April 19, 2024

దేవుళ్ళకూ తప్పలేదు!

రచన: పెయ్యేటి రంగారావు

దేవుళ్ళయినా పరిస్థితులకి తలలు ఒగ్గవలసిందే! ఒక్కొక్కసారి అటక ఎక్కుతారు, ఒక్కొక్కసారి అల్మారాల్లో దాక్కుంటారు. ఒక్కొక్కసారి గట్టెక్కుతారు!!
సీతమ్మగారి మనవడు గురుదత్త మహా గడుగ్గాయి. కొద్దిగా ఈ మధ్యనే నడక వచ్చింది. దాంతో ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. పొద్దున్న లేవగానే సీతమ్మగారి కోడలు సీతాలక్ష్మి పొందికగా మంచం మీద దుప్పటి చక్కగా సరిచేస్తుంది. ఆవిడ స్నానం చేసి బొట్టు పెట్టుకోవడానికి పడకగదిలోకి వచ్చేసరికి మంచం మీద దుప్పటి నేల మీద పారాడుతూ వుంటుంది. తల దువ్వుకుందామంటే దువ్వెన కనబడదు. తెగ వెతికేస్తుంటే దత్తు గాడి తలలో కనిపిస్తుంది. టేబులు వాడికందదు కదా, దువ్వెన ఎలా తీసాడు అని పరిశోధిస్తే, టేబులు దగ్గర తను పడకకుర్చీ దగ్గర పెట్టుకున్న చిన్న స్టూలు కనిపిస్తుంది. వాడు దాన్ని జరుపుకుంటూ టేబులు దగ్గిరకి తీసికెళ్ళి వుంటాడని, దాని మీదకెక్కి టేబులు మీదున్న దువ్వెన తీసేసి వుంటాడని అర్థమవుతుంది. అంతేకాదు, అక్కడ సీసాల్లో వున్న స్నో, పౌడర్లలో సగభాగం వాడి మొహాన్న పూయబడి వుంటుంది. ఇంకా వాడి ముస్తాబు పూర్తి అవదు. కుంకుమతో నిలువుబొట్టు మందంగా దిద్దుకుని శ్రీమహావిష్ణువులా దర్శనమిస్తాడు!
అక్కడితో వాడి అల్లరి ఆగుతే బాగానే వుండును. కాని బామ్మగారి భరతం పట్టందే వాడికి తృప్తి కలగదు.
సీతమ్మగారి దేవుడి గదిలోకి వెళ్ళి, అక్కడి దేవుళ్ళ పటాలన్నీ ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, విష్ణుమూర్తిని హాలులో ఒక మూల కూర్చోబెడతాడు. శివుడిని తీసుకువెళ్ళి పడకగదిలో మంచం మీద పడుకోబెడతాడు. ఆంజనేయస్వామిని వంటింట్లో పోపులపెట్టి మీద కూర్చోబెడతాడు. ఇది రోజూ జరుగుతున్న దత్తభాగవతం.
వాడి బాధ పడలేక సీతమ్మగారు దేవుళ్ళందర్నీ టేబులు మీద సర్దుకుంది. ఐనా వాడు వదలడు. చిన్నస్టూలు జరుపుకుంటూ తీసుకుపోయి మళ్ళీ దేవుళ్ళందర్నీ కిడ్నాప్ చేసేస్తూ వుంటాడు.
ఆవిడ దేవుడి గదిలోంచి గావుకేకలు పెడుతూ వుంటుంది. ‘ఏమేవ్ సీతా! ఇవాళ దత్తబాబు నా శివుడ్ని ఎత్తుకుపోయాడే! అయ్యో, అయ్యో! శుక్కురారం పూటా లక్ష్మీదేవి ఏమయిపోయిందే? ఇంక నేనీ పూజలు, పునస్కారాలకి మంగళం పాడక తప్పదేమోనే తల్లీ! ఐనా పూజ చేసుకోకుండా కాఫీ కూడా తాగను కదే? నేనేం చేతునురా శ్రీరామచంద్రా!’
ఆవిద కేకలు వింటూ ఆ శ్రీరామచంద్రుడి, ఆ శివుడి అవతారమే అయిన గురుదత్త చిద్విలాసంగా నవ్వుతూ నిల్చుంటాడు.
ఇంక తప్పనిసరయి సీతమ్మగారు శ్రీమన్నారాయణుడిని లక్ష్మీసమేతంగాను, పరమశివుడ్ని పార్వతీసమేతంగాను, పాపం ఆంజనేయస్వామి బ్రహ్మచారి కనక ఒంటరిగాను మొత్తం అందరు దేవుళ్ళని అటక ఎక్కించేసి, తాను కుర్చీలో కూర్చుని జపం ముగించుకుని వాళ్ళకి అలాగే సైగలతో ధూపదీప నైవేద్యాలు కానిచ్చేస్తుంది. ఆ విధంగా సీతమ్మగారి ఇంట్లో దేవుళ్ళందరూ అటక ఎక్కేసారు పాపం!
ఇక సుబ్బలక్ష్మిగారి ఇంటికి వెడదాం.
పాపం సుబ్బలక్ష్మి గారు తమ స్వగ్రామంలో 800 గజాల స్థలంలో కట్టబడిన లంకంత కొంపలో వుండేవారు. వారి ఇంటిలో ప్రత్యేకించి విశాలమైన దేవుడి గది వుంది. ఆ గదిని ఆవిడ చాలా మనోహరంగా అలంకరించుకున్నారు. రోజూ పొద్దున్న స్నానం చేయగానే దేవుడి గదిలోకి వెళ్ళి నిష్టగా రెండుగంటలు జపం చేసుకునే వారు. శుక్రవారం అయితే సాయంత్రం కూడా రెండుగంటలు పూజ చేసుకునేవారు. కాని వారి అబ్బాయికి ఈ మధ్యనే పూనేకి బదిలీ అయింది. ఆయన బలవంతం మీద సుబ్బలక్ష్మిగారు కూడా పూనే వెళిపోయారు. అక్కడ ఒక అపార్ట్ మెంట్ లోని పదవ అంతస్థులోని ట్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో వారి మకాం. మూడు విశాలమైన పడకగదులు, హాలు, కిచెన్. అంతే. ఆ అపార్ట్ మెంట్ లో దేవుడి గది లేదు. అందుకని గత్యంతరం లేక సుబ్బలక్ష్మిగారు హాలులోని ఈశాన్యం మూలలో చిన్న అల్మారా పెట్టించుకుని అందులో దేవుళ్ళందరినీ బంధించి తాళం వెసేసారు. రోజూ పొద్దున్న స్నానం కాగానే ఆ అల్మారా తెరిచి కరెంటు దీపారాధన చేసి, కరెంటు అగరువత్తులు వెలిగించి, దణ్ణం పెట్టుకుని రెండు అరటిపళ్ళు, ఇవి మాత్రం నిజమైనవే, నైవేద్యం పెట్టి, మళ్ళీ ఆ అల్మారాకి తాళం వేసేస్తారు. ఎందుకంటే అడ్డమైన వాళ్ళూ (పొట్టిగా, లావుగా, పొణకంత బొజ్జతో వున్నవాళ్ళు), నిలువైన వాళ్ళూ, (సన్నగా పొడుగ్గా, గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా వుండేవాళ్ళు), ఎంతమందో రోజూ హాలులోకి చెప్పులతోనే వచ్చి కూర్చుంటూ వుంటారు. అందుకని సుబ్బలక్ష్మిగారికి దేవుళ్ళని అల్మారాలో పెట్టి బంధించక తప్పలేదు.
ఇక జానకమ్మగారి ఇంట్లో పరిస్థితి చూద్దాం. వారు వుంటున్నది మహానగరం ఐన హైదరాబాద్ లోనే. కాని వారిది ఇండిపెండెంట్ హౌస్. అందులో సెపరేట్గాత విశాలమైన దేవుడిగది వుంది. అందుకని అవిడకు ఏ విధమైన ఇబ్బంది లేదు. వచ్చిన చిక్కల్లా ఆవిడ వయసుతోనే. ఆవిడకు డెభ్భయి సంవత్సరాలు. భారీకాయం. ఆవిడ పాపం నేల మీద కూర్చోలేదు. అందుకని ఒక విశాలమైన కుర్చీ చేయించుకుని దేవుడి గదిలో వేయించుకుంది. ఐతే తను దర్జాగా సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని, దేవుళ్ళని పీటలు వేసి నేలబారుగా కూర్చోపెట్టడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు కదా? పైగా… పూజ చేస్తూ, తనేదో దేవుళ్ళని ఆశీర్వదిస్తున్నట్లు, వారి మీద అక్షింతలు చల్లితే ఏం బాగుంటుంది? తనకన్నా దేవుళ్ళని కొంచెం ఎత్తులో కూర్చోపెట్టాలి. అందుకని పాలరాతితో ఒక ఎత్తైన గట్టు కట్టించి, దేవుళ్ళందరినీ గట్టెక్కించింది.
ఎవరైనా దేవుడిని ‘హే పరంధామా! నన్నీ కష్టాలనించి గట్టెక్కించవయ్యా.’ అని ప్రార్థిస్తారు. కాని జానకమ్మగారు మాత్రం ఆ దేవుళ్ళనే గట్టెక్కించేసింది.
ఈ విధంగా సర్వాంతర్యాములైన దేవుళ్ళు పరిస్థితులకి తలలొగ్గి, కొందరిళ్ళలో అటకలెక్కారు, కొందరిళ్ళలో అల్మారాలలో దాక్కున్నారు, కొందరిళ్ళలో భక్తులని గట్టెక్కించే ఆలోచనలు విరమించుకుని తామే గట్టెక్కేసారు!

చూసారా, పాపం? దేవుళ్ళకూ ఈ ఇబ్బందులు తప్పలేదు!

4 thoughts on “దేవుళ్ళకూ తప్పలేదు!

  1. చాలా సహజంగా సరదాగా అక్షరాల వెంట పరుగులు తీయించారండి… అభినందనలు

Leave a Reply to మాలిక పత్రిక సెప్టెంబర్ 2019 సంచికకు స్వాగతం.. – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *