March 28, 2024

గిలకమ్మ కతలు – బక్కసిక్కిన రేగొడేలు

  రచన: కన్నెగంటి అనసూయ

    

     అదసలే  శీతాకాలం..

అప్పుడప్పుడే తెల్లార్తందేవో..  అంతా పొగమంచు నిండిపోయి బాగా దగ్గిరికంటా వత్తేగాని మడిసి మడిసికి ఆపడ్తాలేదు.

        అంతకు ముందే లేసి పొయ్యిలో బూడిది సేట్లోకెత్తి అవతల దొడ్లో కుండలో పోసొచ్చి రెండు మూడు పిడకల్ని పేర్సి, కాయితం ముక్క లోనకంటా  కూరి  అగ్గి పుల్ల గీసింది సరోజ్ని పిడకల్ని అంటిత్తాకి.

    కాయితాలక్కాయితాలయిపోతన్నాయ్ గానీ పిడక అంటుకుంటే ఒట్టు….

   కూతురు కట్తం సూసి అక్కడే రేగ్గాయలు పుచ్చులున్నయ్యేవోనని సూసి సూసి మరీ సిదుపుతున్న సుబ్బయ్యమ్మ..

   “ ఎన్ని కాయింతాలని సింపుతా..? ఓ సుక్క కిరసనాలొయ్యి. ఎవరి కోసం అంటుకోదో సూద్దారి..అవతల పిల్లలు లేసే ఏలయ్యింది..బళ్ళొకెల్లాలిగందా..”

    “ తేరగా వత్తంది మరి కిరసనాలు”  సణుక్కుంది సరోజ్ని మాటల్లోనే మరో కాయితాన్ని నలిపి   పిడకల్లోకి జొనుపుతా..

      ఇంతలో కల్లు నులుంకుంటా    తిన్నగా ఈధి గుమ్మంకేసి ఎల్లిపోతన్న గిలక్కేసి సూత్తా..

  “ ఎక్కడికలాగ? ఎనక్కిరా. సీకటి. బయటేవీ అగుపిత్తాలేదు. అయినా పొద్దొడవకుండానే..ఎక్కడికే బయల్ధేరేవ్?  మొకం మొద్దులెట్టు..దవళ్ళ మీద పాసీ నువ్వూను….” అరిసింది సుబ్బాయమ్మ..గిలకెనక్కి  సూత్తా..

      “ఈదిలో ఎవరన్నా మంటేత్తన్నారో లేదో సూత్తాకి.  .సలికాసుకుంటాకి. “ అప్పటికే               పిడకలంటుకున్నయ్యేవో….గొట్టంతో ఉస్ ఉస్ అని ఊత్తానే సరోజ్నన్న మాటలకి తరుంకుంటా వచ్చింది సుబ్బాయమ్మా..

   “ మంటలకాడికైతే మాత్తరం మొకం మొద్దులెట్టకుండానేనా.? ఈలోపు  సెరుగ్గెళ్లేసుకుని ఏ ఎడ్లబండైనా వత్తే ఆమట్నే పరిగెత్తుద్ది….బండెనకాల..”    అంటా ఇంకా గొట్టంతోనే తవుసడతన్న కూతురికేసి సూత్తా..

   “పచ్చి పిడకలెట్టేవా ఏటి..అలా ఏడిపిత్తన్నయ్యి. అయ్యి ఇవతలికి లాగి పక్కనడేసి ఎండిన పిడకలు తీస్కోపోయేవా? నన్రమ్మంటావా? ” అంది సుబ్బయ్యమ్మ.

     “ ..గోడ్నించి వలిసేకా కూడా అయిదార్రోజులు ఎండలో పడేడిసినియ్యి. ఎండగ్గాదు. ఏడిపిచ్చాలని. ఒకో రోజింతే..” పొగకి కళ్ళు మండినియ్యేవో..సెంగుతో తుడుసుకుంటా బదులిచ్చింది..సరోజ్ని,  ఓపాళాన అంటుకోలేదేవో..పిడకలు..ఆట్నించొచ్చే పొగ, మంచుకి  పైకి  పోలేక అక్కడక్కడే తిరుగుతుం మొదలెట్టిందేవో..ఊపిరి సలుపుతుల్లేదని అక్కణ్నించి లేసి ఇవతలికొత్తా..

     ఈదిలో ఎక్కడా సలిమంటలేసేవోల్లు  అగపడపోయేతలికి  ఆమట్నే..సేతుల్రెండూ భుజాల మీదేసుకుని సలికి ముడుసుకుపోతా సుబ్బయ్యమ్మ దగ్గరికంటా వచ్చి నిల్సుని..

   ” అబ్బ..రేగుపళ్ళు. సెప్పరే…రేగొడియాలెడతన్నావని..?” అంది..అక్కడే నిలబడి ఆటెనక్కే  సూత్తా..

    “ పెడతన్నాంగానీ..మొకం కడక్కుండా ముట్టుకున్నావంటే ఊరుకోను. ఉప్పుడుదాకా ఈట్ని నీల్లల్లో ఏసి కడిగేతలికి  పెద్దలు దిగొచ్చేరు. ఎల్లు.  ఎల్లి మొకం కడుక్కురా..” ఇసుక్కుంది మనవరాల్ని సుబ్బాయమ్మ. 

        “ఎల్తాన్లేవే అమ్మమ్మా..! ముందీట్ని సూడ్నియ్..!  ఎవరు తెచ్చేరీటిని..?” సలికి గొంతుకులో సన్నని వణుకొచ్చేత్తందేవో…ముడుసుకుపోయి సుబ్బాయమ్మని ఆనుకుని కూచ్చుంటా…అంది గిలక.

     “ ..ఎవరిత్తారు? కొన్నాం కావిడోడి దగ్గర…రెండు కుంచాల ఒడ్లకి కుంచుడు రేగుపల్లు.. అస్సరేగానీ ఏవెట్టుకుని తోంతా పళ్ళు రోజూను? “

      ఏమ్మాట్తడకుండా రేగు పళ్లల్లో సెయ్యెట్టి కెలుకున్న మనవరాల్నే సూత్తా..మల్లీ సుబ్బాయమ్మే..“..వారానికోసారన్నా..కచ్చికితో తోంకోవాలి. ! అయ్యాలే ఇరిసిన  మల్లె పూలల్లే.. మెరిసిపోతయ్ పల్లు. మా సిన్నప్పుడు యాప్పుల్లతో కడుక్కునేవోల్లం. లేపోతే కాపి పొడో, ఉప్పో..అంతగా లేపోతే కచ్చికితోనో కడుక్కునేవోల్లం.  ఈ పేస్టులూ గీస్టులూ మాకు తెల్దు. సరిగ్గా  గంట కడిగీది మియ్యమ్మ కచ్చికితో. “ అరిగిపోతయ్యమ్మా..అంచేటు తోవితే..” అని అరిసీవోడు మీ తాత. అయినా ఇనేదిగాదు. కడిగి బోర్లిచ్చిన పింగాణీ గిన్నెలల్లే తలతల్లాడిపోయ్యీయి .. మియ్యమ్మ పల్లు..”

     “ఛీ..పేడతో సేత్తారయ్యి…! గేది ముడ్లోంచి ఒత్తది పేడ. కచ్చికితో పల్లు దోంకుంటవేటే అమ్మమ్మా..! “ అని కిసుక్కున్నవ్వి..

  “ మరి నాలికి దేంతో గీస్కునేవోళ్ళు..? గేది తోకతోనా? ”  పక పకా నవ్వేసింది గిలక..  రేగుపళ్ళల్లో సెయ్యెట్టి..అటూ ఇటూ కెలుకుతా..

     “ గేత్తోకతోనా? బాగానే ఉంది సంబడం. మియ్యమ్మిందంటే కొరకంచట్టుకొత్తాది. ఎల్లు. ఎల్లి  మొకం కడుక్కున్రా.  మొకం కడుక్కోకుండా ముట్టుకోవద్దన్నానా? సెయ్యెందుకెట్టా?” కాయలు సిదుపుతున్నదల్లా  గిలకమ్మ సెయ్యట్టుకుని ఒక్క గుంజు గుంజి ఇస్సురుగా లాగి ఇవతల  పడేసింది ఇసుగ్గా సుబ్బాయమ్మ..

    సుబ్బరంగా లేపోతే ఆవిడికి మా ఒల్లుమంట..

   “ఈ ఒక్కటీ సెప్పే అమ్మమ్మా..!  మీ సిన్నప్పుడు  నాలుక దేంతో గీసుకునీవోరు..? గేత్తోకతోనే గదా..?”

    “  గేత్తోకతోనా ఇంకేవన్నానా? కొబ్బరీనుల పుల్లతో గీస్కునేవోళ్లం.. గానీ..ఎల్లి మొకం కడుక్కు రమ్మంటే ఎల్లవేటి? ఇక్కడికొత్తంది పాసోసన..”

   “ సెప్తే ఇంటదా? ఇనదు. అదినాలంటే  మన్నోరడిపోవాలి..అయినా ఈదుల్లో ఎవరూ మంటేత్తన్నట్టు లేరు. ఆళ్ళేత్తే ఇది మనకి దొరకాపోను బడేల దాకా..” సరోజ్నంది పొయ్యిలో పిడకెగదోత్తా…

    ఆల్లమ్మన్న మాట ఇనిపిచ్చినా ఇనిపిచ్చనట్టున్న గిలక

“ ఈ రేగొడేలు ఎండుతాకెన్ని రోజులడద్దే  అమ్మమ్మా..” అంది గిలక.. పురుగేదైనా కనిపిత్తదేవోనని .పక్కనడేసిన పుచ్చు కాయలొంక  కళ్ళింతంత సేసుకుని సూత్తానే లేసి నిలబడతా.. ..

   “ అయిదార్రోజులైనా  ఇరగెండాలి. అదైనా ఎండొత్తేని…” అని గిలకతో అని..కూతురు కేసి..సూత్తా

 “ సరోజ్నే…ఆ పొయ్యంటుకుంటే  రెండు పిడకలు దాపెట్టు.  పొయ్యికాణ్నించి లెగాలింక.  మిరప్పళ్ళూ , బెల్లం తుయ్యాలి. ఎండెక్కిందంటే పోటెయ్యలేం. మల్లీ మియ్యాయన పొలాన్నించొత్తే ..ఆలీసమవ్వుద్ది.  “ అన్న తల్లి మాటల్ని పట్టిచ్చుకోకుండా.. 

    “  తూత్తాన్లేగానీ ..ఏటి? అయిదార్రోజులెండితే  సాలా?  పిండొడేలనుకుంటన్నావా ఏటి? రేగొడేలియ్యి. ఏవైదార్రోజులు..? మతిగాని పోయిందా ఏటే అమ్మా నీకు?  పది పన్నెండ్రోజులైనా ఎండా పోతే పురుగులట్టెయ్యవూ? రెండేళ్లనాడు  గేపకవుందా? మర్సిపోయేవా?  సరిగ్గా ఎండకే  గందా….అయిన కుంచుడొడియాలు  పురుగట్టి , ఇక్కడ పారబోత్తే  ఎవరన్నా  సూసినోల్లు..ఇదెంత గుండాబొయి ముండ, దీనికి ఉందీ..లేందీ ఏటీ తెలుత్తాలేదనుకుంటారని..మనూరట్టూపోయి ఎవరూ సూడకుండా  అక్కడ మన గుమ్మం ముందున్న  తూంకాలవలో పారబోసేవ్ .  మర్సిపోయేవా ఏటి? “ తరుంకొచ్చింది సరోజ్ని..

        “ అమ్మో..అన్ని రోజులాగాలా  ..తింటాకి? అప్పడు దాకా  ఈటిని తినగూడదా?”  నిరాశగా అంది. .

     “తినొచ్చో లేదో తర్వాజ్జెప్పుద్ది ముందు నువ్వెల్లి మొకం కడుక్కుని ఆణ్ణి లేపు బడేలవుతుంది..ఎన్నిసార్లు సెప్పాలి…”  అని గిలకనో కసురు కసిరి..

   “ పండు మిరప్పళ్ళు..కుంచుడు రేగు పళ్లకి ఎన్ని తుయ్యమంటా..” అంది తక్కెడి సరి సేసి కేజీ రాయోపక్కనేత్తా..

       “ మరీ అంత తుయ్యక్కా లేదులే  .ఉజ్జాయింపుగా ఏసేద్దారి. పట్టినన్నేసి మిగతాయి ఉప్పేసి తొక్కి వాసినిగడితే  పండుమిరప్పండు పచ్చడి రుబ్బొచ్చు..    “

    “ బూజట్టకుండా ఎండబెట్టాలి..ఎండెక్కడొచ్చి సత్తంది..” అంటా సీవెండి పళ్ళెం లోకి కాసిన్ని పండు మిరపకాయలు ఏసుకుని సుబ్బాయమ్మ దగ్గరకంటా వచ్చి ఆటిని సూపిత్తా..

   “ఇయ్యోసారి సూడు.  సరిపోతాయంటే ముక్కలు కోసేత్తాను కత్తిపీటేసుకుని. మల్లీ ఆడులేసినా, ఈయనొచ్చినా నాకు పని సాగదు..”

     “ తడార్నియ్యా..? లేపోతే పొడి గుడ్డెట్టి తుడువ్”  

   “ తళ్ళేదు. సూసేను.”

   “ అందాకా అందాజ్ గా ఏద్దారి ముందు. సాలా పోతే అప్పుడే సూడొచ్చులే..బెల్లవెక్కడుంది..? “

   “దింపిందైపోయింది. మసిరి మీదుంది. దింపిచ్చాలి..” అని ఆల్లమ్మతో అని  గిర్రున గిలకెనక్కి తిరిగి..పుల్లటి రత్తవొచ్చేలా నెత్తి మీదో మొట్టు మొట్టి..

  “ మొకం కడుక్కు రమ్మని పొద్దుణ్ణించి ఆమట్ని మొత్తుకుంటే నీగ్గాదా? ఎన్నిసార్లు సెప్పాలే? సెవుడా? ఎల్లు.ఎల్లి మొకం కడుక్కురా..!  పీటెక్కి మసిరి మీంచి  బెల్లాన్ని దింపాలి..ఎల్లు. ఎల్లేవా లేదా?”

   “ఎల్తానుండేహ్హె. అస్సలే సలిగా ఉంటే నువ్వలా మొడతావేటి? నేన్దియ్యను..  ఎదవ బెల్లవూ నువ్వూను..”

   తల్లి మొట్టుడుకి  దెబ్బకి సలొదిలి పోయిందేవో..ఇస్సురుగా అనేసి  తల మీద మొట్టిన సోట సేత్తో రాసుకుంటా అక్కణ్ణించి తూవులోకి పరిగెత్తింది..గిలక.

   “ పిల్ల పెద్దదవుతుంది.  సీటికీ మాటికీ నువ్వలా మొడతా ఉంటే..పెద్దోల్లయ్యాకా ఆల్లకియ్యే  మనసులో నాటూపోతాయ్. కాత్తంత సెయ్యి జాడిత్తం తగ్గిచ్చుకుంటే మంచిది. నేనెంతుకు సెప్తున్నానో ఇను…”సుబ్బయ్యమ్మంది గుసగుసలుగా కూతురుతోటి..

   “ ఇసుకొత్తందనుకో..! పెద్దదవుతున్నప్పుడు ఓసారి జెప్తే ఇనాల. ఇంకెప్పుడొత్తది ఇవరం. ఎన్నిసార్లని సెప్తాం. మనకి మాత్తరం ఓపికుండద్దాంట.. “   అంటానే కత్తిపీటోల్చి పండు మిరప్పళ్లను రెండేసి ముక్కల్జేత్తా..

   ఎంతసేపటికే రాని గిలక్కోసం..“..గిలకా..గిలకా అయ్యిందా మొకం కడుగుతుం?   “

   “ వత్నాను..ఆగెహ్హే..! మొట్నప్పుడు లేదేటి?  నేనెంతుకు తియ్యాలి” అరిసింది గిలక నాలిగ్గీసుకుంటా..

    అరవటం అయితే అరిసిందిగానీ..ఎల్లాపోతే మల్లీ ఎక్కడ మొట్టుద్దోనని..తుడ్సుకోకుండానే మూలగదిలోకెల్లి పీటీడ్సుకుని..ఇత్తడి ఎన్నగిన్ని కిందకి దింపి మొయ్యలేక మొయ్యలేక మోత్తా..ఆల్లమ్మ దగ్గరకి తెచ్చి పెట్టి ఎనక్కెల్లిపోబోతుంటే..

   “బళ్ళోకి ఎల్తాకి ఇంకా టైముంది గానీ.. వంటింట్లో గోడ మీద  మేక్కి తగిలిచ్చున్న  సేటిలా పట్రా..”   అని సేట తెచ్చేకా..”  కాసేపాగు. మరీ అడావిడి పడిపోనక్కల్లేదు. పేద్ద రోజూ టైంకి  బళ్ళోకెల్లిపోతన్నట్టు..” ఎటకారంగా అని..మళ్ళీ తనే..” అమ్మమ్మనడిగి ఎంత బెల్లం తుయ్యమంటదో..కలంలో రాయిదెచ్చి ముక్కలు కొట్టు. నలగా పోతే రేగొడియాల్లో బెల్లం సుద్దలు నాలిక్కి తగిలి సిరాకొత్తది….”

      “  ఏం రేగొడేలోగానీ సంపేత్తిందిరా  బాబోయ్..మాయమ్మ..” అని లోపల్లోపల అనుకోబోయి పైకే అనేసిందేవో..

  “ ఆ.. సప్పలిచ్చేతప్పుడో..! కాయితాల్లో సుట్టుకుని సంచిలో పెట్టుకుని బళ్ళోకి ఎల్లేటప్పుడను బాబోయ్ అని..” ఎటకారంగా అంది సరోజ్ని..

    “ య్యె య్యె “ అంతే ఎటకారంగా అంటా..జడలు ముందుకేసుకుని  రిబ్బను ముడులిప్పుతా దువ్వెన కోసం లోపలికెల్లింది గిలక..

   “ రెండు గుప్పిల్లు..జీలకర్రొయ్..రుసొత్తాది..” సుబ్బాయమ్మంది..సరోజ్నితో..

     “ అబ్బ…ఏటెల్లకాలం సెప్తానే ఉంటావా? రేగొడియాల్లో గీలకర్రేసుకుంతారని నువ్వు సెప్తే తెలవాలి మరి నాకు..” ఇసుక్కుంది సరోజ్ని..తల్లి మీద.   

     మజ్జానం బళ్లోంచి ఇంటికొచ్చేతలికి  రోట్లో ఏసి తొక్కుతున్న రెగుపళ్ల పచ్చణ్ణి సూసి  నోట్లో సివ్వున ఇంతెత్తున పొంగి అంగిణ్ణి తాకింది  నోట్లో నీల్లు.  

       అన్నం తినేసి..సిన్న డబ్బాలో బళ్లోకి పచ్చడట్టుకెల్లి  జతకత్తుల్తో కల్సి తింటే తప్ప తీర్లేదు గిలక్కి. సందేళ నోరంతా కొట్టుకుపోగా..పైపళ్లతో నాలుక మీద దురదొచ్చిన సోట గీక్కుంటా ఇంటికొచ్చేతలి..ఒకందంగా ఆకాసంలో నచ్చత్రాలని పేర్సినట్టు పేర్సేరు పట్తే మంచం మీద పరిసిన గుడ్డ మీద రేగొడేలు.  .

    నాలుక్కొట్టూపోయినా గానీ  సిన్నగా సిట్టి గారెలంతంత సైజులో మంచవంతా పరిసేసున్న ఆటిని సూత్తానే దవలేసరం లాకుల్లోంచి ఉరికురికొచ్చినట్టు ఎంటెంట్నే నోరూరేసింది గిలక్కి.

       “  నాకింకోటి కావాలి..” అంది ఆట్నే సూత్తా..

   “ ఏట్ గావాలి? పట్టికెల్లెందైపోయిందా..?  అయ్యన్నీ నీక్కాదా? ఎండెకా తిందూగాన్లే? “

    “ కుదరదు. నాక్కావాలంతే.. బెల్లవెంతుక్కొట్టిచ్చా నాతో..! అలాగన్జెప్తే బళ్ళోకెల్లాపోదునుగదా..!  నాకు నోరూరిపోతంది. నేనోటి తీసుకుంటాను..” కాల్లు నేలకేసి బాత్తా పట్టుదలగా అంది గిలక..

   “సెయ్యిరగ్గొడతాను ..వడేల్లో సేతులెట్టేవంటేని. నాలిక్కొట్టూపోతే వణ్నం దిన్లేవు..నువ్విలాగంటావనే ఎన్నొడేలెట్తేనో లెక్కెట్టేను..”

   “ ఆ..ఒకటి తీసుకోనిద్దూ..! అన్నీ దానికే అంటావు. తీస్కుంటానంటే సెయ్యిరగ్గొడతానంటావు..అన్నీ నీ మాటలే..పిల్లలన్నాకా తింటారు..తినకుండా ఎట్టుంటారు?  ” అని గిలక్కేసి తిరిగి..   “ తీస్కోమ్మా..! తింటాక్కాపోతే ఇంకెంతుకు? తీస్కో.”

   గుర్రున సూసింది సరోజ్ని తల్లొంక..మిటా మిటా సూత్తానే..

   “ అక్కడికి నువ్వు మంచిదానివీని..నేను కాదా? తీసేవంటే ఊరుకోను ఏవనుకున్నావో ఏవో గానీ..ఒకటి తియ్యనిత్తే..మరోటంటాది. ఇక అందవెక్కడుంటది మంచం మీదియ్యి మంచం మీదే అయిపోతే..”  అయ్యన్నీ ఇంటా  ఇద్దర్నీ మార్సి మార్సి సూసింది గిలక.  అంతలోనే ఏదో ఆలోసనొచ్చి ..

          “తియ్యన్లే..! అరవకండి..ఎండేకేనే దింటా..” అంది ..

           “ వడియం మొత్తం తీత్తే ఊరుకోవు . అంతే కదా..ఒసే పిచ్చి అమ్మా..! ” అని తన ఆలోసనకి తనే మనసులో నవ్వుకుంటా..

     గుడ్ద మీద రేగొడేలు ఎండుతూనూ ఉన్నాయ్..గిలకమ్మ నోరు సప్పలిత్తానూ ఉంది. సరోజ్ని లెక్కకి తక్కువైతే ఒట్టు..

   అర్దవయ్యాకా..”  ఓహో..! ఏటా సిక్కిపోతన్నయ్ అలాగనుకున్నాను..ఇంతుకా..ఓహ్హోహ్హో..ఏం తెలివే మనవరాలా?” అంది సుబ్బాయమ్మ..అటూ ఇటూ సూసి ఎవ్వరూ లేరనుకున్నాకా వడియంలోంచి  ఒడుపుగా  గింజలాగుతున్న గిలకమ్మకేసి మంచం మీద పడుకునే ఓసూపు సూత్తా..

       “..ఆహా..హ్హ..హ్హ..హ్హా..సూసేసావా?” పకపకా నవ్వింది గిలక  రేగ్గింజ సప్పలిత్తా..

                                                      —

 

 

   

       

   

 

   

   

 

  

    

     

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *