ్ చేసేను. కొన్నాళ్ళకి ఆ టీం నుంచి నేను మారిపోయి, లండన్ లో ఏదో ప్రాజెక్ట్ చెయ్యాలంటే, యూకే వెళ్లిపోయేను.
యూకే వెళ్లిన తర్వాత జీవితం ప్రశాంతంగా ఉంది. రోజూ పెళ్లి చేసుకోమనే సొద లేదు, పైగా పెళ్లి మాట ఎత్తితే ఫోన్ పెట్టేస్తానని మా నాన్న కూడా ఆ విషయం ఎత్తడం లేదు.. ‘నీ ఇష్టం.. నీకు ఏది ఇంపార్టెంట్ అనేది నీకు తెలుసని నా నమ్మకం ‘ అనేసేరాయన.
ఆ రోజు ఆఫీసు కి వెళదామని లండన్ కింగ్స్ క్రాస్ స్టేషన్ లో ట్రైన్ కోసం చూస్తూంటే, ఫోన్ రింగయ్యింది. అవతల పక్క మా నాన్న. ‘అమ్మని హాస్పిటల్ లో అడ్మిట్ చేసేము.. చిన్న స్ట్రోక్.. వీలైతే రా ‘ అనేసరికి, వెంటనే ఆఫీస్ కి ఫోన్ చేసి శెలవు పెట్టేసి, దొరికిన ఫ్లైట్ పట్టుకుని ఇండియా బయలుదేరేను.
హీత్రో ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ వెళ్లే బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూంటే, దూరంగా ఏదో చైనీస్ ఫుడ్ కౌంటర్ ముందు నవ్వుకుంటూ, తింటున్న రాహుల్, శైలజ కనిపించేరు.
‘అరె చాలా కాలమైంది వీళ్ళని చూసి.. ‘ అని వాళ్ళ దగ్గిరికెళ్ళేసరికి అర్ధమైంది, నేను కళ్ళజోడు పెట్టుకునే రోజులు వచ్చేసేయని !.. అక్కడ రాహుల్ ఉన్నాడు, కానీ అతనితో ఉన్న అమ్మాయి శైలజ కాదు !
‘హలో.. హవార్యు ‘ అంటూ రాహుల్ నవ్వుతూ పలకరించేడు, గబుక్కున తేరుకుని, ‘ఫైన్.. ఎలా ఉన్నావు?’ అని అడిగితే, ‘ఇప్పుడు డెన్వర్ లో ఉంటున్నాము.. మీట్ మై వైఫ్ మౌనిక ‘ అంటూ భార్యని పరిచయం చేసేడు !

ఆ అమ్మాయిని పలకరించి వెంటనే అక్కణ్ణుంచి వచ్చేసేను. శైలజ కి ఏమయ్యింది ? వీళ్ళిద్దరూ విడిపోయేరా, లేకపోతే మరి ఎక్కడుంది అనే ఆలోచనలు.. వాటన్నిటిని పక్కనెట్టి, మా అమ్మ గురించి తల్చుకుంటూ, హైదరాబాద్ వచ్చేసరికి, నాన్న ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ‘సారీ.. నిన్ను కంగారు పెట్టి పిలిపించేను.. ఇప్పుడు అమ్మ కి బాగానే ఉంది..ఇంటికి కూడా తీసుకు వచ్చేసేము’ అన్నారు, ‘సారీ ఎందుకు నాన్నా.. ఈ వంకతోనైనా, నీతోనూ, అమ్మతోనూ గడిపే ఛాన్స్ వచ్చింది ‘ అంటూ మా కార్ వేపు నడిచేను.
ఆ రాత్రి అమ్మా, నాన్నలిద్దరితో కబుర్లు చెప్పి పడుక్కోబోతూంటే గుర్తుకొచ్చింది శైలజ. వెంటనే హైందవి కి ఫోన్ చేసేను. ‘కీర్తీ నువ్వా ‘ అని తను పలకరిస్తూంటే పట్టించుకోకుండా, ‘నీకు రాహుల్, శైలజ గుర్తున్నారు కదా.. ఇప్పుడు శైలజ ఎక్కడుంది ‘ అని అడిగితే ‘ఏమిటీ.. ఆ శైలజ గురించి కనుక్కోడానికి ఫోన్ చేసేవా? ఇంకా మర్చిపోలేదా వాళ్ళని ?’ అంది
‘అవన్నీ తర్వాత.. తను ఎలా ఉంది ? అసలుందా లేదా ?’ అని గాభరాగా అడిగితే, ‘శుభ్రంగా ఉంది.. నువ్వు ఇద్దరికీ వీసా అప్లై చేయించేవు కదా…. రాహుల్ కి వీసా వచ్చింది.. తనకి రాలేదు.. “నువ్వు వెళ్తే వెళ్ళు.. నీకు డిపెండెంట్ గా మటుకు నేను రాను..” అని వాడితో అందిట ‘
‘ఏమిటే ?.. ఇద్దరూ ఎంతో అఫెక్షన్ తో ఉంటారు కదా ‘
‘ఉంటే మటుకు ?..వీడికి వీసా వచ్చిందని వాడు యూఎస్ వెళ్ళిపోయేడు.. నాతో పాటు నీకు వీసా అప్లై చెయ్యమని ఫైట్ చేసిందే నేను.. అలాంటిది నాకు రాకపోతే, సిగ్గులేకుండా నువ్వు యూఎస్ వెళ్తావా ‘ అనేసి డివోర్స్ తీసుకుంది.. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి, వేర్వేరు పెళ్లిళ్లు చేసేసుకున్నారు ‘ అని హైందవి అంటూంటే, కళ్ళు తిరగడం మొదలెట్టేయి నాకు !

*****

5 thoughts on “కంభంపాటి కథలు – ఇన్ డిపెండెంట్

  1. ఇప్పటి తరానికి రాజీ అనేది లేదు. చాలా దుడుకు/దూకుడు నిర్ణయాలు.

Leave a Reply to Sudheer Cancel reply

Your email address will not be published. Required fields are marked *