April 19, 2024

పాలమనసులు

రచన: కొత్తపల్లి ఉదయబాబు

అది నగరంలోని ప్రసిద్ధమైన కార్పొరేట్ పాఠశాల మెయిన్ బ్రాంచ్. ఎలిమెంటరీ సెక్షన్స్ వన్ టు ఫైవ్ క్లాసెస్ ఉన్న బ్లాక్ లోని పేరెంట్ విజిటర్స్ రూంలో ప్రిన్సిపాల్ గారి కోసం నిరీక్షిస్తున్నాయి రెండు జంటలు తమ పిల్లలతో.
ఒక పక్క ఆఫీసుకు టైం అవుతోంది. రఘువరన్ అసహనంగా భార్యకేసి చూసాడు. యూనిఫామ్ లో ఉన్న ఐశ్వర్య తల్లి చెయ్యి పట్టుకుని ధీమాగా కూర్చుంది.
చరణ్ కూడా తనభార్య ప్రశాంతి తో అక్కడే కూర్చున్నాడు. తల్లి చున్నీలో ముఖం దాచుకుని సింహం ముందు ఆహారమవబోతున్న లేడి పిల్లలా భయంగా తండ్రి వంక డోర్ వంక, ఐశ్వర్య వంకా తన తెల్లటి కళ్ళను తిప్పుతూ చూస్తున్నాడు అభినయ్.
“హోమ్ వర్క్ చేసేసావా. . . “హఠాత్తుగా అడిగింది ఐశ్వర్య ముద్దుముద్దుగా.
“ష్. . . సిగ్గులేదు ఆ అబ్బాయితో మాట్లాడటానికి?”మెల్లగా కటువుగా కూతుర్ని మందలించాడు రఘువరన్.
“లేదు”అన్నట్టుగా తలూపాడు తల్లి చున్నీ చాటునుంచి అభినయ్.
మండి పోయింది చరణ్ కి. అతనికి కోపం వచ్చినట్టు కంద గడ్డలా మారిన ముఖంలో దవడ కండరం బిగుసుకోవడమే తెలుపుతోంది. ప్రశాంతి “తప్పు నాన్న మాట్లాడకు” అన్నట్టు అభినయ్ కి నోటిమీద వేలు పెట్టి చూపించింది.
“సిగ్గు లేకపోతే సరి. పిల్లల్ని చిన్నప్పటినుంచి సక్రమంగా పెంచుకోకపోతే ఇలాగే దోషుల్లా నిలబడి సంజాయిషీ ఇచ్చు కోవాల్సి వస్తుంది. వాళ్ళు తప్పు చేసిన పాపానికి మనకి టైం వేస్ట్. ” గొణుక్కుంటున్నట్టుగానే రఘువరన్ అన్నా చరణ్ కి స్పష్టంగా వినిపించింది.
“మిస్టర్. మైండ్ యువర్ లాంగ్వేజ్. ” అనేలోపుగానే ప్రశాంతి బలంగా చరణ్ జబ్బపుచ్చుకుని ఆపింది.
అంతలో ప్రిన్సిపాల్ ప్రవేశించి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ తన సీట్ లో కూర్చున్నాడు. సాలోచనగా తల పంకించి కాలింగ్ బెల్ ప్రెస్ చేసాడు.
ఒక 18 సంవత్సరాల అమ్మాయి లోపలికి వచ్చింది.
“టీచర్. సెకండ్ క్లాస్ టీచర్ ప్రవల్లికను రమ్మనండి. “ఆజ్ఞాపించాడు.
“ఎస్సార్”అని ఆ అమ్మాయి నిష్క్రమించింది.
“గుడ్ మార్నింగ్ సర్”అన్నాడు అభినయ్ ప్రిన్సిపాల్ కి సెల్యూట్ చేస్తూ.
అది విని ఐశ్వర్య కూడా “గుడ్ మార్నింగ్ సర్” అని ప్రిన్సిపాల్ కి సెల్యూట్ చేసింది.
“గుడ్ మార్నింగ్ మై స్వీట్ చిల్డ్రన్”అన్నాడు ప్రిన్సిపాల్ చిరునవ్వుతో.
అపుడు పిల్లల పేరెంట్స్ కేసి చూస్తూ ” గుడ్ మార్నింగ్ పేరెంట్స్. “అని పెద్దవాళ్ళు నలుగురికి విష్ చేసాడు.
తిరిగి విష్ చేశారు రఘువరన్, చరణ్ లు కూడా.
అంతలో “మే ఐ కమిన్ సర్?” అనుమతి అడుగుతూనే లోపలికి వచ్చింది. తిండి, గుడ్డ కరువై బీదస్థితిలో ఉండి కాలర్ బోన్స్ బయటకు కనిపిస్తున్న 20 ఏళ్ల ఆఅమ్మాయి స్వరం మాత్రం కోకిల కంఠంలా ఉంది.
తమ టీచర్ చూస్తూనే మళ్లీ “గుడ్ మార్నింగ్ టీచర్” అంటూ పిల్లలిద్దరూ ఒకే శృతిలో విష్ చేశారు. ప్రవల్లిక పిల్లలిద్దరినీ తిరిగి విష్ చేసింది.
ప్రిన్సిపాల్ కంఠం సవరించుకుని ” డియర్ పేరెంట్స్. మీరు మీ పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అంతా విన్నాక మీరు మాట్లాడటానికి నేను పెర్మిషన్ ఇస్తాను. ఈలోగా మీరు ఒక్క మాట మాట్లాడటానికి ప్రయత్నించినా మీరు మీ పిల్లల టీ. సి. తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. మళ్లీ మీ పిల్లలకు ఇక్కడ అడ్మిషన్ కావాలంటే ఒక ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఒకే కదా. ” అని వారిని హెచ్చరించి వారి సమాధానం కోసం చూడకుండా ప్రవల్లికని అడిగాడు.
“మిస్. మీరు చెప్పండి. నిన్న క్లాస్ లో ఎం జరిగిందో వివరంగా చెప్పండి. ”
పేరెంట్స్ టీచర్ చెప్పేదానికోసం అలెర్ట్ అయ్యారు.
“సర్. నా సెకండ్ క్లాస్ లో ఇద్దరు ఐశ్వర్య లు ఉన్నారు. కె. ఐశ్వర్య, ఈపాప ఎం. ఐశ్వర్య. నిన్న కె. ఐశ్వర్య పుట్టినరోజు. వాళ్ళ పేరెంట్స్ ఆ పాపని పుట్టినరోజు డ్రెస్ వేసి టీచర్స్ అందరికి కేక్స్, క్లాసులో పిల్లలందరికీ చాకలెట్స్ పంపారు. ఆ ఐశ్వర్యకు పిల్లలందరూ క్లాస్ లో హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడాక, స్వీట్స్ పంచడానికి ఈ ఐశ్వర్య ని చాకలెట్స్ ఉన్న బాక్స్ పట్టుకోమని చెప్పి ఒక్కొక్కరికి చాకలెట్స్ ఇవ్వసాగింది. సరిగ్గా అభినయ్ దగ్గరకు వచ్చి చాకలెట్స్ ఇస్తున్నప్పుడు అవితీసుకుని ” ఐశ్వర్య . ఐ లవ్ యూ ఐశ్వర్య” అన్నాడు. వెంటనే ఈ ఐశ్వర్యకి కోపం వచ్చి నేను చెబుతున్నా వినకుండా ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది సర్. తరువాత మీరు చెప్పినట్లుగానే డైరీస్ లో వాళ్ల పేరెంట్స్ ను ఈ మార్నింగ్ మిమ్మల్ని కలవడానికి రమ్మని రాసాను. ఇదే సర్ జరిగింది. ”
“ఒకే. నౌ యూ కెన్ గో అండ్ సెండ్ దట్ ఐశ్వర్య. ” ఆర్డరేశాడు ప్రిన్సిపాల్. ఆ అమ్మాయి బతుకు జీవుడా అంటూ అక్కడనుంచి నిష్క్రమించింది.
“విన్నారుగా పేరెంట్స్. అదీ జరిగింది. అమ్మాయి ఐశ్వర్యా. . . ప్లీజ్ కం టు మీ. ” పిలిచాడు ప్రిన్సిపాల్.
“సార్ పిలుస్తున్నారుగా వెళ్ళు. నిన్ను అలాంటి మాటలు అన్నవాళ్ళకి లేని భయం నీకెందుకు?ధైర్యంగా సర్ ఆడిగినదానికి సమాధానం చెప్పు. నెనున్నాగా ఇక్కడ”అన్నాడు రఘువరన్.
ఐశ్వర్య ధీమాగా ప్రిన్సిపాల్ దగ్గరగా వచ్చింది.
“అభినయ్ నిజంగా నిన్ను ఐ లవ్ యు అన్నాడామ్మా” అడిగాడు ప్రిన్సిపాల్
“ఎస్సార్. నిజంగానే అన్నాడు. నాకు భయమేసింది. వచ్చి మీతో చెప్పేసాను. కావాలంటే కె. ఐశ్వర్యని కూడా అడగండి. ” అంది.
“నువ్ కూడా ఇలా రా నాన్న. . . “అభినయ్ ని పిలిచాడు ప్రిన్సిపాల్.
అసలు తాను అన్నదాంట్లో తప్పేముందని తనని ప్రిన్సిపాల్ ముందు నిలబెట్టారో అర్ధం కాని ఆ లేతమనసు ఒక్కసారిగా ఏడవసాగాడు.
ప్రశాంతి అభినయ్ ని ఎత్తుకుని కళ్ళు తుడుస్తూ అంది. “తప్పు నాన్న. ప్రిన్సిపాల్ సర్ ఏమీ అనరు. నేను డాడీ ఇక్కడే ఉన్నాం కదా. సర్ ఆడిగినదానికి సరిగ్గా సమాధానం చెప్పు. ప్లీజ్ నాన్న. ఐ లవ్ యూ కదూ. ”
అభినయ్ ఏడుపు ఆపాడు. ప్రశాంతి అభినయ్ ని చరణ్ కి ఇచ్చింది. చరణ్ అభినయ్ ని ఎత్తుకుని “ఆ ఐశ్వర్య కూడా వస్తుంది కదా. సర్ ఆ అమ్మాయిని కూడా అడుగుతారు. నీకేం భయం లేదు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. నేనున్నాను కదా. యూ లవ్ మీ కదా. ఏడవకుండా సర్ అడిగినదానికి భయపడకుండా సమాధానం చెప్పు. ఒకే నా”అని బుజ్జగించి ప్రిన్సిపాల్ దగ్గరకు పంపాడు.
అభినయ్ ప్రిన్సిపాల్ దగ్గరగా వచ్చి చేతులు కట్టుకున్నాడు.
“గుడ్ మార్నింగ్ సర్. మే ఐ కం ఇన్ సర్” అని నవ్వుతూ అడిగి లోపలికి వచ్చిన ఆ పాపను చూస్తూనే అక్కడి అందరి కళ్ళూ పెద్దవయ్యాయి ఆశ్చర్యం తో.
బాదం పాలతో స్నానం చేసిన బాల దేవకన్యలా మెరిసిపోతోంది ఆ అమ్మాయి. నవ్వితే పారిజాతపు పూలు జలజలా రాలుతున్నాయా అన్నంత అద్భుతంగా నవ్వుతోంది.
“ఎందుకు సర్ నన్ను రమ్మన్నారు?” అడిగింది ప్రిన్సిపాల్ ని.
“ఎం లేదురా. చిన్న మాట అడుగుదామని. నిన్న క్లాస్ రూమ్ లో నువ్ స్వీట్స్ పంచినపుడు అభినయ్ ఏమైనా అన్నాడా?”
గుర్తుకు వచ్చినట్టు అంది ఐశ్వర్య.
“ఎస్ సర్. క్లాస్ రూమ్ లో అందరూ థాంక్స్ చెప్పారు. కానీ అభినయ్ కి ఇచ్చినప్పుడు “ఐశ్వర్య. ఐ లవ్ యూ ఐశ్వర్య. ” అన్నాడు. అపుడు ఎం. ఐశ్వర్య ఏడుస్తూ వచ్చి మీకు కంప్లయింట్ చేసింది. అంతే సర్” అంది అమాయకంగా.
“అభినయ్ అలా అని నిన్ను అన్నాడా. . . ఎం. ఐశ్వర్య ని అన్నాడా?” అడిగారు ప్రిన్సిపాల్.
“నాతోనే అన్నాడు సర్. మరి ఎం. ఐశ్వర్యకు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్ధం కాలేదు సర్. “అంది కె. ఐశ్వర్య నవ్వుతూ.
“ఒకే. యూ కెన్ గో టు యువర్ క్లాస్. ”
“థాంక్యూ సర్. “కె. ఐశ్వర్య వెళ్ళిపోయింది.
ప్రిన్సిపాల్ అభినయ్ ని దగ్గరకు తీసుకున్నాడు.
“నాన్నా అభినయ్. ఇపుడు నువ్ చెప్పు. నువ్ ఐ లవ్ యూ అని ఎవరిని అన్నావు?కె. ఐశ్వర్యనా? ఎం. ఐశ్వర్యనా? చెప్పు నాన్నా?” అనునయంగా అడిగాడు ప్రిన్సిపాల్.
వాళ్ళిద్దరిని అడిగాక తనని అడుగుతున్నారన్న ధైర్యంతో అన్నాడు అభినయ్ ” సర్. నిన్న కె. ఐశ్వర్య వేసుకున్న బర్త్ డే డ్రెస్ చాలా చాలా బాగుంది. అలాంటిది మా చెల్లికి మమ్మీ చేత కొనిపించాలనిపించింది. సరిగ్గా అపుడు కె. ఐశ్వర్య నాచేతుల్లో చాకలెట్స్ పెట్టింది. అంత దగ్గరగా వచ్చిన కె. ఐశ్వర్య ను చూసి ఐ లవ్ యూ అన్నాను. అంటే నువ్ ఈ డ్రెస్సులో చాలా బాగున్నావ్ అని అన్నాను. ప్రామిస్ సర్. నేను కె. ఐశ్వర్యనే అన్నాను. ఎం. ఐశ్వర్య ని అనలేదు. ప్లీజ్ సార్. నన్ను స్కూల్ నుంచి పంపకండి సర్. మా మమ్మీ ఏడుస్తుంది సర్. ప్లీజ్ సర్. “చివరలో అభినయ్ కి దుఃఖం పొర్లుకు వచ్చేసింది.
“నో నాన్నా. నువ్వు ఈ స్కూల్ లొనే చదువుతావ్. సరేనా. ఇంకెప్పుడూ అలాంటి మాటలు అనకూడదు. సరేనా. అభినయ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. గో టు యువర్ క్లాస్ రూమ్. ఎం. ఐశ్వర్య కమాన్. విన్నావ్ గా. అభినయ్ అన్నది నిన్ను కాదమ్మా. కె. ఐశ్వర్య ని. అయినా ఐ లవ్ యూ అంటే నీకు ఏమి అర్ధం అయిందమ్మా?” అడిగాడు ప్రిన్సిపాల్.
” టి. వి. లో వేసిన సినిమాలో హీరోయిన్ హీరోకి ఐ లవ్ యూ చెప్పకపోతే ముఖం మీద ఆసిడ్ పోసేసాడు సర్. ఇంకో సినిమాలో అయితే కత్తి పెట్టి హీరోయిన్ గొంతు కోసేసాడు సర్. అందుకే భయమేసి వచ్చి మీతో చెప్పాను సర్. కె. ఐశ్వర్య నైనా అనకూడదు కదా సర్. “ఆరిందాలా చేతులు తిప్పుతూ అంది ఎం. ఐశ్వర్య.
“ఒకే. నేను మీ పేరెంట్స్ తో మాట్లాడి పంపిస్తాను. యూ బోత్ గో టు యువర్ క్లాస్. బాగా చదువుకోవాలి. . నౌ మీరిద్దరూ గుడ్ ఫ్రెండ్స్. సరేనా?” అన్నాడు ప్రినిపాల్.
“ఒకే అండ్ థాంక్యూ సర్. బై మమ్మీ బై డాడీ. . . “అని పిల్లలిద్దరూ హుషారుగా అక్కడనుండి వెళ్లిపోయారు.
ప్రిన్సిపాల్ పేరెంట్స్ వైపు తిరిగారు.
” చూసారా సర్స్. ఈ ప్రపంచంలో అతి పవిత్రం గా పలకవలిసిన “ప్రేమ”అన్న పదం, ఆ పదానికి పూర్తి అర్ధం తెలియని పాలమనసుల్లో ఎటువంటి స్థితికి దిగజారిపోయిందో అర్ధమైందా సర్? అభం శుభం ఎరుగని ఆ పసి మనసుల్లో పుచ్చు విత్తనమై నాటుకుని అది మొక్కగా పెరిగి వృక్షమైతే దానికి బాధ్యులు ఎవరు సర్? మీరా? మేమా? చెప్పండి.
అనురాగం ఆత్మీయత అభిమానం ఇలాంటి అమృత తుల్యమైన మాటలున్న మన మాతృభాషకు సమాంతరంగా పరిజ్ఞానం కోసం ఆంగ్లభాష నేర్చుకోవలసిందే. నేర్చుకునే భాషల పట్ల మమకారాన్ని పెంచి అవగాహన కలిగించండి. అభం శుభం తెలియని ఏనిమిదేళ్ల వయసులో ఐశ్వర్యకు ఐ లవ్ యూ అంటే ఎలా అర్దమైందో చూసారా. . ?ఎవరు దానికి కారణం?, మేమా?
అలాగే పిల్లల పట్ల ప్రేమ ఉండాల్సిందే. కానీ వాళ్ళని సముదాయించడం కోసం ఐ లవ్ యూ నాన్న. యూ లవ్ మీ కదా. . . అని ముద్దు చెయ్యడం ఎంతవరకు సమంజసం?ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎంత అమృతమైనా విషమౌతుంది.
పిల్లల పెంపకంలో ప్రేమ ఎంత అవసరమో క్రమశిక్షణా అంతే అవసరం. వాటిని సమపాళ్లలో పెంపకంలో పిల్లలకు అందించిన నాడు పిల్లలలో ఈ విపరీత ధోరణు లుండవు.
డబ్బు అవసరానికి మించి సంపాదించి పిల్లల చదువులకు అవసరాలకు ధారపోస్తున్నామనుకుంటారే గాని వారి ప్రవృత్తి, ప్రవర్తన తల్లిదండ్రులు పట్టించుకోక పోతే రాబోయే తరం చేతిలో రాజీ పడలేక బ్రతకలేక జీవశ్చవా లల్లా బ్రతుకు ఈడ్చుకు రావలసిందే. ఆ పరిస్థితి మీకు రాకూడదనుకుంటే మీరు ఇప్పటినుంచీ జాగ్రత్తపడటం మంచిది. అర్ధమైందనుకుంటాను. ఇక మీరు వెళ్ళవచ్చు సర్” అన్నాడు ప్రిన్సిపాల్ లేచి నిలబడి.
తన పిల్లలో తప్పు పెట్టుకుని ఎదుటివారిని పరుషంగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడ్డాడు రఘువరన్. తన పిల్లవాడితో ఎలాంటి మాటలు మాట్లాడాలో అర్ధమైన చరణ్ తన ప్రవర్తనను మనసులో నొచ్చుకున్నాడు.
నలుగురు లేచి వెళ్ళడానికి ఉద్యుక్తులౌతుండగా రఘువరన్ చరణ్ తో ” ఐయాం వెరీ సారి బ్రదర్. వెరీ వెరీ సారీ. ” అన్నాడు చరణ్ తో కరచాలనం చేసి.
చరణ్ కూడా “అయామ్ అల్సొ సో సారి ఫర్ ద ఇన్ కన్వీనియన్స్ బ్రదర్. రియల్లీ వెరీ సారీ. ” అన్నాడు.
“మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని మాట ఇస్తున్నాం సర్. మీ అమూల్య సూచనలకు సదా కృతజ్ఞతలు సర్. నమస్తే. ” అందరూ బయటకు కదులుతుండగా చివరగా ప్రశాంతి చెప్పిన మాటలకు మెచ్చుకోలుగా చూస్తూ చిరునవ్వుతో వీడ్కోలు పలికాడు ప్రిన్సిపాల్.

సమాప్తం

1 thought on “పాలమనసులు

  1. ఎడిటర్ గారికి, నా కధ ”పాలమనసులు ” సెప్టెంబర్ సంచికలో ప్రచురించినందులకు తమకు నా ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *